sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
పంచవింశతితమోZధ్యాయః - జమదగ్ని, కార్తవీర్యుల యుద్ధము నారాయణ ఉవాచ - నారాయణముని ఇట్లనెను. హరిం స్మరన్కార్తవీర్యో హృదయేన విదూయతా | దూతం ప్రస్థాపయామాస కుపితో మునిసన్నిధిం || 1 యుద్ధం దేహి మునిశ్రేష్ఠ కిం వా ధేనుం చ వాంఛితం | మహ్యం భృత్యాయాతిథయే సువిచార్య యథోచితం || 2 దూతస్య వచనం శ్రుత్వా జహాస మునిపుంగవః | హితం సత్యం నీతిసారం సర్వం దూతమువాచ హ || 3 కార్తవీర్యుడు తన మనస్సు బాధపడుచుండగా శ్రీహరిని స్మరించుకొనుచు కోపముతో మునిదగ్గరకు ఒక దూతను పంపెను. ఆ దూత కార్తవీర్యుడు పలికినట్లు ఇట్లనెను. ఓ మునీ నేను నీకు సేవకుడను, అతిథినికూడ, ఈరెండిటినిచక్కగా ఆలోచించుకొని నేను కోరుకొనిన కామధేనువునైనను నాకిమ్ము; లేనిచో యుద్ధమునకైనను సిద్ధముకమ్మని పలికెను. జమదగ్నిముని ఆ దూత మాటలను విని నవ్వుచు హితవైనది, సత్యమైనది, నీతియుక్తమైన మాటలనిట్లు పలికెను. మునిరువాచ - జమదగ్ని ముని ఇట్లు పలికెను దృష్టో నృపో నిరాహారః సమానీతో మయా గృహం - వివిధం చ యథాశక్త్యా భోజితశ్చ యథోచితం || 4 కపిలాం యాచతే రాజా మమప్రాణాధికాం ప్రియాం | తాం దాతుమక్షమో దూత యుద్ధం దాస్యామి నిశ్చితం || 5 మునేస్తద్వచనం శ్రుత్వా దూతః సర్వమువాచ హ | నృపేంద్రం చ సభామధ్యే సన్నాహైస్సంయుతం భియా || 6 తిండితిప్పలు లేని రాజును చూచి ఇంటికి తీసికొనివచ్చి నా శక్తికొలది అతనికి తగిన భోజనమును వివిధ పదార్థములతో పెట్టితిని. అట్టి రాజు నా ప్రాణములకంటె ప్రియమైన కామధేనువు కావలెనని అడుగుచున్నాడు. కాని నేనా ఆవును ఇవ్వలేను కావున తప్పక యుద్ధము చేయుదుననెను. జమదగ్ని మహర్షి మాటలు విన్న దూత కార్తవీర్యునకు సభలో ఈ విషయమునంతయు చెప్పగా ఆతడు భయముతో యుద్ధసన్నాహము చేయమొదలిడెను. మునిశ్చ కపిలామాహ సాంప్రతం కి కరోమ్యః | కర్ణధారం వినా నౌకా తథా సైన్యం వినా మయా || 7 కపిలా చ దదౌ తసై#్మ శస్త్రాణి వివిధాని చ | యుద్ధశాస్త్రోపదేశం చ సంధానం చౌపయోగికం || 8 జయం భవతు తే విప్ర యుద్ధే జేష్యసి నిశ్చితం | తవ మృత్యుర్న భవితా సత్యమస్త్రం వినా మునే || 9 నృపేణ సార్థం తే యుద్ధమయుక్తం బ్రాహ్మణస్య చ | దత్తాత్రేయస్య శిష్యేణ వ్యర్థం వై శక్తిధారిణా | ఇత్యుక్త్వా కపిలా బ్రహ్మాన్ విరరామ మనస్వినీ || 10 మునిర్మనస్వౌ సైన్యం చ సజ్జీకృత్యతతో మునే | గృహృత్వా సర్వసైన్యం చ స జగామ రణాంగణం || 11 జమదగ్నిముని కామధేనువు దగ్గరకు పోయి నేనిప్పుడు ఏమి చేయవలెను? నావికుడు లేని నౌకవలె నేను లేనిచో నాసైన్యముండునని పలుకగా ఆ కామధేనువతనికి అనేక విధములైన శస్త్రములను ఇచ్చి యుద్ధ శాస్త్రోపదేశమును, శస్త్ర సంధానపద్ధతిని, శస్త్రములయొక్క ఉపయోగము మొదలగువాటినన్నిటిని తెలిపి ఓ మునీ! నీకు యుద్ధమున తప్పక విజయము లభించును. నీకు ఏ శస్త్రమువలనను మరణము సంభవింపదని చెప్పుచు దత్తాత్రేయ మహర్షి శిష్యుడు, వ్యర్థముగా శక్తిని ధరించి తిరుగుచున్న కార్తవీర్యునితో బ్రాహ్మణుడవగు నీవు యుద్ధముచేయుట తగదని కామధేనువు పలికెను. విజ్ఞుడైన జమదగ్నిమునికూడా తన సైన్యమునంతయు సమీకరించుకొని రణరంగమునకు బయలుదేరెను. రాజా జగామ యుద్ధాయ ననామ మునిపుంగవం | ఉభయోః సైన్యయోర్యుద్ధం బభూవ బహుదుష్కరం || 12 రాజసైన్యం జితం సర్వం కపిలాసేనయా బలాత్ | విచిత్రం చ రథం రాజ్ఞో బభంజే లీలయా రణ || 13 ధనుశ్చిచ్ఛేద సజ్యం తత్సా సేనా కాపిలీ ముదా | నృపేంద్రః కాపిలేయాని జేతుం సైన్యాని చాక్షమః || 14 సైన్యాని తం శస్త్రవృష్ట్యా న్యస్తశస్త్రం చకార హ | శరవృష్ట్యా శస్త్రవృష్ట్యా రాజామూర్ఛామవాప హ || 15 కార్తవీర్యుడు కూడ యుద్ధరంగమును ప్రవేశించి తొలుత జమదగ్నికి నమస్కరించి యుద్ధమును ప్రారంభించెను. రెండు సైన్యములమధ్య గొప్పయుద్ధము జరిగినది. కపిల సృష్టించిన సైన్యమువలన రాజసైన్యము జయింపబడెను. అట్లే రాజుయొక్క రథము విచిత్రముగా విరిగిపో యెను. కపిల సృష్టించిన సేనవలన ఆ మహారాజుయొక్క ధనుస్సుకూడ విరిగిపోయెను. అందువలన కార్తవీర్యుడు కపిలసైన్యములను జయింపలేకపోయెను. ఆ సమయమున కపిలసైన్యము శస్త్రవర్షముచే రాజును ఉక్కిరిబిక్కిరిచేసెను. ఆ సైన్యముయొక్క శరవర్షమునకు, శస్త్రవర్షమునకు తట్టుకొనలేక కార్తవీర్యుడు రణరంగమున మూర్ఛపొందెను. కించిచ్ఛిష్టం బలం రాజ్ఞ ః కించిదేవ పలాయితం | మునీంద్రో మూర్ఛితం దృష్ట్యా నృపేంద్రమతిథిం మునే || 16 కృపానిధిశ్చ కృపయా తత్సైన్యం సంజహార చ | గత్వా సైన్యం విలీనం చ కపిలాయాం చ కృత్రిమం || 17 నృపయ మునినా శీఘ్రం దత్తాశ్చరణరేణవః | ఆశీర్వాదం ప్రదత్తం చ జయోస్త్వి కృపాళునా | కమండలు జలం ప్రోక్ష్య జీవయామాస తం నృపం || 18 స రాజా చేతనాం ప్రాప్య సముత్థాయ రణాంగణాత్ | మూర్ద్నా భక్త్యా చ మునిశ్రేష్ఠం కృతాంజలిః || 19 మునిః శుభాశిషం దత్వా రాజానం త్వాలిలింగ సః | పుస్తకం స్నాపయిత్వా చ భోజయామాస యత్నతః || 20 యుద్ధమున రాజగు కార్తవీర్యుని సైన్యము కొంతమాత్రమే మిగిలియుండెను. మరికొంత పలాయనమును చిత్తగించెను. మునీంద్రుడగు జమదగ్ని తన తిథియగు కార్తవీర్యుడు మూర్ఛనొందియుండుటను కమినించి దయతో ఆ మహారాజుయొక్క మిగిలిన సైన్యమును చంపక వదలిపెట్టెను. కపిల సృష్టించిన సైన్యము కపిలయందు విలీనమయ్యెను. అప్పుడు ముని దయతో తనికి జయము కలుగునట్లు ఆశీర్వదించి తన కమండలువులోనున్న నీటితో ఆ మహారాజు మూర్ఛనుండి తేరుకొనునట్లు చేసెను. రాజగు కార్తవీర్యుడు రణరంగమున మూర్ఛనుండి తేరుకొని భక్తితో మునికి నమస్కరించి చేతులు కట్టుకొని నిలబడెను. ముని యాతనికి శుభాశ్శీసుల నొసగి ఆలింగనము చేసుకొని అతనికి స్నానము చేయించి భోజనమును సైతమొసగెను. నవనీతం హిహృదయం బ్రాహ్మణానాం తు సంతతం | అన్యేషాం క్షురధారాభమసాధ్యం దారుణం సదా | ఉవాచ తం మునిశ్రేష్ఠో గృహం గచ్ఛ ధరాధిప || 21 బ్రాహ్మణులయొక్క హృదయమెల్లప్పుడు నవ్యనవనీతములెన మృదువుగానుండును. ఇతరులయొక్క మనస్సు కత్తియొక్క అంచువలె దారుణమైయుండును. అందువలన జమదగ్నిముని రాజుతో నీవు ఇంటికి వెళ్ళిపొమ్మని పలికెను. రాజోవాచ - రాజగు కార్తవీర్యుడిట్లు పలికెను. రణం దేహి మహాబాహో ధేనుం కిం వా మయేప్సితాం || 22 పరాక్రమశాలివగు జమదగ్ని మహర్షీ! నాకు ఇష్టమైన కామధేనువునైననిమ్ములేనిచో నాతో యుద్ధమునైన సేయుమని కోరెను. ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ తృతీయే గణపతిఖండే నారదనారాయణ సంవాదే జమదగ్ని కార్తవీర్యార్జున యుద్ధవర్ణనం నామ పంచవింశోZధ్యాయః || శ్రీ బ్రహ్మవైవర్తమహాపురాణములో మూడవదగు గణపతిఖండమున నారదనారాయణుల సంవాదసమయమున పేర్కొనబడిన జమదగ్ని కార్తవీర్యార్జునుల యుద్ధవర్ణనము కల ఇరువదియైదవ అధ్యాయము సమాప్తము.