sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
పంచత్రింశత్తమోzధ్యాయః - శంకర కవచ ప్రకధనం నారాయణ ఉవాచ - నారాయణ ముని ఇట్లు నారదునితో పలికెను- మనోరమా ప్రాణనాథం క్షణం కృత్వా స్వవక్షసి | భవిష్యం మనసా చక్రే యద్యత్ స్వామి ముఖాత్ శ్రుతం ||
1 పుత్రాంశ్చ పురతః కృత్వా బాంధవాంశ్చ స్వకింకరాన్ | సస్మార సా హరిపదం మేనే సత్యం భ##వేన్మునే || 2 యోగేన భిత్వా షట్చక్రం వాయుం సంస్థాప్య మూర్దని | బ్రహ్మరంధ్రస్థకమలే సహస్ర దళసంయుతే || 3 స్వాంతమాకృష్య విషయాజ్జలబుద్బుద సన్నిభాత్ | సంస్థాప్య బధ్వాజ్ఞానేన లోలం బ్రహ్మణి నిష్కలే || 4 ద్వివిధం కర్మ సన్యస్య నిర్మూలమపునర్భవం | తత్ర ప్రాణాంశ్చ తత్యాజ న చ ప్రాణాధికం ప్రియం || 5 మనోరమాదేవి తన ప్రాణనాథుని క్షణకాలము తన రొమ్ముపై నుంచుకొని తన భర్త చెప్పిన భవిష్యద్విషయములను మనస్సులో నుంచుకొని తన పుత్రులను కింకరులను, బంధువులనందరను పిలిపించుకొని శ్రీహరి పాదములను మనస్సులోనుంచుకొని తన భర్త చెప్పిన మాటలు సత్యమగునని విశ్వసించెను. తరువాత ఆ దేవి యోగమార్గమున మూలాధారాది షట్చక్రములనతిక్రమించి, తన శిరస్సున వాయువునుంచుకొని, బ్రహ్మరంధ్రముననున్న సహస్ర దళకమలమున నీటి బుడగలవంటి విషయములనుండి తన మనస్సును తప్పించి నిష్కళంకమైన పరబ్రహ్మయందు దానిని సుస్థిరము చేసెను. నిర్మూలము, సంసార రహితమగు ద్వివిధ కర్మలను వదలిపెట్టుచు తన ప్రాణములను కూడ విడిచినది. కాని ఆమె తన మనస్సులో తన ప్రాణముల కన్న గొప్పవైన తన భర్తను మాత్రము వదిలిపెట్టలేదు. స రాజా తాం మృతాం దృష్ట్వా విలలాప రురోదచ | సన్నాహం సంపరిత్యజ్య కృత్వా వక్షస్యువాచ తాం || 6 రాజగు కార్తవీర్యార్జునుడు తన భార్య చనిపోయిన విషయమును తెలిసికొని ఏడ్వసాగెను. అట్లే అతడు యుద్ద సన్నాహములను వదలి పెట్టి ఆమెను కౌగిలించుకొని ఇట్లు మాట్లాడెను. రాజోవాచ- రాజగు కార్తవీర్యుడిట్లు పలికెను. మనోరమే సముత్తిష్ఠ న యాస్యామి రణాంగణం | సచేతనా మాం పశ్యేతి విలపంతం ముహుర్ముహుః || 7 మనోరమే సముత్తిష్ఠ మయాసార్థం గృహం వ్రజ | న కరిష్యామి సమరం భృగుణా సహ భామిని || 8 మనోరమే సముత్తిష్ఠ శ్రీశైలం వ్రజ సుందరి | తత్ర క్రీడాం కరిష్యామి త్వయాసార్థం యథా పురా || 9 మనోరమే సముతిష్ఠ వ్రజ గోదావరీం ప్రియే | జలక్రీడాం కరిష్యామి త్వయా సార్థం యథాపురా || 10 మనోరమే సముత్తిష్ఠ నందనం వ్రజ సుందరి | పుష్పభద్రానదీతీరే విహరిష్యామి నిర్జనే || 11 మనోరమే సముత్తిష్ఠ మలయం వ్రజ సుందరి | త్వయాసార్థం రమిష్యేzహం తత్ర చందన కాననే || 12 శీతేన గంధయుక్తేన వాయునా సురభీకృతే | భ్రమర ధ్వని సంయుక్తే పుంస్కోకిలరుతశ్రుతే || 13 చందనాగురు కస్తూరీ కుంకమాలేపనం కురు | చందనోక్షిత సర్వాంగం పశ్య మాం సస్మితే సతి || 14 సుధాతుల్యం సుమధురం వచనం రచయ ప్రియే | కుటిల భ్రూవికారం చ కథం న కురుషేzధునా || 15 ఓ మనోరమా!నీవు లేనిచో నేను యుద్ధమునుకు పోను. నన్ను చక్కగా చూడుమని రాజు మాటి మాటికి విలపించుచుండెను. అతడుతన గడచిన స్మృతులను జ్ఞాపకమునకు తెచ్చుకొనుచు ఓ మనోరమా! నీవు లేచి శ్రీశైల పర్వతమునకు పోయినచో అచ్చట పూర్వము విహరించినట్లే విహరింతుము. అట్లే ప్రియురాలా! నీవు లేచి గోదావరీనదికి పోయినచో ఆనదిలో పూర్వమాచరించినట్లే జలక్రీడలుచేయుదము. ఇంకను నీవు లేచి నందనవనమునకు పోయిన చో పుష్పభద్రానదీతీరమునున్న నిర్జనప్రాంతమున విహరించుదము. అట్లే లేచి మలయ పర్వతమునకు వెళ్ళినచో, అచ్చటి చందనవనమున నీతోరమింతును. అచ్చటివాయువు చల్లగాను, పరిమళభరితముగాను ఉండును. ఆ ప్రదేశము గండుతుమ్మెదల ధ్వనితో, గండుకోయిలల కుహూ నాదముతో నిండియుండును. అచ్చట నీవు నన్ను చందనము, అగురు, కస్తూరి, కుంకుమ మొదలగు సుగంధ ద్రవ్యములపై పూతను పూయుము. చందనముతో నిండిన సర్వావయవములు కల నన్ను చూడుము. అమృతోపమానములగు సమధురవచనములతో నన్ను పలుకరింపుము. నీవిప్పుడు కోపముతో ఎందుకు పలుకరింపవని దుఃఖించుచు రాజు పలికెను. నృపస్య రోదనం శ్రుత్వా వాగ్బభూవాశరీరిణీ | స్థిరీభవ మహారాజ కురుషే రోదనం కథం || 16 త్వం మహాజ్ఞానినాం శ్రేష్ఠో దత్తాత్రేయ ప్రసాదతః | జలబుద్బదవత్సర్వం సంసారం పశ్య శోభనం || 17 కమలాంశా చ సా సాధ్వీ జగామ కమలాలయం | త్వేమేవ గచ్ఛ వైకుంఠం రణం కృత్వా రణాజిరే || 18 కార్తవీర్యుడు దుఃఖముతో పలుకుచున్న మాటలు విని అశరీరవాణి ఆ మహారాజుతో ఇట్లు పలికెను. ఓమహారాజా! నీవు ఓపిక పట్టుకొనుము. దత్తాత్రేయస్వామియొక్క అనుగ్రహమువలన నీవు మిక్కిలి జ్ఞానమును సంపాదించుకొంటివి. మహాజ్ఞానివగు నీవే ఏడ్చుచున్నావు. ఈ సంసారమంతయును నీటి బుడగవలె చాల అందముగా కన్పించుచున్నను అది క్షణికమైనది. దానికై నీవు బాధపడుట తగదు. నీభార్యయగు మనోరమ పరమ పతివ్రత. లక్ష్మీదేవియొక్క అంశవలన జన్మించినది కావుననే లక్ష్మీదేవి నివసించుచున్న వైకుంఠమునకు పోయినది. అందువలన నీవు కూడ రణరంగమున ప్రాణములను వదలి వైకుంఠమునకు పొమ్మని పలికెను. ఇత్యేవం వచనం శ్రుత్వా జహౌ శోకం నరాధిపః | తతశ్చందన కాష్ఠేన చితాం దివ్యాం చకార సః || 19 సంస్కారాగ్నిం కారయిత్వా పుత్రద్వారా దదాహ తాం | నానావిధాని రత్నాని బ్రహ్మణభ్యో దదౌ ముదా || 20 నానావిధాని దానాని వస్త్రాణి వివిధాని చ | మనోరమాయాః పుణ్యన బ్రాహ్మణభ్యో దదౌ ముదా || 21 భుజ్యతాం భుజ్యతాం శశ్వద్దీయతాం దీయతా మితి ష శబ్దో బభూవ సర్వత్ర కార్తవీర్యాశ్రమే మునే || 22 కోపేషు స్వాదికారేషు స్థితం యద్యద్దనం తదా | మనోరమాయః పుణ్యన బ్రాహ్మణభ్యో దదౌ ముదా || 23 ఆకాశవాణి యొక్క మాటలను విని కార్తవీర్యుడు భార్యాశోకమును వదలి చందనపు కట్టెలతో దివ్యమైన చితిని చేయించెను. తరువాత పుత్రుని ద్వారా సంస్కారములనన్నిటిని చేయించి చితికి నిప్పు పెట్టించెను. అటుపిమ్మట బ్రాహ్మణులకు దానముగా అనేక విధములైన రత్నములను, వస్త్రములను తనకు చెందిన కోశాగారమున నున్న ధనమంతయు ఇచ్చెను. ఇదియంతయు మనోరమ యొక్క పుణ్యము వలననే జరిగినది. ఆసమయమున కార్తవీర్యునియొక్క ఇంటిలో ఎచ్చట చూచినను తినుడు తినుడని, దానములనిండు, ఇండు అనుశబ్దములు మాత్రమే వినవచ్చినవి. రాజా జగామ సమరం హృదయేన విదూయతా | సార్థం సైన్యసమూహైశ్చ వాద్యభాండైరసంఖ్యకైః || 24 దదర్శామంగళం రాజా పురోవర్త్మని వర్త్మని | య¸° తథాzపి సమరం నాజగామ గృహం పునః || 25 రాజు బాధపడుచున్న మనస్సుతోనే, తన సైన్యసమూహమును, వాద్యములను, భాండాగారమును వెంట పెట్టుకొని యుద్దమునకు బయలు దేరెను. అతడు యుద్దమునకు పోవు సమయమున త్రోవలో అనేకాశుభ శకునములు కనిపించినను వెనుదిరుగక యుద్దమునకు పోయిన మహారాజు మరల ఇంటికి తిరిగి రాలేదు. ముక్తకేశీం ఛిన్ననాసాం రుదతీం చ దిగంబరాం | కృష్ణవస్త్రపరీధానామపరాం విధవామపి || 26 ముఖదుష్టాం వ్యాధియుక్తాంచ కుట్టినీం | పతిపుత్ర విహీనాం చ డాకినీం పుంశ్చలీం తథా || 27 కుంభకారం లైలకారం వ్యాధం సర్పోపజీవినం | కుచైలమతిరూక్షాంగం నగ్నం కాషాయవాసినం || 28 వసా విక్రయిణం చైవ కన్యావిక్రయిణం తథా | చితా దగ్దం శవం భస్మ నిర్వాణాంగారమేవచ || 29 సర్పక్షతం నరం సర్పం గోధాం చ శశఖం విషం | శ్రాద్ధపాకం చ పిండం చ మోటకం చ తిలాస్తథా || 30 దేవలం వృషవాహం చ శూద్రశ్రాద్ధాన్న భోజినం | శూద్రాన్న పాచకం శూద్రయాజకం గ్రామయాజకం || 31 కుశపుత్తలికాం చైవ శవదాహన కారిణం | శూన్యకుంభం భగ్నకుంభం తైలం లవణమస్థి చ | 32 కార్పాసం కచ్ఛపం చూర్ణం కుక్కురం శబ్దకారిణం | దక్షిణ చ సృగాలం చ కుర్వంతం భైరవం రవం || 33 కపర్దకం చ క్షౌరం చ ఛిన్నకేశం నఖం మలం | కలహం చ విలాపం చ తథా తత్కారిణం జనం || 34 అమంగళం రుదంతం చ రుదంతం శోకకారిణం || 35 మిథ్యాసాక్ష్య ప్రదాతారం చౌరం చ నరఘాతినం | పుంశ్చలీపతి పుత్రౌ చ పుంశ్చల్యోదన భోజినం || 36 దేవతా గురు విప్రాణాం వస్తు విత్తాపహారిణం | దత్తాపహరిణం దస్యుం హింసకం సూచకం ఖలం || 37 పితృమాతృవిరక్తం చ ద్విజాశ్వత్థ విఘాతినం | సత్యఘ్నం చ కృతఘ్నం చ స్థాప్యస్యాప్యపహారిణం || 38 విప్ర మిత్ర ద్రోహమేవం క్షతం విశ్వాస ఘాతకం | గురుదేవ ద్విజానాం చ నిందకం స్వాంగ ఘాతకం || 39 జీవానాం ఘాతకం చైవ స్వాంగహీనం చ నిర్దయం | వ్రతోపవాసహీనం చ దీక్షాహీనం నపుంసకం || 40 గలిత వ్యాధిగాత్రం చ కారణ బధిరమేవ చ | పుల్కసం ఛిన్నలింగం చ సురామత్తం సురాం తథా || 41 క్షిప్తం వమంతం రుధిరం మహిషం గర్దభం తథా | మూత్రం పురీషం శ్లేష్మాణం రూక్షిణం నృకపాలకం || 42 చండవాతం రక్తవృష్టిం వాద్యం వై వృక్షపాతనం | వృకం చ సూకరం గృధ్రం శ్యేనం కంకం చ భల్లుకం || 43 పాశం చ శుష్కకాష్ఠం చ వాయసం గంధకం తథా || 44 ప్రతిగ్రాహి బ్రాహ్మణం చ తంత్రమంత్రోప జీవినం | వైద్యం చ రక్తపుష్పం చాప్యౌషధం తుషమేవ చ || 45 కువార్తాం మృతవార్తాంచ విప్రశాపం చ దారుణం | దుర్గంధివాతం దుశ్శబ్దం రాజాzపశ్యత్స వర్త్మని || 46 మనశ్చ కుత్సితం ప్రాణాః క్షుభితాశ్చ నిరంతరం | వామాంగ స్పందనం దేహజాడ్యం రాజ్ఞో బభూవ హ || 47 కార్తవీర్యుడు రణరంగమునకు పోవుచున్నప్పుడు మార్గమధ్యలో తల విరియబోసికొని ముక్కు తెగిపోగా దిగంబరగా ఏడ్చుచు నల్లని వస్త్రములు ధరించిన స్త్రీని, విధవాస్త్రీని, చెడుమాటలు మాట్లాడునది, రోగముతోనున్న కుట్టినిని (తార్చెడుస్త్రీని) భర్త, పుత్రులులేని స్త్రీని, వ్యభిచారము చేయు స్త్రీని, కుమ్మరివానిని, గానుగవానిని, వ్యాధుని, పాములనాడించుచు బ్రతుకు పురుషుని, మలిన వస్త్రములు ధరించినవానిని, చాలా భయంకమైన అవయవములు కలవానిని, నగ్నముగా నున్నవానిని, కాషాయ వస్త్రములు కలవానిని, వసను అమ్ముకొని బ్రతుకువానిని, తన కన్యను అమ్ముకొనువానిని, చితిపై మండుచున్న శవమును, శవము యొక్క బూడిదను, ఆరిపోవుచున్న నిప్పును చూచుచు రణరంగమునకు పోయెను. ఇంకను అతడు తన మార్గములో సర్పదష్టుడైన పురుషుని, సర్పమును, తొండను, కుందేలును, విషమును, శ్రాద్ధపాకమును, శ్రాద్ధపిండములను, మోటకమును, నూవులను, అర్చకుని, వృషభమునెక్కి తిరుగువానిని, శూద్రుని యొక్క శ్రాద్దాన్నమును భుజించువానిని, శూద్రులకు వంట వండి బ్రతుకువానిని, శూద్రులచే పూజలు చేయించువానిని, గడ్డిబొమ్మను, శవములను కాల్చువానిని, శూన్యమైన కుంభమును, పగిలిన కుండను, నునె, ఉప్పు, ఎముకలను, ప్రత్తిని, తాబేలును, కుడిప్రక్క మొరుగుచున్న కుక్కను, భయంకరముగా ఊళ##వేయునక్కను, క్షౌరము చేయగా పడిన వెండ్రుకలను, గోళ్ళను, మలమును, కలహమను, ఏడ్పును, చనిపోయినందువలన ఏడ్చుచున్న జనమును, కూట సాక్ష్యములు చెప్పువానిని, దొంగను, హంతకుని, చెడిపోయిన స్త్రీయొక్క భర్తను, పుత్రులను, ఆమె వంటను తిను బ్రాహ్మణుని, దేవతలు, గురువు, బ్రాహ్మణుల యొక్క ధనము నపహించువానిని, ఇతరులకు దానముగా నీయబడిన వస్తువు నపహరించిన వానిని, దుర్మార్గుని, ఇతరుల హింసించువానిని, సూచకుని, తల్లిదండ్రులను పోషింపనివానిని, బ్రాహ్మణుని హింసించువానిని, రావిచెట్టును పడగొట్టువానిని, అబద్దములాడు వానిని, కృతఘ్నుని, తన దగ్గర దాచి పెట్టిన వస్తువుల నపహరించువానిని, బ్రాహ్మణులకు, తనమిత్రులకు ద్రోహము చేయు వానిని, విశ్వాసఘాతకుని, గురువులను, దేవతలను, బ్రాహ్మణులను ఎల్లప్పుడు నిందించువానిని, జీవులను చంపువానిని, అవయవములు లేనివానిని, దయలేనివానిని, వ్రతోపవాసములు చేయనివానిని, వ్రతనియమము లేని వానిని, కల్లును, రక్తమును కక్కుకొనుచున్నవానిని, దున్నపోతును, గాడిదను, మలమూత్రములను, శ్లేష్మమును, భయంకరమైన పుఱ్ఱను, ఈదురుగాలిని, రక్తవర్షమును, చెట్లు పడిపోవుటను, తోడేలును, పందిని, డేగను, ఎలుగుబంటిని, పాశములను, ఎండిపోయిన కట్టెలను, కాకిని, దానమును తీసికొనుచున్న బ్రాహ్మణుని, తంత్రమంత్రమువలన జీవించువానిని, వైద్యుని, ఎఱ్ఱని పుష్పములను, ఔషధమును, ఊకను, చెడువార్తను, మరణవార్తను, బ్రాహ్మణశాపమును, దుర్వాసనగల వాయువును చూచెను. దానిచే అతని మనస్సు వికలమైనది. ఎడమ పార్శ్వము అదరసాగినది. జాడ్యమేర్పడినది. ఈ విధముగా కార్తవీర్యునకు మార్గమధ్యములో అపశకునములు కలిగినవి. తధాzపి రాజా నిశ్శంకో దదర్శ సమరాంగణం | సర్వ సైన్యసమాయుక్తః ప్రవివేశ రణాజిరం || 48 అవరుహ్య రథాత్తూర్ణం దృష్ట్వా చ పురతో భృగుం | ననామ దండవధ్భూమౌ రాజేంద్రైః సహ భక్తితః || 49 ఆయుషం యుయుజేరామః స్వర్గం యాహీతి వాంఛితం | తేషాం సహ్యం తద్భభూవుర్దుర్లంఘ్యా బ్రాహ్మణాశిషః || 50 భృగుం ప్రణమ్య రాజేంద్రో రాజేంద్రైస్సహ తక్షణాత్ | ఆరుహ్య చ రథం తూర్ణం నానాయుధ సమన్వితం || 51 నానాప్రకారవాద్యం చ దుందుభిం మురజాదికం | వాదయామాస సహసా బ్రాహ్మణభ్యో దదౌ ధనం || 52 ఉవాచ రామో రాజేంద్రం రాజేంద్రాణాం చ సంసది | హితం సత్యం నీతిసారం వాక్యం వేదవిదాం వరః || 53 కార్తవీర్యార్జునుడు రణరంగమునకు పోవుచుండగా త్రోవలో అపశకునములెదురైనను ఎట్టి శంకలేక తన సైన్యముతో రణరంగమును ప్రవేశించెను. ఆ రణరంగమున తనకెదురుగా నున్న పరశురాముని చూచి తన రథమునుండి వెంటనే దిగి తోటి రాజులతో కలసి భక్తితో దండ ప్రణామమాచరించెను. అప్పుడు భార్గవరాముడు కార్తవీర్యునితో నీవు కోరుకున్నట్లు స్వర్గమునకు పోయెదవని ఆశీర్వదించెను. బ్రాహ్మణాశీర్వచనములు అనుల్లంఘనీయములు కదా! కార్తవీర్యుడు తనతోటి రాజులతో కలసి భార్గవరామునకు నమస్కరించి అనేకాయుధములతో వెంటనే తన రథము నధిరోహించెను. యుద్ధము చేయుటకు ముందు బ్రాహ్మణులకు దానములు చేసి యుద్ధవాద్యములగు దుందుభి మృదంగము మొదలగు వాద్యములను యుద్ధసూచకముగా మ్రోగించెను. అప్పుడు భార్గవరాముడు కార్తవీర్యునుతో అతని తోడి రాజుల ముందు హితము, సత్యము, నీతియుక్తమగు మాట లిట్లు పలికెను. పరశురామ ఉవాచ - పరశురాముడిట్లు పలికెను- శ్రుణు రాజేంద్ర ధర్మిష్ఠ చంద్రవంశసముద్భవ | విష్ణోరంశస్య శిష్యంస్త్యం దత్తాత్రేయస్య ధీమతః || 54 స్వయం విద్వాంశ్చ వేదాంశ్చ శ్రుత్వా వేదవిదో ముఖాత్ | కథం దుర్బుద్ధిరధునా సజ్జనానాం విహింసనా || 55 త్వం పూర్వ మహనో లోభాన్నిరీహం బ్రాహ్మణం కథం | బ్రాహ్మణీ శోక సంతస్తా భర్త్రాసార్థం గతా సతీ || 56 కిం భవిష్యతి తే భూప పరత్రైవానయోర్వధాత్ | సర్వం మిధ్యైవ సంసారం పద్మపత్రే యథాజలం || 57 సత్కీర్తిశ్చాథ దుష్కీర్తిః కథామాత్రావశేషితా | విడంబనా వా కిమతో దుష్కీర్తేశ్చ సతామహో || 58 క్వగతా కపిలా త్వం క్వ క్వ వివాదో మునిః కుతః | యత్కృతం విదుషా రాజ్ఞా న కృతం హాలికేన తత్ || 59 త్వాముపోషితమీశం హి దృష్ట్వా తాతో హి ధార్మికః | పారణం కారయామాస దత్తం తస్య ఫలం త్వయా || 60 అధీతం విధివద్దత్తం బ్రాహ్మణభ్యో దినే దినే | జగత్తే యశసా పూర్ణమయశో వార్ధకే కథం || 61 దాతా వరిష్ఠో యశస్వీ పుణ్యవాన్ సుధీః | కార్తవీర్యార్జునసమో న భూతో న భవిష్యతి || 62 పురాతనా వదంతీతి వందినోధరిణీతలే | యో విఖ్యాతః పురాణషు తస్య దుష్కీర్తిరీదృశీ || 63 దుర్వాక్యం దుస్సహం రాజంస్తీక్ణాప్త్రాదపి జీవినాం | సంకటేzపి సతాం వక్త్రాత్ ద్విరుక్తిర్న వినిర్గతా || 64 న దదామి ద్విరుక్తిం తే ప్రాకృతం కథయామ్యహం | ఉత్తరం దేహి రాజేంద్ర మహ్యం రాజేంద్ర సంసది || 65 సూర్య చంద్రమనూనాం చ వంశజాః సంతి సంసది | సత్యం వద సభాయాం చ శ్రుణ్వంతు పితరః సురాః || 66 శ్రుణ్వంతు సర్వే రాజేంద్రాః సదసద్వక్తుమీశ్వరాః | పశ్యంతో హి సమం సంతుః పాక్షికం న వదంతి చ || 67 ఓరాజా! నీవు ధర్మత్పరుడవు. చంద్రవంశమున పుట్టిన వాడవు. ఇంకను విష్ణుమూర్తికి అంశావతారమగు దత్తాత్రేయుని శిష్యుడవు. అతడు మహాజ్ఞాని. నీవు కూడ స్వయముగా విద్వాంసుడవు. వేదములన్నియు తెలిసిన దత్తాత్రేయునినుండి వేదములను చదివిన నీకు సజ్జనులను హింసించుట అనుదుర్బద్ది ఏవిధముగా నేర్పడినది. నీవు ఇంతకు ముందు లోభగుణముచే కోరికలు లేని బ్రాహ్మణుని చంపితివి. అతని భార్య తన భర్తృశోకము వలన బాధచెంది భర్తతో సహగమనము చేసినది. దానివలన నీకేమి లాభము జరిగినది?ఈసంసారమంతయు తామరాకుపై నున్న నీటిబొట్టువలె అశాశ్వతమైనది. సత్కీర్తి లేక దుష్కీర్తి ఈరెంటిలో ఒకటి మాత్రమే లోకమున మిగులును. సత్పురుషులకు అపకీర్తి కలిగెనన్నచో దానికంటె మించినదేమి కలదు? కపిల (కామధేనుము) ఎచటకు పోయెను?నీవెచటకు పోతివి? రాజువగు నీవెక్కడ?మునిఎక్కడ? మీ ఇరువురి మధ్య వివాదమెక్కడ? వివేకవంతుడగు రాజు చేసిన ఇట్టి దుష్కృత్యము వివేక మేమాత్రమును లేని అమాయకుడు కూడా చేయడు. నీవు ఉపోష్యమున్నవిషయమును పరమధార్మికుడగు నాతండ్రి గమనించి నీకు భోజనము పెట్టిన దానికి నీవు చక్కని ఫలితము నిచ్చితివి. నీ వేదాధ్యయనము, ప్రతిదినము బ్రాహ్మణులకు విధిపూర్వకముగానిచ్చిన దానముల వలన ఈ ప్రపంచమంతయు నిండిపోయినది. అట్టి నీకు ముసలితనమున అపకీర్తి లభించినది గదా! దానము చేయువాడు, శ్రేష్ఠుడు, ధర్మకార్యముల నాచరించువాడు, చక్కని పేరున్నవాడు, పుణ్యవంతుడు, విద్వాంసుడు అగు కార్తవీర్యుని వంటివాడు పుట్టడు, పుట్టబోడు అని ఈ ప్రపంచమున పెద్దలు, వంది మాగధులు కొనియాడుచున్న నీకు ఇటువంటి చెడు కీర్తి కలిగినది. ఓరాజా!పరుషమైన వాక్కు సహింపరానిది. అది పదునైన శస్త్రము వంటిది. సత్పురుషుల నోటినుండి కష్టసమయమున కూడ రెండు విధములైన మాటలు రావు. నేను నీపై ఆరోపణలు చేయలేదు. సత్యమైన మాటగనే చెప్పితిని. అందువలన ఈ రాజసమూహమున్న చోట నీవు నాకు ఉత్తరమిమ్ము. ఇచ్చట సూర్య, చంద్ర, మను వంశములకు చెందిన రాజులున్నారు. ఈ సభయందు నీవు సత్యమును పలుకుము. నీ మాటలను పితృదేవతలు, దేవతలు కూడ విందురు. అట్లే మంచి చెడ్డలు చెప్పగలిగన రాజ శ్రేష్ఠులందరు నీప్రత్యుత్తరమును విందురు. సజ్జనులెల్లప్పుడు పక్షపాతము లేక న్యాయముగా ఉందురని భార్గవరాముడు పలికెను. ఇత్యుక్త్వా రైణుకేయుశ్చ విరరామ రణస్థలే | రాజా బృహస్పతి సమః ప్రవక్తుముపచక్రమే || 68 భార్గవ రాముడు రణరంగమున ఈ విధముగా కార్తవీర్యార్జునితో పలికి యూరకుండెను. అప్పుడు బుద్ధియందు బృహస్పతితో సమానమైన కార్తవీర్యుడు ఇట్లు ప్రత్యుత్తరమునిచ్చెను. కార్తవీర్యార్జున ఉవాచ - కార్తవీర్యార్జునుడిట్లనెను- శ్రుణు రామ హరే రంశో హరిభక్తో జితేంద్రియః | శ్రుతో ధర్మో ముఖాద్వేషాం త్వం చ తేషాం గురోర్గురుః || 69 కర్మణా వాzప్యసద్బుధ్యా కరోతి బ్రహ్మభావనాం | స్వధర్మ నిరతః శుద్ధస్తస్మాద్ర్బాహ్మణ ఉచ్యతే || 70 అంతర్బహిశ్చ మననాత్కురుతే కర్మ నిత్యశః | మౌనీ శశ్వద్వదేత్కాలే యోవై స మునిరుచ్యతే || 71 స్వర్ణేలోష్టే గృహేzరణ్య పంకే సుస్నిగ్ద చందనే | సమతా భావనా యస్య సయోగీ పరికీర్తితః || 72 సర్వ జీవేషు యో విష్ణుం భావయేత్సమతా ధియా | హరౌ కరోతి భక్తిం చ హరిభక్తః స చ స్మృతః || 73 తపో ధనం బ్రాహ్మణానాం తపః కల్పతరుర్యథా | తపస్యా కామధేనుశ్చ సంతతం తపసి స్పృహా || 74 ఐశ్వర్యే క్షత్రియాణాం చ వాణిజ్యే చ తథా విశాం | క్షత్రియాణాం చ తపసి స్పృహాzతీవాzప్రశంసితా || 75 బ్రాహ్మణానాం వివాదే చ స్పృహాzతీవ వినిందితా || 76 రాగీ రాజసికం కార్యం కురుతే కర్మ రాగతః | రాగాంధో యో రాజసికస్తేవ రాజా ప్రకీర్తితః || 77 రాగతః కామధేనుశ్చ మయావై యాచితా మునే | కో దోష ఏకమేజాతః క్షత్రియస్యానురాగిణః || 78 కుతుః కస్య మునే రస్తి కామధేనుస్త్యయా వినా | స్పృహా రణనా భోగే వా యుష్మాకం చ వ్యతిక్రమః || 79 త్రింశదక్షౌహీణీం సేనాం రాజేంద్రాణాం త్రికోటికాం | నిహత్యాయాం తమేకం హం నహంతుం సహనం మునే || 80 ఆత్మానం హంతు మాయాంతమపివేదాంగ పారగం | నదోషో హననే తస్య న తేన బ్రహ్మహాzభవం || 81 ఓ భార్గవరామా! నీవు శ్రీహరియొక్క అంశస్వరూపుడవు. శ్రీహరి భక్తుడవు. ఇంద్రియములనన్నిటిని జయించిన వాడవు. నీవు ఏ గురువుల దగ్గర ధర్మ విషయములను తెలిసికొంటివో వారికే నీవు గురువువంటివాడవు. తన కర్మననుసరించి లేక సద్భుద్ధితోనైనా బ్రహ్మభావనను తన ధర్మముననుసరించిచేయువాడు బ్రాహ్మణుడని పిలువబడుచున్నాడు. లోపల మననము చేయుచు బయట కర్మలనాచారించువాడు ముని. అతడెల్లప్పుడు మౌనముగా నుండి అవసరమైన సమయమున మాత్రమే మాటలాడును. బంగారమున, మట్టిపాత్రయందు, ఇంటిపై, అడవిపై, బురదపై, చిక్కని చందనముపై సమభావనము కలవాడే యోగి యనబడును. సమస్తజీవులయందు సమతా భావనచే హరిబుద్దిని కలిగియుండువాడు, శ్రీహరి యందు భక్తి భావన కలవానిని హరి భక్తుడని అందురు. బ్రాహ్మణులకు తపస్సే ధనము. అది కల్పతరువు వంటిది. కామధేనువు వంటిది. కావుననే వారికెల్లప్పుడు తపస్సుపై కోరిక యుండును. క్షత్రియులకు ఐశ్వర్యముపై, వైశ్యులకు వాణిజ్యమున కోరికయుండును. కాని క్షత్రియులు తపస్సు చేయుటను పెద్దలు నిందింతురు. అట్లే బ్రాహ్మణులు వివాదముల జోలికి పోవుట అప్రశస్తమందురు. అనురాగియైనవాడు కర్మపై అనురాగముతో రాజసిక కార్యములు చేయును. రాగాంధుడు రాజసికుడైనవానిని రాజని పిలుతురు. అందువలన అనురాగముచే నేను జమదగ్ని మహామునిని కామధేనువు కావలెనని జమదగ్ని మహర్షిని యాచించితిని. అనురాగియగు క్షత్రియునకీ విషయమున తప్పేమి కలదు. మీకు తప్ప కామధేనువు ఏమహర్షికి కలదు. మునులకు యుద్ధముపై కోరిక భోగములననుభవింపలెనని అనుకొనుట తగని విషయము కాదు. అట్లే ముప్పది యక్షౌహిణుల సైన్యమును, మూడుకోట్ల రాజేంద్రులను చంపి ఒంటరిగా నున్న నన్ను చంపబూనుటను సహింపలేక జమదగ్ని మహర్షిని చంపితిని. తనను చంపుటకు ప్రయత్నించువాడు వేదవేదాంగ పారగుడైనను అతనిని చంపినచో బ్రహ్మహత్యాదోషమంటదు అందువలన నా తప్పేమి లేదని కార్తవీర్యుడనేను. ప్రాయశ్చిత్తం హింసకానాం నవేదేషు నిరూపితం | వధస్సముచితస్తేషా మిత్యాహ కమలోద్భవః || 82 పిత్రాతే నిహతా భూపా మహాబలపరాక్రమాః | ఇదానీం రాజపుత్రాశ్చ శిశవోzత్ర సమాగతాః || 83 త్రిః సప్తకృత్వో నిర్భూపాం కృత్నాం కుర్తుం మహీమితి | త్వయా కృతా ప్రతిజ్ఞా యా తస్యాస్త్వం పాలనం కురు || 84 క్షత్రియాణాం రణో ధర్మో రణ మృత్యుర్న గర్హితః | రణ స్వాహా బ్రాహ్మణానాం లోకే వేదే విడంబనా || 85 తపోధనానాం విప్రాణాం వాగ్బలానాం యుగే యుగే | శాంతిః స్వస్త్యయనం కర్మ విప్రధర్మో న సంగరః || 86 క్షత్రియాణాం బలం యుద్దం వ్యాపారశ్చ బలం విశాం | భిక్షాబలం భిక్షుకాణాం శూద్రాణాం విప్రసేవనం || 87 హరౌ భక్తిర్హరేర్దాస్యం వైష్ణవానాం బలం హరిః || హింసా బలం ఖలానాం చ తపస్యా చ తపస్వినాం || 88 బలం వేషశ్చ వేశ్యానాం యోషితాం ¸°వనం బలం | బలం ప్రతాపో భూపానాం బాలానాం రోదనం బలం || 89 సతాం సత్యం బలం మిథ్యా బలమేవాసతాం సదా | అనుగానామనుగమః స్వల్పస్వానాం చ సంచయః || 90 విద్యాబలం పండితానాం ధైర్యం సాహసినాం బలం || 91 ధనం బలం చ దనినాం శుచీనాం చ విశేషతః | బలం వివేకః శాంతానాం గుణినాంబలమేకతా || 92 గుణోబలం చ గుణినాం చౌరాణాం చౌర్యమేవచ | ప్రియవాక్యం చ కాపట్యమధర్మః పుంశ్చలీబలం || 93 హింసా చ హింస్రజంతూనాం సతీనాం పతిసేవనం | వరశాపౌ సురాణాం చ శిష్యాణాం గురుసేవనం || 94 బలం ధర్మో గృహస్థానాం భృత్యానాం రాజసేవనం | బలం స్తవఃస్తావకానాం బ్రహ్మచ బ్రహ్మచారిణాం || 95 యతీనాం చ సదాచారో నాస్యః సన్యాసినాం బలం | పాపం బలం పాతకినామశక్తానాం హరిర్బలం || 96 పుణ్యం బలం పుణ్యవతాం ప్రజానాం నృపతిర్బలం | ఫలం బలం చ వృక్షాణాం జలజానాం జలం బలం || 97 జలం బలం చ సస్యానాం మత్స్యానాం చ జలం బలం | శాంతిర్బలం చ భూపానాం విప్రాణాం చ విశేషతః || 98 విప్రః శాంతో రణోద్యోగీనైవ దృష్టో న చ శ్రుతః | స్థితే నారాయణ దేవే బభూవాన్యవిపర్యయః || 99 పరులను హింసించువారు చేసికొనవలసిన ప్రాయశ్చిత్తమును గురించి వేదములందెచ్చట చెప్పబడలేదు. వారిని వధించుటయే తగినదని బ్రహ్మదేవుడు చెప్పెను. నీతండ్రి మహాబలపరాక్రమవంతులగు రాజుల నెందరనో సంహరించెను. ఇచ్చటనున్న వారందరు వయస్సులో చిన్న వారైన రాజపుత్రులు, శిశువులు. నీవుకూడ రాజులనందరను ఇరువదియొక్క మార్లు తిరిగి సంహరింతునని ప్రతిజ్ఞ చేసితివి కదా . నీ ప్రతిజ్ఞను నెరవేర్చుకొమ్ము. క్షత్రియులకు యుద్దము చేయుట వారి వృత్తి. ఆయుద్దమున చనిపోవుట నిందింపతగినది కాదు. కాని బ్రాహ్మణులు యుద్దము చేయుట వేదములందు, లౌకిక శాస్త్రములందు ఎచ్చటను కనిపించదు. తపోధనులు, వాక్కులే బలముగా కల బ్రాహ్మణులకు శాంతి, స్వస్తి వాచనము అనునవి ధర్మములు. క్షత్రియులకు యుద్ధము చేయుట వైశ్యులకు వర్తకము చేయుట, భిక్షుకులకు బిచ్చమెత్తుట, శూద్రులకు బ్రాహ్మణసేవ, వైష్ణవులకు శ్రీహరిసేవ, శ్రీహరి దాస్యము ధర్మములు, విష్ణుభక్తులకు శ్రీహరి బలము, దుష్టులకు హింస, తపస్వులకు తపమాచరించుట, వేశ్యలకు అలంకరించుకొనుట, స్త్రీలకు ¸°వనము, రాజులకు ప్రతాపము, చిన్నపిల్లలకు ఏడ్చుట, సత్పురుషులకు సత్యము పలుకుట, దుష్టులకు అబద్దములాడుట, తక్కువ ధనము కలవారికి కూడబెట్టుట, పండితులకు విద్య,సాహసవంతులకు ధైర్యము, దనవంతులకు ధనము, శాంతస్వభావులకు వివేకము కలిగియుండుట, సద్గుణములు కలవారికి ఐక్యముగానుండుట, దొంగలకు దొంగతనము చేయుట, చెడు నడకగల స్త్రీలకు ప్రియముగా పలుకుట, కపటము, అధర్మాచరణము స్వభావ సిద్ధమైనది. అదేవిధముగా దుష్టజంతువులకు హింసించుట, సతులకు భర్తృశుశ్రూష, దేవతలకు వరములు, శాపములిచ్చుట, శిష్యులకు గురువును సేవించుట, గృహస్థులకు ధర్మాచరణము సేయుట, భృత్యులకు సేవజేయుట, వందిమాగధులకు స్తోత్రము చేయుట, బ్రహ్మచారులకు పరబ్రహ్మమును గురించి తెలిసికొనుట, యతులకు సదాచారము, సన్యాసులకు ఆత్మభారమును పరమాత్మపై నుంచుట, పాపాత్ములకు పాపములు సేయుట, అశక్తులకు శ్రీహరిని సేవించుట, పుణ్యవంతులకు పుణ్యకార్యములు చేయుట, ప్రజలకు రాజు యొక్క అండలోనుండుట అనునవి స్వభావ సిద్ధమైనవి. అట్లే వృక్షములకు పండ్లు కలిగియుండుట, జలజంతువులకు జలములోనుండుట, సస్యములకు చేపలకు నీరు, రాజులకు శాంతి, ఇంకను బ్రాహ్మణులకు కూడ శాంతి కలిగియుండుట బలమును కలిగించునవి. బ్రాహ్మణుడు శాంతముగానుండవలయునే కాని యుద్దము నాచరించుట యనునది ఎక్కడను కన్పించలేదు. విన్పించలేదు. భగవంతుడు శ్రీమన్నారాయణమూర్తి యుండగానే ఇటువంటి విపరీతము కన్పించుచున్నదని కార్తవీర్యుడు పలికెను. ఇత్యేవముక్త్యా రాజేంద్రో విరరామ రణాజిరే | తస్య తద్వచనం శ్రుత్వా సద్యస్తూష్ణీం బభూవ హ || 100 రామస్య భ్రాతరః సర్వే తీక్ష్‌ణశస్త్రాస్త్ర పాణయః | ఆరేభిరే రణం కుర్తుం మహావీరాస్తదాజ్ఞయా || 101 రణోన్ముఖాంశ్చ తాన్ దృష్ట్వా మత్స్యరాజో మహాబలః | సమారేభే రణం కర్తుం మంగళో మంగళాలయః || 102 శరజాలేన రాజేంద్రో వారయామాస తానపి | చిచ్ఛిదుః శరజాలం చ జమదగ్ని సుతాస్తదా || 103 రాజా చిక్షేప దివ్యాస్త్రం శతసూర్యప్రభం మునే | మహేశ్వరేణ మునయశ్చిచ్ఛిదుశ్చైవ లీలయా || 104 దివ్యాస్త్రేణనైవ మునయః చిచ్ఛిదుః సశరం ధనుః | రథం చ సారథిం చైవ రాజ్ఞః సన్నాహమేవ చ || 105 న్యస్తశస్త్రం నృపం దృష్ట్యా మునయో హర్షవిహ్వలాః | దధార శూలినః శూలం మత్స్యరాజ జిఘాంసయా || 106 కార్తవీర్యుడు ఈవిధముగా అని ఊరకొనగా పరశురాముడు సైతము ఊరకుండెను. అప్పుడు పరశురాముని సోదరులు తమ సోదరుని ఆజ్ఞననుసరించి అనేక శస్త్రాస్త్రములను ధరించి యుద్ధము చేయుటకు మొదలిడిరి. భార్గవరాముని సోదరులు యుద్ధసన్నద్ధులగుటను గమనించిన మహాబలుడగు మత్స్యదేశాధిపతి తాను కూడ యుద్ధమునకు సన్నద్ధుడయ్యెను. యుద్దమునకై వచ్చుచున్న భార్గవరాముని సోదరులను మత్స్య రాజు తన బాణములచే నివారింపగా వారు అతని బాణపరంపరను ముక్కలు ముక్కలు చేసిరి. అప్పుడు మత్య్సరాజు వారిపై దివ్యాస్త్రమును వేయగా వారు పాశుపతాస్త్రములను వేసి మత్స్యరాజుయొక్క దివ్యాస్త్రమును విరిచి వేసిరి. అట్లే తమ దివ్యాస్త్రములచే ఆ మహారాజుయొక్క ధనుర్బాణములను, రథమును, సారథిని, అతని సైన్యమును అవలీలగా ఖండించిరి. ధనుర్బాణములు లేని ఆ మహారాజును చూచి భార్గవరాముని సోదరులు సంతోషముతో అతనిని చంపుటకై శంకరుని శూలమును చేతిలోనికి తీసికొనిరి. శూల నిక్షేప సమయే వాగ్బభూవాzశరీరిణీ | శూలం త్యజత విప్రేంద్రాః శివస్యాzవ్యర్థమేవ చ || 107 శివస్య కవచం దివ్యం దత్తం దుర్వాససా పురా | మత్స్యరాజ గళేzస్త్యేతత్సర్వావయవరక్షకం || 108 ప్రాణానాం చ ప్రదాతారం కవచం యాచతం నృపం | తదా నిక్షిప్తశూలం చ జఘాన నృపతిశ్చిరం || 109 తచ్ఛూలం తం నృపం ప్రాప్య శతఖండం గతం మునే | శ్రుత్వైవాకాశవాణీంచ శృంగీ సన్యాస వేషకృత్ || 110 యయాచే కవచం భూపం జమదగ్నిసుతో మహాన్ | రాజా దదౌ చ కవచం బ్రహ్మాండ విజయంపరం || 111 గృహీత్వా కవచం తచ్చ శూలేనైవ జఘాన హ | పపాతమత్స్య రాజశ్చ శతచంద్రసమాననః || మహాబలిష్ఠో గుణవాన్ చంద్రవంశసముద్భవః || 112 భార్గవరాముని సోదరులు మత్స్య రాజుపై శంకరుని శూలమును ప్రయోగించుచున్న సమయమున వారితో ఆకాశవాణి ఇట్లు పలికెను. ఓ బ్రాహ్మణులారా! మీరు మత్స్యరాజుపై శంకరుని శూలమును ప్రయోగింపకుడు. ఆరాజునకు పూర్వము దుర్వాసముని దివ్యమైన శివకవచము నిచ్చెను. సమస్తావయవములను రక్షించు ఆ దివ్యకవచము ఆమహారాజుయొక్క మెడలో ఇప్పటికిని ఉన్నది. మత్స్యరాజు గొప్ప దాత. అడిగిన వానికి కాదనక తన ప్రాణములనైనను సమర్పించును. అట్టి రాజును మీరు శివకవచమునిమ్మని తొలుత యాచన సేయుడని పలికినది. ఐనను ఆముని కుమారులు శూలమును ప్రయోగింపగా అది మహారాజు దగ్గరకు వచ్చి నూరు ముక్కలైపోయినది. ఆసమయమున ఆకాశవాణి మాటలు విన్న శృంగియను జమదగ్ని పుత్రుడు సన్యాసి వేషమును ధరించి యుద్ధరంగమునకు వచ్చి ఆరాజును శివకవచము నిమ్మని ప్రార్థించెను. రాజు కూడ బ్రహ్మాండ విజయమును ఆ కవచమును బ్రాహ్మణ కుమారునకిచ్చివేసెను. శివకవచమును తీసికొన్న బ్రాహ్మణ కుమారుడతనిపై శివుని త్రిశూలమును ప్రయోగింపగా దానివలన గొప్ప బలవంతుడు, చంద్రవంశమున పుట్టిన ఆ మత్స్యరాజు భూమిపై పడి ప్రాణములు వదిలెను. నారద ఉవాచ - నారద మహర్షి ఇట్లు పలికెను- శివస్య కవచం బ్రూహి మత్స్యరాజేన యద్ధతం | నారాయణ మహాభాగ శ్రోతుం కౌతుహలం మమ || 113 ఓ నారాయణముని! మత్స్యరాజు ధరించిన శివకవచమును తెలిసికొనవలెనని యున్నది. దయచేసి నాకు దానిని వివరించి చెప్పుడని పల్కెను. కవచం శ్రుణు విప్రేంద్ర శంకరస్య మహాత్మనః | బ్రహ్మండ విజయం నామ సర్వావయవ రక్షణం || 114 పురా దుర్వాససా దత్తం మత్స్య రాజాయ ధీమతే | దత్వా షడక్షరం మంత్రం సర్వపాపప్రణాశనం || 115 స్థితే చ కవచే దేహే నాస్తి మృత్యుశ్చ జీవినాం | అస్త్రే శ##స్త్రే జలే వహ్నౌ సిద్ధిశ్చేన్నాస్తి సంశయః || 116 యుద్ధృత్వా పఠనాద్బాణః శివత్వం ప్రాప లీలయా | బభూవ శివతుల్యశ్చ యుద్ధృత్వా నందికేశ్వరః || 117 వీరశ్రేష్ఠో వీరభద్రః సాంబోzభూద్దారణాద్యతః | త్రైలోక్య విజయీ రాజా హిరణ్య కశిపుః స్వయం || 118 హిరణ్యాక్షశ్చ విజయీ చాభవద్ధారణాద్ధిసః | యుద్ధృత్వా పఠనాత్సిద్ధో దుర్వాసా విశ్వపూజితః || 119 జైగీషవ్యో మహాయోగీ పఠనాద్ధారణాద్యతః | యద్ధృత్వా వామదేవశ్చ దేవలః పవనః స్వయం || అగస్త్యశ్చ పులస్త్య శ్చాzప్యభవద్విశ్వ పూజితః || 120 ఓనారదమహర్షి! సమస్తావయవములను రక్షించు బ్రహ్మాండ విజయమును శంకరుని కవచమును సావధానముగా వినుము. సమస్త పాపములను హరించు శంకరుని షడక్షర మంత్రమును దుర్వాసమహర్షి మత్స్య రాజునకు ఉపదేశించెను. ఈ షడక్షర మంత్రసహితమైన శంకరుని కవచమును ధరించినచో వారికి అస్త్రములవలనను, శస్త్రములవలనను, నీటియందైనను, అగ్నియందైనను మృత్యువు సంభవింపదు. ఈ శివకవచమును ధరించి, చదువుచున్నందువలన బాణాసురుడు శివత్వమును పొందెను. అట్లే నందీశ్వరుడు శివునితో సమానుడయ్యెను. వీరభద్రుడు వీరులలో శ్రేష్ఠుడయ్యెను. హిరణ్యకశిపుడు ముల్లోకముల జయింపగలిగెను. హిరణ్యాక్షుడు అతడు విశ్వపూజితుడయ్యెను. అదేవిధముగా జైగీషవ్యుడను ముని, వామదేవుడు, దేవలుడు, పననుడు, అగస్త్యుడు వీరందరు లోకమాన్యులైరని పలికెను. ఓం నమఃశివాయేతి మస్తకం మే సదాzవతు | ఓం నమః శివాయేతి చ స్వాహా ఫాలం సదావతు || 121 ఓం హ్రీం శ్రీం క్లీం శివాయేతి స్వాహానేత్రే సదాzవతు | ఓం హ్రీం హూం శివాయేతి నమో మే పాతునాసికాం || 122 ఓం నమః శివాయ శాంతాయ స్వాహా కంఠం సదాzవతు | ఓం హ్రీం శ్రీం హూం సంహార కర్త్రే స్వాహా కర్ణౌ సదావతు || 123 ఓం హ్రీం శ్రీం పంచవక్త్రాయ స్వాహా దంతం సదాzవతు | ఓం హ్రీం మహేశాయ స్వాహా చాధరం పాతుమే సదా || 124 ఓం హ్రీం శ్రీం క్లీం త్రినేత్రాయ స్వాహా కేశాన్ సదాzవతు | ఓం హ్రీం ఐం మహాదేవాయ స్వాహా వక్షః సదాzవతు || 125 ఓం హ్రీం శ్రీం క్లీం మైం రుద్రాయ స్వాహా నాభిం సదాzవతు | ఓం హ్రీం మైం శ్రీమీశ్వరాయస్వాహా పృష్ఠం సదాzవతు || 126 ఓం హ్రీం క్లీం మృత్యుంజయాయ స్వాహా భ్రువౌ బాహూసదాzవతు | ఓం హ్రీం శ్రీం హ్రీమీశానాయ స్వాహా పార్శ్వం సదాzవతు || 127 ఓం హ్రీం మీశ్వరాయ స్వాహా చోదరం పాతు మేసదా | ఓం శ్రీం హ్రీం మృత్యుంజయాయ స్వాహా బాహూసదాzవతు || 128 ఓం హ్రీం శ్రీం క్లీమీశ్వరాయ స్వాహా పాతు కరౌ మమ | ఓం మహేశ్వరాయ రుద్రాయ నితంబం పాతుమే సదా || 129 ఓం హ్రీం శ్రీం భూతనాథాయ స్వాహా పాదౌ సదాzవతు | ఓం సర్వేశ్వరాయ శర్వాయ స్వాహా పాదౌ సదాzవతు || 130 ప్రాచ్యాం మాం పాతు భూతేశ ఆగ్నేయ్యాం పాతు శంకరః | దక్షిణ పాతు మాం రుద్రో నైఋత్యాం స్థాణురేవచ || 131 పశ్చిమే ఖండ పరుశుర్వాయవ్యాం చంద్రశేఖరః | ఉత్తరే గిరిశః పాతు చైశాన్యామీశ్వరః స్వయం || 132 ఊర్ధ్యేమృడః సదా పాతు చాధో మృత్యుంజయః స్వయం | జలే స్థలే చాంతరిక్షే స్వప్నే జాగరణ సదా || 133 పినాకీ పాతు మాం ప్రీత్యా భక్తం స వై భక్తవత్సలః | ఇతి తే కథితం వత్స కవచం పరమాద్భుతం || 134 ఓం నమః శివాయ అను మంత్రము నా శిరస్సును రక్షించుగాక! ఓం నమః శివాయ స్వాహా అను మంత్రము నానొసటిని రక్షించుగాక! ఓం హ్రీం శ్రీం క్లీం శివాయ స్వాహా అను మంత్రము నాకండ్లను రక్షించుగాక! ఓం హ్రీం శ్రీం హూం శివాయనమః అనుమంత్రము నా నాసికను రక్షించుగాక! ఓం నమః శివాయ శాంతాయ స్వాహా అను మంత్రము నా కంఠమును రక్షించుగాక! ఓం హ్రీం శ్రీం హూం సంహార కర్త్రే స్వాహా అను మంత్రము నా చెవులను రక్షించుగాక! ఓం హ్రీం శ్రీం పంచవక్త్రోయ స్వాహా అను మంత్రము నాదంతములను రక్షించుగాక! ఓం హ్రీం మహేశాయ స్వాహా అను మంత్రము నాపెదవులను రక్షించుగాక! ఓం హ్రీం శ్రీం క్లీం త్రినేత్రాయ స్వాహా అను మంత్రము నా వెంట్రుకలను రక్షించుగాక! ఓం హ్రీం ఐం మహాదేవాయస్వాహా అను మంత్రము నావక్షస్థలమును రక్షించుగాక! ఓం హ్రీం శ్రీం క్లీం మైం రుద్రాయస్వాహా అను మంత్రము నాబొడ్డును రక్షించుగాక! ఓం హ్రీం మైం శ్రీమీశ్వరాయ స్వాహా అను మంత్రము నాపృష్ఠభాగమును రక్షించుగాక! ఓం హ్రీం క్లీం మృత్యుంజయాయ స్వాహా అనునది నాకనుబొమ్మలను, బాహువుల రక్షించుగాక! ఓం హ్రీం శ్రీం హ్రీమీశానాయ స్వాహా అను మంత్రము నా పార్శ్వభాగముల రక్షించుగాక! ఓం హ్రీంమీశ్వరాయ స్వాహా అను మంత్రము నా ఉదర భాగమును రక్షించుగాక! ఓం శ్రీం హ్రీం మృత్యుంజయాయ స్వాహా అనుమంత్రము నా బాహువుల రక్షించుగాక! ఓం హ్రీం శ్రీం క్లీమీశ్వరాయ స్వాహా అనుమంత్రము నాచేతులను రక్షించుగాక! ఓం మహేశ్వరాయ రుద్రాయ అనుమంత్రము నానితంబ భాగమును రక్షించుగాక! ఓం హ్రీం శ్రీం భూతనాథయ స్వాహా అనుమంత్రము నా పాదముల రక్షించుగాక! ఓం సర్వేశ్వరాయ శర్వాయ స్వాహా అను మంత్రము నా పాదముల రక్షించుగాక! భూతేశుడు నాప్రాగ్భాగమును, శంకరుడు నా ఆగ్నేయ దిగ్భాగమును, రుద్రుడు దక్షిణ దిగ్భాగమును, నైఋతి దిగ్భాగమును స్థాణువు, ఖండ పరశువు పశ్చిమ దిగ్భాగమును, చంద్రశేఖరుడు వాయవ్యదిగ్భాగమును, గిరీశుడు ఉత్తరదిగ్భాగమును, ఈశ్వరుడు ఈశాన్య దిగ్భాగమును, మృడుడు ఊర్ద్వభాగమును, మృత్యుంజయుడు అధోభాగమును, భక్తవత్సలుడగు పినాకి జలమున, భూభాగమున, ఆకాశమున, స్వప్నావస్థయందు, జాగ్రదవస్థయందు భక్తుడనగు నన్ను ప్రేమతో ఎల్లప్పుడు రక్షించుగాక! నారదా! ఈవిధముగా పరమాద్భుతమైన శివకవచమును నీకు వివరించితినని నారాయణముని పలికెను. దశలక్షజపేనైవ సిద్ధిర్భవతి నిశ్చితం | యది స్యాత్సిద్ధ కవచో రుద్రతుల్యో భ##వేద్ధ్రువం || 135 తవ స్నేహాన్మయాzఖ్యాతం ప్రవక్తవ్యం న కస్యచిత్ | కవచం కాణ్వ శాఖోక్తమతి గోప్యం సుదుర్లభం || 136 అశ్వమేధ సహస్రాణి రాజసూయ శతాని చ | సర్వాణి కవచస్యాzస్య కళాం నార్హంతి షోడశీం || 137 కవచస్య ప్రసాదేన జీవన్ముక్తో భ##వేన్నరః | సర్వజ్ఞః సర్వసిద్ధీశో మనోయాయీ భ##వేత్ ధ్రువం || 138 ఇదం కవచమజ్ఞాత్వా భ##జేద్యః శంకర ప్రభుం | శతలక్ష ప్రజప్తోzపి న మంత్రః సిద్ధినాయకః || 139 ఈ శివకవచమును పదిలక్షల మార్లు జపించినచో అది సిద్ధియగును. కవచము సిద్ధించిన వాడు రుద్రునితో సమానుడగును. ఈ కవచమును నీపై గల ప్రేమచే నీకు తెలిపితిని. దీనిని అర్హతలేనివారికి ఉపదేశింపకూడదు. ఈకవచము శుక్లయజుర్వేదమునకు సంబంధించిన కాణ్వశాఖయందు చెప్పబడినది. ఇది మిక్కిలి రహస్యమైనది. దుర్లభ##మైనది. కూడ. వేలకొలది అశ్వమేధయాగములు, వందలకొలది రాజసూయయాగములన్నియు ఈకవచము యొక్క గొప్పతనమున పదునారవ వంతైనను కాజాలవు. ఈకవచముయొక్క అనుగ్రహము వలన దానిని పఠించినవాడు జీవన్ముక్తుడగును. అట్లే అతడు సర్వజ్ఞుడై సమస్త సిద్ధులను బడసి మనోవేగముచే పోవు శక్తిని పొందును. ఈ కవచమును వదలి శంకరుని కోట్లకొలది శివమంత్రములచే జపించినను అతనికి మంత్రసిద్ధి కలుగదని నారాయణనుని నారదునితో ననెను. ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ తృతీయే గణపతిఖండే నారద నారాయణ సంవాదే శంకర కవచ ప్రకథనం నామ పంచత్రింశోzధ్యాయః || శ్రీ బ్రహ్మవైవర్తమహాపురాణమున మూడవదగు గణపతి ఖండమున నారద నారాయణుల సంవాద సమయమున చెప్పబడిన శంకర కవచమను ముప్పది యైదవ అధ్యాయము సమాప్తము.