Siva Maha Puranam-3    Chapters   

అథ సప్తవింశోధ్యాయః

గౌతముని శాపము

ఋషయ ఊచుః |

గంగా చ జలరూపేణ కుతో జాతా వద ప్రభో | తన్మాహాత్మ్యం విశేషేణ కుతో జాతం వద ప్రభో || 1

యైర్విపై#్ర ర్గౌతమాయైవ దుఃఖం దత్తం దురాత్మభిః | తేషాం కిం చ తతో జాతముచ్యతాం వ్యాససద్గురో || 2

ఋషులు ఇట్లు పలికిరి-

ఓ ప్రభూ! గంగ జలరూపములో ఎక్కడనుండి ఆవిర్భవించినది? దానికి విశేషమగు మహిమ ఎక్కడ నుండి వచ్చినది? ఓ ప్రభూ! ఈ విషయమును చెప్పుము (1). వ్యాసుడు సద్గురువుగా గలవాడా! దుర్బుద్ధిగల ఏ బ్రాహ్మణులు గౌతములకు దుఃఖమును కలిగించిరో, వారికి ఆ తరువాత ఏమాయెను? ఈ విషయమును కూడ చెప్పుము (2).

సూత ఉవాచ |

ఏవం సంప్రార్థితా గంగా గౌతమేన తదా స్వయమ్‌ | బ్రహ్మాణశ్చ గిరేర్విప్రా ద్రుతం తస్మాదవాతరత్‌ || 3

ఔదుంబరస్య శాఖాయాస్తత్ర్ప వాహో వినిస్సృతః | తత్ర స్నానం ముదా చక్రే గౌతమో విశ్రుతో మునిః || 4

గౌతమస్య చ యే శిష్యా అన్యే చైవ మహర్షయః | సమాగతాశ్చ తే తత్ర స్నానం చక్రుర్ముదాన్వితాః || 5

గంగాద్వారం చ తన్నామ ప్రసిద్ధమభవత్తదా | సర్వపాపహరం రమ్యం దర్శనాన్మునిసత్తమాః || 6

గౌతమస్పర్ధినస్తే చ ఋషయస్తత్ర చాగతాః | స్నానార్థం తాంశ్చ సా దృష్ట్వా హ్యంతర్ధానం గతా ద్రుతమ్‌ || 7

మామేతి గౌతమస్తత్ర వ్యాజహార వచో ద్రుతమ్‌ | ముహుర్ముహుః స్తువన్‌ గంగాం సాంజలిర్నతమస్తకః || 8

సూతుడు ఇట్లు పలికెను-

ఓ బ్రాహ్మణులారా! అపుడు గౌతముడు స్వయముగా ప్రార్థించగా, గంగ ఆ బ్రహ్మగిరినుండి వేగముగా క్రిందకు దిగెను (3). ఆ ప్రవాహము ఉదుంబరవృక్షముయొక్క కొమ్మనుండి ఆవిర్భవించెను. ప్రఖ్యాతిని గాంచిన గౌతమమహర్షి దానియందు ఆనందముతో స్నానమును చేసెను (4). గౌతముని శిష్యులు మరియు అక్కడకు విచ్చేసిన ఇతరమహర్షులు ఆనందముతో కూడినవారై దానియందు స్నానమును చేసిరి (5). అప్పటినుండి అది గంగాద్వారమని ప్రసిద్ధిని గాంచెను. ఓ మహర్షులారా! ఆ సుందరప్రదేశము దర్శనమాత్రము చేతనే సర్వపాపములను పోగొట్టును (6). గౌతమునిపై విరోధమును బూనిన ఆ ఋషులు అక్కడకు స్నానముకొరకు వచ్చిరి. వారిని చూచి ఆ గంగ వెంటనే అంతర్ధానమును చెందెను (7). ఆ సమయములో గౌతముడు చేతులను జోడించి తలను వంచి అనేక పర్యాయములు స్తుతిస్తూ, వద్దు, వద్దు అని శీఘ్రముగా పలికెను (8).

గౌతమ ఉవాచ |

ఇమే చ శ్రీమదాంధాశ్చ సాధవో వాప్యసాధవః | ఏతత్పుణ్యప్రభావేణ దర్శనం దీయతాం త్వయా || 9

గౌతముడు ఇట్లు పలికెను-

వీరు ధనమదముతో గ్రుడ్డివారు అయి ఉండవచ్చును. వీరు సాధుపురుషులు కావచ్చును; కాకపోవచ్చును. కాని ఈ స్థలముయొక్క పుణ్య ప్రభావముచే నీవు వీరికి దర్శనమును ఈయదగును (9).

సూత ఉవాచ |

తతో వాణీ సముత్పన్నా గంగాయా వ్యోమమండలాత్‌ | తచ్ఛృణుధ్వమృషిశ్రేష్టా గంగావచనముత్తమమ్‌ || 10

ఏతే దుష్టతమాశ్చైవ కృతఘ్నాస్స్వామిద్రోహిణః | జాల్మాః పాఖండినశ్చైవ ద్రష్టుం వర్జ్యాశ్చ సర్వదా || 11

సూతుడు ఇట్లు పలికెను-

అప్పుడు ఆకాశమునుండి గంగయొక్క వచనము వినవచ్చెను. ఓ మహర్షులారా! గంగయొక్క ఆ ఉత్తమవచనమును వినుడు (10). వీరు పరమదుర్మార్గులు, చేసిన మేలును మరచినవారు, ప్రభువునకు ద్రోహమునాచరించినవారు, పాపాత్ములు మరియు నిశ్చితముగా నాస్తికులు గనుక వీరిని ఎన్నడైననూ చూడరాదు (11).

గౌతమ ఉవాచ |

మాతశ్చ శ్రూయతామేతన్మహతాం గిర ఏవ చ | తస్మాత్త్వయా చ కర్తవ్యం సత్యం చ భగవద్వచః || 12

అపకారిషు యో లోక ఉపకారం కరోతి వై | తేన పూతో భవామ్యత్ర భగవద్వచనం త్విదమ్‌ || 13

గౌతముడు ఇట్లు పలికెను-

ఓ తల్లీ! ఈ మహాత్ముల వచనములను వినుము. ఇది భగవానుని వచనము గనుక, దీనిని నీవు సత్యము చేయుము (12). లోకములో ఎవడైతే అపకారము చేసినవానికి ఉపకారమును చేయునో, వానిచే నేను ఈ లోకములో పవిత్రుడనగుదునని భగవానుడు ఈ వచనమును చెప్పియున్నాడు (13).

సూత ఉవాచ |

ఇతి శ్రుత్వా మునేర్వాక్యం గౌతమస్య మహాత్మనః | పునర్వాణీ సముత్పన్నా గంగాయా వ్యోమమండలాత్‌ || 14

కథ్యతే హి త్వయా సత్యం గౌతమర్షే శివం వచః | తథాపి సంగ్రహార్థం చ ప్రాయశ్చిత్తం చరంతు వై || 15

శతమేకోత్తరం చాత్ర కార్యం ప్రక్రమణం గిరే ః | భవచ్ఛాసనతస్త్వే తైస్త్వ దధీనైర్విశేషతః || 16

తతశ్చైవాధికారశ్చ జాయతే దుష్టకారిణామ్‌ | మద్దర్శనే విశేషేణ సత్యముక్తం మయా మునే || 17

ఇతి శ్రుత్వా వచస్తస్యాశ్చక్రుర్వై తే తథా%ఖిలాః | సంప్రార్థ్య గౌతమం దీనాః క్షంతవ్యో నో%పరాధకః || 18

ఏవం కృతే తదా తేన గౌతమేన తదాజ్ఞయా | కుశావర్తం నామ చక్రే గంగాద్వారాదధోగర్తమ్‌ || 19

తతః ప్రాదురభూత్తత్ర సా తస్య ప్రీతయే పునః | కుశావర్తం చ విఖ్యాతం తీర్థమాసీత్తదుత్తమమ్‌ || 20

తత్ర స్నాతో నరో యస్తు మోక్షాయ పరికల్పతే | త్యక్త్వా సర్వానఘాన్‌ సద్యో విజ్ఞానం ప్రాప్య దుర్లభమ్‌ || 21

గౌతమో ఋషయశ్చాన్యే మిలితాశ్చ పరస్పరమ్‌ | లజ్జితాస్తే తదా యే చ కృతఘ్నా హ్యభవన్‌ పురా || 22

సూతుడు ఇట్లు పలికెను-

మహాత్ముడగు గౌతమమహర్షియొక్క ఈ మాటను వినిన తరువాత, ఆకాశమండలమునుండి గంగయొక్క వాణి మరల ఆవిర్భవించెను (14). ఓ గౌతమమహర్షీ! నీవు సత్యము, మంగళకరము అగు మాటను చెప్పియుంటివి. అయిననూ లోకసంగ్రహముకొరకు వీరు ప్రాయశ్చిత్తమును చేయుదురు గాక! (15) వీరు ప్రత్యేకించి నీ చెప్పుచేతలలోనున్నవారై నీ ఆజ్ఞను అనుసరించి ఈ పర్వతమును నూట ఒక్కసార్లు ప్రదక్షిణము చేయవలెను (16). ఓ మహర్షీ! చెడు పనిని చేసిన వీరికి ఆ తరువాత మాత్రమే నన్ను దర్శించే విశేషాధికారము లభించును. నేను సత్యమును పలుకుచున్నాను (17). ఆమెయొక్క ఆ వచనమును వినిన వారందరు మా అపరాధమును మన్నించుడని దీనముగా గౌతముని వేడుకొని, ఆ విధముగనే చేసిరి (18). వారు అట్లు చేసిన తరువాత ఆమెయొక్క అనుమతిని పొంది ఆ గౌతముడు గంగాద్వారమునకు క్రిందిభాగములో కుశావర్తమనే ఒక గోతిని చేసెను (19). తరువాత ఆ గంగ ఆయనకు ప్రీతిని కలిగించుటకొరకై మరల అచట ఆవిర్భవించెను. అది కుశావర్తమను పేరు గలదై ఉత్తమమగు తీర్థముగా ప్రఖ్యాతిని పొందెను (20). అచట స్నానమును చేసిన మానవుడు వెంటనే సర్వ పాపములనుండి విముక్తుడై దుర్లభమగు జ్ఞానమును పొంది మోక్షమునకు అర్హుడగును (21). గౌతముడు మరియు ఇతరమహర్షులు ఒకరితోనొకరు కలుసుకొనిరి. పూర్వము కృతఘ్నులమైతిమని అప్పుడు వారు సిగ్గుపడిరి (22).

ఋషయ ఊచుః |

అస్మాభిరన్యథా సూత శ్రుతం తద్వర్ణయామహే | గౌతమస్తాన్‌ ద్విజాన్‌ క్రుద్ధశ్శశాపేతి ప్రబుధ్యతామ్‌ || 23

ఋషులు ఇట్లు పలికిరి -

ఓ సూతా! మేము మరియొక విధముగా వినియుంటిమి. దానిని నీకు చెప్పెదము. గౌతముడు కోపించి ఆ బ్రాహ్మణులను శపించెనని తెలసుకొనుము (23).

సూత ఉవాచ |

ద్విజాస్తదపి సత్యం వై కల్పభేదసమాశ్రయాత్‌ | వర్ణయామి విశేషేణ తాం కథామపి సువ్రతాః || 24

గౌతమో%పి ఋషీన్‌ దృష్ట్వా తదా దుర్భిక్షపీడితాన్‌ | తపశ్చకార సుమహద్వరుణస్య మహాత్మనః || 25

అక్షయ్యం కల్పయామాస జలం వరుణమాయయా | తతో వ్రీహీన్‌ యవాంశ్చైవ వాపయామాస భూరిశః || 26

ఏవం పరోపకారీ స గౌతమో మునిసత్తమాః | ఆహారం కల్పయామాస తేభ్యస్స్వతపసో బలాత్‌ || 27

కదాచిత్తత్‌ స్త్రియో దుష్టా జలార్థమవమానితాః | ఊచుః పతిభ్యస్తాః క్రుద్ధా గౌతమేర్ష్యాకరం వచః || 28

తతస్తే భిన్నమతయో గాం కృత్వా కృత్రిమాం ద్విజాః | తద్ధాన్యభక్షణాసక్తాం చక్రుస్తాం కుటిలాశయాః || 29

స్వధాన్యభక్షణాసక్తాం గాం దృష్ట్వా గౌతమస్తదా | తృణన తాడయామాస శ##నైస్తాం సంనివారయన్‌ || 30

తృణసంస్పర్శమాత్రేణ సా భూమౌ పతితా చ గౌః | మృతా హ్యభూత్‌ క్షణం విప్రా భావికర్మవశాత్తదా || 31

గౌర్హతా గౌతమేనేతి తదా తే కుటిలాశయాః | ఏకత్రీభూయ తత్రత్యైస్సకలా ఋషయో%వదన్‌ || 32

తతస్స గౌతమో భీతో గౌర్హతేతి బభూవ హ | చకార విస్మయం నార్యహల్యాశిషై#్యశ్శివానుగః || 33

తతస్స గౌతమో జ్ఞాత్వా తాం గాం క్రోధసమాకులః | శశాప తానృషీన్‌ సర్వాన్‌ గౌతమో మునిసత్తమః || 34

సూతుడు ఇట్లు పలికెను-

ఓ బ్రాహ్మణులారా! కల్పభేదమును స్వీకరించినచో, ఆ కథ కూడ సత్యమే యగును. ఓ గొప్ప నిష్ఠగలవారా! ఆ కథను కూడ వివరముగా వర్ణించగలను (24). అప్పుడు గౌతముడు దుర్భిక్షముచే బాధింపబడుచున్న ఋషులను చూచి, మహాత్ముడగు వరుణుని ఉద్దేశించి మిక్కిలి గొప్ప తపస్సును చేసెను (25). ఆయన వరుణుని మాయాప్రభావముచే అక్షయమగు నీటిని ఏర్పాటు చేసి, ఆ తరువాత ధాన్యమును, యవలను అధికముగా పండింపజొచ్చెను (26). ఓ మహర్షులారా! ఈ విధముగా పరోపకారియగు ఆ గౌతముడు తన తపోబలముచే వారికి ఆహారమును ఏర్పాటు చేసెను (27). ఒక నాడు దుర్బుద్ధిగల వారి భార్యలు నీటికొరకై అవమానమును పొంది కోపించినవారై భర్తలతో గౌతమునిపై ఈర్ష్యను కలిగించే వచనములను చెప్పిరి (28). అపుడు వక్రబుద్ధిగల ఆ బ్రాహ్మణులు గౌతమునిపై వ్యతిరేకభావము గలవారై కృత్రిమమగు గోవుని నిర్మించి, అది గౌతముని ధాన్యమును ఆసక్తితో భక్షించునట్లు చేసిరి (29). అప్పుడు తన ధాన్యమును ఆసక్తితో భక్షించుచున్న గోవును చూచి గౌతముడు దానిని మెల్లగా నివారించబోయి గడ్డిపరకతో అదిలించెను (30). ఓ బ్రాహ్మణులారా! అపుడు భవిష్యత్తును నిర్ధారించే కర్మయొక్క ప్రభావముచే, ఆ గోవు గడ్డిపరక తగిలినంత మాత్రాన నేలపై బడి వెనువెంటనే మరణించెను (31). అప్పుడు దుష్టబుద్ధిగల ఆ ఋషులు అందరు అక్కడి వారితో జతగొట్టి గౌతముడు గోవును చంపినాడని చెప్పిరి (32). అప్పుడు శివభక్తుడగు ఆ గౌతముడు భార్యయగు అహల్య మరియు శిష్యులతో గూడి గోవు సంహరించబడినదనే భయము గలవాడై ఆశ్చర్యమును పొందెను (33). తరువాత ఆ గౌతమమహర్షి ఆ గోవుయొక్క యథార్థస్వరూపమునెరింగి కోపముతో నిండిన మనస్సు గలవాడై ఆ ఋషులనందరినీ శపించెను (34).

గౌతమ ఉవాచ |

యూయం సర్వే దురాత్మానో దుఃఖదా మే విశేషతః | శివభక్తస్య సతతం స్యుర్వేదవిముఖాస్సదా || 35

అద్య ప్రభృతి వేదోక్తే సత్కర్మణి విశేషతః | మా భూయాద్భవతాం శ్రద్ధా శైవమార్గే విముక్తిదే || 36

అద్య ప్రభృతి దుర్మార్గే తత్ర శ్రద్ధా భ##వేత్తు వః | మోక్షమార్గవిహీనే హి సదా శ్రుతిబహిర్ముఖే || 37

అద్య ప్రభృతి ఫాలాని మృల్లిప్తాని భవంతు వః | స్రంసధ్వం నరకే యూయం భాలమృల్లేపనాద్ద్విజాః || 38

భవంతో మా భవిష్యంతు శివైకపరదేవతాః | అన్యదేవసమత్వేన జానంతు శివమద్వయమ్‌ || 39

మా భూయాద్భవతాం ప్రీతిశ్శివపూజాదికర్మణి | శివనిష్ఠేషు భ##క్తేషు శివపర్వసు సర్వదా || 40

అద్య దత్తా మయా శాపా యావంతో దుఃఖదాయకాః | తావంతస్సంతు భవతాం సంతతావపి సర్వదా || 41

అశైవాస్సంతు భవతాం పుత్రపౌత్రా దయో ద్విజాః | పుత్రైస్సహైవ తిష్ఠంతు భవంతో నరకే ధ్రువమ్‌ || 42

తతో భవంతు చండాలా దుఃఖదారిద్ర్యపీడితాః | శఠా నిందాకరాస్సర్వే తప్తముద్రాంకితాస్సదా || 43

గౌతముడు ఇట్లు పలికెను-

దుర్మార్గులగు మీరందరు శివభక్తుడనగు నాకు విశేషదుఃఖమును కలిగించితిరి. మీరు సర్వదా వేదము నందు శ్రద్ధలేనివారు అగుదురు గాక! (35) ఈనాటినుండియు మీకు వేదవిహితమైన సత్కర్మయందు, విశేషించి మోక్షమునిచ్చే శైవమార్గమునందు శ్రద్ధ కలుగకుండుగాక! (36) ఈ నాటి నుండియు మీకు మోక్షమార్గమునకు విరుద్ధమైన వేదబాహ్యమైన చెడు మార్గమునందు నిత్యము శ్రద్ధ కలుగుగాక! (37). ఈ నాటినుండియు మీ లలాటములు మట్టి పూసినవి అగుగాక! ఓ బ్రాహ్మణులారా! మట్టిని పూసిన లలాటములు గల మీరు నరకములో పడెదరు గాక! (38) మీరు శివుడు మాత్రమే పరదేవతగా గలవారు కాకుందురు గాక! మీరు అద్వితీయుడగు శివుని ఇతరదేవతలతో సముడని భావించెదరు గాక! (39) మీకు శివపూజ మొదలగు కర్మయందు శివపరాయణులగు భక్తుల యందు మరియు శివసంబంధి పర్వదినములయందు ఎన్నటికైననూ ప్రీతి కలుగకుండుగాక! (40) నాకు దుఃఖమును కలిగించిన ఎంతమందికైతే నేనీనాడు శాపమును ఇచ్చితినో, అంతమంది మీ సంతానమునందు కూడ ఉండెదరు గాక! (41) ఓ బ్రాహ్మణులారా! మీ పుత్రపౌత్రాదిసంతానము శివభక్తి లేనివారు అగుదురుగాక! మీరు మీ సంతానముతో గూడి నిశ్చయముగా నరకమును పొందెదరు (42). మరియు మీరందరు దుఃఖముచే మరియు దారిద్ర్యముచే పీడింపబడువారు, మోసగాళ్లు, ఇతరులను నిందించువారు, కాల్చిన ముద్రల చిహ్నములను శరీరముపై ధరించువారునగు చండాలురు అగుదురు గాక! (43)

సూత ఉవాచ |

ఇతి శప్త్వా మునీన్‌ సర్వాన్‌ గౌతమస్స్వాశ్రమం య¸° | శివభక్తిం చకారాతి స బభూవ సుపావనః || 44

తతసై#్తః భిన్నహృదయా ఋషయస్తే%ఖిలా ద్విజాః | కాంచ్యాం చక్రుర్నివాసం హి శైవధర్మబహిష్కృతాః || 45

తత్పుత్రాశ్చాభవన్‌ సర్వే శైవధర్మబహిష్కృతాః | అగ్రే తద్వద్భవిష్యంతి కలౌ బహుజనాః ఖలాః || 46

ఇతి ప్రోక్తమశేషేణ తద్వృత్తం మునిసత్తమాః | పూర్వవృత్తమపి ప్రాజ్ఞాశ్శ్రు తం సర్వైస్తు చాదరాత్‌ || 47

ఇతి వశ్చ సమాఖ్యాతో గౌతమ్యాశ్చ సముద్భవః | మాహాత్మ్యముత్తమం చైవ సర్వపాపహరం పరమ్‌ || 48

త్ర్యంబకస్య చ మాహాత్మ్యం జ్యోతిర్లింగస్య కీర్తితమ్‌ | యచ్ఛ్రు త్వా సర్వపాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయః || 49

అతః పరం ప్రవక్ష్యామి వైద్యనాథేశ్వరస్య హి | జ్యోతిర్లింగస్య మాహాత్మ్యం శ్రూయతాం పాపహారకమ్‌ || 50

ఇతి శ్రీ శివమహాపురాణ కోటిరుద్రసంహితాయం త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగ మాహాత్మ్య వర్ణనం నామ సప్తవింశో%ధ్యాయః (27).

సూతుడు ఇట్లు పలికెను-

పరమపవిత్రుడగు గౌతముడు మునులనందరినీ ఈ విధముగా శపించి తన ఆశ్రమమునకు వెళ్లి దృఢమగు శివభక్తితో జీవించెను (44). ఓ బ్రాహ్మణులారా! తరువాత ఆ ఋషులందరు ఆ శాపములచే దుఃఖములతో నిండిన హృదయము గలవారై శివధర్మమునుండి బహిష్కరింపబడిరి. కాంచీ నగరమునందు నివాసమునేర్పాటు చేసుకొనిరి (45). వారి పుత్రులందరు శివధర్మము నుండి బహిష్కరింపబడిరి. భవిష్యత్తులో కలియుగములో కూడ దుష్టులగు అనేకజనులు అటులనే కాగలరు (46). ఓ మహర్షులారా! ఈ విధముగా ఆ వృత్తాంతమును సమగ్రముగా చెప్పితిని. ఓ బుద్ధిశాలులారా! పూర్వకల్పమునందలి వృత్తాంతమును కూడ మీరు ఆదరముతో వినినారు (47). ఈ విధముగా మీకు గౌతమియొక్క ఆవిర్భావమును మరియు దాని యొక్క సకలపాపములను పోగొట్టే సర్వోత్కృష్టమహిమను కూడ చెప్పియుంటిని (48). త్ర్యంబకేశ్వరజ్యోతిర్లింగముయొక్క మాహాత్మ్యమును కూడ వర్ణించితిని. దీనిని విన్నవారు సకలపాపములనుండి విముక్తిని పొందెదరనుటలో సందేహము లేదు (49). దీని తరువాత పాపహరమగు వైద్య నాథేశ్వరజ్యోతిర్లింగముయొక్క మాహాత్మ్యమును చెప్పగలను (50)

శ్రీ శివమహాపురాణములో కోటిరుద్రసంహితయందు త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగ మాహాత్మ్యవర్ణనమనే ఇరువది ఏడవ అధ్యాయము ముగిసినది (27).

Siva Maha Puranam-3    Chapters