sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణము ప్రథమ ఖండము - ప్రకృతి ఖండము ప్రథమోZధ్యాయః అనుక్రమణిక (జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం | ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ముపాస్మహే||) అథబ్రహ్మవైవర్తే బ్రహ్మఖండం - బ్రహ్మవైవర్తపురాణములోని బ్రహ్మ, ప్రకృతి, గణపతి, శ్రీకృష్ణ జన్మఖండములనే నాలుగు ఖండములలో బ్రహ్మఖండము ప్రారంభింపబడుతున్నది. గణశ బ్రహ్మేశ సురేశ శేషా: సురాశ్చ సర్వే మనవో మునీంద్రా:| సరస్వతీ శ్రీగిరిజాది కాశ్చ యం నమంతి దేవ్య: ప్రణమామితం విభుం స్థూలస్తనూర్విదధతం త్రిగుణం విరాజం విశ్వాని లోమవివరేషు మహాంతమాద్యం| సృష్ట్యున్ముఖ: స్వకలయాపి ససర్జసూక్ష్మం నిత్యం సమేత్య హృది య స్తమజం భజామి|| ధ్యాయంతో ధ్యాన నిష్ఠా: సురనరమనవో యోగినో యోగరూఢాః| సంతః స్వప్నేZపి సంతం కతికతిజనిభిర్యం న పశ్యంతి తప్త్వా| ధ్యాయే స్వేచ్ఛామయం తం త్రిగుణపరమహో నిర్వికారం నిరీహం| భక్త్యా ధ్యానైకహేతోర్నిరుపమ రుచిరశ్యామ రూపం దధానం|| వందే కృష్ణం గుణాతీతం పరం బ్రహ్మాచ్యుతం యతః | ఆవిర్బభూవుః ప్రకృతి బ్రహ్మ విష్ణు శివాదయః || గణపతి, బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, ఆదిశేషుడు మొదలైన దేవతలు, మనువు మొదలైన మహర్షులు, శ్రీదేవి, పార్వతి, సరస్వతి మొదలైన స్త్రీదేవతలు ఎవరిని ఎల్లప్పుడు నమస్కరింతురో ఆ శ్రీకృష్ణుని నమస్కరింతును. త్రిగుణ స్వరూపుడు, మహత్స్వరూపుడు, ఆద్యుడైన శ్రీకృష్ణుడు సృష్టిచేయదలిచి తన రోమకూపములలో సమస్తలోకములను, స్థూలశరీరములను ఏర్పరుస్తూ తన మాయతో సూక్ష్మస్వరూపాన్ని కూడ సృష్టించినాడు. అట్టి పరబ్రహ్మరూపియైన శ్రీకృష్ణుని సదా నా మనస్సులో ధ్యానింతును. ధ్యానైక నిష్ఠులైన దేవతలు, మునులు, మానవులు, యోగులు, ఏ పరమేశ్వరుని ఎల్లప్పుడు ధ్యానించినా, ఎన్ని జన్మలకైనా స్వప్నంలో కూడా అతనిని చూడలేకపోతున్నారో, త్రిగుణాతీతుడు, నిర్వికారుడు, కోరికలు ఏ మాత్రము లేని ఆ పరమపురుషుడు భక్తులు ధ్యానించుకొనుటకు అనుకూలముగా మిక్కిలి సుందరమైన నల్లని రూపును ధరిస్తున్నాడు. స్వేచ్ఛామయుడైన శ్రీకృష్ణదేవుని భక్తితో ధ్యానింతును. బ్రహ్మ, అచ్యుతాదులకన్నా విశిష్టుడు త్రిగుణాతీతుడు ఐన ఆ శ్రీకృష్ణ పరబ్రహ్మమునుండి ప్రకృతి, బ్రహ్మ, విష్ణువు, శివుడు మొదలగువారు ఉద్భవించిరి. ఆ శ్రీకృష్ణ తత్వమును నేను నమస్కరింతును. ఓం నమో భగవతే వాసుదేవాయ - భగవంతుడగు వాసుదేవునికి నమస్కారము. నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం | దేవీం సరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్ || అమృతపరమపూర్వం భారతీకామధేనుం | శ్రుతిగణ కృతవత్సో వ్యాసదేవో దుదాహ || అతిరుచిర పురాణం బ్రహ్మవైవర్తమేతత్ | పిబత పిబత ముగ్ధా దుగ్ధ మక్షయ్య మిష్టం || నారాయణుని, నరుడనేమునిని, సరస్వతిని వ్యాసుని నమస్కరించి ''జయ'' శబ్దము చేయవలెను. శ్రీవేదవ్యాసుడు వేదములను దూడగా ఒనర్చి, భారతి అను కామధేనువును పితుకగా వచ్చిన అపూర్వము, అమృతమయము, పురాణములలో కడు ఇంపైన బ్రహ్మవైవర్త పురాణమనే క్షయములేని పాలను కడు ఇష్టముగా త్రాగుడు. భారతే నైమిషారణ్య ఋషయః శౌనకాదయః | నిత్యాం నైమిత్తికీం కృత్వా క్రియా మూషుః కుశాసనే || 1 భరతఖండములోని నైమిశారణ్యములో శౌనకాదిమహర్షులు నిత్య నైమిత్తిక క్రియలు పూర్తిచేసికొని దర్భాసనములో కూర్చొని ఉండిరి. ఏతస్మిన్నంతరే సౌతిమాగచ్ఛంతం యదృచ్ఛయా | ప్రణతం సువినీతం తం విలోక్య దదురాసనం || 2 తం సంపూజ్యాతిథిం భక్త్యా శౌనకో మునిపుంగవః | పప్రచ్ఛకుశలం శాంతం శాంతః పౌరాణికం ముదా || 3 వర్త్మాయాసవినిర్ముక్తం వసంతం సుస్థిరాసనే | సస్మితం సర్వతత్వజ్ఞం పురాణానాం పురాణవిత్ || 4 పరం కృష్ణకథోపేతం పురాణం శ్రుతిసంమతం | మంగళం మంగళార్హంచ మాంగళ్యం మంగళాలయం || 5 సర్వమంగళబీజం చ సర్వదా మంగళప్రదం | సర్వామంగళనిఘ్నంచ సర్వసంపత్కరం పరం || 6 హరిభక్తిప్రదం శశ్వత్సుఖదం మోక్షదం భవాత్ | తత్వజ్ఞానప్రదం దారపుత్రపౌత్ర వివర్ధనం || 7 పప్రచ్ఛ సువినీతం చ సుప్రీతో మునిసంసది | యథాకాశే తారకాణాం ద్విజరాజో విరాజతే || 8 ఆ సమయములో అనుకొనకుండా అక్కడికి వచ్చిన సౌతిని (సూతమహర్షి వంశజుడైన రోమహర్షణి మహర్షిని) చూచి శౌనకాదిమునులు ఆసనమునిచ్చిరి. (పృథుచక్రవర్తి యజ్ఞములు చేయుచున్నప్పుడు శ్రీమహావిష్ణువే సూతుడనే పేరుతో పురాణకథలను చెప్పినట్లు, అతని వంశమున పుట్టిన వారినందరిని సూతుడనే పేరుతోనే పిలుస్తున్నట్లు బ్రహ్మాండ పురాణము తెల్పుచున్నది. వ్యాసమహర్షి శిష్యులలో ఒకడైన రోమహర్షణిముని పురాణముల నన్నిటిని శౌనకాది మహర్షులకు వినిపించినాడు.) అతిథిగా వచ్చిన ఆ సౌతిమునిని శౌనక మహర్షి గౌరవించి ఇట్లు కుశలప్రశ్న వేసినాడు. మార్గాయాసము తొలగిన పిమ్మట స్థిరాసనమున ఉన్నవాడు, సమస్త తత్వములు తెలిసినవాడు, ప్రాచీనములైన పురాణములన్ని తెలిసిన ఆ సౌతిమహర్షిని మునుల సభలో శౌనకముని ఈవిధముగా ప్రశ్నించినాడు. సమస్తశ్రుతి సమ్మతము, మంగళప్రదము అమంగళములనన్నిటిని తొలగించునది, సమస్త సంపదలను కలిగించునది, హరియందు భక్తిని, శాశ్వత సుఖములను, మోక్షమును, తత్వజ్ఞానమును కలిగించునది, భార్యాపుత్రపౌత్ర సంపదనభివృద్ధిచేయునది, కృష్ణకథా సమన్వితమైన పురాణమును వినగోరి ఆకాశమునందున్న తారకలలో చంద్రునివంటి శౌనకమహర్షి ఇట్లు అడిగెను. శౌనక ఉవాచ - శౌనకమహర్షి ఇట్లు పలికెను. ప్రస్థానం భవతః కుత్ర కుత ఆయాసి తే శివం | కిమస్మాకం పుణ్యదినమద్య త్వద్దర్శనేనచ || 9 వయమేవ కలౌ భీతా విశిష్టజ్ఞానవర్జితాః | ముముక్షువో భ##వే మగ్నా స్తద్ధేతు స్త్వమిహాగతః || 10 భవాన్ సాధుర్మహాభాగః పురాణషు పురాణవిత్ | సర్వేషు చ పురాణషు నిష్ఠాతోzతికృపానిధిః || 11 శ్రీకృష్ణే నిశ్చలాభక్తిర్యతో భవతి శాశ్వతీ | తత్కథ్యతాం మహాభాగ పురాణం జ్ఞానవర్ధనం || 12 గరీయసీ యా సాక్షాచ్చ కర్మమూల నికృంతనీ | సంసారసన్నిబద్ధానాం నిగడచ్ఛేదకర్తరీ || 13 భవదావాగ్ని దగ్ధానాం పీయూషవృష్టివర్షిణీ | సుఖదానందదా సౌతే శశ్వచ్చేతసి జీవినాం || 14 మీరు ఎచ్చటికి వెళ్ళుచున్నారు. ఎక్కడినుండి వచ్చుచున్నారు. మీకు మంగళమగుగాక. మీదర్శనమువలన మాకు ఈ దినము సుదినము. మేము విజ్ఞాన రహితులము. సంసారసాగరమున మునిగి ఉన్నాము. కలియుగములో ఉన్నందువలన కలియుగ ధర్మములనుండి భయపడి మోక్షమును కోరి ఉన్నాము. మీరు మమ్ము సుజ్ఞానులచేసి మోక్షము కలిగించుటకు ఇచ్చటికి వచ్చియున్నారు. మీరు సాధువులు శ్రేష్ఠులు. సమస్తపురాణములను ఎఱిగినవారు. మిక్కిలి దయగలవారు. ఏ పురాణశ్రవణమువలన కర్మబంధాలను సమూలముగా నిర్మూలము చేయగల్గినది, సంసారబద్ధులైనవారి సంకెళ్ళను ఛేదించగల్గినది, సంసారమనే కారుచిచ్చునబడి దగ్ధమగుచున్నవారిపై అమృతవర్షాన్ని వర్షించునది, ఆనందమును, సుఖమును ఎల్లప్పటికి కల్గించునది ఐన శ్రీకృష్ణభక్తి కలుగునో ఆ పురాణమును మాకు చెప్పగలరని ప్రార్థన. యత్రాదౌ సర్వబీజం చ పరం బ్రహ్మ నిరూపణం | తస్య సృష్ట్యున్ముఖస్యాzపి సృష్టేరుత్కీర్తనం పరం || 15 సాకారం వా నిరాకారం పరమాత్మ స్వరూపకం | కిమాకారం చ తద్బ్రహ్మ తద్ధ్యానం కిం చ భావనం || 16 ధ్యాయంతే వైష్ణవాః కిం వా శాంతాశ్చ యోగినస్తథా | మతం ప్రధానం కేషాం నా గూఢం వేదే నిరూపితం || 17 ప్రకృతేశ్చ య ఆకారో యత్రవత్స నిరూపితః | గుణానాం లక్షణం యత్ర మహదాదేశ్చ నిశ్చయః || 18 గోలోక వర్ణనం యత్ర యత్ర వైకుంఠ వర్ణనం | వర్ణనం శివలోకస్య యత్రాన్యత్ స్వర్గవర్ణనం || 19 అంశానాం చ కలానాం చ యత్ర సౌతే నిరూపణం | కే ప్రాకృతాః కా ప్రకృతిః క ఆత్మా ప్రకృతేః పరః || 20 నిగూఢం జన్మ యేషాం వా దేవానాం దేవయోషితాం | సముత్పత్తిః సముద్రాణాం శైలానాం సరితామపి || 21 కేవాంశాః ప్రకృతేశ్చాపి కలాః కా వా కలాకలాః | తాసాంచ చరితం ధ్యానం పూజాస్తోత్రాదికం శుభం || 22 దుర్గా సరస్వతీ లక్ష్మీ సావిత్రీణాం చ వర్ణనం | యత్రైవ రాధికాఖ్యానం అత్యపూర్వం సుధోపమం || 23 జీవకర్మవిపాకశ్చ నరకాణాం చ వర్ణనం | కర్మాణాం ఖండనం యత్ర యత్ర తేభ్యో విమోక్షణం || 24 యేషాంచ జీవినాం యద్యత్ స్థానం యత్ర శుభాశుభం | జీవినాం కర్మణో యస్మాద్యాసు యాసు చ యోనిషు || 25 జీవినాం కర్మణో యస్మాద్యో యో రాగో భ##వేదిహ | మోక్షణం కర్మణో యస్మాత్తేషాం చ తన్నిరూపయ || 26 ఏ పురాణమున తొలుత సమస్తమునకు కారణమైన 'బ్రహ్మ' నిరూపణము, చరాచర జగత్తును సృష్టించ దలచిన ఆ పరబ్రహ్మయొక్క సృష్టి వివరణ, సాకారము, నిరాకారము ఐన ఆ పరమాత్మస్వరూపము, ఆ పరమాత్మను ధ్యానము చేయువిధము, వైష్ణవులు, యోగులు ఎవని ధ్యానింతురో, వేదప్రోక్తమైన వారి మతము, ప్రకృతి స్వరూపము, సత్వరజస్తమోగుణముల లక్షణము, పృథివి మొదలగు పంచభూతములు, వాటి తన్మాత్రలు, మహత్తు మొదలైనవాటి వివరణ, గోలోక వర్ణన, వైకుంఠవర్ణన, శివలోక వర్ణన, ఇంకను స్వర్గలోక వర్ణన, ప్రాకృతులు, ప్రకృతికన్న భిన్నమైన ఆత్మస్వరూప వివరణ, దేవతలు, దేవతాస్త్రీలు, సముద్రములు, పర్వతములు నదులయొక్క ఉత్పత్తి, దుర్గ, లక్ష్మి, సావిత్రి, సరస్వతుల వర్ణన, వారి ధ్యానము, పూజాస్తోత్రాదికములు, అమృతప్రాయమైన రాధాదేవి చరిత్ర, నరక వర్ణన, జీవులు ఏ ఏ స్థానములందుందురో ఆయాస్థాన వర్ణన, జీవులు తాము చేయు శుభాశుభ కర్మలననుసరించి ఏ ఏ యోనులలో పుట్టునో, ఏ ఏ రోగముల పొందునో, ఆ యా కర్మలనుండి మోక్షము పొందు విధము, చెప్పబడిన ఆ పురాణమును మాకు విపులముగా తెలుపుడు. మనసా తులసీ కాళీ గంగా పృథ్వీ వసుంధరా | ఆసాం యత్ర శుభాఖ్యాన మన్యాసామపి యత్రవై || 27 శాలిగ్రామశిలానాంచ దానానాంచ నిరూపణం | అపూర్వం యత్రవా సౌతే ధర్మాధర్మ నిరూపణం || 28 గణశ్వరస్య చరితం యత్ర తజ్జన్మ కర్మ చ | కవచస్తోత్రమంత్రాణాం గూఢానాం యత్ర వర్ణనం || 29 యదపూర్వముపాఖ్యానం అశ్రుతం పరమాద్భుతం | కృత్వా మనసి తత్సర్వం సాంప్రతం వక్తుమర్హసి || 30 మనస, తులసి, కాళి, గంగ, పృథివి, ఇంకను ఇతర దేవతల కథలు, శాలిగ్రామ శిలలగూర్చి, వాటిని దానము చేయుటవలన కలుగు ఫలితములు, ధర్మాధర్మముల వివరణ, గణపతి చరిత్ర, కవచము, స్తోత్రములు, నిగూఢమైన మంత్రములు మొదలగువాని వివరణ, ఇంతవరకు ఎన్నడు విననివి, అపూర్వము, అత్యద్భుతమైన ఉపాఖ్యానములు ఏ పురాణమున కలవో ఆపురాణమునంతయు మాకు చెప్పవలసినది. యత్ర జన్మ భ్రమో విశ్వే పుణ్యక్షేత్రే చ భారతే | పరిపూర్ణతమస్యాపి కృష్ణస్య పరమాత్మనః || 31 జన్మ కస్య గృహేలబ్ధం పుణ్య పుణ్యవతో మునే | సుతం ప్రసూతా కా ధన్యా మాన్యా పుణ్యవతీ సతీ || 32 ఆవిర్భూయ చ తద్గేహాత్ క్వా గతః కేన హేతునా | గత్వా కిం కృతవాంస్తత్ర కథం వా పునరాగతః || 33 భారావతరణం కేన ప్రార్థితో గోశ్చకార సః | విధాయ కిం వా సేతుం చ గోలోకం గతవాన్పునః || 34 ఇతీద మన్య దాఖ్యానం పురాణం శ్రుతి దుర్లభం | దుర్విజ్ఞేయం మునీనాం చ మనోనిర్మలకారణం || 35 స్వాజ్ఞానాద్యన్మయా పృష్టం అపృష్టం వా శుభాశుభం | సద్యోవైరాగ్య జననం తన్మే వ్యాఖ్యాతు మర్హసి || 36 భారతదేశమందలి ఏ పుణ్యక్షేత్రమున పరమాత్మయైన శ్రీకృష్ణుడు జన్మించినాడో, ఏపుణ్యవంతుని పవిత్రమైన గృహమున ఆ పరమాత్మ పుట్టినాడో, పూజనీయురాలు, సతి అగు ఏ పుణ్యవతి ఆతనిని కన్నదో, ఆ పరమాత్మ జన్మించిన స్థలమునుండి ఏకారణమున బయటికి వెళ్ళెనో, అచ్చట ఏఏ కార్యములు చేసెనో, మరల ఎట్లు తాను పుట్టినచోటికి తిరిగి వచ్చెనో, ఎవరి ప్రార్థనవల్ల భూ భారమును తగ్గించెనో, ఏఏ కార్యములు చేసి తిరిగి గోలోకమునకు వెళ్ళెనో శ్రుతి దుర్లభము, మునులకు సైతం తెలియరానిది, మనస్సును తేలికపరచు ఈ కథను, ఇతర కథలను తెలిసి తెలియక నేను అడిగిన వాటిని, అడుగని వాటిని సద్యో వైరాగ్యమునిచ్చు ఆ పరమాత్మ కథలను విపులముగా వ్యాఖ్యానించగలరు. శిష్యపృష్టమపృష్టం వా వ్యాఖ్యానం కురుతేచ యః | స సద్గురుః సతాంశ్రేష్ఠో యోగ్యాయోగ్యే చ యస్సమః || 37 యోగ్యాయోగ్య విషయములయందు ఎవరు సమదృష్టి కలిగిఉందురో, శిష్యులు అడిగినా, అడుగక పోయినా వారికి అవసరమైన విషయములను వ్యాఖ్యాన పూర్వకముగా ఎవరు తెల్పుదురో అతడు సజ్జనశ్రేష్ఠుడు. సద్గురువు. సౌతిరువాచ - సౌతిమహర్షి ఇట్లు పలికెను. సర్వం కుశలమస్మాకం త్వత్పాదపద్మ దర్శనాత్ | సిద్ధక్షేత్రాదాగతోహం యామి నారాయణాశ్రమం || 38 దృష్ట్యా విప్రసమూహం చ నమస్కర్తుమిహాగతః | ద్రష్టుం చ నైమిషారణ్యం పుణ్యదం చాపి భారతే || 39 శౌనకమహర్షీ! మీ పాదపద్మములను దర్శించుటచేత మేము కుశలముగా ఉన్నాము. నేను సిద్ధక్షేత్రమునుండి నారాయణ క్షేత్రమైన బదరికా వనమునకు పోవుచున్నాను. భరతఖండమున పుణ్యప్రదమైన నైమిషారణ్యమును చూచుటకు ఇచ్చటికి వచ్చితిని. ఇచ్చటి విప్ర సమూహమును చూచి నమస్కరించు భావనతో వచ్చితిని. దేవం విప్రం గురుం దృష్ట్యా న నమేద్యస్తు సంభ్రమాత్ | సకాలసూత్రం వ్రజతి యావచ్చంద్ర దివాకరౌ || 40 హరిర్బ్రాహ్మణ రూపేణ శశ్వద్భ్రమతి భూతలే | సుకృతీ ప్రణమేత్ పుణ్యాత్ బ్రాహ్మణం హరిరూపిణం || 41 తొందరపాటువలన దేవతలను, విప్రులను గురువును చూచి ఎవడు నమస్కరించడో అతడు సూర్యచంద్రులున్నంతవరకు నరకమున ఉండును. శ్రీమన్నారాయణుడు బ్రాహ్మణ రూపమున భూమిపై సంచరించును. కావున పుణ్యవంతుడు హరిరూపమున ఉన్న బ్రాహ్మణుని తప్పక నమస్కరించవలెను. భగవన్ యత్త్వయా పృష్టం జ్ఞాతం సర్వమభీప్సితం | సారభూతం పురాణషు బ్రహ్మవైవర్తముత్తమం || 42 పురాణోపపురాణానాం వేదానాం భ్రమ భంజనం | హరిభక్తిప్రదం సర్వతత్వజ్ఞాన వివర్ధనం || 43 కామినాం కామదం చేదం మముక్షూణాం చ మోక్షదం | భక్తిప్రదం వైష్ణవానాం కల్పవృక్ష స్వరూపకం || 44 పూజ్యుడా! మీ అభీప్సితము నాకు బాగుగా తెలిసినది. మీరడిగినవన్నియు బ్రహ్మవైవర్త పురాణమున కన్పించును. ఆ పురాణము, పురాణములకన్నిటికి సారభూతమైనది. అది పురాణ, ఉపపురాణములు వేదములయందు మనకున్న సంశయములను పోగొట్టును. కోరినవారికి ఐహికకామములను, మోక్షార్థులకు మోక్షమును, వైష్ణవులకు భక్తిని కల్పవృక్షమువలె అది ఇచ్చును. బ్రహ్మఖండం సర్వబీజం పరబ్రహ్మనిరూపణం | ధ్యాయంతే యోగినః సంతో వైష్ణవా యత్పరాత్పరం || 45 వైష్ణవా యోగినః సంతో న చ భిన్నాశ్చ శౌనక | స్వాజ్ఞానపరిపాకేన భవంతి జీవినః క్రమాత్ || 46 సంతో భవంతి సత్సంగాత్ యోగిసంగేన యోగినః | వైష్ణవా భక్తసంగేన క్రమాత్ సద్యోగినః పరాః || 47 బ్రహ్మవైవర్తపురాణము నాలుగు ఖండములుగా విభజింపబడినది. వాటిలో తొలిఖండమైన బ్రహ్మఖండమున యోగులు, సంతులు, వైష్ణవులు ఏ పరమాత్మను నిత్యము ధ్యానింతురో, సమస్త సృష్టికి కారణభూతమైన ఆ పరమాత్మ నిరూపణము చేయబడినది. సంతులు, యోగులు, వైష్ణవులు ముగ్గురు వేరువేరని తలపరాదు. వారివారి అజ్ఞాన పరిపాకమువలన జీవులు మూడువిధములగా పేర్కొనబడుచున్నారు. సత్సంగము చేసినవారిని సంతులని, యోగులతో కలిసిఉన్నవారిని యోగులని, భక్తులతో కలిసి తిరుగువారిని వైష్ణవులని చెప్పుదురు. యత్రోద్భవశ్చ దేవానాం దేవీనాం సర్వజీవినాం | తతః ప్రకృతి ఖండే చ దేవీనాం చరితం శుభం || 48 జీవకర్మవిపాకశ్చ శాలిగ్రామ నిరూపణం | తాసాం చ కవచస్తోత్రమంత్రపూజానిరూపణం || 49 ప్రకృతేర్లక్షణం తత్ర కళాంశానాం నిరూపణం | కీర్తే రుత్కీర్తనం తాసాం ప్రభావశ్చ నిరూపితః || 50 సుకృతీనాం దుష్కృతీనాం యద్యత్ స్థానం శుభాశుభం | వర్ణనం నరకాణాం చ రోగాణాం మోక్షణం తతః || 51 రెండవఖండమైన ప్రకృతి ఖండములో దేవతలు, సమస్తజీవుల జన్మవృత్తాంతము దేవతా కవచములు, స్తోత్రములు, మంత్రములు పూజచేయు పద్ధతి, జీవుల కర్మవిపాకము, శాలిగ్రామములు, ప్రకృతి యొక్కలక్షణము, పుణ్యవంతులు, పాపులు పొందు శుభాశుభస్థానములు, నరక వర్ణన, రోగములు, వాటి నివారణ రీతులు చెప్పబడినవి. తతోగణశఖండే చ తజ్జన్మ పరికీర్తితం | అతీవాపూర్వచరితం శ్రుతివేద సుదుర్లభం || 52 గణశ భృగుసంవాదే సర్వతత్వ నిరూపణం | నిగూఢ కవచస్తోత్ర మంత్రతత్వనిరూపణం || 53 తృతీయ ఖండమైన గణశఖండమున అపూర్వము, వేదములయందు చెప్పబడని గణపతి చరిత్ర వర్ణించబడినది. అందలి గణశ భృగుసంవాదమున సమస్త తత్వనిరూపణ, గణపతియొక్క కవచము, స్తోత్రములు, మంత్రముల వివరణ కన్పించును. శ్రీకృష్ణ జన్మఖండం చ కీర్తితం చ తతః పరం భారతే పుణ్యక్షేత్ర చ శ్రీకృష్ణ జన్మకర్మ చ || 54 భువో భారావతరణం క్రీడా కౌతుక మంగళం | సతాం సేతువిధానం చ జన్మఖండే నిరూపితం || 55 చివరిదైన శ్రీకృష్ణజన్మ ఖండమున శ్రీకృష్ణుని జన్మవృత్తాంతము, భూమియొక్క భారమును తగ్గించుటకు అతడు చేసిన క్రీడలు సజ్జనులకు ఆతడు చేసిన మంగళ కార్యములు వర్ణింపబడినవి. ఇదం తే కథితం విప్ర పురాణప్రవరం పరం | చతుః ఖండైః పరిమితం సర్వధర్మనిరూపణం || 56 సర్వేషా మీప్సితం శ్రీదం సర్వాశాపూర్ణ కారణం | బ్రహ్మ వైవర్తకం నామ సర్వాభీష్ట ఫలప్రదం || 57 సారభూతం పురాణషు కేవలం వేదసంమితం | వివృతం బ్రహ్మ కార్త్స్మయం చ కృష్ణేన యత్ర శౌనక || 58 బ్రహ్మ వైవర్తకం తేన ప్రవదంతి పురావిదః | శౌనకమహర్షీ! ఈ బ్రహ్మవైవర్త పురాణము సమస్త ధర్మముల నిరూపించునది, బ్రహ్మఖండము మొదలైన నాలుగు ఖండములతో కూడుకున్నది, అందరికోరికలను తీర్చునది, సంపత్కరము. ఈ పురాణము సమస్త పురాణముల సారభూతము, వేద సమ్మితముకూడ. ఇందు శ్రీకృష్ణునిచేత బ్రహ్మస్వరూపమంతయు వివరించబడి ఉన్నందున దీనిని బ్రహ్మవైవర్తమని ప్రాచీనులు చెప్పుచున్నారు. ఇదం పురాణసూత్రం చ పురాదత్తం చ బ్రహ్మణ || 59 నిరామయే చ గోలోకే కృష్ణేన పరమాత్మనా | మహాతీర్థే పుష్కరే చ దత్తం ధర్మాయ బ్రహ్మణా || 60 ధర్మేణ దత్తం పుత్రాయ ప్రీత్యా నారాయణాయ చ || 61 నారదో వ్యాస దేవాయ ప్రదదౌ జాహ్నవీ తటే | వ్యాసః పురాణసూత్రం తత్సంవ్యస్య విపులం మహత్ || 62 మహ్యం దదౌ సిద్ధక్షేత్రే పుణ్యదేశే మనోహరం | మయేదం కథితం బ్రహ్మన్ తత్సమగ్రం నిశామయ || 63 ఈ పురాణముయొక్క ఆచార్య పరంపర ఈవిధముగా నున్నది. ఈ పురాణము శ్రీకృష్ణపరమాత్మచే గోలోకమున బ్రహ్మదేవునికి ఎఱింగించబడినది. బ్రహ్మదేవుడు పుష్కరతీర్థమున ధర్మునకు దీనిని తెలిపెను. ధర్ముడు బ్రహ్మపుత్రుడైన నారదునకు, నారాయణునకు చెప్పెను. నారదమహర్షి గంగానదీ తీరమున వ్యాసమహర్షికి చెప్పెను. వ్యాసుడు విపులమైన ఈ పురాణమును చక్కగా విభజించి పుణ్య ప్రదేశ##మైన సిద్ధక్షేత్రమున నాకు తెల్పెను. శౌనకమహర్షీ! నేను నీకు ఇప్పుడు దీనిని చెప్పుచున్నాను. ఇట్లు ఆచార్య పరంపరతో కూడుకొని ఉన్న ఈ పురాణమునంతయు శ్రద్ధగా నీవు వినుము. అష్టాదశసహస్రంతు వ్యాసేనేదం పురాణకం | పురాణ కార్త్స్మయ శ్రవణ యత్ఫలం లభ##తేనరః | తత్ఫలం లభ##తే నూనమధ్యాయ శ్రవణన చ || 64 వ్యాసమహర్షిచే 18,000 శ్లోకములతో ఈ పురాణము చెప్పబడినది. (కాని ప్రస్తుతము ఈ పురాణమున 20 వేలకు పైగా శ్లోకములున్నవి. అనగా వ్యాసకృత బ్రహ్మవైవర్తమును సౌతిమహర్షి పెంచి శౌనకాదులకు వివరించినట్లున్నాడు. అందువల్లనే శ్రీ సౌతిమహర్షి వ్యాసకృతమైన బ్రహ్మవైవర్తమును 'పురాణకం' (చిన్నపురాణము) అని అన్నాడు.) పురాణముల నన్నిటిని వినిన ఏ ఫలితము లభించునో ఇందలి ఏ ఒక్క అధ్యాయమును విన్నా అంతటి ఫలితము లభించగలదు. ఇతి శ్రీ బ్రహ్మ వైవర్తే మహాపురాణ సౌతి శౌనక సంవాదే బ్రహ్మఖండే అనుక్రమణికా నామ ప్రథమోzధ్యాయః శ్రీబ్రహ్మ వైవర్త మహాపురాణమున సౌతి శౌనక సంవాదముతో నున్న బ్రహ్మఖండమున అనుక్రమణిక (విషయసూచి) అను ప్రథమాధ్యాయము సమాప్తము.