sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
షోడశోzధ్యాయః - కార్తికేయాగమనం నారాయణ ఉవాచ - నారాయణముని నారదునితో నిట్లనెను. ఇత్యేవముక్త్యా తం శ్రీఘ్రం బోధయిత్వా చ కృత్తికాః | ఉవాచ కించిద్యుక్తం చ వచనం శంకరాత్మజః ||
1 కార్తికేయుడు నందీశ్వరునితో పైవిధముగానని, తన తల్లులగు కృత్తికలను ఊరడించి యోగ్యమైన మాటలను ఇంకను ఇట్లు పలికెను. యాస్యామి శంకరస్థానం ద్రక్ష్యామి సురసంచయం | మాతరం బంధువర్గాంశ్చాప్యాజ్ఞాం మే దత్త మాతరః ||
2 దైవాధీనం జగత్సర్వం జన్మ కర్మ శుభావహం | సంయోగశ్చ వియోగశ్చ న చ దైవాత్పరం బలం ||
3 కృష్ణాయత్తం చ తద్దైవం స చ దైవాత్పరస్తతః | భజంతి సతతం సంతః పరమాత్మానమీశ్వరం ||
4 దైవం వర్దయితుం శక్తః క్షయం కర్తుం స్వలీలయా | న దైవబద్ధస్తద్భక్తశ్చావినాశీతి నిర్ణయః ||
5 తస్మాద్భజత గోవిందం మోహం త్యజత దుఃఖదం | సుఖదం మోక్షదం సారం జన్మమడత్యుభయాపహం ||
6 పరమానందజననం మోహజాలనికృంతనం | శశ్వద్భజంతి యత్సర్వే, బ్రహ్మవిష్ణుశివాదయః ||
7 కోzహం భవాబ్దౌ యుష్మాకం కా వా యూయం మహత్మికాః | తత్కర్మస్రోతసాం సర్వం పుంజీభూతం చ ఫేనవత్ || 8 సంశ్లేషం వా వియోగం వా సర్వమీశ్వరచింతయా | బ్రహ్మాండమీశ్వరాధీనం న స్వతంత్రం విదుర్బుధాః || 9 జలబుద్బుదవత్సర్వమనిత్యం చ జగత్త్రయం | మాయామనిత్యే కుర్వంతి మాయయా మూఢచేతసః || 10 సంతస్తత్ర నలిప్యంతే వాయువత్కృష్ణచేతనః | తస్మాన్మోహం పరిత్యజ్య చాజ్ఞప్తిం దత్త మాతరః || 11 ఓ తల్లులారా! నేను కైలాసమునకు పోయి అచ్చట దేవతా గణమున తల్లియగు పార్వతిని ఇతర బంధువులను చూచెదను. కావున వారిని చూచుటకు నాకు అనుమతినిండు. ప్రాణులయొక్క జన్మ, వారు చేయు కర్మ, సంయోగ వియోగములన్నియు దైవాధీనమైయుండును. దైవముకంటె గొప్పనైనది ఈలోకమున కన్పింపదు. కాని ఆ దైవము శ్రీకృష్ణపరమాత్మకధీనమై ఉండును. ఆ పరమాత్మ దైవమునకతీతుడు. అందువలనే సజ్జనులు పరమాత్మ, ఈశ్వరుడునగు శ్రీకృష్ణుని ఎల్లప్పుడు సేవింపుచుందురు. ఆ పరమాత్మ దైవమును పెంచుటకుగాని నాశనము చేయుటకుగాని సమర్థుడు. అందవలన శ్రీకృష్ణుని భక్తుడు దైవముచే బంధింపబడడు. అట్లే అతడు నాశనమును పొందడు. అందువలన మీరు దుఃఖమును కలిగించు పుత్రవ్యామోహమును వదలిపెట్టి గోవిందుని సేవింపుచుండుడు. సుఖమును మోక్షమును కలిగించునిది, జన్మమృత్యుభయములను తొలగించునది, పరమానందమును కలిగించునది, మోహమను వలను ఛేదించునది అగు ఆ పరబ్రహ్మమును బ్రహ్మవిష్ణుశివాదులు ఎల్లప్పుడు సేవింపుచుందురు. ఈ సంసారసాగరమున నేనెవరు? మీరెవరు? ఈ ఆత్మీయత ఎట్టిది? ఈ ఆత్మీయతాభావము కర్మయను నదులయొక్క పుంజీభూతమైన నురగవంటిది. ఒకరినొకరు కలిసికొనుట, విడిపోవుట ఇవన్నియు ఆ శ్రీకృష్ణపరమాత్మకు అధీనమైయుండును. ఇది స్వతంత్రమైనది కాదని పండితులు వక్కాణింతురు. ఈ ముల్లోకములన్నియు నీటిబుడగవలె అశాశ్వతమైనవి. మాయవలన జ్ఞానము పోగొట్టుకొనినవారు అశాశ్వతమైన ఈ ప్రపంచమున మాయాబుద్దికలిగియుందురు. కాని శ్రీకృష్ణపరమాత్మను ఎల్లప్పుడు ధ్యానించు సజ్జనులు మాయమోహితులు కారు. అందువలన ఓ తల్లులారా! మీరుకూడ మాయామోహితులు కాక నేను కైలాసమునకు పోవుటకై నాకు ఆజ్ఞనిండని వేడుకొనెను. ఇత్యేవముక్త్యా తా నత్వా సార్థం శంకరపార్షదైః | యాత్రాం చకార భగవాన్మనసా శ్రీహరిం స్మరన్ || 12 ఏతస్మిన్నంతరే తత్ర దదర్శ రథముత్తమం | విశ్వకర్మకృతం రమ్యం హీరకేణ విరాజితం || 13 సద్రత్నసారరచితం మాణిక్యేన విరాజితం | పారిజాతప్రసూనానాం మాలాజాలైశ్చ శోభితం || 14 మణీంద్ర దర్పణశ్వేతచామరైరతిదీపితం | క్రీడార్హమందిరై రమ్యైశ్చిత్రిత్రైశ్చిత్రితం వరం || 15 శతచక్రం సువిస్తీర్ణం మనోయాయి మనోహరం | ప్రస్థాపితం చ పార్వత్యా వేష్టితం పార్షదైర్వర్తైః || 16 కార్తికేయుడావిధముగా తన తల్లులగు కృత్తికలతో పలికి, మనస్సులో శ్రీహరిని స్మరింపుచు శంకరుని అనుచరులతో కలసి కైలాసమునకు బయలుదేరెను. అప్పుడు విశ్వకర్మ నిర్మించినది, అందమైనది, రత్నములు, వజ్రములు, మాణిక్యములచే అలంకరింపబడినది, పారిజాత పుష్పములమాలలు గలది, మణుల అద్దములు, తెల్లని చామరములతో ప్రకాశించునది, అనేక మందిరములతో, చిత్రములతో శోభిల్లునది, నూరు చక్రములు కలిగి మిక్కిలి విశాలమైనది, పార్వతీదేవి యొక్క అనుచరగణముతో నున్నది అగు రథమును పార్వతీదేవి అచ్చటకు పంపించెను. సమారుహంతం యానం తా హృదయేన విదూయతా | సహసా చేతనాం ప్రాప్య ముక్తకేశ్యః శుచాతురాః || 17 దృష్ట్వా చ స్వపురః స్కందం స్తంభితాశ్చాతిశోకతః | ఉన్మత్తా ఇవ తత్రైవ వక్తుమారభిరే భియా || 18 కార్తికేయుడు పార్వతీదేవి పంపిన రథమునెక్కుచున్నప్పుడు అచ్చటనున్న కృత్తికాగణము మిక్కిలి దుఃఖముతో వెంట్రుకలు విరబోసికొని మూర్ఛపడి తిరిగి తెలివికి వచ్చి ఏడ్చుచు పిచ్చిపట్టినట్లు అతనితో నిట్లనిరి. కృత్తికా ఊచుః - కృత్తికలిట్లనిరి. కిం కుర్మః క్వ యాసి త్వం నాయం ధర్మస్తవాధునా || 19 స్నేహేన వర్థితోzస్మాభిః పుత్రోzస్మాకం స్వధర్మతః | నాయం ధర్మో మాతృవర్గాననురక్తస్సుతః త్యజేత్ || 20 ఇత్యుక్త్వా కృత్తికాః సర్వా కృత్వా వక్షసి తం సుతం | పునర్మూర్ఛామవాపుస్తాః సుతవిచ్ఛేదదారుణః || 21 కుమారో బోధయిత్వా తా అధ్యాత్మవచనేన వై | తాభిశ్చ పార్షదైస్సార్థమారురోహ రథం మునే || 22 ఇప్పుడు మేమేమి చేయవలెను? ఎచ్చటకు పోవలెను? మేము సదా నిన్నాశ్రయించియున్నాము కదా! మమ్ములను వదలిపోవుట నీకు ధర్మముకాదు. మేము నిన్ను ప్రేమతో పెంచితిమి కావున నీవు మాకు ధర్మముననుసరించి పుత్రుడవు. ప్రేమగల పుత్రుడవు మాతృగణమును వదలిపోవుట ధర్మముకాదు. అనుచు కృత్తికలు తమ రొమ్ముపై అతనినుంచుకొని మరల మూర్ఛచెందిరి. పుత్రవియోగమతిదారుణమైనదికదా! అప్పుడు స్కందుడు వారిని అధ్యాత్మప్రబోధముతో ఓదార్చి వారితో, శివుని అనుచరగణముతో కలసి పార్వతీదేవి పంపిన రథమునధిరోహించెను. పూర్ణకుంభం ద్విజం వేశ్యాం శుక్లధాన్యాని దర్పణం | దధ్యాజ్యం మధు లాజాంశ్చ పుష్పం దూర్వాక్షతాన్ సితాన్ || 23 వృషం గజేంద్రం తరగం జ్వలదగ్నిం సువర్ణకం | పూర్ణం చ పరిపక్వాని ఫలాని వివిధాని చ || 24 పతిపుత్రవతీం నారీ ప్రదీపం మణిముత్తమం | ముక్తాం ప్రసూనమాలాం చ సద్యోమాంసం చ చందనం || 25 దదర్శైతాని వస్తూని మంగళాని పురోమునే | శృగాలం నకులం కుంభం శవం వామే శుభావహం || 26 రాజహంసం మయూరం చ ఖంజనం చ శుకం పికం | పారావతం శంఖచిల్లం చక్రవాకం చ మంగళం || 27 కృష్ణసారం చ సురభిం చమరీం శ్వేతచామరం | ధేనుం చ వత్ససంయుక్తం పతాకాం దక్షిణ శుభాం || 28 నానాప్రకారవాద్యం చాప్యశ్రౌషీన్మంగళధ్వనిం | మనోహరం చ సంగీతం ఘంటా శంఖధ్వనిం తథా || 29 దృష్ట్వా శ్రుత్వా మంగళం సహ్యగమత్తాతమందిరం | క్షణనానందయుక్తశ్చ మనోయాయిరథేన చ || 30 కుమారః ప్రాప్య కైలాసం న్యగ్రోధాక్షయమాలకే | క్షణం తస్థౌ కృత్తికాభిః పార్షదప్రవరైః సహ || 31 కార్తికేయుడు పార్వతిపంపిన రథమునెక్కి కైలాసమునకు వెళ్ళుచున్నప్పుడు అతనికి పూర్ణకుంభము, బ్రాహ్మణుడు, వేశ్య, తెల్లని ధాన్యములు, అద్దము, పెరుగు, నేయి, తేనె, పేలాలు, పూవులు గరిక, తెల్లని అక్షతలు, వృషభము, ఏనుగు, గుఱ్ఱము, బాగుగా మండుచున్న అగ్ని, బంగారము, మంచిగా పండిన పండ్లు, భర్త, పుత్రులుగలస్త్రీ, దీపము, మణులు, ముత్యాలహారము, పుష్పములమాల, అప్పుడే చంపి ఛేదించిన మాంసము, చందనములను ఎదురుగా చూచెను నక్క, రాజహంస, కుంభము, శవములు ఎడమవైపు పోవుచుండగా చూచెను. ముంగిస, నెమలి, కాటుకపిట్ట, చిలుక, కోకిల, పావురము, శంఖచిల్లము, చక్రవాకపక్షి, కృష్ణసారము, ఆవు, చమరీమృగము, తెల్లని చమరమృగము, దూడతోనున్న ఆవు, పతాకము మొదలగు మంగళవస్తువులను కుడివైపు చూచెను. అట్లే అనేకవిధములగు మంగళవాద్యములు, ఇంపైన సంగీతము, గంట, శంఖముల చప్పుడును వినెను. ఇట్లు కార్తికేయుడు తాను వెళ్ళుచున్న త్రోవలో మంగళవస్తువులను, చూచుచు, మంగళవాద్యములను వినుచ మనోవేగమున పోవుచున్న రథమును తండ్రియగు శంకరుని నివాసమును చేరెను. ఆ కైలాసపర్వతమున అక్షయవటవృక్షము క్రింద తన తల్లులగు కృత్తికలతో, శివుని అనుచరగణముతో కొంత సమయముండెను. పార్వతీ మంగళం కృత్వా రాజమార్గం మనోహరం | పద్మరాగైరింద్రనీలైః సంస్కృతం పరితః పురం || 32 రంభాస్తంభసమూహైశ్చ పట్టసూత్రాంశుకైస్తథా | శ్రీఖండపల్లవైర్యుక్తం పూర్ణకుంభైస్సుశోభితం || 33 పూర్ణకుంభజలైర్వ్యాప్తం సిక్తం చందనావారిభిః | అసంఖ్య రత్నదీపైశ్చ మణిరాజైర్విరాజితం || 34 నటనర్తక వేశ్యానాముత్సవైః సంకులం సదా | బందిభిర్విప్రవర్గైశ్చ దూర్వాపుష్పకరైర్యుతం || 35 పతిపుత్రవతీభిశ్చ సాధ్వీభిశ్చ సమన్వితం | లక్ష్మీం సరస్వతీం దుర్గాం సావిత్రీం తులసీం రతిం || 36 అరుంధతీమహల్యాం చ దితిం తారాం మనోరమాం | అదితిం శతరూపాం చ శచీం సంధ్యాం చ రోహిణీం || 37 అనసూయాం తథా స్వాహాం సంజ్ఞాం వరుణకామినీం | ఆకూతిం చ ప్రసూతిం చ దేవహూతిం చ మేనకాం || 38 తామేకపాటలామేకపర్ణాం మైనాక కామినీం | వసుంధరాం చ మనసాం పురస్కృత్య సమాయ¸° || 39 పార్వతీదేవి రాజమార్గమును అందముగా చేయించెను. అట్లే దానిని పద్మరాగమణులతో, ఇంద్రనీలమణులతో చుట్టు అలంకరింపచేసెను. త్రోవపొడువున అరటిస్తంభములను స్వాగతతోరణములను ఉంచెను. పూర్ణకుంభములలో శ్రీఖండవృక్షముయొక్క చిగురుటాకులనుంచినది. మార్గమునంతయు శ్రీచందనముయొక్క నీటిని చల్లించి అసంఖ్యాకములైన రత్నదీపములను మణులను నిలిపినది. అది నటులు, నర్తకులు, వేశ్యలతో సందడిగానుండెను. ఇంకను వందిమాగధులు, గఱక, పుష్పములు చేతులతో ధరించి బ్రాహ్మణులు పతిపుత్రులుగల సాధ్వామణులచ్చటనుండిరి. పార్వతీదేవి లక్ష్మి, సరస్వతి, దుర్గ, సావిత్రి, తులసి, రతి, అరుంధతి, అహల్య, దితి, తార, మనోరమ, అదితి, శతరూప, శచి, సంధ్య, రోహిణి, అనసూయ, స్వాహ, సంజ్ఞ, వరుణునిభార్య, అకూతి, ప్రసూతి, దేవహూతి, మేనక, ఏకపాటల, ఏకపర్ణ, మైనాకునిసతి, భూదేవత, మనసాదేవి, మొదలగు దేవతాస్త్రీలను వెంటపెట్టుకొని కుమారస్వామిని ఎదుర్కొనుటకు బయలుదేరినది. రంభా తిలోత్తమా మేనా ఘృతాచీ మోహినీ శుభా | ఊర్వశీ రత్నమాలా చ సుశీలా లలితా కళా || 40 కదంబమాలా సురసా వనమాలా చ సుందరీ | ఏతాశ్చాన్యాశ్చ బహవో విప్రేంద్రాప్సరసాంగణాః || 41 సంగీతనర్తనపరాః సస్మితాః వేషసంయుతాః | కరతాళకరాః సర్వాః జగ్మురానందపూర్వకం || 42 దేవాశ్చ మునయః శైలా గంధర్వాః కింనరాస్తథా | సర్వే యయుః ప్రముదితాః కుమారస్యానుమజ్జనే || 43 నానాప్రకారవాద్యైశ్చ రుద్రైర్వా పార్షదైః సహ | భైరవైః క్షేత్రపాలైశ్చ య¸°సార్థం మహేశ్వరః || 44 పార్వతీదేవి వెంబడి కార్తికేయుని ఎదుర్కొనుటకు రంభ, తిలోత్తమ, మేన, ఘృతాచి, మోహిని, ఊర్వశి, రత్నమాల, సుశీల, లలిత, కళ, కదంబమాల, సురస, వనమాల, మొదలగు అప్సర స్త్రీలు పాటలుపాడుచు, నాట్యములు చేయుచు, అనేక వేషములతో చప్పట్లు కొట్టుచు సంతోషముతో వెళ్ళిరి. ఇంకను బ్రాహ్మణులు, దేవతలు, మునులు, శైలాధిదేవతలు, గంధర్వులు, కిన్నరులు, మొదలగువారందరు కుమారస్వామియొక్క పట్టాభిషేకమహోత్సవమునకై సంతోషముతో బయలుదేరిరి. శంకరుడు అనేకవిధములైన వాద్యములతో, తన రుద్రగణము, అనుచరులు, భైరవులు, క్షేత్రపాలురు వెంటరాగా కుమారస్వామినెదుర్కొనుటకు బయలుదేరెను. అథ శక్తిథరో హృష్టో దృష్ట్వాz రాత్పార్వతీ తదా | అవరుహ్య రథాత్తూర్ణం శిరసా ప్రణనామ హ || 45 తం పద్మాప్రముఖం దేవీగణం చ మునికామినీం | శివం చ పరయా భక్త్యా సర్వాన్సంభాష్య యత్నతః || 46 అప్పుడు కుమారస్వామి పార్వతీదేవిని సమీపమునుండి చూచి సంతోషముతో రథమునుండి దిగి ఆమెకు నమస్కరించెను. ఆ తర్వాత అతడు లక్ష్మీదేవి మొదలగు దేవతాస్త్రీలను, మునిపత్నులను, శివుని పరమభక్తితో నమస్కరించెను. కార్తికేయం శివా దృష్ట్వా క్రోడే కృత్వా చుచుంబ చ | శంకరశ్చ సురాః దేవ్యో వై శైలయోషితః || 47 పార్వతీప్రముఖా దేవ్యస్తథా దేవశ్చ శంకరః| శైలాశ్చ మునయస్సర్వే దదుస్తసై#్మ శుభాశిషః || 48 కుమారః సగణౖ సార్థమాగత్య చ శివాలయం | దదర్శ తం సభామధ్యే విష్ణుం క్షీరోదశాయినం || 49 రత్నసింహాసనస్థం చ రత్నభూషణ భూషితం | ధర్మబ్రహ్మేంద్ర చంద్రార్క వహ్నివాయ్యాదిభిర్యుతం || 50 ఈషద్ధాస్యం ప్రసన్నాస్యం భక్తానుగ్రహకారకం | స్తుతం మునీంద్రైర్దేవేంద్రైః సేవితం శ్వేతచామరం || 51 తం దృష్ట్వా జగతాం నాథం భక్తినమ్రాత్మకంధరః | పులాకాన్విత సర్వాంగః శిరసా ప్రణనామ హ || 52 విధిం ధర్మం చ దేవాంశ్చ మునీంద్రాంశ్చ ముదాన్వితాన్ | ప్రణనామ పృథక్తత్ర ప్రాప తేభ్యః శుభాశిషః || 53 పృథక్సంభాష్య సర్వాంశ్చాప్యువాస కనకాసనే | దదౌ ధనాని విప్రేభ్యః పార్వత్యా సహ శంకరః || 54 పార్వతీదేవి కార్తికేయుని ఒడిలోనికి తీసికొని అతని ముఖమును ముద్దుపెట్టుకొనెను. శంకరుడు దేవతలు, పర్వతరాజులు, దేవతాస్త్రీలు, పర్వతరాజుల భార్యలందరు అతనిని దగ్గరకు తీసికొని లాలించిరి. తరువాత పార్వతీదేవి మొదలగు దేవతాస్త్రీలు, శంకరుడు, పర్వతరాజులు, మునులందరు కుమారస్వామికి ఆశీర్వచనముల నొసగిరి. కుమారస్వామి శివగణముతో అచ్చటకువచ్చి కైలాసమునందలి సభలో శేషశాయియగు శ్రీమహావిష్ణువును దర్శించెను. అటుపిమ్మట రత్నసింహాసనముపై రత్నభూషణభూషితుడై ధర్మదేవత, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, అగ్ని, వాయువు మొదలగు దేవతలు పరివేష్టించి యుండగా చిరునవ్వుతో భక్తులననుగ్రహించువాడు, మునిశ్రేష్ఠులు, దేవతా శిరోమణులచే సేవింపబడివాడు, అగు శ్రీమహావిష్ణువును కుమారస్వామి చూచి భక్తిచే తలవంచుకొని పులకాంచిత శరీరుడై అతనికి నమస్కరించెను. తరువాత బ్రహ్మదేవుని, ధర్మదేవతను ఇతర దేవతలను, మునిశ్రేష్ఠులను వేరువేరుగా నమస్కరించి వారి ఆశీస్సులను పొంది వారి అనుమతితో కనకాసనమున కూర్చుండెను. అప్పుడు పార్వతీపరమేశ్వరులు సంతోషముతో బ్రాహ్మణులకందరకు అపరిమితమైన దానములు చేసిరి. ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణ తృతీయే గణపతిఖండే నారదనారాయణసంవాదే కార్తికేయాగమనంనామషోడశోzధ్యాయః | శ్రీబ్రహ్మవైవర్తమహాపురాణమున మూడవదగు గణపతిఖండమున నారదనారాయణమునుల సంవాద సమయమున చెప్పబడిన కార్తికేయుడు కైలాసపర్వతమునకు వచ్చుటయను విషయముగల పదునారవ అధ్యాయము సమాప్తము.