Siva Maha Puranam-3    Chapters   

అథ సప్తత్రింశో%ధ్యాయః

దేవర్షినృపశైవత్వ వర్ణనము

ఋషయ ఊచుః |

సూతసూత మహాభాగ జ్ఞానవానసి సువ్రత | పునరేవ శివసై#్యవ చరితం బ్రూహి విస్తరాత్‌ || 1

పురాతనాశ్చ రాజాన ఋషయో దేవతాస్తథా | ఆరాధనం చ తసై#్యవ చక్రుర్దేవవరస్య హి || 2

ఋషులు ఇట్లు పలికిరి -

ఓ సూతా! సూతా! మహాత్మా! నీవు జ్ఞానివి. ఓ గొప్ప వ్రతము గలవాడా! మరల శివుని వృత్తాంతమునే విస్తారముగా చెప్పుము (1). ప్రాచీనకాలములో రాజులు, ఋషులు మరియు దేవతలు ఆ దేవ దేవుని మాత్రమే ఆరాధించిరి (2).

సూత ఉవాచ |

సాధు పృష్టమృషిశ్రేష్ఠాః శ్రూయతాం కథయామి వః | చరిత్రం శాంకరం రమ్యం శృణ్వతాం భుక్తిముక్తిదమ్‌ || 3

ఏతదేవ పురా పృష్టో నారదేన పితామహః | ప్రత్యువాచ ప్రసన్నాత్మా నారదం మునిసత్తమమ్‌ || 4

సూతుడు ఇట్లు పలికెను-

ఓ మహర్షులారా! మీరు చక్కగా ప్రశ్నించితిరి. విను వారలకు భుక్తిని మరియు ముక్తిని ఇచ్చే సుందరమైన శంకరుని వృత్తాంతమును మీకు చెప్పెదను (3). పూర్వము నారదుడు బ్రహ్మను ఇటులనే ప్రశ్నించగా, ఆయన ప్రసన్నమైన అంతఃకరణము గలవాడై నారదమహర్షితో నిట్లనెను (4).

బ్రహ్మోవాచ |

శృణు నారద సుప్రీత్యా శాంకరం చరితం వరమ్‌ | ప్రవక్ష్యామి భవత్స్నేహాన్మహాపాతకనాశనమ్‌ || 5

రమయా సహితో విష్ణుశ్శివపూజాం చకార హ | కృపయా పరమేశస్య సర్వాన్‌ కామానవాప హి || 6

అహం పితామహశ్చాపి శివపూజనకారకః | తసై#్యవ కృపయా తాత విశ్వసృష్టికరస్సదా || 7

శివపూజాకరా నిత్యం మత్పుత్రాః పరమర్షయః | అన్యే చ ఋషయో యే తే శివపూజనకారకాః || 8

నారద త్వం విశేషేణ శివపూజనకారకః | సప్తర్షయో వసిష్ఠాద్యాశ్శివపూజనకారికాః ||10

అరుంధతీ మహాసాధ్వీ లోపాముద్రా తథైవ చ | అహల్యా గౌతమస్త్రీ చ శివపూజనకారికాః || 11

దుర్వాసాః కౌశికశ్శక్తిర్దధీచో గౌతమస్తథా | కణాదో భార్గవో జీవో వైశంపాయన ఏవ చ || 12

ఓ నారదా! మహాపాపములను పోగొట్టే శంకరుని శ్రేష్ఠమగు చరితమును నీయందలి ప్రేమచే చెప్పగలను. పరమప్రీతితో వినుము (5). విష్ణువు లక్ష్మితో గూడి శివుని పూజించి, ఆ పరమేశ్వురుని దయచే కోర్కెలనన్నిటినీ పొందెను (6). ఓ కుమారా! పితామహుడగు నేను కూడ శివుని పూజించి ఆయన దయచేతనే సర్వదా సృష్టించుచున్నాను (7). నా కుమారులగు మహర్షులు మరియు ఇతర మహర్షులు శివుని పూజించెదరు (8). ఓ నారదా! నీవు శివుని విశేషముగా పూజించెదవు. వసిష్ఠుడు మొదలగు సప్తర్షులు కూడ శివుని పూజింతురు (9). మహాపతివ్రతయగు అరుంధతి, లోపాముద్ర మరియు గౌతముని భార్యయగు అహల్య కూడ శివుని పూజింతురు (10). దుర్వాసుడు, కౌశికుడు, శక్తి దధీచుడు, గౌతముడు, కణాదుడు, భార్గవుడు, బృహస్పతి మరియు వైశంపాయనుడు కూడ శివ పూజకులే (11).

ఏతే చ మునయస్సర్వే శివపూజాకరా మతాః | తథా పరాశరో వ్యాసశ్శివపూజారతాస్సదా || 12

ఉపమన్యుర్మ హాభక్త శ్శివస్య పరమాత్మనః | యాజ్ఞవల్క్యో మహాశైవో జైమినిర్గర్గ ఏవ చ || 13

శుకశ్చ శౌనకాద్యాశ్చ శంకరస్య ప్రపూజకాః | అన్యే%పి బహవస్సంతి మునయో మునిసత్తమాః || 14

అదితిర్దేవమాతా చ నిత్యం ప్రీత్యా చకార హ | పార్థివీం శైవపూజాం వై సవధూః ప్రేమతత్పరా || 15

శక్రాదయో లోకపాలా పసవశ్చ సురాస్తథా | మహారాజికదేవాశ్చ సాధ్యాశ్చ శివపూజకాః || 16

గంధర్వా కిన్నరాద్యాశ్చో పసురాశ్శివపూజకాః | తథా%సురా మహాత్మానశ్శివపూజాకరా మతాః || 17

హిరణ్యకశిపుర్దైత్యస్సానుజస్ససుతో మునే | శివపూజాకరో నిత్యం విరోచనబలీ తథా || 18

ఈ మునులు అందర మాత్రమే గాక, పరాశరుడు మరియు వ్యాసుడు కూడ శివపూజయందు నిష్ఠ గల వారే (12). ఉపమన్యుడు శివపరమాత్మయొక్క మహాభక్తుడు. యాజ్ఞవల్క్యుడు, జైమిని మరియు గర్గుడు కూడ మహాశివభక్తులే (13). శుకశౌనకాది మహర్షులు కూడ శంకరపూజకులే. వీరే గాక శంకర పూజకులగు మహర్షులు ఎందరో గలరు (14). దేవమాతయగు అదితి కోడలితో కలిసి నిత్యము పరమప్రేమతో పార్థివశివలింగపూజను చేసెడిది (15). ఇంద్రుడు మొదలగు లోకపాలకులు, వసువులు, దేవతలు, మహారాజికదేవతలు మరియు సాధ్యులు కూడ శివపూజకులే (16). గంధర్వులు, కిన్నరులు, ఉపదేవతలు మొదలగు వారు మాత్రమే గాక, మహాత్ములగు రాక్షసులు కూడ శివుని పూజించెడివారని పెద్దలు చెప్పెదరు (17). ఓ మునీ! హిరణ్యకశిపుడనే రాక్షసుడు సోదరులతో మరియు పుత్రులతో గూడ నిత్యము శివుని పూజించెడివాడు. విరోచనుడు మరియు బలి కూడ అటులనే చేసెడివాడు (18).

మహాశైవస్స్మృతో బాణో హిరణ్యాక్షసుతాస్తథా | వృషపర్వా దనుస్తాత దానవాశ్శివపూజకాః || 19

శేషశ్చ వాసుకిశ్చైవ తక్షకశ్చ తథా పరే | శివభక్తా మహానాగా గరుడాద్యాశ్చ పక్షిణః || 20

సూర్య చంద్రావుభౌ దేవౌ పృథ్వ్యాం వంశప్రవర్తకౌ | శివసేవారతౌ నిత్యం సవంశ్యౌ తౌ మునీశ్వర || 21

మనవశ్చ తథా చక్రుస్స్వాయంభుపురస్సరాః | శివపూజాం విశేషేణ శివవేషధరా మునే || 22

ప్రియవ్రతశ్చ తత్పుత్రాస్తథా చోత్తానపాత్సుతః | తద్వంశ్యాశ్చైవ రాజానశ్శివపూజనకారకాః || 23

ధ్రువశ్చ ఋషభ##శ్చైవ భరతో నవ యోగినః | తద్భ్రాతరః పరే చాపి శివపూజనకారకాః || 24

వైవస్వతసుతాస్తార్‌క్ష్య ఇక్ష్వాకుప్రముఖా నృపాః | శివపూజారతాత్మానస్సర్వదా సుఖభోగినః || 25

బాణుడు మహాశైవుడని కీర్తించబడినాడు. ఓ కుమారా! ఇంతేగాక, హిరణ్యాక్షుని కుమారులు, వృషపర్వుడు,మరియు ఇతరదానవులుకూడ శివపూజకులే (19). శేషుడు, వాసుకి, తక్షకుడు మరియు ఇతర మహాసర్పములు మాత్రమే గాక, గరుడుడు మొదలగు పక్షులు కూడ శివభక్తులే (20). ఓ మహర్షీ! భూలోకములో వంశములను ప్రవర్తిల్ల జేసిన సూర్య చంద్రులు ఇద్దరు తమ వంశీయులతో సహా నిత్యము శివుని నిష్ఠతో పూజించెడివారు (21). ఓ మునీ! స్వాయంభువమనువు మొదలగు మనువులు కూడ శివ వేషమును ధరించి విశేషమగు శివపూజను చేసెడివారు (22). ప్రియవ్రతుడు, ఆయన పుత్రులు, ఉత్తానపాదుడు, ఆతని కుమారుడు మరియు వారి వంశములోని రాజులు శివుని పూజించెడివారు (23). ధ్రువుడు, ఋషభుడు, భరతుడు, ఆతని సోదరులగు తొమ్మిదిమంది యోగులు మరియు ఇతరులు కూడ శివుని పూజించెడివారు (24). వైవస్వతుని కుమారులు, తార్‌క్ష్యుడు మరియు ఇక్ష్వాకువు మొదలగు రాజులు సర్వకాలములలో శివుని నిష్ఠతో పూజించి సుఖములను అనుభవించిరి (25).

కకుత్‌స్థశ్చాపి మాంధాతా సగరశ్శైవసత్తమః | ముచుకుందో హరిశ్చంద్రః కల్మాషాంఘ్రిస్తథైవ చ || 26

భగీరథాదయో భూపా బహవో నృపసత్తమాః | శివపూజాకరా జ్ఞేయాశ్శివవేషవిధాయినః || 27

ఖట్వాంగశ్చ మహారాజో దేవసాహాయ్య కారకః | విధితః పార్థివీం మూర్తిం శివస్యాపూజయత్సదా || 28

తత్పుత్రో హి దిలీపశ్చ శివపూజనకృత్సదా | రఘుస్తత్తనయశ్శైవస్సుప్రీత్యా శివపూజకః || 29

అజశ్శివార్చ కస్తస్య తనయో ధర్మయుద్ధకృత్‌ | జాతో దశరథో భూయో మహారాజో విశేషతః|| 30

పుత్రార్థే పార్థివీం మూర్తిం శైవీం దశరథో హి సః | సమానర్చ విశేషేణ వసిష్ఠస్యాజ్ఞయా మునేః || 31

పుత్రేష్టిం చ చకారాసౌ పార్థివో భవభక్తిమాన్‌ | ఋష్యశృంగమునేరాజ్ఞాం సంప్రాప్య నృపసత్తమః || 32

కకుత్‌స్థుడు, మాంధాత, సగరుడు, ముచుకుందుడు, హరిశ్చంద్రుడు మరియు కల్మాషపాదుడు కూడ గొప్ప శివభక్తులే (26). భగీరథుడు మొదలగు అనేకమహారాజులు శివవేషమును దాల్చి శివపూజను చేసెడివారని తెలియవలెను (27). దేవతలకు సాహాయ్యమును చేసిన ఖట్వాంగ మహారాజు యథా విధిగా పార్థివశివమూర్తిని చేసి నిత్యము పూజించెను (28). ఆయన పుత్రుడగు దిలీపుడు నిత్యము శివుని పూజించెడివాడు. ఆయన కుమారుడగు రఘువు ప్రేమతో శివుని పూజించే శివభక్తుడు (29). ఆయన కుమారుడు, ధర్మయుద్ధమును చేయువాడు అగు అజుడు శివార్చకుడే. ఆయన కుమారుడు ప్రఖ్యాతిని గాంచిన దశరథమహారాజు (30). ఆ దశరథమహారాజు పుత్రసంతానము కొరకై వశిష్ఠ మహర్షి యొక్క ఆజ్ఞచే శివుని పార్థివమూర్తిని విశేషశ్రద్ధతో ఆరాధించెను (31). శివభక్తుడగు ఆ మహారాజు ఋష్యశృంగమహర్షియొక్క ఆజ్ఞను పొంది పుత్రకామేష్ఠిని చేసెను (32).

కౌసల్యా తత్ర్పి యా మూర్తిం పార్థివీం శాంకరీం ముదా | ఋష్యశృంగసమాదిష్టా సమానర్చ సుతాప్తయే || 33

సుమిత్రా చ శివం ప్రీత్యా కైకేయీ నృపవల్లభా | పూజయామాస సత్పుత్రప్రాప్తయే మునిసత్తమ || 34

శివప్రసాదతస్తా వై పుత్రాన్‌ ప్రాపుశ్శుభంకరాన్‌ | మహాప్రతాపినో వీరాన్‌ సన్మార్గనిరతాన్మునే || 35

తతశ్శివాజ్ఞయా తస్మాత్తాసు రాజ్ఞస్స్వయం హరిః | చతుర్భిశ్చైవ రూపైశ్చావిర్భభూవ నృపాత్మజః || 36

కౌసల్యాయాస్సుతో రామస్సుమిత్రాయాశ్చ లక్ష్మణః | శత్రుఘ్నశ్చైవ కైకేయ్యా భరతశ్చేతి సువ్రతాః || 37

రామస్ససహజో నిత్యం పార్థివం సమపూజయత్‌ | భస్మరుద్రాక్షధారీ చ విరజాగమమాస్థితః || 38

తద్వంశే యే సముత్పన్నా రాజానస్సానుగా మునే | తే సర్వే పార్థివం లింగం శివస్య సమపూజయన్‌ || 39

ఆయన ప్రియురాలగు కౌసల్య ఋష్యశృంగుని ఆదేశముచే శంకరుని పార్థివమూర్తిని పుత్రసంతానము కొరకై ఆనందముతో పూజించెను (33). ఓ మహర్షీ! సుమిత్ర మరియు రాజునకు అప్తురాలగు కైకేయి కూడ సత్పుత్రసంతానము కొరకై ప్రీతిపూర్వకముగా శివుని పూజించిరి (34). ఓ మునీ! వారు శివుని అనుగ్రహముచే, శుభకర్మలను అనుష్ఠించువారు, గొప్ప ప్రతాపము గలవారు, వీరులు, సన్మార్గమునందు ప్రీతి గలవారు అగు పుత్రులను బడసిరి (35). కావుననే, విష్ణువు శివుని ఆజ్ఞచే ఆ దశరథుని భార్యలయందు స్వయముగా నాలుగు రూపములతో రాజకుమారుడై అవతరించెను (36). కౌసల్యకు రాముడు, సుమిత్రకు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు, కైకేయికి భరతడు కుమారులై జన్మించి ధర్మ బద్ధమగు జీవితమును గడిపిరి (37). రాముడు సోదరులతో కలిసి భస్మను, రుద్రాక్షలను ధరించి విరజ అనే శైవాగమనియమములను పాటిస్తూ నిత్యము పార్థివలింగమును పూజించెను (38). ఓ మునీ! వారి వంశములో పుట్టిన రాజులు అందరు తమ అనుచరులతో కలిసి శివుని పార్థివలింగమును చక్కగా పూజించిరి (39).

సుద్యుమ్నశ్చ మహారాజశ్శైవో మునిసుతో మునే | శివశాపాత్ర్పియాహేతో రభూన్నారీ ససేవకః || 40

పార్థివేశసమర్చాతః పునస్సో%భూత్పుమాన్‌ వరః | మాసం స్త్రీ పురుషో మాసమేవం స్త్రీత్వం న్యవర్తత || 41

తతో రాజ్యం పరిత్యజ్య శివధర్మపరాయణః | శివవేషధరో భక్త్యా దుర్లభం మోక్షమాప్తవాన్‌ || 42

వురూరవాశ్చ తత్పుత్రో మహారాజస్సుపూజకః | శివస్య దేవదేవస్య తత్సుతశ్శివపూజకః || 43

భరతస్తు మహాపూజాం శివసై#్యవ సదాకరోత్‌ | నహుషశ్చ మహాశైవశ్శివపూజారతో హ్యభూత్‌ || 44

యయాతిశ్శివపూజాతస్సర్వాన్‌ కామానవాప్తవాన్‌ | అజీజనత్సుతాన్‌ పంచ శివధర్మపరాయణాన్‌ || 45

తత్సుతా యదుమాఖ్యాశ్చ పంచాపి శివపూజకాః | శివపూజాప్రభావేణ సర్వాన్‌ కామాంశ్చ లేభిరే || 46

ఓ మునీ! మహర్షికుమారుడు మరియు శివభక్తుడు అగు సుద్యుమ్నమహారాజు ప్రియురాలి కారణముగా శివుని శాపముచే సేవకునితో సహా స్త్రీ రూపమును పొందెను (40). ఆతడు పార్థివలింగమును పూజించి మరల శ్రేష్ఠుడగు పురుషుడాయెను. ఒక నెల పురుషుడు, మరియొక నెల స్త్రీ అను విధముగా కొంతకాలము గడచిన తరువాత శాపము పూర్తిగా తొలగిపోయెను (41). ఆతడు తరువాత రాజ్యమును విడిచిపెట్టి శివధర్మమునందు నిష్ఠ గలవాడై శివవేషమును ధరించి భక్తితో దుర్లభమగు మోక్షమును పొందెను (42). వాని పుత్రుడగు పురూరవమహారాజు గొప్ప పూజను చేసెను. వాని సుతుడు కూడ దేవదేవుడగు శివుని పూజించెడివాడు (43). భరతుడు కూడ నిత్యము శివుని గొప్పగా పూజించెడివాడు. మహాశివభక్తుడగు నహుషుడు శివపూజయందు ప్రీతిని కలిగియుండెడివాడు (44). యయాతి శివపూజను చేసి కోర్కెలనన్నిటినీ బడసినాడు. ఆయనకు శివధర్మపరాయణులగు ఐదుగురు కొడుకులు కలిగిరి (45). యదువు మొదలగు ఆ అయిదుగురు కుమారులు శివుని పూజించి ఆ ప్రభావముచే కోర్కెలనన్నిటినీ పొందిరి (46).

అన్యే%పి యే మహాభాగా స్సమానర్చుశ్శివం హి తే | తద్వంశ్యా అన్యవంశ్యాశ్చ భుక్తిముక్తిప్రదం మునే || 47

కృష్ణేన చ కృతం నిత్యం బదరీపర్వతోత్తమే | పూజనం తు శివసై#్యవ సప్తమాసావధి స్వయమ్‌ || 48

ప్రసన్నాద్భగవాంస్తస్మాద్వరాన్‌ దివ్యాననేకశః | సంప్రాప్య చ జగత్సర్వం వశే%నయత శంకరాత్‌ || 49

ప్రద్యుమ్నస్తత్సుతస్తాత శివపూజాకరస్సదా | అన్యే చ కార్‌ష్ణిపరవరాస్సాంబాద్యాశ్శివపూజకాః || 50

జరాసంధో మహాశైవస్తద్వంశ్యాశ్చ నృపాస్తథా | నిమిశ్శైవశ్చ జనకస్తత్పుత్రాశ్శివపూజకాః || 51

నలేన చ కృతా పూజా వీరసేనసుతేన వై | పూర్వజన్మని యో భిల్లో వనే పాంథసురక్షకః || 52

యతిశ్చ రక్షితస్తేన పురా హరసమీపతః | స్వయం వ్యాఘ్రాదిభీ రాత్రౌ భక్షితశ్చ మృతో నృపాత్‌ || 53

తేన పుణ్య ప్రభావేణ స భిల్లో హి నలో%భవత్‌ | చక్రవర్తీ మహారాజో దమయంతీప్రియో%భవత్‌ || 54

ఇతి తే కథితం తాత యత్పృష్టం భవతానఘ | శాంకరం చరితం దివ్యం కిమన్యత్ప్రష్టుమిచ్ఛసి || 55

ఇతి శ్రీ శివమహాపురాణ కోటిరుద్రసంహితాయం దేవర్షినృపశైవత్వవర్ణనం నామ సప్తత్రింశో%ధ్యాయః (37).

ఓ మునీ! వీరేగాక, వారి వంశీయులు మరియు ఇతర వంశీయులు ఎందరో మహాత్ములు భుక్తిని మరియు ముక్తిని ఇచ్చే శివుని చక్కగా పూజించిరి (47). ఉత్తమమగు బదరీ పర్వతమునందు శ్రీకృష్ణుడు స్వయముగా ఏడు మాసములవరకు నిత్యము శివుని మాత్రమే పూజించెను (48). ఆ శ్రీకృష్ణ భగవానుడు ప్రసన్నుడైన శంకరుని నుండి దివ్యములగు అనేక వరములను పొంది సర్వజగత్తును తన వశము చేసుకొనెను (49). ఓ కుమారా! ఆయన కుమారుడగు ప్రద్యుమ్నుడు నిత్యము శివుని పూజించెడివాడు. ఇంతేగాక, సాంబుడు మొదలగు శ్రీకృష్ణుని ఇతరపుత్రులు కూడ శివపూజకులే (50). జరాసంధుడు మహాశైవుడు. వాని వంశీయులగు రాజులు, నిమి, వాని పుత్రుడగు జనకుడు కూడ శివ పూజకులే (51). వీరసేనకుమారుడగు నలుడు కూడ శివపూజకుడే. ఆతడు పూర్వజన్మలో భిల్లుడు. అపుడాతడు అడవిలో బాటసారిని రక్షించెను (52). పూర్వజన్మలో ఆతడు శివుని సమీపమునందు రాత్రి సమయములో యతిని రక్షించుటకొరకై తాను పెద్దపులిచే భక్షింపబడి ధర్మము కొరకై ప్రాణములను బలి పెట్టెను. (53). ఆ పుణ్యప్రభావముచే ఆ భిల్లుడే నలుడై జన్మించి, చక్రవర్తియై గొప్ప రాజ్యమునేలి దమయంతికి ప్రియుడాయెను (54). ఓ వత్సా! పుణ్యాత్మా! నీవు కోరిన విధముగా దివ్యమైన శంకరచరితమును చెప్పితిని. ఇంకనూ ఏమి ప్రశ్నించదలచుచుంటివి? (55).

శ్రీ శివమహాపురాణములో కోటిరుద్రసంహితయందు దేవర్షినృపశైవత్వ వర్ణనమనే ముప్పది ఏడవ అధ్యాయము ముగిసినది (37).

Siva Maha Puranam-3    Chapters