Siva Maha Puranam-3    Chapters   

అథ ద్విచత్వారింశో%ధ్యాయః

సగుణ నిర్గుణ భేదము

ఋషయ ఊచుః |

శివః కో వా హరిః కో వా రుద్రః కో వా విధిశ్చ కః | ఏతేషు నిర్గుణః కో వా హ్యేతం నశ్ఛింధి సంశయమ్‌ || 1

ఋషులు ఇట్లు పలికిరి-

శివుడు ఎవరు? విష్ణువు ఎవరు? రుద్రుడు ఎవరు? బ్రహ్మ ఎవరు? వీరిలో నిర్గుణుడు ఎవరు? మా ఈ సంశయమును తొలగించుము (1).

సూత ఉవాచ |

యచ్చాదౌ హి సముత్పన్నం నిర్గుణాత్పరమాత్మనః | తదేవ శివసంజ్ఞం హి వేదవేదాంతినో విదుః || 2

తస్మాత్ర్పకృతిరుత్పన్నా పురుషేణ సమన్వితా | తాభ్యాం తపః కృతం తత్ర మూలస్థే చ జలే సుధీః || 3

పంచక్రోశీతి విఖ్యాతా కాశీ శర్వాతివల్లభా | వ్యాప్తం చ సకలం హ్యేతత్తజ్జలం విశ్వతో గతమ్‌|| 4

సంభావ్య మాయయా యుక్తస్తత్ర సుప్తో హరిస్సవై | నారాయణతి విఖ్యాతః ప్రకృతిర్నారాయణీ మతా || 5

తన్నాభికమలే యో వై జాతస్స చ పితామహః | తేనైవ తపసా దృష్టస్స వై విష్ణురుదాహృతః || 6

ఉభయోర్వాదశమనే యద్రూపం దర్శితం బుధాః | మహాదేవేతి విఖ్యాతం నిర్గుణన శివేన హి || 7

తేన ప్రోక్తమహం శంభుర్భవిష్యామి కభాలతః | రుద్రో నామ స విఖ్యాతో లోకానుగ్రహకారకః || 8

ధ్యానార్థం చైవ సర్వేషామరూపో రూపవానభూత్‌ | స ఏవ చ శివస్సాక్షాద్భక్తవాత్సల్యకారకః || 9

సూతుడు ఇట్లు పలికెను-

నిర్గుణపరమాత్మనుండి ఏదైతే ముందుగా జన్మించినదో అదియే శివ అనే నామమును పొందునని వేద వేదాంతవేత్తలు చెప్పుచున్నారు (2). ఆ శివునినుండి పురుషునితో కూడియున్న ప్రకృతి పుట్టెను. వివేకియగు పురుషుడు ప్రకృతితో కలిసి మూలములోనున్న జలములో తపస్సును చేసెను (3). పంచక్రోశి అని పేరు గాంచి శివునకు అతిప్రియమైన కాశీనగరము తప్ప మిగిలిన విశ్వమంతయు ఈ జలముతో నిండియుండెను (4). దీనిని చూచి నారాయణి అనబడే మాయ (ప్రకృతి)తో కూడియున్న నారాయణనామేధేయుడై హరి ఆ జలమునందు నిద్రించెను (5). ఆయన నాభికమలమునుండి పితామహుడు జన్మించెను. ఆయన తపస్సును చేసి ఆ విష్ణువును దర్శించెను (6). ఓ విద్వాంసులారా! వారి ఇద్దరి వాదము శమించిన తరువాత నిర్గుణుడగు శివుడు చూపించిన రూపమునకు మహాదేవుడని పేరు వచ్చినది (7). నేను బ్రహ్మయొక్క లలాటమునుండి జన్మించెదనని ఆ శంభుడు చెప్పెను. ఆయనయే రుద్రుడై లోకములను అనుగ్రహించెను (8). సర్వప్రాణులు ధ్యానమును చేయుటకొరకై రూపము లేని ఆ శివుడు రూపము కలవాడు ఆయెను. ఆ సరూపుడే భక్తులయందు ప్రేమను వర్షించే శివుడు అయిఉన్నాడు (9).

శివే త్రిగుణసంభిన్నే రుద్రే తు గుణధామని | వస్తుతో న హి భేదో%స్తి స్వర్ణే తద్భూషణ యథా || 10

సమానరూపకర్మాణౌ సమభక్తగతిప్రదౌ | సమానాఖిలసంసేవ్యౌ నానాలీలావిహారిణౌ || 11

సర్వథా శివరూపో హి రుద్రో రౌద్రపరాక్రమః | ఉత్పన్నో భక్తకార్యార్థం హరిబ్రహ్మసహాయకృత్‌ || 12

అన్యే చ యే సముత్పన్నా యథానుక్రమతో లయమ్‌ | యాంతి నైవ తథా రుద్రశ్శివే రుద్రో విలీయతే || 13

తే వై రుద్రం మిలిత్వా తు ప్రయాంతి ప్రకృతా ఇమే | ఇమాన్‌ రుద్రో మిలిత్వా తు న యాతి శ్రుతిశాసనమ్‌ || 14

సర్వే రుద్రం భజంత్యేవ రుద్రః కంచిద్భజేన్న హి| స్వాత్మనా భక్తవాత్సల్యాద్భజత్యేవ కదాచన || 15

అన్యం భజంతి యే నిత్యం తస్మింస్తే లీనతాం గతాః | తేనైవ రుద్రం తే ప్రాప్తాః కాలేన మహతా బుధాః || 16

త్రిగుణాతీతుడగు శివునకు గుణములకు ధామయగు రుద్రునకు, బంగారమునకు ఆభరణమునకు వలె వస్తుతత్త్వమునందు భేదము లేదు (10). వారిద్దరు సమానమైన రూపము మరియు కర్మ గలవారు. భక్తులకు వారు సమానముగా ఉత్తమగతిని ఇచ్చెదరు. అందరికి వారు సమానముగా సేవించదగినవారు. వారు అనేకలీలలను ప్రకటించుచూ విహరించెదరు (11). భయంకరపరాక్రమము గల రుద్రుడు అన్ని విధములుగా శివరూపుడే. ఆయన భక్తుల కార్యమును నెరవేర్చుటకై ఉదయించి బ్రహ్మవిష్ణువులకు సాహాయ్యమునందించినాడు (12). మిగిలిన వారు అందరు ఏ క్రమములో జన్మించిరో, అదే క్రమములో లయమును పొందెదరు. కాని రుద్రుడు అట్లు లయము కాడు. ఆయన శివునిలో ఐక్యమగును (13). ప్రకృతిజన్యములగు కార్యములన్నియు రుద్రుని కలిసి లయమును పొందును. కాని రుద్రుడు వాటితో కలిసి లయమును పొందడని వేదముయొక్క అనుశాసనము (14). సర్వులు రుద్రుని నిశ్చయముగా సేవించుచున్నారు. కాని రుద్రుడు ఇతరులను సేవించుట లేదు. కాని ఆయన స్వరూపతః భక్తులయందు ప్రేమ కలవాడు గనుక కాదాచిత్కముగా తనంత తానుగా సేవించవచ్చును (15). ఓ విద్వాంసులారా! నిత్యము ఇతరులను సేవించువారు వారిలోననే లీనమగుదురు. కావున వారు చిరకాలము తరువాత రుద్రునిలోననే లీనమగుదురు (16).

రుద్రభక్తాస్తు యే కేచిత్తత్‌ క్షణం శివతాం గతాః | అన్యాపేక్షా న వై తేషాం శ్రుతిరేషా సనాతనీ || 17

అజ్ఞానం వివిధం హ్యేతద్విజ్ఞానం వివిధం న హి | తత్ర్పకారమహం వక్ష్యే శృణుతాదరతో ద్విజాః || 18

బ్రహ్మాదితృణపర్యంతం యత్కించిద్దృశ్యతే త్విహ | తత్సర్వం శివ ఏవాస్తి మిథ్యా నానాత్వకల్పనా || 19

సృష్టేః పూర్వం శివః ప్రోక్తస్సృష్టేర్మధ్యే శివస్తథా | సృష్టే రంతే శివః ప్రోక్తస్సర్వశూన్యే తదా శివః || 20

తస్మాచ్చతుర్గుణః ప్రోక్తశ్శివ ఏవ మునీశ్వరాః | స ఏవ సగుణో జ్ఞేయశ్శక్తిమత్త్వాద్ద్విధాపి సః || 21

రుద్రభక్తులు ఆ క్షణమునందే శివునిలో ఐక్యమగుదురనియు, వారికి ఇతరసాధనములతో పని లేదనియు అనాదియగు వేదము చెప్పుచున్నది (17). అజ్ఞానములో అనేక భేదములు గలవు. కాని ఈ జ్ఞానములో వివిధత్వము లేదు. ఓ బ్రాహ్మణులారా! దాని వివరములను చెప్పెదను. ఆదరముతో వినుడు (18). బ్రహ్మ మొదలుకొని గడ్డిపోచ వరకు ఈజగత్తులో కానవచ్చే సర్వము మిథ్య. ఈ నానాత్వము కల్పితము. ఈ సర్వము శివునికంటే భిన్నముగా లేదు (19). సృష్టికి పూర్వము ఉన్నది శివుడే. సృష్టికి మధ్యలో ఉన్నది శివుడే. సృష్టి నశించిన తరువాత ఉండేది శివుడే. సర్వశూన్యావస్థలోనైననూ ఉండేది శివుడే (20). ఓ మహర్షులారా! అందువలననే శివునియందు మాత్రమే నాలుగు గుణములు కలవని చెప్పెదరు. సగుణుడు కూడ ఆయనయే. శక్తిసమేతుడగుటచే ఆయనయే సగుణనిర్గుణభేదముచే భాసిల్లుచున్నాడు (21).

యేనైవ విష్ణవే దత్తాస్సర్వే వేదాస్సనాతనాః | వర్ణామాత్రా హ్యనేకాశ్చ ధ్యానం స్వస్య చ పూజనమ్‌ || 22

ఈశానస్సర్వవిద్యానాం శ్రుతిరేషా సనాతనీ | వేదకర్తా వేదపతిస్తస్మాచ్ఛంభురుదాహృతః || 23

స ఏవ శంకరస్సాక్షాత్సర్వానుగ్రహకారకః | కర్తా భర్తా చ హర్తా చ సాక్షీ నిర్గుణ ఏవ సః || 24

అన్యేషాం కాలమానం చ కాలస్య కలనా న హి | మహాకాలస్స్వయం సాక్షాస్మహాకాలీసమాశ్రితః || 25

తథా చ బ్రాహ్మణా రుద్రం తథా కాలీం ప్రచక్షతే | సర్వం తాభ్యాం తతః ప్రాప్తమిచ్ఛయా సత్యలీలయా || 26

న తస్యోత్పాదకః కశ్చిద్భర్తా హర్తా న తస్య హి | స్వయం సర్వస్య హేతుస్తే కార్యభూతాచ్యుతాదయః || 27

స్వయం చ కారణం కార్యం స్వస్య నైవ కదాచన | ఏకో ప్యనేకతాం యాతోప్యనేకోప్యేకతాం వ్రజేత్‌ || 28

ఏకం బీజం బహిర్భూత్వా పునర్బీజం చ జాయతే | బహుత్వే చ స్వయం సర్వం శివరూపీ మహేశ్వరః || 29

ఏతత్పరం శివజ్ఞానం తత్త్వతస్తదుదాహృతమ్‌ | జానాతి జ్ఞానవానేవ నాన్యః కశ్చిదృషీశ్వరాః || 30

ఆ శివుడే స్వయముగా సనాతనములగు నాలుగు వేదములను, అనేకములగు వర్ణములను, మాత్రలను, ధ్యానమును మరియు తనను పూజించు విధిని విష్ణువునకు ఇచ్చెను (22). విద్యలన్నింటికి ఆయనయే ఈశ్వరుడని సనాతనమగు వేదము చెప్పుచున్నది. కావున వేదములను రచించినవాడు, వేదములకు అధిపతి శంభుడేనని మహర్షులు చెప్పుచున్నారు (23). సర్వులను అనుగ్రహించువాడు, జగత్తుయొక్క సృష్టిస్థితిలయములను చేయువాడు, సాక్షి మరియు నిర్గుణుడు అగు ఆ పరంబ్రహ్మ సాక్షాత్తుగా శంకరుడే (24). సర్వజీవులకు ఆయుర్దాయముయొక్క పరిగణన కలదు. కాని కాలస్వరూపుడగు శివునకు ఈ పరిగణనతో సంబంధము లేదు. ఆయనయే మహాకాలితోగూడి స్వయముగా మహాకాలస్వరూపుడై ఉన్నాడు (25). బ్రాహ్మణులు వారినే రుద్రుడు మరియు కాలి అని వర్ణించుచున్నారు. ఈ సర్వము వారి ఇచ్ఛచే మరియు వారి సత్యలీలచే వారినుండి ఉద్భవించినది (26). శివునకు కారణము లేదు. శివునకు పోషించువాడు గాని, లయము చేయువాడు గాని లేడు. ఆయనయే స్వయముగా సర్వకారణకారణుడై ఉన్నాడు. అచ్యుతడు మొదలగు వారందరు కార్యస్వరూపులు (27). కారణస్వరూపుడు ఆయనకు మరియొక్క కారణము లేదు. ఆయన ఒక్కడుగానుండి అనేకత్వమును, అనేకస్వరూపుడే అయిననూ ఏకత్వమును పొందుచుండును (28). ఒకే బీజము వృక్షరూపములో ప్రకటమై మరల బీజములకు జన్మనిచ్చును. ఆ నానాత్వమంతయూ ఆ వృక్షములో అంతర్గతమగును. శివస్వరూపుడగు మహేశ్వరుని విషయములో కూడ ఇదియే వ్యవస్థ (29). శివునియొక్క ఈ పరమజ్ఞానమును నేను యథాతథముగా చెప్పితిని. ఓ మహర్షులారా! దీనిని జ్ఞాని మాత్రమే తెలుసుకొనగల్గును. అజ్ఞానికి ఇది తెలియదు (30).

మునయ ఊచుః |

జ్ఞానం సలక్షణం బ్రూహి యద్‌ జ్ఞాత్వా శివతాం వ్రజేత్‌ | కథం శివశ్చ తత్సర్వం సర్వం వా శివ ఏవ చ || 31

మునులు ఇట్లు పలికిరి -

ఏ జ్ఞానముచే మానవుడు శివునితో ఐక్యమగునో, అట్టి జ్ఞానమును లక్షణసహితముగా చెప్పుము. శివుడు ఈ సర్వముగా ఎట్లు అయినాడు? సర్వము శివునియందు ఎట్లు ఉన్నది? (31)

వ్యాస ఉవాచ|

ఏతదాకర్ణ్య వచనం సూతః పౌరాణికోత్తమః | స్మృత్వా శివపదాంభోజం మునీంస్తానబ్రవీద్వచః || 32

ఇతి శ్రీ శివమహాపురాణ కోటి రుద్రసంహితయాం సగుణనిర్గుణ భేదవర్ణనం నామ ద్విచత్వారింశో% ధ్యాయః (42).

వ్యాసుడు ఇట్లు పలికెను-

పౌరాణికులలో ఉత్తముడగు సూతుడు ఈ వచనమును విని శివుని పాదపద్మములను స్మరించి ఆ మునులతో ఇట్లు పలికెను (32).

శ్రీ శివమహాపురాణములో కోటిరుద్రసంహితయందు సగుణనిర్గుణభేదమును వర్ణించే నలుబది రెండవ అధ్యాయము ముగిసినది (42).

Siva Maha Puranam-3    Chapters