Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

ఎనుబదితొమ్మిదవ అధ్యాయము - సదాచార వర్ణనము

పుష్కరః- మాల్యం లక్ష్మీకరం నామ నిత్యం శిరసి ధారయేత్‌ | నాన్యత్ర ధారయేత్‌ ప్రాజ్ఞో బహిర్గధం న ధారయేత్‌

యచ్చ కంటకి సంభూతం కృష్ణం రక్తం చ భార్గవ| కంటకిభ్యోపి యజ్ఞాతం శుక్లం ధార్యం తు తద్భవేత్‌ ||

కృష్ణరక్తే తధా ధార్యే యది స్యాతాం జలోద్భవే | చందనే నామలిప్తేన కుంకుమా గురుభి స్తథా ||

కర్పూరేణ తధాంగాని శుభేన చ ప్రియంగునా | వస్త్రం నాన్యధృతం ధార్యం న రక్తం మలినం తథా ||

జీర్ణం నాపదశం చైవ; శ్వేతం ధార్యం ప్రయత్నతః | ఉపానహం నాన్యధృతం బ్రహ్మసూత్రం చ ధారయేత్‌ ||

హీనాంగై రధికాంగై శ్చ బాలైఃవృద్ధేర్బుధుక్షితైః | వ్యాళై రదాన్తై ర్వాహైశ్చ న వ్రజేచ్చ కదాచన ||

స్నానభోజనపానాది తేషా మాద్యౌ న వాచరేత్‌ | నైకః ప్రపద్యే దధ్వానం నాధార్మికసహాయవాన్‌ ||

న రాత్రౌ నచ మధ్యాహ్నే న చదేవే ప్రవర్షతి | న చాతివిషమే వాతే సంధ్యయోశ్చ తథా ద్విజ ||

నా సన్నిహితపానే వా న వేగాన్న చ సంతతమ్‌ | సాతపత్ర పదత్రాణస్సోష్ణీ

షశ్చ తథా చరేత్‌ ||

చతుష్పథం నమః కుర్యా ద్విఖ్యాతాం శ్చ వనన్పతీన్‌ | మాంగల్యాని చ సర్వాణి పధి కుర్యాత్‌ ప్రదక్షిణమ్‌ || 10

అమాంగల్యాని వామాని కర్తవ్యాని విజానతా | వరస్య భూమిపాలస్య స్నాతకస్యాథ చక్రిణః ||

భారాక్రాంతస్య గుర్విణ్యాః పంధా దేయః ప్రయత్నతః | వ్యాలయుద్ధం న చేక్షెత వినా విషమమాస్థితః ||

న పశ్యే చ్చార్క ముద్యంతం నాస్తంయంతం న చాంభసి | తిరస్కృతం తు వస్త్రేణ న క్రుద్దస్య గురో ర్ముఖమ్‌ ||

న స్త్రీం స్రవంతీం నోదక్యాం న నగ్నాం నాన్య సంగతామ్‌ | న పత్నీం భోజన స్వప్నస్నానా సక్తాం మభూషణామ్‌ ||

నాంజయన్తీం స్వకే నేత్రే నాశ్లీలం కించి దేవ తు | నానా స్థానం న పశ్చేచ్చ న పశ్యచ్చ మహానసమ్‌ |

జలాశయతటస్థాం శ్చ న పశ్యేత్తు కదాచన |

పుష్కరుడనియె: పూలమాల లక్ష్మీకరము. దానిని నిత్యము శిరమ్ముననే ధరింపవలెను. మఱియెక్కడను గూడదు. పరిమళము లేని దానిని ధరింపరాదు, ముళ్ళుగల చెట్టులం బూచినవి నల్లనివి ఎఱ్ఱనివియునైన పూలు ధరింపదగదు. ముళ్ళుగల చెట్లుతీగల నుండి పుట్టిన దైనను తెల్లని వగునేని ధరింపదగినవే. నీటిలో బుట్టిన నల్లని ఎఱ్ఱని పూలు ధరింపవచ్చును. చందనము కుంకుమపువ్వు అగురు కర్బూరము ప్రియంగువు నను వానిం బూసికొనవలెను. నల్లని తెల్లని పూలమాలలు ధరింపవలెను. ఇతరులు ధరించినది ఎఱ్ఱనిది మాసినదియు చినిగినదియు అంచులేనిదియునైన తెల్లని వస్త్రము కట్టుకో గూడదు. ఇంకొకని చెప్పులు (పాదుకలు) బ్రహ్మసూత్రము (జందెము) ధరింపరాదు. ఆంగహీనులు అధికాంగులు బాలవృద్ధులు నాకలితో నున్నవారు క్రూరమృగములు లొంగని గుఱ్ఱములు మొదలయిన వాహనములతోను నెప్పుడును వెళ్ళరాదు. స్నానభోజన పానాదులను వాని కంటె ముందు జేయరాదు. ఒంటరిగను అధార్మికులు తోడుగను రాత్రి మిట్టమద్యాహ్నాము దేవుడువర్షముకురియుచుండగను అతివిషమముగా గాలవీచునపుడు సంధ్యలందు మంచి నీళ్ళు దగ్గరగ లభించనిచోట ప్రయాణము సేయరాదు. తొందర పడకుండ నడుమ నడుమ నాగుచు గొడుగు పాదరక్షలు పూని తలపాగయుంగొని ప్రయాణము సేయవలెను. చతుష్ప థమును = నాల్గు దారులు కలిసినచోటును ప్రసిద్ధములైన వనస్పతులను సర్వమంగళ పదార్థములను నమస్కరించి ప్రదక్షిణము సేయవలెను. అమంగళ వస్తువుల నెడమువైపు నుండునట్లు చరింపవలెను. వరునకు రాజునకు స్నాతకునికి రథమునకు బరువెత్తుకొన్న వారికి గర్భిణికి సప్రయత్నముగా దారి యీయవలెను. ఇరుకులో పడినప్పుడు తప్ప వ్యాలయుద్దము చూడరాదు. (వ్యాలము = క్రూరమృగము) ఉదయించుచున్న అస్తమించుచున్న నీళ్ళలో ప్రతిబింబించిన సూర్యుని జూడరాదు. వస్త్రముతో కప్పవడిన సూర్యుని కుపితుడైన గురు ముఖమును స్రవించు స్త్రీని ఉదక్యను ముట్టయిన దానిని వివస్త్రను, ఇంకొకనితో నున్న స్త్రీని భోజనము నిద్రలోనున్న దానిని స్నానము చేయుచున్న నగలు లేని దానిని కన్నుల కాటుక పెట్టకొనుచున్నప్పుడు భార్యను జూడరాదు. అశ్లీల విషయములను, నానా (స్త్రీ) ప్రదేశములను వంటయింటిని జలాలయమొడ్డున నిలువబడిన వారిని జూడరాదు.

చతుష్పథ స్తుషాంగారశూన్యవేశ్మాటవీ స్తధా ||

కార్పాసాస్థి తథా భస్మ నాక్రమె ద్యచ్చ కుత్సితమ్‌ | అంతఃపురం ఋతుగృహం పరదూతగృహం తథా ||

నారోహే ద్విషమాం నావం న వృక్షం న చ వర్వతమ్‌ | న లోష్టేన న కాష్ఠేన చ ఫలద్రుమాన్‌ || 20

న పాతయే న్న కుర్వీత సర్వత్ర చ కుతూహలమ్‌ | అర్థాయతనశాస్త్రేఘ సర్వత్ర స్యా త్కుతూహలీ ||

దండేన కరపాతైర్యా న కుర్యా దంబువాదనమ్‌ | తృణచ్ఛేదం న కుర్వీత న చ లోష్టాభి మర్దనమ్‌ ||

నఖానాం భక్షణం చైవ దంతానాం కుట్టనం తథా | ఛేదనం చ నఖై ర్లోమ్నాం వృథా చేష్టాం వివర్జయేత్‌ ||

ముఖాంగవాదనం చైవ క్ష్వేడోత్కృష్టం తధా వృథా | అవగుంఠ్య శిరో రాత్రౌ న శయీత కదాచన || 24

పర్యటే న్న తథా రాత్రౌ వినా రామ ప్రదీపికామ్‌ | నాద్వారేణ పశుగృహే నా ద్వారేణ రిపో ర్గృహమ్‌ ||

ప్రవిశేన్న చ తిష్ఠే చ్చ నిద్రితం న చబోధయేత్‌ | నా క్షిపేత్సర వాక్యం తు న చ ర క్తం విరాగయేత్‌ ||

కధాభంగం న కుర్వీత నచ వాసో విపర్యయమ్‌ | నోర్ధ్వ జాను శ్చిరం తిష్ఠే దుత్పతంతీం న లంఘయేత్‌ ||

పరక్షేత్రే చరన్తీం గాం పాయయన్తీం చ వత్సకమ్‌ | నాచక్షీత తథాన్యస్య శక్రచాపం న దర్శయేత్‌ ||

భద్రం భద్ర మితి బ్రూయ న్నానిష్టం వర్తయే త్క్వచిత్‌ | పాలశ మాసనం వర్జ్యం పాదపీఠం చ పాదుకే || 29

దూది ఎముకలు బూడిదను చతుష్వథముసు, పొల్లును, నిప్పును, శూన్య గృహమును, అడవిని పాడువడిన దానిని ద్రొక్కరాదు. అంతఃపురము ముట్టుగది శత్రువుయొక్క తదూ విడిదిసేసిన యిల్లునను నడుగిడరాదు. విషమముగానున్న పడవను చెట్టును కొండను నెక్కరాదు. మట్టిబెడ్డలతో కర్రతో రాళ్ళతో పండ్ల చెట్లును పడగొట్టరాదు ఎల్లయెడల ఎల్ల వానికై ఉబలాటపడరాదు. ధన గృహశాస్త్రములందు (జుమాఖర్చులలో లెక్కలో నెల్లయెడల) కుతూహలము కల్గియుండవలెను. కర్రతోగాని చేతులచే గాని నీళ్ళ చప్పుడు సేయరాదు. గడ్డిపరకలు త్రింపుట మట్టిని మర్దించుట గోళ్ళు కొఱకుట దంతములు ఛేదించుట, గోళ్ళచే రోమములు (వెంట్రుకలు) పీకుట త్రెంచుట, వృథాచేష్టము చేయరాదు. ముఖాంగవాదనము. నోటతోడాళము వేయుట మొదలయిన చప్పుడు పనిలేని యరపులు చేయ కూడదు. రాత్రి శిరము గప్పికొని యెన్నడుం బండు కొనరాదు. దీపములేకుండ రాత్రి పర్యటింపరాదు. (తిరుగరాదు) పశుశాలను శత్రునింటిని గుమ్మము నంగాక ప్రవేశింపరాదు. అక్కడ నిలువను గూడదు. పండుకొన్న వానిని లేపగూడదు. ఒరుని మాటనడ్డగింపరాదు. అనురాగములగల వానిని విరక్తుని జేయరాదు, కధాభంగము ఒకడు చేయు సంభాషణమునకు అడ్డుపడరాదు, కట్టు వస్త్రమునట్టిట్టు మార్చి (తారుమారుగా) కట్టుకొనరాదు, చాలాసేపు యోకాళ్ళెత్తి నిలువ బడరాదు, ఎగిరెగిరి దూకునాకును దాటిపోరాదు, ఇతరుని పొలములో మేయుచున్న గోవును దూడకు పాల్గుడుపుచున్న యావును చెరపరాదు, ఇంద్రధనుస్సు నొరునికి జూపరాదు, భద్రము భద్రము = శుభము శుభము. అనవలెనేకాని అప్రియమైన విషయము చెప్పరాదు. ఆసనము గాని పాదపీఠముగాని పాదుకలు గాని పలాశ (మొదుగు) నిర్మితములు పనికిరావు.

సురార్చా గురుభూపానాం బ్రహ్మణానాం విశేషతః | నాక్రామేచ్చ తథా ఛాయాం శ్వపచస్య చ భార్గవః || 30

ద్విజయో శ్చైవ దంపత్యోః భూపయో ర్యుధ్యమానయోః | అగ్ని బ్రాహ్మణయో శ్చైవ ద్విజ భూపాలయో స్తథా ||

శిష్యో పాధ్యాయయో శ్చైవ నచ మధ్యే న పూజ్యయోః | తైలే జలే తథా వక్త్ర మాదర్శే చ మలాన్వితే ||

న పశ్చే న్న తధా పశ్చే దుపరక్తం దివాకరమ్‌ | నోచ్ఛిష్ట స్తారకా రాహుః స్తుతినాశం హుతాశనమ్‌ ||

న తిష్ఠే త్ప్రతి వాతం చ తథా చ ప్రతి భాస్కరమ్‌ | న సంహతాభ్యాం పాణిభ్యాం కండూయే దాత్మన శ్శిరః ||

రోదనం చ తధా నగ్నః కుర్యా త్తోయావ గాహనమ్‌ | నిష్కారణం నదీపారం బాహుభ్యాం న తర్తే త్తధా ||

న ప్రశంసే న్నదీతోయేన నదీ మన్యాం కథం చ | నగిరౌన పర్వతం రామ! న రాజ్ఞః పురతో నృపమ్‌ ||

అసంతర్ప్య పితు ర్దేయం నదీపారం నచ వ్రజేత్‌ | భోజనం వర్జయే న్నావి ష్ఠీవనం చ తధాంభసి ||

నైవాప్సు ప్రక్షిపే ద్విద్వాన్‌ అమేధ్యం రుధిరం విషమ్‌ | సమాల్యో నాచరేత్‌ స్నానం నవివాసా అకారణమ్‌ ||

ఆత్మన శ్చ తధా రామ! నైవ త్వపనయేత్‌ స్రజమ్‌ | స్నాత శ్శిరో నా వధునే న్నాంగేభ్య స్తోయ ముద్ధరేత్‌ ||

తద్దినే చానులింప్తాంగః తథా స్నానం వివర్జయేత్‌ | శిరస్స్నాతశ్చ తైలేన స్పృశే దంగం నకించన || 40

దేవతాదివిగ్రహములు గురువులు రాజులు బ్రాహ్మణుల నీడ త్రొక్కరాదు. చండాలుని నీడ త్రొక్కరాదు. నీచుని నీడయుం ద్రొక్కరాదు. ఇద్దరు ద్విజుల దంపతులు యుద్దము సేయచున్న రాజులు అగ్నికి బ్రాహ్మణలకు రాజులకు శిష్యోపాధ్యాయులకు పూజ్యులకు నడుమం బోరాదు. నూనెలో మకిలి గమ్మిన యద్దములో మొగము చూచికొనరాదు. గ్రహణము పట్టిన సూర్యుని సూడరాదు. ఎంగిలి వడి నక్షత్రముఅను రాహువును స్తుతింపకుండ యగ్నిని జూడరాదు. ఎదురుగాలికెదరువోరాదు. సూర్యుని కెదురువోరాదు. రెండు చేతులు జోడించి తల బరికికొనరాదు. ఏడపరాదు. దిగంబరియై నీట దిగరాదు. (స్నానము సేయరాదు) పనిలేక చేతులూపుచు నదిలో నీదరాదు. ఒకపుణ్యనదిలో స్నానము సేయొచు మఱొక నదిని ఒక కొండపై నుండి యింకొక కొండను ఒక రాజుముందింకొక రాజును గొనియాడరాదు. తర్పరణము సేయక తండ్రికి నివేదన సేయరాదు. నది చిట్ట చివరకు బోరాదు. పడవలో భుజించుట నీటిలోనీదుట- అమేధ్యము రక్తము విషమును వైచుట పనికిరాదు. కారణములేకుండ పూలమాలలతో ఒక వస్త్రము గట్టుకొని స్నానము సేయరాదు. నిష్కారణముగ స్నానము చేయరాదు. తన మెడలో మాలను స్నాన సమయమున దీసి వేయరాదు. స్నానము చేసి తలను (జుట్టును) దులుపరాదు. ఒడలి నున్న నీటిని చేతితో దులుపరాదు. తద్దినము రోజున సున్నిపిండి మొదలయిన వానితో రుద్దుకొని స్నానము చేయరాదు. ఆనాడు నూనె రాసికొని స్నానము చేయరాదు. ఒడలికి నూనె రాసికొనరాదు.

వాససా వామభాగస్య రజసః పూర్వవాససా | సంమార్జనం రజో వర్జ్యం ఖరాదీనాంత స్తధైవ దేశ్చ తు || 41

మేధ్యాని చ తథా రామ! గో గజాశ్వ రజాంసి చ | నాధః కుర్వీత దహనం నచ పాదౌ ప్రతాపయేత్‌ ||

దర్భైర్న మార్జయే త్పాదౌ నచ కాంస్యే ప్రధాపయేత్‌ | గో గజాశ్వాజపుచ్ఛేషు ఖరస్య చ విశేషతః ||

యల్లగ్నముదకం తస్మా ద్విప్రుషో దూరత స్త్యజేత్‌ | అకస్మా దప్యశస్తా స్తాః ఖంజాంగ స్పర్శనం తథా ||

హీనం న వహే ద్రామ! శ్రుత రూపధనాదిభిః | హీనైర్న చ వసేత్సార్థం న దేశే వైద్య వర్జితే ||

న భూపాల విహీనే చ న సాంవత్సర వర్జితే | దుష్టకూమాపాన్వితే రామ! తథా చ బహునాయకే ||

స్త్రీనాయకే బాలపతౌ శూద్రరాజ్యే తధైవ చ | వ్లుెచ్ఛవేషో న కర్తవ్యః వ్లుెచ్ఛభాషా తధైవ చ ||

చండాలైః పతితై ర్ల్మేచ్ఛై ర్భాషణం న కదాచన | న్యక్కారం కాయతః కృత్వా కీర్తయే త్కేశవం విభుమ్‌ || 48

ఉత్తరీయముతో, కట్టుకొన్న వస్త్రముతో దుమ్మును దులపరాదు. గాడిదలు గుఱ్ఱాల ధూళినిగూడ దులపరాదు. గోవులు ఏనుగులు గుఱ్ఱముల పాదధూళి పవిత్రము. అగ్నిని క్రిందుగా నుంచరాదు. పాదము లగ్నితో కాచుకొన గూడదు. దర్భలతో పాదములను తుడుపరాదు.కంచు పళ్లెములో కడుగరాదు. ఆవు, ఏనుగు, గుఱ్ఱము, మేక యొక్క తోకల నీటి తుంపురులను మీద బడనీయరాదు. అనుకోకుండ పడినవి నింద్యము. కుంటి వాని శరీరముదాకరాదు. పాండిత్యము అందము థనమును లేని వానిని వహించరాదు. నీచులతో గూడ వసింపరాదు. వైద్యుడు భూపాలుడు జ్యోతిష్కుడు లేనిచోట పాడునూయిగల చోట బహు నాయకము స్త్రీనాయకము బాలనాయకము శూద్రనాయకమైన రాజ్యమునందుండరాదు. వ్లుెచ్ఛుల వేషము బాషయు, చండాలురతో పతితులతో వ్లుెచ్ఛులతో సంభాషణము నెన్నడుం చేయగూడరాదు. శారీరకముగ తిరస్కారము సంభవించిన యెడల కేశవుని స్మరింపవలెను.

నాసంవృత ముఖః కుర్యా ద్ధాసం జృంభాం తధా క్షుతమ్‌ | గోపయే జ్జన్మ నక్షత్ర మృణసారం గృహే మలమ్‌ ||

ప్రభో రప్యవమానం స్వం తస్య దుశ్చరితం చయత్‌ | నాను కూల్యం తథా కార్య మింద్రియాణాం సుఖేప్సునా || 50

యుక్త్యా చ కామసేవీ స్యా నాకస్మా న్నిస్సుఖీ భ##వేత్‌ |

నోరు గప్పుగొనక నవ్వరాదు. ఆవలింపరాదు. తుమ్మరాదు. జన్మ నక్షత్రము అప్పును ఇంటిలో కుళ్ళు (తప్పు)ను ప్రభువు వలన జరిగిన యవమానమును వాని పాడునడవడినిదాచవలెను. వెల్లడింపరాదు. సుఖార్థియైనవా డింద్రియముల కనుకూలుడుగాగూడదు. విషయవిముఖుడై యుండవలెనన్న మాటయుక్తితో కామపురుషార్థమును సేవింపవలెను. అకస్మాత్తుగా సుఖమును విడువ రాదు. కోపవేగము తప్ప తక్కిన మలమూత్రాది వేగములను నిరోధింపరాదు. రోగమును కాని అల్పుడైన శత్రువునుకాని నుపేక్షింపరాదు.

వేగరోధం న కర్తవ్య మన్యత్ర క్రోధ వేగతః ||

నోపేక్షితవ్యో వ్యాధిః స్యాద్రిపు రల్పోపి భార్గవ! | స్నాత్వా భుక్త్వా చ ధర్మజ్ఞ భక్తి కామ స్సురార్చనే ||

మలాయనానాం సంస్పర్శే మలానాం చైవ భార్గవ | వాససశ్చ పరీధానే రధ్యాచంక్రమణ తథా ||

ఆచమేచ్చ తథా రామః తథా స్వప్నోత్థితో నరః | న హుం కుర్యా చ్ఛివం పూజ్యం భిభృయా న్నాన్యచారిణీమ్‌ ||

న భుక్త పాత్రం ప్రాయస్యే న్నీ చసేవాం వివర్జయేత్‌ | పాదేన నాక్రమే త్పాదం న కండూయే న్న శౌచయేత్‌ ||

వర్జయే చ్ఛవ ధూమం తుం గిరం చాశ్లీలసంయుతామ్‌ | ప్రత్యక్షం వా పరోక్షం వా కస్య చి న్నాప్రియం వదేత్‌ ||

వేద శాస్త్ర నరేంద్రర్షి దేవ నిందాం వివర్జయేత్‌ | నాస్తిక్య మనృతం చైవ చేతసో దూషణం తథా ||

స్త్రీణా మీర్ష్యా న కర్తవ్యా విశ్వాసంతాసు వర్జయేత్‌ | లాలితా స్తాడితాః కార్యా గేహేస్వే స్త్రీ కుమారికాః ||

సర్వేషా మేవ ధర్మాణాం కర్తవ్యం శ్రవణం తథా | నమస్కారం చ దేవానాం సర్వేషా మేవ కారయేత్‌ ||

సర్వేషాం చరితం రామ! ధర్మతో న వికుత్సయేత్‌ | న చాచరేచ్చ ధర్మజ్ఞ! తేహి తేజోపహా హతాః || 60

ధర్మస్యా ర్ధస్య కామస్య పీడా వర్జ్యా పరస్పరమ్‌ | దేహస్య పయస శ్చైవ శిల్పస్య స్వకులస్య చ ||

ఆచరే త్సదృశం వేషం ప్యవసాయాను రూపతః | స్నాత ఏవాశు బి భృయా త్సోష్ణీషే ధౌతవాససీ ||

అనులిప్యేత్తధాంగాని సితం మాల్యం చ ధారయేత్‌ | నా సంస్కృతం చ బి భృయా త్కాంచనం పురుషోత్తమ|

నిరాశనస్య సుప్తస్య శయానస్య తథైవ చ | తధా భుక్తవతో రామ! స్నాతస్య భాషితస్య చ ||

యాత్రాయుద్ధో త్సుకస్యాపి శ్మశ్రు కర్మ వివర్జయేత్‌ |

స్నానము చేసిభోజనముచేసి దేవతార్చన మందు భక్తిని గోరి, మలస్థానములను మలములను తాకియు వస్త్రము ధరించి, రాచబాటలో సంచరించి నిద్రనుండి లేచి యాచమనము సేయవలెను. శివుని గూర్చి పూజ్యుని గూర్చి హుంకరింపరాదు. (గద్దింపరాదన్న మాట) అన్యచారిణిని భరింపరాదు. భోజనముచేసిన పాత్రను తీయరాదు. నీచుని సేవింపరాదు. ఒకకాలి నింకొక కాలిమీద నుంచరాదు. గోకికొనరాదు. కడుగుకొనరాదు. శవ ధూమమునకు దూరముగ పోవలెను. అశ్లీల సంభాషణము ఎదుటగాని చాటునగాని నింకొకని కప్రియముగను మాటలాడరాదు. వేదశాస్త్రములను, రాజును, ఋషులను, దేవతలను నిందింపరాదు. నాస్తిక్యము గూర్చి అనృతము చేతోదూషణము (తన మనస్సును దాను దిట్టుకొనుట) మాన వలెను. స్త్రీల యెడ ఈర్ష్య పనికిరాదు. వారి యెడ విశ్వాసమును (నమ్మకము) గూడదు. స్త్రీలను ఆడపిల్లలను లాలింపవలెను. అదుపులో పెట్టుటకు గొట్టినం గొట్టవచ్చును. సర్వ ధర్మ శాస్త్రములను శ్రవణము సేయవలెను. సమస్త దేవతలను నమస్కరించవలెను.

అందరి చరిత్రమును నడవడిని ధర్మదూరమని నిందింపరాదు. ఆట్లని యారితిగా తానుజేయనురాదు. అట్లు ఎదిరివారి తేజోహాని చేసిన వారు కించపరచిన వారు తాము దెబ్బతిందురు. ధర్మము అర్థము కామములను పురుషార్థముల కొకదానితో నొకటి సంఘర్షణ పడకుండ జూచికొనవలెను. అనగా కేవల ధర్మము కొఱకు అర్ధ కామములను కేవల కామము కొఱకు ధర్మార్థములను చెడకుండ సమవిభాగముగ మూడు పురుషార్థములను పరి రక్షించుకొనవలెను.

తన దేహమునకు, వయస్సునకు తన కులమునకు శిల్పమునకు ననువైనదియు తన వ్యవసాయమునకు (అనగా బ్రతుకుతెఱవు కొఱకు తాను జేయు ప్రయత్నమునకు ఉద్యోగమునకు అనువైన వేషము వేయవలెను. స్నానముచేసి వెంటనే తలపాగయు నుతికిన మడుపులనుధరింప వలెను. ఒడలికి గంధము పూసికొనవలెను. తెల్లని పూలమాలల ధరింపవలెను. పుటము పెట్టిన (శుద్ధిచేసిన) బంగారమునే ధరింపవలెను. నిరశనుడై యున్నపుడు (ఉపవాసముండుట కాని లంఖణములు చేయుటగాని జరిగినప్పుడు) నిద్రలోనున్న వాడు పరుండిన వాడు భోజనము చేసినతరువాత స్నానమయిన తర్వాత భాషించునపుడు ప్రయాణోత్సుకుడు యుద్ధ సన్నద్ధడైన వాడు శ్మశ్రు కర్మ (క్షురకర్మ) విడువవలెను.

వైష్ణవం వారుణం త్వాష్ట్రం సావిత్రం వాసవం తథా ||

వాయవ్య మింద్రకం పౌష్ణం శాక్ర మాశ్విన మేవచ | మైత్రా దిత్యే తధా పుష్యః శంఖ చక్రగణం భ##వేత్‌ ||

నక్షత్రాణా మధైతేషాం ముహుర్తాశ్చ హితప్రదాః | అర్కార్కి భౌమ వారా శ్చ రిక్తా శ్చ తిథయ స్తథా ||

ప్రతి పచ్చ తథా షష్ఠీ వర్జయేత్‌ క్షౌర కర్మణి | వర్జయే జ్జన్మనక్షత్రం నానుకూలం తధైవ చ ||

జన్మ నక్షత్ర గే సోమే శిరస్నానేన యత్నతః | పూజా సోమస్య కర్తవ్యా నక్షత్రస్య తథాత్మనః ||

శ్రాద్ధం కుర్యా త్ప్రయత్నేన వహ్ని బ్రాహ్మాణ పూజనమ్‌ | వాహనాయుధ చ్ఛత్రాద్యం పూజనీయం ప్రయత్నతః || 70

సురాణా మర్చనం కార్యం కేశవస్య విశేషతః | సమం స్వలంకృత స్తిష్ఠే చ్ఛిరస్నాతశ్చ మానవః ||

నిర్మలాని చ కార్యాణి దన్త కేశ నభాని చ | అష్ఠమీం చ తథా షష్టీం నవమీం చ చతుర్ధశీమ్‌ ||

శిరోభ్యంగం న కుర్వీత పర్వసంధౌ తధైవ చ | తధైవా మలక స్నానం సప్తమీషు వివర్జయే త్‌ ||

వినాతు సతతం స్నానంన స్నాయా ద్ధశమీషు చ | అమావస్యాం సురార్బాసు నవ వస్త్రం నధారయేత్‌ ||

నచ భౌమదినే రామః తేష్వన క్తేషు చాప్యథ | సావిత్రం రోహిణం మైత్ర మాదిత్యం తిష్య మాశ్వినమ్‌ ||

ఉత్తరా త్రితయం చిత్రా వాయవ్యం వసుదైవతమ్‌ | ఇంద్రాగ్ని దైవతం పౌష్ణం తావి శస్తాని నిర్దిశేత్‌ ||

నక్షత్రాణా మధైతేషాం ముహూర్తా శ్చ హిత ప్రదాః | పరద్రోహం తథా హింసాం ప్రయత్నేన వవర్జయేత్‌ ||

శ్రవణ, శతభిష, త్వష్ణృదేవతాకము హస్త, ధనిష్ఠ, స్వాతి, జ్యేష్ఠ, రేవతి, చిత్ర, అశ్వని, అనూరాధ, పునర్వసు, పుష్యమి వీనిని శంఖ చక్ర గణమందురు. ఈనక్షత్రముహూర్తములు హిత ప్రదములు. ఆది, శని, మంగళవారములు రిక్త ఆధులు, పాడ్యమి, షష్ఠియు క్షురకర్మకువిడువదగినవి. జన్మనక్షత్రముకూడ పనికిరాదు. సోముడు జన్మ నక్షత్రగతుడైనపుడు శిరస్నానముచేసి సోమునికి, తన నక్షత్రమును పూజచేయవలెను. ప్రయత్నముతో శ్రాద్దము, అగ్ని బ్రాహ్మణ పూజనము వాహనాయుభ ఛత్రాది పూజయు దేవతల యర్చనము, విశేషించి కేవార్చనము చేయనగును. శిరస్నాతుడై చక్కగ నలంకరించుకొనిదన్త కేశనఖములను నిర్మలముగ చేసికొననగును. అష్టమి, షష్టి, నవమి, చతుర్ధశి తిధులలోను, పర్వసంధి యందును, శిరోభ్యంగము చేసికొనరాదు. ఆమలక (విసిరికాయ) స్నానము సప్తమియందు చేయరాదు. నిరస్తరము స్నానము చేయని వాడు దశమినాడు కూడ చేయరాదు. అమావాస్య నాడును, దేవతా పూజలందును నూతన వస్త్రధారణ చేయరాదు. మంగళవారమునందు ధరించరాదు. పసుపు రాయకుండ ధరించరాదు. హస్త రోహీణి, అనూరాధ, పునర్వసు, పుష్యమి, అశ్వని, ఉత్తర, ఉతరాషాఢ, ఉత్తరాభాద్ర చిత్ర స్వాతి, ధనిష్ట, విశాఖ రేవతి, ఇవి నూతన వస్త్రధారణకు ప్రశస్తములు. ఈ నక్షత ముహూర్తములను హిత ప్రదములు. ఇతరులకు ద్రోహముచేయుట, హింసచేయుట ప్రయత్నపూర్వకముగ విడిచిపెట్టవలెను.

కేశగ్రహాన్‌ ప్రహారాంశ్చ శిర స్యేతాన్‌ తధైవ చ || దూరా దావసధాన్మూత్రం పురీషం చ సముత్సృజేత్‌ ||

పాద ప్రక్షాళనం చైవభిన్న భాండాదికం చ యత్‌ | సర్వ మేతత్త్యజే త్రాజ్ఞో యేనస్యా ధరిమర్దనమ్‌ ||

తండులోదక నిక్షేపం విపరీతం తు కారయేత్‌ | తధైక మనసా కార్యం దేవతానాం చ పూజనమ్‌ || 80

వహ్ని సంపూజనం చైవ న చాస్నాతేన భార్గవ | మాల్యాను లేపనాదీని న ప్రపద్యాత్తు కస్యచిత్‌ ||

అన్యే చ దేవతా విప్ర గురుణాం భృగునందన| కోవిదార గణశాకం చతుర్థీం పిప్పలీం తథా ||

వర్జయేత్‌ (మధు) మాంసం చ సుఖార్థీ సర్వమేవ తు | రాజ ద్విష్టం నకర్తవ్యం విరోధం చ మహాజనైః ||

శుష్కవైరం వివాదం చ ప్రయత్నేన విసర్జయేత్‌ | న వసేచ్చ తథాం వాసం వాస్తు విద్యా విగ్యర్హితమ్‌ ||

ఆగారాదాఖుఘాతాత్‌ చ పరోచ్ఛిష్టాం తధైవ చ | ఊషరా చ్చైవ వల్మీకాత్‌ మృదం శౌ చే వివర్జయేత్‌ ||

యనే చ్ఛే ద్విపులాం ప్రీతిం తేన సార్ధ మరిందమ! | న కుర్యా దర్థ సంబంధం దార సందర్శనం తధా||

ఆత్మాభిష్టవనం నిందాం పరస్య చ వివర్జయేత్‌ | ధృఢ భక్తో భ##వే న్నిత్యం కృతజ్ఞ శ్చ విశేషతః || 87

ఇంద్రియాణాం జయే యోగ మాతిష్ఠేచ్చ సదా నరః | ఇంద్రియాణాం జయా చ్చైవ లోకయో స్సుఖ మాప్నుయాత్‌ ||

అభిగత్వా తు ధర్మజ్ఞో యోగ క్షేమార్థ మీశ్వరమ్‌ | గృహం ప్రవిశ్య కుర్వీత స్వాధ్యాయం సతతం బుధః ||

అర్థ లాభేపి మహతి స్వాధ్యాయం న సముత్సృజేత్‌ | కులాన్య కులతాం యాన్తి స్వాధ్యాయస్య వివర్జనాత్‌ || 90

యస్తు వర్షశతం పూర్ణం త్వరణ్య తపతే తపః | ఋచ మేకాం చ యో ధ్యేతి సమౌ స్యాతాం న చాథికః ||

స్వాధ్యాయాన న్తరం స్నాతః కృతజప్యః సమాహితః

సంపూజనం దేవ వరస్య కుర్యాత్‌ తస్యాప్రమేయస్య జనార్ధనస్య |

సంపూజనా ద్యస్య సమస్త యజ్ఞైః కృతై ఫలం శీఘ్ర మవాప్ను వన్తి ||

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయ ఖండే ఆచారాధ్యాయోనామ ఏకోన నవతి తమోధ్యాయః || 89

జుట్టు పట్టుకొనుట తలమీద గొట్టుట మానవలెను. ఇంటికి చాల దూరముగా మూత్ర పురీషోత్సర్జనము పాదములం కడుగుకొనుట, సేయవలెను. పగిలిన కుండలు మున్నగువానిని ప్రాజ్ఞుడు త్యజింపవలయును. దాన శత్రు నాశనమగును. బియ్యము కడుగు నీరు పెడగా నుంచవలెను. ఏకాగ్ర బుద్ధితో దేవతార్చన అగ్న్యుపాసన చేయవలెను. స్నానము సేయకుండ పూలమాలలు గంధము నీయరాదు. దేవబ్రాహ్మణ గురువులయొక్క ప్రసాదరూపములైన మాల్య గంధాదులను మరియితర ప్రసారములను స్నానము చేయకుండ నెవ్వరికీనీయరాదు. సుఖమును గోరినవాడు మధుమాంసములను కోవిదారం = రక్తకాంచనమును గణమును శాకమును పిప్పలిని విడువ వలెను. రాజుతో మహాజనులతో దగవు పెట్టకోరాదు. శుష్క (పనిలేని) వైరము శుష్కవిషాదము (ఏడుపు) విడువవలెను. వాస్తు శాస్త్రమనుసరించి కట్టని యింట నివసింపరాదు. శౌచమునకై ఇంటిలో నెలుకలు త్ర్వవ్వినది, ఉచ్ఛిష్టమైనది ఊషరభూమిలోనిది, పుట్టలోనిదియునగు మట్టిని విడిచిపెట్టవలెను. ఎవనితో మిక్కిలి ప్రీతిగా నుండగోరునో వానితో నర్ధసంబంధము (డబ్బువ్యవహారము) పెట్టుకోరాదు. వాని భార్యను జూడరాదు.

ఆత్మస్తుతిని పరనిందయు మానవలెను. నిత్యము ధృఢ భక్తి గలవాడగుచు కృతజ్ఞుడునై యుండవలెను. ఎల్లపుడు నింద్రియములనదుపులో బెట్టుకనుటకై యోగము ననుష్ఠించవలయును. ఇద్రియజయము వలన నిహపరలోకములందు సుఖమొందును. గృహముచేరి నిత్యము సాధ్యాయమొనరింప వలెను. గొప్ప ధన లాభము న్నను స్వాధ్యాయము మానుట తగదు. ధర్మజ్ఞుడు యోగ క్షేమముల కొరకు భగవంతునినాశ్రయించ స్వాధ్యాయమువలన కులము లకునుములను. (కులభ్రష్టులగుదురు) నూరేండ్లడవిలో తపస్సు చేసినవాడును, ఒక్క బుక్కను అధ్యయనము చేసిన యాతడును సములే, స్వాధ్యాయము చేసిన తర్వాత స్నానముచేసి జపముచేసి యింద్రియములం గుదుటబెట్టుకొని దేవ దేవుని అప్రమేయని జనార్దనుని బూజింపవలెను. విష్ణు పూజనముచేసి సర్వయజ్ఞ ఫలమును వెనువెంటనే పొందును.

ఇది ఆచారాధ్యాయమను నెనుబది తొమ్మిదవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters