Siva Maha Puranam-3    Chapters   

అథషోడశో%ధ్యాయః

మహాకాలేశ్వర మాహాత్మ్యము

ఋషయ ఊచుః |

సూత సర్వం విజానాసి వస్తు వ్యాసప్రసాదతః | జ్యోతిషాం చ కథాం శ్రుత్వా తృప్తిర్నైవ ప్రజాయతే || 1

తస్మాత్త్వం హి విశేషేణ కృపాం కృత్వాతులాం ప్రభో | జ్యోతిర్లింగం తృతీయం చ కథయ త్వం హి నో% ధునా || 2

ఋషులు ఇట్లు పలికిరి-

ఓ సూతా! వ్యాసుని అనుగ్రహముచే నీకు విషయములన్నియు తెలియును. జ్యోతిర్లింగముల కథను వినుచున్న మాకు తృప్తి కలుగటనే లేదు (1). ఓ ప్రభూ! కావున నీవు సాటిలేని విశిష్టకృపను మాపై చూపి ఇపుడు మాకు మూడవ జ్యోతిర్లింగమును గురించి చెప్పుము (2).

సూత ఉవాచ |

ధన్యో%హం కృతకృత్యో%హం శ్రీమతాం భవతాం యది | గతశ్చ సంగమం విప్రా ధన్యా వై సాధుసంగతిః || 3

అతో మత్వా స్వభాగ్యం హి కథయిష్యామి పావనీమ్‌ | పాపప్రణాశినీం దివ్యాం కథాం చ శృణుతాదరాత్‌ || 4

అవంతీ నగరీ రమ్యా ముక్తిదా సర్వదేహినామ్‌ | శివప్రియా మహాపుణ్యా వర్తతే లోకపావనీ || 5

తత్రాసీద్ర్బాహ్మణ శ్రేష్ఠశ్శుభకర్మపరాయణః | వేదాధ్యయనకర్తా చ వేదకర్మరతస్సదా || 6

అగ్న్యాధానసమాయుక్తశ్శివపూజారతస్సదా | పార్థివీం ప్రత్యహం మూర్తిం పూజయామాస వై ద్విజః || 7

సర్వకర్మఫలం ప్రాప్య ద్విజో వేదప్రియస్సదా | సతాం గతిం సమాలేభే సమ్యగ్‌ జ్ఞానపరాయణః || 8

తత్పుత్రాస్తాదృశాశ్చాసంశ్చత్వారో మునిసత్తమాః | శివపూజారతా నిత్యం పిత్రోరనవమాస్సదా || 9

సూతుడు ఇట్లు పలికెను-

ఓ విప్రులారా! వేదవేత్తలగు మీ యొక్క సంగమము నాకు లభించినది. నేను ధన్యుడను, కృతార్థుడను అయినాను. సాధుసమాగమము పుణ్యప్రదమైనది గదా! (3) కావున ఇది నా భాగ్యమని భావించి పావనము, పాపములను పోగొట్టునది అగు దివ్యగాథను చెప్పెదను. అదరముతో వినుడు (4). సుందరమైనది, సర్వప్రాణులకు మోక్షము నిచ్చునది, శివునకు ప్రియమైనది, పరమపవిత్రమైనది, జనులకు శుద్ధిని కలిగించునది అగు అవంతీనగరము గలదు (5). అచట శుభకర్మలను చేయుటలో నిమగ్నమైనవాడు, వేదమున అధ్యయనము చేసి వేదవిహిత కర్మలను నిత్యము శ్రద్ధగా ఆచరించువాడు, నిత్యాగ్నిహోత్రుడు, సర్వదా శివపూజయందు అభిరుచి గలవాడు అగు బ్రాహ్మణశ్రేష్ఠుడు ఉండెను. ఆ బ్రాహ్మణుడు ప్రతినిత్యము శివుని పార్థివమూర్తిని పూజించెడివాడు (6, 7). నిత్యము వేదమునందు అభిరుచి గలవాడు, సమ్యగ్‌ జ్ఞాననిష్ఠయందు లగ్నమైన మనస్సు గలవాడు అగు ఆ బ్రాహ్మణుడు తాను ఆచరించిన కర్మలన్నింటియొక్క ఫలరూపముగా సత్పురుషులు పొందే గతిని పొందెను (8). ఓ మహర్షులారా! ఆయనతో సమానమైనవారు, తల్లిదండ్రులకు తీసిపోనివారు, సర్వదా శివపూజయందు అభిరుచి గలవారు అగు నల్గురు కుమారులు ఆయనకు గలరు (9).

దేవప్రియశ్చ తజ్జ్యేష్ఠః ప్రియమేధాస్తతః పరమ్‌ | తృతీయస్సుకృతో నామ ధర్మవాహీ చ సువ్రతః || 10

తేషాం పుణ్యప్రతాపాచ్చ పృథివ్యాం సుఖమైధత | శుక్లపక్షే యథా చంద్రో వర్ధతే చ నిరంతరమ్‌ || 11

తథా తేషాం గుణాస్తత్ర వర్ధంతే స్మ సుఖావహాః | బ్రహ్మతేజోమయీ సా వై నగరీ చాభవత్తదా || 12

ఏతస్మిన్నంతరే తత్ర యజ్జాతం వృత్తముత్తమమ్‌ | శ్రూయతాం తద్ద్విజశ్రేష్ఠాః కథయామి యథాశ్రుతమ్‌ || 13

పర్వతే రత్నమాలే చ దూషణాఖ్యో మహాసురః | బలవాన్‌ దైత్యరాజశ్చ ధర్మద్వేషీ నిరంతరమ్‌ || 14

బ్రహ్మణో వరదానాచ్చ జగత్తుచ్ఛీ చకార హ | దేవాః పరాజితాస్తేన స్థానాన్నిస్సారితాస్తథా || 15

పృథివ్యాం వేదధర్మాశ్చ స్మృతిధర్మాశ్చ సర్వశః | స్ఫోటితాస్తేన దుష్టేన సింహేనేవ శశాః ఖలు || 16

యావంతో వేదధర్మాశ్చ తావంతో దూరతః కృతాః | తీర్థే తీర్థే తథా క్షేత్రే ధర్మో నీతిశ్చ దూరతః || 17

అవంతీ నగరీ రమ్యా తత్రై కా దృశ్యతే పునః | ఇత్థం విచార్య తేనైవ యత్కృతం శ్రూయతాం హి తత్‌ || 18

బహుసైన్యసమాయుక్తో దూషణస్స మహాసురః | తత్రస్థాన్‌ బ్రహ్మణాన్‌ సర్వానుద్దిశ్య సముపాయ¸° || 19

తత్రాగత్య స దైత్యేంద్రశ్చతురో దైత్యసత్తమాన్‌ | ప్రోవాచాహూయ వచనం విప్రద్రోహీ మహాఖలః || 20

పెద్ద కుమారునకు దేవప్రియుడని పేరు. తరువాతి వాడు ప్రియమేధనుడు. మూడవ వాడు సుకృతుడు. చక్కని నియమనిష్ఠలు గల నాల్గవవాని పేరు ధర్మవాహి (10). వారి పుణ్యప్రభావముచే భూమండలమునందు సుఖము వర్ధిల్లెను. సుఖకరములగు వారి గుణములు శుక్లపక్షచంద్రునివలె దినదినప్రవర్ధమానము లయ్యెను. ఆ కాలములో ఆ నగరము బ్రహ్మతేజస్సుతో ప్రకాశించెను (11, 12). ఓ బ్రాహ్మణశ్రేష్ఠులారా! ఈ కాలములో అచట జరిగిన వృత్తాంతమును నేను విన్నంతమేరకు చెప్పెదను. దానిని వినుడు (13). రత్నమాలపర్వతమునందు బలవంతుడు, సర్వకాలములలో ధర్మమును ద్వేషించువాడు, రాక్షసచక్రవర్తి అగు దూషణాసురుడు ఉండెను (14). వాడు బ్రహ్మయొక్క వర ప్రభావమువలన జగత్తును అత్యల్పముగా పరిగణించి దేవతలను జయించి వారిని వారి స్థానములనుండి వెళ్లగొట్టెను (15). దుష్టుడగు ఆ రాక్షసుడు భూమండలమునందలి వేదోక్తధర్మములను మరియు స్మృతివిహీతధర్మములను సింహము కుందేళ్లనువలె సర్వవిధములుగా నాశనము జేసెను (16). ఎన్ని వేదధర్మములు గలవో, వాటినన్నిటినీ వాడు నాశనమొనర్చెను. సర్వతీర్థములయందు మరియు క్షేత్రములయందు ధర్మము, నీతి లోపించునట్లు చేసెను (17). భూమండలములో అవంతీనగరము ఒక్కటి మాత్రమే అందముగా నుండుటను గాంచి వాడు ఆలోచించి చేసిన పనిని గురించి వినుడు (18). ఆ దూషణాసురుడు పెద్ద సైన్యము తోడు రాగా ఆ నగరమునందలి బ్రాహ్మణులందరికి హానిని చేయగోరి బయలుదేరెను (19). బ్రాహ్మణద్రోహి, పరమదుష్టుడు, చతురత గలవాడు అగు ఆ రాక్షసరాజు రాక్షసవీరులనందరినీ పిలిచి ఇట్లు పలికెను (20).

దైత్య ఉవాచ |

కిమేతే బ్రాహ్మణా దుష్టాన కుర్వంతి వచో మమ | వేదధర్మరతా ఏతే సర్వే దండ్యా మతే మమ || 21

సర్వే దేవా మయా లోకే రాజానశ్చ పరాజితాః | వశే కిం బ్రాహ్మణాశ్శక్యా న కర్తుం దైత్యసత్తమాః || 22

యది జీవితుమిచ్ఛా స్యాత్తదా ధర్మం శివస్య చ | వేదానాం పరమం ధర్మం త్యక్త్వా సుఖసుభాగినః || 23

అన్యథా జీవనే తేషాం సంశయశ్చ భవిష్యతి | ఇతి సత్యం మయా ప్రోక్తం తత్కురుధ్వం విశఙ్కితాః || 24

ఆ రాక్షసుడు ఇట్లు పలికెను-

దుష్టులగు ఈ బ్రాహ్మణులు నా మాటను వినకపోవుటకు కారణమేమి? వేదధర్మమునందు నిష్ఠగల వీరందరు దండనకు అర్హులని నా అభిప్రాయము (21). నేను లోకమునందలి దేవతలను మరియు రాజులను అందరినీ జయించితిని. ఓ రాక్షసశ్రేష్ఠులారా! ఈ బ్రాహ్మణులను వశము చేసుకొనుట సంభవము కాదా యేమి? (22) వీరికి ప్రాణములపై తీపి యున్నచో, శివధర్మమును మరియు వేదవిహితమైన పరమధర్మమును పరిత్యజించి సుఖములననుభవించెదరు గాక! (23) అట్లు గానిచో, వారి ప్రాణములకు ముప్పు తప్పదు. నేను సత్యమును పలుకుచున్నాను. కావున, మీరు నిశ్శంకముగా అట్లు చేయుడు (24).

సూత ఉవాచ |

ఇతి నిశ్చిత్య తే దైత్యాశ్చత్వారః పావకా ఇవ | చతుర్దిక్షు తదా జాతాః ప్రలయే చ యథా పురా || 25

తే బ్రాహ్మణాస్తథా శ్రుత్వా దైత్యానాముద్యమం తదా | న దుఃఖం లేభిరే తత్ర శివధ్యాన పరాయణాః || 26

ధైర్యం సమాశ్రితాస్తే చ రేఖామాత్రం తదా ద్విజాః | న చేలుః పరమధ్యానాద్వరాకాః కే శివాగ్రతః || 27

ఏతస్మిన్నంతరే తైస్తు వ్యాప్తాసీన్నగరీ శుభా | లోకాశ్చ పీడితాసై#్తస్తు బ్రాహ్మణాన్‌ సముపాయయుః || 28

సూతుడు ఇట్లు పలికెను-

ఆ నల్గురు రాక్షసులు ఈ విధముగా నిశ్చయించి ప్రలయకాలమునందలి అగ్నులవలె అప్పుడు నలుదిక్కులయందు ముట్టడించిరి (25). శివుని ధ్యానించుటలో నిమగ్నులైన ఆ బ్రాహ్మణులు రాక్షసుల ఆ ప్రయత్నమును గురించి వినియు దుఃఖమును పొందలేదు (26). అపుడా బ్రాహ్మణులు ధైర్యమునవలంబించి పరమేశ్వరధ్యానమునుండి ఇసుమంతయైననూ చలించకుండిరి. శివుని యెదుటనున్న భక్తులకు దైన్యము ఎక్కడిది? (27) ఇంతలో ఆ రాక్షసులు ఆ శుభనగరమును ఆక్రమించి ప్రజలను పీడించమొదలిడిరి. అపుడు వారు ఆ బ్రాహ్మణుల వద్దకు వచ్చిరి (28).

లోకా ఊచుః |

స్వామినః కిం చ కర్తవ్యం దుష్టాశ్చ సముపాగతః | హింసితా బహవో లోకా ఆగతాశ్చ సమీపతః || 29

జనులు ఇట్లు పలికిరి -

ఓ ప్రభువులారా! ఆ దుష్టులు చాల దగ్గరకు వచ్చి చాలమంది జనులను హింసించుచున్నారు. మేము ఏమి చేయవలెను? (29)

సూత ఉవాచ |

తేషామితి వచశ్ర్శు త్వా వేదప్రియసుతాశ్చ తే | సమూచుర్బ్రా హ్మణాస్తాన్‌ వై విశ్వస్తాశ్శంకరే సదా || 30

వేదప్రియుని కుమారులగు ఆ బ్రాహ్మణులు సర్వదా శంకరునియందు విశ్వాసము గలవారై వారి మాటలను విని వారితో నిట్లనిరి (30).

బ్రాహ్మణా ఊచుః |

శ్రూయతాం విద్యతే నైవ బలం దుష్టభయావహమ్‌| న శస్త్రా ణి తథా సంతి యచ్చ తే విముఖాః పునః || 31

సామాన్యస్యావమానో నో హ్యాశ్రయస్య భ##వేదిహ | పునశ్చ కిం సమర్థస్య శివస్యేహ భవిష్యతి || 32

శివో రక్షాం కరోత్వద్యాసురాణాం భయతః ప్రభుః | నాన్యథా శరణం లోకే భక్తవత్సలతశ్శివాత్‌ || 33

బ్రాహ్మణులు ఇట్లు పలికిరి-

మీరు వినుడు. ఈ దుష్టులను భయపెట్టి తరిమివేయగలిగే సైన్యము గాని, ఆయుధములు గాని మన వద్ద లేవు (31). సాధారణజనునకు జరిగే అవమానము ఆతనికి గాక, ఆతడు ఆశ్రయించినవానికి తగులును. కాని సమర్థుడగు శివునకు ఇపుడు ఇచట ఎట్టి హాని జరుగగలదు? (32) ఈనాడు ఈ రాక్షసభయమునుండి శివప్రభుడు రక్షించుగాక! లోకములో భక్తవత్సలుడగు శివునికంటే భిన్నముగా మరియొక శరణము లేదు (33).

సూత ఉవాచ |

ఇతి ధైర్యం సమాస్థాయ సమర్చాం పార్థివస్య చ | కృత్వా తే చ ద్విజాస్సమ్యక్‌ స్థితా ధ్యానపరాయణాః || 34

దృష్టా దైత్యేన తావచ్చ తే విప్రాస్సబలేన హి | దూషణన వచః ప్రోక్తం హన్యతాం వధ్యతామితి || 35

తచ్ఛ్రు తం తైస్తదా నైవ దైత్యప్రోక్తం వచో ద్విజైః | వేదప్రియసుతైశ్శంభోర్ధ్యానమార్గపరాయణౖః || 36

అథ యావత్స దుష్టాత్మా హంతుమైచ్ఛద్ద్విజాంశ్చ తాన్‌ | తావచ్చ పార్థివస్థానే గర్త ఆసీత్సశబ్దకః || 37

గర్తాత్తతస్సముత్పన్నశ్శివో వికటరూపధృక్‌ | మహాకాల ఇతి ఖ్యాతో దుష్టహంతా సతాం గతిః || 38

మహాకాలస్సముత్పన్నో దుష్టానాం త్వాదృశామహమ్‌ | ఖల త్వం బ్రాహ్మణానాం హి సమీపాద్దూరతో వ్రజ || 39

ఇత్యుక్త్వా హుంకృతేనైవ భస్మసాత్కృతవాంస్తదా | దూషణం చ మహాకాలశ్శంకరస్సబలం ద్రుతమ్‌ || 40

సూతుడు ఇట్లు పలికెను-

ఆ బ్రాహ్మణులీ విధముగా ధైర్యమునవలంబించి పార్థివలింగమును పూజించి స్థిరముగా ధ్యానము నందు నిమగ్నులై యుండిరి (34). అపుడు సైన్యముతో గూడియున్న ఆ దూషణాసురుడు ఆ బ్రాహ్మణులను గాంచి చంపుడు, చంపుడు అని పలికెను (35). వేదప్రియుని కుమారులగు ఆ బ్రాహ్మణులు ధ్యానమార్గములో శంభుని భావన చేయుచున్నవారై ఆ రాక్షసుల పలుకులను విననే లేదు (36). ఇంతలో ఆ దుర్బుద్ధి ఆ బ్రాహ్మణులను చంపుటకు ఉద్యమించుచుండగా, పార్థివ లింగము యొక్క స్థానములో పెద్ద శబ్దముతో గోయి ఏర్పడెను (37). శిష్టరక్షకుడు దుష్టశిక్షకుడు అగు శివుడు మహాకాలుడని ప్రసిద్ధిని గాంచిన భయంకరరూపమును దాల్చి ఆ గోతినుండి ఆవిర్భవించెను (38). ఓరీ దుష్టా! నీవంటి దుష్టుల పాలిటి భయంకర మృత్యువునగు నేను ఆవిర్భవించితిని. నీవా బ్రాహ్మణులకు దూరముగా పొమ్ము (39). ఇట్లు పలికి ఆ మహాకాలేశ్వరుడు కేవల హుంకారమాత్రముచే దూషణుని వాని సైన్యముతో సహా శీఘ్రముగా భస్మము చేసెను (40).

కియత్సైన్యం హతం తేన కించిత్సైన్యం పలాయితమ్‌ | దూషణశ్చ హతస్తేన శివేనేహ పరాత్మనా || 41

సూర్యం దృష్ట్వా యథా యాతి సంక్షయం సర్వశస్తమః | తథైవ చ శివం దృష్ట్వా తత్సైన్యం విననాశ హ || 42

దేవదుందుభయో నేదుః పుష్పవృష్టిః పపాత హ | దేవాస్సమాయయుస్సర్వే హరిబ్రహ్మాదయస్తథా || 43

భక్త్యా ప్రణమ్య తం దేవం శంకరం లోకశంకరమ్‌ | తుష్టుపుర్వివిధైః స్తోత్రైః కృతాంజలిపుటా ద్విజాః || 44

బ్రాహ్మణాంశ్చ సమాశ్వాస్య సుప్రసన్నశ్శివస్స్వయమ్‌ | వరం బ్రూతేతి చోవాచ మహాకాలో మహేశ్వరః || 45

తచ్ఛ్రు త్వా తే ద్విజాస్సర్వే కృతాంజలిపుటాస్తదా | సుప్రణమ్య శివం భక్త్యా ప్రోచుస్సన్నతమస్తకాః || 46

శివపరమాత్మ కొంత సైన్యమును సంహరించగా, మరికొంత సైన్యము పారిపోయెను. అపుడాయన దూషణుని కూడ సంహరించెను (41). సూర్యుని గాంచిన చీకటి ఏ విధముగా సర్వత్రా నశించునో, అదే విధముగా శివుని గాంచి ఆ సైన్యము నశించెను (42). అపుడు దేవదుందుభులు మ్రోగెను. పూలవాన కురిసెను. మరియు బ్రహ్మ, విష్ణువు మొదలగు దేవతలందరు విచ్చేసిరి (43). ఆ బ్రాహ్మణులు చేతులను జోడించి ప్రణమిల్లి, లోకములకు కల్యాణములను చేగూర్చు ఆ శంకరదేవుని వివిధస్తోత్రములతో భక్తిపూర్వకముగా స్తుతించిరి (44). మహాకాలేశ్వర రూపములోనున్న ఆ శివుడు స్వయముగా ఆ బ్రాహ్మణులకు ధైర్యమును చెప్పి, వరమును కోరుకొమ్మని పలికెను (45). అపుడా బ్రాహ్మణులు అందరు ఆ మాటను విని చేతులను జోడించి శివునకు భక్తితో నమస్కరించి తలలను వంచి ఇట్లు పలికిరి (46).

ద్విజా ఊచుః |

మహాకాల మహాదేవ దుష్టదండకర ప్రభో | ముక్తిం ప్రయచ్ఛ నశ్శంభో సంసారాంబుధితశ్శివ || 47

అత్రైవ లోకరక్షార్థం స్థాతవ్యం హి త్వయా శివ | స్వదర్శకాన్నరాన్‌ శంభో తారయ త్వం సదా ప్రభో || 48

ఆ బ్రాహ్మణులు ఇట్లు పలికిరి-

ఓ మహాకాలేశ్వరా! మహాదేవా! ఓ దుష్టులను దండించే ప్రభూ! హే శంభో! శివా! మాకు సంసారసముద్రమునుండి విముక్తిని కలిగించుము (47). ఓ శివా! శంభూ! నీవు లోకముల రక్షణ కొరకై ఇక్కడనే స్థిరముగానుండి నిన్ను దర్శించే మానవులను సర్వదా రక్షించుచుండుము (48)

సూత ఉవాచ |

ఇత్యుక్తసై#్తశ్శివస్తత్ర తస్థౌ గర్తే సుశోభ##నే | భక్తానాం చైవ రక్షార్థం దత్త్వా తేభ్యశ్చ సద్గతిమ్‌ || 49

ద్విజాస్తే ముక్తిమాపన్నాశ్చతుర్దిక్షు శివాస్పదమ్‌ | క్రోశమాత్రం తదా జాతం లింగరూపిణ ఏవ చ || 50

మహాకాలేశ్వరో నామ శివః ఖ్యాతశ్చ భూతలే | తం దృష్ట్వా న భ##వేత్స్వ ప్నే కించిద్దుఃఖమపి ద్విజాః || 51

యం యం కామ మపేక్ష్యైవ తల్లింగం భజతే తు యః | తం తం కామమవాప్నోతి లభేన్మోక్షం పరత్ర చ || 52

ఏతత్సర్వం సమాఖ్యాతం మహాకాలస్య సువ్రతాః | సముద్భవశ్చ మాహాత్మ్యం కిమన్యచ్ఛ్రో తుమిచ్ఛథ || 53

ఇతి శ్రీ శివమహాపురాణ కోటిరుద్రసంహితాయాం మహాకాల జ్యోతిర్లింగ మాహాత్మ్యవర్ణనం నామ షోడశో%ధ్యాయః (16).

సూతుడు ఇట్లు పలికెను-

అపుడు వారు ఇట్లు పలుకగా, శివుడు వారికి ఉత్తమగతిని ఒసంగి భక్తుల రక్షణకొరకై పరమసుందరమగు ఆ బిలమునందే స్థిరముగానుండెను (49). ఆ బ్రాహ్మణులు ముక్తిని పొందిరి. ఆ శివలింగముయొక్క ఆధారపీఠము నాల్గు దిక్కులయందు క్రోసు దూరమువరకు విస్తరించి ఉండెను (50). శివుడు భూలోకములో మహాకాలేశ్వరుడను పేర ప్రఖ్యాతిని గాంచెను. ఓ బ్రాహ్మణులారా! ఆయనను దర్శించినవారికి స్వప్నములోనైననూ దుఃఖము కలుగదు (51). మానవుడు ఏయే కోర్కెలనపేక్షించి ఆ శివలింగమునారాధించునో, ఆయా కామనలను పొందుటయే గాక, మరణానంతరము మోక్షమును పొందును (52). గొప్ప వ్రతనిష్ఠ గల ఓ ఋషులారా! మహాకాలేశ్వరుని ఆవిర్భావము, మహిమలను గూర్చి మీకు ఈ విధముగా సమగ్రముగా చెప్పియుంటిని. ఇంకనూ ఏమి వినగోరుచున్నారు? (53).

శ్రీ శివమహాపురాణములోని కోటిరుద్ర సంహితయందు మహాకాల జ్యోతిర్లింగ మాహాత్మ్యవర్ణనమనే పదునారవ అధ్యాయము ముగిసినది (16).

Siva Maha Puranam-3    Chapters