Siva Maha Puranam-3    Chapters   

అథ ద్వాదశో%ధ్యాయః

తపస్సు యొక్క మహిమ

సనత్కుమార ఉవాచ |

పానీయదానం పరమం దానానాముత్తమం సదా | సర్వేషాం జీవపుంజానాం తర్పణం జీవనం స్మృతమ్‌|| 1

ప్రసాదమతః కుర్యాత్సుస్నేహాదనివారితమ్‌ | జలాశ్రయవినిర్మాణం మహానందకరం భ##వేత్‌ || 2

ఇహ లోకే పరే వాపి సత్యం సత్యం న సంశయః | తస్మాద్యాపీశ్చ కూపాంశ్చ తడాగాన్‌ కారయేన్నరః || 3

అర్ధం పాపస్య హరతి పురుషస్య వికర్మణః | కూపః ప్రవృత్తపానీయస్సుప్రవృత్తస్య నిత్యశః || 4

సర్వం తారయతే వంశం యస్య ఖాతే జలాశ##యే | గావః పిబంతి విప్రాశ్చ సాధవశ్చ నరాస్సదా || 5

నిదాఘకాలే పానీయం యస్య తిష్ఠత్యవారితమ్‌ | సుదుర్గం విషమం కృచ్ఛ్రం న కదాచిదవాప్యతే || 6

తడాగానాం చ పక్ష్యామి కృతానాం యే గుణాః స్మృతాః | త్రిషు లోకేషు సర్వత్ర పూజితో యస్తడాగవాన్‌ || 7

అథవా మిత్రసదనే మైత్రం మిత్రార్తివర్జితమ్‌ | కీర్తిసంజననం శ్రేష్ఠం తడాగానాం నివేశనమ్‌ || 8

ధర్మస్యార్థస్య కామస్య ఫలమాహుర్మనీషిణః | తడాగం సుకృతే యేన తస్య పుణ్యమనంతకమ్‌ || 9

చతుర్విధానాం భూతానాం తడాగః పరమాశ్రయః | తడాగాదీని సర్వాణి దిశంతి శ్రియముత్తమామ్‌ || 10

సనత్కుమారుడు ఇట్లు పలికెను-

సర్వకాలములలో నీటిని దానము చేయుట దానములలో ఉత్తమదానము. సర్వప్రాణిసమూహములకు దప్పికను తీర్చుటచే నీటికి జీవనము అను పేరు వచ్చినది (1). కావున, మానవుడు వెనకకు తగ్గకుండగా అతిశయించిన ప్రేమతో చలివేంద్రమును ఏర్పాటు చేయవలెను. జలాశయములను నిర్మించుట వలన మానవుడు ఇహలోకములో మాత్రమే గాక, పరలోకములో కూడ మహానందమును పొందగలడు. ఇది ముమ్మాటికీ నిజము. సందేహము లేదు. కావున, మానవుడు దిగుడు బావులను, నూతులను, మరియు చెరువులను నిర్మించవలెను (2, 3). ఎవనిచే నిర్మించబడిన నూయి నిత్యము జనులకు నీటిని పుష్కలముగా సరఫరా చేయునో, అట్టివాడు చేసిన పాపములలో సగము పాపమును ఆ నూయి తొలగించును (4). ఎవనిచే నిర్మించబడిన చెరువులో గోవులు, బ్రాహ్మణులు, సాధువులు మరియు ఇతరమానవులు నిత్యము నీటిని త్రాగెదరో, వాని వంశము అంతయు తరించును (5). ఎవడైతే వేసవి కాలములో కాదనకుండగా నీటిని సరఫరా చేయునో, వానికి గట్టెక్కుటకు శక్యము కాని కష్టములు ఎన్నటికి రావు (6). చెరువులను నిర్మించుటలో గల గుణములను చెప్పెదను. చెరువును నిర్మించిన వాడు ముల్లోకములలో సర్వకాలములలో పూజించబడును (7). చెరువులను నిర్మించిన వాడు గొప్ప కీర్తిని పొందుటయే గాక, ఆదిత్యలోకములో సూర్యుని తాపము లేకుండగా, స్నేహభావముతో నివసించును (8) చెరువు ధర్మార్థకామములనే మూడు పురుషార్థముల ఫలస్వరూపమని విద్వాంసులు చెప్పెదరు. చెరువును నిర్మించు వ్యక్తియొక్క పుణ్యము అనంతము (9). జరాయుజ, అండజ, స్వేదజ, ఉద్భిజ్జములనే నాలుగు రకముల ప్రాణులకు చెరువు గొప్ప జలాధారము అగుచున్నది. కావున, చెరువును నిర్మించుట మొదలగు పుణ్యకార్యములు ఉత్తమమగు సంపదను కలిగించును (10).

దేవా మనుష్యా గంధర్వాః పితరో నాగరక్షసాః | స్థావరాణి చ భూతాని సంశ్రయంతి జలాశయమ్‌ || 11

ప్రావృడృతౌ తడాగే తు సలిలం యస్య తిష్ఠతి | అగ్నిహోత్రఫలం తస్య భవతీత్యాహ చాత్మభూః || 12

శరత్కాలే తు సలిలం తడాగే యస్య తిష్ఠతి | గోసహస్రఫలం తస్య భ##వేన్నైవాత్ర సంశయః || 13

హేమంతే శిశిరే చైవ సలిలం యస్య తిష్ఠతి | స వై బహుసువర్ణస్య యజ్ఞస్య లభ##తే ఫలమ్‌ || 14

వసంతే చ తథా గ్రీష్మే సలిలం యస్య తిష్ఠతి | అతిరాత్రాశ్వమేధానాం ఫలమాహుర్మనీషిణః || 15

మునే వ్యాసాథ వృక్షాణాం రోపణ చ గుణాన్‌ శృణు | ప్రోక్తం జలాశయఫలం జీవప్రీణసముత్తమమ్‌ || 16

అతీతానాగతాన్‌ సర్వాన్‌ పితృవంశాంస్తు తారయేత్‌ | కాంతారే వృక్షరోపీ యస్తస్మాద్యృక్షాంస్తు రోపయేత్‌ || 17

తత్ర పుత్రా భవంత్యేతే పాదపా నాత్ర సంశయః | పరం లోకం గతస్సో% పి లోకానాప్నోతి చాక్షయాన్‌ || 18

పుషై#్పస్సురగణాన్‌ సర్వాన్‌ ఫలైశ్చాపి తథా పితౄన్‌ | ఛాయయా చాతిథీన్‌ సర్వాన్‌ పూజయంతి మహీరుహాః || 19

కిన్నరోరగరక్షాంసి దేవగంధర్వమానవాః | తథైవర్షిగణాశ్చైవ సంశ్రయంతి మహీరుహాన్‌ || 20

దేవతలు, మనుష్యులు, గంధర్వులు, పితృదేవతలు, నాగులు, రాక్షసులు, చెట్టుచేమలు మరియు సర్వప్రాణులు చెరువును ఆశ్రయించుకొని జీవించును (11). ఎవడు నిర్మించిన చెరువులో వర్షాకాలము నీరు ఉండునో, వానికి అగ్నిహోత్రకర్మను చేసిన ఫలము లభించునని బ్రహ్మ చెప్పెను (12). ఎవని చెరువులో శరత్కాలమునందు నీరు ఉండునో, వానికి వేయి గోదానముల ఫలము లభించుననుటలో సందేహము లేదు (13). ఎవని చెరువులో హేమంత, శిశిరములనే ఋతువులలో నీరు ఉండునో, వానికి అధికమగు ధనమును దక్షిణలు ఇచ్చి చేసిన యజ్ఞము వలన లభించే ఫలము లభించును (14). ఎవని చెరువులో వసంత, గ్రీష్మములనే ఋతువులలో నీరు ఉండునో, వానికి అతిరాత్ర -అశ్వమేధములనే క్రతువులు చేసిన ఫలము లభించునని విద్వాంసులు చెప్పుచున్నారు (15). ఓ వ్యాసమహర్షీ! ప్రాణులకు తృప్తిని కలిగించే చెరువులను త్రవ్వించుట వలన కలిగే ఫలమును చెప్పితిని. ఇప్పుడు చెట్లనునాటుట వలన కలిగే ఫలమును వినుము (16). ఎవడైతే అడవిలో చెట్లను నాటునో, వానియొక్క గడచిన పితరుల వంశములు మాత్రమే గాక, రాబోయే పితరుల వంశములు కూడ తరించును. కావున, చెట్లను నాటవలెను(17). ఈ చెట్లు వానికి పుత్రసంతానముతో సమానమగు ప్రేమకు పాత్రమగుననుటలో సందేహము లేదు. వాడు మరణించిన తరువాత కూడ, వినాశము లేని పుణ్యలోకములను పొందును (18). చెట్లు తమ పూవులతో సర్వదేవతాగణములను, ఫలములతో పితరులను, నీడతో అతిథులను అందరినీ పూజించును (19). కిన్నరులు, నాగులు, రాక్షసులు, దేవతలు, గంధర్వులు, మానవులు మరియు ఋషులు సముదాయములు కూడ చెట్లను ఆశ్రయించెదరు (20).

పుష్పితాః ఫలవంతశ్చ తర్పయంతీహ మానవాన్‌ | ఇహ లోకే పరే చైవ పుత్రాస్తే ధర్మతః స్మృతాః || 21

తడా గకృద్వృక్షరోపీ చేష్టయజ్ఞశ్చ యో ద్విజః | ఏతే స్వర్గాన్న హీయంతే యే చాన్యే సత్యవాదినః || 22

సత్యమేవ పరం బ్రహ్మ సత్యమేవ పరం తపః | సత్యమేవ పరో యజ్ఞస్సత్యమేవ పరం శ్రుతమ్‌ || 23

సత్యం సుప్తేషు జాగర్తి సత్యం చ పరమం పదమ్‌ | సత్యేనైవ ధృతా పృథ్వీ సత్యే సర్వం ప్రతిష్ఠితమ్‌ || 24

తతో యజ్ఞశ్చ పుణ్యం చ దేవర్షిపితృపూజనే | ఆపో విద్యా చ తే సర్వే సర్వం సత్యే ప్రతిష్ఠితమ్‌ || 25

సత్యం యజ్ఞస్తపో దానం మంత్రా దేవీ సరస్వతీ | బ్రహ్మచర్యం తథా సత్యమోంకారస్సత్యమేవ చ || 26

సత్యేన వాయురభ్యేతి సత్యేన తపతే రవిః | సత్యేనాగ్నిర్నిర్దహతి స్వర్గస్సత్యేన తిష్ఠతి || 27

పాలనం సర్వవేదానాం సర్వతీర్థావగాహనమ్‌ | సత్యేన వహతే లోకే సర్వమాప్నోత్యసంశయమ్‌ || 28

అశ్వమేధసహస్రం చ సత్యం చ తులయా ధృతమ్‌ | లక్షాణి క్రతవశ్చైవ సత్యమేవ విశిష్యతే || 29

సత్యేన దేవాః పితరో మానవోరగరాక్షసాః | ప్రీయంతే సత్యతస్సర్వే లోకాశ్చ సచరాచరాః || 30

వృక్షములు పుష్పించి ఫలించి ఇహ లోకములో మానవులకు తృప్తిని ఇచ్చుచున్నవి. కావున, చెట్లు మానవులకు ఇహపరలోకములలో సుఖమునిచ్చే పుత్రులతో సమానమని ధర్మశాస్త్రములు చెప్పుచున్నవి (21). చెరువులను త్రవ్వించినవాడు, చెట్లను పాతినవాడు, యజ్ఞమును చేసిన బ్రాహ్మణుడు మరియు సత్యమును పలుకువారు స్వర్గమును కోల్పోయే ప్రసక్తి లేదు (22). సత్యమే పరంబ్రహ్మ. సత్యమే గొప్ప తపస్సు. సత్యమే శ్రేష్ఠమగు యజ్ఞము. సత్యమే గొప్ప పాండిత్యము (23). మానవులు నిద్రించుచున్ననూ, సత్యము మేల్కొని యుండును. సత్యమే పరమపదము. సత్యమే భూమిని ధరించి యున్నది. సర్వము సత్యమునందు స్థితిని కలిగియున్నది (24). యజ్ఞము, పుణ్యము, దేవపూజ, పితృపూజ, ఋషిపూజ, జలములు, విద్య అనే ఈ సర్వము సత్యమునందు నిలకడగా నున్నవి (25). సత్యమే యజ్ఞము. సత్యమే తపస్సు. సత్యమే దానము. సత్యమే మంత్రములు. సత్యమే సరస్వతీ దేవి. సత్యమే బ్రహ్మచర్యము మరియు ఓంకారము కూడ సత్యమే (26). సత్యము చేతనే వాయువు వీచుచున్నది. సత్యము చేతనే సూర్యుడు ప్రకాశించుచున్నాడు. సత్యము చేతనే అగ్ని కాల్చుచున్నది. స్వర్గము సత్యము చేతనే నిలబడి యున్నది (27). లోకములో మానవులు సత్యమును పాలించి, సర్వవేదముల ఆదేశములను పాలించిన ఫలమును మరియు సర్వతీర్థములలో స్నానము చేసిన ఫలమును కూడ పొందెదరనుటలో సంశయము లేదు (28). వేయి అశ్వమేధములు, లక్ష క్రతువులు ఒక వైపు, సత్యము ఒక వైపు ఉండగా తూచినచో, సత్యమే బరువైనదని తేలినది (29). సత్యముచే దేవతలు, పితృదేవతలు, మానవులు, నాగులు, రాక్షసులు మరియు సర్వలోకములలోని స్థావరజంగమాత్మకమగు సర్వప్రాణులు ప్రీతిని పొందును (30).

సత్యమాహుః పరం ధర్మం సత్యమాహుః పరం పదమ్‌ | సత్యమాహుః పరం బ్రహ్మ తస్మాత్సత్యం సదా వదేత్‌ || 31

మునయస్సత్యనిరతాస్తపస్తప్త్వా సుదుశ్చరమ్‌ | సత్యధర్మరతాస్సిద్ధాస్తతస్స్వర్గం చ తే గతాః || 32

అప్సరోగణసంవిష్టైర్విమానైః పరిమాతృభిః | వక్తవ్యం చ సదా సత్యం న సత్యాద్విద్యతే పరమ్‌ || 33

అగాధే విపులే సిద్ధే సత్యతీర్థే శుచిహ్రదే | స్నాతవ్యం మనసా యుక్తం స్థానం తత్పరమం స్మృతమ్‌ || 34

ఆత్మార్థేవా పరార్థే వా పుత్రార్థే వాపి మానవాః | అనృతం యే న భాషంతే తే నరాస్స్వర్గగామినః || 35

వేదా యజ్ఞాస్తథా మంత్రాస్సంతి విప్రేషు నిత్యశః | నో భాంత్యపి హ్యసత్యేషు తస్మాత్సత్యం సమాచరేత్‌ || 36

పరమధర్మము సత్యమే. పరమపదము సత్యమే. పరం బ్రహ్మ సత్యమే. కావున, సర్వకాలములలో సత్యమును పలుకవలెను (31). సత్యమునందు నిష్ఠ గల మునులు మరియు సత్యమనే ధర్మమునందు రుచి గల సిద్ధులు మిక్కిలి కఠినమైన తపస్సును చేసి ఆ సత్యము యొక్క ప్రభావముచే, పరిచర్యలను చేయు అప్సరసలతో కూడియున్న విమానములనెక్కి స్వర్గమును పొందిరి. కావున, మానవుడు సర్వదా సత్యమును పలుకవలెను. సత్యముకంటే గొప్పది లేదు (32, 33). లోతైనది, విస్తారమైనది, సిద్ధిని ఇచ్చునది మరియు శుచియైనది అగు సత్యమనే తీర్థమునందు మనస్సును నిలిపి స్నానమును చేయవలెను. సత్యమే గొప్ప స్థానమని చెప్పబడినది (34). ఏ మానవులైతే తమ కొరకు గాని ఇతరుల కొరకు గాని పుత్రుని కొరకైననూ గాని, అసత్యమును పలుకరో, వారు స్వర్గమును పొందెదరు (35). బ్రాహ్మణులయందు వేదములు, యజ్ఞములు, మంత్రములు నిత్యము ఉన్ననూ, అసత్యము ఉన్నచో, అవి ప్రకాశించవు. కావున, సత్యమును వ్రతముగా స్వీకరించవలెను (36).

వ్యాస ఉవాచ|

తపసో మే ఫలం బ్రూహి పునరేవ విశేషతః | సర్వేషాం చైవ వర్ణానాం బ్రాహ్మణానాం తపోధన || 37

వ్యాసుడు ఇట్లు పలికెను-

తపస్సే ధనముగా గలవాడా! బ్రాహ్మణులకు మరియు సర్వవర్ణముల వారికి తపస్సు యొక్క ఫలమును గూర్చి మరల విశేషముగా చెప్పుము (37).

సనత్కుమార ఉవాచ |

ప్రవక్ష్యామి తపో%ధ్యాయం సర్వం కామార్థసాధకమ్‌ | సుదుశ్చరం ద్విజాతీనాం తన్మే నిగదతః శృణుః || 38

తపో హి పరమం ప్రోక్తం తపసా విద్యతే ఫలమ్‌ | తపోరతా హి యే నిత్యం మోదంతే సహ దైవతైః || 39

తపసా ప్రాప్యతే స్వర్గస్తపసా ప్రాప్యతే యశః | తపసా ప్రాప్యతే కామస్తపస్సర్వార్థసాధనమ్‌ || 40

తపసా మోక్షమాప్నోతి తపసా విందతే మహత్‌ | జ్ఞానవిజ్ఞానసంపత్తిస్సౌభాగ్యం రూపమేవ చ || 41

నానావిధాని వస్తూని తపసా లభ##తే నరః | తపసా లభ##తే సర్వం మనసా యద్యదిచ్ఛతి || 42

నాతప్తతపసో యాంతి బ్రహ్మలోకం కదాచన | నాతప్తతపసాం ప్రాప్యశ్శంకరః పరమేశ్వరః || 43

యత్కార్యం కించిదాస్థాయ పురుషస్తపతే తపః | తత్సర్వం సమవాప్నోతి పరత్రేహ చ మానవః || 44

సురాపః పారదారీ చ బ్రహ్మహా గురుతల్పగః | తపసా తరతే సర్వం సర్వతశ్చ విముంచతి || 45

అపి సర్వేశ్వరః స్థాణుర్విష్ణుశ్చైవ సనాతనః | బ్రహ్మా హుతాశనశ్శక్రో యే చాన్యే తపసాన్వితాః || 46

అష్టాశీతిసహస్రాణి మునీనామూర్ధ్వరేతసామ్‌ | తపసా దివి మోదంతే సమేతా దైవతైస్సహ || 47

తపసా లభ్యతే రాజ్యం స చ శక్రస్సురేశ్వరః | తపసా%పాలయత్సర్వమహన్యహని వృత్రహో || 48

సూర్యాచంద్రమసౌ దేవౌ సర్వలోకహితే రతౌ | తపసైవ ప్రకాశంతే నక్షత్రాణి గ్రహాస్తథా || 49

న చాస్తి తత్సుఖం లోకే యద్వినా తపసా కిల | తపసైవ సుఖం సర్వమితి వేదవిదో విదుః || 50

జ్ఞానం విజ్ఞానమారోగ్యం రూపవత్త్వం తథైవ చ | సౌభాగ్యం చైవ తపసా ప్రాప్యతే సర్వదా సుఖమ్‌ || 51

తపసా సృజ్యతే విశ్వం బ్రహ్మా విశ్వం వినా శ్రమమ్‌ | పాతి విష్ణుర్హరో% ప్యత్తి ధత్తే శేషో% ఖిలాం మహీమ్‌ || 52

విశ్వామిత్రో గాధిసుతస్తపసైవ మహామునే | క్షత్రియో%థాభవద్విప్రః ప్రసిద్ధం త్రిభ##వే త్విదమ్‌ || 53

ఇత్యుక్తం తే మహాప్రాజ్ఞ తపోమాహాత్మ్యముత్తమమ్‌ | శృణ్వధ్యయనమాహాత్మ్యం తపసో%ధికముత్తమమ్‌ || 54

ఇతి శ్రీశివమహాపురాణ ఉమాసంహితాయాం తపోమాహాత్మ్య వర్ణనం నామ ద్వాదశో%ధ్యాయః (12)

సనత్కుమారుడు ఇట్లు పలికెను-

తపస్సు వలన కోరికలు అన్నియు ఈడేరును. బ్రాహ్మణులకైననూ చేయుటకు కఠినమైన ఆ తపస్సును గూర్చి చెప్పెదను. నేను చెప్పే ఈ అధ్యాయమును వినుము (38). తపస్సు చాల గొప్పది. తపస్సు ఫలమునిచ్చును. నిత్యము తపస్సును చేసినవారు దేవతలతో గూడి ఆనందించుచున్నారు (39). తపస్సుచే స్వర్గము లభించును. తపస్సుచే మోక్షమును పొందును. తపస్సుచే గొప్ప విషయములు లభించును. పారమార్థికజ్ఞానము, లౌకికజ్ఞానము, సంపద, మంచి భాగ్యము మరియు సౌందర్యములను తపస్సుచే పొందవచ్చును (41). మానవుడు వివిధములైన వస్తువులను తపస్సుచే పొందగలడు. మానవుడు తన మనస్సులో కోరే సర్వమును తపస్సుచే పొందును (42). తపస్సును చేయని వారు ఎన్నటికీ బ్రహ్మలోకమునకు వెళ్లజాలరు. తపస్సును చేయనివారు మంగళకరుడగు పరమేశ్వరుని పొందలేరు (43). మానవుడు ఇహపరలోకములలో ఏ ప్రయోజనమును అపేక్షించి తపస్సును చేయునో, ఆ సర్వమును పొందును (44). మద్యపానము చేయువాడు, పరభార్యతో రమించువాడు, బ్రహ్మహత్యను చేసినవాడు, మరియు గురుభార్యాగమనము చేయువాడు తపస్సుచే సర్వపాపములను అతిక్రమించి వాటినుండి విముక్తిని పొందెదరు (45). సర్వేశ్వరుడగు శివుడు, సనాతనుడగు విష్ణువు, బ్రహ్మ, అగ్ని, ఇంద్రుడు మొదలగు వారు తపస్సును చేసినవారే (46), అస్ఖలితబ్రహ్మచారులగు ఎనభై ఎనిమిది వేల మునులు తపస్సుయొక్క ప్రభావముచే స్వర్గములో దేవతలతో గూడి ఆనందమును అనుభవించుచున్నారు (47). తపస్సుచే రాజ్యము లభించును. దేవతలకు ప్రభువు. వృత్రాసురుని సంహరించినవాడు అగు ఆ ఇంద్రుడు తపఃప్రభావముచే ప్రతిదినము సర్వమును పాలించుచున్నాడు (48). ప్రకాశమునిచ్చి సర్వలోకములకు హితమును చేకూర్చు సూర్యచంద్రులు, నక్షత్రములు మరియు గ్రహములు తపస్సుచేతనే ప్రకాశించుచున్నవి (49). తపస్సు లేకుండగా లభించే సుఖము లోకములో లేదు. తపస్సు చేతనే సర్వసుఖము లభించునని వేదవేత్తలు చెప్పుచున్నారు (50). పారమార్ధికజ్ఞానము, లౌకికవిజ్ఞానము, ఆరోగ్యము, సౌందర్యము, సౌభాగ్యము, మరియు నిత్యసుఖము అనునవి తపస్సుచే మాత్రమే పొందబడును (51). తపఃప్రభావముచే శ్రమ లేకుండగనే బ్రహ్మ బ్రహ్మాండమును సృష్టించుచున్నాడు; విష్ణువు పాలించుచున్నాడు; శివుడు ఉపసంహరించుచున్నాడు; శేషుడు సకలభూమండలమును మోయుచున్నాడు (52). ఓ మహర్షీ! గాధికుమారుడు, క్షత్రియుడు అగు విశ్వామిత్రుడు తపస్సు చేతనే బ్రాహ్మణుడైనాడు. ఈ విషయము ముల్లోకములలో ప్రసిద్ధిని గాంచినది (53). ఓ మహాబుద్ధిశాలీ ! తపస్సు యొక్క మహిమను నీకు ఈ విధముగా చెప్పితిని. తపస్సు కంటే అధ్యయనము ఇంకనూ ఉత్తమమైనది. దాని మహిమను వినుము (54).

శ్రీ శివమహాపురాణములో ఉమాసంహితయందు తపస్సుయొక్క మహిమను వర్ణించే పన్నెండవ అధ్యాయము ముగిసినది (12).

Siva Maha Puranam-3    Chapters