sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
చతుస్త్రింశత్తమోzధ్యాయః - కార్తవీర్యార్జునుని యుద్ధ సన్నాహము నారాయణ ఉవాచ- నారాయణముని ఇట్లనెను- సప్రాతరాహ్నికం కృత్వా సమాలోచ్య చ తైస్సహ | దూతం ప్రస్థాపయామాస కార్తవీర్యాశమ్రం భృగు ః ||
1 సదూతః శీఘ్రమాగత్య వసంతం రాజసంపది | వేష్టితం సచివైస్సార్థమువాచ నృపతీశ్వరం ||
2 భార్గవరాముడు ప్రాతః కాలమున నిర్వర్తింపవలసిన కాలకృత్యములను నిరవ్వర్తించి కార్తవీర్యుని ఆశ్రమమునకు (సౌధమునకు) దూతను పంపెను. ఆ దూత శీఘ్రముగా రాజభవనమునకు వచ్చి సభలో మంత్రులతో కొలువు దీరిన రాజుతో నిట్లనెను. రామదూత ఉవాచ- పరశురాముని దూత ఇట్లనెను- నర్మదాతీరసాన్నిధ్యే న్యగ్రోధాయక్షయమూలకే | సభృగుర్భ్రాతృభిస్సార్థం తత్ర త్వం గంతు మర్హసి ||
3 యుద్ధం కురు మహారాజ జాతిభిర్ జ్ఞాతిభిస్సహ | త్రిస్సప్తకృత్వో నిర్భూపాం కరిష్యతి మహీపతి ||
4 ఇత్యుక్త్యా రామదూతశ్చాప్యగచ్ఛద్రామ సన్నిధిం | రాజా విధాయ సన్నాహం సమరం గంతుముద్యతః ||
5 ఓ కార్తవీర్య మహారాజ! నర్మదా నదీతీరమున నున్న అక్షయవటవృక్షముయొక్క క్రింద తన సోదరులతో నున్న బార్గవరాముని దగ్గరకు నీవు వెళ్ళుము. నీవు నీ పరివారముతో, సోదరులతో కలసి యుద్ధము చేయుము. అతడు భూమిపై ఇరువది యొక్క మార్లు తిరిగి రాజులు లేకుండ చేయునని రాజుతో పలికి ఆదూత పరశురాముని సన్నిధికి తిరిగి పోయెను. కార్తవీర్య మహారాజు కూడ యుద్ధ సన్నాహములు చేయుచు యుద్ధము చేయుటకు నిశ్చయించుకొనెను. గచ్ఛంతం సమరం దృష్ట్వా ప్రాణశం సా మనోరమా | తమేవ వారయామాస వాసయామాస సన్నిధౌ ||
6 రాజా మనోరమాం దృష్ట్వా ప్రసన్న వదనేక్షణః | తామువాచ సభా మధ్యే వాక్యం మానసికం మునే ||
7 యుద్ధమునకై వెళ్ళుచున్న తన భర్తను చూచి మనోరమ అతనిని తన దగ్గర కూర్చుండబెట్టుకొని అతని యుద్ధ ప్రయత్నములను వారింపసాగెను. కార్తవీర్యుడు తన భార్యను చూచి సంతోషముతో తన మనస్సులో నున్న భావము నిట్లు వివరింపసాగెను. కార్తవీర్యార్జున ఉవాచ- కార్తవీర్యార్జునుడిట్లు పలికెను- మామేవాహ్వయతే కాంతే జమదగ్నిసుతో మహాన్ | స తిష్ఠన్నర్మదాతీరే రణాయ భ్రాతృభిః సహ || 8 సంప్రాప్య శంకరాచ్ఛస్త్రం మంత్రం చ కవచం హరేః | త్రిస్సప్తకృత్వో నిర్భూపాం కర్తుమిచ్ఛతి మేదినీం || 9 ఆందోళయంతి మే ప్రాణా మనస్సంక్షుభితం ముహుః | శతత్ స్ఫురతి వామాంగం దృష్టం స్వప్నం శ్రుణు ప్రియే || 10 తైలాభ్యంగిత మాత్మానమపశ్యం గర్థభోపరి | ఔడపుష్పస్య మాల్యం చ బిభ్రతం రక్త చందనం || 11 రక్తవస్త్రపరీధానం లోహాలంకార భూషితం | క్రీడంతం చ హసంతం చ నిర్వాణాంగార రశ్మినా || 12 భస్మాచ్ఛన్నాం చ పృథివీం జపాపుష్పాన్వితాం సతి | రహితం చంద్ర సూర్యభ్యాం రక్త సంధ్యాన్వితం నభః || 13 ముక్తేకేశాం చ నృత్యంతీం విధవాం ఛిన్న నాసికాం | రక్త వస్త్ర పరీధానాపశ్యం చాట్టహాసినీం || 14 సశరామగ్ని రహితాం చితాం భస్మసమన్వితాం | భస్మవృష్టిమసృగ్వృష్టి మగ్నివృష్టి మపీశ్వరి || 15 పక్వతాళఫలాకీర్ణాం పృథీవీ మస్థిసంయుతాం | అపశ్యం కర్పరౌఘం చ ఛిన్నకేశనఖాన్వితం || 16 పర్వతం లవణానాంచ రాశీభూతం కపర్దకం | చూర్ణానాం చైవ తైలానామదృశం కందరం నిశి || 17 అదృశం పుష్పితం వృక్ష మశోక కరవీరయోః | తాళవృక్షం చ ఫలితం తత్ర చైవ పతత్ఫలం || 18 స్వకరాత్పూర్ణ కలశః పపాత చ బభంజ చ | ఇత్యపశ్యం చ గగనాత్సంపతచ్చంద్రమండలం || 19 అపశ్యమంబరాత్సూర్యమండలం సంపతద్భువి | ఉల్కాపాతం ధూమకేతుం గ్రహణం సూర్య చంద్రయోః || 20 వికృతాకార పురుషం వికటాస్యం దిగంబరం | ఆగచ్చంతం చాగ్రతస్తమపశ్యం చ భయానకం || 21 ఓ ప్రియురాలా! జమదగ్ని మహర్షి పుత్రుడు నర్మదానదీ తీరమున తన సోదరులతో నుండి యుద్ధమునకు రమ్మని నన్నే ఆహ్వానించుచున్నాడు. అతడు శంకరుని అనుగ్రహమువలన శస్త్రములను, శ్రీహరి మంత్రమును కవచమును పొంది ఈ భూమిపై నున్న రాజుల నందరను ఇరువది యొక్క మార్లు చంపవలెనని అనుకొనుచున్నాడు. ఇప్పుడు నా ప్రాణములన్నియు ఆందోళనము చెందుచున్నట్లు మనస్సు కలవరపడుచున్నట్లు తోచుచున్నది. అట్లే ఎడమభాగము అదరుచున్నది. నిన్న రాత్రి ఒక దుస్వప్నము కలిగినది దానిని వినుము. నేను నూనె శరీరమందంతట పులుముకొని ఔఢపుష్పముల మాలను ధరించి రక్తవస్త్రమును ఇనుముతో చేసిన అలంకారములను ధరించి గాడిదనెక్కి పోవుచున్నట్లు, ఆరిపోవుచున్న నిప్పులతో నవ్వుచు ఆడుకొనుచున్నట్లు, ఈభూమియందంతట దిరిసెన పువ్వులు, దుమ్ము నిండియున్నట్లు, చంద్రసూర్యులు లేని ఆకాశము ఎఱ్ఱగా నున్నట్లు, విధవ, ముక్కు కోయబడినది అగు స్త్రీ ఎఱ్ఱని వస్త్రములు ధరించి నృత్యము చేయుచున్నట్లు కలగాంచితిని. అదేవిధముగా ఒకచితి నిప్పులులేక బూడిదతో నుండి బాణములతో కప్పబడియున్నట్లు, బూడిద వర్షమును, రక్తవర్షమును, అగ్నివర్షమును, కూడ కలలో చూచితిని, అశోకము, కరవీరము పుష్పములతో నున్నట్లు, తాటిచెట్టు ఫలములతో నుండగా ఆ ఫలములు పడిపోవుచున్నట్లు, నా చేతినుండి పూర్ణకలశము చేజారి క్రిందపడి పగిలిపోయినట్లు, ఆకాశమునుండి చంద్రసూర్యమండలములు భూమిపై పడిపోవుచున్నట్లు, పిడుగులు రాలుట, తోకచుక్క, సూర్యచంద్రుల గ్రహణమును కలలో చూచితిని. ఒక వికృతాకారముగల పురుషుడు భయంకరమైన ముఖముతో దిగంబరుడై నాముందు వచ్చుచున్నట్లు కలగంటిని. బాలా ద్వాదశ వర్షీయా వస్త్రభూషణా భూషితా | సంరుష్టా యాతి మద్గేహాదిత్యపశ్యమహం నిశి || 22 ఆజ్ఞాం త్వం దేహి రాజేంద్ర త్వద్గేహాద్యామి కాననం | వదసి త్వం మామితి చ నిశ్యపశ్యమహం శుచా || 23 ఋష్టో విప్రో మాం శపతే సన్యాసీ చ తథా గురుః | భీత్తౌ పుత్తాలికాశ్చిత్రా నృత్యంతీశ్చ దదర్శహ || 24 చంచలానాం చ గృధ్రాణాం కాకానాం నికరైః సదా | పీడితం మహిషాణాం చ స్వమపశ్యమహం నిశి || 25 పీడితం తైలయంత్రేణ భ్రామితం తైలకారిణా | దిగంబ రాన్పాశహస్తానపశ్య మహమీశ్వరి || 26 నృత్యంతి గాయకాః సర్వే గానం గాయంతిమే గృహే | వివాహం పరమానంద మిత్యపశ్యమహం నిశి || 27 రమణం కుర్వతో లోకాన్ కేశాకేశి చ కుర్వతః | అదృశం సమరం రాత్రౌ కాకానాం చ శునామసి || 28 మోటకాని చ పిండాని స్మశానం శవసంయుతం | రక్తవస్త్రం శుక్ల వస్త్రం మపశ్యం నిశి కామిని || 29 కృష్ణవర్ణా కృష్ణాంబరా నగ్నా వై ముక్తకేశినీ | విధవాzశ్లిష్యతి చ మామపశ్యం నిశి శోభ##నే || 30 నాపితో ముండతే ముండం శ్మశ్రుశ్రేణీం చ మేప్రియే | వక్షఃస్థలం చ నఖరమిత్యపశ్యమహం నిశి || 31 పాదుకా చర్మ రజ్జూనామపశ్యం రాసి ముల్బణం | చక్రం భ్రమంతం భూమౌచ కులాలస్యేతి సుందరి || 32 వాత్యయా ఘూర్ణమానం చ శుష్కవృక్షం సముత్థితం | ఘూర్ణమానం కబంధం వై చాపశ్యం నిశి సువ్రతే || 33 గ్రథితాం ముండమాలాం చ చూర్ణమానాం చ వాత్యయా | అతీవ ఘోరదర్శనాం చాప్యపశ్య మహం వరే || 34 భూతప్రేతా ముక్తకేశా వమంతశ్చ హుతాశనం | మాం భీషయంతి సతతమిత్యపశ్యమహం నిశి || 35 దగ్ధజీవనం దగ్ధవృక్షం వ్యాధిగ్రస్తం నరం పరం | అంగహీనం చ వృషల మప్యశ్యమహం నిశి || 36 గేహ పర్వత వృక్షాణాం సహసా పతనం పరం | ముహుర్ముహు ర్వజ్ర పాత మప్యపశ్యమహం నిశి|| 37 కుక్కరాణాం శృగాలానాం రోదనం చ ముహుర్ముహుః | గృహే గృహే చ నియత మప్యపశ్యం సర్వతో నిశి || 38 అధశ్శిర స్తూర్ధ్వపాదం ముక్త కేశం దిగంబరం | భూమౌ భ్రమంతం గచ్ఛంతం చాప్యప శ్యమహం నరం || 39 వికృతాకారశబ్దం చ గ్రామాదౌ దేవరోదనం | ప్రాతఃశ్రుత్వైవావబుద్ధః క ఉపాయో వదాధునా || 40 మంచి వస్త్రములను ఆభరణమును ధరించిన పన్నెండు సంవత్సరముల కన్య కోపముతో నాఇంటినుండి పోవుచు ఓ రాజా నీఇంటినుండి అడవికి పోదలచుకున్నాను. నీవందులకు ఆజ్ఞనిమ్మని కోరుచున్నట్లు రాత్రిపూట కలగంటిని. అట్లే కోపముతో బ్రహ్మణుడు, సన్యాసి, గురువు వీరందరు నన్ను శపించుచున్నట్లు, గోడపైనున్న బొమ్మలు చిత్రములు నృత్యము చేయుచున్నట్లు, కాకులు, గద్దలు తిరుగుచున్నట్లు, దున్నపోతులు నన్ను కిందపడవేసి హింసించుచున్నట్లు కలబడినది. దిగంబరులు, పాశహస్తులు, అగుపురుషులను గానుగవాడు తనగానుగలో వేసి త్రిప్పుచు నన్ను బాధించుచున్నట్లు, నా ఇంటిలో పెండ్లి జరుగుచుండగా కొందరు పాడుచున్నట్లు, మరికొందరు ఆడుచున్నట్లు కనిపించినది. ఇంకను కొందరు రమించుచున్నట్లు, మరికొందరు వెంట్రుకలు, పట్టుకొని కొట్టుకొనుచున్నట్లు, కాకులు, కుక్కలు కొట్లాడుచున్నట్లు కలలో చూచితిని. అదే విధముగా నాకలలో శవమున్న స్మశానము, ఎఱ్ఱనివస్త్రము, తెల్లని వస్త్రము కనిపించినది. నల్లని వస్త్రములము ధరించి వెంట్రుకలను విరియబోసికొన్న ఒక విధవ నగ్నముగా నన్ను కొగిలించికొన్నట్లు, మంగలి నాతలను, గడ్డము, రొమ్మును క్షౌరముచేసి గోళ్లు తీయుచున్నట్లు, కలగంటిని. మరికొంత సమయమునకు పాదుకలు, చర్మముచే చేయబడిన త్రాళ్ళు కుప్పగా నున్నట్లు, కుమ్మరిచక్రమును తిప్పుచున్నట్లు, ఎండిపోయిన చెట్టు పెద్దగాలికి కొట్టుకుపోయినట్లు, అది తిరిగి నిలబడినట్లు, తలలేని మొండెము ఇటునటు తిరుగుచున్నట్లు చూచితిని. మరికొంతసేపటికి భయంకరమైన స్త్రీ తలలపుఱ్ఱలను, మెడలో వేసికొనగా గాలికి అవి పగిలిపోవుచున్నట్లు, భూత ప్రేతములు తలవిరయబోసికొని, నిప్పులు గ్రక్కుచు, నన్ను బయపెట్టుచున్నట్లు, కాలిపోవుచున్న ప్రాణిని, కాలిపోవుచున్న చెట్టును, అంగహీనుడగు పురుషుని, కలలోచూచితిని, మరికొంత సమయమునకు ఇండ్లు, గుట్టలు, చెట్లు, వెంటనే పడిపోవుచున్నట్లు, పిడుగులు మాటిమాటికి పడుచున్నట్లు కుక్కల, నక్కలు ఏడ్చుచున్నట్లు కలలో చూచితిని. అట్లే తలక్రిందికి పాదముల పైకి పెట్టి తలవిరియబోసికొన్న దిగంబరుడొకడు తిరుగుచున్నట్లు కనిపించినది. గ్రామములముందు దేవతలు ఏడ్చుచున్నట్లు, మరియొక వికృతమైన శబ్దమును విని మేల్కొంటిని. కావున ఇప్పుడేమి చేయవలెనో చెప్పుమని కార్తవీర్యుడు తన భార్యయగు మనోరమతోననెను. నృపతేర్వచనం శ్రుత్వా హృదయేన విదూయతా | సగద్గదం చ రుదతీ తమువాచ నృపే శ్వ రం || 41 రాజు చెప్పిన స్వప్నవృత్తాంతమును విన్నమనోరమ మనస్సు బాధపడుచుండగా ఏడ్చుచునిట్లు తన భర్తతో పలికెను. మనోరమోవాచ- మనోరమ ఇట్లు పలికినది- హే నాథ రమణ శ్రేష్ఠ శ్రేష్ఠ సర్వ మహీభృతాం | ప్రాణాతిరేక ప్రాణశ శ్రుణు వాక్యం శుభావహం || 42 నారాయణాంశో భగవాన్ జామదగ్న్యో మహాబలీ | సృష్టి సంహర్తురీశస్య శిష్యోzయం జగతః ప్రభోః || 43 త్రిః సప్తకృత్వోనిర్భూపాం కరిష్యామి మహీపతి | ప్రతిజ్ఞా యస్య రామస్య తేన సార్థం రణం త్యజ || 44 పాపినం రావణం జిత్వా శూరం త్వమివ మన్యసే | స త్వయా న జితో నాథ స్వపాపేన పరాజితః || 45 యో న రక్షతి ధర్మం చ తస్య కో రక్షితా భువి | స నశ్యతి స్వయం మూఢో జీవన్నపి మృతోహి స ః || 46 శుబాశుభస్య సతతం సాక్షీ ధర్మస్య కర్మణః | ఆత్మారామః స్థితః స్వాంతో మూఢస్త్వం నహి పశ్యసి || 47 పుత్ర దారాదికం యద్యత్సర్వైశ్వర్యం సుధర్మిణాం | జలబుద్బుదవత్సర్వమనిత్యం నశ్వరం నృప || 48 సంసారం స్వప్న సదృశం మత్వా సంతోzత్పభారతే | ధ్యాయంతి సతతం ధర్మ తపః కుర్వంతి భక్తితః || 49 దత్తేన దత్తం యత్జ్ఞానం తత్సర్వం విస్మృతం త్వయా | అస్తి చేద్విప్రహింసాయాం కుబుద్ధే త్వన్మనః కథం || 50 సుఖార్థే మృగయాం గత్వా తత్రోపోష్య ద్విజాశ్రమే | భుక్త్వా మిష్టమపూర్వం చ హతో విప్రో నిరర్థకం || 51 గురు విప్రసురాణాంచ యః కరోతి పరాభవం | అభీష్ట దేవస్తం రుష్టో విపత్తిస్తస్య సన్నిదౌ || 52 స్మరణం కురు రాజేంద్ర దత్తాత్రేయ పదాంబుజం | గురౌ భక్తిశ్చ సర్వేషాం సర్వ విఘ్న వినాశినీ || 53 గురుదేవం సమభ్యర్చ్య తం భృగుం వరణం వ్రజ | విప్రే దేవే ప్రసన్నే చ క్షత్రియాణాం నహి క్షతిః || 54 విప్రస్య కింకరో భూపో వైశ్యో భూపస్య భూమిప | సర్వేషాం కింకరాః శూద్రాః బ్రహ్మణస్య విశేషతః || 55 ఆయశః శరణం శ్వశ్వత్ క్షత్రియస్య చ క్షత్రియే| మహద్యశస్తచ్ఛరణం గురుదేవ ద్విజేషు చ || 56 బ్రహ్మణం భజ రాజేంద్ర గరీయాంసం సురాదపి | బ్రహ్మణ పరితుష్టే చ సంతుష్టాః సర్వదేవతాః || 57 సమస్త రాజులలో ఉత్తముడవైన ఓ ప్రాణశుడా | నా మాటను నీవు వినుము. జమదగ్ని పుత్రుడగు భార్గవరాముడు శ్రీమన్నారాయణాంశ సంభూతుడు. గొప్పబలవంతుడు కూడా. అతడు సృష్టిసంహారము చేయు పరమశివుని యొక్క శిష్యుడు. అతడు ఈ భూమిపై నున్న రాజులనందరను ఇరువదియొక్క మార్లు హతము చేయుదునని ప్రతిజ్ఞ చేసెను. అట్టి భార్గవనందనునితో యుద్ధమును వదలి పెట్టుము. నీవు పాపాత్ముడగు రావణాసురుని జయించి శూరుడవని అనుకొనుచున్నావు. కాని ఆ రావణుడు నీబలమువలన ఓడిపోలేదు. అతని పాప కార్యములే అతనిని ఓడించినవి. ధర్మమును రక్షింపనివారిని ఎవరుకూడ రక్షింపలేరు. ఆమూఢాత్ముడు స్వయముగానే నశించుచున్నాడు. అతడు బ్రతికియున్నను చనిపోయినవానితో సమానుడగుచున్నాడు. శుభాశుభ కర్మలకన్నిటికి ఎల్లప్పుడు సాక్షీభూతుడు ధర్మదేవత. అతడు ఆత్మయందుండును. ఆ ధర్మదేవతను నీవు గమనింపక ఉన్నావు. చక్కగా ధర్మమును పరిపాలించువారలకు పుత్రులు. భార్య మొదలగు సమసై#్తశ్వర్యములు నీటి బుడగల వంటివి. అవి నశించుపోవునని, ఈసంసారమంతయు కలతో సమామమైనదని తలచి ధర్మము నెల్లప్పుడు ధ్యానము చేయుచుందురు. దానికై భక్తితో తపమును ఆచరించెదరు. దత్తాత్రేయుడు ప్రసాదించిన జ్ఞానమునంతయు నీవు మరచితివి. లేనిచో బ్రాహ్మణుని హింసించుటకు నీమనస్సు అనుమతించునా? నీవు నీ సుఖమునకై వేటాడబోయి అచ్చట తిండి లభింపనందువలన ఉపవాసముండి బ్రహ్మణుని యొక్క ఆశ్రమమున అపూర్వమైన మృష్టాహారమును భుజించి, వ్యర్థముగా ఆ బ్రాహ్మణుని చంపితివి. గురువును, బ్రాహ్మణులను, దేవతలను అవమానించిన వానిపై ఇష్టదేవత కూడ కోపించును. అందువలన ఆపద తప్పక కలుగును. కావున నీవు నీగురువగు దత్తాత్రేయుని ధ్యానింపుము. గురుభక్తి యనునది సమస్త విఘ్నములను తొలగించును. నీవు నీగురుదేవుని అర్చించి ఆ భార్గవరాముని శరణు వేడికొమ్ము. బ్రాహ్మణుడు, అభీష్టదైవము ప్రసన్నమైనచో క్షత్రియుల కాపదలు కలుగవు. రాజు బ్రాహ్మణునకు దాసుడు. వైశ్యుడు రాజదాసుడు. శూద్రుడు సర్వదాసుడు. క్షత్రియుడు క్షత్రియుని శరణు వేడినచో అపకీర్తి కలుగును. కాని గురువులను, దేవతలను, బ్రాహ్మణులను శరణువేడినచో అపకీర్తి కలుగదు. పైగా మంచి కీర్తి లభించును. అందువలన నీవు భార్గవ రాముని శరణు వేడుము. బ్రాహ్మణుడు దేవతలకంటె గొప్పవాడు. బ్రాహ్మణుడు సంతోషపడినచో దేవతలందరు సంతోషపడుదురని మనోరమ పలికెను. ఇత్యేవ ముక్త్వా రాజేంద్రం క్రోడే కృత్వా మహాసతీ | ముహుర్ముహుర్ముఖం దృష్ట్వా విలలాప రురోదచ || 58 క్షణం తిష్ఠ మహారాజ పునరేవమువాచ సా | స్నానం కురు మహారాజ భోజయిష్యామి వాంఛితం || 59 చందనాగురుకస్తూరీ కర్పూరైః కుంకుమైర్యుతం | అనులేపం కరిష్యామి సర్వాంగే తవ సుందరం || 60 క్షణం సింహాసనే తిష్ఠ క్షణం వక్షసి మే ప్రభో | సభాయాం పుష్పరచితే తల్పే పశ్యామి శోభనం || 61 శత పుత్రాధికః ప్రేవ్ణూ సతీనాం వై పతిర్నృప | నిరూపితో భగవతా దేవేషు హరిణా స్వయం || 62 మనోరమావచః శ్రుత్వా రాజా పరమపండితః | బోధయామాస తాం రాజ్ఞీం దదౌ ప్రత్యుత్తరం పునః || 63 మనోరమాదేవి ఈవిధముగా కార్తవీర్యునితో పలికి అతనిని తన ఒడిలోనికి దీసికొని అతని ముఖము చూచుచు మిక్కిలి శోకించెను. ఓ మహారాజ నీవు క్షణకాలముండుము. స్నానము చేసిరమ్ము. తరువాత నీకొర్కెను తీర్చెదను. చందనము అగరు, కస్తూరి, కర్పూరము, కుంకుమలతో అనులేపనము చేసి నీ శరీరమునంతటను అలుముదును. నీవు క్షణకాలము నా ఎదపైనుండుము. పుష్పములచే చేసిన శయ్యపై పరుండుము. సతులు తన భర్తను నూరుగురు పుత్రుల కంటె ఎక్కువగా ప్రేమింతురని వేదములలో శ్రీమన్నారాయణుడు తెల్పెను. అను మనోరమ పలుకులు విని గొప్పజ్ఞానియగు కార్తవీర్యుడిట్లు సమాధానమిచ్చెను. కార్తవీర్యార్జుని ఉవాచ - కార్తవీర్యార్జునుడిట్లు పలికెను- శ్రుణు కాంతే ప్రవక్ష్యామి శ్రుతం సర్వం త్వయేరితం | శోకార్తానాం చ వచనం న ప్రశస్యం సభాసు చ || 64 సుఖం దఃఖం భయం శోకః కలహః ప్రీతిరేవచ | కర్మ భోగార్హకాలేన సర్వం భవతి సుందరి || 65 కాలో దదాతి రాజత్వం కాలో మృత్యుం పునర్భవం | కాలః సృజతి సంసారం కాలః సంహరతే పునః || 66 కరోతి పాలనం కాలః కాలరూపీ జనార్దనః | కాలస్య కాలః శ్రీకృష్ణో విధాతుర్విధి రేవ చ || 67 సంహర్తుర్వాపి సంహర్తా పాతుః పాతా చ కర్మకృత్ | స కర్మణాం కర్మరూపీ దదాతి తపసాం ఫలం || కః కేన హన్యతే జంతుః కర్మణా వై వినా సతి || 68 స్రష్టా సృజతి సృష్టిం చ సంహర్తా సంహరేత్పునః | పాతా పాతి చ భూతాని యస్యాజ్ఞాం పరిపాలయేత్ || 69 యస్యాజ్ఞయా వాతి వాతః సంతతం భయ విహ్వలః | శశ్వత్సంచరతే మృత్యుః సూర్యస్తపతి సంతతం || 70 ఓకాంతా! నీమాటలనన్నిటిని వింటిని. ఇక నాసమాధానము వినుము. సభలయందు శోకార్తుల మాటలు మన్నింపతగినవి కావు. సుఖము దుఃఖము, భయము, శోకము, కలహము, ప్రేమ కర్మ ఇవన్నియు అనుభవింపదగిన కాలమున జరుగును. కాలము రాజత్వము నిచ్చును. మృత్యువును, పునర్జన్మను కలిగించును. కాలమువలననే సంసారమేర్పడుచున్నది. ఆ సంసార నివృత్తి కూడజరుగుచున్నది. సంసారపాలనము కూడ కాలము వలననే జరుగుచున్నది. ఇట్టి కాలరూపి జనార్దనుడే. శ్రీకృష్ణుడు కాలమునకు కాల స్వరూపుడు అతడు సృష్టికర్తకు సృష్టికర్త. సంహర్తకు సంహారకారకుడు. సృష్టిపాలకునకు పాలకుడు కూడ. కర్మలకు కర్మరూపియగు అతడు తపః ఫలములనిచ్చును. కర్మ ప్రభావము లేక ఎవరు ఎవరిని సంహరింపజాలరు. ఆ కృష్ణుని వలననే బ్రహ్మదేవుడు ఈ సృష్టినంతయు చేయుచుండగా సంహారకారకుడగు పరమశివుడు సృష్టిసంహారమును చేయుచున్నాడు. సృష్టిపాలకుడగు శ్రీమహావిష్ణువు ఈ సృష్టినంతయు పరిపాలించుచున్నాడు. అతని ఆజ్ఞననుసరించియే గాలివీచుచున్నది. మృత్యువు అతని భయముచే ఎల్లప్పుడు తిరుచున్నది. అదేవిధముగ సూర్యుడు ఎండనిచ్చుచున్నాడు అని పలికెను. వర్షతీంద్రో దహత్యగ్నిః కాలోభ్రమతి భీతవత్ | తిష్ఠంతి స్థావరాః సర్వే చరంతి సతతం చరాః || 71 వృక్షాశ్చ పుష్పితాః కాలే ఫలితాః పల్లవాన్నితాః | శుష్యంతి కాలతః కాలే వర్థంతే చ తదాజ్ఞయా || 72 ఆవిర్భూతా తిరోభూతా సృష్టిరేవ తదాజ్ఞయా | తస్యాజ్ఞయా భ##వేత్సర్వం న కించిత్ స్వేచ్ఛయా నృణాం || 73 నారాయణాంశో భగవాన్ జామదగ్న్యో మహాబలః | త్రిః సప్తకృత్వో నిర్భూపాం కరిష్యతి మహీమితి || 74 ప్రతిజ్ఞా విఫలా తస్య న భ##వేత్తు కదాచన | నిశ్చితం తస్య వధ్యోzహమితి జానామి సువ్రతే || 75 జ్ఞాత్వా సర్వం భవిష్యం చ శరణం యామి తత్కథం | ప్రతిష్ఠితానాం చాకీర్తిర్మరణాదతిరిచ్యతే || 76 ఆ పరమాత్మయొక్క ఆజ్ఞననుసరించి ఇంద్రుడు వర్షించుచున్నాడు. అగ్ని దహించుచున్నాడు. కాలుడు భీతిచెందినట్లు తిరుగుచున్నాడు. వృక్షములు పుష్పించుచున్నవి. ఆయా కాలముననుసరించి ఫలించుచున్నవి. ఎండిపోవుచున్నవి. మరల మొలుచుచున్నవి. అతని ఆజ్ఞవలననే ఈ సృష్టి జరుగుచున్నది. నశించుచున్నది. సర్వకార్యములు అతని ఆజ్ఞవలననే జరుగుచున్నవి. ఏది కూడ స్వేచ్ఛగా జరుగుచులేదు. ఈ జమదగ్ని సుతుడగు భృగురాముడు మహాబలపరాక్రమవంతుడు. శ్రీమన్నారాయణుని అంశవలన ఉద్భవించినవాడు. అతడు ఈ భూమిపై ఇరువదియొక్క మార్లు రాజులు లేకుండా చేయును. అతని ప్రతిజ్ఞ ఎప్పుడును విఫలము కాదు. నేను అతని వలన చంపబడుదునన్న విషయము నాకు తెలియును. ముందు జరగుగవలసిన విషయమంతయు తెలిసి అతనినెట్లు శరణు వేడెదను? కీర్తిగల వారికి చెడ్డపేరు చావుకంటె గొప్పది అని పలికెను. ఇత్యేవ ముక్త్వా రాజేంద్రః సమరం గంతు ముద్యతః | వాద్యం చ వాదయామాస కారయామాస మంగళం || 77 శతకోటిర్నృపాణాం చ రాజేంద్రానాం త్రిలక్షకం | అక్షౌహిణీనాం శతకం మహాబలపరాక్రమం || 78 అశ్వానాం చ గజానాం చ పదాతీనాం తథైవ చ | అసంఖ్యకం రథానాం చ గృహీత్వా గంతు ముద్యతః || 79 కార్తవీర్యార్జునుడీ విధముగా తన భార్యతో పలికి యుద్దమునుక పోవుటకు నిశ్చయించి, యుద్ధవాద్యములను మ్రోగించుచు మంగళవచనము చేయించెను. అతనితో నూరుకోట్ల రాజులు, మూడులక్షల రాజేంద్రులు మహాబలపరాక్రమ సంపన్నమగు నూరు అక్షౌహిణుల సైన్యము, అసంఖ్యాకమైన అశ్వములు, గజములు, రథములు, పదాతివర్గమును వెంటపెట్టుకొని యుద్దమునకు బయలు దేరుచుండెను. బభూవ స్తిమితా సాధ్వీ దృష్ట్వా తం గమనోన్ముఖం | ధృతవంతం చ సన్నాహమక్షయం సశరం ధనుః || 80 క్రీడాగారే క్షణం తస్థౌ కృత్వా కాంతం స్వవక్షసి | పశ్యంతీ తన్ముఖాంభోజం చుచుంబ చ ముహుర్ముహుః || 81 కార్తవీర్యార్జునుని భార్య అతని మాటలు విన్న తరువాత స్తిమితపడినదై యుద్దసన్నాహములు చేయుచు ధనుర్బాణములను ధరించి యుద్ధమునకు పోవుచున్న తన భర్తను క్రీడాగారమునుక తీసికొని పోయి అతని తన వక్షస్థలముపై నుంచుకొని అతని ముఖమును చూచుచు మాటిమాటికి ముద్దుపెట్టుకొనెను అని నారాయణుడు నారదునితో పలికెను. ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ తృతీయే గణపతిఖండే నారద నారాయణ సంవాదే కార్తవీర్యార్జున సన్నాహోనామ చతుస్త్రింశత్తమోzధ్యాయః || శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణములో మూడవదగు గణపతిఖండమున నారద నారాయణమునుల సంవాద సమయమున పేర్కొనబడిన కార్తవీర్యార్జునుని యుద్ధ సన్నాహమను ముప్పది నాల్గవ అధ్యాయము సమాప్తము.