sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
ద్విచత్వారింశత్తమోzధ్యాయః - గణశ పరశురామ సంవాదము పరశురామ ఉవాచ- పరశురాముడు గణపతితో ఇట్లు పలుకసాగెను- యాస్యామ్యంతఃపురం భ్రాతః ప్రణామం కర్తుమీశ్వరం | ప్రణమ్య మాతరం భక్త్యా యాస్యామి త్వరితం గృహం ||
1 త్రిస్సప్తకృత్వో నిర్భూపాం కృత్వా పృథ్వీం చ లీలయా | కార్తవీర్యస్సుచంద్రశ్చ హతో యస్యప్రసాదతః ||
2 నానావిద్యా యతో లబ్దా నానాశాస్త్రం సుదుర్లభం | తం గురుం జగతాం నాథం ద్రష్టుమిచ్ఛామి సాంప్రతం ||
3 సగుణం నిర్గుణం చైవ భక్తానుగ్రహ విగ్రహం | సత్యం సత్యస్వరూపం చ బ్రహ్మజ్యోతిః సనాతనం ||
4 స్వేచ్ఛామయం దయాసింధుం దీనబంధు మునీశ్వరం | ఆత్మారామం పూర్ణకామం వ్యక్తావ్యక్తం పరాత్పరం ||
5 పరాపరాణాంస్రష్టారం పురుహూతం పురస్కృతం | పురాణం పరమాత్మనమీశానం త్వాదిమవ్యయం ||
6 సర్వమంగళమాంగళ్యం సర్వమంగళకారణం | సర్వమంగళదం శాంతం సర్వైశ్వర్యప్రదం వరం ||
7 ఆశుతోషం ప్రసన్నాస్యం శరణాగతవత్సలం | భక్తాభయప్రదం భక్తవత్సలం సమదర్శనం ||
8 ఓ సోదరా!ఈశ్వరునకు, తల్లియగు పార్వతీదేవికి నమస్కరించుటకై శంకరుని అంతఃపురమునకు వెళ్ళుచున్నాను. ఆ పరమేశ్వరుని అనుగ్రహమువలన ఈభూమిపైనున్న క్షత్రియులనందరను ఇరువదియొక్క మార్లు తిరిగి సంహరించితిని. అట్లే కార్తవీర్యార్జునుని, సుచంద్రుని సంహిరించితిని. ఆ దేవదేవుని అనుగ్రహమువలన అనేకవిధములైన విద్యలు, అనేక శాస్త్రములను నేర్చుకొంటిని. జగన్నాథుడగు నాగురువును చూడవలెనని పోవుచున్నాను. అతడు సగుణస్వరూపుడు, నిర్గుణస్వరూపుడు, భక్తులను అనుగ్రహించుటకై మూర్తిని ధరించినవాడు. సత్యస్వరూపుడు, పరబ్రహ్మరూపుడు, జ్యోతిస్వరూపుడు, సనాతనుడు, స్వేచ్ఛామయుడు, కరుణాసముద్రుడు, దీనబంధుడు, ఆత్మారాముడు, పూర్ణకాముడు, వ్యక్తావ్యక్తుడు, పరాత్పరుడు, పురాణరూపుడు, పరమాత్మడు, ఈశ్వరుడు, ఆద్యంతరహితుడు, అవ్యయుడు, సమస్తమంగళములకు కారణభూతుడు, సమస్తశుభములను కలిగించువాడు, సమసై#్తశ్వర్యములనిచ్చువాడు, అల్పసంతోషి, శరణుకోరినవారిపై దయగలవాడు, భక్తులకు అభయమునిచ్చువాడు, భక్తులపై దయకలవాడు, అట్టి నా గురువును చూచుటకు పోవుచున్నానని పరశురాముడు పలికెను. ఇత్థం పరశురామోzస్థాదుక్త్వా గణపతేః పురః | వాచా మధురయా తత్ర సమువాచ గణశ్వరః || 9 క్షణం తిష్ఠ క్షణం తిష్ఠ శ్రుణు భ్రాతరిదం వచః | రహఃస్థలస్థితో నైవ ద్రష్టవ్యః స్ర్రీయుతః పుమాన్ || 10 స్త్రీసంయుక్తం చ పురుషం యః పశ్యతి నరాధమః | కరోతి రసభంగం చ కాలసూత్రం వ్రజేత్ ధ్రువం || 11 తత్ర తిష్ఠతి పాపీయాన్యావచ్చంద్రిదివాకరం | విశేషతశ్చ పితరం గురుం భూతపతిం ద్విజ || 12 రహస్సురత సంసక్తం నహి పశ్యేద్విచక్షణః | కామతః కోపతోవాzపి యః పశ్యేత్సురతోన్ముఖం || 13 స్త్రీవిచ్చేదో భ##వేత్తస్య ధ్రువం సప్తమ జన్మసు | శ్రోణీ వక్షస్థలం వక్త్రం యః పశ్యతి పరస్త్రియః | కామతోzపి విమూఢశ్చ సోzధోభవతి నిశ్చితం || 14 పరశురాముడీవిధముగా గణపతితో పలికి ఊరకుండెను. అప్పుడు గణనాథుడు మధురముగా ఇట్లు మాట్లాడసాగెను. ఓసోదరా! క్షణకాలము ఆగుము. నామాటలను శ్రద్దగా వినుము. రహస్యస్థలమునందు భార్యతోనున్న పురుషుని చూడకూడదు. రహస్యస్థలమునందున్న స్త్రీ పురుషులను చూచి వారి కామకేళికి భంగము కలిగించిన దుష్టుడు కాలసూత్రమను నరకమునకు పోవును. అతడు ఆ నరకమునందు సూర్యచంద్రులున్నంతకాలముండును. ఓ బ్రాహ్మణుడా! విజ్ఞానవంతుడు తండ్రిని, గురువును, రహస్యస్థలమున సురతమునందుండగా చూడకూడదు. ఉద్దేశ్యములేకుండనో, కోపముతోనో సురతమునందున్న పురుషుని చూచినచో అతడు ఏడు జన్మలలోను భార్యావిహీనుడగును. పరస్త్రీయొక్క పిరుదులను, వక్షస్థలమును, ముఖమును చూచిని పురుషుడు తప్పక అధోగతినిపొందును. గణశస్య వచః శ్రుత్వా ప్రహస్య భృగునందనః | తమువాచ మహాకోపాన్నిష్ఠురం వచనం మునే || 15 పై విధముగా గణపతి పలికిన మాటలను విన్న పరశురాముడు అధికకోపముతో నిష్ఠురముగా వెక్కిరించుచు ఇట్లు పలికెను. పరశురామ ఉవాచ- పరశురాముడిట్లు పలికెను- అహోశ్రుతం కింవచనమపూర్వం నీతిసంయుతం | ఇదమేవమహో నైవం శ్రుతమీశ్వర వక్త్రతః || 16 శ్రుతం శ్రుతౌ వాక్యమిదం కామినాం చవికారిణాం | నిర్వికారస్య చ శిశోర్వదోషః కశ్చిదేవ హి | యస్యామ్యంతః పురం భ్రాతస్తవ కిం తిష్ఠ బాలక || 17 యథాదృష్టి కరిష్యామి మత్కార్యం సమయోచితం | తవైవ తాతో మాతాచేత్యేవం నైవనిరూపితం || 18 జగతాం పితరౌ తౌ చపార్వతీపరమేశ్వరౌ | పార్వతీస్త్రీ పుమాన్ శంభురితి కైర్ననిరూపితః || 19 సర్వరూపః శంకరశ్చ సర్వరూపా చ పార్వతీ | గుణాతీతస్య కా క్రీడా తద్భంగో వా కుతోవిభో || 20 క్రీడాలజ్జా భీతిభంగో గ్రామ్యస్యేవ న చేశితుః | స్తనంధయం చ మాం దృష్ట్యాపిత్రోర్లజ్జా కుతో భ##వేత్ || 21 లజ్జాయాశ్చ కుతోలజ్జా లజ్జేశస్య చ సా కుతః | లజ్జా లజ్జాం కిమాప్నోతి తాపం కిం వా హుతాశనః || 22 శీతం శైత్యమహోభ్రాతర్నిదాఘో దాహమేవచ | భీతిర్భీతిమవాప్నోతి మృత్యోర్మృత్యుర్బిభేతి కిం || 23 కుతోజ్వరో జ్వరం హంతి వ్యాధిం వ్యాధి శ్చ జీర్యతి | సంహర్తా నాపిసంహర్తుః కాలః కాలాద్బిభేతి కిం || 24 స్రష్టారం సృజతే స్రష్టా పాతా కిం పాతి తే మతే | క్షుత్ క్షుధం సమవాప్నోతి తృష్ణాం ప్రయాతి కిం || 25 నిద్రానిద్రాంచ శోభాంశ్రీః శాంతిః శాంతిం చ తే మతే | పుష్టిః పుష్టిం కిమాప్నోతి తుష్టిస్తుష్టిం క్షమాక్షమాం || 26 ఓ గణపతీ! నీవు మిక్కిలి గొప్పనైన నీతివాక్యములు పలుకుచున్నావు. ఇట్టి మాటలను నేనెప్పుడు నా గురువగు పరమేశ్వరుని నోట వినలేదు. నీవుచెప్పిన విషయము మోహవికారముగల కాముకులకు సంబంధించినది. మోహవికారము లేని శిశువునకు నీవుచెప్పిన దోషమంటదు. నేను పరమేశ్వరునియొక్క అంతఃపురములోనికి పోవుచున్నాను. బాలకుడవగు నీకు దీనిని గురించి మీమాంస అనవసరము. నేను సమయోచితముగా నాకు తెలిసినట్లు చేయుదును. పార్వతీపరమేశ్వరులు నీకే తల్లిదండ్రులని ఎచ్చట చెప్పలేదు. వారు ప్రపంచమునకంతయు తల్లిదండ్రులు. ఇంకను సర్వరూపుడగు పరమేశ్వరుడు, సర్వరూపిణియగు పార్వతీదేవి స్త్రీపురుషులని ఎచ్చటను నిరూపింపబడలేదు. అందువలన గుణాతీతుడైన ఆ పరమేశ్వరుడు క్రీండించుట, ఆ క్రీడ భంగమగుట అనునవి లేనేలేవు. రతిక్రీడయందు సిగ్గుపడుట, ఆ క్రీడకు భంగమగుట అనునవి సాధారణమానవునకే కాని పరమేశ్వరునకు సంబంధించినవికావు. చంటిపిల్లవాడనగు నన్నుచూచి జగత్పితరులగు పార్వతీపరమేశ్వరులెందుకు సిగ్గుపడెదరు? ఓగణపతి! సిగ్గుకు సిగ్గుఉండునా? అగ్ని తాపమును పొందునా? శీతము శైత్యమును వేసవికాలము దప్పికను, భయము భయమును పొందునా? అట్లే మృత్యువునుండి మృత్యువు భయపడునా?జ్వరము జ్వరమును, వ్యాధి ఆవ్యాధిని పొగొట్టునా?సంహారముచేయువానిని చూచి సంహారకారకుడు, కాలపురుషునిజూచి కాలపురుషుడు భయపడునా? నీ అభిమతముననుసరించి సృష్టికారకుడు సృష్టికారకుని సృష్టించునా? లోకరక్షకుడు తన్ను రక్షించుకొనునా? ఆకలి ఆకలిని, దప్పి దప్పికను, నిద్ర నిద్రను, శోభ శోభను శాంతి శాంతిని, పుష్టి పుష్టిని, తుష్టి తుష్టిని, క్షమ క్షమను పొందునా? కామక్రోధౌ లోభమోహౌ స్వాత్మనైతే న బాధితాః | దయా న బద్దా దయాయా నేచ్చా బద్దేచ్ఛయా ప్రభో || 27 జ్ఞానబుద్ధ్యోః కోవికారో జరాం నోబాధతేజరా | చింతా న చింతయాగ్రస్తా చక్షుశ్చక్షుర్న పశ్యతి || 28 హర్షో ముదం కిమాప్నోతి శోకం శోకో న బాధతే | కా విపత్తిర్విపత్తేశ్చ సంపత్తి సంపదః కుతః || 29 మేధాయ ధారణాశక్తిః స్మృతేర్వాస్మరణం కుతః | న దగ్దః స్వప్తతాపేన వివస్వానితి సమ్మతః || 30 విపరీతమతోభ్రాతస్త్వయైవాచరితోzధునా | న శ్రుతోzయం గురుముఖా న్నదృష్టో న శ్రుతౌశ్రుతః || 31 కామము, క్రోధము, లోభము, మోహము అనునవి ఆత్మచే బాధింపబడవు. దయ దయాబద్ధము కాజాలదు, అట్లే ఇచ్ఛకూడ, చింతచింత్రాగ్రస్తముకాదు. కన్ను తనయొక్క ఇంకొక కన్నును చూడలేదు. హర్షమువలన సంతోషము కలుగునా?శోకమువలన శోకము, ఆపదవలన ఆపద, సంపదవలన సంపద అనునవి ప్రత్యేకముగా ఏర్పడవు. అట్లే బుద్ధికి ధారణశక్తి, స్మతికి స్మరించుగుణము, సూర్యునకు ఇతరులను దహించుగుణము స్వభావసిద్ధములు. కాని నీ ప్రవర్తన స్వభావసిద్ధముగాలేదు. నీవు చెప్పిన విషయమును నాకు గురువు ఎన్నడును చెప్పలేదు. అట్లే ఏ గ్రంథమునను చూడలేదు అని పల్కెను. ఇత్యుక్త్యా చాపి పరశురామశ్శశ్వత్ర్పహస్య సః | శ్రీఘ్రం గంతుం మనశ్చక్రే తద్గృహాభ్యంతరం ముదా || 32 పరశురాముడీవిధముగా నవ్వుచు పలికి శంకరుని అంతఃపురములోనికి తొందరముగా వెళ్ళబోయెను. తచ్చ రామవచః శ్రుత్వా జితక్రోదో గణశ్వరః | శుద్ధసత్వస్వరూపశ్చ ప్రహస్య తమువాచహ || 33 భార్గవరాముని పలుకులను విన్న గణపతి క్రోధములేనివాడు, శుద్దసత్వస్వరూపుడు కావున పరశురామునితో ఇట్లు పలికెను. గణపతి రువాచ- గణపతి ఇట్లు పలికెను- అజ్ఞాన తిమిరాచ్చన్నో జ్ఞానం ప్రాప్నోతి తద్విదః | పితుర్భ్రాతుర్ముఖాత్ జ్ఞానం దుర్లభం భాగ్యవాన్ లభేత్ || 34 శ్రుతం జ్ఞానం విశిష్టం చ జ్ఞానినామపి దుర్లభం | కించిన్మే త్వం మందబుద్ధేః శ్రుణు భ్రాతర్నివేదనం || 35 యోనిర్గుణః సనిర్లిప్తః శక్తిభిర్నహి సంయుతః | సిసృక్షురాశ్రితః శక్త్యా నిర్గుణః సగుణో భ##వేత్ || 36 యావంతి చ శరీరాణి భోగార్హాణి మహామునే | ప్రాకృతాని చ సర్వాణి వినా శ్రీకృష్ణవిగ్రహం || 37 ధ్యాయంతి యోగినస్తం చ శుద్దజ్యోతి స్వరూపిణం | హస్తపాదాది రహితం నిర్గుణం ప్రకృతేః పరం || 38 వైష్ణవాస్తం నమస్యంతి భక్తానుగ్రహకారకం | కుతో బభూవ తజ్ఞ్యోతిరహో తేజస్వినో వినా || 39 జ్యోతిరభ్యంతరే నిత్యం శరీరం శ్యామసుందరం | ద్వభుజం మురళీహస్తం సస్మితం పీతవాససం || 40 అతీవామూల్యసద్రత్నభూషణౖశ్చ విభూషితం | జ్యోతిరభ్యంతరే మూర్తిం పశ్యంతి కృపయా విభోః || 41 ఓపరశురామా! జ్ఞానము కల తండ్రివలన లేక సోదరుని వలన అదృష్టముకల అజ్ఞాని జ్ఞానమును పొందును. నీవు జ్ఞానులకు సహితము లభించని విశిష్టజ్ఞానమును పొందినట్లు విన్నాను. ఐనను తెలివితక్కువగల నాయొక్క విన్నపమును సహితము కొంత వినుమని వేడుకొనెను. నిర్గుణుడగు పరబ్రహ్మ నిర్లిప్తుడుగానుండును. అతనికి శక్తియొక్క తోడ్పాటు అక్కరలేదు. కాని ఆ నిర్గుణపరబ్రహ్మమే జగత్తును సృష్టించుటకై శక్తితో కలసి సగుణుడుగా మారును. భోగములననుభవించు ప్రాణుల శరీరములన్నియు శ్రీకృష్ణుడు లేనిచో సామాన్యమైనవి అగును. అందువలననే యోగులు ఆ శ్రీకృష్ణపరమాత్మను శుద్దజ్యోతిస్వరూపుడుగా , అవయవ రహితుడుగా, ప్రకృతికి అతీతమైన నిర్గుణస్వరూపుడుగా భావింతురు.వైష్ణవులు మాత్రము భక్తులననుగ్రహించు ఆ శ్రీకృష్ణపరమాత్మను సగుణుడుగా భావింతురు. వారు జ్యోతిలోపనున్న మూర్తి శ్యామసుందరమూర్తియని, రెండుభుజములు, హస్తమున మురళి, పట్టువస్త్రములు ధరించి అమూల్యమైన రత్నాభరణములచే అలంకృతుడైనమూర్తిగా భావింతురు. తదా దాస్యే నియుక్తాస్తే భవంత్యేవేశ్వరేచ్ఛయా | యోగస్తపో వా దాస్యస్య కళాం నార్హంతి షోడశీం || 42 యదా సృష్ట్యున్ముఖః కృష్ణః ససృజే ప్రకృతిం ముదా | తద్యోనే హ్యర్పితం వీర్యం వీర్యాడ్డింభో బభూవ హ || 43 దివ్యేన లక్షవర్షేణ గర్భాడ్డింభో వినిర్గతః | తదా బభూవ నిశ్వాసస్తతో వాయుర్బభూవహ || 44 నిశ్వాసేన సమం భ్రాతః ముఖబిందుర్వినిర్గతః | తతో బభూవ సహసా విశ్వాధారో మహావిరాట్ || 46 తజ్జలే చ స్థితో డింభో దివ్యవర్షాణి లక్షకం | తతో బభూవ సహసా విశ్వాధారో మహావిరాట్ || 46 యావంతి గాత్రలోమాని తస్యసంతి మహాత్మనః | బ్రహ్మాండాని చ తావంతి విద్యమానాని నిశ్చతం || 47 తత్రైవ ప్రతివిధ్యండే బ్రహ్మవిష్ణుమహేశ్వరాః | దేవాశ్చ మునయశ్చైవ విద్యమానాశ్చరాచరాః || 48 మహావిరాడాశ్రయశ్చ సర్వస్యచ జనస్య చ | నిశ్వాసవాయుర్భగవాన్ బభూవ శ్రీహరేర్మునే || 49 మహావిష్ణుశ్చ కళయా తతః క్షుద్రవిరాడభూత్ | తన్నాభికమలే బ్రహ్మా శంకరస్తల్లలాటజః || 50 విష్ణుస్తదంశః పాతా యః శ్వేతద్విపనివాసకృత్ | ఏవం తే ప్రతివిధ్యండే బ్రహామవిష్ణుమహేశ్వరాః || 51 ఆ వైష్ణవులు పరమాత్ముని కోరికననుసరించి శ్రీకృష్ణదాస్యముననుష్ఠింతురు. శ్రీకృష్ణదాస్యము చాలాగొప్పది. యోగము,తపస్సు అనునవి దానికి పదునారవవంతైనను కాజాలవు. ఆ శ్రీకృష్ణుడు సృష్టిచేయదలచి తొలుత ప్రకృతిని సృష్టించెను. ఆ పరమాత్మ వీర్యమువలన ప్రకృతి గర్భమును దాల్చెను. ఆమె ఆ గర్భమును దివ్యలక్షవత్సరములు ధరించిన పిదప శిశువు ఉదయించెను. ఆపరమాత్మయొక్క నిశ్వాసమునుండి వాయువేర్పడినది. ఆనిశ్వాసముతోపాటు ఆ పరమాత్మ ముఖమున ఏర్పడిన చెమటచుక్క అతనిముందే సముద్రముగా మారినది. ఆ సముద్రమున ప్రకృతినుండి ఉద్భవించిన శిశువు లక్షదివ్యసంవత్సరములుండినది. ఆశిశువే ప్రపంచమునకు ఆధారభూతుడై మహావిరాట్పురుషుడయ్యెను. ఆ మహావిరాట్పురుషుని రోమరోమమున బ్రహ్మాండములేర్పడినవి, అట్లే ప్రతిబ్రహ్మాండమునను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, దేవతలు, మునులు ఇంకను చరాచరప్రాణిసృష్టియు జరిగినది. పరమాత్మ వదలిన నిశ్వాసవాయువు మహావిరాట్పురుషుని ఆశ్రయించుకొని సమస్తజీవులకు నిశ్వాసవాయువయ్యెను. మహావిరాట్పురుషుని అంసవలన క్షుద్రవిరాట్పురుషుడావిర్భవించెను. మహావిష్ణువుయొక్క నాభికమలమున చతుర్ముఖ బ్రహ్మ, ముఖమున శంకరుడు అతని అంశవలన విష్ణువు ఉద్భవించిరి.. ఈవిధముగా ప్రతిబ్రహ్మాండమునను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులేర్పడిరి. స్వయం చ స్వాంశకళయా నానా మూర్తిధరో హరిః | తదాzభవచ్చ సగుణః సర్వశక్తియుతస్తదా || 52 కథం లజ్జాదిరహితః స చ స్వేచ్ఛామయో మహాన్ | సర్వదా సర్వభోగార్హః సర్వశక్తిసమన్వితః || 53 లజ్జా నాస్త్యేవ లజ్జాయామతోzయం సర్వసమ్మతః | యా చ లజ్జావతీ దేవీ తస్యలజ్జా కుతోగతా || 54 సర్వశక్తిమతీ దుర్గా ప్రకృత్యా సాచ శైలజా | తస్యా లజ్జాదయః సంతి సర్వదా సర్వసమ్మతాః || 55 శ్రీహరి స్వయముగా తనయొక్క అంశలవలన, అంశాంశలవలన అనేకవిధములైన శరీరముల ధరించెను. ఈవిధముగా ఆ పరమాత్మ సగుణుడు, సర్వశక్తియుక్తుడయ్యెను. స్వేచ్ఛారూపుడు సమస్తభోగములకు అర్హుడు, సమస్త శక్తిసమేతుడైన ఆ పరమాత్మ లజ్జాది భోగరహితుడెట్లగును. నీవనినట్లు లజ్జాబుద్ది లజ్జారహితమే. దీనిని అందురు ఆమోదింతురు. కాని సగుణాత్మికయైన ఆ పార్వతీదేవికి లజ్జ ఉండుట సహజమే కదా! స్వభావముతో సర్వశక్తులుగల యాదుర్గాదేవియే పార్వతీదేవి. ఆదేవికి లజ్జాది భావములుండుటలో ఎవరికి వ్యతిరేకతయుండదు. పంచధా ప్రకృతిర్యాచ శ్రీకృష్ణస్య బభూవహ | రాధా పద్మా చ సావిత్రీ దుర్గాదేవీ సరస్వతీ || 56 ప్రాణాధిష్ఠాతృదేవీ యా కృష్ణస్య పరమాత్మనః | ప్రాణాధికా ప్రియా సాచ రాధాzస్తే తస్యవక్షసి || 57 విద్యాధిష్ఠాతృదేవీ యా సావిత్రీ బ్రహ్మణః ప్రియా | లక్ష్మీర్నారాయణసై#్యవ సర్వసంపత్స్వరూపిణీ || 58 సరస్వతీ ద్విధాభూత్వా కృష్ణస్య ముఖనిర్గతా | సావిత్రీబ్రహ్మణః కాంతా స్వయం నారాయణస్యచ || 59 బుద్ద్యధిష్ఠాతృదేవీ యా జ్ఞానసూః శక్తిసంయుతా | సాదుర్గా శూలినః కాంతా తస్యా లజ్జా కుతోగతా || 60 శ్రీకృష్ణుని అంశరూపయైన ప్రకృతీదేవి రాధ, లక్ష్మీ, సావిత్రి, దుర్గాదేవి, సరస్వతి అనుపేర్లతో ఐదువిధములుగా మారినది. వారిలో రాధాదేవి శ్రీకృష్ణపరమాత్మకు ప్రాణములకంటె మిక్కిలిప్రియమైనది. అతని ప్రాణములకు ఆమె అధిష్ఠాన దేవత. ఆ రాధాదేవి ఎల్లప్పుడును శ్రీకృష్ణపరమాత్మవక్షస్థలముననే ఉండును. విద్యకు అధిష్ఠానదేతయగు సావిత్రి బ్రహ్మదేవునుభార్య. సమస్త సంపదలకు రూపమైన లక్ష్మీదేవి నారాయణుని భార్య. శ్రీకృష్ణునిముఖమునుండి ఉద్భవించిన సరస్వతి రెండువిధములైన రూపులను ధరించినది. సరస్వతీదేవి నారాయణునకు భార్యకాగా సావిత్రీదేవి బ్రహ్మదేవుని భార్యయైనది. బుద్దికి అధిష్ఠానదేవతయగు దుర్గాదేవి జ్ఞానమును ప్రసాదించునది. సమస్త శక్తులుగలది. ఆదేవి శంకరునకు భార్యయైనది. అట్టి పార్వతీదేవికి లజ్జ ఎందుకుండదని గణపతి పరశురామునితో పలికెను. ప్రకృతిః పంచధా భ్రాతః గోలోకే చ బభూవ హ | ఇమాః ప్రధానాః కళయా బభూవుర్నైకధా యతః || 61 ఓసోదరా! ఈవిధముగా గోలోకమున ప్రకృతి ఐదువిధములుగా మారినది. పైన పేర్కొన్న స్త్రీలు ప్రకృతియొక్క ప్రధానాంశలు. ఇంకను ఆ ప్రకృతియొక్క అంశాంశలవలన అనేక స్త్రీమూర్తులుద్భవించిరి. విప్రేంద్ర నిత్యం వైకుంఠం బ్రహ్మాండాత్పరముచ్యతే | అవినాశి స్థలం శశ్వల్లయే ప్రాకృతికే ధ్రువం || 62 తత్ర నారాయణోదేవః కృష్ణార్ధాంశశ్చ తుర్భుజః | వనమాలీ పీతవాసా శక్త్యావై పద్మయా సహ || 63 స్వయం కృష్ణశ్చ గోలోకే ద్విభుజః శ్యామసుందరః | సస్మితో మురళీహస్తో రాధావక్షస్థలస్థితః || 64 శశ్వద్గో గోపగోపీభిః సంయుక్తో గోపరూపధృక్ | పరిపూర్ణతమః శ్రీమాన్ నిర్గుణః ప్రకృతేః పరః || 65 స్వేచ్ఛామయః స్వతంత్రస్తుపరమానందరూపధృక్ | భార్గవరామా! బ్రహ్మాండములకు ఊర్ధ్వభాగముననున్నది వైకుంఠలోకము. అది ప్రాకృతిక లయమందును నశింపనిది. అచ్చట శ్రీకృష్ణుని అర్ధాంశమగు నారాయణుడుండును. అతడు నాలుగు భుజములు కలవాడు, వనమాలను ధరించినవాడు లక్ష్మీదేవితోకలిసి పీతవస్త్రములను ధరించియుండును. గోలోకమున ద్విభుజుడగు శ్రీకృష్ణుడుండును. అతడు శ్యామసుందరమూర్తికలవాడు. అతడెల్లప్పుడు మురళీహస్తుడై రాధాదేవియొక్క వక్షఃస్థలముననుండును. అతడు గొల్లవానివేశషమున గోవులు, గోపికలు, గోపాలురు వెంటనుండగా గోలోకముననుండును. ప్రకృతికంటె విశిష్టుడైన ఆ శ్రీకృష్ణపరమాత్మయే సంపూర్ణముగా పరిపూర్ణుడు, స్వేచ్ఛారూపి, స్వతంత్రుడు, పరమానందస్వరూపడు నిర్గుణుడుకూడ. సురాః కళోద్భవా యస్య షోడశాంశో మహావిరాట్ || 66 యతో భవంతి విశ్వాని స్థూలసూక్ష్మాదికానిచ | పునస్తత్ర ప్రలీయంత ఏవమేవ ముహుర్ముహుః || 67 గోలోక ఊర్ధ్వవైకుంఠాత్పంచాశతోటియోజనః | నాస్తిలోకస్తదూర్ధ్యం చ నాస్తి కృష్ణాత్పరః ప్రభుః || 68 దేవతలందరు ఆ శ్రీకృష్ణపరమాత్మయొక్క అంశాంశలవలన పుట్టినవారు. మహావిరాట్పురుషుడు ఆ పరమాత్మయొక్క పదునారవయంశ . ఈ స్థూలసూక్ష్మవిశ్వములన్నియు మహావిరాడ్రూపుని వలననే ఉద్భవించుచున్నవి. అతనియందే ప్రళయకాలమున విలీనమగుచున్నవి. గోలోకము వైకుంఠలోకముకంటె ఏబది యోజనముల ఎత్తుననున్నది. గోలోకముకంటె పైభాగమున ఎట్టిలోకములు లేవు. అట్లే శ్రీకృష్ణుని కంటె గొప్ప దైవము లేదని చెప్పెను. ఇదం శ్రుతం శంభువక్త్రాన్మయా తే కథితం ద్విజ | క్షణం తిష్ఠాzధునాభ్రాతరీశ్వరః సురతోన్ముఖః || 69 భార్గవరామా!దీనినంతయు నేను శంకరునివలననే నేర్చుకొంటిని. శంకరుడు సురతోన్ముఖుడైయున్నందువలన శంకరుని అంతఃపురములోనికి వెళ్ళక క్షణకాలముండుమని కోరెను. ఇతిశ్రీబ్రహ్మవైర్తే మహాపురాణ తృతీయే గణపతిఖండే నారదనారాయణసంవాదే గణశ పరశురామసంవాదోనామ ద్విచత్వారింశత్తమోzధ్యాయః || శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణమున మూడవదగు గణపతిఖండమున నారదనారాయణుల సంవాదసమయమున చెప్పబడిన గణపతి పరశురాముల సంభాషణయను నలుభై రెండవ అధ్యాయము సమాప్తము.