sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
షష్ఠోzధ్యాయః- పార్వతీదేవి పుణ్యక వ్రతము చేయుట శౌనక ఉవాచ- శౌనకమహర్షి ఇట్లు పలికెను. నారాయణవచః శ్రుత్వా నారదో హృష్టమానసః | కిం పప్రచ్ఛ పునః సాధో తన్మేబ్రూహి తపోధన ||
1 ఓ సౌతి మహర్షీ! నారాయణుని మాటలు విన్న నారదముని సంతోషముతో ఏమడిగెనో వివరింపుమని అడిగెను. సూత ఉవాచ- సూతమహర్షి ఇట్లు పలికెను. నారాయణముని చెప్పిన మాటలు విని నారదుడు సంతోషపడి పుణ్యకవ్రతమును ఎట్లు ఆరంభము చేయవలెనో తెలుపుమని నారాయణుని అడిగెను. నారద ఉవాచ- నారదు డిట్లు పలికెను. కృతం కేన ప్రకారేణ వ్రతమేతచ్ఛుభావహం | తన్మే బ్రూహి మునిశ్రేష్ఠ పార్వత్యా భర్తురాజ్ఞయా ||
3 లలాభ జన్మ భూతేశః కృతే సువ్రతయా వ్రతే | బ్రహ్మన్ కేన ప్రకారేణ తన్నః శంసితుమర్హసి || 4 ఓ మహర్షీ! పార్వతీదేవి తనభర్తయొక్క ఆజ్ఞననుసరించి శుభములనిచ్చు నీ పుణ్యకవ్రతము నెట్లు చేసెనో నాకు వివరింపుము. పార్వతీదేవి ఆ వ్రతము నొనరించినందువలన పరమేశ్వరుడేవిధముగా ఆమెకు తన అంశ##చే పుత్రుడుగా జన్మనెత్తెనో దానినికూడ వివరింపుడని అడిగెను. నారాయణ ఉవాచ- నారాయణుడిట్లు నారదునితో ననెను. కథయిత్వాం కథాం దివ్యాం విధానం చ వ్రతస్య చ | స్వయం విధాతా తపసాం జగామ తపసే శివః || 5 హరేరారాధనే వ్యగ్రో మూర్తిభేదధరో హరః | హరిభావన శీలశ్చ హరిధ్యాన పరాయణ ః || 6 పరమానందపూర్ణశ్చ జ్ఞానానందః సనాతనః | దివానిశం న జానాతి హరిమంత్రం బహిఃస్మరన్ || 7 శంకరుడు పార్వతీదేవికి పుణ్యకవ్రతవిధానము నంతయు ఎరిగించి, తాను స్వయముగా తపఃఫలితము నిచ్చువాడైనను తపస్సు చేయుటకై పోయెను. శ్రీహరి యొక్క రూపభేదమే ఐన శివుడు శ్రీహరిని మనసున ధ్యానింపుచు హరిని ఆరాధించుటకు పూనుకొనెను. జ్ఞానానందుడు, సనాతనుడు, పరమానందపూర్ణుడగు శంకరుడు శ్రీహరిమంత్రమును జపించుచు రాత్రి పగలు అనువాటినన్నిటిని మరచిపోయెను. ప్రహృష్టమనసా దేవీ పార్వతీ భర్తురాజ్ఞయా |కింకరాన్ ప్రేరయామాస విప్రాంశ్చ వ్రతహేతవే || 8 ఆనీయం సర్వద్రవ్యాణి వ్రతే యోగ్యాని యాని చ | వ్రతం కర్తుం సమారేభే శుభదా సా శుబేక్షణా || 9 సనత్కుమారో భగవానాజగామ విధేః సుతః | మూర్తిమాంస్తేజసాం రాశిః ప్రజ్వలన్ బ్రహ్మతేజసా || 10 బ్రహ్మ జగామ హృష్టశ్చ బ్రహ్మలోకాత్సభార్యకః | అతిత్రస్తో హి భగవానాజగామ మహేశ్వరః || 11 విష్ణుః క్షీరోదశాయీ చ స లక్ష్మీకశ్చతుర్భుజః | భగవాన్ జగతాం పాతా శాస్తా భర్తా సపార్షద ః || 12 వనమాలాధరః శ్యామో భూషితో రత్నభూషణౖః | తథా సంభృతసంభారో రత్నయానేన నారద || 13 పార్వతీదేవి తన భర్తయొక్క ఆజ్ఞననుసరించి వ్రతముకొరకు దాసజనమును, బ్రహ్మాణులను నియోగించెను. ఆ దేవి ఆ వ్రతమునకు కావలసిన సమస్త పదార్థములను తెప్పించి పుణ్యకవ్రతము చేయుటకు మొదలిడెను. అచ్చటికి బ్రహ్మతేజో విరాజితుడు, తేజఃపుంజము మూర్తీభవించినట్లున్న బ్రహ్మోపుత్రుడగు సనత్కుమారుడు వచ్చెను. బ్రహ్మదేవు డచ్చటికి తన భార్యయగు సావిత్రీదేవితో వచ్చెను. మహేశ్వరుడు కూడ అచ్చటకు తొందరపడుచు వచ్చెను. అట్లే చతుర్భుజములు కలవాడు, ముల్లోకములను శాసించువాడు, రక్షించువాడు వనమాలము ధరించినవాడు, రత్నాలంకార శోభితుడగు శ్రీమహావిష్ణువు తన భార్యయగు లక్ష్మీదేవితో, తన అనుచరవర్గముతో కలిసి రత్నములు పొదిగిన రథముపై అచ్చటకు వచ్చెను. సనకశ్చ సనందశ్చ కపిలశ్చ సనాతనః | అసురిశ్చ క్రతుర్హంసో, వోఢుః వంచశిఖోzరుణిః || 14 అగస్త్యశ్చ ప్రచేతాశ్చ దుర్వాసాశ్చ్యవనస్తథా | మరీచిః కశ్యపః కణ్వో జరత్కారుశ్చ గౌతమః || 15 యతిశ్చ సుమతిశ్చైవ వసిస్ఠశ్చ సహానుగః | పులహశ్చ పులస్త్యశ్చాప్యత్రిశ్చ భృగురాంగిరాః || 16 బృహస్పతిరుతథ్యశ్చ సంవర్తః సౌభరిస్తథా | జాబాలిర్జమదగ్నిశ్చ జైగీషవశ్చ దేవలః || 17 గోకాముఖో వక్రరథః పారిభద్రః పరాశరః | విశ్వామిత్రో వామదేవ ఋష్యశృంగో విభాండకః || 18 మార్కండేయో మృకండుశ్చ పుష్కరో లోమశస్తథా | కౌత్సో వత్సశ్చ దక్షశ్చ బాలాగ్నిరఘుమర్షణః || 19 కాత్యాయనః కణాదశ్చ పాణినిః శాకటాయనః | శంకురాపిశలిశ్చైవ శాకల్యః శంఖ ఏవ చ || 20 ఏతే చాన్యే బహవః సశిష్యా మునయో రమునే | ఆవాం చ ధర్మపుత్రౌ చ నరనారాయణౌ మమౌ || 21 దిక్పాలాశ్చ తథా దేవా యక్షగంధర్వ కిన్నరాః | ఆజగ్ముః పర్వతాః సర్వే సగణా ః పార్వతీవ్రతే || 22 హిమాలయః శైలరాజః సాపత్యశ్చ సభార్యకః | సగణః సానుగశ్చైవ రత్నభూషణభూషితః || 23 ఆ వ్రతమునకు సనక, సనాతనులు, కపిలమహర్షి , ఆసురు, క్రతువు, హంసుడు, వోఢుడు, పంచశిఖముని, అరుణిమహర్షి, అగస్త్యుడు, ప్రచేతసుడు, దుర్వాసముని, చ్యవనమహర్షి , మరీచి, కశ్యపుడు, కణ్వుడు జరత్కారు, గౌతముడు, యతి, సుమతి, వసిష్ఠముని, పులహుడు, పులస్త్యుడు, అత్రి, భృగువు, అంగిరసుడు, బృహస్పతి, ఉతథ్యుడు, సంవర్తుడు, సౌభరి, జాబాలి, జమదగ్ని, జైగీషవ్యుడు, దేవలుడు, గోకాముఖుడు, వక్రరథుడు, పారిభద్రుడు, పరాశరుడు, విశ్వామిత్రుడు, వామదేవుడు, ఋష్యశృంగుడు, విభాండకుడు, మార్కండేయుడు, మృకండుముని, పుష్కరుడు, లోమశుడు, కౌత్సుడు, వత్సుడు, దక్షుడు, బాలాగ్ని, అఘమర్షణుడు, కాత్యాయనుడు, కణాదుడు, పాణిని, శాకటాయనుడు, శంకుముని, అపిశలి, శాకల్యుడు, శంఖుడు, ధర్మునిపుత్రులమగు మేము (నరనారాయణులు) ఇంకను అనేకమునులు తమ శిష్యులతో అచ్చటికేతెంచిరి. అట్లే అష్టదిక్పాలురు, దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, మొదలగువారందరు. తమ తమ గణములతో అచటికి వచ్చిరి. అదేవిధముగా అన్ని పర్వతములు శైలరాజగు హిమాలయపర్వతము తన భార్యాపుత్రులతో, తన అనుచరగణముతో అచ్చటికి వచ్చెను. తథా సంభృత సంభారో నానాద్రవ్యసమన్వితః | మణిమాణిక్య రత్నాని వ్రతే యోగ్యాని యాని చ || 24 నానాప్రకారవస్తూని జగత్యాం దుర్లభాని చ | లక్షం చ గజరత్నానాం అశ్వరత్నం త్రిలక్షకం || 25 దశలక్షమ గవాం రత్నం శతలక్షం సువర్ణకం | రుచకాణాం హీరకాణాం స్పర్శనాం చ తథైవ చ || 26 ముక్తానాం చ చతుర్లక్షం కౌస్తుభానాం సహస్రకం | సుస్వాదు నానాద్రవ్యాణాం లక్షభారాణి కౌతుకే | అనంతరత్నప్రభవ ఆజగామ సుతావ్రతే || 27 హిమాలయము తన కూతురగు పార్వతి చేయుచున్న వ్రతమునకై అనేక ద్రవ్యములను, మణిమాణిక్యములను. ప్రపంచమున దొరకని అనేక వస్తువులను తీసికొని వచ్చెను. లక్ష ఏనుగులను, మూడులక్షల గుఱ్ఱములను, లక్షగోవులను, కోటి రత్నములను, బంగారు నాణములను, వజ్రములు, ముత్యాలు, కౌస్తుభమణులు, రుచిగల అనేక ద్రవ్యములుగల లక్షమూటలు కట్టుకొని తెచ్చెను. బ్రహ్మణా మనవః సిద్దా నాగా విద్యాధరాస్తథా | సన్యాసినో భిక్షుకాశ్చ వందినః పార్వతీ వ్రతే || 28 విద్యాధరీ నర్తకీ చ నర్తకాప్సరసాం గణాః | నానావిధా వాద్యభాండా ఆజగ్ముః శివమందిరం || 29 ఇంకను బ్రహ్మణులు, మనువులు, సిద్దులు, నాగులు, విద్యాధరులు, సన్యాసులు భిక్షకులు, స్తోత్రపాఠకులు, విద్యాధరులు, నర్తకులు, అప్సరసలు, అనేకమైన వాద్యములతో కైలాసపర్వతమునకు వచ్చిరి. కైలాసరాజమార్గం చ చందనేన సుసంస్కృతం | ఆమ్రపల్లవసూత్రాఢ్యం కదళీస్తంభశోభితం || 30 దూర్వాధాన్యఫలైః పర్ణలాజ పుషై#్పర్విభూషితం | నిర్మితం పద్మరాగేణ దదృశుస్తే గణా ముదా || 31 ఉచ్చైః సింహాసనేష్వేతే పూజితాః శంకరేణ చ | కైలాసవాసినః సర్వే పరమానందసంయుతాః || 32 దానాధ్యక్షః శునాసీరః కుబేరః కోశరక్షకః | ఆదేష్టా చ స్వయం సూర్యః పరివేష్టా జలాధిపః || 33 దధ్నాం నద్యః సహస్రాణి దుగ్ధానాం చ తథైవ చ | సహస్రాణి ఘృతానాం చ గుడానాం చ శతాని చ || 34 మాధ్వీకానాం సహస్రాణి తైలానాం చ శతానిచ | లక్షాణి చైవ తక్రాణాం బభూవుః పార్వతీవ్రతే || 35 పీయూషాణాం చ కుంభాని శతలక్షాణి నారద | మిష్టాన్నానాం శర్కరాణాం బభూవుర్లక్షరాశయః | యవగోధూమ చూర్ణానాం ఘృతాక్తానాం చ నారద || 36 స్వస్తికానాం చ పూర్ణానాం బభూవుర్లక్షరాశయః | గుడసంస్కృతలాజానాం బభూవుః కోటిరాశయః || 37 శాలీనాం పృథుకానాం చ రాశీనాం దశకోటయః | వరతండుల రాశీనాం మునే సంఖ్యా న విద్యతే || 38 స్వర్ణరౌప్యప్రవాళానాం మణీనాం చ మహామునే | బభూవుః పర్వతాస్తత్ర కైలాసే పార్వతీ వ్రతే || 39 పాయసం పిష్టకం చైవ శాల్యన్నం సుమనోహరం | చకార లక్ష్మీః పాకం చ వ్యంజనం ఘృతసంస్కృతం || 40 ఋభుజే దేవర్షిగణౖః శివోనారాయణన చ | బభూవుర్లక్ష వుప్రాశ్చ పరివేషణకారకాః || 41 తాంబూలం చ దదౌతేభ్యః కర్పూరాది సువాసితం | రత్నసింహాసనస్థేభ్యో విప్రలక్షేభ్య ఏవచ || 42 పార్వతీదేవి పుణ్యకవ్రతమును చేయుచున్నప్పుడు కైలాసమునందలి రాజమార్గమును చందనముచే కలయంపిజల్లినారు. ఆ మార్గమునందంతట అరటిచెట్ల స్తంభములను నిలిపి, మామిడి తోరణములను కట్టిరి. ఆ మార్గమునందంతట దర్భలు, ధ్యానములు, ఫలములు కుప్పలు కుప్పలుగానున్నవి. ఆ రాజమార్గమంతయు పద్మారాగమణులచే నిర్మించబడిన ఆరుగులున్నవి. అట్టి రాజమార్గమును మునిగణము, దేవతాగణము, యక్ష కిన్నరాది గణము సంతోషముతో చూచెను. శంకరుడు తనభార్యచేయుచున్న వ్రతమునకు వచ్చినవారినందరిని ఎత్తైన సింహాసనములందు కూర్చుండబెట్టి గౌరవించెను. దానిని చూచి కైలాసముననున్న వారందరు సంతోషించిరి. ఆ పుణ్యకవ్రత కార్యక్రమమున దేవేంద్రుడు దానాధ్యక్షుడుగా, కుబేరుడు, ధనాగారమునకు రక్షకుడుగా, సూర్యుడు అందరకు పనులనాదేశించువాడుగా, వరుణుడు, భోజనములు పెట్టుచోట ఉండెను. అచ్చట పెరుగు, పాలు, నేయి, గుడము, తేనె, నూనె, మజ్జిగ నదులై పారెను. పీయూషమను వంటకములు, మిష్టాన్నములు, చక్కరలు రాశులుగానుండినవి. నేతితో కలిపిన యవలు. గోధుమల పిండి, స్వస్తికములనే పిండివంటలు, పూర్ణములను పిండివంటలు బెల్లము కలిపిన పేలాలు, అటుకులు, మంచి బియ్యము రాశులు రాశులుగా నచ్చట ఉండినవి. అట్లే అచ్చట బంగారము , వెండి, పగడములు, మణులరాశులు పర్వతములవలె ఉండినవి. పాయసము, పిండి, అన్నము, నేతితో చేసిన కూరగాయలను లక్ష్మీదేవి వండిపెట్టినది. లక్ష్మీదేవి చేసిన వంటను, శివుడు, నారాయణుడు, దేతలు, మునులు, బ్రహ్మాణులందరు చక్కగా భుజించిరి . ఆసమయమున వడ్డించుటకే లక్షమంది బ్రహ్మాణులుండిరన్నచో భోజనముచేసినవారి సంఖ్య ఎంతయో చెప్పలేము. పార్వతీదేవి వారినందరిని రత్నసిహాసనములపై కూర్చుండబెట్టి కర్పూరాది సువాసన ద్రవ్యములు కల తాంబూలమునిచ్చినది. రత్నసింహసనస్థం చ విష్ణుం క్షీరోదశాయినం | సేవ్యమానం పార్షదైశ్చ సస్మితైశ్వేత చామరైః||43 ఋషిభిః స్తూయమానం చ సిద్దైర్దేవగణౖః స్తథా | విద్యాధరీణాం నృత్యాని పశ్యంతం సస్మితం ముదా || 44 గంధర్వాణాం చ సంగీతం శ్రుతవంతం మనోహరం | పప్రచ్ఛ శంకరో బ్రహ్మన్ బ్రహ్మేశం ప్రీతిపూర్వకం || 45 బ్రహ్మణా ప్రేరితో యుక్తం వ్రతం కర్తవ్యమీప్సితం | దేవర్షిగణపూర్ణాయాం సభాయాం సంపుటాంజలిః || 46 అప్పుడు పాలకడలిలో పడుకొనియుండు విష్ణుమూర్తి రత్నసింహాసనముపై కూర్చొని దాసజనము శ్వేతచామరములు వీచుచుండగా మునులు ఆ దేవదేవుని స్తుతించుచుండగా , సిద్ధులు, దేవగణములు సేవించుచుండగా గంధర్వులు పాడుచున్న సంగీతమును వినుచు విద్యాధరస్త్రీలు చేయు నాట్యములను తిలకించుచుండెను. అట్టి పరబ్రహ్మస్వరూపుడైన విష్ణువును, దేవతలు ఋషులు నిండిపోయి యున్న సభలో బ్రహ్మదేవుడు ప్రేరేపింపగా ఆవ్రతమున చేయతగు కార్యమును శంకరుడు చేతులు కట్టుకొని ఇట్లడిగెను. శ్రీ మహాదేవ ఉవాచ- శ్రీమహాదేవు డిట్లనెను. మదీయం వచనం నాథ శ్రీనివాస శ్రుణుప్రభో | తపఃస్వరూప తపసాం కర్మణాం చ ఫలప్రద || 47 వ్రతానాం జపయజ్ఞానాం పూజానాం సర్వపూజిత | సర్వేషాం బీజరూపేణ వాంఛాకల్పతరో హరే || 48 సుపుణ్యం చ వ్రతం కర్తుం బ్రహ్మన్నిచ్ఛతి పార్వతీ | పుత్రార్థినీ సా శోకార్తా హృదయేన విదూయతా || 49 రతిభంగే కృతే దేవైః వ్యర్థవీర్యశుచార్దితా | ప్రభోధితా మయా సాధ్వీ వివిధైర్వచనామృతైః || 50 సత్పుత్రం స్వామి సౌభాగ్యం సువ్రతా యాచతే వ్రతే | తాభ్యాం వినా న సంతుష్టా స్వప్రాణాంస్త్యక్తుమిచ్ఛతి || 51 ఓ శ్రీనివాసా! నీవు తపః స్వరూపుడవు. నీవు తపస్సుయొక్క. కర్మయొక్క ఫలితములనిచ్చువాడవు. అట్లే వ్రతములయొక్క జపములయొక్క యజ్ఞములయొక్క ఫలితములను నీవిత్తువు. నిన్ను అందరు పూజింతురు. నీవు అందరి కోరికలను కల్పవృక్షమువలె తీర్చెదవు. అట్టినీవు నామాటను వినుము. నాభార్యయగు పార్వతీదేవి శోకముతో బాధపడుచు పుత్రులను కోరి సుపుణ్యకవ్రతమును చేయవలెననుకొన్నది. దేవతలు రతిభంగమును చేసినప్పుడు వీర్యము వ్యర్థముకాగా బాధపడుచున్నప్పుడా సాధ్విని నేను మంచిమాటలతో ఓదార్చితిని, ఇప్పుడా దేవి సత్పుత్రుని, స్వామిసౌభాగ్యము కావలెనని వ్రతము చేయుచున్నది. సత్పుత్రుడు, స్వామిసౌభాగ్యము లభింపనిచో ఆమె నిరాశకు గురియై ప్రాణములను తీసికొనుటకైనా వెనుకాడకున్నది. పురా త్యక్త్యా స్వదేహం చ పితృయజ్ఞే చ మానినే | మన్నిందయా హిమవతి పునర్జన్మ లలాభ సా || 52 సర్వం జానాసి వృత్తాంతం సర్వజ్ఞం త్వాం వదామి కిం | దీనాం తాం వద తత్వజ్ఞ పరిణామ శుభప్రదాం || 53 దుర్నివార్యశ్చ సర్వేశ స్త్రీస్వభావశ్చ చాపలః | దుస్త్యజం యోగిభిః సిద్దైరస్మాభిశ్చ తపస్విభిః || 54 జితేంద్రియైర్జితక్రోదైః స్త్రీరూపం మోహకారణం | సర్వమాయాకరండం చ కామవర్దన కారణం || 55 బ్రహ్మస్త్రం కామదేవస్య దుర్భేద్యం జయకారణం | సునిర్మితం చ విధినా సర్వాద్యం విధిపూర్వకం || 56 మోక్షద్వారకపాటం చ హరిభక్తి నిరోధనం | సంసారబంధనస్తంభరజ్జురూపమకృంతనం || 57 వైరాగ్యనాశబీజం చ శశ్వద్రాగ వివర్ధనం | పత్తనం సాహసానాం చ దోషాణామాలయం సదా || 58 అప్రత్యయానాం క్షేత్రం చ స్వయం కపటమూర్తిమత్ | అహంకారాశ్రయం శశ్వద్విషకుంభం సుధాముఖం || 59 సర్వైరసాధ్యమానం చ దురారాధ్యం చ సర్వదా | స్వకార్యసాధ్యాచారాఢ్యం కలహాంకురకారణం || 60 సర్వం నివేదితం బ్రహ్మన్ కర్తవ్యం వక్తుమర్హసి | కార్యం సర్వం పరామర్శే పరిణామసుఖావహం || 61 ఓ పరబ్రహ్మస్వరూపుడా! నా భార్యయైన పార్వతి పూర్వజన్మలో తండ్రియైన దక్షప్రజాపతిచేయుచున్న యజ్ఞమునందు అతడు నన్ను నిందించుటను సహింపలేక ఆ యజ్ఞాగ్నిలో తన శరీరమును పరిత్యజించి తిరిగి హిమవత్పర్వత కన్యగా పునర్జన్మను పొందినది. ఓ విష్ణుమూర్తీ! నీవు సర్వజ్ఞుడవు. నేను చెప్పిన వృత్తాంతమంతయు నీకు తెలియును. ఐనను నేను నీకు ఈ వృత్తాంతమును చెప్పితిని. సమస్తతత్వములు తెలిసిన నీవు పార్వతీదేవికి చక్కని హితమును చెప్పుము. ఓసర్వేశ్వరుడా! స్త్రీలయొక్క స్వభావము చంచలమైనది. దానిని నివారింపవీలులేనిది. యోగులైనను, సిద్ధులైనను, మావంటి తపోధనులైనను, జితేంద్రియులు, జితక్రోధులైనను స్త్రీని వదలి మనజాలరు. స్త్రీయొక్క రూపము అందరకు మోహమును కల్గించునది. అది సమస్తమాయలకు నిలయమైనది. కామమును పుట్టించునేర్పుకలది. అది మన్మథుడు బ్రహ్మస్త్రము, దానినెవ్వరు ఎదుర్కొనలేరు. అన్ని సమయములందు. అతటను జయమును కల్గించును. ఈ విధముగా బ్రహ్మదేవుడు స్త్రీరూపమును సృష్టించెను. అది మోక్షమనే వాకిలికి తలుపువంటిది. శ్రీహరిపై భక్తిని కలుగనీయదు. సంసారమనే స్తంభమున శాశ్వతముగా బంధించు త్రాడువంటిది. ఎల్లప్పుడు అనురాగమునే కల్గించును కాని వైరాగ్యమును కలుగనీయదు. సాహసములకు, దోషములకు నిలయమైనది. నమ్ముటకు వీలులేనిది. కపటమైనది. ఎల్లప్పుడు అహంకారము కలిగియుండు ఆ స్త్రీరూపము పయోముఖ విషకుంభమువంటిది. స్త్రీలు ఎవ్వరికిని వశులుకారు వారిని లాలించవలెననినచో మిక్కిలి కష్టము కలుగును. కలహములను వారు కలిగింతురు. ఓ పరబ్రహ్మరూపుడా! నా పరిస్థితినంతయు నీకు నివేదించితిని. ఇప్పుడు నేనేమి చేయవలెనో నాకు కర్తవ్యమును ఉపదేశింపుము. ఆ కర్తవ్యము విమర్శించి చేయతగినది కావలెను. అట్లే పరిణామసమయమున సుఖమును కలిగించవలెను. అట్టి కర్తవ్యమును నీవు చక్కగా విమర్శించి ఉపదేశింపుమని శంకరుడు అడిగెను. శ్రీనారాయణ ఉవాచ- నారాయమమహర్షి నారదునితో ఇట్లనెను. ఇత్యేవముక్త్వా భగవాన్నిరీక్ష్య బ్రహ్మణో ముఖం | విరరామ సభామధ్యే స్తుత్వా చ కమలాపతిం || 62 శంకరస్య వచః శ్రుత్వా ప్రహస్య జగదీశ్వరః | హితం చ నీతివచనం ప్రవక్తుముపచక్రమే || 63 శ్రీమహాదేవుడు లక్ష్మీపతియగు నారాయణునితో ఈ విధముగా తన వృత్తాంతమునంతయు దేవతలున్న ఆ సభలో చెప్పి శ్రీమహావిష్ణువును కీర్తించుచు, బ్రహ్మదేవుని ముఖమును చూచి ఆగిపోయెను. అనంతజగములకెల్ల ప్రభువగు శ్రీమహావిష్ణువు శంకరుని మాటలనన్నిటిని విని చిరునవ్వుతో హితమును, నీతియుక్తమునగు మాటలను ఇట్లు చెప్పసాగెను. శ్రీవిష్ణురువాచః- శ్రీమహావిష్ణువిట్లు శంకరునితో ననెను. సుపుణ్యకవ్రతం సారం సతీసంతానహేతవే | స్వామిసౌభాగ్యబీజం చ పత్నీ తే కర్తుమిచ్ఛతి || 64 సర్వాసాధ్యం దురారాధ్యాం సర్వకామఫలప్రదం | సుఖదం సుఖసారం చ మోక్షదం పార్వతీశ్వర || 65 ఆత్మా సాక్షిస్వరూపశ్చ జ్యోతీరూపః సనాతనః | నిరాశ్రయశ్చ నిర్లిప్తో నిరుపాధిర్నిరామయః || 66 భక్తప్రాణశ్చ భ##క్తేశో భక్తానుగ్రహకారకః | దురారాధ్యో హి యోzన్యేషాం భక్తానామతిసాధకః || 67 భక్త్యధీనో హి భగవాన్ సర్వసిద్ధో హి నిష్ఫలః | తే యస్య చ కళాః పుంసో బ్రహ్మవిష్ణుమహేశ్వరాః || 68 మహాన్ విరాడ్యదంశశ్చ నిర్లిపః ప్రకృతేః పరః | అవ్యయో నిగ్రహశ్చోగ్రో భక్తానుగ్రహవిగ్రహః || 69 ఉగ్రగ్రహో గ్రహాణాం చ గ్రహనిగ్రహకారకః | త్రికోటిజన్మమధ్యే చ న సాధ్యో భవతా వినా || 70 ఓశంకరా! నీ భార్యయగు పార్వతి భర్తృసౌభాగ్యము, చక్కని సంతానము కలుగవలెనని వ్రతములలో సర్వశ్రేష్ఠమైన పుణ్యకవ్రతమును చేయవలెనని అనుకొనుచున్నది. ఆ వ్రతము అందరకు అసాద్యమైనది . అది సమస్తవాంఛితములను, సుఖమును, మోక్షమును కల్గించును. ఈవ్రతమునకు సాక్షీభూతుడై అధిదేవతాగానుండువాడు సనాతనుడు జ్యోతిస్వరూపుడు అగు పరమాత్మయే. అతడు నిరాశ్రయుడు, నిర్లిప్తుడు, నిరుపాధిరూపుడు, నిరామయుడు, ఆ పరమాత్మ భక్తులనెల్లప్పుడు అనుగ్రహించుచుండును. అతని ప్రాణములు పరమభాగవతోత్తములే. అతడు అన్యజనులకు అందనివాడైనను భక్తజనులకు మాత్రము ఎల్లప్పుడు అనుకూలమై యుండును. ఆ భగవంతుని వదలివేసినచో సమస్తసిద్ధులు నిష్పలమగును. బ్రహ్మదేవుడు, మహావిష్ణుమూర్తి, మహేశ్వరుడు అ పరమపురుషుని అంశస్వరూపులు మాత్రమే. అట్లే ప్రకృతికంటెపరుడైన మహావిరాట్స్వరూపుడు ఆ పరమపురుషుని అంశస్వరూపుడు మాత్రమే. భక్తులననుగ్రహించుటకై ఆకారమును ధరించిన ఆ పరమపురుషుని నీవంటివారు తప్ప ఇతరులు మూడుకోట్ల జన్మలెత్తినను పొందజాలరు. లబ్ద్వా హి భారతే జన్మ హరిభక్తిం లభేన్నరః | సేవనం క్షుద్రదేవానాం కృత్వా సప్తసు జన్మసు || 71 సూర్యమంత్రమవాప్నోతి కేవలం స తదాశిషా | సూర్యమంత్రం సమారాధ్య త్రిషు జన్మసు భారతే || 72 ప్రాప్నోతి శైవం మంత్రం చ సర్వదం మానవోముదా | ఈ భారతభూమిపై జన్మపొందినవాడు మాత్రమే శ్రీహరి భక్తిని పొందును. క్షుద్రదేవతలను ఏడు జన్మలవరకు నియమనిష్ఠలతో ఆరాధించిన వ్యక్తికి సూర్యమంత్రము లభించును. అట్లే ఈ భారత ఖండమున సూర్యమంత్రము నియమనిష్ఠలతో మూడు జన్మలవరకు ఉపాసించినచో సమస్తకోరికలను తీర్చు శివమంత్రము లభించును. సంసేవ్య పరయా భక్త్యా త్వామేవం సప్తజన్మసు || ప్రాప్నోతి మాయామంత్రం చ త్వత్పదాబ్జప్రసాదతః | శతం జన్మసు చారాధ్య మాయాం నారాయణీం పరాం || 74 నారాయణకళాం సేవ్యాం సమవాప్నోతి మానవః | కళాం నిషేవ్య వర్షే zత్ర పుణ్యక్షేత్రే సుదుర్లభే || 75 కృష్ణభక్తిమవాప్నోతి భక్తసంసర్గహైతుకీం | సంప్రాప్య భక్తిం నిశ్పక్వాం భ్రామం భ్రామం చ భారతే || 76 ప్రాప్నోతి పరిపక్వాం చ భక్తిం భక్తనిషేయా | తదా భక్తప్రసాదేన దేవానామాశిషా శివ | éశ్రీకృష్ణమంత్రం ప్రాప్నోతి నిర్వాణఫలదం పరం || 77 కృష్ణతుల్యో భ##వేద్భక్తశ్చిరం కృష్ణనిషేవయా || 78 అంతులేని భక్తితో పరమశివుడవగు నిన్ను ఆ ఏడుజన్మలవరకు ఆరాధించినచో నీ అనుగ్రహమువలన విష్ణుమాయ అను దుర్గాదేవీ మంత్రము లభించును. నారాయణియగు ఆ దేవిని నూరుజన్మలవరకు ఆరాధించినచో నారాయణాంశ మంత్రమును పొందగలడు. ఆ నారాయణాంశమును పుణ్యక్షేత్రమున ఒక సంవత్సరము అత్యంతభక్తితో ఉపాసించినతో శ్రీకృష్ణ భక్తులతో సమాగమనమను కల్పించు శ్రీకృష్ణ భక్తి లభించును. పూర్తిగా పరిపక్వముకాని శ్రీకృష్ణభక్తితో ఈ భారతవర్షమున పుణ్యక్షేత్రసందర్శనము చేసినచో అచ్చటనున్న శ్రీకృష్ణభక్తులతో కలిసియున్న పుణ్యము వలన ఆయా దేవతల అనుగ్రహమువలన పూర్తిగా పక్వమైన మోక్షఫలము నొసగునది ఐన శ్రీకృష్ణమంత్రము లభించును. శ్రీకృష్ణమంత్రము, శ్రీకృష్ణవ్రతము సమస్త కోరికలను తీర్చును. శ్రీకృష్ణమంత్రము నెల్లప్పుడు ఉపాసించు భక్తుడు శ్రీకృష్ణునితో సమానుడు కాగలడు. మహతి ప్రళ##యే పాతః సర్వేషాం వై సునిశ్చితం | న పాతః కృష్ణభక్తానాం సాధూనామవినాశినాం || 79 అవినాశిని గోలోకే మోదంతే కృష్ణకింకరాః | హసంతి తే సునిశ్చింతా దేవాన్ బ్రహ్మాదికాన్ శివ|| 80 త్వం సంహర్తా చ సర్వేషాం న భక్తానాం మహేశ్వర | మాయా మోహయతే సర్వాన్ భక్తాన్న కృపయా మమ || 81 మాయా నారాయణ మాతా సర్వాషాం కృష్ణభక్తిదా | న కృష్ణభక్తి ప్రప్నోతి వినా మాయా నిషేవణం || 82 సా చ నారాయణ మాయా మూలప్రకృతిరీశ్వరీ | కృష్ణప్రియా కృష్ణభక్తా కృష్ణతుల్యాzవినాశినీ || 83 సా చ తేజః స్వరూపా చ స్వేచ్ఛావిగ్రహధారిణీ | ఆవిర్భూతా చ దేవానాం తేజసాzసురనిగ్రహే || 84 నిహత్య దైత్యసంఘాంశ్చ దక్షపత్న్యాం చ భారతే | లలాభ దక్షస్తపసా జన్మచానేక జన్మనః || 85 మహాప్రళయకాలమున ఈలోకములందున్న సర్వజీవులు నశించును. కాని పరమసాధువులైన శ్రీకృష్ణభక్తులు మాత్రము నశింపరు. శ్రీకృష్ణభక్తులాసమయమున నాశనమనునది లేని గోలోకమున సుఖముగానుందురు. మహాప్రళయకాలమున బ్రహ్మాదిదేవతలందరు నశించుచుండుటను కని వారు నిశ్చింతతో నుందురు. ఓ మహేశ్వరా! నీవు చరాచర ప్రపంచమునంతయు లయమొనరింతువు కాని నాభక్తులను మాత్రము నీవు సంహరింపలేవు. నామాయ అందరిని మోహింపజేయును గాని నాఅనుగ్రహమువలన నా భక్తులను మాత్రము మోహపరవశులను చేయజాలదు. పైగా నారాయణియగు విష్ణుమాయ నాఅనుగ్రహము వలన భక్తలందరకు శ్రీకృష్ణభక్తిని కలిగించును. అందువలన విష్ణుమాయయగు దుర్గాదేవిని సేవింపక ఎవ్వరు శ్రీకృష్ణభక్తిని పొందజాలరు. నారాయణియగు విష్ణుమాయ మూలప్రకృతిస్వరూపిణి. ఆ దేవి శ్రీకృష్ణునకు మిక్కిలి ప్రియమైనది. ఆమె శ్రీకృష్ణునకు భక్తురాలు. అతనితో సమానమైనది. తేజోరూపిణి. తాను కోరుకున్న ఆకారమును ధరించగలది. ఆమె సమస్తదేవతల తేజస్సువలన రాక్షసులను సంహరించుటకు అవతరించిన తల్లి. ఆదేవి శుంభాది రాక్షసులను సంహరించి దక్షప్రజాపతి అనేక జన్మలలో చేసికొన్న తపస్సువలన అతనికి పుత్రికగా జన్మించినది. త్యక్త్వా దేహం పితుర్యజ్ఞే సా సతీ తవ నిందయా | జగామ దేవీ గోలోకం కృష్ణశక్తిః సనాతనీ|| 86 గృహీత్వాం విగ్రహం తస్యాః గుణరూపాశ్రయం పరం | భ్రామం బ్రామం భారతే త్వం విషణ్ణోzభూః పురా హరా || 87 ప్రబోధితా మయా త్వం చ శ్రీశైలేషు సరిత్తటే | లలాభ జన్మ సా శైలకాంతాయామ చిరేణ చ || 88 నారాయణియగు ఆ సతీదేవి తన తండ్రియగు దక్షుడు యజ్ఞము చేయుచున్న సమయమున నిన్ను నిందిపగా విని సంహింపలేక అచ్చటనే తన శరీరమును వదలి గోలోకమునకు చేరినది. అప్పుడు నీవాదేవియొక్క శరీరమును చేతబట్టుకొని బారతదేశమంతటను తిరుగుచుండగా నీ అవస్థను గమనించి నేను నిన్ను ఓదార్చితిని. అప్పుడే ఆమె హిమాలయ పర్వతమునకు కూతురై పుట్టెను. కరోతు పుణ్యకం సాధ్వీ సువ్రతా సువ్రతం శివా! రాజసూయ సహస్రాణాం పుణ్యం శంకర పుణ్యకే|| 89 రాజసూయ సహస్రాణాం వ్రతే యత్ర ధనవ్యయః | న సాధ్యం సర్వసాధ్వీనాం వ్రతమేతత్త్రిలోచన || 90 స్వయం భూతే శనాథస్త్యం పుణ్యకస్య ప్రబావతః | పార్వతీగర్భజాతశ్చ తవ పుత్రో భవిష్యతి || 91 స్వయం దేవగణానాం స యస్మాదీశః కృపానిధిః | గణశ ఇతి విఖ్యాతో భవిష్యతి జగత్త్రయే || 92 యస్య స్మరణమాత్రేణ విఘ్ననాశో భ##వేత్ ధ్రువం | జగతాం హేతునాzనేన విఘ్ననిఘ్నాభిధో విభుః |. 93 నానావిధాని ద్రవ్యాణి యస్మాద్దేయాని పుణ్యకే | భుక్త్వా లంబోధరత్వం చ తేన లంబోదరః స్మృతః || 94 శనిదృష్ట్యా శిరచ్ఛేదాత్ గజవక్త్రేణ యోజితః | గజాననః శిశుః తేన సర్వేషాం సర్వసిద్ధిదః |. 95 దంతభంగంః పరశునా పశురామస్య వై యతః | హేతునా తేన విఖ్యాతశ్చైకదంతాబిధః శిశుః || 96 పూజశ్చ సర్వదేవానాస్మాకం జగతాం విభుః | సర్వాగ్రేపూజనం తస్య భవితా మద్వరేణ వై || 97 పూజాసు సర్వదేవానామగ్రే సంపూజ్య తం జనః | పూజాఫలమవాప్నోతి నిర్విఘ్నేన వృథాzన్యథా || 98 ఓ శంకరా! పరమపతివ్రతయగు పార్వతీ దేవి మంచివ్రతమైన పుణ్యకవ్రతమును చేయుగాక . ఆ వ్రతము వెలకొలది రాజసూయయాగములు చేసినదానికంటె గొప్ప పుణ్యమును కలిగించును. ఈ వ్రతమును పతివ్రతలందరు చేయజాలరు. ఈపుణ్యకవ్రత మహాత్మ్యమువలన పార్వతీదేవికి పుత్రుడు కలుగును. అతడు దేవతాగణముల కన్నిటికి అధిపతిగావున గణశుడను పేరుతో ప్రసిద్ధినందును. అట్లే అతనిని స్మరించినంచమాత్రమున విఘ్నములన్నియు నశించిపోవునుకావున విఘ్నాధిపుడుగను, విఘ్ననాశకుడుగను పేరు సంపాదించుకొనును. అదేవిధముగా ఈ పుణ్యకవ్రతమున అతని కొసగు నైవేద్యములవలన అతడు లంబోదరుడగును. శనిదేవునియొక్క వక్రదృష్టి ఇతనిపై పడుటవలన అతని శిరచ్ఛేదము జరుగును. అటు పిమ్మట అతనికి గజముయొక్క శిరస్సును తగిలించుటవలన గజానను డగును. అట్లే అతడు పరశురామునియొక్క గండ్రగొడ్డలి దెబ్బచే ఒక దంతమున కొల్పోయి ఏకదంతుడగును. ఈతడు సమస్తదేవతలకు చివరకు నాకు కూడ పూజనీయుడగును. నావరమువలన ఇతడు అందరు దేవతలకంటె ముందుగానే పూజలనందుకొనును. జనులు సమస్తదేవతలను పూజించు సమయమున తొలుత ఈ గణపతిని పూజించినందువలన ఆయా దేవతాపుజ నిర్విఘ్నముగా కొనసాగును. అట్లే పూజచేయుమానవునకు పూజాఫలముకూడ తప్పక లభించును. గణశం చ దినేశం చ విష్ణు శంభుం హుతాశనం | దుర్గామేతాన్సన్నిషేవ్య పూజయేద్దేవతాంతరం || 99 గణశపూజనే విఘ్నం నిర్మూలం జగతాం భ##వేత్ | నిర్వ్యాధిః సూర్యపూజాయాం శుచిః శ్రీవిష్ణుపూజనే || 100 మోక్షశ్చ పాపనాశశ్చ యశ##శ్చైశ్వర్యముత్తమం | తత్వజ్ఞానంసుతృప్తీనాం బీజం శంకరపూజనాత్ || 101 స్వబుధ్ధిశుద్ధిజననం కీర్తితం వహ్నిపూజనం | విధి సంస్కృతవహ్నేస్తు పూజాతో జ్ఞానతో మృతిః || 102 దాతా భోక్తా చ భవతి సంకరాగ్నిషేవణాత్ | హరిభక్తిప్రదం చైవ పరం దుర్గార్చనం శివం || 103 గణపతిని, సూర్యుని, విష్ణుమూర్తిని, శంకరుని, అగ్నిని, దుర్గాదేవిని పూజించిన తరువాతనే ఇతర దేవతలను పూజింపవలెను. గణపతిని పూజించినచో విఘ్నములన్నియు తొలగిపోవును. సూర్యదేవుని పూజించినచో చక్కని ఆరోగ్యము కలుగును. శ్రీమహావిష్ణువును పూజించినచో శుచిత్వము కలుగును. శంకరుని పూజ వలన మోక్షము, పాపనాశనము. కీర్తి ఉత్తమైశ్వర్యము, తత్వజ్ఞానము కలుగును. అగ్నిదేవుని పూజించినచో చక్కని బుద్ధి కలుగును. ప్రతిదినము విధిప్రకారము అగ్న్యాధానము చేయువాడు అగ్నిని పూజించుచున్నచో మరణసమయమునకు అతనికి జ్ఞానముండును. అట్లే ప్రతిదినము అగ్నిని శంకరుని పూజించినచో ధనధాన్యములు కలిగి ఇతరులకు దానములు చేయుచు తాను వాటిననుభవించుచు సుఖముగానుండును. దుర్గాదేవిని అర్చించిన శ్రీహరి భక్తి కలుగును . విపరీతం త్రిజగతామేతేషాం పూజనం వినా | ఏవం క్రమో మహాదేవా కల్పే కల్పేzస్తి నిశ్చితంll 104 ఏతే శశ్వద్విద్యమనా నిత్యాః సృష్టిపరాయణాః l ఆవిర్భవతిరోభావౌ చైతేషామీశ్వరేచ్ఛయాll 105 గణపతి మొదలగు దేవతలను పూజింపక ఇతర దేవతలను పూజించినచో విపరీతము జరుగును. పై పేర్కొనిన క్రమపద్ధతిననుసరించియే ప్రతికల్పమున ఇతర దేవతలను పూజింతురు. ఈ దేవతలు సృష్టికర్తలై నిత్యులైయుందురు. వీరి జననమరణములు శ్రీకృష్ణపరమాత్మ యొక్క ఇచ్ఛననుసరించియే జరగును. ఇత్యుక్త్వా శ్రీహరిస్తత్ర విరరామ సభాతలే | ప్రహృష్టా దేవతా విప్రా పార్వత్యా సహ శంకరః || 106 శ్రీహరి ఆదేవతలున్న సభలో శంకరునితో నిట్లు పలికి ఊరకుండగా దేవతలు పార్వతీపరమేశ్వరులు ఇంకను అచటనున్న బ్రాహ్మణులందరు సంతసించిరి. ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ తృతీయే గణశఖండే నారదనారాయణసంవాదే వ్రతాజ్ఞాగ్రహణం నామషష్ఠోZధ్యాయం ః || బ్రహ్మవైవర్తమహాపురాణములో మూడవదగు గణశఖండమున నారదనారాయణ మహర్షులసంవాదమున చెప్పబడిన పార్వతీదేవి పుణ్యకవ్రతాజ్ఞను స్వీకరించుకథ గల యారవధ్యాయము సమాప్తము.