Siva Maha Puranam-3    Chapters   

అథ అష్టాత్రింశో% ధ్యయః

శివరాత్రి వ్రతమహాత్మ్య వర్ణనము

ఋషయ ఊచుః|

ధన్యో%సి కృతకృత్యో%సి జీవితం సఫలం తవ | యచ్ఛ్రావయసి నస్తాత మహేశ్వరకథాం శుభామ్‌ || 1

బహుభిశ్చర్షిస్సూత శ్రుతం యద్యపి వస్తుసత్‌ | సందేహో న గతో%స్మాకం తదేతత్కథయామి తే||2

కేన వ్రతేన సంతుష్టశ్శివో యచ్ఛతి సత్సుఖమ్‌ | కుశలశ్శివకృత్యే త్వం తస్మాత్పృచ్ఛమహే వయమ్‌ || 3

భుక్తిర్ముక్తిశ్చ లభ్యేత భ##క్తైర్యేన వ్రతేన వై | తద్వద త్వం విశేషణ వ్యాసశిష్య నమో% స్తుతే || 4

ఋషులు ఇట్లు పలికిరి-

ఓ తండ్రీ| నీవు ధన్యుడవు. కృతార్ధుడవు.నీ జీవితము సార్థకమైనది. ఏలయన, నీవు మాకు శుభకరమగు మహేశ్వరగాథను వినిపించుచున్నావు(1). ఓ సూతా! ఈ సద్వస్తువును గురించి అనేకులగు ఋషులు చెప్పియున్ననూ మా సందేహము తొలగిపోలేదు. కావుననే నిన్ను ప్రశ్నించుచున్నాము(2). ఏ వ్రతముననుష్ఠించినచో శివుడు సంతోషించి ఉత్తమమగు సుఖమునొసంగును? నీవు శివారాధన కర్మలలో నిపుణుడవు. కావుననే మేము నిన్ను ప్రశ్నించుచున్నము(3) ఓ వ్యాస శిష్యా! భక్తులు ఏ వ్రతముచే భుక్తిని మరియు ముక్తిని పొందగల్గుదురో, దానిని నీవు విశేషణముగా చెప్పుము. నీకు నమస్కారమగుకాక!(4)

సూత ఉవాచ|

సమ్యక్‌ పృష్టమృషిశ్రేష్ఠా భవద్భిః కరుణాత్మభిః | స్మృత్వా శివపదాంభోజం కథయామి యథాశ్రుతమ్‌ ||5

యథా భవద్భిః పృచ్ఛేత తథా పృష్టం హి వేధసా| హరిణా శివయా చైవ తథా వైశంకరం ప్రతి ||6

కస్మింశ్చిత్సమయే తైస్తు పృష్టం చ పరమాత్మనే | కేన వ్రతేన సంతుష్టో భుక్తిం ముక్తిం చ యచ్ఛసి|| 7

ఇతిపృష్టస్తదా తైస్తు హరిణా తేనవై తదా | తదహం కథయామ్యద్యశృణ్వతాం పాపహారకమ్‌ ||8

సూతుడు ఇట్లు పలికెను-

ఓ మహర్షులారా! దయామూర్తులగు మీరు చక్కగా ప్రశ్నించితిరి. నేను శివుని పాదపద్మములను స్మరించి నేను విన్నదానికి అనురూపముగా చెప్పగలను(5). మీరు ప్రశ్నించిన విధముగనే బ్రహ్మ, విష్ణువు మరియు పార్వతి శంకరుని ప్రశ్నించియుండిరి(6). నీవు ఏ వ్రతమును చేసినచో సంతసించి భుక్తిని మరియు ముక్తిని ఇచ్చెదవు? అని వారు ఒకనాడు పరమాత్మను ప్రశ్నించిరి(7). ఈ విధముగా వారు ప్రశ్నించగా శివుడు చెప్పిన విషయమును నేను మీకు చెప్పుచున్నాను. దీనిని విన్నవారికి పాపవిముక్తి కలుగును(8).

శివ ఉవాచ|

భూరి ప్రతాని మే సంతి భుక్తి ముక్తి ప్రదాని చ | ముఖ్యాని తత్ర జ్ఞేయాని దశసంఖ్యాని తానివై|| 9

దశ శైవవ్రతాన్యాహుర్జబాలశ్రుతిపారగాః | తాని వ్రతాని యత్నేన కార్యాణ్యవ ద్విజైన్సదా||10

ప్రత్యుష్టమ్యాం ప్రయత్నేన కర్తవ్యం నక్తభోజనమ్‌ | కాలాష్టమ్యాం విశేషేణ హరే త్యాజ్యం హి భోజనమ్‌ ||11

ఏకాదశ్యాం సితాయాం తు త్యాజ్యం విష్ణో హి భోజనమ్‌ | అసితాయాం హి భోక్తవ్యం నక్తమభ్యర్చ్య మాం హరే || 12

త్రయోదశ్యాం సితాయాం తు కర్తవ్యం నిశి భోజనమ్‌ | అసితాయాం తు భూతాయాం తన్న కార్యం శివ్రతైః || 13

నిశి యత్నేన కర్తవ్యం భోజనం సోమవాసరే | ఉభయోః పక్షయోర్విష్ణో సర్వస్మిఞ్ఛివతత్పరైః || 14

వ్రతేష్వేతేషు సర్వేషు శైవా భోజ్యాఃప్రయత్నతః | యథాశక్తిద్విజశ్రేష్ఠావ్రతసంపూర్తి హేతవే||15

శివుడు ఇట్లు పలికెను-

భుక్తిని మరియు ముక్తిని ఇచ్చే నావ్రతములు చాల గలవు. కాని వాటిలో పది ముఖ్యమైనవని తెలియదగును (9). జాబాలశ్రుతిలో నిష్ణాతులగు ఋషులు పదిశైవవ్రతములును చెప్పియున్నారు. బ్రాహ్మణులు సర్వదా ఆ వ్రతములను ప్రయత్నపూర్వకముగా తప్పక అనుష్ఠించవలయును(10). ప్రతి అష్టమినాడు రాత్రియందు మాత్రమే భోజనమును చేయవలెను. ఓ విష్ణూ! కాలాష్టమినాడుభోజనమును తప్పనిసరిగా విడిచిపెట్టవలెను(11). ఓ విష్ణూ! శుక్లపక్షములో ఏకాదశినాడు భోజనమును చేయరాదు. ఓ హరీ ! కృష్ణ పక్షములో ఏకాదశినాడు రాత్రియందు నన్ను ఆరాధించి భుజించవలెను(12). శుక్లపక్షములో త్రయోదశినాడు రాత్రియందు భుజించవలెను. శివవ్రతముననుష్ఠించువారికి కృష్ణపక్షములోత్రయోదశినాడు రాత్రిభోజనము నిషిద్ధము(13). ఓ విష్ణూ! రెండు పక్షములలో ప్రతిసోమవారము నాడు రాత్రిమాత్రమే శివారాధనకులు తప్పనిసరిగా భుజించవలెను(14) ఈ వ్రతములన్నింటియందు బ్రాహ్మణులశ్రేష్ఠులగు శైవులకు యథాశక్తిగా శ్రద్ధతో భోజనమును ఏర్పాటు చేసినచో వ్రతము సంపూర్ణమగును(15).

వ్రతాన్యేతాని నియమానత్కర్తవ్యాని ద్విజన్మభిః | వ్రతాన్యేతాని తు త్యక్త్వా జాయంతే తస్కరా ద్విజాః ||16

ముక్తిమార్గప్రవీణౖశ్చ కర్తవ్యం నియమాదితి| ముక్తేస్తు ప్రాపకం చైవ చతుష్టయముదాహృతమ్‌ || 17

శివార్చనం రుద్రజప ఉపవాసశ్శివాలయే | వారాణస్యాం చ మరణం ముక్తిరేషా సనాతనీ|| 18

అష్టమీ సోమవారే చకృష్ణపక్షే చతుర్ధశీ| శివతుష్టికరం చైతన్నాత్ర కార్యా విచారణా|| 19

చుతుర్ష్వపి బలిష్ఠం హి శివరాత్రివ్రతం హరే | తస్మాత్తదేవ కర్తవ్యం భుక్తిముక్తిఫలేప్సుభిః ||20

ఏతస్మాచ్చ వ్రతాదన్యన్నాస్తి నౄణాం హితావహమ్‌ | ఏతద్ర్వ తం తు సర్వేషాం ధర్మసాధనముత్తమమ్‌ || 21

నిష్కామానాం సకామానం సర్వేషాం చ నృణాం తథా| వర్ణానామాశ్రమాణాం చ స్త్రీ బాలానాం తథా హరే || 22

దాసావాం దాసికానాం చ దేవాదీనాం తథైవ చ | శరీరిణాం చ సర్వేషాం హితమేతద్ర్వం తం వరమ్‌ ||23

మాఘస్య హ్యసితేపక్షే విశిష్టా సాతికీర్తితా | నిశీథవ్యాపినీ గ్రాహ్యా హత్యాకోటివినాశినీ|| 24

తద్దినే చైవ యత్కార్యం ప్రాతరారభ్య కేశవ | శ్రుయతాం తన్మనో దత్త్వా సుప్రీత్యా కథయామి తే || 25

బ్రాహ్మణులు ఈ వ్రతములను తప్పనిసరిగా ఆచరించవలెను. ఈ వ్రతములను విడిచిపెట్టిన బ్రాహ్మణులు చోరులగుదురు(16). మోక్షమార్గమునందు నిష్ణాతులగువారు ఈనాలుగు వ్రతములను నియమము తప్పకుండగా ఆచరించవలెను.ఈ నాలుగు ముక్తిసాధనములని చెప్పబడినది(17). శివపూజ, రుద్రజపము, శివాలయమునందు ఉపవాసము మరియు వారాణాసిలో మరణము అనునవి ఈ నాలుగు సనాతనమగు ముక్తిమార్గములు(18). అష్టమీతిథితో కూడిన సోమవారము మరియు కృష్ణపక్షచతుర్దశి శివునకు ప్రీతికరములనుటలో సందేహము లేదు(19). ఓ హరీ! ఈ నాల్గింటిలో శివరాత్రివ్రతము సర్వోత్తమమైనది. కావున భుక్తి మరియు ముక్తి అనే ఫలములను కోరువారు దానిని నిశ్చయముగా ఆచరించవలెను (20). మానవులకు ఈ వ్రతమును మించి హితమును కలిగించునది మరియొకటి లేదు. ఈ వ్రతము ధర్మసాధనములన్నింటిలో ఉత్తమమైనది(21). ఓ హరీ! కామనలు గలవారు, కామనలు లేనివారు, సర్వవర్ణములవారు, అన్ని ఆశ్రమములవారు, స్త్రీలు, పిల్లలు, సేవకులు, సేవికలు, దేవతలు మొదలగు సర్వప్రాణులకు ఈ వ్రతము గొప్ప హితమును కలిగించును(22,23). మాఘకృష్ణపక్షములో ఈ వ్రతముచాల శ్రేష్ఠమైనది అప్పుడు రాత్రి అంతయు ఈ వ్రతమును చేసినచో, కోటి హత్యల పాపము నశించును(24). ఓ కేశవా! ఆనాడు ఉదయమే ఆరంభించి చేయదగిన కర్తవ్యము నంతను నేను చెప్పుచున్నాను.నీవు మనస్సును లగ్నము చేసి పరమప్రీతితోవినుము(25).

ప్రాతరుత్థాయ మేధావీ పరమానందసంయుతః | సమాచరేన్నిత్యకృత్యం స్నానాదికమతంద్రితః || 26

శివాలయే తతో గత్వా పూజయిత్వా యథావిది| నమస్కృత్య శివం పశ్చాత్సంకల్పం సమ్యగాచరేత్‌ || 27

దేవదేవ మహాదేవ నీలకంఠ నమో%స్తుతే| కర్తుమిచ్చామ్యహం కదేవ శివరాత్రివ్రతం తవ|| 28

తవ ప్రభావాద్దేవేశ నిర్విఘ్నేన భ##వేదితి| కామాద్యాశ్శత్రవో మాం వై పీడాం కుర్వంతు నైవహి ||29

ఏవం సంకల్పమాస్థాయ పూజాద్రవ్యం సమాహరేత్‌ | సుస్థలే చైవ యల్లింగం ప్రసిద్ధం చాగమేషు వై|| 30

రాత్రౌ తత్ర స్వయం గత్వా సంపాద్య విధిముత్తమమ్‌ | శివస్య దక్షిణ భాగే పశ్చిమే వాస్థలే శుభే|| 31

నిధాయ చైవ తద్ద్ర వ్యం పూజార్థం శివసన్నిధౌ | పునస్స్నాయాత్తదా తత్ర విధిపూర్వం నరోత్తమః || 32

బుద్దిమంతుడగు మానవుడు పరమానందభరితుడై స్నానము మొదలగు నిత్యకృత్యమును ఉపేక్షచేయకుండగా చక్కగా చేసుకొనవలెను(26). తరువాత శివాలయమునకు వెళ్లి యథావిధిగా పూజను చేసి శివునకు నమస్కరించి తరువాత సంకల్పమును చేయవలెను(27). ఓ దేవ దేవా! మహదేవా! నీలకంఠా! నీకు నమస్కారము అగుగాక! ఓ దేవా ! నేను నీ శివరాత్రివ్రతమును చేయగోరుచున్నాను(28). ఓ దేవేశా! నీ ప్రభావముచే ఇది నిర్విఘ్నముగా పూర్తియగుగాక! కామము మొదలగు శత్రువులు లేశ##మైననూ పీడను కలిగించకుండను గాక! (29). ఈ విధముగా సంకల్పించి పూజద్రవ్యములను తెచ్చుకొనవలెను. ఆగమములలో ప్రసిద్ధమైన లింగము ఉన్న పవిత్రస్థలమునకు(30). రాత్రి యందు స్వయముగా వెళ్లి ఉత్తమమగు విధిని పాటిస్తూ శివునకు దక్షిణమునందుగాని, పశ్చిమమునందు గాని శుభమగు స్థలములో (31), ఆ పూజాద్రవ్యములను శివుని సన్నిధిలో ఉంచి ఆ ఉత్తమ పురుషుడు మరల అచట యథావిధిగా స్నానమును చేయవలెను(32).

పరిధాయ శుభం వస్త్ర మంతర్వాసశ్శుభం తథా| ఆచమ్య చ త్రివారం హి పూజారంభం సమాచరేత్‌ || 33

యస్య మంత్రస్య యద్ద్ర వ్యం తేన పూజాం సమాచరేత్‌ | ఆ మంత్రకం న కర్తవ్యం పూజనం తు హరస్య చ|| 34

గీతైర్వాద్యైస్తథా నృత్యైర్భక్తిభావసమన్వితః | పూజనం ప్రథమే యామే కృత్వా మంత్రం జపేద్బుధః || 35

పార్థివం చ తదా శ్రేష్ఠం విదధ్యాన్మంత్రవాన్‌ యది | కృత నిత్యక్రియః పశ్చాత్పార్థివం చ సమర్పయేత్‌ || 36

ప్రథమం పార్థివం కృత్వా పశ్చాత్‌ స్థాపన మాచరేత్‌ | స్తోత్రై ర్నానా విధైర్దేవం తోషయే ద్వృషభద్వజమ్‌ || 37

మహాత్మ్యం వ్రతసంభూతం పఠితవ్యం సుధీమతా| శ్రోతవ్యం భక్తవర్యేణ వ్రతసంపూర్తికామ్యయా|| 38

చతుర్ష్విపి చ యామేఘు మూర్తీనాం చ చతుష్టయమ్‌ | కృత్వావాహనపూర్వం హి విసర్గావధి వై క్రమాత్‌|| 39

శుభ్రమగు వస్త్రమును ధరించవలెను. శుభ్రమగు లోపలి వస్త్రమును కూడ ధరించి మూడుసార్లు ఆచనమును చేసి పూజను మొదలు పెట్టవలెను(33). ఏ మంత్రమునకు ఏ ద్రవ్యము విహితమో, ఆ క్రమములో మాత్రమే పూజను చేయవలెను. శివుని మంత్రము లేకుండగా పూజించరాదు(34). వివేకియగు వ్యక్తి భక్తిభావముతో కూడినవాడై గీతము, వాద్యము మరియు నృత్యము అను వాటితో మొదటి యామములో పూజను పూర్తిచేసి మంత్రమును జపించవలెను(35). మంత్రోపదేశము గల వ్యక్తి అయినచో, శ్రేష్ఠమగు పార్థివలింగమును చేసి నిత్యకర్మానుష్ఠానము తరువాత దానిని చక్కగా పూజించవలెను(36). ముందుగా పార్థివలింగమును చేసి తరువాత స్థాపించవలెను. వివిధరకముల స్తోత్రములతో వృషభధ్వజుని ప్రసన్నుని చేసుకొనవలెను(37). బుద్ధిమంతుడగు వ్యక్తి వ్రతమునకు సంబంధించిన మహాత్మ్యమును పఠించవలెను. వ్రతసంపూర్తినికోరు భక్తాగ్రేసరుడు దానిని వినవలెను(38). నాలుగు యామములయందు నాలుగు మూర్తులను చేసి ఆవాహననుండి ఉద్వాసన వరకు క్రమముగా పూజించవలెను(39).

కార్యం జాగరణం ప్రీత్యా మహోత్సవసమన్వితమ్‌ | ప్రాతస్స్నాత్వా పునస్తత్ర స్థాపయేత్ఫూజయేచ్ఛివమ్‌ || 40

తతస్సంప్రార్థయే చ్ఛంభుం నతస్కంధః | కృతసంపూర్ణవ్రతకో నత్వా తం చ పునః పునః || 41

నియమో యో మహాదేవ కృతశ్చైవ త్వదాజ్ఞాయా | విసృజ్యతే యమా స్వామిన్‌ వ్రతం జాతమనుత్తమమ్‌ || 42

వ్రతేనానేన దేవేశ యథాశక్తికృతేచ | సంతుష్టో భవ శర్వాద్య కృపాం కురు మమోపరి|| 43

పుష్పంజలిం శివే దత్త్వా దద్యాద్దానం యథావిది| నమస్కృత్య శివాయైవ నియమం తం విసర్జయేత్‌ || 44

యథాశక్తి ద్విజాన్‌శైవాన్‌ యతినశ్చ విశేషతః | భోజయిత్వా సుసంతోష్య స్వయం భోజనమాచరేత్‌ || 45

మహోత్సవపురస్సరముగా ప్రీతితో జాగరణమును చేయవలెను. ఉదయమే స్నానమును చేసి మరల అచట శివుని స్థాపించి పూజించవలెను(40). తరువాత చేతులను జోడించి తలను వంచి శంభుని నమస్కరించవలెను. ఈ విధముగా వ్రతమును పూర్తి ఏసి పలుమార్లు ప్రణమిల్లవలెను (41). ఓ మహాదేవా! నీ ఆజ్ఞచే నేను స్వీకరించిన నియముమును విడిచిపెట్టుచున్నాను. ఓ స్వామీ! ఉత్తమమగు వ్రతము సంపన్నమైనది (42). ఓ దేవేశా! నేను యథాశక్తితో చేసిన ఈ వ్రతము నీకు సంతోషము కలిగించు గాక! ఓ శర్వా! ఓ సర్వకారణా ! నీవీనాడు నాపై దయను చూపుము(43). ఈ విధముగా శివునకు పుష్పాంజలిని సమర్పించి యథావిధిగా దానమును చేసి శివునకు నమస్కరించి ఆ నియమును విడిచిపెట్టవలెను(44). యథాశక్తిగా బ్రాహ్మణులను, శివభక్తులను, విశేషించి సన్న్యాసులను భోజనమునిడి సంతోషపెట్టి తరువాత తాను భోజనమును చేయవలెను(45).

యామే యామే యథా పూజా కార్యా భక్తవైరైర్హరే | శివరాత్రౌ విశేషణ తామహం కథయామి తే|| 46

ప్రథమే చైవ యామే చ స్థాపితం పార్థివం హరే | పూజయేత్పరయా భక్త్వా సూపచారైరనేకశః || 47

పంచద్రవ్యైశ్చ ప్రథమం పూజనీయో హరస్సదా| తస్య తస్య చ మంత్రేణ పృథగ్ద్రవ్యం సమర్పయేత్‌ || 48

తచ్చద్రవ్యం సమర్ప్యైవ జలధారం దదేత వై| పశ్చాచ్చ జలధారాభిర్ద్ర వ్యాణ్యుత్తారయేద్భుదః || 49

శతమష్టోత్తరం మంత్రం పఠిత్వా జలధారయా| పూజయేచ్చ శివం తత్ర నిర్గుణం గుణరూపిణమ్‌ || 50

గురుదత్తేన మంత్రేణ పూజయే ద్వృషభద్వజమ్‌| అన్యథా నామమంత్రేణ పూజయేద్వైసదాశివమ్‌ || 51

చందనేన విచిత్రేణ తండులైశ్చాప్యఖండితైః | కృష్ణైశ్చైవ తిలైః పూజా కార్యా శంభోః పరాత్మనః || 52

పుషై#్పశ్చ శతపత్రై శ్చకరవీరైస్తథా పునః | అష్టభిర్నామమంత్రై శ్చార్పయేత్పుష్పాణి శంకరే|| 53

ఓ హరీ! శివరాత్రినాడు విశేషముగా ప్రతియామమునందు భక్తశ్రేష్ఠులు పూజను చేయదగిన విధముగను నేను నీకు చెప్పుచున్నాను (46). ఓ విష్ణూ! మొదటి యామమునందు పార్థిలింగమును స్థాపించి అనేకములగు ఉపచారములతో పరమభక్తిపూర్వకముగా పూజించవలెను(47). ముందుగా శివుని ఐదు ద్రవ్యములతో తప్పని సరిగాపూజించవలెను. ఆయా ద్రవ్యములను ఆయా మంత్రములతో వేర్వేరుగా సమర్పించవలెను (48). ఆ ద్రవ్యములను సమర్పించిన తరువాత జలధారను ఏర్పాటు చేయవలెను. వివేకియగు భక్తుడు జలధారలతో ఆ ద్రవ్యములను తొలగునట్లు చేయవలెను(49). నిర్గుణుడు అయిననూ సగుణుడైన శివుని ఆ లింగమునందు నూట ఎనిమిది సార్లు మంత్రమును జపించిన తరువాత జలధారతో పూజించవలెను (50). గురవుచే ఉపదేశించబడిన మంత్రముతో వృషభద్వజుని పూజించవలెను. లేదా, సదాశివుని నామమంత్రముతోనైననూ పూజించవచ్చును (51). రంగు రంగుల చందనము, నూకలు లేని బియ్యము మరియు నల్లని తిలలు అను వాటితో శంభుపరమాత్మను పూజించవలెను(52). శంకరుని ఎనిమిది నామమంత్రములను పఠిస్తూ ఎర్రగన్నేరు, పద్మము ఇత్యాది పుష్పములను శంకరునికి ఆర్పించవలెను(53).

భవశ్శర్వస్తథా రుద్రఃపునః పశుపతిస్తథా| ఉగ్రో మహాంస్తథా భీమ ఈశాన ఇతి తానివై|| 54

శ్రీపూర్వైశ్చ చతుర్థ్యం తైర్నామభిః పూజయేచ్ఛివమ్‌ | పశ్చాద్ధూపం చ దీపం చ నైవేద్యం చ తతః పరమ్‌ || 55

ఆద్యే యామే చ నైవేద్యం పక్వాన్నం కారమేద్భుదః | అర్దం చ శ్రీ ఫలం దత్త్వా తాంబూలం చ నివేదయేత్‌ || 56

నమస్కారం తతో ధ్యానం జపః ప్రోక్తో గురోర్మనోః| అన్యథా పంచవర్ణేన తోషయేత్తేన శంకరమ్‌ || 57

ధేనుముద్రాం ప్రదర్శ్యాథ సుజలైస్తర్పరణం చరేత్‌ | పంచబ్రాహ్మణభోజం చ కల్పయేద్వై యథాబలమ్‌|| 58

మహోత్సవశ్చ కర్తవ్యో యావద్యామో భ##వేదిహ | తతః పూజాఫలం తసై#్మ నివేద్య చ విసర్జయేత్‌ ||59

పునర్ద్వితీయే యామే చ సంకల్పం సుసమాచరేత్‌ | అథవైకదైవ సంకల్పం కుర్యాత్పూజాం తథావిధామ్‌ || 60

భవుడు, శర్వుడు, పశుపతి, ఉగ్రుడు, మహాన్‌, భీముడు, ఈశానుడు అనునవి ఆ పది నామములు(54). ఈ నామములను చతుర్థీ విభక్తీలోనికి మార్చి వాటికి ముందు శ్రీకారమును ఉంచి శివుని పూజించవలెను. తరువాత ధూపదీపనైవేద్యమును అర్పించవలెను(55). వివేకి మొదటి యామము(మూడుగంటలు) నందు వండిన అన్నమును నైవేద్యమిడవలెను. కొబ్బరిచెక్కతో బాటు తాంబూలమునీయవలెను(56). తరవాత నమస్కారము, ధ్యానము, ఆతరువాత గురువుచే ఉపదేశించిబడిన మంత్రము యొక్క జపము అను వాటిని చేయవలెను. లేదా, పంచాక్షరీమంత్రమును జపించి శంకరునుకు సంతోషమును కలిగించవలెను(57). తరువాత ధేనుముద్రను చూపించి పవిత్ర జలముతో తర్పణమును చేయవలెను. యథాశక్తిగా ఐదుగురు బ్రాహ్మణములకు భోజనము నిడవలెను(58). యామము పూర్తియగునంతవరకు మహోత్సవమునుచేసి, తరువాత పూజాఫలమును పరమేశ్వరునకు సమర్పించి ఉద్వాసన చెప్పవలెను(59). మరలరెండవ యామములో సంకల్పమును చెప్పవలెను. లేదా, ఒకేసారి సంకల్పమును చెప్పి పూజను అదే విధముగా కొనసాగించవలెను(60).

ద్రవ్యైః పూర్వైస్తథా పూజాం కృత్వా ధారాం సమర్పయేత్‌ |

పూర్వతో ద్విగుణం మంత్రం సముచ్చార్యార్చయేచ్ఛివమ్‌ || 61

పూర్వైస్తిలయవైశ్చాథ కమలైః పూజయేచ్ఛివమ్‌ | బిల్వపత్రైర్విశేషణ పూజయేత్పరమేశ్వరమ్‌ || 62

అర్ఘ్యం చ బీజపూరేణ నైవేద్యం పాయసం తథా | మంత్రావృత్తిస్తు ద్విగుణా పుర్వతో% పి జనార్దన|| 63

తతశ్చ బ్రాహ్మణానాం హి భజ్య సంకల్పమాచరేత్‌ | అన్యత్సర్వం తథా కుర్యాద్యావచ్చ ద్వితయావధి|| 64

యామే ప్రాప్తే తృతీయ చ పూర్వవత్పూజనం చరేత్‌ | యవస్థానే చ గోధూమాః పుష్పాణ్యర్క భవాని చ|| 65

ధూపైశ్చ వివిధస్తత్ర దిపైర్నానా విధైరపి | నైవేద్యాపూపకైర్విష్ణో శాకైర్నానావిధైరపి||66

కృత్వైవం చాథ కర్పూరైరారార్తికవిధిం చరేత్‌ | అర్ఘ్యం సదాడియం దద్యాద్ద్విగుణం జపమాచరేత్‌ || 67

పూర్వములో ఉపయోగించిన ద్రవ్యములతోనే పూజను చేసి ధారను ఏర్పాటు చేయవలెను. మొదటియామమునకు రెట్టింపు జపమును చేసి శివుని ఆరాధించవలెను(61). పూర్వయాగములో వలెనే శివుని తిలలు, యవలు మరియు కమలములతో పూజించవలెను. ఆపరమేశ్వరుని బిల్వపత్రములతో విశేషముగా పూజించవలెను(62). నిమ్మపండుతో అర్ఘ్యమును ఈయవలెను. పాయసమును నైవేద్యముమిడవలెను. ఓ జనార్దనా! మంత్రమునుపూర్వముకంటె రెట్టింపు జపించవలెను(63). తరువాత బ్రాహ్మణులకు భోజనమునిడెదనని సంకల్పమును చేయవలెను. రెండవ యామములో మిగిలిన సర్వము ప్రథమయామముతో సమానము(64). మూడవ యామము రాగానే పూర్వము వలెననే పూజను చేయవలెను. యవల స్థానములో గోధుమలను వాడవలెను. జిల్లేడు పుష్పములతో పూజించవలెను(65). ఓ విష్ణూ| వివిధరూపములను మరియునానావిధదీపములను కూడ సమర్పించి వివిధ శాకములను మరియు అప్పములను నైవేద్యము పెట్టవలెను(66). ఈ విధముగా కర్పూరహారతులను యథావిధిగాఇచ్చి తరువాత దాడిమఫలముతో ఆర్ఘ్యమునీయవలెను. రెట్టింపు జమును చేయవలెను(67).

తత్రశ్చ బ్రహ్మభోజస్య సంకల్పం చ సదక్షిణమ్‌ | ఉత్సవం పూర్వవత్కుర్యాద్యావద్యామావధిర్భవేత్‌ || 68

యామే చతుర్థే సంప్రాప్తే కుర్యాత్తస్య విసర్జనమ్‌ | ప్రయోగాది పునః కృత్వా పూజాం వివిధమాచరేత్‌ || 69

మాషైః ప్రియం గుభిర్ముద్గైస్సప్త ధాన్యైస్తథాథవా| శంఖీపుషై#్పర్బిలపత్రైఃపూజయేత్పరమేశ్వరమ్‌ ||70

నేవేద్యం తత్ర దద్యాద్వై మధురైర్వివిధైరపి| అథవా చైవ మాషాన్నైస్తోషయేచ్చ సదాశివమ్‌ || 71

అర్ఘం దద్యాత్కదల్యాశ్చ ఫలేనైవాథవా హరే | వివిధైశ్చ ఫలైశ్చైవ దద్యాదర్ఘ్యం శివాయ చ|| 72

పూర్వతో ద్విగుణం కర్యాన్మంత్రజాపం నరోత్తమః | సంకల్పం బ్రహ్మభోజస్య యథాశక్తి చరేద్భుధః || 73

గీతైర్వాద్యైస్తథా నృత్యైర్నయేత్కాలం చ భక్తితః | మహోత్సవైర్భక్తజనైర్యావత్స్యాదరుణోదయః || 74

తరువాత బ్రాహ్మణభోజనమును వారికి దక్షిణములతో సహా సంకల్పించి పూర్వమునందు వలెనే యామము పూర్తియగువరకు ఉత్సవమును చేయవలెను (68). నాల్గవ యామము ప్రారంభము కాగానే దానికి ఉద్వాసన చెప్పి ప్రయెగమునంతనూ మరల చేసి వివిధపూజలను చేయవలెను(69). మినుములు, పెసలు, ప్రియంగుధాన్యము లేదా ఏడు ధాన్యములలో ఏదోఒక ధాన్యము శంఖీపుష్పములు, మరేడు పత్రి అను వాటితో పరమేశ్వరుని పూజించవలెను(70). ఆ సమయములో వివిధ మధురపదార్థములను గాని, లేదా మినుములతో కూడిన అన్నమును గాని నైవేద్యము చేసి సదాశివుని సంతోషపెట్టవలెను(71). అరటి పండుతో గాని, లేదా, ఏదేని ఒక పండుతో గాని శివునికు అర్ఘ్యము నీయవలెను(72). ఉత్తమభక్తుడు ముందటి యామమునకు రెట్టింపు జపమును చేయవలెను. వివేకి యథాశక్తి బ్రాహ్మణభోజనమును గురించి సంకల్పమును చేయవలెను(73). గీతములు, వాద్యములు మరియు నృత్యములతో కాలుమను భక్తిపూర్వకముగా గుడుపవలెను. భక్తజనులు తెల్లవారువరకు మహోత్సవములను చేయవలెను(74).

ఉదయే చ తథా జాతే పునస్న్సాత్వార్చయేచ్ఛివమ్‌ | నానాపూజోపహారైశ్చ స్వాభిషేకమథాచరేత్‌ || 75

నానావిధాని దానాని భోజ్యం చ వివిధం తథా| బ్రాహ్మణానాం యతీనాం చ కర్తవ్యం యామసంఖ్యయా|| 76

శంకరాయ నమస్కృత్య పుష్పాంజలిమథాచరేత్‌ | ప్రార్థయేత్సుస్తుతిం కృత్వా మంత్రైరేతైర్విచక్షణః || 77

తావకస్త్వద్గత ప్రాణస్త్వచ్చిత్తో% హం సదా మృడ| కృపానిధే ఇతిజ్ఞాత్వా యథా యోగ్యం తథాకురు|| 78

అజ్ఞానాద్యది వా జ్ఞానాజ్జపపూజాదికం మయా| కృపా నిధిత్వాత్‌ జ్ఞాత్వైవ భూతనాథ ప్రసీద మే || 79

అనేనైవో పవాసేన యజ్జాతం ఫలమేవ చ | తేనైవ ప్రీయతాం దేవశ్శంకరస్సుఖదాయకః|| 80

కులే మమ మహాదేవ భజనం తే% స్తు సర్వదా | మాభూత్తస్య కులే జన్మయత్ర త్వం న హి దేవతా || 81

తెల్లవారగానే మరల స్నానము చేసి శివునకు చక్కగా అభిషేకమును చేసి వివిధద్రవ్యములతో శివుని పూజించలెను(75). బ్రాహ్మణులకు మరియు యతులకు యామసంఖ్యను బట్టి వివిధభోజ్యములను మరియు నానావిధములగు దానములను ఈయవలెను(76). వివేకియగు భక్తుడు తరువాత శంకరునకు నమస్కరించి పుష్పాంజలిని సమర్పించి చక్కగా ఈ మంత్రములతో స్తుతించవలెను(77). ఓ మృడా! నేను నీవాడను. నాప్రాణములు నీయందే ఉన్నవి. నా మనస్సు సర్వదా నీపై లగ్నమై ఉన్నది. ఓ దయానిధీ! ఈ విషయమును గమనించి తరువాత యథాయోగ్యముగాచేయుము (78). ఓ భూతనాథా! నేను తెలిసిగాని, తెలియక గాని జపము , పూజ ఇత్యాదులలో లోపమును చేసినచో దానిని దయానిధివిఅగు నీవు గమనించిననూ, ప్రసన్నతను విడనాడవద్దు(79). ఈ ఉపవాసముచే ఏ ఫలము కలిగినదో, దానిచే సుఖకరుడగు శంకరదేవుడు ప్రపన్నుడగుగాక!(80). ఓ మహాదేవా! నా కులములో సర్వదా నీ భజనము ఉండుగాక! నిన్ను ఆరాధించని వ్యక్తి ఈ కులములో జన్మించకుండుగాక!(81)

పుష్పంజలిం సమర్ప్యైవం తిలకాశిష ఏవచ | గృహ్ణీయాద్బ్రాహ్మణ భ్యశ్చ తతశ్శంభుం విసర్జయేత్‌ || 82

ఏవం వ్రతం కృతం యేన తస్మాద్దూరో హరో నహి | న శక్యతే ఫలం వక్తుం నా దేయం విద్యతే మమ|| 83

అనాసక్తతయా చేద్వైకృతం వ్రతమిదం పరమ్‌ | తస్యవైముక్తిబీజం చ జాతం నాత్ర విచారణా || 84

ప్రతిమాసం వ్రతం చైవ కర్తవ్యం భక్తితో నరైః |ఉద్యాపనవిధిం పశ్చాత్కృత్వా సాంగఫలం లభేత్‌ || 85

వ్రతస్యకరణాన్నూనం శివో%హం సర్వదుఃఖహా | దద్మి భుక్తిం చ ముక్తిం చ సర్వం వై

వాంఛితం ఫలమ్‌ || 86

ఈ విధముగా పుష్పాంజలిని సమర్పించి బ్రాహ్మణులనుండి తిలకమును మరియు ఆశీర్వచనములను స్వీకరించి తరువాత శంభునకు ఉద్వాసనను చెప్పవలెను(82). ఈ విధమైన వ్రతమును చేయువానికి శివుడు దూరములో లేడు. వాని ఫలములను చెప్పుటకు సాధ్యము కాదు. వానికి నే ను ఈయదగనిది ఏదీ లేదు(83). ఈ గొప్ప వ్రతమును నిష్కామముగా ఆదరించువానికి ముక్తిబీజము ఉదయించినదని చెప్పవచ్చును. సందేహము లేదు (84). మానవులు ఈ వ్రతమును ప్రతినెల భక్తితో చేయవలెను. తరువాత ఉద్వాసన విధిని ఆచరించినచో అంగములతో కూడిన ఫలము లభించును(85). సర్వ దుఃఖములను పొగొట్టె శివుడను నేను ఈ వ్రతమును చేసినవానికి భుక్తిని ముక్తిని మరియుఅభీష్టములైన సర్వఫలములను ఇచ్చెదను(86).

సూత ఉవాచ|

ఇతి శివవచనం నిశమ్య విష్ణుర్హితతమరమద్భుతమాజగామ ధామ|

తదను వ్రతముత్తమం జనేషు సమచరదాత్మహితేషు చైతదేవ ||87

కదాచిన్నారదాయాథ శివరాత్రివ్రతం త్విదమ్‌ | భుక్తిముక్తిప్రదం దివ్యం కథయామాస కేశవః || 88

ఇతి శ్రీ శివమహాపురాణ కోటిరుద్రసహితాయాం శివరాత్రి వ్రతమహాత్మ్య వర్ణనం నామ అష్టాత్రింశో%ధ్యాయః (38).

సూతుడు ఇట్లు పలికెను-

శివుని మిక్కిలి హితకరమైన మరియు అధ్బుతమైన ఈ వచనమును విని విష్ణువు తన ధామమునకు మరలి వచ్చెను. తరువాత ఈ ఉత్తమవ్రతము మాత్రమే ఆత్మహితము కోరు మానవులలో ప్రవర్తిల్లెను(87). ఒకనాడు భుక్తిముక్తిప్రదమగు ఈ దివ్యమగు శివరాత్రి వ్రతమును కేశవుడు నారదునకు తరువాత చెప్పెను(88).

శ్రీ శివమహాపురాణములోని కోటిరుద్రసంహితమందు శివరాత్రివ్రతమహాత్య్మమును వర్ణించే ముప్పది ఎనిమిదవ అధ్యాయము ముగిసినది(38).

Siva Maha Puranam-3    Chapters