Siva Maha Puranam-3    Chapters   

అథ నవమో%ధ్యాయః

నరక యాతనలు

సనత్కుమార ఉవాచ|

ఏషు పాపాః ప్రపచ్యంతే శోప్యంతే నరకాగ్నిషు | యాతనాభిర్విచిత్రాభిరాస్వకర్మక్షయాద్భృశమ్‌ || 1

స్వమలప్రక్షయాద్యద్వదగ్నౌ ధాస్యంతి ధాతవః | తత్ర పాపక్షయాత్పాపా నరాః కర్మానురూపతః || 2

సుగాఢం హస్తయోర్బద్ధ్వా తతశ్శృంఖలయా నరాః | మహావృక్షాగ్రశాఖాసు లంబ్యంతే యమకింకరైః || 3

తతస్తే సర్వయత్నేన క్షిప్తా దోలంతి కింకరైః | దోలంతశ్చాతివేగేన విసంజ్ఞా యాంతి యోజనమ్‌ || 4

అతరిక్ష స్థితానాం చ లోహభారశతం పునః | పాదయోర్బధ్యతే తేషాం యమదూతైర్మహాబలైః || 5

తేన భారేణ మహతా ప్రభృశం పీడితా నరాః | ధ్యాయంతి స్వాని కర్మాణీ తూష్ణీం తిష్ఠంతి నిశ్చలాః || 6

తతోంకుశైరగ్నివర్ణైర్లోహదండైశ్చ దారుణౖః | హన్యంతే కింకరైర్ఘోరైస్సమంతాత్పాపకర్మిణః || 7

తతః క్షారేణ దీప్తేన వహ్నేరపి విశేషతః | సమంతతః ప్రలిప్యంతే తీవ్రేణ తు పునః పునః || 8

ద్రుతేనాత్యంతలిప్తేన కృత్తాంగా జర్జరీకృతాః | పునర్విదార్య చాంగాని శిరసః ప్రభృతి క్రమాత్‌ || 9

వృతాకవత్ర్పపచ్యంతే తప్తలోహకటాహకైః | విష్ఠాపూర్ణే తథా కూపే కృమీణాం నిచయే పునః || 10

సనత్కుమారుడు ఇట్లు పలికెను-

పాపాత్ములు ఈ నరకాగ్నులయందు తమ తమ కర్మ క్షయమగు వరకు విచిత్రములు మరియు తీవ్రములు అగు యాతనలచే తపించి శుష్కింప చేయుబడుదురు (1). లోహములను మనము వాటిలోని మాలిన్యము పోవు వరకు నిప్పులలో పుటము పెట్టెదము. అటులనే, అచట పాపాత్ములగు మానవులు తమ తమ కర్మకు అనురూపముగా తాపమునకు గురిచేయ బడుదురు (2). యమకింకరులు ఆ మానవుల చేతులను గట్టిగా కట్టి పెద్ద చెట్ల చిటారు కొమ్మలకు గొలుసులతో వ్రేలాడ దీసెదరు (3). తరువాత వారిని ఆ కింకరులు తమ బలమునంతనూ ఉపయోగించి మహావేగముతో ఊయలను ఊపుచుండగా, వారు స్పృహను గోల్పోయి యోజనము దూరము వరకు ఊగుచుందురు (4). వారు గాలిలో వ్రేలాడుచుండగా మహాబలశాలురగు ఆ యమదూతలు వారి పాదములకు వంద భారముల లోహమును కట్టెదరు (5). ఆ మహాభారముచే అతిశయించిన పీడను పొందిన ఆ నరులు తమ కర్మలను స్మరిస్తూ మౌనముగా కదలిక లేకుండగా నుందురు (6). తరువాత ఆ కింకరులు ఆ పాపాత్ములను అగ్నివలె ప్రకాశించే అంకుశములతో మరియు దారుణమైన లోహపు రోకళ్లతో అంతటా కొట్టెదరు (7). తరువాత మండే నిప్పులకంటే అధికమగు మంటను కలిగించే తీవ్రమగు క్షారమును వారి దేహములకు అంతటా పలుమార్లు పూసెదరు (8). కరిగిన లోహమును వారి దేహములపై పోయగా వారి అవయవములు కోసివేయబడి శిథిలమగును. మరల వారి దేహావయవములను తలనుండి మొదలిడి వరుసగా చీల్చి వేసెదరు (9). తరువాత వారిని వంకాయలను వలె కాగే ఇనుప గుండిగలలో వేయించి, తరువాత మలముతో నిండిన నూతులలో మరియు క్రిముల గుట్టలలో పారవేసెదరు (10).

మేదో%సృక్పూయపూర్ణాయాం వాప్యాం క్షిప్యంతి తే పునః | భక్ష్యంతే కృమిభిస్తీక్‌ష్ణైర్లోహతుండైశ్చ వాయసైః || 11

శ్వభిర్దం శైర్వృకైర్వ్యాఘ్రై రౌద్రైశ్చ వికృతాననైః | పచ్యంతే మత్స్యవచ్చాపి ప్రదీప్తాంగారరాశిషు || 12

భిన్నాశ్శూలైస్సుతీక్‌ష్ణైశ్చ నరాః పాపేన కర్మణా | తైలయంత్రేషు చాక్రమ్య ఘోరైః కర్మభిరాత్మనః || 13

తిలా ఇవ ప్రపీడ్యంతే చక్రాఖ్యే జనపిండకాః | భ్రజ్యంతే చాతపే తప్తే లోహభాండేష్వనేకధా || 14

తైలపూర్ణకటాహేషు సుతప్తేషు పునః పునః | బహుధా పచ్యతే జిహ్వా ప్రపీడ్యోరసి పాదయోః || 15

యాతనాశ్చ మహత్యో%త్ర శరీరస్యాపి సర్వతః | నిశ్శేషనరకేష్వేవం క్రమంతి క్రమశో నరాః || 16

నరకేషు చ సర్వేషు విచిత్రా యమయాతనా | యామ్యైశ్చ దీయతే వ్యాస సర్వాంగేషు సుకష్టదా || 17

జ్వలదంగారమాదాయ ముఖమాపూర్య తాడ్యతే | తతః క్షారేణ దీప్తేన తామరేణ చ పునః పునః || 18

ఘృతేనాత్యంతతప్తేన తదా తైలేన తన్ముఖమ్‌ | ఇతస్తతః పీడయిత్వా భృశమాపూర్య హన్యతే || 19

విష్టాభిః కృమభిశ్చాపి పూర్వమాణాః క్వచిత్క్వచిత్‌ | పరిష్వజంతి చాత్యుగ్రాం ప్రదీప్తాం లోహశాల్మలీమ్‌ || 20

వారు మరల క్రొవ్వు, రక్తము మరియు మురికితో నిండిన నూతిలోనికి త్రోసివేయ బడుదురు. వారిని వాడి కోరలు గల క్రిములు, లోహనిర్మితమైన ముక్కులు గల కాకులు, కుక్కలు, దోమలు, తోడేళ్లు మరియు వికృతమగు ముఖముతో భీతిని గొల్పు పెద్ద పులులు భక్షించును. వారు కణ కణ కాలే నిప్పులపై చేపల వలె పచనము చేయబడుదురు (11, 12). మానవులు పాపకర్మప్రభావముచే మిక్కిలి వాడియగు శూలములచే పొడువబడుదురు. చేసిన కర్మను బట్టి వారు చక్రము అనబడే నూనె గానుగలలో భయంకరులగు యమకింకరులచే త్రొక్కి పెట్టి నువ్వుల వలె గట్టిగా పీడింపబడి తెలక పిండి వలె చేయ బడెదరు. మరియు మండుటెండలో కాలుచున్న ఇనుపగుండిగలలో అనేకరములుగా ఉడికించబడెదరు (13, 14). నాలుకను, వక్షఃస్థలమును మరియు పాదములను త్రొక్కి పెట్టి గుండిగలలో సలసల మరిగే నూనెలో వారు అనేకపర్యాయములు అనేకవిధములుగా వేయించబడెదరు (15). ఇచట శరీరమునకు అన్ని భాగములలో కలిగే యాతనలు తీవ్రముగా నుండును. మానవులు నరకముల నన్నింటినీ క్రమముగా అనుభవించెదరు (16). ఓ వ్యాసా! నరకములన్నింటిలో యమభటులు అవయవములన్నింటికీ అధికమగు కష్టమును కలిగించే విచిత్రమగు యాతనలను పెట్టెదరు (17). వారి నోటిలో మండే నిప్పులను, తరువాత కాగే క్షారమును, తరువాత పలుమార్లు మరిగే రాగిని, చాల వేడిగా నుండే నేతిని, తరువాత నూనెను నిండుగా నింపి ఇటునటు నొక్కి కొట్టెదరు (18, 19). కొన్ని సమయములలో వారు మలముచే మరియు క్రిములచే కప్పి వేయబడెదరు. వారు మిక్కిలి వేడిగా నుండే ఇనుప వృక్షమును కౌగిలించు కొనునట్లు చేసెదరు (20).

హన్యంతే పృష్ఠదేశే చ పునర్దీపై#్తర్మహాఘనైః | దంతురేణాదికంఠేన క్రకచేన బలీయసా || 21

శిరః ప్రభృతి పీడ్యంతే ఘోరైః కర్మభిరాత్మ జైః | ఖాద్యంతే చ స్వమాంసాని పీయతే శోణితం స్వకమ్‌ || 22

అన్నం పానం న దత్తం యైస్సర్వదా స్వాత్మపోషకైః | ఇక్షువత్తే ప్రపీడ్యంతే జర్జరీకృత్య ముద్గరైః || 23

అసితాలవనే ఘోరే ఛిద్యంతే ఖండశస్తతః | సూచీభిర్భిన్నసర్వాంగాస్తప్తశూలాగ్రరోపితాః || 24

సంచాల్యమానా బహుశః క్లిశ్యంతే న మ్రియంతి చ | తథా చ తచ్ఛరీరాణి సుఖదుఃఖసహాని చ || 25

దేహాదుత్పాట్య మాంసాని భిద్యంతే సై#్వశ్చ ముద్గరైః | దంతురాకృతిభిర్ఘోరైర్యమదూతైర్బలోత్కటైః || 26

నిరుచ్ఛ్వాసే నిరుఛ్ఛ్వాసాస్తిష్ఠంతి నరకే చిరమ్‌ | ఉత్తాడ్యంతే తథోచ్ఛ్వాసే వాలుకాసదనే నరాః || 27

రౌరవే రోదమానాశ్చ పీడ్యంతే వివిధైర్వధైః | మహారౌరవపీడాభిర్మహాంతో%పి రుదంతి చ || 28

పత్సు వక్త్రే గుదే ముండే నేత్రయోశ్చైవ మస్తకే | నిహన్యంతే ఘనైస్తీక్‌ష్ణైస్సుతపై#్తర్లోహశంకుభిః || 29

సుతప్తవాలుకాయాం తు ప్రయోజ్యంతే ముహుర్ముహుః | జంతుపంకే భృశం తప్తే క్షిప్తాః క్రందంతి విస్వరమ్‌ || 30

కుంభీపాకేషు చ తథా తప్తతైలేషు వై మునే | పాపినః క్రూరకర్మాణో% సహ్యేషు సర్వథా పునః || 31

లాలాభ##క్షేషు పాపాస్తే పాత్యంతే దుఃఖదేషు వై | నానాస్థానేషు పచ్యంతే నరకేషు పునః పునః || 32

సూచీముఖే మహాక్లేశే నరకే పాత్యతే నరః | పాపీ పుణ్యవిహీనశ్చ తాడ్యతే యమకింకరైః || 33

ఇంతేగాక, వారు కాలే సుత్తులచే వెనుక భాగమునందు కొట్టబడెదరు. వారిని శిరస్సు మొదలుకొని అవయవములు పదునైన పళ్లు గల బలమైన రంపముచే కోయబడును. వారీ విధముగా తాము చేసిన కర్మలచే పీడించబడెదరు. వారు తమ మాంసమును తామే తినునట్లు తమ రక్తమును తామే త్రాగునట్లు చేయబడుదురు (21, 22). ఎవరైతే తాము మాత్రమే భుజిస్తూ ఇతరులకు అన్నపానముల నీయరో, వారిని రోకళ్లతో చెరుకుగడను వలె పిప్పి చేసి తీవ్రమగు పీడకు గురి చేయుదురు (23). తరువాత వారిని అసితాలవనములో ముక్క ముక్కలుగా కోసి సూదులతో అవయవములను అన్నింటినీ గుచ్చి శూలముపై కొరత వేసెదరు (24). ఈ విధముగా వారిని పలు నరకస్థానములలోనికి మార్చెదరు. వారు క్లేశములను అనుభవించెదరే గాని, మరణించరు. వారి శరీరములు సుఖదుఃఖములను సహించును (25). బలముచే గర్వించి యున్న యమదూతలు దేహమునుండి కండలను పెరికి, వాడి పళ్లను కలిగి భయంకరాకారము గల తమ చేతి దండములతో మోదెదరు (26). నిరుచ్ఛ్వాసము అనే నరకములో ఆ మానవులు చాల సేపు గాలి పీల్చకుండగా నిలిచి యుందురు. మరియు వారిని ఉచ్ఛ్వాసమనే నరకములో ఇసుక గదులలో ఉతికెదరు (27). రౌరవనరకములో వివిధపీడలకు గురి చేయబడి వారు రోదించెదరు. మహారౌరవమునందలి యాతనలచే గొప్ప వారు కూడ రోదించెదరు (28). మిక్కిలి బరువైన, బాగా కాలుచున్న, వాడియైన, ఇనుప కీలలతో వారిని పాదములు, ముఖము, గుదము, తల కన్నులు, లలాటము అను స్థానములయందు పొడిచెదరు (29). వారిని కాలే ఇసుకలో అనేకపర్యాయములు దొర్లించెదరు. జంతుదేహములతో నిండి మరుగుతూ ఉండే బురదలో పారవేయగా, వారు వికృతస్వరముతో రోదించెదరు (30). ఓ మునీ! క్రూరమగు కర్మలను చేసిన పాపాత్ములను కుంభీపాకనరకముల యందు లేశ##మైననూ సహింప శక్యము కాని, కాగే నూనెతో నిండిన గుండిగలలో పడవేయుదురు (31). లాలాభక్షములు అనే నరకములలో పాపాత్ములను దుఃఖమును కలిగించే వివిధస్థానములలో పారవేసి పలుమార్లు ఉడికించెదరు (32). యమకింకరులు పుణ్యమును చేయని పాపాత్ముడగు మానవుని మహాదుఃఖమును కలిగించే సూచీముఖ నరకములో పారవేసి కొట్టెదరు (33).

లౌహకుంభే వినిక్షిప్తాః శ్వసంతశ్చ శ##నైశ్శనైః | మహగ్నినా ప్రపచ్యంతే స్వపాపైరివ మానవాః || 34

దృఢం రజ్జ్వాదిభిర్బద్ధ్వా ప్రపీడ్యంతే శిలాసు చ | క్షిప్యంతే చాంధకూపేషు దశ్యంతే భ్రమరైర్భృశమ్‌ || 35

కృమిభిర్భిన్నసర్వాంగాశ్శతశో జర్జరీకృతాః | సుతీక్‌ష్ణక్షారకూపేషు క్షిప్యంతే తదనంతరమ్‌ || 36

మహాజ్వాలే%త్ర నరకే పాపాః క్రందంతి దుఃఖితాః | ఇతశ్చేతశ్చ ధావంతి దహ్యమానాస్తదర్చిషా || 37

పృష్ఠే చానీయ తుండాభ్యాం విన్యస్తస్కంధయోజితే | తయోర్మధ్యేన వాకృష్య బాహుపృష్ఠేన గాఢతః || 38

బద్ధాః పరస్పరం సర్వే సుభృశం పాపరజ్జుభిః | బద్ధపిండాస్తు దృశ్యంతే మహాజ్వాలే తు యాతనాః || 39

రజ్జుభిర్వేష్టితాశ్చైవ ప్రలిప్తాః కర్దమేన చ | కరీషతుషవహ్నౌ చ పచ్యంతే న మ్రియంతి చ || 40

సుతీక్‌ష్ణం చరితాస్తే హి కర్కశాసు శిలాసు చ | ఆస్ఫాల్య శతశః పాపాః పచ్యంతే తృణవత్తతః || 41

శరీరాభ్యంతరగతైః ప్రభూతైః కృమిభిర్నరాః | భక్ష్యంతే తీక్‌ష్ణవదనైరాత్మదేహక్షయాద్భృశమ్‌ || 42

కృమీణాం నిచయే క్షిప్తాః పూయమాంసాస్థిరాశిషు | తిష్ఠంత్యుద్విగ్నహృదయాః పర్వతాభ్యాం నిపీడితాః || 43

తప్తేన వజ్రలేపేన శరీరమనులిప్యతే | అధోముఖోర్ద్వపాదాశ్చ తాతప్యంతే స్మ వహ్నినా || 44

వదనాంతః ప్రవిన్యస్తాం సుప్రతప్తామయోగదామ్‌ | తే ఖాదంతి పరాధీనాసై#్తస్తాడ్యంతే సముద్గరైః || 45

ఇత్థం వ్యాస కుకర్మాణో నరకేషు పచంతి హి | వర్ణయామి వివర్ణత్వం తేషాం తత్త్వాయ కర్మిణామ్‌ || 46

ఇతి శ్రీశివమహాపురాణ ఉమాసంహితాయాం నరకగతివర్ణనం నామ నవమో%ధ్యాయః (9)

మానవులు తాము చేసిన పాపముల ప్రభావముచే ఇనుప కుండలోనికి త్రోసివేయబడి పెద్ద మంటలచే ఉడికించ బడుతూ మెల్ల మెల్లగా గాలిని పీల్చుచుందురు (34). వారిని గట్టిగా త్రాళ్లు మొదలైన వాటితో బంధించి రాళ్లపై వేసి ఈడ్చెదరు. వారిని చీకటి నూతుల లోనికి త్రోసెదరు. అచట వారిని తేనెటీగలు గట్టిగా కుట్టుచుండును (35). క్రిములచే భేదించ బడిన సర్వావయవములు కలిగి శతవిధములుగా శిథిలమైన దేహములు గల ఆ జీవులను ఆ తరువాత మిక్కిలి తీక్‌ష్ణమైన క్షారముతో నిండిన నూతులలో పారవేసెదరు (36). అచట పెద్ద పెద్ద మంటలతో నిండిన నరకములో వారు ఆ వేడిచే కాలిన దేహములు గలవారై దుఃఖముతో రోదిస్తూ ఇటునటు పరుగులెత్తెదరు (37). వారి నోళ్లను భుజములపై ఆన్చి చేతులను ఆ భుజముల మధ్యలో నుండి వెనుకకు లాగి గట్టిగా కట్టెదరు (38). వారందరు ఈ విధముగా మహాజ్వాల అనే నరకములో, వారు చేసిన పాపములే త్రాళ్లు కాగా, ఒకరితో మరియొకరు చాల గట్టిగా కట్టబడిన దేహములు గలవారై యాతనలను అనుభవించెదరు (39). వారిని త్రాళ్లతో శరీరమంతా చుట్టి బురదను పూసి ఊక మరియు పిడకలతో కూడిన నిప్పులలో ఉడికించెదరు. అయిననూ, వారు మరణించరు (40). ఆ పాపులను కర్కశమగు రాళ్లపై చాల గట్టిగా పడవేసి ఈడ్చి అనేకవిధములుగా కొట్టి, తరువాత గడ్డిని వలె కాల్చెదరు (41). ఆ మానవులు తమ దేహములోపల నుండే వాడి నోళ్లు గల పెద్ద పెద్ద క్రిములచే భక్షింపబడెదరు. వారిని క్రిముల గుట్టపై, మరియు మలమాంసముల ఎముకల రాశులపై పారవేసెదరు. రెండు పర్వతముల మధ్యనలిగి పోతూ వారు తమ దేహములు తీవ్రముగా కృశించుచుండగా భయముతో నిండిన హృదయములు గలవారై దుఃఖించెదరు (42, 43). వజ్రపు పొడితో చేసిన ముద్దను కాల్చి వారి శరీరములకు పూత పూసెదరు. వారిని తల క్రిందకు కాళ్లు పైకి ఉండునట్లు వ్రేలాడదీసి నిప్పులపై తపింప జేసెదరు (44). వారు నోటిలోనికి చొప్పించ బడిన మిక్కిలి వేడిగా నున్న ఇనుప గదను నిస్సహాయులై నమిలెదరు. వారు రోకళ్లచే కొట్టబడెదరు (45). ఓ వ్యాసా! పాపాత్ములు ఈ విధముగా నరకములో తపించెదరు. కర్మలను చేయు మానవుల అవగాహన కొరకై నేను వారి బాధలను వర్ణించెదను (46).

శ్రీశివమహాపురాణములోని ఉమాసంహితయందు నరకగతివర్ణనము అనే తొమ్మిదవ

అధ్యాయము ముగిసినది (9).

Siva Maha Puranam-3    Chapters