sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
చతుర్థోzధ్యాయః - పుణ్యక వ్రత విధానము నారాయణా ఉవాచ - నారాయణ మహర్షి నారదమునితో ఇట్లనెనుః శ్రుత్వా వ్రతవిధానం చ దుర్గా సహృష్ట మానసా | సర్వమ్ వ్రతవిధానం చ సంప్రష్టు ముపచక్రమే ||
1 శంకరుడు పుణ్యకవ్రతమును చేయుమని చెప్పగా పార్వతీదేవి విని సంతోషముతో ఆవ్రతవిధానమును చెప్పుమని అడిగెను. పార్వత్యువాచ- పార్వతి ఇట్లు అనెను. సర్వం వ్రతవిధానం మాం వద వేదవిదాం వర | హే నాథ! కరుణాసింధో, దీనబంధో, పరాత్ పర ||
2 కాని వ్రతోపయుక్తాని ద్రవ్యాణి చ ఫలాని చ | సనియమం సభక్ష్యం చ విధానం తత్ఫలం ప్రభో ||
3 దేహి మహ్యం వినీతాయై నియుక్తం సత్పురోహితం | పుష్పోపహారాన్ విప్రాంశ్చ ద్రవ్యాహరణ కింకరాన్ ||
4 అన్యాని చోపయుక్తాని మయాజ్ఞాతాని యానిచ | సన్నియోజయ తత్సర్వం స్త్రీణాం స్వామీ చ సర్వదః ||
5 పితా కౌమారకాలేచ సదా పాలనకారకః | భర్తా మధ్యే సుతః శేషే త్రిథావస్థా సుయోషితాం ||
6 తతోzశోకః ప్రాణతుల్యాం దత్వా సత్స్వామినే సుతాం | స్వామీ నిర్వృతిమాప్నోతి సన్యస్య స్వసుతే ప్రియాం || 7 బంధు త్రయయుతా యా స్త్రీ సా చ భాగ్యవతీ పరా | కించిద్విహీనా మధ్యా చ సర్వహీనాధీమా భువి || 8 ఓమహాదేవా ఈ పుణ్యకవ్రతమును ఎట్లు చేయవలెనో దయాసముద్రుడవు దీనబంధువు పరాత్పరుడవైన నీవు నాకు తెలుపుము. ఈవ్రతమున ఏద్రవ్యములు కావలెను, ఏఫలములు కావలెను, ఎట్టి భక్ష్యములు కావలెను, ఈవ్రతమును ఎట్లు చేయవలెను. దీని ఫలితమునెట్లుండను, అను విషయములను నాకు చెప్పుము. ఇంకను దీనికి ఫలితమెట్లుండును, అను విషయములను గురించి, బ్రాహ్మణుల గురించీ ఈవ్రతమున ఉపయోగించు వస్తువులు అన్నిటిని వాకు వివరించి తెలుపుము. స్త్రీలకు భర్త అన్ని కోరికలను తీర్చును. ఆమెను చిన్నతనమున తండ్రి, పెళ్ళి అయినతరువాత పుత్రుడు ఆమెను రక్షింతురు. మంచి స్త్రీలకు ఇట్టి రక్షణ ఉండును. తండ్రి తన ప్రాణముతో సమానమైన తన కూతురిని దుఃఖపడక మంచిభర్తకు ఇచ్చి సంతోషపడును. అట్లే ఆమెభర్త తన భార్యను తనపుత్రునకు అప్పగించి నిర్వృతి పొందుచున్నాడు. ఇట్లు తండ్రి, భర్త, పుత్రుడు అను ముగ్గురు బంధువులు గల స్త్రీ పరమభాగ్యవతి. ఈ ముగ్గురిలో ఒకరు, ఇద్దరు లేకపోయినచో ఆమె మద్యస్థురాలు. ముగ్గురూ లేనిచో ఆస్త్రీ అధమగా చెప్పబడుచున్నది. ఏతేషాం చ సమీపస్థా ప్రశంస్యాసా జగత్రయే | నిందితాzన్యేషు సంన్యస్తా సర్వమేతచ్ఛృతౌశ్రుతం || 19 సర్వాత్మా భగవాంస్త్వంచ సర్వసాక్షీ చ సర్వవిత్ | దేహి మహ్యం పుత్రవరం స్వాత్మనిర్వృతిహేతుకం || 10 స్వాత్మబోధానుమానేన మహాత్మని నివేదితం | సర్వాంతరాభిప్రాయజ్ఞం బోధజ్ఞం బోధయామి కిం || 11 ఇత్యుక్త్యా పార్వతీ ప్రీత్యా పపాత స్వామినః పదే | కృపా సింధుశ్చ భగవాన్ ప్రవక్తుముపచక్రమే || 12 పైన పేర్కొన్న ముగ్గురు బంధువుల సమీపమునున్న స్త్రీని ముల్లోకములలో ప్రశంసింతురు. ఆ విధముగా కాక ఇతరుల దగ్గరఉన్న స్త్రీని అందురు నిందింతురని వేదమున చెప్పబడినది. నీవు సర్వాత్ముడవు, సర్వసాక్షివి, సమస్తము తెలిసినవాడవు. నాకు సంతోషము కలుగునట్లు మంచిపుత్రుని ప్రసాదింపుము. పెద్దవారికి నా మనసు తెలుసునని ఈ విషయము చెప్పితిని. అయినను నీవు సమస్తప్రాణులయొక్క మనోభావములను తెలిసినవాడవు. చెప్పనేర్చినవాడవు. అట్టినీకు నేనేమి చెప్పుదును. ఇట్లు పార్వతి పరమేశ్వరునితో అని అతని కాళ్ళపై పడినది అప్పుడు దయాసముద్రుడైన ఆ శంకరుడు పార్వతికి ఇట్లు చెప్పసాగెను. శ్రీమహాదేవ ఉవాచ - మహాదేవుడు ఇట్లు పలికెను. శ్రృణు దేవీ ప్రవక్ష్యామి విధానం నియమం ఫలం | ఫలాని చైవ ద్రవ్యాణి వ్రతయోగ్యాని యానిచ || 13 విపాణం శతకం శుద్దం ఫల పుష్పాపహారకం | కింకరాణాం చ శతకం ద్రవ్యాహరణ కారకం || 14 దాసీనాం శతకం లక్షం నియుక్తంచ పురోహితం | సర్వవ్రత విధానజ్ఞం వేదవేదాంతపారగం || 15 ప్రవరం హరిభక్తానాం సర్వజ్ఞం జ్ఞానినాం వరం | సనత్కుమారం మత్తుల్యం గృహాణ వ్రతహేతవే || 16 ఓ పార్వతీ ఈ పుణ్యకవ్రతం ఎట్లు చేయువలెనో ఆవ్రత నియమములెట్లుండునో, దాని ఫలమెట్లుండునో ఆవ్రతమునకు కావలసిన వస్తువులేమిటో చెప్పెదను. ఈవ్రతమునకు వందమంది బ్రాహ్మణులు కావలెను. పరిశుద్ధమైన ఫలములు, పుష్పములు కావలెను. పూజాద్రవ్యములు తెచ్చుటకై వందమంది సేవకులు, కోటిమంది దాసీజనము కావలెను. ఈవ్రతము చేయు పురోహితుడు సమస్తవ్రతములు చేయించువాడై ఉండవలెను. వేద, వేదాంతములు చక్కగా తెలిసినవాడు కావలెను. అందువలన శ్రీహరి భక్తులలో శ్రేష్టుడును, సర్వజ్ఞుడు, జ్ఞానవంతులలో శ్రేష్టుడు, నాతో సమానమైనవాడగు సనత్‌మారుని ఈవ్రతము చేయించుటకు పురోహితునిగా ఎన్నుకొనుము. దేవి శుద్దేచ కాలేచ పరం నియమపూర్వకం | మాఘశుక్ల త్రయోదశ్యాం వ్రతారంభః శుభః ప్రియే || 17 గాత్రం సునిర్మలం కృత్వా శిరస్సంస్కార పూర్వకం | ఉపోష్య పూర్వదివసే వస్త్రం సంశోధ్య యత్నతః || 18 అరుణోదయ వేళాయాం తల్పదుత్థాయ సువ్రతీ | ముఖప్రక్షాళనం కృత్వా స్నాత్వా వై నిర్మలే జలే || 19 అచమ్య యత్నపూతో హి హరిస్మరణ పూర్వకం | దత్వార్ఘ్యం హరయే భక్త్యా గృహమాగత్య సత్వరం || 20 ధౌతేచ వాససీ ధృత్వా హ్యుపవిశ్యాసనే శుచౌ | ఆచమ్య తిలకం ధృత్వా సమాప్య సాహ్నికం పునః || 21 ఓ పార్వతీ పరిశుద్దమైన సమయమున నియమముతో ఈవ్రతమును పూర్తిచేయవలయును. మాఘశుధ్ద త్రయోదశినాడు ఈవ్రతమును చేయుట మంచిది. దానికి ముందునాడు ఉపవాసముండి వస్త్రములను చక్కగా ఉతుకుకొనవలెను. అరుణోదయ సమయమున శయ్య నుండి లేచి ముఖప్రక్షాళన చేసికొని తలంటుకొని నిర్మలమైన నీటియందు స్నానము చేయవలెను. తర్వాత శ్రీహరిని స్మరించుచు ఆచమనము చేసి శ్రీహరికి ఆర్ఘ్యమును ఇచ్చి ఇంటికి రావలెను. ఇంటికి వచ్చిన తర్వాత ఉతికిన బట్టలు కట్టుకుని పరిశుద్ధమైన ఆసనమున కూర్చుని తిలకమును పెట్టుకుని ఆచమనము చేసి ఆహ్నిక కార్యక్రమములన్ని పూర్తిచేయవలెను. ఘటం సంస్ధాప్య విధివత్స్యస్తి వాచనపూర్వకం | పురోహితస్య వరణం పురఃకృత్వా ప్రయత్నతః || 22 సంకల్పం వేదవిహితం వ్రతమేతత్సమాచరేత్ | వ్రతే ద్రవ్యాణి నిత్యాని ఉపచారాస్తు షోడశ || 23 దేయాని నిత్యం దేవేశి కృష్ణాయ పరమాత్మనే | ఆసనం స్వాగతం పాద్యమర్ఘ్యమాచనీయకం || 24 స్నానీయం మధుపర్కం చ వస్త్రాణ్యాభరణాని చ | సుగంధిపుష్పధూపం చ దీపనైవేద్యచందనం || 25 యజ్ఞసూత్రం చ తాంబూలం కర్పూరాది సువాసితం | ద్రవ్యాణ్యతాని పూజాయాశ్చాంగరూపిణి సుందరి || 26 దేవి కించిద్విహీనేన చాంగహానిః ప్రజాయతే | అంగహీనం చ యత్కర్మ చాంగహీనో యథానరః అంగహీనే చ కార్యే చ ఫలహానిః ప్రజాయతే || 27 స్వస్తివాచనములతో నియమపూర్వకముగా కలశస్థాపన చేసి వేదవిహితమైన రీతిలో సంకల్పము చేసి ఈ వ్రతమునారంభింపవలెను. ఈ వ్రతమునకు ప్రతిదినము ఉపయోగించు వస్తువులే చాలును. కాని శ్రీకృష్ణునకు షోడశోపచారములను మాత్రము చేయవలెను. అవి అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము, ఆసనము, స్వాగతము, స్నానీయము, మధుపర్కము, వస్త్రములు, ఆభరణములు, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము, చందనము, యజ్ఞోపవీతము, తాంబూలము అనునవి. ఇవన్నియు పూజకు అంగములుగా ఉన్నవి. ఈ షోడశోపచారములలో ఏ ఒక్క ఉపచారము తక్కువైనను అంగహాని జరుగును. అంగహీనమైన పూజ అంగహీనుడగు నరునివలె ఫలితము నీయజాలదు. అష్టోత్తరశతం పుష్పణాం లక్షమక్షతమీప్సితం | ప్రదేయం హరయే భక్త్యా వర్ణసౌందర్యహేతవే || 29 సహస్రపత్రపద్మానామక్షతం లక్షకం తథా | భక్త్యా దేయం చహరయే ముఖసౌందర్యహేతవే || 30 అమూల్యరత్నరచితం దర్పణానాం సహస్రకం | దేయం నారాయణాయైవ నేత్రయోర్దీప్తిహేతవి || 31 నీలోత్పలానాం లక్షం చ దేయం కృష్ణాయ భక్తితః | వ్రతాంగభూతం దేవేశి చక్షుషో రూపహేతవే || 32 హిమాలయోద్భవం లక్షం రుచిరం శ్వేతచామరం | ప్రదేయం కేశవాయైవ కేశసౌందర్యహేతవే || 33 అమాల్యరత్నరచితం పుటకానాం సహస్రకం | ప్రదేయం గోపికేశాయ నాసాసౌందర్యహేతవే || 34 బంధూక పుష్పలక్షం చ దేయం రాధేశ్వరాయ చ | సౌమ్యౌష్ఠాదరయోశ్చైవ వర్ణసౌందర్యహేతవే || 35 ముక్తాఫలానాం లక్షం చ దంతసౌందర్యహేతవే | దేయం గోలోకనాథాయ శైలజే భక్తిపూర్వకం || 36 రత్నగండూషలక్షం చ గండసౌందర్యహేతవే | మహేశ్వరాయ దాతవ్యం వ్రతే శైలేంద్రకన్యకే || 37 రత్నపాశకలక్షం చ దేయం బ్రహ్మేశ్వరాయ చ | ఓష్ఠాధః స్థవరూపాయ వ్రతీ ప్రాణశి భక్తితః || 38 కర్ణభూషణలక్షం చ రత్నసారవినిర్మితం | దేయం సర్వేశ్వరాయైన కర్ణసౌందర్యహేతవే || 39 మాధ్వీక కలశానాం చ లక్షం రత్ననిర్మితం | దేయం విశ్వేశ్వరాయైవ సర్వసౌందర్యహేతవే || 40 సుధాపూర్ణం చ కుంభానాం సహస్రం రత్ననిర్మితం | దేయం కృష్ణాయ దేవేశి! వాక్యసౌందర్యహేతవే || 41 రత్నప్రదీపలక్షం చ గోపవేషవిధాయినే | దేయం కిశోరవేషాయ దృష్టిసౌందర్యహేతవే || 42 ధత్తూరకుసుమాకారం రత్నపాత్రసహస్రకం | దేయం గోరక్షకారయైవ బలసౌందర్యహేతవే || 43 ఓ పార్వతి! తనకు అందమైన రూపము కలుగుటకు ప్రతిదినము శ్రీకృష్ణునకు నూట ఎనిమిది పారిజాత పుష్పములతో ఈ వ్రతదీక్ష తీసికొన్న సమయమున పూజ చేయవలెను. అట్లే మంచివర్ణము కలుగుటకు తెల్లని చెంపక పుష్పములతో, శ్రీకృష్ణుని పూజింపవలెను. అట్లే ముఖసౌందర్యమునకై సహస్రదళములు కల లక్షపద్మములతో, కండ్లకు మంచి శోభకలుగుటకై వేలకొలది అద్దములతో , కండ్లు అందముగా ఉండుటకు లక్షనీలోత్పములతో, అందమైన వెండ్రుకలకొరకు లక్ష తెల్లని చామరములతో, అందమైన ముక్కు కొరకు అమూల్యరత్నములచే నిర్మించిన లక్ష పద్మములతో, అందమైన పెదవులకొరకు లక్ష దిరిసెనపువ్వులతో, అందమైన పలువరుసకై లక్షముత్యాలతో, అందమైన చెక్కిళ్ళకొరకు రత్నగండూషములతో, అందమైన పెదవులకింది భాగము అందముగానుండుటకై రత్నపాశములతో, అందమైన చెవులకై రత్నములచే చేయబడిన కర్ణభూషణములతో, చక్కని గొంతుకొరకు (స్వరమునకై ) రత్నపాత్రలలో పోసిన తేనెతో, చక్కనిమాటలకొరకు అమృతముకల రత్నపాత్రలతో, దృష్టిసౌందర్యమునకై రత్నదీపములతో, బలమునకై ఉమ్మెత్తపూవులవంటి రత్నపాత్రలతో శ్రీకృష్ణుని ప్రతిదినము పూజింపవలెను. సద్రత్నసారరచితం పద్మనాళసహస్రకం | దేయం చండకపాలాయ బాహుసౌందర్య హేతవే || 44 లక్షం చ రక్తపద్మానాం కరసౌందర్యహేతవే| దేయం గోపాంగనేశాయ నారాయణి హరివ్రతే || 45 అంగుళీయకలక్షం చ రత్నసార వినిర్మితం | అంగుళీనాం చ రూపార్థం దేయం దేవేశ్వరాయ చ || 46 మణీంద్రసారలక్షం చ శ్వేతవర్ణం మనోహరం | దేయం మునీంద్రనాథాయ నఖసౌందర్యహేతవే || 47 సద్రత్నసారహారాణాం లక్షం చాతిమనోహరం | దేయం మదనమోహాయ వక్షఃసౌందర్యహేతవే || 48 సుపక్వశ్రీఫలానాంచ లక్షం చ సుమనోహరం | దేయం సిద్ధేంద్రనాథాయ స్తనసౌందర్యహేతవే || 49 సద్రత్నవర్తులాకారపత్ర లక్షం మనోహరం | దేయం పద్మాలయేశాయ దేహసౌందర్యహేతవే || 50 సద్రత్నసారరచితం నాబీనాం చ సహస్రకం | ప్రదేయం పద్మనాభాయ నాభిసౌందర్యహేతవే || 51 సద్రత్నసారరచితం రథచక్రసహస్రకం | నింతబసౌందర్యార్థం చ దేయం వై చక్రపాణయే || 52 సువర్ణరంభాస్తంభానాం లక్షం చ సుమనోహరం | ప్రదేయం శ్రీనివాసాయ శ్రోణిసౌందర్యహేతవే ||53 శతపత్రస్థలాబ్జానాం లక్షమవ్లూనమక్షతం | ప్రదేయం పద్మనేత్రాయ పాదసౌందర్యహేతవే || 54 ఓ పార్వతి! అట్లే బాహుసౌందర్యముకొరకు మంచిరత్నములచే నిర్మితమైన పద్మనాళములను శ్రీవారికి సమర్పింపవలెను. చేతులు అందముగానుండుటకై ఎఱ్ఱని పద్మముల నాగోపికాపతికి సమర్పింపవలెను. చేతివేళ్ళు అందముగానుండుటకై మంచిరత్నములచే నిర్మింపబడిన ఉంగరములను సమర్పింపవలెను. చేతివేళ్ళగోర్లు అందముగానుండుటకై తెల్లని మంచిరత్నములను, వక్షఃసౌందర్యమునకై మంచిరత్నములుగల హారములను. స్తనసౌందర్యమునకై చక్కగా పండిన బిల్వఫలములను, శరీరసౌందర్యమునకై, గుండ్రముగానుండు మంచి రత్నపత్రములను, బొడ్డు అందముగానుండుటకై మంచిరత్నములచే నిర్మింపబడిన నాభులను, పిరుదుల అందమునకై మంచిరత్నములచే నిర్మితమైన వేలకొలది రథచక్రములను, మధ్యభాగమందముగానుండుటకై బంగారుచే చేయబడిన అరటిస్తంభములను, పాదములయొక్క సౌందర్యమునకై నూరురేకులుగల వాడని మెట్టతామరలను పద్మనేత్రుడగు శ్రీకృష్ణునకు సమర్పించవలెను. సువర్ణరచితానాం చ ఖంజనానాం సహస్రకం | గతిసౌందర్యహేత్వర్థం దేయం లక్ష్మీశ్వరాయ చ || 55 రాజహంస సహస్రం చ గజేంద్రాణాం సహస్రకం | సువర్ణరచితం దేయం హరయే గతిహేతవే || 56 సువర్ణచ్ఛత్రలక్షం చ దేయం నారాయణాయ చ | విచిత్రం రత్నసారేణ మూర్ధసౌందర్య హేతవే || 57 మాలతీనాం చ కుసుమమక్షతం లక్షమీశ్వరి | దేయం బృందావనేశాయ హాస్యసౌందర్యహేతవే || 58 అమూల్యరత్నలక్షం చ దేయం నారాయణాయ వై | సువ్రతే వ్రతపూర్ణార్థం శీలసౌందర్యహేతవే || 59 స్వచ్ఛస్ఫటికసంకాశ మణీంద్రశ్రేష్ఠలక్షకం | దేయం మునీంద్రనాథాయ మనస్సౌందర్యహేతవే || 60 ప్రవాళసారసంకాశం మణిసారసహస్రకం | దేయం కృష్ణాయ భక్త్యా చ ప్రియారావివృద్ధయే || 61 ఓపార్వతీ దేవి! గమనము అందముగా నుండుటకై బంగారముచే చేయబడిన కాటుక పెట్టెలను రాజహంసలను, ఏనుగులను, శ్రీకృష్ణునకు పూజాసమయమున సమర్పింపవలెను. శిరసౌందర్యమునకై బంగారము, రత్నములచే చేయబడిన ఛత్రములను, చక్కని హస్యమునకై దళములు విరిగిపోని మాలతీపువ్వులను, శీలసౌందర్యమునకై, వ్రతము సంపూర్ణమగుటకు అమూల్యమైన రత్నములను, మనసౌందర్యమునకై స్వచ్ఛస్ఫటికమువంటి మణులను, భార్యయొక్క అనురాగమునకై మంచిపగడములను, మంచిమణులను శ్రీకృష్ణునకు భక్తితో సమర్పించుకొనవలెను. మాణిక్యసారలక్షం చ దేయం కృష్ణాయ యత్నతః | జన్మనః కోటిపర్యంతం స్వామిసౌభాగ్యహేతవే || 62 కూష్మాండం నారికేళం చ జంబీరం శ్రీఫలం తథా | ఫలాన్యేతాని దేయాని హరయే పుత్రహేతవే || 63 రత్నేంద్రసారలక్షం చ దేయం కృష్ణాయ యత్నతః | అసంఖ్య జన్మపర్యంతం స్వామినో ధనవృద్ధయే || 64 పాయసం పిష్టకం సర్పిఃశర్కరాక్తం మనోహరం | ప్రదేయం హరయే భక్త్యా స్వామినో భోగవృద్ధయే || 65 వాద్యం నానాప్రకారం చ కాంస్యతాళాదికం పరం | వ్రతేసంపత్తి వృద్ధ్యర్థం శ్రీహరి శ్రావయేద్వతీ || 66 సుగంధిపుష్పమాలానాం లక్షమక్షతమీప్సితం | ప్రదేయం హరయే భక్యా హరిభక్తి వివృద్ధయే || 67 అనేక జన్మలవరకు తనభర్తకు సౌభాగ్యము కలుగుటకై మంచిమాణిక్యములను శ్రీకృష్ణునకు భక్తితో సమర్పింపవలెను. అట్లే పుత్రులు కలుగుటకై గుమ్మడిపండును కొబ్బరికాయను, నిమ్మపండును, బిల్వఫలమును సమర్పింపవలెను. తనభర్తకు ధనసమృద్ధి కలుగుటకై అనేక రత్నములను ఇవ్వవలెను. తనభర్తకు సద్భోగములు కలుగుటకై పాయసమును, నేయి, చక్కర కలిపిన పిండిని భక్తితో నొసగవలెను. తాళములు మొదలగు నానావిధవాద్యములను తనసంపదయొక్క అభివృద్ధికై మ్రోగించవలెను. శ్రీహరిపై భక్తి పెరుగుటకు ఆశ్రీహరికి అనేక పుష్పమాలలను సమర్పించుకొనవలెను. నైవేద్యాని చ దేయాని స్వాదూని మధురాణి చ | శ్రీకృష్ణప్రీతివృద్ధ్యర్థం దుర్గే నానావిధాని చ || 68 నానావిధాని పుష్పాణి తులసీసంయుతాని చ | శ్రీకృష్ణప్రీతియే భక్త్యా వ్రతే దేయాని సువ్రతే || 69 బ్రహ్మణానాం సహస్రం చ ప్రత్యహం భోజయేద్వ్రతీ | స్వాత్మనః సస్యవృద్ధ్యర్థం వ్రతే జన్మని జన్మని || 70 పుష్పాంజలిశతం దేయం నిత్యం పూర్ణం చ పూజనే | ప్రణామశతకం దేవి కర్తవ్యం భక్తివృద్ధయే || 71 ఈవ్రతమునాచరించునపుడు ప్రతిదినము శ్రీకృష్ణునకు నానావిధములైన నైవేద్యములను పెట్టవలెను. శ్రీకృష్ణుని సంతోషమునకై ఈపుణ్యకవ్రతమున ఆ భగవంతునకు తులసీదళములతోనున్న అనేకవిధములగు పుష్పములను సమర్పింపవలెను. అట్లే ప్రతిదినము వేయిమంది బ్రహ్మణులకు వ్రత సమయమున భోజనమిడవలెను. భక్తి పెరుగవలెనని పూజాసమయమున ప్రతిదినము శ్రీకృష్ణునకు పుష్పాంజలిశతమును, నమస్కారశతమును సమర్పించవలెను. షణ్మాసాంశ్చ హవిష్యాన్నం మాసాన్ పంచఫలాదికం | హవిఃపక్షం జలంపక్షం వ్రతే భ##క్షేచ్చ సువ్రతీ || 72 రత్నప్రదీపశతకం వహ్నిం దద్యాద్దివానిశం | రాత్రౌ కుశాసనం కృత్వా నిత్యం జాగరణం వ్రతే || 73 స్మరణం కీర్తనం కేళిః ప్రేక్షణం గుహ్యభాషణం | సంకల్పోzధ్యవసాయశ్చ క్రియానిర్వృతిరిత్యపి || 74 స్వప్నమైథునం త్యాజ్యం వ్రతినా వ్రతశుద్ధయే | సంపూర్ణే చ వ్రతే దేవి ప్రతిష్ఠా తదనంతరం || 75 త్రిశతం వై షష్ఠ్యధికం రల్లకం వస్త్రసంయుతం | సంభోజ్య సోపవీతం చ సోపహారం దదాత్వయం || 76 త్రిశతం వై షష్ఠ్యధికసహస్రం విప్రభోజనం | త్రిశతం వై షష్ఠ్యదికం సహస్రం తిలహోమకం || 77 త్రిశతం వై షష్ఠ్యదికం సహస్రం స్వర్ణయేవ చ | దేయాద్‌వ్రత సమాప్తౌ చ దక్షిణావిధి బోధితా || 78 అన్యాం సమాప్తిదివసే కథయిష్యామి దక్షిణాం | ఈ వ్రతము నాచరించువారు ఆరుమాసములు హవిష్యాన్నమును ఐదునెలలు పండ్లను మాత్రము భుజింపవలెను. చివరినెలలో పదిహేను దినములు హవిష్యాన్నమును మిగిలిన పదిహేను దినములు నీటిని మాత్రము నియమముతో స్వీకరింపవలెను. ఈవ్రతము చేయునప్పుడు ప్రతిదినము నూరుదీపములను వెలిగంచవలెను. రాత్రిసమయమున దర్భాసనముపై కూర్చుండి జాగరణ చేయవలెను. ఇతరవిషయముల స్మరించుట, కీర్తించుట, కేళి, చూచుట, రహస్యముగా సంభాషించుట, ఇతర క్రియాసంకల్పము చేయుట, వ్రతక్రియలను అనుష్ఠింపకపోవుట, నిదురుంచుట, మైథునము అనువాటిని వ్రతశుద్ధినిగోరి వ్రతముననుష్ఠించువాడు చేయరాదు. వ్రతము ముగియుసందర్భమున మూడువందల అరవై కంబళ్ళతో, యజ్ఞోపవీతములతో, మూడుకోట్ల అరువైలక్షల బ్రహ్మణులకు భోజనమును పెట్టవలెను. వారికందరకు బంగారునాణములను దక్షిణగా దానమీయవలెను. తిలహోమము మూడుకోట్ల అరవైలక్షల పర్యాయము చేయవలెను. ఇంకను వ్రతము సమాప్తమగు దినమున చేయవలసిన దక్షిణ గురించి తరువాత నీకు చెప్పుదునని శంకరు డనెను. ఏతద్ర్వతఫలం దేవి దృఢాభక్తిర్హరౌ భ##వేత్ || 79 హరితుల్యో భ##వేత్పుత్రో విఖ్యాతో భువనత్రయే | సౌందర్యం స్వామిసౌభాగ్యమైశ్వర్యం విపులం ధనం || 80 సర్వవాంఛి సిద్ధీనాం బీజం జన్మని జన్మని | ఓ పార్వతీ! ఈ వ్రతమునాచరించినందువలన శ్రీహరిపై భక్తి అధికమగును. వారికి పుట్టు పుత్రుడు శ్రీహరితో సమానుడగును. ముల్లోకములలో ప్రఖ్యాతిపొందును. అట్లే సౌందర్యము, భర్తృసౌభాగ్యము, ఐశ్వర్యము, అంతులేని ధనము, కలుగును. అదేవిధముగా ఆవ్రతమునాచరించిన స్త్రీకి ప్రతిజన్మలో ఆమె కోరిన కోరికలన్నియు సిద్ధించును. ఇత్యేవం కథితం దేవి వ్రతం మహేశ్వరి || 81 పుత్రస్తే భవితా సాధ్వీత్యుక్త్యా సవిరరామ హ || 82 పార్వతీ! నీకు ఇట్లు పుణ్యకత్రమును గురించి చెప్పితిని. అందువలన నీవు ఈ వ్రతమునాచరించినచో నీకు తప్పక పుత్రుడు కలుగునని మహాదేవుడు పార్వతితో చెప్పి ఊరకుండెను. ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణ తృతీయే గణపతిఖండే నారదనారాయణసంవాదే పుణ్యకవ్రతవిధానం నామచతుర్థోzద్యాయః || శ్రీ బ్రహ్మవైవర్తమహాపురాణమున మూడవదగు గణపతిఖండమున నారదనారాయణుల సంవాదమున తెలుపబడిన పుణ్యకవ్రతవిధానమను నాలుగవ అధ్యాయము సమాప్తము.