Siva Maha Puranam-3    Chapters   

అథ ద్వితీయో%ధ్యాయః

శివభక్తి-మాహాత్మ్యము

సనత్కుమార ఉవాచ |

ఇత్యాకర్ణ్య మునేర్వాక్యముపన్యోర్మహాత్మనః | జాతభక్తిర్మహాదేవే కృష్ణః ప్రోవాచ తం మునిమ్‌ || 1

సనత్కుమారుడు ఇట్లు పలికెను-

మహాత్ముడగు ఉపమన్యుమహర్షియొక్క ఈ మాటను విని మహాదేవునియందు ఉదయించిన భక్తి గల శ్రీకృష్ణుడు ఆ మహర్షితో నిట్లనెను (1).

శ్రీకృష్ణ ఉవాచ |

ఉపమన్యో మునే తాత కృపాం కురు మమోపరి | యే యే శివం సమారాధ్య కామనాపుశ్చ తాన్‌ వద || 2

శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను-

ఓ ఉపమన్యుమహర్షీ! తండ్రీ! నాపై దయను చూపుము. శివుని ఆరాధించి తమ కోరికలనీడేర్చుకున్నవారిని గురించి చెప్పుము (2).

సనత్కుమార ఉవాచ |

ఇత్యాకర్ణ్యోపమన్యుస్స మునిశ్శైవవరో మహాన్‌ | కృష్ణవాక్యం సుప్రశస్య ప్రత్యువాచ కృపానిధిః || 3

సనత్కుమారుడు ఇట్లు పలికెను -

శివభక్తాగ్రగణ్యుడు, మహాత్ముడు, దయానిధి అగు ఆ ఉపమన్యుమహర్షి శ్రీకృష్ణుని ఆ మాటను విని ఆయనను కొనియాడి ఇట్లు బదులు చెప్పెను (3).

ఉపమన్యురువాచ |

యైర్యైర్భవారాధనతః ప్రాప్తో హృత్కామ ఏవ హి | తాంస్తాన్‌ భక్తాన్‌ ప్రవక్ష్యామి శృణు త్వం వై యదూద్వహ || 4

శర్వాత్సర్వామరైశ్వర్యం హిరణ్యకశిపుః పురా | వర్షాణాం దశలక్షాణి సో%లభచ్చంద్రశేఖరాత్‌ || 5

తస్యాథ పుత్రప్రవరో నందనో నామ విశ్రుతః | స చ శర్వవరాదింద్రం వర్షాయుతమధోనయత్‌ || 6

విష్ణుచక్రం చ తద్ఘోరం వజ్రమాఖండలస్య చ | శీర్ణం పురాభవత్కృష్ణ తదంగేషు మహాహవే || 7

న శస్త్రాణి వహంత్యంగే ధర్మతస్తస్య ధీమతః | గ్రహస్యాతిబలస్యాజౌ చక్రవజ్రముఖాన్యపి || 8

అర్ద్యమానాశ్చ విబుధా గ్రహేణ సుబలీయసా | దేవదత్తవరా జఘ్నురసురేంద్రాస్సురాన్‌ భృశమ్‌ || 9

తుష్టో విద్యుత్ర్పభస్యాపి త్రైలోక్యైశ్వరతామదాత్‌ | శతవర్షసహస్రాణి సర్వలోకేశ్వరో భవః || 10

తథా పుత్రసహస్రాణామయుతం చ దదౌ శివః | మమ చానుచరో నిత్యం భవిష్యస్యబ్రవీదితి || 11

కుశద్వీపే శుభం రాజ్యమదదాద్భగవాన్‌ భవః | స తసై#్మ శంకరః ప్రీత్యా వాసుదేవ ప్రహృష్టధీః || 12

ధాత్రా సృష్టశ్శతమఖో దైత్యో వర్షశతం పురా | తపః కృత్వా సహస్రం తు పుత్రాణామలభద్భవాత్‌ || 13

ఉపమన్యువు ఇట్లు పలికెను-

ఓ యదువంశ##శ్రేష్ఠా! ఏయే భక్తులు శివుని ఆరాధించి తమ హృదయములోని కోర్కెలను పూర్ణము చేసుకొనిరో, ఆయా భక్తులను గురించి చెప్పగలను. నీవు వినుము (4). పూర్వము హిరణ్యకశిపుడు సంహారకారకుడగు చంద్రశేఖరునినుండి పది లక్షల సంవత్సరముల కాలము వరకు దేవతల ఐశ్వర్యమునంతనూ పొందెను (5). తరువాత నందనుడు అను ప్రఖ్యాతిని గాంచిన ఆతని శ్రేష్ఠుడగు కుమారుడు శివుని వరము వలన పదివేల సంవత్సరములు ఇంద్రుని తన ఆధీనములో పెట్టుకొనెను (6). ఓ శ్రీకృష్ణా! పూర్వము మహాయుద్ధములో ఆ భయంకరమగు విష్ణుచక్రము మరియు ఇంద్రుని వజ్రము వాని అవయవములకు తగిలి విరిగిపోయినవి (7). అతి బలుడు, బుద్ధిశాలి అగు గ్రహుడను రాక్షసుని దేహమునందు యుద్ధములో ధర్మబద్ధముగా ప్రయోగించబడిన ఆయుధములు ప్రభావమును చూపజాలవు (8). దేవతలు మహాబలశాలియగు గ్రహునిచే పీడించ బడిరి. ఈ విధముగా రాక్షసరాజులు శివునినుండి వరములను పొంది దేవతలను అధికముగా హింసించిరి (9). సర్వలోకములకు ఈశ్వరుడగు శివుడు సంతసిల్లి విద్యుత్ర్పభునకు లక్ష సంవత్సరములు ముల్లోకముల అధిపత్యమునొసంగెను (10). అంతేగాక, కోటిమంది పుత్రసంతానమునిచ్చి, నీవు నిత్యము నాకు అనుచరుడవై ఉండగలవు అని పలికెను (11). ఓ వాసుదేవా! సద్ఘనుడగు శంకరభగవానుడు మిక్కిలి సంతసించిన మనస్సు గల వాడై వానికి కుశద్వీపమునందు మంగళకరమగు రాజ్యమును ప్రేమతో నిచ్చెను (12). పూర్వము బ్రహ్మచే సృష్టింబడిన శతమఖుడనే రాక్షసుడు వంద సంవత్సరములు తపస్సు చేసి శివుని అనుగ్రహముచే వేయి మంది పుత్రులను బడసెను (13).

యాజ్ఞవల్క్య ఇతి ఖ్యాతో గీతో వేదేషు వై మునిః | ఆరాధ్య స మహాదేవం ప్రాప్తవాన్‌ జ్ఞానముత్తమమ్‌ || 14

వేదవ్యాసస్తు యో నామ్నా ప్రాప్తవానతులం యశః | సో%పి శంకరమారాధ్య త్రికాలజ్ఞానమాప్తవాన్‌ || 15

ఇంద్రేణ వాలఖిల్యాస్తే పరిభూతాస్తు శంకరాత్‌ | లేభిరే సోమహర్తారం గరుడం సర్వదుర్జయమ్‌ || 16

ఆపః ప్రణష్టాస్సర్వాశ్చ పూర్వరోషాత్కపర్దినః | శర్వం సమకపాలేన దేవైరిష్ట్వా ప్రవర్తితమ్‌ || 17

అత్రేర్భార్యా చానసూయా త్రీణి వర్షశతాని చ | ముశ##లేషు నిరాహారా సుప్త్వా శర్వాత్తతస్సుతాన్‌ || 18

దత్తాత్రేయ మునిం లేభే చంద్రం దుర్వాసనం తథా | గంగాం ప్రవర్తయామాస చిత్రకూటే పతివ్రతా || 19

వికర్ణశ్చ మహాదేవం తథా భక్తసుఖావహమ్‌ | ప్రసాద్య మహతీం సిద్ధిమాప్తవాన్‌ మధుసూదన || 20

చిత్రసేనో నృపశ్శంభుం ప్రసాద్య దృఢభక్తిమాన్‌ | సమస్తనృపభీతిభ్యో% భయం ప్రాపాతులం చ కమ్‌ ||21

శ్రీకరో గోపికాసూనుర్నృవపూజావిలోకనాత్‌ | జాతభక్తిర్మహాదేవే పరమాం సిద్ధిమాప్తవాన్‌ || 22

చిత్రాంగదో నృపసుతస్సీమంతిన్యాః పతిర్హరే | శివానుగ్రహతో మగ్నో యమునాయాం మృతో న హి || 23

వేదములలో కీర్తించబడి ప్రసిద్ధిని గాంచిన యాజ్ఞవల్క్యమహర్షి మహాదేవుని ఆరాధించి ఉత్తమమగు జ్ఞానమును పొందెను (14). సాటిలేని కీర్తిని పొందిన వేదవ్యాస మహర్షి కూడ శంకరుని ఆరాధించి త్రికాలజ్ఞానమును పొందెను (15). ఇంద్రునిచే పరాభవించబడిన వాలఖిల్యమహర్షులు శంకరుని అనుగ్రహము వలన ఎవ్వరికైననూ జయింప శక్యము కానివాడు, అమృతమును తెచ్చిన వాడు అగు గరుడుని పొందిరి (16). పూర్వము జటాజూటధారియగు శివుని కోపముచే జలములు అన్నియు ఎండిపోగా, దేవతలు ఏకకాలములో శివుని ఉద్దేశించి కపాలముతో ఆహుతులను సమర్పించి నీటిని మరల ప్రవహింపజేసిరి (17). అత్రి భార్య, పతివ్రత అగు అనసూయ మూడు వందల సంవత్సరములు ఆహారము లేకుండగా రోకళ్లపై నిద్రించి, తరువాత శివుని అనుగ్రహము వలన దత్తాత్రేయమహర్షిని, చంద్రుని మరియు దుర్వాసుని పుత్రులుగా పొంది, చిత్రకూటపర్వతమునందు గంగను ప్రవహింప జేసెను (18, 19) ఓ మధుసూదనా! ఇంతేగాక, వికర్ణుడు భక్తులకు సుఖమునొసంగు మహాదేవుని ప్రసన్నునిగా జేసుకొని గొప్ప సిద్ధిని పొందెను (20). దృఢమగు భక్తి గల చిత్రసేనమహారాజు శంభుని ప్రసన్నునిగా జేసుకొని అందరు రాజుల భయమునుండి విముక్తుడై సాటి లేని సుఖమును పొందెను (21). గోపిక యొక్క కుమారుడగు శ్రీకరుడు రాజు చేయుచున్న శివపూజను చూచి మహాదేవుని భక్తి ఉదయించుటచే శ్రేష్ఠమగు సిద్ధిని పొందినాడు (22) ఓ హరీ! రాజకుమారుడు, సీమంతిని భర్త అగు చిత్రాంగదుడు యమునలో మునిగిననూ శివుని అనుగ్రహముచే మరణించలేదు (23).

స చ తక్షాలయం గత్వా తన్మైత్రీం ప్రాప్య సువ్రతః | ఆయాతస్స్వగృహం ప్రీతో నానాధనసమన్వితః || 24

సీమంతినీ ప్రియా తస్య సోమవ్రతపరాయణా | శివానుగ్రహతః కృష్ణ లేభే సౌభాగ్యముత్తమమ్‌ || 25

తత్ర్పభావాద్ర్వతే తస్మిన్నేకో ద్విజసుతః పురా | కశ్చిత్‌ స్త్రీత్వం గతో లోభాత్కృతదారాకృతిశ్ఛలాత్‌ || 26

చంచుకా పుంశ్చలీ దుష్టా గోకర్ణద్విజతః పురా | శ్రుత్వా ధర్మకథాం శంభోర్భక్త్యా ప్రాప పరాం గతిమ్‌ || 27

స్వస్త్ర్యను గ్రహతః పాపీ బిందుగో చంచుకాపతిః | శ్రుత్వా శివపురాణం చ సద్గతిం ప్రాప శాంకరీమ్‌ || 28

పింగలా గణికా ఖ్యాతా మదరాహ్వో ద్విజాధమః | శైవమృషభమభ్యర్చ్య లేభాతే సద్గతిం చ తౌ ||29

మహానందాభిధా కాచిద్వేశ్యా శివపదారతా | దృఢాత్పణాత్సుప్రసాద్య శివం లేభే చ సద్గతిమ్‌ || 30

కైకేయీ ద్విజబాలా శ్చ సాదరాహ్వా శివవ్రతా | పరమం హి సుఖం ప్రాప శివేశవ్రతధారణాత్‌ || 31

విమర్షణశ్చ నృపతిశ్శివభక్తిం విధాయ వై | గతిం లేభే పరాం కృష్ణ శివానుగ్రహతః పురా || 32

గొప్ప వ్రతము గల ఆ చిత్రాంగదుడు తక్షుని (విశ్వకర్మ) గృహమునకు వెళ్లి ఆయనతో స్నేహమును చేసి, వివిధరకముల సంపదతో గూడి ఆనందముతో స్వగృహమునకు మరలి వచ్చెను (24). ఓ శ్రీకృష్ణా! ఆతని ప్రియురాలగు సీమంతిని శివుని వ్రతమును శ్రద్ధగా చేసి శివుని అనుగ్రహముచే ఉత్తమమగు సౌభాగ్యమును పొందెను (25). పూర్వము ఆ వ్రతమునందు ఒక బ్రాహ్మణబాలకుడు లోభముచే భార్య వేషమును దాల్చి మోసము చేయబోయి ఆ శివుని మహిమచే స్త్రీత్వమును పొందెను (26). పూర్వము చంచుక యను దుష్టురాలగు వేశ్య గోకర్ణమునందలి బ్రాహ్మణుని నుండి శంభుని ధర్మకథను భక్తితో విని పరమగతిని పొందెను (27). చంచుకయొక్క భర్త, పాపాత్ముడు అగు బిందుగుడు తన భార్యయొక్క అనుగ్రహముచే శివపురాణమును విని సత్పురుషులు పొందే శివలోకమును పొందెను (28). పింగళ యను వేశ్య మరియు మదరుడను బ్రాహ్మణధముడు శివుని వాహనమగు నందీశ్వరుని ఆరాధించి సద్గతిని పొందిరి (29). మహానంద అనే ఒకానొక వేశ్య శివుని లోకమును పొందవలెననే ఆసక్తి గలదై దృఢమగు శపథముచే శివుని సంతోషపెట్టి, సద్గతిని పొందెను (30). కైకేయి, బ్రాహ్మణబాలకులు మరియు, శివవ్రతమునందు నిష్ఠగల సాదర అనునామె పరమేశ్వరుడగు శివుని వ్రతమును అనుష్ఠించుట వలన పరమసుఖమును పొందిరి (31). ఓ శ్రీకృష్ణా! పూర్వము విమర్షణుడు మహారాజు శివునియందు భక్తిని చేసి శివుని అనుగ్రహముచే పరమగతిని పొందెను (32).

దుర్జనశ్చ నృపః పాపీ బహుస్త్రీలంపటః ఖలః | శివభక్త్యా శివం ప్రాప నిర్లిప్తస్సర్వకర్మసు || 33

సస్త్రీ కశ్శబరో నామ్నా శంకరశ్చ శివవ్రతీ | చితాభస్మరతో భక్త్యా లేభే తద్గతిముత్తమామ్‌ || 34

సౌమినీ నామ చాండాలీ సంపూజ్యాజ్ఞానతో హి సా | లేభే శైవీం గతిం కృష్ణ శంకరానుగ్రహాత్పరాత్‌ || 35

మహాకాలాభిధో వ్యాధో కిరాతః పరహింసకః | సమభ్యర్చ్య శివం భక్త్యా లేభే సద్గతిముత్తమామ్‌ || 36

దుర్వాసా మునిశార్దూలశ్శివానుగ్రహతః పురా | తస్తార స్వమతం లోకే శివభక్తిం విముక్తిదామ్‌ || 37

కౌశికశ్చ సమారాధ్య శంకరం లోకశంకరమ్‌ | బ్రాహ్మణో% భూత్‌ క్షత్రియశ్చ ద్వితీయ ఇవ పద్మభూః || 38

శివమభ్యర్చ్య సద్భక్త్యా విరించిశ్శైవసత్తమః | అభూత్సర్గకరః కృష్ణ సర్వలోకపితామహః || 39

మార్కండేయో మునివరశ్చిరంజీవీ మహాప్రభుః | శివభక్తవరః శ్రీమాన్‌ శివానుగ్రహతో హరే || 40

దేవేంద్రో హి మహాశైవసై#్త్రలోక్యం బుభుజే పురా | శివానుగ్రహతః కృష్ణ సర్వదేవాధిపః ప్రభుః || 41

బలిపుత్రో మహాశైవశ్శివానుగ్రహతో వశీ | బాణో బభూవ బ్రహ్మాండనాయకస్సకలేశ్వరః || 42

పాపి, అనేక స్త్రీ వ్యామోహము గలవాడు, దుష్టుడు అగు దుర్జనమహారాజు కర్మలన్నింటియందు ఆసక్తిని వీడి శివభక్తిని చేసి శివుని పొందెను (33). శంకరుడను బోయ వాడు శివ వ్రతమును అనుష్ఠించి భస్మను శ్రద్ధతో ధరించి భార్యతో సహా ఉత్తమమగు అనుగ్రహముచే శివలోకమును పొందెను (35). ఇతరులను హింసించే మహాకాలుడను కిరాతుడు శివుని భక్తితో చక్కగా పూజించి ఉత్తమమగు సద్గతిని పొందెను (36). పూర్వము దుర్వాసమహర్షి శివుని అనుగ్రహముచే, శివభక్తి మోక్షమునిచ్చుననే తన మతమును లోకములో ప్రచారము చేసెను (37). క్షత్రియుడగు విశ్వామిత్రుడు లోకములకు మంగళములనిచ్చే శంకరుని బాగుగా ఆరాధించి బ్రాహ్మణుడై రెండవ సృష్టికర్తవలె భాసించెను (38). ఓ శ్రీకృష్ణా! శివభక్తాగ్రగణ్యుడగు బ్రహ్మ గొప్ప భక్తితో శివుని ఆరాధించి సృష్టికర్తయై లోకములన్నింటికీ పితమహుడు ఆయెను (39). ఓ శ్రీహరీ! గొప్ప సమర్థుడు, శివభక్తులలో శ్రేష్ఠుడు అగు మార్కండేయమహర్షి శివుని అనుగ్రహము వలన చిరంజీవియై సంపదలను పొందెను (40). ఓ శ్రీకృష్ణా! పూర్వము మహాశివభక్తుడు, సమర్థుడు అగు దేవేంద్రుడు శివుని అనుగ్రహముచే దేవతలందరికీ అధీశ్వరుడై త్రిలోకాధిపత్యమును అనుభవించెను (41). బలియొక్క కుమారుడు, గొప్ప శివభక్తుడు, జితేంద్రియుడు, సర్వసమర్థుడు అగు బాణుడు శివుని అనుగ్రహము వలన బ్రహ్మాండమునకు నాయకుడైనాడు (42).

హరిశ్శక్తిశ్చ సద్భక్త్యా దధీచశ్చ మహేశ్వరః | శివానుగ్రహతో% భూవంస్తథా రామో హి శాంకరః || 43

కాణాదో భార్గవశ్చైవ గురుర్గౌతమ ఏవ చ | శివభక్త్యా బభూవుస్తే మహాప్రభవ ఈశ్వరాః || 44

శాకల్యశ్శంసితాత్మా చ నవవర్షశతాన్యపి | భవమారాధయామాస మనోయజ్ఞేన మాధవ || 45

తుతోష భగవానాహ గ్రంథకర్తా భవిష్యసి | వత్సాక్షయ్యా చ తే కీర్తిసై#్త్రలోక్యే ప్రభవిష్యతి || 46

అక్షయం చ కులం తే%స్తు మహర్షిభిరలంకృతమ్‌ | భవిష్యసి ఋషిశ్రేష్ఠస్సూత్రకర్తా తతస్తతః || 47

ఇత్యేవం శంకరాత్ర్పాప వరం మునివరస్స వై | త్రైలోక్యే వితతశ్చాసీత్పూజ్యశ్చ యదునందన || 48

సావర్ణిరితి విఖ్యాత ఋషిరాసీత్కృతే యుగే | ఇహ తేన తపస్తప్తం షష్టిర్వర్షశతాని చ || 49

తమాహ భగవాన్‌ రుద్రస్సాక్షాత్తుష్టో%స్మి తే%నఘ | గ్రంథకృల్లోకవిఖ్యాతో భవితాస్యజరామరః || 50

ఏవంవిధో మహాదేవః పుణ్యపూర్వతరైస్తతః | సమర్చితశ్శుభాన్‌ కామాన్‌ ప్రదదాతి యథేప్సితాన్‌ || 51

ఏకేనైవ ముఖేనాహం వక్తుం భగవతో గుణాః | యే సంతి తాన్న శక్నోమి హ్యపి వర్షశ##తైరపి || 52

ఇతి శ్రీ శివమహాపురాణ ఉమాసంహితాయం శివభక్తిమాహాత్మ్య వర్ణనం నామ ద్వితీయో%ధ్యాయః (2).

విష్ణువు, మాయాశక్తి, సర్వసమర్థుడగు దధీచుడు, శివభక్తుడగు రాముడు, కణాదుడు, శుక్రాచార్యుడు మరియు గౌతముడు శివునియందలి పవిత్రమగు భక్తిచే గొప్పవారు మరియు సర్వసమర్థులు కాగల్గినారు (43, 44). ఓ మాధవా ! శుద్ధమగు అంతకరణము గల శాకల్యుడు తొమ్మిది వందల సంవత్సరములు ఉపాసనారూపమగు యజ్ఞముతో శివుని ఆరాధించెను (45). అపుడు శివుడు సంతోషించి ఇట్లు పలికెను : ఓ వత్సా! నీవు గ్రంథమును నిర్మించగలవు. ముల్లోకములలో నీకు అక్షయమగు కీర్తి లభించగలదు. నీ కులము మహర్షులచే అలంకరింపబడి అక్షయము కాగలదు. నీవు మహర్షివై సూత్రములను రచించగలవు (46, 47). ఆ మహర్షి శంకరుని నుండి ఈ విధమగు వరమును పొందెను. ఓ శ్రీకృష్ణా! ఆయన కీర్తి ముల్లోకములలో వ్యాపించెను. ఆయనను అందరు పూజించిరి (48). కృతయుగములో సావర్ణి అనే ప్రసిద్ధిని గాంచిన ఋషి ఉండెడివాడు. ఆయన ఇచట అరవై వేల సంవత్సరములు తపస్సును చేసెను (49). అపుడు రుద్రుడు సంతోషించి స్వయముగా ప్రత్యక్షమై ఇట్లు పలికెను : ఓయీ పుణ్యాత్మా! నేను నీ తపస్సుచే సంతోషించితిని. నీవు గ్రంథములను రచించి లోకములో ప్రఖ్యాతిని పొందుటయే గాక, వృద్ధాప్యము నుండి మరియు మరణము నుండి విముక్తిని పొందెదవు (50). ఈ విధముగా పుణ్యాత్ములగు పూర్వీకులచే ఆరాధింపబడిన మహాదేవుని పూజించినచో, ఆయన మనస్సులోని శుభకరమగు కోర్కెలను ఈడేర్చగలడు (51). భగవానునకు గల గుణములనన్నింటినీ ఒకే ఒక నోరు గల నేను వందల సంవత్సరములు ప్రయత్నించిననూ చెప్ప జాలను (52).

శ్రీ శివమహాపురాణములో ఉమాసంహితయందు శివభక్తిమాహాత్మ్య వర్ణనమనే రెండవ అధ్యాయము ముగిసినది (2).

Siva Maha Puranam-3    Chapters