sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
చతుర్దశోzధ్యాయః - మాలతీ విష్ణుమూర్తుల సంవాదము సౌతిరువాచ- సౌతి మహర్షి ఇట్లనెను- తత్ర స్థిత్వా క్షణం దేవా బ్రహ్మేశాన పురోగమాః | యయుర్మాలావతీమూలం పరం మంగళదాయకాః ||
1 మాలావతీ సురాన్ దృష్ట్యా ప్రణనామ పతివ్రతా | రురోద కాంతం సంస్థాప్య దేవానాం సన్నిధౌ మునే || 2 ఏతస్మిన్నంతరే తత్ర కశ్చిద్ర్బాహ్మణబాలకః | ఆజగామ సురాణాం చ సభామతిమనోహరః || 3 దండీ ఛత్రీ శుక్లవాసాః బిభ్రత్తిలకముజ్వలం | దీర్ఘపుస్తకహస్తశ్చ సుప్రశాంతశ్చ సుస్మితః || 4 చందనోక్షితసర్వాంగః ప్రజ్వలన్ బ్రహ్మతేజసా | సురాన్సంభాష్య తత్రైవ విస్మితాన్ విష్ణుమాయయా || 5 తత్రోవాస సభామధ్యే తారామధ్యే యథా శశీ | ఉవాచ దేవాన్ సర్వాంశ్చ మాలతీం చ విచక్షణః || 6 బ్రహ్మ, ఈశ్వరుడు మొదలగు దేవతలు పాలసముద్రము యొక్క తీరములో కొంత సమయముండి మాలావతి ఉన్న ప్రదేశమునకు వెళ్ళిరి. మాలావతి దేవతలను చూచి నమస్కరించి తన భర్త శవమును దేవతల ముందుంచి ఏడ్వసాగెను. ఆ సమయమున అతిమనోహరాకారుడు, చేతిలో దండమును, ఛత్రమును ధరించినవాడు అగు ఒక బ్రాహ్మణ బాలకుడు తెల్లవి వస్త్రములను, ఉజ్వలమైన తిలకమును, చేతిలో తాళపత్రగ్రంథమును ధరించి ప్రశాంతత, చిరునవ్వుతో కూడుకొనిన వాడై ఆ దేవతల సమీపమునకు వచ్చెను. ఆ బ్రాహ్మణ బాలకుడు బ్రహ్మ తేజముతో ప్రకాశించుచు, విష్ణుమాయవలన విస్మయము చెందిన దేవతలనందరను పలుకరించి చుక్కలమధ్య చంద్రుడున్నట్లు ఆ సభామధ్య భాగమున కూర్చుండి దేవతలతో, మాలావతితో ఇట్లనెను. బ్రాహ్మణ ఉవాచ- బ్రాహ్మణుడిట్లనెను - కథ మత్రసురాః సర్వే బ్రహ్మేశాన పురోగమాః | స్వయం విధాతా జగతాం స్రస్టా వై కేన కర్మణా || 7 సర్వబ్రహ్మాండసంహర్తా శంభురత్ర స్వయం విభుః | అహో త్రిజగతాం సాక్షీ ధర్మో వై సర్వ కర్మణాం || 8 కథం రవిః కథం చంద్రః కథ మత్ర హుతాశనః | కథం కాలో మృత్యుకన్యా కథం వాzత్ర యమాదయః || 9 హే మాలావతి తే క్రోడే కోzతిశుష్కశ్శzవో నఘే | జీవితాయాః కథం మూలే యోషితశ్చ పుమాన్ శవః || 10 ఇత్యుక్త్వా తాంశ్చ తాం విప్రో విరరామ సభాస్థలే | మాలావతీ తం ప్రణమ్య సమువాచ విచక్షణం || 11 ఇక్కడ బ్రహ్మ, ఈశ్వరుడు మొదలుగు దేవతలు ఎందుకున్నారు? ప్రపంచములనన్నిటిని సృజించు విధాత, సమస్త బ్రహ్మాండములను సంహరించు శంకరుడు, ముల్లోకములకు సాక్షీ భూతుడైన ధర్మదేవత, సూర్యుడు, చంద్రుడు, అగ్నిదేవుడు, కాలుడు, మృత్యుకన్య, యముడు మొదలగు దేవతలు ఎందుకున్నారు? ఓ మాలావతి! నీఒడిలో మిక్కిలి శుష్కించిన శవమున్నది. ఇది ఎవరిది? బ్రతికియున్న స్త్రీయొక్క ఒడిలో పురుషుని శవమెందుకున్నది? అని ఆ బ్రాహ్మణుడనగా మాలావతి ఆతనికి నమస్కరించి ఇట్లనెను. మాలావత్యువాచ- మాలావతి ఇట్లనెను - ఆనంద పూర్వకం వందే విప్రరూపం జనార్దనం | తుష్టా దేవా హరిస్తుష్టో యస్య పుష్ప జలేన చ || 12 అవధానం కురు విభో శోకార్తాయాః నివేదనే | సమా కృపా సతాం శశ్వత్ యోగ్యాయోగ్యే కృపావతాం || 13 ఉపబర్హణ భార్యzహం కన్యా చిత్రరథస్య చ | సర్వే మాలావతీం కృత్వా వదంతే విప్రపుంగవ || 14 దివ్యం లక్షయుగం రమ్యే స్థానే స్థానే మనోహరే | కృతాః స్వచ్ఛందతః క్రీడాః చానేన స్వామినా సహ || 15 ప్రియే స్నేహో హి సాధ్వీనాం యావాన్విప్రేంద్ర యోపితాం | సర్వశాస్త్రానుసారేణ జానాసి త్వం విచక్షణ || 16 అకస్మాత్ బ్రహ్మణః శాపాత్ ప్రాణాంస్తత్యాజ మత్పతిః | దేవానుద్దిశ్య విలపే యథా జీవతి మత్పతిః || 17 స్వకార్యసాధనే సర్వే వ్యగ్రాశ్చ జగతీతలే | భావాభావం న జానంతి కేవలం స్వార్థతత్పరాః || 18 సుఖం దుఃఖం భయం శోకం సంతాపః కర్మణా నృణాం | ఐశ్వర్యం పరమానందో జన్మ మృత్యుశ్చ మోక్షణం || 19 దేవాశ్చ సర్వజనకాః దాతారః కర్మణాం ఫలం | కర్మవృక్షాణాం మూలచ్ఛేదం చ లీలయా || 20 న హి దేవాత్పరో బంధుః న హి దేవాత్పరో బలీ | దయావాన్నహి దేవాచ్చ న చ దాతా తతః పరః || 21 సర్వాన్ దేవానహం యాచె పతిదానం మమేప్సితం | ధర్మార్థ కామమోక్షాణాం ఫలదాంశ్చ సురద్రుమాన్ || 22 యది దాస్యంతి దేవా మే కాంతదానం యథేప్సితం | భద్రం తదన్యథా తేభ్యో దాస్యామి స్త్రీవధం ధ్రువం || 23 శపిష్యామి చ సర్వాంశ్చ దారుణం దుర్నివారకం | దుర్నివార్యః సతీశాపః తపసా కేన వార్యతే || 24 ఇత్యుక్త్వా మాలతీ సాధ్వీ శోకార్తా సురసంసది | విరరామ ద్విజశ్రేష్ఠస్తామువాచ చ శౌనకః || 25 బ్రాహ్మణ రూపియైన జనార్దనుని సంతోషముగా నమస్కరించుచున్నాను. బ్రాహ్మణుని పూజించినచో శ్రీహరి, దేవలందరు సంతృప్తులైనట్లే భావించవచ్చును. శోకార్తనైన నా మాటలను శ్రద్ధగా ఆలకించుము. దయామూర్తులైన సజ్ఞనులు యోగ్యులపై అయోగ్యులపై సమానమైన కృప కలిగి ఉందురు. నేను చిత్రరథుడను గంధర్వుని కూతురును. నా భర్త ఉపబృంహణుడనే గంధర్వరాజు. నన్ను మాలావతి అని పిలుతురు. నా భర్తతోకలిసి లక్ష దివ్యయుగములు సంతోషముగా క్రీడించితిని. పతివ్రతలైన స్త్రీలు తమ ప్రియునిపై స్నేహముతో నుండుట సర్వశాస్త్రసమ్మతము. అకస్మాత్తుగా బ్రహ్మదేవుడు శాపమిచ్చుటవలన నాభర్త చనిపోయెను. అందువలన నా భర్త తిరిగి బ్రతుకవలెనని దేవతలనుద్దేశించి శోకించుచున్నాను. ఈ ప్రపంచమున ప్రతివాడు తమ పనులు సాధించుకొన జూతురు. స్వార్థపరులు మంచి చెడులను గమనించక ప్రవర్తింతురు. మానవులు చేయు కర్మలవలన సుఖము, దుఃఖము, భయము, శోకము, సంతాపము, ఐశ్వర్యము, పరమానందము, జన్మ మృత్యువు, మోక్షము కలుగుచున్నవి. దేవతలు సమస్త కర్మఫలితములనిచ్చువారు. అట్లే కర్మ వృక్షములను సమూలముగా నాశనము చేయుదురు. అట్టి దేవతల కన్న శ్రేష్ఠుడైన బంధువు, బలవంతుడు, దయకలవాడు, దాత ఎవరు ఈ ప్రపంచమున లేరు. అందువలన నాకిష్టమైన పతి దానము నివ్వుమని దేవతలను యాచించుచున్నాను. వారు ధర్మర్థకామమోక్షములనే ఫలములనిచ్చు వృక్షములు. దేవతలు నేను కోరుకుంటున్న పతి దానము నొసగినచో వారికి మేలు జరుగును. లేనిచో స్త్రీవధ చేసిన వారగుదురు. దేవతలకందరకు దుర్నివారణమైన శాపమునిత్తును. అని మాలతి దుఃఖముచే విహ్వల అయి దేవతలముందు బ్రాహ్మణ కుమారునితో చెప్పగా నాతడు మాలావతితో ఇట్లనెను. బ్రాహ్మణ ఉవాచ- బ్రాహ్మణుడిట్లనెను - కర్మణాం ఫలదాతారో దేవాః సత్యం చ మాలతి | స సద్యః సుచిరేణౖవ ధాన్యం కృషకవన్నృణాం || 26 గృహీ చ కృషకద్వారా క్షేత్రే ధాన్యం వపేత్సతి | తదంకురో భ##వేత్కాలే కాలే వృక్షః ఫలత్యపి || 27 కాలే సుపక్వం భవతి కాలే ప్రాప్నోతి తద్గృహీ | ఏవం సర్వం సమున్నేయం చిరేణ కర్మణః ఫలం || 28 అష్ఠీవపతి సంసారే గృహస్థో విష్ణుమాయయా | కాలే తదంకురో వృక్షః కాలే ప్రాప్నోతి తత్ఫలం || 29 పుణ్యవాన్ పుణ్యభూమౌ చ కరోతి సుచిరం తపః | తేషాం చ ఫలదాతారో దేవాః సత్యం నసంశయః || 30 బ్రాహ్మణానాం ముఖే క్షేత్రే శ్రేష్ఠేz నూషర ఏవచ | యో యజ్జుహోతి భక్త్యాచ స తత్ర్పాప్నోతి నిశ్చితం || 31 నబలం నచ సౌందర్యం నౌశ్వర్యం న ధనం సుతః | నైవ స్త్రీ న చ సత్కాంతః కిం భ##వేత్తపసా వినా || 32 సేవతే ప్రకృతిం యోహి భక్త్యా జన్మని జన్మని | స లభేత్సుందరీం కాంతాం వినీతాం చ గుణాన్వితాం || 33 ఓ మాలతి! మానవులు కర్షకుడి వలన ఏవిధముగా ధాన్యమును పొందుచున్నారో అట్లే దేవతల ద్వారా కర్మ ఫలితములను పొందుచున్నారు. గృహస్థు కర్షకుని ద్వారా తన క్షేత్రములో ధాన్యమును విత్తగా అది అంకురమై, వృక్షమై ఫలములు కలిగి ఆ తరువాత పరిపూర్ణముగా పక్వమైన ఫలములు కలిగి గృహస్థుకు అనుభవయోగ్యమైనట్లు కర్మఫలము కూడ క్రమముగా పరిపక్వమై అనుభయోగ్యమగుచున్నది. గృహస్థు విష్ణుమూర్తి యొక్క మాయచే ఈ ప్రపంచమున ధాన్యపుగింజను విత్తినచో అది కొంత కాలమునకు మొలకెత్తి వృక్షమై ఫలవంతమైనప్పుడు ఆ ఫలమును అనుభవించుచున్నాడు. అట్లే పుణ్యవంతుడు పుణ్యభూమిపై చాలాకాలము తపస్సు చేసినచో దేవతలు తప్పక తత్ఫలమునిత్తురు. బ్రాహ్మణులముఖమందు, చక్కని క్షేత్రమందు ఆదరముతో ఏది వేసిన అది చక్కగా ఫలితమునిచ్చును. తపస్సులేక బలము, సౌందర్యము, ఐశ్వర్యము, ధనము, సుతులు, భార్య భర్త ఎవరు లభించరు. ఎవరు ప్రకృతిని జన్మజన్మలందు భక్తిశ్రద్ధలతో ఆరాధింతురో అతడు వినయవంతురాలు, సుగుణవంతురాలు, సుందరియైన భార్యను పొందును. శ్రియం చ నిశ్చలాం పుత్రం పౌత్రం భూమిం ధనం ప్రజాం | ప్రకృతేశ్చ వరేణౖవ లభేద్భకోzవలీలయా || 34 శివం శివస్వరూపం చ శివపదం శివకారణం | జ్ఞానానందం మహాత్మానం పరం మృత్యుంజయం పరం || 35 తమీశం సేవతే యోహి భక్త్యా జన్మని జన్మని | పుమాన్ ప్రొప్నోతి సత్కాంతాం కామినీ చాపి సత్పతిం || 36 విద్యాం జ్ఞానం సుకవితాం పుత్రం పౌత్రం పరాం శ్రియం | విద్యామైశ్వర్యమానందం వరేణ బ్రహ్మణో నరః || 38 యో నరో భజతే భక్త్యా దీననాథం దినేశ్వరం | విద్యామారోగ్యమానందం ధనం పుత్రం లభేత్ ధ్రువం || 39 గణశ్వరం యో భజతే దేవదేవం సనాతనం | సర్వాగ్రపూజ్యం సర్వేశం భక్త్యా జన్మని జన్మని || 40 విఘ్ననాశో భ##వేత్తస్య స్వప్నే జాగరణzనిశం | పరమానందమైశ్వర్యం పుత్రం పౌత్రం ధనం ప్రజాః | 41 జ్ఞానం విద్యాం సుకవితాం లభ##తే తద్వరేణచ | భజతే యో హి విష్ణుం చ లక్ష్మీకాంతం సురేశ్వరం || 42 వరార్థీ చేల్లభేత్సర్వం నిర్వాణ మన్యథా ధ్రువం | శాంతం నిషేవ్య పాతారం సత్యం సత్యం లభేన్నరః || 43 సర్వం తపః సర్వధర్మం యశః కీర్తిమనుత్తమాం | విష్ణుం నిషేవ్య సర్వేశం యో మూఢో లభ##తే వరం || 44 విడంబితో విధాత్రాzసౌ మోహితో విష్ణుమాయయా | మాయా నారాయణీశానా సర్వప్రకృతీరీశ్వరీ || 45 సా కృపాం కురుతే యం చ విష్ణుమంత్రం దదాతి తం | ధర్మం యో భజతే ధర్మీ సర్వధర్మం లభేత్ ధ్రువం || 46 ఇహలోకే సుఖం భుక్త్వా యాతి విష్ణోః పరం పదం | యో యం దేవం భ##జేద్భక్త్యా స చాదౌ లభ##తే చ తం || 47 కాలే పశ్చాత్తేన సార్థం పరం విష్ణోః పదం లభేత్ | ప్రకృతియొక్క అనుగ్రహమువలన స్థిరమైన సంపదను పుత్రులను, మనుమలను, భూమిని, ధనమును పొందును. శివుడు, మంగళస్వరూపుడు, మంగళములను ఇచ్చువాడు, తత్కారణుడు, జ్ఞానానంద స్వరూపుడు, మహాత్ముడు, మృత్యుంజయుడు అగు ఈశ్వరుని ఎవరు జన్మజన్మలనుండి సేవింతురో వాడు పురుషుడైనచో మంచి భార్యను, స్త్రీయైనచో మంచి భర్తను పొందును. ఇంకను విద్యను, జ్ఞానమును, మంచి కవిత చెప్పగలశక్తిని, పుత్రపౌత్రులను, అంతులేని సంపదను, బలమును, పరాక్రమమును హరుని అనుగ్రహమున పొందును. బ్రహ్మదేవుని సేవించినచో చక్కని సంతానమును, సంపదను, విద్యను, ఐశ్వర్యమును, ఆనందమును అతని అనుగ్రహమున పొందును. సూర్యుని పూజించినచో విద్య, ఆరోగ్యము, ఆనందము, ధనము, పుత్రులు కలుగుదురు. గణశ్వరుని పూజించినచో సర్వాగ్ర్యపూజ, ఎల్లప్పుడు విఘ్నములు లేకుండుట, పరమానందము, ఐశ్వర్యము, పుత్ర పౌత్రాదులు, జ్ఞానము, విద్య, సుకవిత మొదలగునవి లభించును. సురేశ్వరుడు, లక్ష్మీపతి యగు విష్ణుమూర్తిని భక్తితో పూజించినచో కోరిన కోరికలన్ని సిద్ధించును. ఏకోరికను కోరనిచో ముక్తి తప్పక లభించగలదు. శాంత స్వరూపుడు, సర్వ రక్షకుడగు విష్ణుమూర్తిని పూజించి సమస్త ధర్మములను గొప్పనైన కీర్తిని వరముగా పొందినవాడు మూర్ఖుడు. అతడు బ్రహ్మదేవునిచే విష్ణుమాయచే మోహితుడగుచున్నాడు. సర్వప్రకృతిస్వరూపిణి, ఈశ్వరియైన విష్ణుమాయ ఎవరిని అనుగ్రహించునో అతనికి విష్ణుమంత్రమును ఉపదేశించును. ధర్మదేవతను సేవించినవాడు సమస్త ధర్మాచరణవలన కలుగు ఫలితమును, ఇహలోకసుఖమును, అటుపిమ్మట వైకుంఠమును పొందును. ఆయా దేవతలను భక్తితో సేవించి, తొలుత తదనుగ్రహమును పొందును. ఆయా దేవతాసారూప్యమును కూడ పొంది కాలక్రమమున ఆయా దేవతలతో పాటు విష్ణుమూర్తి యొక్క సాన్నిధ్యమును పొందును. శ్రీకృష్ణం భజతే యోహి నిర్గుణం ప్రకృతేః పరం || 48 బ్రహ్మ విష్ణు శివాదీనాం సేవ్యం బీజం పరాత్పరం | అక్షరం పరమం బ్రహ్మ భగవంతం సనాతనం || 49 సాకారం చ నిరాకారం జ్యోతిః స్వేచ్ఛామయం విభుం | సర్వాధారం చ సర్వేశం పరమానందమీశ్వరం || 50 నిర్లిప్తం సాక్షిరూపం చ భక్తానుగ్రహవిగ్రహం | స సత్యం హి న వరం లభ##తే సుధీః || 51 స సర్వం మన్యతే తుచ్ఛం సాలోక్యాది చతుష్టయం | బ్రహ్మత్వమమరత్వం వా మోక్షం యత్తుచ్ఛవత్సతి || 52 ఐశ్వర్యం లోష్టతుల్యం చ నశ్వరం చైవ మన్యతే | ఇంద్రత్వం చ మనుత్వం చ చిరంజీవిత్వమేవ వా || 53 జలబుద్బుదవత్ బుధ్యా చాతితుచ్ఛం న గణ్యతే | స్వప్నే జాగరణవాzపి శశ్వత్సావాం చ వాంఛతి || 54 దాస్యం వినా న యాచేత శ్రీకృష్ణస్య పదం పరం | తత్పదాబ్జే దృఢాం లబ్ధ్వా పూర్ణో నిరంతరం || 55 పరిపూర్ణతమం బ్రహ్మ నిషేవ్యం సుస్థిరః సదా | ఆత్మనః కులకోటిం చ శతం మాతామహస్య చ || 56 శ్వశురస్య శతం పూర్వం ఉద్ధృత్వ చావలీలయా | దాసం దాసీం ప్రసూం భార్యాం పుత్రాదపి పరం శతం || 57 ఉద్ధరేత్ కృష్ణభక్తశ్చ గోలోకం యాతి నిశ్చితం | నిర్గుణస్వరూపుడు, ప్రకృతికి అతీతుడు, బ్రహ్మాదులచే సేవింపబడువాడు, సర్వకారణుడు, పరాత్పరుడు, క్షరుడు కానివాడు (నాశనములేక వ్యష్టి సమష్టి రూపమున నున్న పరాప్రకృతి) పరబ్రహ్మస్వరూపుడు, భగవంతుడు, సనాతనుడు, సాకార నిరాకార స్వరూపుడు, జ్యోతిస్స్వరూపుడు, స్వేచ్ఛామయుడు, అన్నిటికి ఆధారభూతుడు, సర్వేశుడు, పరమానందరూపుడు, ఈశ్వరుడు, నిర్లిప్తుడు, సర్వసాక్షి, భక్తులననుగ్రహించు శ్రీకృష్ణుని సేవించు విద్వాంసుడు ఆ భగవంతునినుండి ఎట్టి వరమును కోరడు. అతడే జీవన్ముక్తుడు. అతడు సాలోక్య సారూప్య సామీప్య, సాయుజ్యములను చతుర్విధముక్తులను తుచ్ఛముగా భావించి ఐశ్వర్యమును మట్టిగడ్డతో సమానముగ అశాశ్వతముగా తలచును. అట్లే ఇంద్రత్వమును, మనుత్వమును, చిరంజీవిత్వమును, నీటిబుడగవలె అతి తుచ్ఛముగా తలంచును. అతడు కలలోనైనా జాగ్రదవస్థలోనూ ఎల్లప్పుడు శ్రీహరి సేవనే కోరుకొనును. శ్రీహరి దాస్యము తప్ప ఇతరమైన దానినెప్పుడు కోరుకొనడు. శ్రీకృష్ణపదాబ్జములయందు దృఢమైన భక్తిని కలిగి పరిపూర్ణమైన పరబ్రహ్మమును సేవించును. అట్టివాడు తన వంశమునందు పుట్టిన కోటిమందిని, మాతామహుని ఇంటికి, మామగారి ఇంటికి చెందిన వందతరములను, తన భార్యా పుత్రులను, ఇంటిలోని దాస దాసీజనమును అందరిని ఉద్ధరించి గోలోకమునకు తప్పక వెళ్ళును. యావద్గర్భే వసేత్కామీ తావతీ యమయాతనా || 58 తావద్గృహీ చ భోగార్థీ యావత్కృష్ణం న సేవతే | గురువక్త్రా ద్విష్ణుమంత్రో యస్యకర్ణే ప్రవిశ్యతి || 59 యమస్తల్లిఖనం దూరం కరోతి తత్క్షణం భియా | మధుపర్కాదికం బ్రహ్మా పురైవ తన్నియోజయేత్ || 60 అహో విలంఘ్య మల్లోకం మార్గేణానేన యాస్యతి | తస్య వై నిష్కృతిర్నాస్తి కల్పకోటిశ##తైరపి || 61 దురితాని చ భీతాని కోటి జన్మ కృతాని చ | తం విహాయ పలాయంతే వైనతేయ మివోరగాః || 62 పురాతనం కృతం కర్మ యద్యత్తస్య శుభాశుభం | ఛినత్తి కృష్ణశ్చక్రేణ తీక్షణ ధారేణ సతతం || 63 తం విహాయ జరామృత్యుర్యాతి చక్రభియా సతి | అన్యథా శతఖండం తాం కురుతే చ సుదర్శనః || 64 నిఃశంకో యాతి గోలోకం విహాయ మానవీం తనుం | గత్వా దివ్యాం తనుం ధృత్వా శ్రీకృష్ణం సేవతే సదా || 65 యావత్ కృష్ణో హి గోలోకే తావద్భక్తో వసేత్సదా | నిమేషం మన్యతే దాసో నశ్వరం బ్రహ్మణో వయః || 66 శ్రీకృష్ణుని భజించనంతవరకు గర్భవాసము, యమయాతనలు, గృహస్థుగా ఉండుట, భోగములనర్థించుట అనునవి ఉండును. ఆచార్యుని ద్వారా విష్ణుమంత్రం ఎవరి చెవిలో పడునో ఆతని నొసటిరాతను భయముతో యముడు దూరము చేయును. బ్రహ్మదేవుడు ముందుగనే అతని గురించి మధుపర్కాదికమును సిద్ధము చేయును. ఇంకను అతడు బ్రహ్మయొక్క కళ్ళముందే గోలోకమునకు వెళ్ళుటను గమనించి ఇతడు నాలోకమును దాటి పోవుచున్నాడని బాధపడును. ఆ శ్రీకృష్ణభక్తునకు నూరుకోట్ల కల్పములకైనా ప్రాయశ్చిత్తముయొక్క అవసరముండదు. కోటి జన్మలలో చేసిన పాపములైనా గరుత్మంతుని చూచిన సర్పములవలె వెంటనే పారిపోగలవు. పూర్వజన్మలలో చేసిన శుభాశుభకర్మలను శ్రీకృష్ణుడు తన చక్రధారలచే చీల్చును. జరామృత్యువులు శ్రీకృష్ణుని చక్రమునకు భయపడిపోవును. లేనిచో సుదర్శన చక్రము వాటిని శతఖండములుగా చేయును. ఆభక్తుడు మానవశరీరమును వదలి దివ్య శరీరమును ధరించి శ్రీకృష్ణుని సేవించుటకు గోలోకమునకు వెళ్ళును. శ్రీకృష్ణుడు ఎంతవరకు గోలొకమున ఉండునో శ్రీకృష్ణభక్తుడు అచ్చట అంతవరకుండును. అతడు బ్రహ్మ దేవుని వయస్సును క్షణికమైనదని తలచును. ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ బ్రహ్మఖండే సౌతి శౌనకసంవాదే విష్ణుమాలావతీ సంవాదో నామ చతుర్దశోzధ్యాయః| శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున సౌతి శౌనక సంవాద రూపమైన బ్రహ్మ ఖండమున విష్ణుమాలావతీ సంవాదమను పదునాలుగవ అధ్యాయము సమాప్తము.