sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
ద్వాతింశత్తమో
భృగురువాచ - భార్గవరాముడిట్లనెను.
సంప్రాప్త కవచం నాథ శశ్వత్సర్వాంగ రక్షణం | సుఖదం మోక్షదం సారం శత్రు సంహార కారణం || 1
అధునా భగవన్మంత్రం స్తోత్రం పూజావిధిం ప్రభో | దేహి మహ్యమనాథాయ శరణాగత పాలక || 2
ఓ పరమేశ్వరా! నీదయవలన సమస్తావయములను రక్షించు కవచమును నాకుపదేశించితివి . ఇది సుఖమును, మోక్షమును, కలిగించును, సమస్త శత్రువులను సంహరించును. ఇక ఇప్పుడు శ్రీకృష్ణమంత్రమును, అతని స్తోత్రమును, పూజించు విధానమును అనాథనగు నాకు ఉపదేశింపుము అని అనెను.
మహాదేవ ఉవాచ- శంకరుడిట్లు పరశురామునితో ననెను-
ఓం శ్రీం నమఃశ్రీకృష్ణాయ పరిపూర్ణతమాయ స్వాహా | మంత్రేషు మంత్ర రాజోzయం మహాన్ సప్తాదశాక్షరః || 3
సిద్ధోzయం పంచలక్షేణ జపేన మునిపుంగవ | తద్దశాంశం చ హవనం తద్దశాంశాభిషేచనం ||
తర్పణం తద్దశాంశం చ తద్దశాంశం చ మార్జనం | సువర్ణానాం చ శతకం పురశ్చరణ దక్షిణా || 4
మంత్రసిద్ధస్య పుంసశ్చ విశ్వం కరతలే మునే | శక్తః పాతుం సముద్రాంశ్చ విశ్వం సంహర్తుమీశ్వరః || 5
పాంచభౌతిక దేహేన వైకుంఠం గంతుమీశ్వరః | తస్య సంస్పర్శ మాత్రేణ పాదపంకజరేణునా ||
పూతాని సర్వతీర్థాని సద్యః పూతా వసుంధరా || 6
"ఓం శ్రీం నమః శ్రీకృష్ణాయ పరిపూర్ణతమాయ స్వాహా" అను పదునేడు అక్షరముల మంత్రము సమస్త మంత్రములందు శ్రేష్ఠమైనది. ఈ మంత్రమును ఐదులక్షలమార్లు జపించినచో అది సిద్ధించును. ఆతరువాత జపమున పదియవ వంతు హోమము చేయవలెను. హోమములో పదియవ భాగముతో అభిషేకము చేయవలెను. అభిషేక సంఖ్యలో పదియవ భాగముతో తర్పణము చేయవలెను. దానిలో పదియవ భాగముతో మార్జనము సేయవలెను. నూరు సువర్ణములను పురశ్చరణ దక్షిణగా నీయవలెను.
ఈ విధముగా మంత్రసిద్ధి కలిగినచో అతనికి ప్రపంచమే హస్తగతమై యుండును. అతడు సప్తసముద్రములను త్రాగుటకు గాని సమస్తప్రపంచమును సంహరించుటకుగాని సమర్థుడగును. అతడీ పాంచభౌతికమైన దేహముతోనే వైకుంఠమునకు వెళ్ళగలుగును. అతనియొక్క స్పర్శవలన పాదరేణువుల వలన సమస్త పుణ్యతీర్థములు, సమస్త భూభాగము పవిత్రమగుచున్నది.
ధ్యానం చ సామవేదోక్తం శ్రుణు మన్ముఖతో మునే | సర్వేశ్వరస్య కృష్ణస్య భక్తి ముక్తి ప్రదాయి చ || 7
నవీన జలద శ్యామం నీలేందీవర లోచనం | శరత్పార్వణ చంద్రాస్యమీషద్ధాస్యం మనోహరం || 8
కోటి కందర్పలావణ్య లీలా ధామ మనోహరం | రత్న సింహాసనస్థం తం రత్నభూషణ భూషితం || 9
చందనోక్షితసర్వాంగం పీతాంబరధరం వరం | వీక్ష్మమాణం చ గోపీభిః సస్మితాభిశ్చ సంతతం || 10
ప్రపుల్లమాలతీమాలా వనమాలా విభూషితం| దధతం కుందపుష్పాఢ్యాం చూడాం చంద్రకచర్చితాం || 11
ప్రభాం క్షిపంతీం నభసశ్చంద్ర తారాన్వితస్య చ | రత్న భూషిత సర్వాంగం రాధావక్షః స్థల స్థితం || 12
సిధ్దేంద్రైశ్చ మునింద్రైశ్చ దేవేంద్రైః పరిషేవితం | బ్రహ్మ విష్ణు మహేశైశ్చ శ్రుతిభిశ్చ స్తుతం భ##జే || 13
శ్రీకృష్ణధ్యానము సామవేదమున చెప్పబడినది. భక్తిని, ముక్తిని కలిగించు ఆ సర్వేశ్వరుని ధ్యానశ్లోకములను నీకుచెప్పుచున్నాను.
నూతనమేఘమువలె నల్లనివాడు, నీలోత్పలమువంటి కన్నులు గలవాడు, శరత్కాలపు పూర్ణిమా చంద్రునివలె గుండ్రని ముఖము గలవాడు, చిరునవ్వు కలవాడు, కోటి మన్మథుల యొక్క అందము కలవాడు, రత్నభూషణములు కలవాడు, రత్నసింహాసనమున నుండువాడు, చందనమును శరీరమునందదంతయు పూసికొన్నవాడు, పచ్చని పట్టు వస్త్రములు ధరించువాడు. మాలచే చుట్టబడిన కొప్పుగలవాడు, రాధాదేవియొక్క వక్షస్థలమున నున్నవాడు, సిద్ధులు, దేవతలు, మునులు, త్రిమూర్తులు వేదములు మున్నగు వాటిచే ఎల్లప్పుడు స్తుతులనందుకొనువాడగు శ్రీకృష్ణుని నేను సేవింతును.
ద్యానేనానేన తం ధ్యాత్వా చోపచారాంస్తు షోడశ | దత్వా భక్త్యా చ సంపూజ్య సర్వజ్ఞత్వం లభేత్సుమాన్ || 14
అర్ఘ్యం పాద్యం చాసనం చ వసనం భూషణం తథా | గామర్ఘ్యం మధుపర్కంచ యజ్ఞ సూత్రమనుత్తమం || 15
ధూపదీపౌ చ నైవేద్యం పునరాచమనీయకం | నానా ప్రకార పుష్పాణి తాంబూలం చ సువాసితం || 16
మనోహరం దివ్యతల్పం కస్తూర్యగరు చందనైః || భక్త్యా భగవతే దేయం మాల్యం పుష్పాంజలి త్రయం || 17
పైధ్యానశ్లోకములచే శ్రీకృష్ణ పరమాత్మను ధ్యానించి, అతనికి షోడశోపచారముల నిర్వర్తించి భక్తితో పూజించిన వానికి సర్వజ్ఞత్వము తప్పక లభించును.
ఆర్ఘ్యము, పాద్యము, ఆసనము, వస్త్రము, భూషణములు, గోవు, మధుపర్కము, యజ్ఞోపవీతము, ధూపదీపములు, నైవేద్యము, పునరాచమనము, అనేక విధములగు పుష్పములు, చక్కని వాసనగల తాంబూలము, కస్తూరీ, అగరు, చందనము వాసన కల దివ్య తల్పము, మాలలు, ముమ్మారు పుష్పాంజలి యనునవి షోఢశోప చారములు ఇది పరమాత్మను పూజించు పద్ధతి.
తతః షడంగం సంపూజ్య పశ్చాత్సంపూజ యేద్గణం | శ్రీదామానం సదామానం వసుదామానమేవ చ || 18
హరిభానుం చంద్రభానుం సూర్యభానుం సుభానుకం | పార్షద ప్రవరాన్సప్త పూజయేద్భక్తి భావతః || 19
గోపీశ్వరీం రాధికాం చ మూల ప్రకృతిమీశ్వరీం | కృష్ణశక్తిం కృష్ణపూజ్యాం పూజయేద్భక్తి పూర్వకం || 20
గోపగోపీగణం శాంతం మా బ్రహ్మణం చ పార్వతీం | లక్ష్మీం సరస్వతీం పృథ్వీం సర్వదేవం సపార్షదం || 21
దేవషట్కం సమభ్యర్చ్య పునః పంచోపచారతః | పశ్చాదేవం క్రమేణౖవ శ్రీకృష్ణ పూజయేత్సుధీః || 22
గణశం చ దినేశం చ వహ్నిం విష్ణుం శివం శివాం | దేవషట్కం సమభ్యర్చ్య చేష్టదేవం చ పూజయేత్ || 23
గణశం విఘ్ననాశాయ వ్యాధినాశాయ భాస్కరం | ఆత్మనః శుద్ధయే వహ్నిం శ్రీవిష్ణు ముక్తిహేతవే || 24
జ్ఞానాయ శంకరం దుర్గాం పరమైశ్వర్యహేతువే | సంపూజనే ఫలమిదం విపరీతమపూజనే || 25
తతః కృత్వా పరీహార మిష్టదేవం చ భక్తితః | స్తోత్రం చ సామవేదోక్తం పఠేద్భక్త్యాచ తచ్ఛృణు || 26
శ్రీకృష్ణుని షోడశోపచారములతో పూజించిన తరువాత షడంగపూజను చేయవలెను. అటుపిమ్మట శ్రీదాముడు, సుదాముడు, వసుదాముడు, హరిభానుడు, చంద్రభానుడు, సూర్యభానుడు, సుభానుడను శ్రీకృష్ణపరమాత్మయొక్క అనుచరులను భక్తితో పూజించి, గోపీశ్వరి, మూలప్రకృతిరూపిణి, కృష్ణశక్తి స్వరూపయగు రాధాదేవిని భక్తితో పూజచేయవలెను. అటుపిమ్మట గోపకులను, గోపికాగణమును, బ్రహ్మదేవుని, పార్వతిని, లక్ష్మిని, సరస్వతిని, భూమిని, అనుచర వర్గసహితమైన సమస్తదేవతలను, గణపతిని, సూర్యుని, అగ్నిని, విష్ణువును, శివుని, దుర్గాదేవిని అర్చించిన పిదప ఇష్టదేవతను మరల పూజింపవలెను.
గణపతిని విఘ్నములు తొలగిపొవుటకైప, ఆరోగ్యమునకై సూర్యుని, ఆత్మశుద్ధికై అగ్నిదేవుని, ముక్తి కలుగుటకు శ్రీమహావిష్ణువును, జ్ఞానసిద్ధికై శంకరుని, పరమైశ్వర్యము లభించుటకు దుర్గాదేవిని పూజింపవలెను. దైవషట్కమును ఆరాధించినచో పై ఫలితము కలుగును. లేనిచో విపరీతపు ఫలితములు కలుగును. ఇట్లు పూజించి పరిహారమును నిర్వర్తించి ఇష్టదైవమును భక్తితో పూజింపవలెను. తరువాత భక్తితో సామవేదమునందుచెప్పబడిన స్తోత్రమును పఠింపవలెను.
మహాదేవ ఉవాచ- శంకరుడిట్లు పలికెను-
పరంబ్రహ్మ పరంధామ పరంజ్యోతిః సనాతనం | నిర్లిప్తం పరమాత్మానం నమామ్యఖిలం కారణం || 27
స్థూలాత్ స్థూలతమం దేవం సూక్ష్మాత్ సూక్ష్మతమం పరం | సర్వదృశ్యమదృశ్యం చ స్వేచ్ఛాచారం నమామ్యహం || 28
సాకారం చ నిరాకారం సగుణం నిర్గుణం ప్రభుం | సర్వాధారం చ సర్వం చ స్వేచ్ఛరూపం నమామ్యహం || 29
అతీవ కమనీయం చ రూపం నిరుపమం విభుం | కరాళరూపమత్యంతం బిభ్రతం ప్రణమామ్యహం || 30
కర్మణః కర్మరూపం తం సాక్షిణం కర్వకర్మణః | ఫలం చ ఫలదాతారం సర్వరూపం నమామ్యహం || 31
స్రస్టా పాతా చ సంహర్తా కళయా మూర్తి భేదతః | నానామూర్తిః కళాంశేన యః పుమాంస్తం నమామ్యహం || 32
స్వయం ప్రకృతి రూపశ్చ మాయయా చ స్వయం పుమాన్ | తయోః పరం స్వయం
శశ్వత్తం నమామి పరాత్పరం || 33
స్త్రీ పుం నపుసకం రూపం యోబిభర్తి స్వమాయయా | స్వయం మాయా స్వయం మాయీ యో దేవస్తం నమామ్యహం || 34
తారకం సర్వ దుఃఖానాం సర్వకారణ కారణం | ధారకం సర్వవిశ్వానాం సర్వబీజం నమామ్యహం || 35
తేజస్వినాం రవిర్యోహి సర్వజాతిషు బాడబః | నక్షత్రాణాంచ యశ్చంద్రః తం నమామి జగత్ప్రభుం || 36
రుద్రాణాం వైష్ణవానాం చ జ్ఞానినాం యోహి శంకరః | నాగానాం యోహి శేషశ్చ తం నమామి జగత్పతిం || 37
ప్రజాపతీనాం యో బ్రహ్మా సిద్దానాం కపిలః స్వయం | సనత్కుమారోమునిషు తం నమామి జగద్గురుం || 38
దేవనాం యోహి విష్ణుశ్చ దేవీనాం ప్రకృతిః స్వయం | స్వాయంభువో మనూనాం యో మానవేషు చ వైష్ణవః ||
నారీణాం శతరూపా చ బహురూపం నమామ్యహం || 39
ఋతూనాం యో వసంతశ్చ మాసానాం మార్గశీర్షకః | ఏకాదశీ తిథీనాం చ నమామ్యఖిల రూపిణం || 40
సాగరః సరితాం యశ్చ పర్వతానాం హిమాలయః | వసుంధరా సహిష్ణూనాం తం సర్వం ప్రణమామ్యహం || 41
పత్రాణాం తులసీపత్రం దారురూపేషు చందనం | వృక్షాణాం కల్పవృక్షో యస్తం నమామి జగత్పతిం || 42
పుష్పాణాం పారిజాతశ్చ సస్యానాం ధాన్యమేవ చ | అమృతం భక్ష్యవస్తూనాం నానా రూపం నమామ్యహం || 43
ఐరావతో గజేంద్రాణాం వైనతేయశ్చ పక్షిణాం | కామధేనుశ్చధేనూనాం సర్వరూపం నమామ్యహం || 44
తైజసానాం సువర్ణం చ ధాన్యానాం యవ ఏవచ | యః కేసరీ పశూనాం చ వర రూపం నమామ్యహం || 45
యక్షానాం కుబేరో యో గ్రహాణాం చ బృహస్పతిః | దిక్పాలానాం మహేంద్రశ్చ తం నమామి పరం వరం || 46
పరబ్రహ్మస్వరూపుడు, పరంధాముడు, పరంజ్యోతి స్వరూపుడు, సనాతనుడు, నిర్లిప్తుడగు పరమాత్మకు నానమస్కారము. స్థూలవస్తువులలో కెల్లను, స్థూలరూపుడు, సూక్ష్మములలో కెల్లను సూక్ష్మరూపుడు, అందరకు కనిపించువాడు, అదృశ్యరూపుడు,
స్వేచ్ఛాచారుడగు దేవుని నేను నమస్కరింతును. సాకారుడు, నిరాకారుడు, సగుణుడు, నిర్గుణుడు, సమస్త సృష్టికి ఆధారభూతుడు స్వేచ్చా రూపుడగు ఆకృష్ణపరమాత్మను నమస్కరింతును. అతని రూపముచాల అందమైనది. సాటిలేనిది. మిక్కిలి భయంకరమైనది. అట్టి దేవుని నమస్కరింతును. కర్మస్వరూపుడు, సమస్త కర్మలకు సాక్షీభూతుడు, సర్వకర్మఫల స్వరూపుడు, సమస్త కర్మలయొక్క ఫలమును ఇచ్చువాడు సర్వరూపుడు తనయొక్క అంశ##భేదముచే ఆ పరమాత్మ సృష్టికర్తగా, రక్షకుడుగా, సంహారకర్తగా కనిపించువాడు, అనేక రూపములు కలవాడు తనయొక్క అంశాంశముచే పురుషరూపమును ధరించిన ఆ దేవదేవునికి నమస్కారము. స్వయముగానతడు ప్రకృతి స్వరూపుడు, తన మాయవల్ల పురుషమూర్తిగా నున్నవాడు, ప్రకృతి పురుషులకంటె అతీతుడు, తనమాయవల్ల స్త్రీపుం నపుంసక రూపములను ధరించువాడు, స్వయముగా మాయారూపుడు, మాయావంతుడు అగు ఆ దేవదేవునకు నమస్కరించుచున్నాను. సమస్త దుఃఖములను పోగొట్టువాడు, సమస్త సృష్టికి కారణభూతుడు, సమస్త ప్రపంచములను ధరించువాడు, అగు పరమాత్మకు నమస్కారము.
ఆ పరమాత్మ తేజోవంతులలో సూర్యుడుగాను, సమస్తజాతులలో బ్రహ్మణుడుగాను, నక్షత్రములలో చంద్రుడుగాను, రుద్రులలో, వైష్ణవులలో, జ్ఞానవంతులలో శంకరుడుగాను, సర్పములలో శేషుడుగాను, ప్రజాపతులలో బ్రహ్మదేవుడుగాను, సిద్ధులలో కపిల మహర్షిగాను, మునులలో సనత్కుమారుడుగాను, దేవతలలో విష్ణువుగాను, దేవతాస్త్రీలలో ప్రకృతిగాను, మనువులలో స్వాయంభువ మనువుగాను, మానవులలో విష్ణుభక్తుడుగను, స్త్రీలలో శతరూపాదేవిగాను, ఋతువులలో వసంతఋతువుగాను, మాసములయందు మార్గశీర్షమాసముగాను, తిథులలో ఏకాదశీ తిథిగాను, నదులకు సముద్రముగాను, పర్వతములలో హిమాలయ పర్వతముగాను, ఓర్పుకలవారిలో భూమిగాను, పత్రములలో తులసీపత్రముగాను, వృక్షములలో కల్పవృక్షముగాను, సస్యములలో ధాన్యముగాను, తినువస్తువులలో అమృతముగాను, ఏనుగులలో ఐరావతముగాను, పక్షులలో గరుత్మంతుడుగాను, తేజస్సుకల వస్తువులలో బంగారముగాను, ధాన్యములలో యవలుగాను, జంతువులలో సింహముగాను, యక్షులలో కుబేరుడగను, గ్రహములలో బృహస్పతిగాను, దిక్పాలురలో దేవేంద్రుడుగా నున్నాడు. అట్టి పరమాత్మకు నమస్కారము.
వేద సంఘశ్చ శాస్త్రాణాం పండితానాం సరస్వతీ | అక్షరాణామకారోయస్తం ప్రధానం నమామ్యహం || 47
మంత్రాణాం విష్ణుమంత్రశ్చ తీర్థానాం జాహ్నవీ స్వయం | ఇంద్రియాణాం మనో యోహి సర్వశ్రేష్ఠం నమామ్యహం || 48
సుదర్శనం చ శస్త్రాణాం వ్యాధినాం వైష్ణవోజ్వరః | తేజసాం బ్రహ్మతేజశ్చ వరేణ్యం తం నమాహ్యం || 49
బలం యో వై బలవతాం మనో వై శ్రీఘ్రగామినాం | కాలః కలయతాం యోహి తం నమామి విలక్షణం || 50
జ్ఞానాదాతా గురూణాం చ మాతృరూపశ్చ బంధుషు | మిత్రేషు జన్మదాతా యస్తం సారం ప్రణమామహ్యం || 51
శిల్పినాం విశ్వకర్మా యః కామదేవశ్చ రూపిణాం | పతివ్రతా చ పత్నీనాం నమస్యంతం నమామ్యహం || 52
ప్రియేషు పుత్ర రూపో యో నృపరూపో నరేషు చ | శాలగ్రామశ్చ యంత్రాణాం తం విశిష్టం తం నమామ్యహం || 53
ధర్మః కల్యాణంబీజానాం వేదానాం సామవేదకః | ధర్మాణాం సత్యరూపో యో విశిష్టం తం నమామ్యహం || 54
జలే శైత్య స్వరూపో యో గంధరూపశ్చ భూమిషు | శబ్ద రూపశ్చ గగనే తం ప్రణమ్యం నమామ్యహం || 55
క్రతూనాం రాజసూయో యో గాయత్రీ ఛందసాం చ యః | గంధర్వానాం చిత్రరథస్తం గరిష్ఠం నమామ్యహం || 56
క్షీరస్వరూపో గవ్యానాం పవిత్రాణాం చ పావకః | పుణ్యదానాం చ యః స్తోత్రం తం నమామి శుభప్రదం || 57
తృణానాం కుశరూపో యో వ్యాధి రూపశ్చ వైరిణాం | గుణానాం శాంతరూపో యశ్చిత్ర రూపం నమామ్యహం || 58
తేజోరూపో జ్ఞానరూపః సర్వరూపశ్చ యో మహాన్ | సర్వానిర్వచనీయం చ తం నమామి స్వయం విభుం || 59
సర్వాధారేషు యో వాయుర్యథాzత్మా నిత్యరూపిణాం | ఆకాశో వ్యాపకానాం యో వ్యాపకం తం నమామ్యహం || 60
శాస్త్రములలో వేదములుగాను, పండితులలో సరస్వతిగాను, అక్షరములలో ఆకారముగాను, మంత్రములలో విష్ణుమంత్రముగాను, తీర్థములలోను గంగానదిగాను, ఇంద్రియములలో మనస్సుగాను, శస్త్రములయందు సుదర్శన చక్రముగను, వ్యాధులలో వైష్ణవజ్వరముగాను, తేజస్సులలో బ్రహ్మ తేజస్సుగను, శీఘ్రముగా పోవు వారిలో మనస్సుగాను, గురువులలో జ్ఞానదాతగాను, బంధువులలో తల్లిగాను, మిత్రులలో తండ్రిగాను, శిల్పాచార్యులలో విశ్వకర్మగాను రూపవంతులలో మన్మథుడుగాను, స్త్రీలలో పతివ్రతగాను, ప్రియమైన వారిలో పుత్రుడుగాను, మానవులలో ధర్మడుగాను, వేదములలో సామవేదముగాను, ధర్మములయందు సత్యముగాను, ఆ పరమాత్మయున్నాడు.
అట్లే అతడు జలములయందు శైత్యస్వరూపుడు, భూమియందు భూగుణమైన గంధస్వరూపుడు, ఆకాశమున అకాశగుణమైన శబ్ధస్వరూపుడు, అతడు యజ్ఞములందు రాజసూయయాగము. ఛందస్సులలో గాయత్రీఛందము, గంధర్వులలో చిత్రరథుడు గవ్యములలో పాలు, పవిత్రమైన వస్తువులలో అగ్నిదేవుడు, తృణములలో దర్భ, శత్రువులందు వ్యాధిరూపుడు, గుణములలో శాంతగుణస్వరూపుడు, అదే విధముగా ఆ పరమాత్మ తేజస్వరూపుడు, జ్ఞాన స్వరూపుడు, సమస్త రూపుడు, వాయురూపుడు, ఆత్మస్వరూపుడు, ఆకాశరూపుడు, అట్టి పరమాత్మను నేను నమస్కరించుచున్నాను.
వేదానిర్వచినీయం యన్నస్తోతుం పండితః క్షమ ః | యదనిర్వచనీయం చ కోవా తత్ స్తోతుమీశ్వరః || 61
వేదా న శక్తా యం స్తోతుం జడీభూతా సరస్వతీ | తం వాఙ్మనసాం పారం కో విద్యాన్ స్తోతుమీశ్వరః || 62
శుద్ధ తేజ స్వరూపం చ భక్తానుగ్రహ విగ్రహం | అతీవ కమనీయం చ శ్యామరూపం నమామ్యహం || 63
ద్విభుజం మురళీవక్త్రం కిశోరం సస్మితం ముదా | శశ్వద్గోపాంగనాభిశ్చ వీక్ష్యమాణం నమామ్యహం || 64
రాధయా దత్తతాంబూలం భుక్తవంతం మనోహరం | రత్న సింహాసనస్థం చ తమీశం ప్రణమామ్యహం || 65
రత్నభూషణ భూషాఢ్యం సేవితం శ్వేత చామరైః | పార్షద ప్రవరైర్గోప కుమారైస్తం నమామ్యహం || 66
బృందావనేంతరే రమ్యే రాసోల్లాససముత్సుకం | రాస మండల మధ్యస్థం నమామి రసికేశ్వరం || 67
శతశృంగే మహాశైలే గోలోకే రత్న పర్వతే | విరజాపులినే రమ్యే ప్రణమామి విహారిణం || 68
పరిపూర్ణతమం శాంతం రాధాకాంతం మనోహరం | నిత్యం బ్రహ్మస్వరూపం చ సత్యం కృష్ణ నమామ్యహం || 69
వేదములు కూడా నిర్వచింపలేని ఆపరాత్పరుని పండితుడు స్తుతింపగలడా? నిర్వచించుటకు వీలులేని ఆ పరబహ్మను ఎవరు స్తుతింపగలరు? ఆ పరమేశ్వరుని స్తుతించుటకు వేదములు అసమర్థములు. అతనిని స్తుతించు విషయములో సరస్వతీదేవి కూడ అసమర్థురాలు. అతడు వాఙ్మనస్సులచే స్తుతింపవీలులేని వాడు. శుద్ధ తేజస్వరూపుడు, భక్తుల ననుగ్రహించుటకు రూపమును ధరించినవాడు. మిక్కిలి అందమైనవాడు. నల్లని రూపుకలవాడు. రెండు భుజములు కలవాడు. మురళిని మ్రోగించువాడు. బాలరూపుడు, చిరునవ్వుతోనుండువాడు, గోపకులు, గోపికలచే ఎల్లప్పుడు సేవింపబడుచున్నవాడు. రాధాదేవి ఇచ్చు తాంబూలమును భుజించుచు రత్న సింహాసనమున కూర్చున్నవాడు. రత్నభూషణ భూషితుడు. అతని అనుచరులు అతనికి శ్వేతచామరములు వీయుచుండగా గోపకుమారులచే సేవింపబడుచున్నవాడు.
ఆ శ్రీకృష్ణుడు బృందావనమున రాసక్రీడకై రాసమండలమున నుండును. అతడు గోలోకమునందలి రత్న పర్వతము యొక్క సమీపమున నున్న విరజానదీతీరములో సుఖముగా విహరించుచుండును. అతడు మిక్కిలి పరిపూర్ణుడు, రాధాకాంతుడు, మనోహరుడు, బ్రహ్మస్వరూపుడు, సత్యస్వరూపుడు నిత్యమైనవాడు. అట్టి శ్రీకృష్ణుని నేనెల్లప్పుడు నమస్కరింతును.
శ్రీకృష్ణస్య స్తోత్ర మిదం త్రి సంధ్యం యః పఠేన్నరః | ధర్మార్థ కామ మోక్షాణాం స దాతా భారతే భ##వేత్ || 70
హరిదాస్యం హరౌ భక్తిం లబేత్ స్తోత్ర ప్రసాదతః | ఇహలోకే జగత్పూజ్యో విష్ణుతుల్యో భ##వేత్ ధ్రువం || 71
సర్వసిద్ధేశ్వరః శాంతోzప్యంతేయాతి హరేః పదం | తేజసా యశసా భాతి యథా సూర్యో మహీతలే || 72
జీవన్ముక్తః కృష్ణభక్తః స భ##వేన్నాత్ర సంశయః | ఆరోగీ గుణవాన్విద్వాన్ పుత్రవాన్ ధనవాన్ సదా || 73
షడభిజ్ఞో దశబలో మనోయాయీ భ##వేత్ ధ్రువం | సర్వజ్ఞః సర్వదశ్చైవ స దాతా సర్వ సంపదాం |
కల్పవృక్షసమః శశ్వద్భవేత్కృష్ణ ప్రసాదతః || 74
ఈ శ్రీకృష్ణ స్తోత్రమును మూడు పూటలందు చదివినచో అతడు చతుర్వర్గములను కలిగించుటకు సమర్థుడగును. ఈస్తోత్రముయొక్క అనుగ్రహము వలన శ్రీహరి సేవను భక్తిని తప్పక పొందును. ఈ లోకమును అతడు జగత్పూజ్యుడై విష్ణువుతో సమానుడగును. అతడు సమస్త సిద్దులను పొంది మరణ సమయమున వైకుంఠమును పొందును. సూర్యుడీ లోకమున తేజస్సుతో ప్రకాశించుచున్నట్లు కీర్తి కలిగి ప్రకాశించును. శ్రీకృష్ణభక్తుడు తప్పక జీవన్ముక్తుడగును. ఆరోగ్యవంతుడై సకల సద్గుణ సంపన్నుడై విద్యావంతుడు, పుత్రవంతుడు, ధనవంతుడు షడభిజ్ఞుడు, దశబలుడునై మనోవేగము కలవాడగును. సర్వజ్ఞుడై కల్పవృక్షమువలె శ్రీకృష్ణుని అనుగ్రహము వలన సమస్త సంపదలను ఇచ్చువాడగును.
ఇత్యేవం కథితం స్తోత్రం వత్స త్వం గచ్ఛ పుష్కరం | తత్ర కృత్వా మంత్ర సిద్ధిం పశ్చాత్ర్పాప్స్యసి వాంఛితం || 75
త్రిస్సప్తకృత్యో నిర్భూపాం కురు పృథ్వీం యథా సుఖం | మమాశిషా ముని శ్రేష్ఠ శ్రీకృష్ణస్య ప్రసాదతః || 76
పరశురామా! నీకీవిధముగా శ్రీకృష్ణస్తోత్రమును తెల్పితిని. నీవు పుష్కర క్షేత్రమునకు వెళ్ళి అచ్చట మంత్రమును జపించి మంత్రసిద్ధిని పొంది నీ కోరికను తీర్చుకొనగలవు. నాయొక్క ఆశీర్వచనము వలన శ్రీకృష్ణుని అనుగ్రహమువలన ఈ భూమిపై ఇరువది యొక్క మార్లు తిరిగి రాజులు లేకుండునట్లు వారినందరను అంతమొందించగలవని శంకరుడు పరశురామునితో పల్కెను.
ఇతి బ్రహ్మ వైవర్తే మాహాపురాణ తృతీయే గణపతి ఖండే నారద నారాయణ సంవాదే స్తవ ప్రదానం నామ ద్వాత్రింశత్ తమోzధ్యాయః ||
శ్రీ బ్రహ్మ వైవర్తే మహాపురాణమున మూడవదగు గణపతి ఖండమున నారద నారాయణ మునుల సంవాద సమయమున తెలుపబడిన శ్రీకృష్ణుని స్తోత్రము గల
ముప్పది రెండవ అధ్యాయము సమాప్తము.