Siva Maha Puranam-3    Chapters   

అథ సప్తమో%ధ్యాయః

నందీశ్వరుని అభిషేకము, వివాహము

నందికేశ్వర ఉవాచ |

తత్ర గత్వా మునే%హం వై స్థిత్వైకాంతస్థలే సుధీః | అతపం తప ఉగ్రం సన్మునీనామపి దుష్కరమ్‌ || 1

హృత్పుండరీకసుషిరే ధ్యాత్వా దేవం త్ర్యంబకమ్‌ | త్ర్యక్షం దశభుజం శాంతం పంచవక్త్రం సదాశివమ్‌ || 2

రుద్ర జాప్యమకార్షం వై పరమధ్యానమాస్థితః | సరితశ్చోత్తరే పుణ్య హ్యేకచిత్త స్సమాహితః || 3

తస్మిన్‌ జాప్యే%థ సంప్రీతః స్థితం మాం పరమేశ్వరః | తుష్టో% బ్రవీన్మహాదేవః సోమస్సోమార్ధ భూషణః || 4

నందికేశ్వరుడిట్లు పలికెను-

ఓ మహర్షీ! బుద్ధిమంతుడనగు నేను అచటకు పోయి, ఏకాంతమగు స్థలమునందుండి, గొప్ప మహర్షులకైననూ శక్యము కాని ఉగ్రమగు తపస్సును చేసితిని (1). నేను హృదయపుండరీకమునందు మూడు కన్నులు పది చేతులు గలవాడు, శాంతమూర్తి, ఐదు ముఖములు గలవాడు, అగు సదాశివదేవుని ధ్యానించి (2), పరమధ్యానమును ఆశ్రయించి నది యొక్క పవిత్రమగు ఉత్తర తటమునందు ఏకాగ్ర చిత్తముతో మనస్సమాధానము గలవాడనై రుద్రమంత్రమును జపించితిని (3). తరువాత ఆ జపములో దృఢముగా నున్న నన్ను గాంచి, పార్వతీ సమేతుడు, చంద్రవంక ఆభరణముగా గలవాడు, పరమేశ్వరుడు అగు మహాదేవుడు మిక్కిలి ప్రీతుడై సంతసముతో నిట్లనెను (4).

శివ ఉవాచ |

శైలాదే వరదో%హం తే తపసా%నేన తోషితః | సాధు తప్తం త్వయా ధీమన్‌ బ్రూహి యత్తే మనోగతమ్‌ || 5

స ఏవముక్తో దేవేన శిరసా పాదయోర్నతః | అస్తవం పరమేశానం జరాశోకవినాశనమ్‌ || 6

అథ మాం నందినం శంభుర్భక్త్యా పరమయా యుతమ్‌ | అశ్రుపూర్ణేక్షణం సమ్యక్‌ పాదయోశ్శిరసా నతమ్‌ || 7

ఉత్థాప్య పరమేశానః పస్పర్శ పరమార్తిహా | కరాభ్యాం సమ్ముఖాభ్యాం తు సంగృహ్య వృషభధ్వజః || 8

నిరీక్ష్య గణపాంశ్చై వ దేవీం హిమవతస్సుతామ్‌ | ఉవాచ మాం కృపాదృష్ట్వా సమీక్ష్య జగతాం పతిః || 9

వత్స నందిన్‌ మహాప్రాజ్ఞ మృత్యోర్భీతిః కుతస్తవ | మయైవ ప్రేషితౌ విప్రౌ మత్సమస్త్వం న సంశయః || 10

అమరో జరయా త్యక్తో%దుఃఖీ గణ పతిస్సదా | అవ్యయశ్చాక్షయశ్చేష్ట స్సపితా సమహృజ్జనః || 11

మద్బలః పార్శ్వగో నిత్యం మమేష్టో భవితానిశమ్‌ | న జరా జన్మ మృత్యుర్వై మత్ర్పసాదాద్భవిష్యతి || 12

శివుడిట్లు పలికెను-

ఓయీ శిలాదపుత్రా! నీ తపస్సునకు సంతసించితిని. నీకు వరమునిచ్చెదను. ఓయీ బుద్ధిశాలీ! నీవు చక్కగా తపస్సును చేసితివి. నీ మనస్సులోని కోరికను తెలుపుము (5). ప్రకాశస్వరూపుడు, జరాదుఃఖమును నాశము చేయువాడునగు పరమేశ్వరుడిట్లు పలుకగా నేను పాదములకు శిరస్సుతో ప్రణమిల్లి స్తుతించితిని (6) పరమభక్తితో కూడి కళ్ల వెంబడి నీటిని గార్చుచూ పాదములయందు శిరస్సునుంచి నమస్కరించిన నందీశ్వరుడనగు నన్ను అపుడు శంభుడు (7) లేవదీసెను. గొప్ప దుఃఖములనైననూ పోగొట్టువాడు, వృషభధ్వజుడు అగు ఆ పరమేశ్వరుడు నన్ను రెండు చేతులతో పట్టుకుని లేవదీసెను (8). ఆయన గణాధ్యక్షులవైపు, పార్వతీదేవి వైపు చూచెను. అపుడా జగత్ర్పభువు నన్ను దయాదృష్టితో చూచి ఇట్లు పలికెను (9). కుమారా! నందీ! నీవు గొప్ప బుద్ధిశాలివి. నీకు మృత్యుభయమేల? ఆ బ్రాహ్మణులను నేనే పంపితిని. నీవు నాతో సముడవు. సందేహము లేదు (10) జరామరణములు లేనివాడవై దుఃఖమునెరుంగని వాడవై నీవు సర్వదా గణాధ్యక్షుడవై నాశముగాని, అపక్షయముగాని లేకుండా నాకు ఇష్టుడవై తండ్రితో మిత్రులతో గూడి ఆనందించెదవు (11). నాతో సమమగు బలము గల నీవు నిత్యము నా ప్రక్కనే ఉండెదవు. నీవు సర్వకాలములలో నాకు ప్రియుడవు కాగలవు. నా అనుగ్రహముచే వార్ధక్యము, పుట్టుక, మరణము అనునవి నీ దరికి జేరవు (12).

నందీశ్వర ఉవాచ |

ఏవముక్త్వా శిరోమాలాం కుశేశయమయీం నిజామ్‌ | సమున్మచ్య బబంధాశు మమ కంఠే కృపానిధిః || 13

తయాహం మాలయా విప్ర శుభయా కంఠసక్తయా | త్ర్యక్షో దశభుజశ్చాసం ద్వితీయ ఇవ శంకరః || 14

తత ఏవ సమాదాయ హస్తేన పరమేశ్వరః | ఉవాచ బ్రూహి కిం తే%ద్య దదామి వరముత్తమమ్‌ || 15

తతో జటాశ్రితం వారి గృహీత్వా హారనిర్మలమ్‌ | ఉక్త్వా నదీ భ##వేతీహ విససర్జ వృషధ్వజః || 16

తతః పంచమితా నద్యః ప్రావర్తంత శుభావహాః | సుతో యాశ్చ మహావేగా దివ్య రూపా చ సుందరీ || 17

జటోదకా త్రిస్రోతాశ్చ వృషధ్వని రితీవ హి | స్వర్ణోదకా జంబునదీ పంచనద్యః ప్రకీర్తితాః || 18

ఏతత్పంచనదం నామ శివపృష్ఠతమం శుభమ్‌ | జపేశ్వరసమీపే తు పవిత్రం పరమం మునే || 19

యః పంచనదమాసాద్య స్నాత్వా జప్తేశ్వరేశ్వరమ్‌ | పూజయేచ్ఛివసాయుజ్యం ప్రయాత్యేవ న సంశయః || 20

అథ శంభు రువాచోమామభిషించామి నందినమ్‌ | గణంద్రం వ్యాహరిష్యామి కిం వా త్వం మన్యసే%వ్యయే || 21

నందీశ్వరుడిట్లు పలికెను -

ఇట్లు పలికి దయానిధియగు శివుడు తన శిరస్సుపైనున్న కమలముల మాలను విడదీసి వెంటనే నా కంఠములో వేసెను (13). ఓ విప్రా! ఆ శుభకరమగు మాల నా కంఠములో పడగానే నేను మూడు కన్నులతో, పదిచేతులతో రెండవ శంకరుని వలె విరాజిల్లితిని (14). అపుడు పరమేశ్వరుడు చేతితో నన్ను పట్టుకొని 'నీకు ఉత్తమమగు వరమును దేనిని ఈయవలెనో చెప్పుము' అని పలికెను (15). అపుడు వృషభధ్వజుడగు ఆ శివుడు తన జటలయందున్న, ముత్యాల హారము వలె స్వచ్ఛమైన నీటిని తీసుకొని 'నీవు నదివి కమ్ము' అని పలికి చల్లెను (16). అపుడా నీరు మంగళకరములు, పవిత్రజలము గలవి. దివ్యరూపము గలవి మరియు సుందరమైనవి యగు అయిదు నదుల రూపములో ప్రవహించెను (17). జటోదకా, త్రిస్రోతస్సు, వృషధ్వని, స్వర్ణోదకా మరియు జంబునది అనునవి ఆ నదుల పేర్లు (18). ఈ అయిదు నదులను దర్శించి స్నానము చేసి జపము చేసిదేవ దేవుడగుశివుని పూజించు వ్యక్తి శివసాయుజ్యమును పొందు ననుటలో సందేహము లేదు (20). అపుడు శంభుడు పార్వతితో నిట్లనెను. ఓ అవ్యయురాలా! నందిని గణాధ్యక్షుడని ప్రకటించెదను. నీ అభిప్రాయమేమి? (21)

ఉమోవాచ -

దాతుమర్హసి దేవేశ నందినే పరమేశ్వర | మహాప్రియతమో నాథ శైలాదిస్తనయో మమ || 22

పార్వతి ఇట్లు పలికెను-

ఓ దేవదేవా! పరమేశ్వరా! నందికి అట్టి భాగ్యమును నీవు కలిగించవలెను. నాథా! శిలాదకుమారుడగు నంది నాకు అత్యంతప్రియుతముడగు పుత్రుడు (22).

నందీశ్వర ఉవాచ |

తతస్స శంకరస్స్వీయాన్‌ సస్మార గణపాన్‌ వరాన్‌ | స్వతంత్రః పరమేశానస్సర్వదో భక్తవత్సలః || 23

స్మరణాదేవ రుద్రస్య సంప్రాప్తాశ్చ గణశ్వరాః | అసంఖ్యాతా మహామోదాశ్శంకరాకృతయో%ఖిలాః || 24

తే గణశాశ్శివం దేవీం ప్రణమ్యాహుశ్శుభం వచః | తే ప్రణమ్య కరౌ బద్ధ్వా నతస్కంధా మహాబలాః || 25

నందీశ్వరుడిట్లు పలికెను-

అపుడు స్వతంత్రుడు, సర్వమునిచ్చువాడు, భక్తప్రియుడు నగు ఆ శంకర పరమేశ్వరుడు తన శ్రేష్ఠగణాధ్యక్షులను స్మరించెను (23). రుద్రుడు స్మరించగనే శంకరుని ఆకారముగల లెక్కలేనంతమంది గణాధ్యక్షులు మహానందముతో విచ్చేసిరి (24). మహాబలశాలురగు ఆ గణాధ్యక్షులు పార్వతీ పరమేశ్వరులకు సాష్టాంగప్రణామమాచరించి, చేతులు కట్టి నిలబడి ఈ శుభవాక్యమును పలకిరి (25).

గణశా ఊచుః|

కిమర్థం చ స్మృతా దేవ హ్యాజ్ఞాపయ మహాప్రభో | కింకరాన్నస్సమాయాతాంస్త్రిపురార్దన కామద || 26

కిం సాగరాన్‌ శోషయామో యమం వా సహ కింకరైః | హన్మో మృత్యుం మహామృత్యుం విశేషం వృద్ధం పద్మజమ్‌ || 27

వృద్ధేంద్రం సమదేవైశ్చ విష్ణుం వా పార్ష దైస్సహ | ఆనయామస్సుసంక్రుద్ధాన్‌ దైత్యాన్వా దానవైస్సహ || 28

కస్యాద్య వ్యసనం ఘోరం కరిష్యామస్తవాజ్ఞయా | కస్య వాద్యోత్సవో దేవ సర్వకామసమృద్ధయే || 29

గణాధ్యక్షులు ఇట్లు పలికిరి-

ఓ దేవా! మహాప్రభూ! మమ్ములను ఏల స్మరించితివి? త్రిపురములను నశింపజేసినవాడా! కోర్కెల నీడేర్చు వాడా! ఇచటకు వచ్చి యున్న కింకరులమగు మమ్ములను ఆజ్ఞాపించుము (26). మేము సముద్రములను ఎండింప జేయవలెనా? లేక మృత్యుదేవతయగు యముని కింకరులతో సహా సంహరించవలెనా? లేక మృత్యువునకు కూడ మృత్యువు మరియు చాల వృద్ధుడు అగు బ్రహ్మను (27) వృద్ధుడగు ఇంద్రుని కూడ దేవతలతో సహా తీసుకురావలెనా? పార్షదులతో గూడిన విష్ణువును లేక కోపశీలురగు దానవులను గొని రావలెనా? (28) నీ ఆజ్ఞచే మేమీనాడు ఎవనికి భయంకరమగు ఆపదను కలిగించవలెను? లేదా, ఓ దేవా! ఎవనికి కోర్కెలనన్నిటినీ ఈడేర్చు సంపదలనిచ్చి ఉత్సవమును కలిగించవలెను? (29)

నందీశ్వర ఉవాచ |

ఇత్యాకర్ణ వచస్తేషషాం గణానాం వీరవాదినమ్‌ | ఉవాచ తాన్‌ స ప్రశంస్య గణశాన్‌ పరమేశ్వరః||30

నందీశ్వరుడిట్లు పలికెను-

వీరవచనములను పలుకుచున్న ఆ గణాధ్యక్షుల మాటలను విని ఆ పరమేశ్వరుడు వారిని ప్రశంసించి వారితో నిట్లనెను (30).

శివ ఉవాచ |

నందీశ్వరో%యం పుత్రో మే సర్వేషా మీశ్వరేశ్వరః | ప్రియో గణాగ్రణీస్సర్వైః క్రియతాం వచనం మమ || 31

సర్వే ప్రీత్వాభిషించధ్వం మద్గణానాం గతిం పతిమ్‌ | అద్య ప్రభృతి యుష్మాకమయం నందీశ్వరః ప్రభుః || 32

శివుడిట్లు పలికెను-

ఈ నందీశ్వరుడు నాకు పుత్రుడు. ప్రభువులందరికీ ఈతడు ప్రభువు. మీరు నా ఆజ్ఞను పాలించుడు. మీరందరు నాకు ప్రియుడగు ఈతనిని గణాధ్యక్షుని చేయుడు (31). ఈతనిని మీరందరు ప్రీతితో నా గణములకు ప్రభువు అనే పదవిలో అభిషేకించుడు. ఈ నాటినుండియు ఈ నందీశ్వరుడే మీకు ప్రభువు (32).

నందీశ్వర ఉవాచ |

ఏవముక్తాశ్శంకరేణ గణపాస్సర్వ ఏవ తే | ఏవమస్త్వితి సంప్రోచ్య సంభారానాహరంస్తతః || 33

తతో దేవాశ్చ సేంద్రాశ్చ నారాయణముఖాస్తథా | మునయస్సర్వతో లోకా ఆజగ్ముర్ముదితాననా ః|| 34

పితామహో%పి భగవాన్ని యోగాచ్ఛంకరస్య వై | చకార నందినస్సర్వమభిషేకం సమాహితః || 35

తతో విష్ణు స్తతశ్శక్రో లోకపాలాస్తథైవ చ | ఋషయస్తుష్టువుశ్చైవ పితామహ పురోగమాః || 36

స్తుతిమత్సు తతస్తేషు విష్ణు స్సర్వజగత్పతిః | శిరస్యంజలి మాధాయ తుష్టావ చ సమాహితః || 37

ప్రాంజలిః ప్రణతో భూత్వా జయశబ్దం చకార చ | తతో గణాధిపాస్సర్వే తతో దేవాస్తతో%సురాః || 38

ఏవం స్తుతశ్చాభిషిక్తో దేవైస్సబ్రహ్మకైస్త దా | నందీశ్వరో%హం విప్రేంద్ర నియోగా త్పరమేశితుః || 39

నందీశ్వరుడిట్లు పలికెను-

శంకరుడిట్లు ఆజ్ఞాపించగా, ఆ గణాధ్యక్షులందరు 'అటులనే అగుగాక!' అని పలికి, పిదప అభిషేకసామగ్రిని తీసుకొని వచ్చిరి (33). అపుడు ఇంద్రుడు, నారాయణుడు మొదలగు దేవతలు, మునులు మరియు ఇతరలోకములలోని జీవులు ఆనందముతో నిండిన ముఖములు గలవారై విచ్చేసిరి (34). శంకరుని ఆజ్ఞచే భగవానుడగు పితామహుడు మనస్సును లగ్నము చేసి నందియొక్క అభిషేకకార్యము నంతనూ నడిపించెను (35). అపుడు విష్ణువు, ఇంద్రుడు, లోకపాలకులు, బ్రహ్మ, ఋషులు మొదలగు వారందరూ స్తోత్రములను చేసిరి (36). వారందరు స్తుతించు చుండగా, సర్వజగత్తులకు ప్రభువు అగు విష్ణువు మనస్సును లగ్నముచేసి శిరస్సుపై చేతులను జోడించి స్తుతించెను (37). ఆయన చేతులను జోడించి ప్రణమిల్లి జయధ్వానమును చేసెను. అపుడు సర్వగణాధ్యక్షులు, దేవతలు మరియు రాక్షసులు కూడా వరుసగా జయధ్వానములను చేసిరి (38). ఓ బ్రాహ్మణ శ్రేష్ఠా! పరమేశ్వరుని ఆజ్ఞచే నందీశ్వరుడనగు నేను దేవతల సమక్షములో బ్రహ్మచే అభిషేకింపబడి ఈ విధముగా స్తుతింపబడితిని (39).

ఉద్వాహశ్చ కృతస్తత్ర నియోగాత్పరమేష్ఠినః | మహోత్సవయుతః ప్రీత్యా విష్ణుబ్రహ్మాది భిర్మమ || 40

మరుతాం చ సుతా దేవీ సుయశాస్తు మనోహరా | పత్నీ సా మే% భవద్దివ్యా మనోనయన నందినీ || 41

లబ్ధం శశిప్రభం ఛత్రం తయా తత్ర విభూషితమ్‌ | చామరైశ్చామరాసక్తహస్తాగ్రై స్త్రీగణౖర్యుతమ్‌ || 42

సింహాసనం చ పరమం తయా చాధిష్ఠితం మయా | అలంకృతో మహాలక్ష్మ్యా ముకుటాద్యైస్సుభూషణౖః || 43

లబ్ధో హారశ్చ పరమో దేవ్యాః కంఠ గతస్తథా | వృషేంద్రశ్చ శితో నాగస్సింహస్సింహధ్వజస్తథా || 44

రథశ్చ మేమహారశ్చ చంద్రబింబసమశ్శుభః | అన్యాన్యపి చ వస్తూని లబ్ధాని హి మయా మునే || 45

ఏవం కృతవివాహో%హం తయా పత్న్యా మహామునే | పాదౌ వవందే శంభోశ్చ శివాయా బ్రహ్మణో హరేః || 46

తథా విధం త్రిలోకేశస్సపత్నీకం చ మాం ప్రభుః | ప్రోవాచ పరయా ప్రీత్యా స శివో భక్త వత్సలః || 47

అపుడు పరమేశ్వరుని ఆజ్ఞచే విష్ణు బ్రహ్మాదులు ప్రీతితో పెద్ద ఉత్సవమును చేసి నా వివాహమును జరిపించిరి (40). మరుద్దేవతల కుమార్తెయగు సుయశాదేవి నాకు భార్య ఆయెను. ఆ దివ్యస్త్రీ మనస్సును దోచి ఆనందమును కలిగించెడిది. ఆమె కన్నులకు హర్షమును కలిగించెడిది (41). ఆమెతో బాటు నాకు చంద్రుని వలె కాంతులీను అలంకృత ఛత్రము లభించెను. స్త్రీగణములు చామరములను ధరించి వీచిరి (42). నేను ఆమెతో గూడి ఉత్తమమగు సింహాసనము నధిష్ఠించితిని. మహాలక్ష్మి కిరీటము మొదలగు చక్కని ఆభరణములతో నన్ను అలంకరించెను (43). లక్ష్మీదేవి కంఠమునందున్న గొప్ప హారము నాకు ఈయబడెను. నాకు గొప్ప ఎద్దు, తెల్లని ఏనుగు, సింహము, మరియు సింహము గుర్తుగల ధ్వజము కూడ లభించెను (44). ఒక రథము, చంద్రబింబమువలె కాంతులీనుచున్న శుభహారము కూడ లభించెను. ఓ మహర్షీ ! నా కింకనూ ఇతరవస్తువులు కూడ లభించెను (45). ఓ మహర్షీ! ఈ విధముగా వివాహితుడైన నేను ఆ భార్యతో గూడి శివపార్వతులకు, బ్రహ్మకు, విష్ణువునకు పాదాభివందనమును చేసితిని (46). ముల్లోకములకుప్రభువు, భక్తవత్సలుడు అగు ఆ శివుడు ఆ విధముగా భార్యతో గూడి నమస్కరించిన నాతో పరమప్రీతితో నిట్లు పలికెను (47).

ఈశ్వర ఉవాచ|

శృణు సత్పుత్ర తాత త్వం సుయశేయం తవ ప్రియా | దదామి తే వరం ప్రీత్యా యత్తే మనసి వాంఛితమ్‌ || 48

ఈశ్వరుడిట్లు పలికెను-

వత్సా! వినుము. నీవు నా యోగ్యమగు పుత్రుడవు. ఈ సుయశ నీ ప్రియురాలు. నేను ప్రేమతో నీకు వరము నిచ్చెదను. నీమనస్సులోని కోరికను వెల్లడించుము (48).

సదాహం తన నందీశ సంతుష్టోస్మి గణశ్వర | దేవ్యా చ సహితో వత్స శృణు మే పరమం వచః || 49

సదేష్టశ్చ విశిష్టశ్చ పరమైశ్వర్య సంయుతః | మహాయోగీ మహేష్వాసః సపితా సపితామహః || 50

అజేయ స్సర్వజేతా చ సదా పూజ్యో మహాబలః | అహం యత్ర భవాంస్తత్ర యత్ర త్వం తత్ర చాప్యహమ్‌ || 51

అయం చ తే పితా పుత్ర పరమైశ్వర్య సంయుతః | భవిష్యతి గణాధ్యక్షో మమభక్తో మహాబలః || 52

పితామహో%పి తే వత్స తథాస్తు నియమా ఇమే | మత్సమీపం గమిష్యంతి మయా దత్తవరాస్తథా || 53

ఓ నందీశ్వరా! నీవిషయములో నేను సర్వకాలములయందు సంతుష్టుడనై యుండెదను. ఓ గణాధ్యక్షా! వత్సా! నీవు నీ భార్యతో గూడి నేను చెప్పు శ్రేష్ఠవచనమను వినుము (49). నీవు నాకు సర్వదా ప్రియుడవు. నీవు విశిష్టవ్యక్తివి. నీకు సర్వైశ్వర్యములు లభించును. మహాయోగివగు నీవు గొప్ప ధనుర్ధారివి అగుదువు. నీ తండ్రి, తాత కూడ నీతో బాటు సుఖించెదరు (50). నిన్ను ఇతరులు జయించలేరు. కాని నీవు అందరినీ జయించెదవు. మహాబలశాలివగు నీవు సర్వదా పూజనీయుడవు. నేను ఉన్నచోట నీవు ఉండెదవు. నీవు ఉన్న చోట నేను ఉండెదను (51). ఓ కుమారా! ఈ నీ తండ్రి పరమైశ్వర్యములను పొంది గణాధ్యక్షుడై గొప్ప బలశాలియై నాకు భక్తుడు కాగలడు (52). ఓ వత్సా! ఈ వరములన్నియూ నీ పితామహునకు కూడ వర్తించగలవు. మరియు మీరందరు నేను ఇచ్చిన వరములను పొంది నా సమీపమునకు రాగలరు (53).

నందీశ్వర ఉవాచ |

తతో దేవీ మహాభాగా నందినం వరదాబ్రవీత్‌ | వరం బ్రూహీతి మాం పుత్ర సర్వాన్‌ కామాన్‌ యథేప్సితాన్‌ || 54

తచ్ఛ్రుత్వా వచనం దేవ్యాః ప్రావోచత్సాంజలిస్తదా | భక్తిర్భవతు మే దేవి పాదయోస్తే సదా వరా || 55

శ్రుత్వా మమ వచో దేవీ హ్యేవమస్త్వితి సాబ్రవీత్‌ | సుయశాం తాం చ సుప్రీత్యా నందిప్రియతమాం శివా || 56

నందీశ్వరుడిట్లు పలికెను-

అపుడు మహాత్మురాలు, వరములనిచ్చు తల్లియగు పార్వతీదేవి నందీశ్వరునితో 'ఓ పుత్రా! వరమును కోరుకొనుము, నీ మనస్సులోని కోర్కెలన్నిటినీ ఈడేర్చెదను' అని పలికెను (52). అపుడా దేవియొక్క ఆ మాటను విని ఆతడు చేతులు జోడించి 'ఓ దేవీ! నాకు సర్వదా నీ పాదములయందు గొప్ప భక్తి కలుగుగాక!' అని కోరెను (55). ఆ దేవి నా మాటను విని అటులనే యగుగాక! అని పలికెను. పార్వతీదేవి నందీశ్వరుని ప్రియురాలగు సుయశను ప్రీతితో లాలించెను (56).

దేవ్యువాచ |

వత్సే వరం యథేష్టం హి త్రినేత్రా జన్మవర్జితా | పుత్రపౌత్రైస్తు భక్తిర్మే తథా చ భర్తురేవ హి || 57

దేవి ఇట్లు పలికెను-

ఓ పుత్రీ! నీవు కూడ నచ్చిన వరమును కోరుకొనుము. నీకు మూడు నేత్రములు ఉండగలవు. నీవు జన్మబంధమునుండి విముక్తురాలవైతివి. నీవు పుత్రపౌ త్రులతో ఆనందించెదవు. మరియు నీకు నాయందు, నీ భర్తయందు భక్తి ఉండగలదు (57).

నంద్యువాచ|

తదా బ్రహ్మా చ విష్ణుశ్చ సర్వే దేవ గణాశ్చవై | తాభ్యాం వసుం దదుః ప్రీత్యా సుప్రసన్నాశ్శివాజ్ఞయా || 58

సాన్వయం మాం గృహీత్వే శస్త తస్సంబంధి బాంధవైః | ఆరుహ్య వృషమీశానో గతో దేవ్యా నిజం గృహమ్‌ || 59

విష్ణ్వాదయ స్సురాస్సర్వే ప్రశంసంతో హ్యమీ తదా | స్వధామాని యయుః ప్రీత్యా సంస్తువంతశ్శివం శివామ్‌ || 60

ఇతి తే కథితో వత్స స్వావతారో మహామునే | సదానందకరః పుంసాం శివభక్తి ప్రవర్ధనః || 61

య ఇదం నందినో జన్మ వరదానం తథా మమ | అభిషేకం వివాహం చ శృణుయా చ్ఛ్రావయేత్తథా || 62

పఠేద్వా పాఠయేద్వాపి శ్రద్ధావాన్‌ భక్తి సంయుతః | ఇహ సర్వసుఖం భుక్త్వా పరత్ర లభ##తే గతిమ్‌ || 63

ఇతి శ్రీ శివమహాపురాణ శతరుద్ర సంహితాయాం నందికేశ్వరాభిషేక వివాహ వర్ణనం నామ సప్తమో%ధ్యాయః (7)

నందీశ్వరుడిట్లు పలికెను-

అపుడు బ్రహ్మ, విష్ణువు మరియు సర్వదేవగణములు మిక్కిలి ప్రసన్నులై శివుని ఆజ్ఞచే ఆ దంపతులకు ప్రేమతో సంపదలనిచ్చిరి (58). నన్ను నా కుటుంబ సభ్యులను, మరియు బంధు గణమును దోడ్కొని శివుడు అపుడు దేవితో గూడి తన వాహనమగు వృషభమునధిష్ఠించి తన గృహమునకు వెళ్లెను (59) అపుడు విష్ణువు మొదలగు వారందరు పార్వతీపరమేశ్వరులను ప్రీతితో పొగుడుకుంటూ తమ తమ స్థానములకు వెళ్లిరి (60). ఓ కుమారా ! మహర్షీ! ఇంతవరకు నీకు నా అవతారమును గురించి చెప్పితిని. ఈ గాథ మానవులకు సర్వదా ఆనందమును కలిగించి, శివభక్తిని వర్థిల్లజేయును (61). నందీశ్వరుడనగు నా ఈ జన్మ, వరములను పొందుట, అభిషేకము మరియు వివాహము అను వృత్తాంతమును ఎవడైతే తాను విని, ఇతరులకు వినిపించునో (62), శ్రద్ధాభక్తులతో తాను పఠించి ఇతరులచే పఠింపజేయునో, అట్టివాడు ఇహలోకములో సర్వసుఖములనను భవించి పరలోకములో ఉత్తమ గతిని పొందును (63).

శ్రీశివమహాపురాణములో శతరుద్ర సంహితయందు నందీశ్వరాభిషేక వివాహవర్ణనమనే ఏడవ అధ్యాయము ముగిసినది (7).

Siva Maha Puranam-3    Chapters