Siva Maha Puranam-3    Chapters   

అథ ఏకవింశో%ధ్యాయః

భీమేశ్వర జ్యోతిర్లింగ మాహాత్మ్యము

సూత ఉవాచ |

శివో%పి చ గణౖస్సార్ధం జగామ హితకామ్యయా | స్వభక్తనికటం గుప్తస్తస్థౌ రక్షార్థమాదరాత్‌|| 1

ఏతస్మిన్నంతరే తత్ర కామరూపేశ్వరేణ చ | అత్యంతం ధ్యానమారబ్ధం పార్థివస్య పురస్తదా || 2

కేనచిత్తం గత్వా చ రాక్షసాయ నివేదితమ్‌ | రాజా కించిత్కరోత్యేవం త్వదర్థం హ్యాభిచారికమ్‌ || 3

రాక్షసస్స చ తచ్ఛ్రుత్వా క్రుద్ధస్తద్ధన నేచ్ఛయా | గృహీత్వా కరవాలం చ జగామ నృపతిం ప్రతి || 4

తద్దృష్ట్వా రాక్షసస్తత్రపార్థివాది స్థితం చ యత్‌ | తదర్థం తత్స్వరూపం చ దృష్ట్వా కించిత్కరోత్యసౌ || 5

అత ఏనం బలాదద్య హన్మి సోపస్కరం నృపమ్‌ | విచార్యేతి మహాక్రుద్ధో రాక్షసః ప్రాహ తం నృపమ్‌ || 6

సూతుడు ఇట్లు పలికెను-

శివుడు కూడ గణములతో కూడి తన భక్తునకు హితమును చేయుట కొరకై ఆతని సమీపమునకు వెళ్లి అతనిని రక్షించుటయందు శ్రద్ధ గలవాడై అచట రహస్యముగా దాగియుండెను (1). అతే సమయములో కామరూపమహారాజు శివుని పార్థివమూర్తియెదుట గొప్ప ధ్యానమును ఆరంభించెను (2). ఒకానొక కింకరుడు ఆ రాక్షషునివద్దకు వెళ్లి ఈ రాజు నీపై ఏదో ఒక చేతబడిని చేయుచున్నాడని చెప్పెను (3). దానిని విని ఆ రాక్షసుడు కోపించి ఆ మహారాజును చంపగోరి కత్తిని చేత బట్టుకొని ఆయనవద్దకు వెళ్లెను (4). ఆ రాక్షసుడు అచటకు వెళ్లి పార్థివమూర్తి మొదలగు వాటిని చూచి ఇట్లు తలపోసెను: ఈతడు ఈ మూర్తిని చూస్తూ ఏదో చేయుచున్నాడు. కావున, పరిచారకులతో సహా ఈ రాజును బలప్రయోగముచే సంహరించెదను. ఇట్లు తలపోసి ఆ రాక్షసుడు మహా క్రోధముతో ఆ రాజును ఉద్దేశించి ఇట్లు పలికెను (5, 6).

భీమ ఉవాచ |

రే రే పార్థివ దుష్టాత్మన్‌ క్రియతే కిం త్వయాధునా | సత్యం వద న హన్యాం త్వామన్యథా హన్మి నిశ్చితమ్‌ || 7

భీముడు ఇట్లు పలికెను-

ఓరీ రాజా! దుర్బుద్ధీ! నీవు ఇపుడు ఏమి చేయుచున్నావు? సత్యమును పలుకుము. సత్యమును చెప్పినచో నిన్ను సంహరించను. లేనిచో, నిన్ను నిశ్చితముగా సంహరించెదను (7).

సూత ఉవాచ |

ఇతి శ్రుత్వా వచస్తస్య కామరూపేశ్వరశ్చ సః | మనసీతి చిచింతాశు శివవిశ్వాసపూరితః || 8

భవిష్యం యద్భవత్యేవ నాస్తి తస్య నివర్తకః | ప్రారబ్ధాధీనమేవాత్ర ప్రారబ్ధస్స శివస్స్మృతః || 9

కృపాలుశ్శంకరశ్చాత్ర పార్థివే వర్తతే ధ్రువమ్‌ | మదర్థం న కరోతీహ కుతః కో%యం చరాక్షసః || 10

స్వానురూపాం ప్రతిజ్ఞాం స సత్యం చైవ కరిష్యతి | సత్యప్రతిజ్ఞో భగవాన్‌ శివచ్చేతి శ్రుతౌ శ్రుతః || 11

మమ భక్తం యదా కశ్చిత్పీడయత్యతిదారుణః | తదాహం తస్య రక్షార్థం దుష్టం హన్మి న సంశయః || 12

ఏవం ధైర్యం సమాలంబ్య ధ్యాత్వా దేవం చ శంకరమ్‌ | ప్రార్థయామాస సద్భక్త్యా మనసైవ రసేశ్వరః || 13

త్వదీయో%స్మి మహారాజ యథేచ్ఛసి తథా కురు | సత్యం చ వచనం హ్యత్ర బ్రవీమి కురు మే హితమ్‌ || 14

ఏవం మనసి స ధ్యాత్వా సత్యపాశేన యంత్రితః | ప్రాహ సత్యం వచో రాజా రాక్షసం చావమానయన్‌ || 15

సూతుడు ఇట్లు పలికెను-

వాని ఆ మాటలను విని శివునియందు విశ్వాసముతో నిండిన మనస్సుగల ఆ కామరూపమహారాజు మనస్సులో ఇట్లు తలపోసెను (8). జరుగవలసినది జరిగియే తీరును. దానిని నివారించగలవారు లేరు. ఈ లోకములో సర్వము ప్రారబ్ధముపై ఆధారపడియున్నది. ప్రారబ్ధకర్మఫలమును ఇచ్చువాడు శివుడని మహర్షులు చెప్పుచున్నారు (9). దయాళువగు శంకరుడు ఈ పార్థివమూర్తియందు నిశ్చయముగానున్నాడు. ఈ కాలములో ఆయన నా పనిని చేయడా యేమి? ఈ రాక్షసుడు ఎవ్వాడు? (10) ఆయన తనకు తగిన ప్రతిజ్ఞను చేసి దానిని సత్యము చేయును. శివభగవానుడు సత్యమగు ప్రతిజ్ఞ గలవాడని వేదము చెప్పుచున్నది (11). నా భక్తుని ఎవడైననూ క్రూరాత్ముడు పీడించినచో, అప్పుడు నేను ఆ భక్తుని రక్షించుటకొరకై ఆ దుష్టుని నిస్సందేహముగా సంహరించెదను (12). ఈ విధమగు ప్రతిజ్ఞపై విశ్వాసముతో ధైర్యమునవలంబించి ఆ మహారాజు శంకరదేవుని ధ్యానించి ఉత్తమమగు భక్తితో మనస్సులోననే ప్రార్థించెదను (13). ఓ జగన్నాథా! నేను నీ వాడను. నీకు తోచినట్లు చేయుము. నేను సత్యవచనమును ఇచట పలుకుచున్నాను. నాకు హితమును కలిగించుము (14). ఆ రాజు ఈ విధముగా మనస్సులో ధ్యానించి సత్యము అనే పాశముచే నియంత్రింపబడినవాడై ఆ రాక్షసునకు అవమానము కలుగు విధముగా సత్యవచనమును పలికెను (15).

నృప ఉవాచ |

భజామి శంకరం దేవం స్వభక్తపరిపాలకమ్‌ | చరాచరాణాం సర్వేషామీశ్వరం నిర్వికారకమ్‌ || 16

ఆ రాజు ఇట్లు పలికెను-

తన భక్తులను పరిపాలించువాడు, స్థావరజంగమాత్మకమగు ప్రాణులన్నింటికి నియామకుడు, వికారములు లేని వాడు అగు శంకరదేవుని సేవించుచున్నాను (16).

సూత ఉవాచ |

ఇతి తస్య వచశ్శ్రుత్వా కామరూపేశ్వరస్య సః | క్రోధేన ప్రచలద్గాత్రో భీమో వచనమబ్రవీత్‌ || 17

సూతుడు ఇట్లు పలికెను-

ఆ కామరూప మహారాజుయొక్క ఆ వచనములను విని కోపముతో కంపించుచున్న దేహము గలవాడై భీముడు ఇట్లు పలికెను (17).

భీమ ఉవాచ |

శంకరస్తే మయా జ్ఞాతః కిం కరిష్యతి వై మమ | యో మే పితృవ్యకేనైన స్థాపితః కింకరో యథా || 18

తద్బలం హి సమాశ్రిత్య విజేతుం త్వం సమీహసే | తర్హి త్వయా జితం సర్వం నాత్ర కార్యా విచారణా || 19

యావన్మయా న దృష్టో హి శంకరస్త్వత్ర్ప పాలకః | తావత్త్వం స్వామినం మత్వా సేవసే నాన్యథా క్వచిత్‌ || 20

మయా దృష్టే చ తత్సర్వం స్ఫుటం స్యాత్సర్వథా నృప | తస్మాత్త్వం వై శివస్యేదం రూపం దూరతరం కురు || 21

అన్యథా హి భయం తే%ద్య భవిష్యతి న సంశయః | స్వామినస్తే కరం తీక్‌ష్ణం దాస్యే%హం భీమవిక్రమః || 22

భీముడు ఇట్లు పలికెను-

నీ శంకరుడు నాకు తెలిసినవాడే. ఆయన నన్ను ఏమి చేయును? నా పినతండ్రి ఆయనను తన వద్ద సేవకునివలె ఉంచుకొనినాడు (18). నీవు ఆయనయొక్క బలమును నమ్ముకొని నన్ను జయించగోరుచున్నావు. అట్టైనచో, నీవు జయించినట్లే. ఈ విషయములో సందేహము లేదు (19). నిన్ను రక్షించే ఆ శివుని నేను చూడనంతవరకు నీవు ఆయనను ప్రభువుగా తలచి సేవించుము. ఏ కాలమునందైననూ దీనికి భిన్నముగా జరుగదు (20). ఓ రాజా! ఆయన నాకు కానవచ్చినచో, ఈ సర్వము అన్ని విధములుగా భగ్నమగును. కావున నీవు శివుని ఈ మూర్తిని దూరముగా పారవేయుము (21). నీవు అట్లు చేయనిచో, నీకు ఈనాడు భయము సంప్రాప్తమగుననుటలో సందేహము లేదు. భయంకరమగు పరాక్రమముగల నేను నీ స్వామికి నా వాడియగు చేతియొక్క దెబ్బను ఇచ్చుట నిశ్చయము (22).

సూత ఉవాచ |

ఇతి తద్వచనం శ్రుత్వా కామరూపేశ్వరో నృపః | దృఢం శంకరవిశ్వాసో ద్రుతం వాక్యమువాచ తమ్‌ || 23

సూతుడు ఇట్లు పలికెను-

కామరూపమహారాజు వాని ఈ మాటలను విని శంకరునియందు దృఢమగు విశ్వాసము గలవాడై వెంటనే వానితోనిట్లు పలికెను (23).

రాజోవాచ |

అహం చ పామరో దుష్టో న మోక్ష్యే శంకరం పునః | సర్వోత్కృష్టశ్చ మే స్వామీ న మాం ముంచతి కర్హిచిత్‌ || 24

రాజు ఇట్లు పలికెను-

నేను మూర్ఖుడను; దుష్టుడను. నేను శంకరుని మాత్రము విడిచిపెట్టను. నా స్వామి అందరికంటే గొప్పవాడు. నన్ను ఏనాడైననూ విడిచిపెట్టడు (24).

సూత ఉవాచ |

ఏవం వచస్తదా శ్రుత్వా తస్య రాజ్ఞశ్శివాత్మనః | తం ప్రహస్య ద్రుతం భీమో భూపతిం రాక్షసో%బ్రవీత్‌ || 25

సూతుడు ఇట్లు పలికెను-

శివస్వరూపుడగు ఆ రాజుయొక్క ఈ వచనమును విని వెంటనే భీమాసురుడు ఆ మహారాజును అవహేళన చేసి ఇట్లు పలికెను (25).

భీమ ఉవాచ |

మత్తో భిక్షయతే నిత్యం స కిం జానాతి స్వాకృతిమ్‌ | యోగినాం కా చ నిష్ఠా వై భక్తానాం ప్రతిపాలనే || 26

ఇతి కృత్వా మతిం త్వం చ దూరతో భవ సర్వథా | అహం చ తవ స స్వామీ యుద్ధం వై కరవావహై || 27

భీముడు ఇట్లు పలికెను-

మదించియున్న ఆ శివుడు నిత్యము భిక్షాటన చేయును. తన రూపమును గురించి ఆయనకు ఏమి తెలియును? భక్తులను రక్షించే పరాయణత్వము యోగులకు ఏల ఉండును? (26) నీవు ఈ విషయమును తెలుసుకొని ఆయనకు సర్వవిధములుగా దూరములో నుండుము. నీ ఆ స్వామి మరియు నేను యుద్ధమును చేసెదము (27).

సూత ఉవాచ |

ఇత్యుక్తస్స నృపశ్రేష్ఠశ్శంభుభక్తో దృఢవ్రతః | ప్రత్యువాచాభయో భీమం దుఃఖదం జగతాం సదా || 28

సూతుడు ఇట్లు పలికెను-

లోకములకు సర్వదా దుఃఖమును కలిగించే ఆ భీమాసురుడు ఇట్లు పలుకగా, శంభుని భక్తుడు, దృఢమగు వ్రతనిష్ఠ గలవాడు అగు ఆ మహారాజు భయము లేనివాడై ఇట్లు

బదులిడెను (28).

రాజోవాచ |

శృణు రక్షస దుష్టాత్మన్‌ మయా కర్తుం న శక్యతే | త్వయా విక్రమతే తర్హి కుతస్త్వం శక్తిమానసి || 29

రాజు ఇట్లు పలికెను-

ఓ రాక్షసా! దుర్బుద్ధీ! వినుము. నీ మాటలను పాలించుట నా వలన కాదు. నీకు తప్పు మార్గములో వెళ్లుటకు కావలసిన శక్తి ఎక్కడిది? (29)

సూత ఉవాచ |

ఇత్యుక్తసై#్సన్యమాదాయ రాజానం పరిభర్త్స్య తమ్‌ | కరాలం కరవాలం చ పార్థివే ప్రాక్షిపత్తదా || 30

పశ్య త్వం స్వామినో%ద్యైవ బలం భక్తసుఖావహమ్‌ | ఇత్యువాచ విహసై#్యవ రాక్షసైస్స మహాబలః || 31

కరవాలః పార్థివం చ యావత్‌ స్పృశతి నో ద్విజాః | యావచ్చ పార్థివాదస్మాదావిరాసీత్స్వయం హరః || 32

పశ్య భీమేశ్వరో%హం చ రక్షార్థం ప్రకటో%భవమ్‌ | మమ పూర్వవ్రతం హ్యేతద్రక్ష్యో భక్తో మయా సదా || 33

ఏతస్మాత్పశ్య మే శీఘ్రం బలం భక్తసుఖావహమ్‌ | ఇత్యుక్త్వా స పినాకేన కరవాలో ద్విధా కృతః || 34

పునశ్చైవ త్రిశూలం స్వం చిక్షిపే తేన రక్షసా | తచ్ఛూలం శతధా నీతమపి దుష్టస్య శంభునా || 35

పునశ్శక్తిశ్చ నిఃక్షిప్తా తేన శంభూపరి ద్విజాః | శంభునా సాపి బాణౖస్స్వర్తక్షధా చ కృతా ద్రుతమ్‌ || 36

పట్టిశశ్చ తతస్తేన నిఃక్షిప్తో హి శివోపరి | శివేన స త్రిశూలేన తిలశశ్చ కృతం క్షణాత్‌ || 37

తతశ్శివగణానాం చ రాక్షసానాం పరస్పరమ్‌ | యుద్ధమాసీత్తదా ఘోరం పశ్యతాం దుఃఖకావహమ్‌ || 38

తతశ్చ పృథివీ సర్వా వ్యాకులా చాభవత్‌ క్షణాత్‌ | సముద్రాశ్చ తదా సర్వే చుక్షభుస్సమహీధరాః|| 39

దేవాశ్చ ఋషయస్సర్వే బభూవుర్వికలా అతి | ఊచుః పరస్పరం చేతి వ్యర్థం వై ప్రార్థితశ్శివః || 40

నారదశ్చ సమాగత్య శంకరం దుఃఖదాహకమ్‌ | ప్రార్థయామాస తత్రైవ సాంజలిర్నతమస్తకః || 41

సూతుడు ఇట్లు పలికెను-

ఆ రాజు ఇట్లు పలుకగా అపుడాతడు ఆయనను నిందాపూర్వకముగా బెదిరించి సైన్యము తోడు రాగా భయంకరమగు కత్తిని శివుని పార్థివమూర్తిపై ప్రయోగించెను (30). భక్తులకు సుఖమును కలిగించే నీ స్వామియొక్క బలమును నీవు ఇపుడు చూడుము అని మహాబలశాలియగు ఆ రాక్షసుడు పలికెను. ఆతడు మరియు ఇతరరాక్షసులు బిగ్గరగా నవ్విరి (31). ఓ బ్రాహ్మణులారా! ఆ కత్తి పార్థివలింగమును స్పృశించుసరికి దానినుండి సాక్షాత్తుగా శివుడు ఆవిర్భవించెను (32). చూడుము. నేను భీమేశ్వరుడను. భక్తుని రక్షించుటకొరకు ప్రకటమైనాను. సర్వకాలములలో నాకు భక్తుడు రక్షణీయుడనే వ్రతము నాకు పూర్వమునుండియు గలదు (33). కావున భక్తులకు సుఖమును కలిగించే నా బలమును నీవు శీఘ్రముగా చూచెదవు అని పలికి ఆయన కత్తిని పినాకముతో రెండు ముక్కలుగా చేసెను (34). మరల ఆ దుష్టరాక్షసుడు తన త్రిశూలమును విసరగా శంభుడు ఆ శూలమును వంద ముక్కలుగా చేసెను (35). ఓ బ్రాహ్మణులారా! వాడు మరల శంభునిపై శక్తిని ప్రయోగించెను. శంభుడు వెంటనే దానిని తన బాణములతో లక్ష ముక్కలుగా చేసెను (36). తరువాత వాడు శివునిపై పట్టిశాయుధమును ప్రయోగించగా, శివుడు దానిని త్రిశూలముతో క్షణములో నుగ్గు నుగ్గు చేసెను (37). అప్పుడు శివగణములకు మరియు రాక్షసులకు పరస్పరము చూచువారలకు కూడ దుఃఖమును కలిగించే భయంకరమగు యుద్ధము జరిగెను (38). అపుడు క్షణములో భూమండలమంతయూ అల్లకల్లోలమయ్యెను. సకల సముద్రములు మరియు పర్వతములు కంపించిపోయెను (39). దేవతలు మరియు ఋషులు అందరు చాల వ్యాకులతను పొందిరి. మనము అనవసరముగా శివుని ప్రార్థించి పొరపాటు చేసితిమి అని వారు తమలోతాము పలుకజొచ్చిరి (40). నారదుడు వచ్చి చేతలును జోడించి తలను వంచి దుఃఖములను నశింపజేయు శంకరుని అదే స్థానములో ప్రార్థించెను (41).

నారద ఉవాచ |

క్షమ్యతాం క్షమ్యతాం నాథ త్వయా విభ్రమకారక | తృణకశ్చ కుఠారోవై హన్యతాం శీఘ్రమేవ హి || 42

ఇతి సంప్రార్థితశ్శంభుస్సర్వాన్‌ రక్షోగణాన్‌ ప్రభుః | హుంకారేణౖవ చాస్త్రేణ భస్మసాత్కృతవాంస్తదా || 43

సర్వే తే రాక్షసా దగ్ధాశ్శంకరేణ క్షణం మునే | బభూవుస్తత్ర సర్వేషాం దేవానాం పశ్యతాం ద్రుతమ్‌ || 44

దావానలగతో వహ్నిర్యథా చ వనమాదహేత్‌ | తథా శివేన క్రుద్ధేన రాక్షసానాం బలం క్షణాత్‌ || 45

భీమసై#్యవ చ కిం భస్మ న జ్ఞాతం కేనచిత్తదా | పరివారయుతో దగ్ధో నామ న శ్రూయతే క్వచిత్‌ || 46

తతశ్శివస్య కృపయా శాంతిం ప్రాప్తా మునీశ్వరాః | దేవాస్సర్వే చ శక్రద్యాస్స్వాస్థ్యం ప్రాపాఖిలం జగత్‌ || 47

క్రోధజ్వాలా మహేశస్య నిస్ససార వనాద్వనమ్‌ | రాక్షసానాం చ తద్భస్మ సర్వం వ్యాప్తం వనే%ఖిలమ్‌ || 48

తతశ్చౌషధయో జాతా నానాకార్యకరాస్తథా | రూపాంతరం తతో నౄణాం భ##వేద్వేషాంతరం తథా || 49

భూతప్రేతపిశాచాది దూరతశ్చ తతో వ్రజేత్‌ | తన్న కార్యం చ యచ్చైవ తతో న భవతి ద్విజాః || 50

తైర్దేవైః ప్రార్థితశ్శంభుర్మునిభిశ్చ విశేషతః | స్థాతవ్యం స్వామినా హ్యత్ర లోకానాం సుఖహేతవే || 51

అయం వై కుత్సితో దేశ అయోధ్యాలోకదుఃఖదః | భవంతం చ తదా దృష్ట్వా కల్యాణం సంభవిష్యతి || 52

భీమశంకరనామా త్వం భవితా సర్వసాధకః | ఏతల్లింగం సదా పూజ్యం సర్వాపద్వినివారకమ్‌ || 53

నారదుడు ఇట్లు పలికెను-

ఓ నాథా! క్షమించుము, క్షమించుము. విశేషమగు సమ్మోహమును కలిగించువాడా! గడ్డిని త్రుంచుటకు గొడ్డలితో పని యేమి? వీనిని శీఘ్రముగా సంహరించుము (42). ఈ విధముగా ప్రార్థించబడిన శంభుప్రభుడు అప్పుడు హుంకారాస్త్ర ముచేతనే రాక్షస గణముల నన్నింటినీ భస్మము చేసెను (43). ఓ మహర్షీ! దేవతలందరు చూచుచుండగా శంకరునిచే ఆ రాక్షసులందరు క్షణకాలములో దగ్ధము చేయబడిరి (44). శంకరుడు కోపించి వనమును దావాగ్నివలె రాక్షససైన్యమును క్షణములో పూర్తిగా తగులబెట్టెను (45). భీముని భస్మమైననూ ఇతరులకు కానరాలేదు. ఆతడు పరివారసమేతముగా నిశ్శేషముగా దహించబడినవాడు (46). అప్పుడు శివుని కృపచే మహర్షులు మరియు సకలదేవతలు శాంతిని పొందిరి. సర్వలోకములు స్వస్థతను పొందెను (47). మహేశ్వరుని కోపాగ్నిజ్వాలలు ఒక వనమునుండి మరియొక వనమునకు వ్యాపించెను. రాక్షసుల ఆ భస్మము అంతయు వనమంతటా వ్యాపించెను (48). దానినుండి వివిధప్రయోజనములను సిద్ధింపజేసే ఓషధులు పుట్టెను. మానవులు భస్మను వినియోగించి వివిధ వేషములను రూపములను దాల్చవచ్చును (49). భస్మవలన భూతప్రేతపిశాచాదులు దూరమగును. ఓ బ్రాహ్మణులారా! భస్మతో సాధించలేని కార్యము లేదు (50). ఆ దేవతలు మరియు మునులు ప్రత్యేకముగా శంభుని ఇట్లు ప్రార్థించిరి: లోకములకు సుఖమును కలిగించుటకొరకై స్వామి ఇచటనే స్థిరముగానుండవలెను (51). ఇచటకు వచ్చే భక్తులగు ప్రజలకు దుఃఖమును కలిగించే ఈ ప్రాంతము అపవిత్రమైనది. కాని ఇది నీ దర్శనముచే మంగళకరము కాగలదు (52). భీమశంకరుడు పేరుగల నీవు కార్యములనన్నింటినీ సాధించి పెట్టెదవు. ఆపదలన్నింటినీ పోగొట్టే ఈ శివలింగము సర్వదా పూజనీయము (53).

సూత ఉవాచ |

ఇత్యేవం ప్రార్థితశ్శంభుర్లోకానాం హితకారకః | తత్రై వాస్థితవాన్‌ ప్రీత్యా స్వతంత్రో భక్తవత్సలః || 54

ఇతి శ్రీ శివమహాపురాణ కోటిరుద్రసంహితాయాం భీమేశ్వర జ్యోతిర్లింగమాహాత్మ్య వర్ణనం నామ ఏకవింశో%ధ్యాయః (21).

సూతుడు ఇట్లు పలికెను-

లోకములకు హితమును చేయువాడు, స్వతంత్రుడు, భక్తవత్సలుడు అగు శంభుడు ఈ విధముగా ప్రార్థించబడినవాడై ప్రీతితో అక్కడనే స్థిరముగానుండెను (54).

శ్రీ శివమహాపురాణములో కోటిరుద్రసంహితయందు భీమేశ్వర జ్యోతిర్లింగ మాహాత్మ్యమును వర్ణించే ఇరువది ఒకటవ అధ్యాయము ముగిసినది (21).

Siva Maha Puranam-3    Chapters