Siva Maha Puranam-3    Chapters   

అథ అష్టమో% ధ్యాయః

భైరవావతారము

నందీశ్వర ఉవాచ |

సనత్కుమార సర్వజ్ఞ శృణు త్వం భైరవీం కథామ్‌ | యస్యాశ్శ్రవణ మాత్రేణ శైవీ భక్తిర్దృఢా భ##వేత్‌ || 1

భైరవః పూర్ణరూపో హి శంకరస్య పరాత్మనః | మూఢాస్తంవై న జానంతి మోహితాశ్శివమాయయా || 2

సనత్కుమార నో వేత్తి మహిమానం మహేశితుః | చతుర్భుజో%పి విష్ణర్వై చతుర్వక్త్రోపి వై విధిః || 3

చిత్రమత్ర న కించిద్వై దుర్‌ జ్ఞేయా ఖలు శాంభవీ | తయా సమ్మోహితాస్సర్వే నార్చ యంత్యపి తం పరమ్‌ || 4

వేద చేద్యది వాత్మానం స ఏవ పరమేశ్వరః | తదా విదంతితే సర్వే స్వేచ్ఛయా నహి కే%పి తమ్‌ || 5

సర్వగో%పి మహేశానో సేక్ష్యతే మూఢ బుద్ధిభిః | దేవవద్బుధ్యతే లోకే యో%తీతో మనసాం గిరామ్‌ || 6

అత్రేతిహాసం వక్షే%హం పరమర్షే పురాతనమ్‌| శృణు తం శ్రద్ధయా తాత పరమం జ్ఞానకారణమ్‌ || 7

మేరు శృంగే%ద్భుతే రమ్యే స్థితం బ్రహ్మాణమీశ్వరమ్‌ | జగ్ముర్దేవర్షయస్సర్వే సుతత్త్వం జ్ఞాతుమిచ్ఛయా || 8

తత్రాగత్య విధిం నత్వా పప్రచ్ఛుస్తే మహాదరాత్‌ | కృతాంజలిపుటాస్సర్వే నతస్కంధా మునీశ్వరాః || 9

నందీశ్వరుడిట్లు పలికెను-

ఓయీ సనత్కుమారా! సర్వజ్ఞా! నీవు భైరవుని గాథను వినుము. ఈ గాథను విన్నచో శివభక్తి దృఢమగును (1). భైరవుడు శంకరపరమాత్ముని పూర్ణావతారము. శివమాయచే మోహితులైన అజ్ఞానులు ఆతనిని ఎరుంగరు (2). ఓయీ సనత్కుమారా! చతుర్భుజుడగు విష్ణువు, మరియు చతుర్ముఖుడగు బ్రహ్మ కూడా మహేశ్వరుని మహిమను ఎరుంగరు (3). దీనిలో విచిత్రమేమియూ లేదు. శంభుని మాయను ఎరుంగుట అసంభవము. అందరు ఆ మాయచే మోహితులగుదురు. అట్లు మోహితులైన జనులు ఆ పరమేశ్వరుని అర్చించుట లేదు (4). ఆ పరమేశ్వరుడే స్వయముగా తన స్వరూపమును తెలిపినచో, అపుడు అట్టి భక్తులు ఆయనను తెలియగలరు. ఎవరైననూ తమ ఇచ్ఛచే ఆ పరమేశ్వరుని తెలియజాలరు (5). మహేశ్వరుడు సర్వవ్యాపకుడై యున్ననూ మూఢబుద్ధులు ఆయనను కనజాలరు. వాక్కునకు మనస్సునకు అందని ఆ పరమేశ్వరుని సామాన్య దేవతయని లోకులు భావించుచుందురు (6). ఓ మహర్షీ! ఈ విషయములో నేనొక ప్రాచీన గాథను చెప్పెదను. వత్సా! జ్ఞానహేతువగు ఆ శ్రేష్ఠగాథను నీవు శ్రద్ధతో వినుము (7). దేవతలు, ఋషులు అందరు కలిసి అద్భుతము, సుందరమునగు మేరు శిఖరమునందున్న భగవానుడగు బ్రహ్మ వద్దకు ఈశ్వరతత్త్వము నెరుంగ గోరి వెళ్లిరి (8). ఆ మహర్షులు, దేవతలు అందరు అచటకు వచ్చి బ్రహ్మకు సాష్టాంగ ప్రణామమును చేసి చేతులను జోడించి ఆదరముతో నిట్లు ప్రశ్నించిరి (9).

దేవర్షయ ఊచుః |

దేవదేవ ప్రజానాథ సృష్టికృల్లోకనాయక | తత్త్వతో వద చాస్మభ్యం కిమేకం తత్త్వమవ్యయమ్‌ || 10

దేవతలు, ఋషులు ఇట్లు పలికిరి-

ఓ దేవదేవా! ప్రజాపతీ! సృష్టికర్తవగు నీవే లోకములకు ప్రభుడవు. వినాశములేని ఏకైక తత్త్వము ఏది? ఈ విషయమును మాకు యథాతథముగా చెప్పుము (10).

నందీశ్వర ఉవాచ |

సమాయయా మహేశస్య మోహితః పద్మసంభవః | అవిజ్ఞాయ పరం భావం సంభావం ప్రత్యువాచ హ || 11

నందీశ్వరుడిట్లు పలికెను-

మహేశ్వరుని మాయచే మోహితుడైన ఆ బ్రహ్మ పరమాత్మ స్వరూపమును, ప్రభావమును ఎరుంగక ఇట్లు బదులిడెను (11).

బ్రహ్మోవాచ |

హే సురా ఋషయ స్సర్వే సుమత్యా శృణుతాదరాత్‌ | వచ్మ్యహం పరమం తత్త్వమవ్యయంవై యథార్థతః || 12

జగద్యోనిరహం ధాతా స్వయంభూరజ ఈశ్వరః | అనాది భాగహం బ్రహ్మ హ్యేక ఆత్మా నిరంజనః || 13

ప్రవర్తకో హి జగతా మహమేవ నివర్తకః | సంవర్తకో మదధికో నాన్యః కశ్చిత్సురోత్తమాః || 14

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ దేవతలారా ! ఋషులారా ! మీరందరు మంచి మనస్సుతో ఆదరముతో వినుడు. వినాశము లేని పరమతత్త్వమును గురించి నేను యథార్థముగా చెప్పెదను (12). స్వయముగా ప్రకటమైనవాడను, జగత్కారణుడను, విధాతను, పుట్టుక లేనివాడను, జగత్పరిపాలకుడను, ఆది లేని వాడను, దోషములు లేని వాడను అగు నేనే పరబ్రహ్మ పరమాత్మను (13). జగత్తును ప్రవర్తిల్ల జేయువాడను నేనే. జగత్తును ఉపసంహరించే ప్రలయకాలాగ్నిని నేనే. ఓ దేవశ్రేష్ఠులారా ! నాకంటె శ్రేష్ఠుడు మరియొకడు లేడు (14).

నందీశ్వర ఉవాచ |

తసై#్యవం వదతో ధాతుర్విష్ణుస్తత్ర స్థితో మునే | ప్రోవాచ ప్రహసన్‌ వాక్యం సంక్రుద్ధో మోహితో%జయా || 15

న చైతదుచితా బ్రహ్మన్‌ యోగయుక్తస్య మూర్ఖతా | అవిజ్ఞాయ పరం తత్త్వం వృథైతత్తే నిగద్యతే || 16

కర్తాహం సర్వలోకానాం పరమాత్మా పరః పుమాన్‌ | యజ్ఞో నారాయణో దేవీ మాయాధీశః పరా గతిః || 17

మమాజ్ఞయా త్వయా బ్రహ్మన్‌ సృష్టిరేషా విధీయతే | జగతాం జీవనం నైవ మామనాదృత్య చేశ్వరమ్‌ || 18

ఏవం త్రిప్రకృతౌ మోహాత్పరస్పర జయైషిణౌ | ప్రోచతుర్నిగమాంశ్చాత్ర ప్రమాణ సర్వెథా తనౌ || 19

ప్రష్టవ్యాస్తే విశేషేణ స్థితా మూర్తిధరాశ్చ తే | పప్రచ్ఛతుః ప్రమాణ జ్ఞానిత్యుక్త్వా చతురో%పి తాన్‌ || 20

నందీశ్వరుడిట్లు పలికెను-

ఓ మహర్షీ! బ్రహ్మ ఇట్లు పలుకుచుండగా అచటనున్న విష్ణువు కోపించి మాయామోహితుడై నవ్వుచూ ఒక వాక్యమును పలికెను (15). ఓ బ్రహ్మా ! నీ వంటి యోగీశ్వరునకు ఇట్టి మూర్ఖత్వము తగదు. నీవు సర్వోత్తమమగు తత్త్వము నెరుంగక ఇట్లు వ్యర్థవచనములను పలుకుచున్నావు (16). సర్వలోకములను సృష్టించు పరమాత్మను, పురుషోత్తముడను నేనే. యజ్ఞ స్వరూపుడనగు నారాయణుడను నేనే. నేను మాయాశక్తిని నా ఆధీనములో నుంచుకొనెదను. సర్వోత్తమగతియగు పరబ్రహ్మ నేనే (17). ఓ బ్రహ్మా ! నీవీ సృష్టిని నా ఆజ్ఞచేతనే చేసియుంటివి. ఈశ్వరుడనగు నన్ను తిరస్కరించినచో, ఈ జగత్తులు క్షణకాలము జీవించియుండలేవు (18). త్రిగుణాత్మకమగు ప్రకృతియందు మోహమును పొంది ఒకరిపై నొకరు విజయమును పొందగోరి వారిద్దరు తమ వాదములకు ప్రామాణ్యమును సంపాదించుట కొరకై ఆ విషయములో వేదములను ప్రశ్నించిరి (19). నాల్గువేదములు విగ్రహములను దాల్చి ఎదుటనున్నవి. అవి ప్రమాణ నిర్ణయమును చేయు సమర్థములు అని పలికి వారిద్దరు ఆ వేదములను ప్రశ్నించిరి (20).

విధివిష్ణూ ఊచతుః|

వేదాః ప్రమాణం సర్వత్ర ప్రతిష్ఠా పరమామితాః | యూయం వదత విశ్రబ్ధం కిమేకం తత్త్వ మవ్యయమ్‌ || 21

బ్రహ్మవిష్ణువులు ఇట్లు పలికిరి-

అన్ని విషయములలో వేదములే ప్రమాణము. అనంతములగు వేదముల ప్రతిష్ఠ సర్వోత్కృష్టమైనది. ఓ వేదములారా! వినాశములేని ఏకైక తత్త్వము ఏది? మీరు సత్యమును చెప్పుడు (21).

నందీశ్వర ఉవాచ |

ఇత్యాకర్ణ్య తయోర్వాచం పునస్తే హి ఋగాదయః | అవదంస్తత్త్వతస్సర్వే పరేశం సంస్మర ప్రభుమ్‌ || 22

యది మాన్యా వయం దేవౌ సృష్ఠిస్థితికరౌ విభూ | తదా ప్రమాణం వక్ష్యామో భవత్సందేహ భేదకమ్‌ || 23

శ్రుత్యుక్తవిధిమాకర్ణ్య ప్రోచతుస్తౌ సురౌ శ్రుతీః | యుష్మదుక్తం ప్రమాణం నౌ కిం తత్త్వం సమ్యగుచ్యతామ్‌ || 24

నందీశ్వరుడిట్లు పలికెను-

వారిద్దరి ఆ మాటను విని ఋగాది నాల్గు వేదములు పరమాత్మయగు శివప్రభుని స్మరించి యథార్థమగు వచనమునిట్లు పలికినవి (22). ఓ దేవతలారా! మీరిద్దరు సృష్టిస్థితులను చేయు ప్రభువులు. మామాట మీకు అంగీకారమైనచో, మీ సందేహమును పోగొట్టే ప్రమాణవచనమును చెప్పగలము (23). వేదములు పలికిన ఈ మాటను విని ఆ దేవతలిద్దరు వేదములతో 'మీమాట మాకు ప్రమాణము. తత్త్వము ఎయ్యది? చక్కగా విచారించి చెప్పుడు' అని పలికిరి (24).

ఋగ్వేద ఉవాచ |

యదంతస్థ్సాని భూతాని యతస్సర్వం ప్రవర్తతే | యదాహుఃపరమం తత్త్వం స రుద్రస్త్వేక ఏవహి || 25

ఋగ్వేదము ఇట్లు పలికెను-

సర్వప్రాణులు ఎవని యందు ఉన్నవో, ఎవని నుండి సర్వ జగత్తు ఉద్భవించుచున్నదో ఆ రుద్రుడు ఒక్కడే పరమతత్త్వమని మహర్షులు చెప్పుచున్నారు(25).

యజుర్వేద ఉవాచ |

యో యజ్ఞైరఖిలైరీశః యోగేన చ సమిజ్యతే | యేన ప్రమాణం ఖలు నస్స ఏకస్సర్వదృక్‌ శివః || 26

యుజుర్వేదము ఇట్లు పలికెను-

ఏ ఈశ్వరుడు సర్వయజ్ఞములచే మరియు యోగముచే ఆరాధింప బడుచున్నాడో, ఎవనిచే మాకు ప్రామాణ్యము లభించుచున్నదో, అట్టి సర్వసాక్షియగు అద్వయ తత్త్వము శివుడే (26).

సామవేద ఉవాచ |

యేనేదం భ్రామ్యతే విశ్వం యోగిభిర్యో విచింత్యతే | యద్భాసా భాసతే విశ్వం స ఏకస్త్ర్యంబకః పరః || 27

సామవేదము ఇట్లు పలికెను-

ఎవనిచే ఈ జగచ్చక్రము త్రిప్పబడుచున్నదో, ఎవనిని యోగులు ధ్యానించెదరో, ఎవని ప్రకాశముచే జగత్తు ప్రకాశించుచున్నదో, అట్టి అద్వయ పరమాత్మ ముక్కంటియే (27).

అథర్వణవేద ఉవాచ |

యంప్రపశ్యంతి దేవేశం భక్త్యానుగ్రహిణో జనాః | తమాహురేకం కైవల్యం శంకరం దుఃఖతఃపరమ్‌ || 28

అథర్వణవేదమిట్లు పలికెను-

ఏ దేవదేవుని కృపచే భక్తులగు జనులు ఆయనను చక్కగా దర్శించుచున్నారో, ఎవడు దుఃఖమునకు అతీతుడో, అట్టి అద్వయ నిర్గుణతత్త్వము శంకరుడని మహర్షులు చెప్పుచున్నారు(28)

నందీశ్వర ఉవాచ|

శ్రుత్యుక్తమిద మాకర్ణ్యాతీవ మాయావిమోహితౌ| స్మిత్వాహతుర్విధిహరీ నిగమాంస్తాన్విచేతనౌ||29

నందీశ్వరుడిట్లు పలికెను-

వేదములు చెప్పిన ఈ మాటలను విని, మాయచే అత్యధికముగా మోహితులై వివేకమును గోల్పోయిన బ్రహ్మ విష్ణువులు నవ్వి వేదములతో నిట్లనిరి (29).

విధిహరీ ఊచతుః |

హే వేదాః కిమిదం యూయం భాషంతే గతచేతనాః | కిం జాతం వో%ద్య సర్వం హి నష్టం సువయునం పరమ్‌ || 30

కథం ప్రమథనాథో%సౌ రమమాణో నిరంతరమ్‌ | దిగంబరః పీతవర్ణో శివయా ధూలధూసరః || 31

విరూపవేషో జటిలో వృషగో వ్యాలభూషణః | పరం బ్రహ్మత్వమాపన్నః క్వ చ తత్సంగవర్జితమ్‌ || 32

ఇత్యుదీరితమాకర్ణ్య ప్రణవస్సర్వగస్తయోః | అమూర్తో మూర్తి మాన్‌ పీత్యా జృంభమాణ ఉవాచ తౌ || 33

బ్రహ్మవిష్ణువులు ఇట్లు పలికిరి-

ఓ వేదములారా! మీరు వివేకమును గోల్పోయి ఇట్లు మాటలాడుచుంటిరేల? మీకీనాడు ఏమైనది? మీ యొక్క చక్కని పరమాత్మ జ్ఞానమంతయు నశించినది (30). ప్రమథగణములకధిపతి, సర్వదా విహారశీలి, దిగంబరుడు, పచ్చని వర్ణముగలవాడు, పార్వతితో గూడి యుండువాడు, భస్మచే బూడిదరంగును కలిగియున్నవాడు (31), వికృతవేషములో నుండువాడు, జటాధారి, వృషభవాహనుడు, పాములే ఆభరణములుగా గలవాడు అగు ఈ శివుడు పరబ్రహ్మ ఎట్లు అయినాడు? సంగరహితమగు పరబ్రహ్మ ఎక్కడ? శివుడు ఎక్కడ? (32) వారిద్దరి ఈ మాటలను విని సర్వవ్యాపకము, ఆకారవిహీనమునగు ఓంకారము ప్రేమతో శరీరమును స్వీకరించి వారిద్దరితో బిగ్గరగా నిట్లనెను (33).

ప్రణవ ఉవాచ |

నహీశో భగవాన్‌ శక్త్యా హ్యాత్మనో వ్యతిరిక్తయా | కదాచిద్రమతే రుద్రో లీలారూపధరో హరః || 34

అసౌ హి పరమేశానస్స్వయం జ్యోతిస్సనాతనః | ఆనందరూపా తసై#్య షా శక్తిర్నాగంతుకీ శివా || 35

ఓంకారము ఇట్లు పలికెను-

భగవంతుడు, ఈశ్వరుడు, లీలారూపములను ధరించువాడు మరియు పాపములను హరించువాడునగు రుద్రుడు ఏనాడైననూ తనకంటె భిన్నమగు శక్తితో విహరించుటలేదు (34). రుద్రుడు పరమేశ్వరుడు, స్వయంప్రకాశస్వరూపుడు మరియు సనాతనుడు. ఆయన యొక్క ఆనందస్వరూపమే పార్వతీ దేవి. ఆమె ఆయనయొక్క శక్తియే గాని బయటనుండి వచ్చినది గాదు (35).

నందీశ్వర ఉవాచ |

ఇత్యేవముక్తో%పి తదా విధేర్విష్ణోశ్చ వై తదా | నాజ్ఞానమగమన్నాశం శ్రీ కంఠసై#్యవ మాయయా || 36

ప్రాదురాసీత్తతో జ్యోతి రుభయోరంతరే మహత్‌ | పూరయన్నిజయా భాసా ద్యావా భూమ్యోర్యదంతరమ్‌ || 37

éజ్యోతిర్మండల మధ్య స్థో దదృశే పురుషాకృతిః | విధిక్రతుభ్యాం తత్రైవ మహాద్భుతతనుర్మునే|| 38

ప్రజజ్వాలాథ కోపేన బ్రహ్మణః పంచమం శిరః| ఆవయోరంతరే కో%సౌ బిభృయాత్పురుషాకృతిమ్‌ || 39

విధిస్సంభావయే ద్యావత్తావత్స త్రివిలోచనః | దృష్టఃక్షణన చ మహాపురుషో నీలలోహితః || 40

త్రిశూలపాణిర్భాలాక్షో నాగోడుపవిభూషణః | హిరణ్యగర్భస్తం దృష్ట్వా విహసన్‌ ప్రాహ మోహితః || 41

నందీశ్వరుడిట్లు పలికెను-

ఓంకారము ఇట్లు పలికిననూ శివుని మాయా ప్రభావముచే బ్రహ్మవిష్ణువుల అజ్ఞానము అప్పటికీ తొలగిపోలేదు (36). అపుడు వారిద్దరి మధ్య ఒక గొప్ప జ్యోతి ఉద్భవించెను. అది తన కాంతులచే భూమ్యాకాశముల మధ్య భాగమును నింపివేసెను (37). ఆ కాంతిమండలము యొక్క మధ్య భాగములో ఒక పురుషాకారమును గాంచి బ్రహ్మవిష్ణువులు అత్యంత విస్మయమును పొందిరి. ఓ మహర్షీ ! (38) అపుడు బ్రహ్మ యొక్క ఐదవ తల కోపముతో మండిపడెను. మా ఇద్దరిమధ్యలో పురుషాకృతిని దాల్చి ఆవిర్భవించిన ఈ తేజస్సు ఎవరు? (39) బ్రహ్మ ఊహ చేయులోపలనే ముక్కంటి, కంఠమునందు నీలవర్ణము ఇతరత్రా ఎర్రని రంగు గలవాడు అగు మహాపురుషుడు క్షణములో కానవచ్చెను (40). త్రిశూలమును చేతియందు ధరించినవాడు, లలాటమునందు కన్ను గలవాడు, సర్పములు చంద్రుడు అలంకారముగా గలవాడు అగు ఆ పురుషుని చూచి మోహితుడై యున్న బ్రహ్మ నవ్వుతూ ఇట్లు పలికెను (41).

బ్రహ్మోవాచ |

నీలలోహిత జానే త్వాం మాభైషీశ్చంద్రశేఖర | భాలస్థలాన్మమ పురా రుద్రః ప్రాదురభూద్భవాన్‌ || 42

రోదనాద్రుద్రనామాపి యోజితో%సి మయా పురా | మామేవ శరణం యాహి పుత్ర రక్షాం కరోమి తే || 43

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓయీ నీలలోహితా ! చంద్రశేఖరా! నేను నిన్ను ఎరుంగుదును. భయపడకుము. పూర్వము నీవు నా లలాట దేశమునుండి రుద్రరూపుడవై ఆవిర్భవించితివి (42). నీవు రోదించుటచే నేను పూర్వము రుద్రుడను నామధేయమునిచ్చి యుంటిని. నన్ను మాత్రమే శరణు పొందుము. పుత్రా ! నేను నిన్ను రక్షించెదను (43).

నందీశ్వర ఉవాచ |

అథేశ్వరః పద్మయోనేశ్శ్రుత్వా గర్వవతీం గిరమ్‌ | చు కోపాతీవ చ తదా కుర్వన్నివ లయం మునే || 44

స కోపతస్సముత్పాద్య పురుషం భైరవం క్వచిత్‌ | ప్రజ్వలంతం సుమహసా ప్రీత్యా చ పరమేశ్వరః || 45

నందీశ్వరుడిట్లు పలికెను -

అపుడు పద్మసంభవుడగు బ్రహ్మయొక్క గర్వముతో గూడిన మాటలను విని ఈశ్వరుడు మిక్కిలి కోపించెను. ఓ మునీ! అపుడాతడు ప్రలయమును చేయునా యన్నట్లుండెను (44). ఆ పరమేశ్వరుడు తన కోపమునుండి భయంకరాకారుడు, గొప్ప తేజస్సుతో వెలిగిపోవుచున్నవాడు నగు ఒక పురుషుని ప్రేమతో సృష్టించెను (45).

ఈశ్వర ఉవాచ |

ప్రాక్‌ చ పంకజ జన్మాసౌ శాస్యస్తే కాలభైరవ | కాలవద్రాజసే సాక్షాత్‌ కాలరాజస్తతో భవాన్‌ || 46

విశ్వం భర్తుం సమర్థో%సి భీషణాద్భైరవస్స్మృతః | త్వత్తో భేష్యతి కాలో%పి తతస్త్వం కాలభైరవః || 47

ఆమర్దయిష్యతి భవాన్‌ రుష్టో దుష్టాత్మనో యతః | ఆమర్దక ఇతి ఖ్యాతిం తతస్సర్వత్ర యాస్యసి || 48

యతః పాపాని భక్తానాం భక్షయిష్యసి తత్‌ క్షణాత్‌ | పాపభక్షణ ఇత్యేవ తవ నామ భవిష్యతి || 49

యామే ముక్తి పురీ కాశీ సర్వాభ్యో%పి గరీయసీ | ఆధిపత్యం చ తస్యాస్తే కాలరాజ సదైవ హి || 50

తత్ర రయే పాతకినరాస్తే షాం శాస్తా త్వమేవ హి | శుభాశుభం చ తత్కర్మ చిత్ర గుప్తో లిఖిష్యతి || 51

ఈశ్వరుడిట్లు పలికెను-

ఓ కాలభైరవా! పద్మమునుండి పుట్టిన ఈ బ్రహ్మను నీవు ముందుగా దండించవలెను. నీవు సాక్షాత్తు కాలుని వలె ప్రకాశించుచున్నావు గాన, నీకు కాలరాజు అని పేరు (46). నీవు జగత్తును భరించుటకు సమర్థుడవు. నిన్ను సర్వలోకములలో ఆమర్దకుడను ఖ్యాతిని పొందగలవు (48). నీవు భక్తుల పాపములను తత్‌ క్షణమే భక్షించెదవు గాన, నీకు పాపభక్షణుడను పేరు కలుగగలదు (49). ఓ కాలరాజా! సర్వనగరములకంటె గొప్పది, ముక్తిని ఇచ్చునది అగు నా కాశీనగరమేది గలదో, దానిపై నీకు సర్వకాలములయందు ఆధిపత్యము గలదు (50). అచటనుండు పాపాత్ములను దండించువాడవు నీవే. మానవుల శుభాశుభకర్మల జాబితాను చిత్ర గుప్తుడు వ్రాయగలడు (51).

నందీశ్వర ఉవాచ |

ఏతాన్‌ వరాన్‌ ప్రగృహ్యాథ తత్‌ క్షణాత్కాలభైరవః | వామాంగుళినఖాగ్రేణ చకర్త చ విధేశ్శిరః || 52

యదంగమపరాధ్నోతి కార్యం తసై#్యవ శాసనమ్‌ | అతో యేన కృతా నిందా తచ్ఛిన్నం పంచమం శిరః || 53

అథ చ్ఛిన్నం విధిశిరో దృష్ట్వా భీతతరోహరిః | శాతరుద్రియ మంత్రైశ్చ భక్త్యా తుష్టావ శంకరమ్‌ || 54

భీతో హిరణ్యగర్భో%పి జజాప శతరుద్రియమ్‌ | ఇత్థం తౌ గతగర్వౌహి సంజాతౌ తత్‌ క్షణాన్మునే || 55

పరబ్రహ్మ శివస్సాక్షాత్సచ్చిదానంద లక్షణః | పరమాత్మా గుణా తీత ఇతి జ్ఞానమవాపతుః || 56

సనత్కుమార సర్వజ్ఞ శృణు మే పరమం శుభమ్‌ | యావద్గర్వో భ##వేత్తావత్‌ జ్ఞానగుప్తిర్విశేషతః || 57

త్వక్త్వాభిమానం పురుషో జానాతి పరమేశ్వరమ్‌ | గర్విణం హంతి విశ్వేశో జాతో గర్వాపహారకః || 58

నందీశ్వరుడిట్లు పలికెను-

అపుడు కాలభైరవుడి వరములను స్వీకరించి వెనువెంటనే బ్రహ్మయొక్క తలను ఎడమచేతివ్రేలి గోటితో దునిమి వేసెను (52). ఏ అంగము అపరాధమును చేయునో, ఆ అంగమును నిశ్చయముగా దండించవలెను. కావున ఏ శిరస్సు నిందించినదో, ఆ ఐదవ శిరస్సు ఖండించబడెను (53). బ్రహ్మయొక్క తల నరుకబడుటను గాంచి విష్ణువు మరింత భయపడి భక్తి పూర్వకముగా శతరుద్రీయమంత్రములతో శంకరుని స్తుతించెను (54). భయపడియున్న బ్రహ్మ కూడా శతరుద్రీయమును జపించెను. ఈ విధముగా వారిద్దరు క్షణకాలములో గర్వమును విడిచి పెట్టిరి. ఓ మునీ! (55) సాక్షాత్తుగా శివుడే సచ్చిదానంద స్వరూపుడగు పరబ్రహ్మ. ఆయనయే గుణాతీతుడగు పరమాత్మ. వారీ జ్ఞానమును అపుడు పొందిరి (56). ఓయీ సర్వజ్ఞుడవగు సనత్కుమారా! నేను పలికే శుభకరమగు శ్రేష్ఠవచనమును వినుము. వ్యక్తిలో గర్వము ఉన్నంత వరకు, వానికి జ్ఞానము ప్రకాశించదు(57). అభినమానమును వీడిన పురుషుడు పరమేశ్వరుని ఎరుంగును. విశ్వేశ్వరుడు గర్విష్ఠిని సంహరించును. గర్వమును పోగొట్టువాడు జన్మించినాడు (58).

అథ విష్ణు విధీ జ్ఞాత్వా విగర్వౌ పరమేశ్వరః | ప్రసన్నో% భూన్మహాదేవో%కరోత్తావభ¸° ప్రభుః || 59

ఆశ్వాస్య తౌ మహాదేవః ప్రీతః ప్రణతవత్సలః | ప్రాహ స్వాం మూర్తిమపరాం భైరవం తం కపర్దినమ్‌ || 60

అపుడు బ్రహ్మ విష్ణువులకు గర్వము తొలగినదని యెరింగి పరమేశ్వరుడగు మహాదేవప్రభుడు ప్రసన్నుడై వారికి అభయమునిచ్చెను (59). భక్త ప్రియుడగు మహాదేవుడు వారిని ఓదార్చి ప్రీతుడై తన అపరావతారమైన జటాధారియగు ఆ భైరవునితో నిట్లు పలికెను (60).

మహాదేవ ఉవాచ |

త్వయా మాన్యా విష్ణురసౌ తథా శతధృతిస్స్వయమ్‌ | కపాలం వైధసం వాపి నీలలోహిత ధారయ || 61

బ్రహ్మ హత్యాపనోదాయ వ్రతం లోకాయ దర్శయ | చర త్వం సతతం భిక్షాం కపాలవ్రతమాశ్రితః || 62

ఇత్యక్త్వా పశ్యతస్తస్య తేజోరూప శ్శివో%బ్రవీత్‌ | ఉత్పాద్య చైకాం కన్యాం తు బ్రహ్మ హత్యా భివిశ్రుతామ్‌ || 63

యావద్వారాణసీం దివ్యాం పురీమేష గమిష్యతి | తావత్త్వం భీషణ కాలమనుగచ్ఛోగ్రరూపిణమ్‌ || 64

సర్వత్ర తే ప్రవేశో%స్తి త్యక్త్వా వారాణసీం పురీమ్‌ | వారాణసీం యదా గచ్ఛే త్తన్ముక్తా భవ తత్‌ క్షణాత్‌ || 65

నియోజ్య తామితి తదా బ్రహ్మహత్యాం చ తాం ప్రభుః | మహాద్భుతశ్చ స శివో%ప్యంతర్థాన మగాత్తతః || 66

ఇతి శ్రీ శివమహాపురాణ శతరుద్రసంహితాయాం భైరవావతారవర్ణనం నామ అష్టమో%ధ్యాయః (8)

మహాదేవిడిట్లు పలికెను-

ఈ విష్ణువును నీవు ఆదరించుము. మరియు నీవు స్వయముగా ఈ బ్రహ్మను కూడ మన్నించుము. ఓ నీలలోహితా! బ్రహ్మకపాలమును నీవు ధరించుము (61). బ్రహ్మహత్యా దోష నివారణ కొరకై నీవు కపాలవ్రతము నాశ్రయించి నిత్యము భిక్షాటనము చేసి లోకమునకు ఆదర్శము కమ్ము (62). ఇట్లు పలకి తేజోమయుడగు శంభుడు ఆతడు చూచుచుండగా బ్రహ్మహత్యయని ప్రసిద్ధిగాంచిన ఒక కన్యను సృష్టించి ఇట్లు పలికెను (63). ఓ భయంకరాకారము గల బ్రహ్మ హత్యా ! ఉగ్రమగు రూపము గల ఈ కాలభైరవుడు దివ్యమగు వారాణసీ నగరమును చేరునంతవరకు నీవు ఆయనను అనుసరించి వెళ్లుము (64). వారాణసీ నగరమును మినహాయించి నీకు అంతటా ప్రవేశము గలదు. ఓ భైరవా ! నీవు వారణాసిని ప్రవేశించగానే, నీకు వెంటనే బ్రహ్మహత్యనుండి విముక్తి కలుగును (65). మహాద్భుతుడగు శివప్రభుడు ఆ బ్రహ్మ హత్యను ఇట్లు ఆజ్ఞాపించి, తరువాత అంతర్ధానమును చెందెను (66).

శ్రీ శివమహాపురాణములోని శతరుద్రసంహితయందు భైరవావతారవర్ణనమనే ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (8).

Siva Maha Puranam-3    Chapters