sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
ఏకచత్వారింశత్తమోzధ్యాయః - కైలాస వర్ణనము నారాయణ ఉవాచ- నారాయణ ముని ఇట్లు పలికెను- హరేశ్చ కవచం ధృత్వా కృత్వా నిఃక్షత్రియాం మహీం | రామో జగామ కైలాసం నమస్కర్తుం శివం గురుం ||
1 గురుపత్నీం శివామంబాం ద్రష్టుం గురుసుతౌ చ తౌ | గుణౖర్నారాయణ సమౌ కార్తికేయ గణశ్వరౌ ||
2 మనోయాయీ మహాత్మా స భృగుః సంప్రాప్య తత్ క్షణం | దదర్శ పర్వతం రమ్యమతీవ సుమనోహరం ||
3 శుద్ధ స్ఫటిక సంకాశైర్మణిభిః సుమనోహరైః | సువర్ణ భూమి సదృశై రాజమార్గైర్విరాజితం || 4 సిందూరారుణ వర్ణైశ్చ వేష్టితం మణివేదిభిః | సంయుక్తం ముక్తా నికరైః పూరితం మణిమండపైః || 5 యక్షాణామాలయైర్దివ్యైః సంయుక్తం శతకోటిభిః | కపాట స్తంభ సోపానైః శోభితైర్మణినిర్మితైః || 6 యక్షానామాలయైర్దివ్యైః సంయుక్తం శతకోటిభిః | కపాటస్తంభ సోపానైః శోభితైర్మణి నిర్మితైః || 7 రత్న భూషణ భూషాడ్యైర్దీపితైః సుందరీ గుణౖః | బాలికాభిర్బాలకైశ్చ చిత్ర పుత్తలికా కరైః || 8 క్రీడద్భిః సస్మితైః శశ్వత్ స్వచ్ఛందం చ విరాజితైః | పారిజాత ద్రుమగణౖః స్వర్ణదీ తీర నీరజైః || 9 అకీర్ణం పుష్పజాలైశ్చ పుష్పితైశ్చ సుగందిభిః | కల్పవృక్షా శ్రితైః సిద్దై కామ ధేను పురస్కృతైః || 10 సిద్ద విద్యాసు నిపుణౖ పుణ్యవద్భిర్నిషేవతం | త్రిలక్ష యోజనోచ్ఛ్రాయైర్వట వృక్షైరథాక్షయైః || 11 శతయోజన విస్తీర్ణైః శతస్కంధ సమన్వితైః | అసంఖ్య శాఖానికరైరసంఖ్య ఫలసంయుతైః || 12 నానాపక్షిగణాకీర్ణైః సుమనోహర శబ్దితైః | కంపితం శీతవాతే మండితం చ సుగంధినా || 13 పుష్పోద్యాన సహస్రేణ సరసాం చ శ##తేన చ | సిద్ధేంద్రాలయలక్షైశ్చ మణిరత్న వికారజైః || 14 భార్గవ రాముడు శ్రీకృష్ణకవచమును ధరించి తత్ర్పభావమువలన భూమియందున్న క్షత్రియులందరను హతమార్చి తన గురువైన పరమశివునకు నమస్కరించుటకై కైలాసపర్వతమునకు పోయెను. అచ్చట ఉన్న గురుపత్నియగు పార్వతీదేవిని, తమ సుగుణములతో శ్రీహరిని పోలిన గురు పుత్రుడైన కుమారస్వామి మరియు గణాధిపతిని సందర్శించుకొనవలెనని మనోవేగముతో పోయి కైలాసపర్వతమును చూచెను. ఆపర్వతము చాలా అందమైనది. శుద్ధమైన స్ఫటికములవంటి మణులతో, బంగారు భూముల వంటి రాజ మార్గములతో నున్నది. అచ్చటి మణి మండపముల వేదికలు కాషాయము, ఎఱుపువర్ణములతో నుండెను. ఆ మణి మండపములకు ముత్యముల హారములున్నవి. అచ్చట దివ్యమైన యక్షుల నివాసములు కోట్ల కొలది కలవు. అచ్చటి సౌదములయొక్క ద్వారములు, స్తంభములు, మెట్లు అన్నియు మణులతో నున్నవి. ఆ సౌధవిమానముల పైన బంగారు కలశములన్నవి. అచ్చటి యక్షులు, యక్షాధిపతులు అందరు రత్నములు బంగారము కల ఆభరణములను ధరించి తెల్లని చామరములతో శివునకు సేవ చేయుచుందురు. అచ్చటి స్త్రీలు చాలా అందమైనవారు. వారుకూడ రత్నాంలంకారములను ధరించి యుందురు. అచ్చటి బాలురు, బాలికలు చిత్రములను, బొమ్మలను చూచుచు నవ్వుచు ఆడుకొనెదరు. అచ్చట పారిజాత వృక్షములు, ఆకాశగంగా నదీ తీరమున నున్న పద్మములు, సువాసన గల ఇతర పుష్పములు కూడ కలవు. అచ్చటనున్న సిద్ధులు కామధేనువు నాశ్రయించుకొని కల్పవృక్షముల యొక్క నీడలో నిసింతురు. వారు అణిమ మొదలగు సిద్ధవిద్యలందు నిపుణులు. అచ్చటి వటవృక్షములు చాల ఎత్తైనవి, విశాలమైనవి కూడ. వాటికి అనేక వందల కొమ్మలున్నవి. ఆ వృక్షములందున్న పక్షులు ఇంపుగా శబ్దము చేయుచుండును. చక్కని వాసన, చల్లని గాలిగల అనేక పుష్పోద్యానములు సరస్సులు అచ్చట నున్నవి. అచ్చట సిద్దేంద్రుల సౌధములన్నియు మణులచే రత్నములచే నిండియున్నవి. రామశ్చ దృష్ట్యా నగరమతిసంహృష్ణ మానసః | దదర్శ పురతో రమ్యం శ్రీయుక్తం శంకరాలయం || 15 సువర్ణమూల్య శతకైర్మణిభిః స్వర్ణవర్ణకైః | ఖచితం రత్నసారైశ్చ రచితం విశ్వకర్మణా || 16 త్రిపంచ యోజనోచ్ఛ్రాయం చతుర్యోజన విస్తృతం | చతురస్రం చతుష్కోణం ప్రాకారం సుమనోహరం || 17 ద్వారం రత్న కపాటేన నానాచిత్రాన్వితేన చ | మణీంద్ర వేదిభిర్యుక్తం మణిస్తంభ విరాజితైః || 18 తద్దక్షిణ వృషేంద్రం చ వామే సింహం చ నారద | నందీశ్వరం మహాకాళం పిగళాక్షం భయంకరం || 19 విశాలాక్షం చ బాణం చ విరూపాక్షం మహాబలం | వికటాక్షం భాస్కరాక్షం రక్తాక్షం వికటోదరం || 20 సంహారభైరవం కాలభైరవం చ భయంకరం | రురు భైరవ మీశాభం మహాభైరవ మేవచ || 21 కృష్ణాంగ భైరవం చైవ క్రోధభైరవముల్బణం | కపాల భైరవం చైవ రుద్ర భైరవమేవ చ || 22 సిద్ధేంద్రాదీన్రుద్ర గణాన్విద్యాధర సుగుహ్యాకన్ | భూతాన్ ప్రేతాన్ పిశాచాంశ్చ కుష్మాండాన్బ్రహ్మరక్షసాన్ || 23 వేతాళాన్దానవాంశ్చైవ యోగీంద్రాంశ్చ జటా ధరాన్ | యక్షాన్ కిం పురుషాం శ్చైవ కిన్నరాంశ్చ దదర్శ హ || 24 పరశురాముడు కైలాసనగరమును చూచి సంతోషముతో గొప్ప శోభతో నున్న శంకరుని సౌధమును చూచెను. ఆసౌధమును విశ్వకర్మ బంగారము, మణులు, రత్నములతో నిర్మించెను. ఆ భవనము యొక్క ప్రాకారము మూడు లేక ఐదు యోజనముల ఎత్తుతో, నాలుగు యోజనముల వైశాల్యముతో చతురస్రముగా, నాలుగు కోణములతో అందముగా కనిపించును. ఆసౌధముయొక్క ద్వారము అనేక చిత్రములు గల రత్నముల తలుపులతో నున్నది. అచ్చట వేదికలు స్తంభములన్నియు మణులతో నున్నవి. ఆసౌధమునకు కుడిభాగమున వృషభేంద్రుడు, ఎడమవైపు సింహము, ఇంకను నందీశ్వరుడు, మహాకాళుడు, పింగళాక్షుడు, విశాలాక్షుడు బాణుడు, విరూపాక్షుడు, వికటాక్షుడు, భాస్కరాక్షుడు, రక్తాక్షుడు, వికటోదరుడు, సంహార భైరవుడు, కాలభైరవుడు, రురుభైరవుడు, మహాభైరవుడు, కృష్ణాంగభైరవుడు, క్రోధభైరవుడు, కపాలభైరవుడు, రుద్రభైరవుడు ఇంకను, సిద్ధేంద్రులు, రుద్రగణములు, విద్యాధరులు, యక్షులు, భుతములు, ప్రేతములు, పిశాచములు, కూష్మాండులు, బ్రహ్మరాక్షసులు, భేతాళులు, దానవులు, జజలను ధరించియున్న యోగీంద్రులు, యక్షులు, కింనరులు, కింపురుషులు మొదలగు వారి నందరను అతడు దర్శించుకొనెను. తాన్ దృష్ట్వా నందికేశాజ్ఞాం గృహీత్వా భృగునందనః | తాన్ సంభాష్యాభ్యంతరం చ జగామానంద సంప్లుతః || 25 రత్నేంద్రసారఖచితం దదర్శ శతమందిరం | అమూల్య రత్న కలశైర్జ్వలద్భిశ్ఛ విరాజితం || 26 అమూల్య రత్న రచితైర్ముక్తానిర్మల దర్పణౖః | హీరసారవికారైశ్చ కపాటైశ్చ విరాజితం || 27 గోరోచనాభిర్మణిభిర్యుతం స్తంభసహస్రకైః | మణిసార వికారైశ్చ సోపానైః పరిశోభితం || 28 దదర్శాభ్యంతరం ద్వారం నానాచిత్ర విరాజితం | మాణిక్య ముక్తాగ్రథితైర్మాలాజాలైర్విరాజితం || 29 భార్గవరాముడు నందీశ్వరుడు మొదలైన వారినందరను చూచి వారినందరను పలుకరించి నందీశ్వరుని ఆజ్ఞను గైకొని సంతోషముతో శివుని సౌధములోనికి ప్రవేశించెను. ఆ మందిరమున నూరు గదులున్నవి. అవి యన్నియు రత్నములతో నిండియున్నవి. ఆ గదులయొక్క విమానములందు రత్న కలశములున్నవి. అట్లే ఆగదుల యొక్క కవాటములన్నియు అమూల్యములైన రత్నములతో మణులతో, అద్దములతో ప్రకాశించుచున్నవి. అచ్చటి స్తంభములన్నియు మణులతో నిర్మింపబడివవి. మెట్లన్నియు మణిమయములే. అనేక చిత్రములతో, మాణిక్యములు ముత్యాలు కల మాలలతో నిండియున్న శంకరుని అభ్యంతరమందిర ద్వారమును పరశు రాముడు చూచెను. దదర్శ కార్తికేయం చ వామే దక్షే గణశ్వరం | వీరభద్రం మహాకాయం శివతుల్య పరాక్రమం || 30 ప్రధాన పార్షదగణాన్ క్షేత్రపాలాం శ్చ నారద | రత్న సింహాసనస్థాంశ్చ రత్న భూషణ భూషితాన్ || 31 తాన్సంభాష్య భృగుః శ్రీఘ్రం మహాబల పరాక్రమః | పర్శుహస్తస్స పరశురామో గంతుం సముద్యతః || 32 శంకరుని అభ్యంతర మందిరమున ఎడమప్రక్క కార్తికేయుని, కుడివైపు గణపతిని, ఇంకను శివునితో సమానమైన పరాక్రమముగల వీరభద్రుని చూచెను. అట్లే రత్న సింహాసనములపై రత్నాలంకార శోభితులైన శంకరుని ప్రధానానుచరులను, క్షేత్రపాలురను కూడా భార్గవరాముడు చూచెను. అతడు గణపతి మొదలగు వారినందరను పలుకరించి అభ్యంతరమందిరములోనికి పోబోయెను. గచ్ఛంతం తం గణశశ్చ క్షణం తిష్ఠేత్యువాచ హ | నిద్రితో నిద్రయాయుక్తో మహాదేవోz ధునేతి చ || 33 ఈశ్వరాజ్ఞాం గృహీత్వాzహ మత్రాగత్య క్షణాంతరే | త్వయా సార్థం గమిష్యామి భ్రాతస్తిష్ఠాత్ర సాంప్రతం || 34 గణశవాక్యం పరశురామశ్ర్శుత్వా మహాబలః | బృహస్పతి సమో వక్తా ప్రవక్తు ముపచక్రమే || 35 భార్గవరాముడు పరమశివుని అభ్యంతరమందిరములోనికి పోవుచుండగా గణపతి అతనిని ఆపి ఇట్లనెను. భార్గవరామా! మహాదేవుడు ఇప్పుడు నిద్రలోనున్నాడు. నేను లోనికి వెళ్ళి ఈశ్వరునియొక్క ఆజ్ఞను తీసికొని వత్తును. అప్పుడు ఇద్దరము కలసి లోనికి వెళ్లుదుము. అంత వరకు ఇక్కడనే ఉండమని కోరెను. గణపతి యొక్క మాటలు విని మహాబలుడు మాటలలో బృహస్పతివంటి వాడగు పరశురాముడు ఇట్లు మాట్లాడసాగెను. అని నారాయణుడు నారదునితో చెప్పెను. ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణ తృతీయే గణపతి ఖండే నారద నారాయణ సంవాదే కైలాస వర్ణనం నామ ఏక చత్వారింశత్తమోzధ్యాయః || శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణములో మూడవదగు గణపతి ఖండనము నారద నారాయణ మునుల సంవాద సమయమున తెల్పబడిన కైలాస వర్ణనమను నలుబడి యొకటవ అధ్యాయము సమాప్తము.