Siva Maha Puranam-3    Chapters   

అథ షష్ఠో%ధ్యాయః

నందీశ్వరావతారము

అధ నందీశ్వరావతారమాహ |

సనత్కుమార ఉవాచ |

భవాన్‌ కథమనుప్రాప్తో మహాదేవాంశజశ్శివమ్‌ | శ్రోతుమిచ్ఛామి తత్సర్వం వక్తుమర్హసి మే ప్రభో || 1

తరువాత నందీశ్వరావతారము వర్ణింపబడుచున్నది. సనత్కుమారుడిట్లు పలికెను-

ఓ ప్రభూ! నీవు మహాదేవుని అంశతో జన్మించి, ఆ తరువాత శివుని ఎట్లు పొందితివి? ఆ వృత్తాంతమునంతనూ వినగోరుచున్నాను. నాకు నీవు చెప్పదగుదువు (1).

నందీశ్వర ఉవాచ |

సనత్కుమార సర్వజ్ఞ సావధానతయా శృణు | యథాహం చ శివం ప్రాప్తో మహాదేవాంశజోమునే || 2

ప్రజాకామశ్శిలాదో%భూదుక్తః పితృభిరాదరాత్‌ | తదుద్ధర్తు మనా భక్త్యా సముద్ధారమ భీప్సుభిః || 3

అధోదృష్టిస్సుధర్మాత్మా శిలాదో నామ వీర్యవాన్‌ | తస్యాసీన్మునికైర్వృత్తి శ్శివలోకే చసో %గమత్‌ (?) || 4

శక్రముద్దిశ్య స మునిస్తపస్తేపే సుదుస్సహమ్‌ | నిశ్చలాత్మా శిలాదాఖ్యో బహుకాలం దృఢవత్రః || 5

తపతస్తస్య తపసా సంతుష్టో% భూచ్ఛతక్రతుః | జగామ చ వరం దాతుం సర్వదేవ ప్రభుస్తదా || 6

శిలాదమాహ సుప్రీత్యా శక్రస్తుష్టో%స్మితే%నఘ | తేన త్వం మునిశార్దూల వరయస్వ వరానితి || 7

తతః ప్రణమ్య దేవేశం స్తు త్వా స్తుతిభిరాదరాత్‌ | శిలాదో మునిశార్దూలస్తమాహ సుకృతాంజలిః || 8

నందీశ్వరుడిట్లు పలికెను-

సనత్కుమారా ! నీవు సర్వజ్ఞుడవు. సావధానముగా వినుము. ఓ మహర్షీ! మహాదేవుని అంశతో జన్మించిన నేను శివుని పొందిన విధమును చెప్పెదను (2). శిలాదుడనే ధర్మాత్ముడగు మహర్షి ఉండెను. తమయొక్క ఉద్ధారమును కోరిన పితృదేవతలు ఆదరముతో శిలాదుని ప్రార్థించగా, ఆతడు వారియందలి భక్తిచే వారిని ఉద్ధరించ గోరి సంతానముపేను కాంక్షించెను (3, 4) ఆ శిలాదమహర్షి దృఢమగు దీక్ష గలవాడై నిశ్చలమగు అంతఃకరణముతో ఇంద్రుని ఉద్దేశించి చిరకాలము కఠోరమగు తపస్సును చేసెను (5). ఆతడిట్లు తపస్సును చేయుచుండగా, దేవతలందరికీ ప్రభువగు ఇంద్రుడు సంతసిల్లి వరమునిచ్చుటకు వెళ్లెను (6). ఇంద్రుడు మిక్కిలి ప్రీతితో శిలాదుని ఉద్దేశించి ఇట్లు పలికెను. ఓయీ పుణ్యాత్మా ! మహర్షీ! నేను చాల సంతోషించితిని. కావున నీవు వరములను కోరుకొనుము (7). అపుడు శిలాదమహర్షి దేవేంద్రునకు ప్రణమిల్లి స్తోత్రములతో సాదరముగా కొనియాడి చక్కగా చేతులను జోడించి ఇట్లు పలికెను (8).

శిలాద ఉవాచ |

శతక్రతో సురేశాన సంతుష్టో యది మే ప్రభో | అయోనిజం మృత్యుహీనం పుత్రమిచ్ఛామి సువ్రతమ్‌ || 9

శిలాదుడిట్లు పలికెను -

హే శతక్రతూ! సురేశ్వరా ! ప్రభూ ! నీవు నాయందు సంతుష్టుడవైనచో, అయోనిజడు, అమరుడు, గొప్ప వ్రతము గలవాడునగు పుత్రుని గోరుచున్నాను (9).

శక్ర ఉవాచ |

పుత్రం దాస్యామి పుత్రార్థిన్‌ యోనిజం మృత్యుసంయుతమ్‌ | అన్యథా తే న దాస్యామి మృత్యుహీనా న సంతివై || 10

న దాస్యామి సుతం తే%హం మృత్యుహీనమయోనిజమ్‌ | హరిర్విధిశ్చ భగవాన్‌ కి ముతాన్యే మహామునే || 11

తావపి త్రి పురార్యంగ సంభవౌ మరణాన్వితౌ | తయోరప్యాయుషాం మానం కథితం నిగమే పృథక్‌ || 12

తస్మాదయోనిజే పుత్రే మృత్యుహీనే ప్రయత్నతః | పరిత్యజాశాం విప్రేంద్ర గృహాణాత్మక్షమం సుతమ్‌ || 13

కిం తు దేవేశ్వరో రుద్రః ప్రసీదతి మహేశ్వరః | సుదుర్లభో మృత్యుహీనస్తవ పుత్రో హ్యయోనిజః || 14

అహం చ విష్ణుర్భగవాన్‌ ద్రుహిణశ్చ మహామునే | అయోనిజం మృత్యుహీనం పుత్రం దాతుం న శక్నుమః || 15

ఆరాధయ మహాదేవం తత్పుత్ర వినికామ్యయా | సర్వేశ్వరో మహాశక్తస్స తే పుత్రం ప్రదాస్యతి || 16

ఇంద్రుడిట్లు పలికెను-

పుత్రుని కోరు ఓ శిలాదా ! స్త్రీ గర్బమునుండి జన్మించువాడు, మర్త్యుడు అగు పుత్రుని నీకు ఇచ్చెదను. నీకు ఇష్టము కానిచో, నేను వరము నీయను. ఏలయన, మృత్యువు లేనివారు లేరు సుమా! (10) అయోనిజుడు, అమరుడు అగుపుత్రుని నేను నీకీయ జాలను. భగవాన్‌ విష్ణువు, మరియు బ్రహ్మకూడ ఈయజాలరు. ఓ మహర్షీ! ఇతరుల గురించి చెప్పున దేమున్నది? (11) వారిద్దరు కూడ త్రిపురారి యగు శివుని దేహమునుండి పుట్టినవారే. మరియు వారికి కూడ మరణము గలదు. శాస్త్రము వారిద్దరి ఆయుర్దాయములను వేర్వేరుగా నిరూపించి యున్నది (12). ఓ బ్రాహ్మణశ్రేష్ఠా ! కావున అయోనిజుడు, అమరుడు అగు పుత్రునియందలి ఆశను ప్రయత్నపూర్వకముగా విడనాడి నీకు తగిన పుత్రుని స్వీకరించుము (13). కాని దేవదేవుడు, మహేశ్వరుడు అగు రుద్రుడు ప్రసన్నుడైనచో, అయోనిజుడు, అమరుడు అగు పుత్రుడు మిక్కిలి దుర్లభుడే అయినా, నీకు లభించవచ్చును (14). ఓ మహామునీ ! నేను గాని, విష్ణుభగవానుడు గాని, బ్రహ్మగాని నీకు అయోనిజుడు, అమరుడు అగు పుత్రుని అనుగ్రహింప జాలము (15). అట్టి పుత్రుని నీవు కోరినచో, మహాదేవుని ఆరాధించుము. సర్వశక్తిమంతుడు, సర్వేశ్వరుడు అగు ఆ శివుడు నీకు పుత్రుని అనుగ్రహించగలడు (16).

నందీశ్వర ఉవాచ |

ఏవం వ్యాహృత్య విప్రేంద్ర మనుగృహ్య చ తం ఘృణీ | దేవైర్వృతస్సురే శానస్స్వలోకం సమగాన్మునే || 17

గతే తస్మింశ్చ వరదే సహస్రాక్షే శిలాశనః | ఆరాధయన్మహాదేవం తపసాతోషయద్భవమ్‌ || 18

అథ తసై#్య వమనిశం తత్పరస్య ద్విజస్యవై | దివ్యం వర్ష సహస్రం తు గతం క్షణమివాద్భుతమ్‌ || 19

వల్మీకేన వృతాంగశ్చ లక్షకీటగణౖర్మునిః | వజ్రసూచీముఖైశ్చాన్యై రక్త భుగ్భిశ్చ సర్వతః || 20

నిర్మాంస రుధిరత్వగ్వై బిలే తస్మిన్నవస్థితః | అస్థిశేషో%భవత్పశ్చాచ్ఛిలాదో మునిసత్తమః || 21

తుష్టః ప్రభుస్తదా తసై#్మ దర్శయామాస స్వాం తనుమ్‌ | దివ్యాం దివ్య గణౖర్యుక్తామ లభ్యాం వామబుద్ధిభిః || 22

దివ్యవర్ష సహస్రేణ తప్యమానాయ శూలధృక్‌ | సర్వదేవాధిపస్తసై#్మ వరదో%స్మీత్యభాషత || 23

మహాసమాధి సంలీనస్స శిలాదో మహామునిః | నాశృణోత్తద్గిరం శంభోర్భక్త్యధీన తరస్యవై || 24

నందీశ్వరుడిట్లు పలికెను -

ఓ మహర్షీ! దయామయుడగు దేవేంద్రుడు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠునితో నిట్లు పలికి, ఆయనను అనుగ్రహించి, దేవతలతో గూడినవాడై తన లోకమునకు వెళ్లెను (17). వరములనిచ్చు ఆ ఇంద్రుడు అంతర్ధానమైన తరువాత, శిలాదుడు మహాదేవుడగు భవుని తపస్సుచే ఆరాధించి సంతోషపెట్టెను (18). ఇట్లు ఆ బ్రాహ్మణుడు నిరంతరము తపస్సును చేయుచుండగా, వేయి దివ్యసంవత్సరములు క్షణమువలె గడిచిపోయెను. ఇది అద్భుతము (19). ఆ మహర్షియొక్క దేహము చుట్టూ పుట్టలు పెరిగెను. వజ్రము వలె పదునైన నోళ్లు గలిగి రక్తమును త్రాగే వివిధరకముల కీటకములు లక్షలసంఖ్యలో ఆతని దేహమునంతనూ వ్యాపించి యుండెను (20). ఆతడు ఆ పుట్టల లోపల మాంసము, రక్తము మరియు చర్మమును కూడ కోల్పోయి తపమునా చరించెను. ఆ శిలాదమహర్షియొక్క అస్థిపంజరము మాత్రమే మిగిలియుండెను (21). అపుడు శివప్రభుడు సంతసిల్లి ఆతనికి దివ్యమైనది, దివ్యమగు గణములతో కూడియున్నది, దుర్బుద్ధి గలవారికి లభింప శక్యము కానిది అగు తన స్వరూపమును చూపించెను (22). శూలధారి, సర్వదేవాధిదేవుడు అగు శివుడు వేయి దివ్య సంవత్సరములనుండి తపస్సు చేయుచున్న అతనితో 'వరమునిచ్చెదను' అని పలికెను (23) భక్తులకు అత్యంతము వశుడై ఉండే శంభుని ఆ మాటను మహాసమాధిలో లీనమైయున్న శిలాదమహర్షి వినలేదు (24).

యదా స్పృష్టో మునిస్తేన కరేణ త్రిపురారిణా | తదైవ మునిశార్దూల ఉత్ససర్జ తపః క్రమమ్‌ || 25

అథోన్మీల్య మునిర్నేత్రే సోమం శంభుం విలోకయన్‌ | ద్రుతం ప్రణమ్య స ముదా పాదయోర్న్య పతన్మునే || 26

హర్షగద్గదయా వాచా సతస్కంధః కృతాంజలిః | ప్రసన్నాత్మా శిలాదస్స తుష్టావ పరమేశ్వరమ్‌ || 27

తతః ప్రసన్నో భగవాన్‌ దేవదేవస్త్రిలోచనః | వరదో%స్మీతి తం ప్రాహ శిలాదం ముని పుంగవమ్‌ || 28

తపసానేన కిం కార్యం భవతే హి మహామతే | దదామి పుత్రం సర్వజ్ఞం సర్వశాస్త్రార్థ పారగమ్‌ || 29

తతః ప్రణమ్య దేవేశం తచ్ఛ్రుత్వా చ శిలాశనః | హర్షగద్గదయా వాచోవాచ సోమవిభూషణమ్‌ || 30

ఓ మహర్షీ! త్రిపురారియగు శివుడు ఆ మహర్షిని చేతితో స్పృశించిన తరువాత మాత్రమే ఆ మహర్షి క్రమముగా సమాధిని విడిచిపెట్టెను (25). ఓ మహర్షీ! అపుడా ముని కళ్లను తెరిచి పార్వతీసమేతుడగుపరమేశ్వరుని దర్శించి వెంటనే ప్రణమిల్లి ఆనందముతో వెంటనే పాదములపై బడెను (26). ఆ శిలాదుడు సాష్టాంగప్రణామమును చేసిచేతులు జోడించి, ప్రసన్నమగు మనస్సు గలవాడై, హర్షముతో గద్గదమైన స్వరముతో పరమేశ్వరుని స్తుతించెను (27). అపుడు దేవదేవుడు, ముక్కంటి యగు భగవానుడు ప్రసన్నుడై శిలాదమహర్షితో 'వరమునిచ్చెదను' అని పలికెను (28). ఓ మహాజ్ఞానీ! నీకు ఈ తపస్సుచే సాధింపదగినది ఏది గలదు? సర్వజ్ఞుడు, సర్వశాస్త్రములలో దిట్టయగు కుమారుని నీకు ఇచ్చెదను (29). అపుడా మాటను విని, శిలాదుడు దేవదేవుడగు ఆ సోమశేఖరునకు నమస్కరించి ఆనందముతో గద్గదమైన వచనముతో నిట్లు పలికెను (30).

శిలాద ఉవాచ |

మహేశ యది తుష్టో%సియది వా వరదశ్చ మే | ఇచ్ఛామి త్వత్సమం పుత్రం మృత్యుహీనమయోనిజమ్‌ || 31

శిలాదుడిట్లు పలికెను -

ఓ మహేశ్వరా! నీవు సంతసించి వరము నీయ గోరినచో, నేను నీతో సమానమైనవాడు, మరణము లేనివాడు, అయోనిజుడు అగు పుత్రుని గోరుచున్నాను (31).

నందీశ్వర ఉవాచ |

ఏవముక్తస్తతో దేవస్త్ర్యంబకస్తేన శంకరః | ప్రత్యువాచ ప్రసన్నాత్మా శిలాదం మునిసత్తమమ్‌ || 32

నందీశ్వరుడిట్లు పలికెను-

శిలాద మహర్షి ఇట్లు పలుకగా ముక్కంటి దేవుడగు శంకరుడు ప్రసన్నమగు అంతఃకరణము గలవాడై ఇట్లు బదులిడెను (32).

శివ ఉవాచ |

పూర్వమారాధితో విప్ర బ్రహ్మణాహం తపోధన | తపసా చావతారార్థం మునిభిశ్చ సురోత్తమైః || 33

తవ పుత్రో భవిష్యామి నందీ నామ్నా త్వయోనిజః | పితా భవిష్యసి మమ పితుర్వై జగతాం మునే || 34

శివుడిట్లు పలికెను-

హే బ్రాహ్మణా! నీవు తపోధనుడవు. పూర్వము నన్ను బ్రహ్మ, మహర్షులు, దేవశ్రేష్ఠులు తపస్సుచే ఆరాధించి అవతరించుమని గోరియున్నారు (33). ఓ మహర్షీ! నేను నంది అను పేరుతో నీకు అయోనిజుడగు పుత్రుడను కాగలను. జగత్తులకు తండ్రిని అగు నాకు నీవు తండ్రివి కాగలవు (34).

నందీశ్వర ఉవాచ |

ఏవముక్త్వా మునిం ప్రేక్ష్య ప్రణిపత్యాస్థితం ఘృణీ | సోమం తూర్ణం సమాదిశ్య తత్రైవాంతర్దధే హరః || 35

గతే తస్మిన్మహాదేవే స శిలాదో మహామునిః | స్వమాశ్రమముపాగమ్య ఋషిభ్యో%కథయత్తతః || 36

కియతా చైవ కాలేన తదాసౌ జనకస్స మే | యజ్ఞాంగణం చకర్షాశు యజ్ఞార్థం యజ్ఞవిత్తమః || 37

తతః క్షణాదహం శంభోస్తనుజస్తస్య చాజ్ఞయా | స జాతః పూర్వమేవాహం యుగాంతాగ్ని సమప్రభః || 38

అవర్షంస్తదా పుష్కరావర్తకాద్యా జగుః ఖేచరాః కిన్నరాస్సిద్ధసాధ్యాః |

శిలాదాత్మజత్వం గతే మయ్యృషీంద్రాః సమంతాచ్ఛ వృష్టిం వ్యధుః కౌసుమీం తే || 39

అథ బ్రహ్మాదయో దేవా దేవపత్న్యశ్చ సర్వశః | తత్రాజగ్ముశ్చ సుప్రీత్యా హరిశ్చైవ శివో%ంబికా || 40

తదోత్సవో మహానాసీన్ననృతుశ్చాప్సరోగణాః | ఆదృత్య మాం తథా లింగన్‌ తుష్టువుర్హర్షితాశ్చ తే || 41

నందీశ్వరుడిట్లు పలికెను-

దయా మయుడగు హరుడు ప్రణమిల్లి నిలబడియున్న మహర్షిని గాంచి ఇట్లు పలికి వెంటనే సోమయాగమును చేయుమని ఆదేశించి అచటనే అంతర్ధానమును చెందెను (35). ఆ మహాదేవుడు అంతర్ధానము కాగానే, ఆ శిలాదమహర్షి తన ఆశ్రమమునకు వచ్చి ఋషులతో జరిగిన వృత్తాంతమును చెప్పెను (36). కొంతకాలము గడిచిన తరువాత నా తండ్రి, యజ్ఞవేత్తలలో శ్రేష్ఠుడు అగు ఆ శిలాదుడు యజ్ఞము కొరకై శీఘ్రమే యజ్ఞశాలను నిర్మించెను (37). అపుడు నేను శంభుని ఆజ్ఞచే యజ్ఞమునకు పూర్వమే ప్రలయాకాలాగ్నితో సమమగు తేజస్సు గలవాడనై ఆతని శరీరము నుండి ఉద్భవించితిని (38). అపుడు పుష్కరావర్త కాది మేఘములు వర్షించినవి. ఆకాశమునందు సంచరించుకిన్నరులు, సిద్ధులు, సాధ్యులు గానము చేసిరి. నేను శిలాదుని పుత్రుడను కాగానే, మహర్షులు అన్నివైపులనుండి పుష్పవృష్టిని గురిపించిరి (39). అపుడు బ్రహ్మాది దేవతలు, దేవపత్నులు అందరు మిక్కిలి ప్రీతితో అచటకు విచ్చేసిరి. విష్ణువు, శివుడు మరియు పార్వతి కూడ విచ్చేసిరి (40). అపుడు గొప్ప ఉత్సవము జరిగెను. అప్సరసల గణములు నాట్యమును చేసిరి. వారందరు ఆనందముతో నన్ను సాదరముగా ఆలింగనము చేసి స్తుతించిరి (41).

సుప్రశస్య శిలాదం తం స్తుత్వా చ సుస్తవైశ్శివౌ | సర్వే జగ్ముశ్చ ధామాని శివావప్య ఖిలేశ్వరౌ || 42

శిలాదో%పి చ మాం దృష్ట్వా కాలసూర్యానలప్రభమ్‌ | త్ర్యక్షం చతుర్భుజం బాలం జటాముకుట ధారిణమ్‌ || 43

త్రిశూలాద్యాయుధం దీప్తం సర్వథా రుద్రరూపిణమ్‌ | మహానందభరః ప్రీత్యా ప్రణమ్యం ప్రణనామ చ || 44

పార్వతీ పరమేశ్వరులు మరియు సమస్త దేవతలు, ఇంద్రాది ప్రభువులు శిలాద మహర్షిని ప్రశంసించి స్తుతించి తమ తమ థామములకు వెళ్లిరి (42). ప్రళయ కాలమునందలి సూర్యుని వలె అగ్నివలె ప్రకాశించునట్టియు, మూడు నేత్రములు నాల్గు భుజములు కలిగినట్టియు, జటలను కిరీటమును ధరించి నట్టియు, త్రిశూలము మొదలగు ఆయుధములు కలిగినట్టియు, సర్వవిధములుగా ప్రకాశించునట్టియు, రుద్రస్వరూపుడైనట్టియు, నమస్కరింపదగినవాడై నట్టియు, బాలకుడనగు నన్ను గాంచి మహానంద భరితుడై ప్రేమతో నమస్కరించెను (43, 44).

శిలాద ఉవాచ |

త్వయాహం నందితో యస్మాన్నందీ నామ్నా సురేశ్వర | తస్మాత్త్వాం దేవమానందం నమామి జగదీశ్వరమ్‌ || 45

శిలాదుడిట్లు పలికెను-

ఓ దేవశ్రేష్ఠా! నీవు నాకు ఆనందమును కలిగించితివి గాన నీకు నంది అను పేరు సార్థకము కాగలదు. ఆనందఘనుడవు. జగదీశ్వరుడవు. ప్రకాశస్వరూపుడవు అగు నీకు నమస్కారము (45).

నందీశ్వర ఉవాచ |

మయా సహ పితా హృష్ణ స్సుప్రణమ్య మహేశ్వరమ్‌ | ఉటజం స్వం జగామాశు నిధిం లభ్ధ్వేవ నిర్ధనః || 46

యదా గతో%హముటజం శిలాదస్య మహామునే | తదాహం తాదృశం రూపం త్యక్త్వా మానుష్య మాస్థితః || 47

మానుష్యమాస్థితం దృష్ట్వా పితా మే లోకపూజితః | విలలాపాతిదుఃఖార్త స్స్వజనైశ్చ సమావృతః || 48

జాతకర్మాది కాన్యేవ సర్వాణ్యాపి చకారమే | శాలంకాయనపుత్రో వై శిలాదః పుత్రవత్సల || 49

వేదానధ్యాపయామాస సాంగోపాంగానశేషతః | శాస్త్రాణ్యన్యాన్యపి తథా పంచవర్షే పితా చ మామ్‌ || 50

సంపూర్ణే సప్తమే వర్షే మిత్రావరుణ సంజ్ఞకౌ| మునీ తస్యాశ్రమం ప్రాప్తౌ ద్రష్టుం మాం చాజ్ఞయా విభోః || 51

సత్కృతౌ మునినా తేన సూపవిష్టౌ మహామునీ | ఊచతుశ్చ మహాత్మానౌ మాం నిరీక్ష్య ముహుర్ముహుః || 52

నందీశ్వరుడిట్లు పలికెను-

హర్షముతో గూడియున్న నా తండ్రి, దరిద్రునకు నిధి లభించినట్లు, నన్ను పొంది మహేశునకు ప్రణమిల్లి తన పర్ణశాలకు వెంటనే చేరుకొనెను (46). ఓ మహర్షీ!నేను శిలాదుని పర్ణశాలకు చేరుకోగానే అటువంటి దివ్యరూపమును విడిచి మనుష్యరూపమును దాల్చితిని (47). లోకవందితుడగు నా తండ్రి మనుష్య రూపమును దాల్చిన నన్ను గాంచి మిక్కిలి దుఃఖముతో గూడినవాడై తన బంధువులచే చుట్టువారబడి రోదించెను (48). శాలంకాయనుని కుమారుడగు ఆ శిలాదుడు పుత్రుని యందు ప్రేమ గలవాడై నాకు జాతకర్మ మొదలగు సంస్కారముల నన్నిటినీ జరిపించెను (49). నా తండ్రి నాకు అయిదవ ఏట అంగ, ఉపాంగములతో కూడిన సర్వవేదములను, మరియు ఇతరశాస్త్రములను కూడ నేర్పించెను (50). నాకు ఏడవ సంవత్సరము వయస్సు రాగానే, పరమేశ్వరుని ఆజ్ఞచే మిత్రావరుణులను పేరు గల ఇద్దరు ఋషులు నన్ను చూచుటకై శిలాదుని ఆశ్రమమునకు విచ్చేసిరి (51). శిలాదమహర్షి ఆ మహామునులనిద్దరినీ ఆసనమునిచ్చి సత్కరించెను. ఆ మహాత్ములిద్దరు నన్ను అనేకపర్యాయములు పరికించి ఇట్లు పలికిరి (52).

మిత్రావరుణాపూచతుః |

తాత నందీ తవాల్పాయుస్సర్వశాస్త్రార్థపారగః | న దృష్టమేవ చాపశ్యం హ్యాయుర్వర్షాదతః పరమ్‌ || 53

ఇత్యుక్తవతో ర్విప్రయోశ్శిలాదః పుత్రవత్సలః | తమాలింగ్య చ దుఃఖార్తో రురో దాతీవ విస్వరమ్‌ || 54

మృతవత్పతితం దృష్ట్వా పితరం చ పితామహమ్‌ | ప్రత్యవోచత్ర్పసన్నాత్మా స్మృథ్వా శివపదాంబుజమ్‌ || 55

కేన త్వం తాత దుఃఖేన వేపమానశ్చ రోదిషి | దుఃఖం తే కుత ఉత్పన్నః జ్ఞాతుమిచ్ఛామి తత్త్వతః || 56

మిత్రావరుణులు ఇట్లు పలికిరి-

వత్సా! నీ కుమారుడగు నంది సర్వశాస్త్రములలో నిష్ణాతుడే అయిననూ, అల్పాయుష్కుడు. మేము పరిశీలించి చూచితిమి. ఈతడు ఇప్పటినుండి సంవత్సరము తరువాత జీవించి యుండునని మాకు తోచుట లేదు (53). ఆ బ్రాహ్మణులు ఇట్లు చెప్పగా, పుత్రునియందు అనురాగము గల శిలాదుడు ఆ బాలుని కౌగిలించుకొని దుఃఖముచే పీడితుడై బిగ్గరగా పాదపద్మములను స్మరించి ఇట్లు పలికెను (55). తండ్రీ! నీవు దుఃఖముతో వణికిపోతూ ఏల ఏడ్చుచుంటివి? నీకు దుఃఖము కలుగుటకు కారణమేమి? నేను యథాతథముగా తెలియ గోరుచున్నాను (56).

పితోవాచ |

తవాల్ప మృత్యు దుఃఖేన దుఃఖితో%తీవ పుత్రక | కో మే దుఃఖం హరతు వై శరణం తం ప్రయామి హ || 57

తండ్రి ఇట్లు పలికెను-

కుమారా! నీ ఆయుర్దాయము అల్పమగుటచే నాకు అతిశయించిన దుఃఖము కలుగుచున్నది. నాదుఃఖమును ఎవరు పోగొట్టగలరో, వారిని నేను శరణు వేడెదను (57)

పుత్ర ఉవాచ |

దేవో వా దానవో వాపి యమః కాలో%థ వాపి హి | ఋధ్యేయుర్యద్యపి హ్యేతే మామన్యే%పి జనాస్తథా || 58

అథాపి చాల్పమృత్యుర్మే న భవిష్యతి మా తుదః | సత్యం బ్రవీమి జనకం శపథం తే కరోమ్యహమ్‌ || 59

పుత్రుడిట్లు పలికెను-

దేవతలు, దానవులు, కాలపురుషుడగు యముడు, మరియు ఇతరులు విడివిడిగా గాని, కలిసి గాని నాకు మృత్యువును కలిగించలేరు (58). నాకు అల్పకాలములో మరణము కలుగదు. నీవు దుఃఖించకుము. తండ్రివగు నీకు నేను శపథము చేసి సత్యమును చెప్పుచున్నాను (59)

పితోవాచ |

కిం తపః కిం పరిజ్ఞానం కో యోగశ్చ ప్రభుశ్చ తే | యేన త్వం దారుణం దుఃఖం వంచయిష్యసి పుత్రమే || 60

తండ్రి ఇట్లు పలికెను-

నీ తపస్సు ఎట్టిది? పరిజ్ఞానమెట్టిది? నీ యోగమేది? నీ ప్రభువు ఎవరు? పుత్రా! నీవు ఏ బలముచే నా దారుణమగు దుఃఖమును పోగొట్టగలవు? (60).

పుత్ర ఉవాచ |

న తాత తపసా మృత్యుం వంచయిష్యే న విద్యయా | మహాదేవస్య భజనాన్మృత్యుం జేష్యామి నాన్యథా || 61

పుత్రుడిట్లు పలికెను -

తండ్రీ! నేను తపస్సుచే గాని, విద్యచే గాని మృత్యువు నుండి తప్పించుకొన గోరుటలేదు. మహాదేవుని భజించి నేను మృత్యువును జయించెదను. మరియొక ఉపాయములేదు (61).

నందీశ్వర ఉవాచ |

ఇత్యుక్త్వాహం పితుః పాదౌప్రణమ్య శిరసా మునే | ప్రదక్షిణీ కృత్య చ తమగచ్ఛం వనముత్తమమ్‌ || 62

ఇతి శ్రీ శివమహాపురాణ శతరుద్ర సంహితాయాం నందికేశ్వరావతారవర్ణనం నామ షష్టో%ధ్యాయః (6)

నందీశ్వరుడిట్లు పలికెను-

ఓ మహర్షీ! నేను ఇట్లు పలికి తండ్రి పాదములకు ప్రణమిల్లి ఆయనకు ప్రదక్షిణము చేసి ఉత్తమమగు వనమునకు వెళ్లితిని (62).

శ్రీ శివమహాపురాణములోని శతరుద్రసంహితయందు నందీశ్వరావతారవర్ణనమనే ఆరవ అధ్యాయము ముగిసినది (6).

Siva Maha Puranam-3    Chapters