sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
పంచచత్వారింశత్తమోధ్యాయః - పరశురామకృత దుర్గాస్తోత్రం
నారాయణ ఉవాచ- నారాయణమహామని ఇట్లు పలికెను-
పార్వతీం బోదయుత్వా తు విష్ణూ రామమువాచ హ | హితం సారం నీతిసారం పరిణామసుఖావహం || 1
శ్రీ మహావిష్ణువు పార్వతీదేవికి హితవు పలికిన పిదప భార్గవరామునితో నీతిసారమైన హితవాక్యములనిట్లు పలికెను.
విష్ణురువాచ- శ్రీమహావిష్ణువు ఈ విధముగా అనెను-
రామ త్వమధునా సత్యమపరాదీ , శ్రుతేర్మతే | కోపాత్కృత్యా దంతభంగం గణశస్య స్థితో zశివే || 2
స్తోత్రేణౖవ మయోక్తేన స్తుత్వా గణపతిం పరం | కాణ్వశాఖోక్త వలిధినా స్తుహి దుర్గాం జగత్ప్రసూం || 3
శ్రీకృష్ణస్య పరాశక్తిర్బుద్ధిరాపా జగత్ప్రభోః | అస్యాం చ తవ రుష్టాయాం హతా బుద్ధిర్భవిష్యతి || 4
సర్వశక్తి స్వరూపేయమనయా శక్తిమజ్జత్ | అనయా శక్తిమాన్ కృష్ణో నిర్గుణః ప్రకృతేః పరః || 5
సృష్టిం కర్తుం న శక్తశ్చ బ్రహ్మ శక్త్యాzనయా వినా| వయమస్యాం ప్రసూతాశ్చ బ్రహ్మవిష్ణుమహేశ్వరాః || 6
సురసంఘేzసురగ్రస్తే కాలే ఘోరతరే ద్విజ | తేజస్సు సర్వదేవానామావిర్భుతా పురా సతీ || 7
కృష్ణాజ్ఞయాzసురాన్ హత్వా దత్వా తేభ్యః పదం తతః || దక్షపత్న్యాం జనిర్లేభే దక్షస్య తపసా పురా || 8
భార్యా భూత్వా శంకరస్య పునః పత్యుశ్చ నిందయా | దేహం త్వక్త్వా శైలపత్న్యాం జనిం లేభే పురా సతీ || 9
శంకరస్తపసా లబ్ధో యోగీంద్రాణాం గురోర్గురుః | లబ్ధో గణపతిః పుత్రః కృష్ణాంశః కృష్ణసేవయా || 10
యం ద్యాయస్యేవ నిత్యం కిం తం న జానాసి బాలక | స ఏవ భగవాన్కృష్ణశ్చాంశేన గిరిజాసుతః || 11
ఓ భార్గవ రామా! గణపతి యొక్క దంతమును భంగము చేసి నీవు అపరాధము చేసిన వాడవైతివి. అట్లే అమంగళ కార్యమును చేసినట్లైతివి.
శుక్లయజుర్ వేదమునందలి కాణ్వశాఖయందు గణపతి స్తోత్రము, దుర్గాస్తోత్రము కలదు. నేను నీకు వాటిని ఉపదేశింతును. ఆ స్తోత్రములచే గణపతిని, దుర్గాదేవిని స్తోత్రము చేయుము.
ఈ దుర్గాదేవి శ్రీకృష్ణునియొక్క పరాశక్తిరూపిణి. అతనియొక్క బుద్దిరూపిణి. అందువలన ఆ దేవి కోపించినచో నీ బుద్దియంతయు నాశనము కాగలదు. ఈ దేవి సర్వశక్తి స్వరూపిణి. ఈ దేవివలననే శ్రీకృష్ణపరమాత్మ సహితము శక్తిని పొందుచున్నాడు. ఈ దేవి లేకపోయినచో బ్రహ్మదేవుడు లోకసృష్టిని చేయజాలడు. అట్లే త్రిమూర్తులమగు మాకు ఈ దుర్గాదేవి తల్లియగుచున్నది. దేవతలందరు రాక్షసులచే పరాజితులైయున్న సమయమున ఆ దేవతల శక్తులన్నిటిని ఒక చోట కలిపినందువలన ఈ దుర్గాదేవి ఆవిర్భవించినది. ఈమె శ్రీకృష్ణునియొక్క ఆజ్ఞననుసరించి రాక్షసులందరిని సంహరించి దేవతలకు వారివారి పదవులనొసగినది. పూర్వము ఈ దేవి దక్షప్రజాపతి చేసికొన్న తపః ఫలితముగా అతనికి కూతురై జన్మించినది. తరువాత శంకరుని వివాహము చేసికొని తన తండ్రి భర్తను నిందించెనను రోషముతో శరీరత్యాగము చేసినది. అటుపిమ్మట హిమవంతునకు పుత్రికగా జన్మనెత్తి గొప్ప తపస్సు చేసి యోగీంద్రులకు గురువైన శంకరునికి తిరిగి ధర్మపత్నియైనది. ఆమె చేసిన తపస్సునకు ఫలితముగా , శ్రీకృష్ణుని ఆరాధన చేసినందుకు ఫలితముగా శ్రీకృష్ణునియొక్క అంశస్వరూపుడైన గణపతి ఆమెకు పుత్రుడుగా లభించెను.
ఓ భార్గవరామా! నీవు ప్రతిదినము శ్రీకృష్ణుని ధ్యానించుకొనుచున్నావు. కాని శ్రీకృష్ణాంశభూతుడైన గణపతిని గుర్తించకున్నావు. ఈ పార్వతీ తనయుడు అంశరూపముననున్న శ్రీకృష్ణపరమాత్మయే యని బ్రహ్మణ బాలకుడు పరశురామునితో పలికెను.
కృతాంజలిర్నతో భూత్వా స్తుహి దుర్గాం శివప్రియాం | శివాం శివప్రదాం సైవాం శివబీజాం శివేశ్వరీం || 12
శివాయాః స్తోత్రరాజేన పురా శూలికృతేన వై | త్రిపురస్య వదే ఘోరే బ్రహ్మణా ప్రేరితేన చ || 13
ఓ భార్గవ రామా! నీవు చేతులు జోడించుకొని తలవంచుకొని శివుని భార్యయగు దుర్గాదేవిని స్తుతింపుము. ఆ దేవి మంగళరూపిణి, మంగళములననొసగునది, శివునకు చెందినది, మంగళకారిణి, శివునకు ప్రియురాలు, ఈ దుర్గాస్తోత్రము ను పూర్వము త్రిపురాసురుల వధించునపుడు బ్రహ్మదేవుడు ప్రేరేపింపగా శంకరుడు చేసెను అని పలికెను.
ఇత్యుక్త్వా శ్రీపదం జగామ శ్రీనికేతనం | గతే హరౌ హరిం స్మృత్వా రామస్తాం స్తోతుముద్యతః || 14
స్తోత్రేణ విష్ణుదత్తేన సర్వవిఘ్న హరేణ చ | ధర్మార్థకామమోక్షాణాం కారణన చ నారద || 15
కృతాంజలిపుటోభూత్వా స్నాత్వా గంగోధకే శుభే | గురం ప్రణమ్య భ##క్తేశం ధృత్వా ధౌతే చ వాససీ || 16
ఆచమ్య నత్వా మూర్ధ్నా తాం భక్తినమాత్మకంధరః | పులకాంచిత సర్వాంగశ్చానంద్రాశ్రు సమన్వితః || 17
శ్రీమహావిష్ణువు భార్గవరామునితో నిట్లు చెప్పి లక్ష్మీ నిలయమగు తన స్థానమును చేరుకొనును.
శ్రీహరి వైకుంఠమునకు బోయిన తరువాత భార్గవరాముడు తన మనస్సులో శ్రీహరిని స్మరించి దుర్గాదేవిని గణశుని స్తుతింపనారంభించెను.
విష్ణుదత్తమైన యాస్తోత్రములు సమస్త విఘ్నములను హరించునవి. ధర్మార్థకామమోక్షములను కల్గించును.
భార్గవరాముడు గంగానదీ జలములందు స్నానముచేసి గురువునకు, భక్తులననుగ్రహించు శ్రీహరికి నమస్కరించి ఉతికి యారవేసిన బట్టలను ధరించెను. ఆ తరువాత ఆచమనము చేసి భక్తితో నమస్కారము చేసి సమస్తావయములు పులకించగా ఆనందాశ్రువులతో ఇట్లు స్తుతింపనారంభించెను.
పరశురామ ఉవాచ- పరశురాముడిట్లు దుర్గాదేవితో పలికెను-
శ్రీకృష్ణస్య చ గోలోకే పరిపూర్ణతమస్య చ | ఆవిర్భూతా విగ్రహతః పురా సృష్టున్ముఖస్య చ || 18
సూర్యకోటి ప్రభాయుక్తా వస్త్రాలంకార భూషితా | వహ్నిశుద్ధాంశుకాధానా సస్మితా సుమనోహరా || 19
నవ¸°వన సంపన్నా సిందూరారుణ్య శోభితా | లలితం కబరీభారం మాలతీమాల్యమండితం || 20
అహోzనిర్వచనీయా త్వం చారుమూర్తిం చ బిభ్రతీ య మోక్షప్రదాముముక్షూణాం మహావిష్ణోర్విధిః స్వయం || 21
ముమోహ క్షణమాత్రేణ దృష్ట్వా త్వాం సర్వమోహినీం | బాలైస్సంభూయ సహసా సస్మితా ధావితా పురా || 22
సద్భిఃఖ్యాతా తేన రాధా మూలప్రకృతిరీశ్వరీ |
సర్వపూర్ణుడైన శ్రీకృష్ణుడు గోలోకముననుండి సృష్టిచేయదలచినపుడు అతని శరీరమునుండి ఒక స్త్రీ జన్మించినది. ఆ దేవి కోటి సూర్యుల కాంతితో పరిశుద్ధమైన వస్త్రముతో అలంకారములతో ప్రకాశించుచుండెను. ఆమె నవ¸°వనము కలది. ఆమె యొక్క సీమంతమున సిందూరము చక్కగా ప్రకాశించుచున్నది. ఆమె సిగలో మాలతీపుష్పముల మాల శోభిల్లుచుండెను. ఆమె ఆకారము చాల అందముగా నుండెను. ఆ దేవి మోక్షమునభిలషించు భక్తులకు మోక్షమునిచ్చును. ఆమె స్వయముగా మాహావిష్ణువునకు విధియగుచున్నది.
అట్టి సర్వమోహినివగు నిన్ను చూచినంతమాత్రముననే మహావిష్ణువు మోహపరవశుడయ్యెను. ఆ సమయమున నీవు బాలురతో కలసి చిరునవ్వు చిందించుచు అక్కడి నుండి ధావనము చేసితిని (పరిగెత్తితివి). అందువలన మూలప్రకృతి, ఈశ్వరివగు నిన్ను పెద్దలు రాధ అని పిలిచిరి.
కృష్ణస్తాం సహసా భీతో వీర్యాధానం చకార హ || 23
తతో డింభం మహజ్జజ్ఞే తతోజాతో మహావిరాట్ | యసై#్యవ లోమకూపేషు బ్రహ్మండాన్యఖిలాని చ || 24
రాదా రతిక్రమేణౖవ తన్నిశ్వాసో బభూవ హ | స నిశ్వాసో మహావాయుః సవిరాడ్విశ్వధారకః || 25
భయఘర్మజలేనైవ పుప్లువే విశ్వగోళకం | స విరాట్ విశ్వనిలయో జలరాశిర్బభూవ హ || 26
శ్రీకృష్ణుడు భయముతో రాధయందు తన వీర్యమును ఉంచెను. అందువలన మహాడింభము ఉద్భవించగా ఆ మహాడింభమునుండి మహావిరాట్పుషుడుద్భవించెను. ఆ మహావిరాట్పుషునియొక్క రోమకూపములందు ఈ బ్రహ్మాండములన్నియు ఇమిడియున్నవి. శ్రీకృష్ణుడు రాధతో రతిచేయునప్పుడు వెల్వడిన అతని నిశ్వాసము మహావాయువైనది. ఆ మహావాయువే జగత్తునకంతయు ఆధారమైనది. అట్లే అతని చెమట నీటిలో ఈ విశ్వమంతయు మునిగిపోయినది. ఆ నీరే జలరాశిగా మారినది.
తతస్త్వం పంచధాభూయ పంచమూర్తీశ్చ బిభ్రతీ | ప్రాణాధిష్ఠాతృమూర్తిర్యా కృష్ణస్య పరమాత్మనః || 27
కృష్ణప్రాణాధికాం రాధాం వదంతి పురావిదః || 28
వేదాధిష్ఠాతృమూర్తిః శాంతిస్త్వం శాంతి రూపిణీ | లక్ష్మీం వదంతి సతస్త్వాం శుద్ధాం సత్వస్వరూపిణీం || 29
రాగాధిష్ఠాతృదేవీ యా శుక్లమూర్తిస్సతాం ప్రసూః | సరస్వతీం తాం శాస్త్రజ్ఞాం శాస్త్రజ్ఞాః ప్రవదంత్యహో || 30
బుద్ధిర్విద్వా సర్వశ##క్తేర్యా మూర్తేరధిదేవతా| సర్వమంగళమంగళ్యా సర్వమంగళరూపిణీ || 31
సర్వమంగళ బీజస్య శివస్య నిలయేzధునా|| 32
శివే శివా స్వరూపాత్వం లక్ష్మీర్నారాయణాంతికే | సరస్వతీ చ సావిత్రీ వేద సూర్బ్రహ్మణః ప్రియా || 33
రాదా రాసేస్వరసై#్యవ పరిపూర్ణతమస్య చ | పరమానందరూపస్య పరమానందరూపిణీ || 34
త్వత్కళాంశాంశకళయా దేవానామసి యోషితః || 35
నీవు ఐదు విధములగు రూపములను ధరించి ఐదు పేర్లు తో విలసిల్లుచున్నావు. అవి రాధా, సావిత్రి, లక్ష్మీ, సరస్వతి, దుర్గ అనునవి.
వీరిలో శ్రీకృష్ణపరమాత్మకు ప్రాణములకంటె మిన్నయైన ప్రియురాలు , అతని ప్రాణములకు అధిష్ఠాన దేవత రాధ.
వేదములకు అధిష్ఠాన దేవత వేదమాత, శాస్త్రములకు కూడ మాతృస్వరూపిణియగు శుద్ధరూపమును సావిత్రియని పిలుతురు.
ఐశ్వర్యమునకు అధిష్ఠాన దేవత, శాంతిస్వరూపిణియగు శుద్దరూపమును లక్ష్మీయని విద్వాంసులు పిలుతురు.
అనురాగమునకు అధిష్ఠానదేవత, తెల్లని యాకారముగలిగి , విద్వాంసులకు మాతృమూర్తియగు రూపమును సరస్వతియని పిలుచుచున్నారు.
బుద్ధికి, విద్యకు, సమస్త శక్తులకు అధిదేవత, సమస్త మంగళ స్వరూపిణి, సర్వమంగళ మాంగళ్య సమస్త మంగళములకు కారణభూతుడగు శివనియొద్ద ఉన్న నీవు దుర్గగా కీర్తింపబడుచున్నావు.
నీవు శివుని యొద్దనున్నావు. లక్ష్మీదేవి నారాయణుని దగ్గర ఉన్నది. వేదమాతయగు సావిత్రి బ్రహ్మదేవునకు భార్యగా నున్నది.
దేవతా స్త్రీలందరు నీ అంశవలన.అంశాంశలవలన, అంశాంశాంశాలవలన జన్మించినవారే అని దుర్గాదేవిని స్తుతించెను.
త్వం విద్యా యోషితః సర్వా సర్వేషాం బీజరూపిణీ | ఛాయాసూర్యస్య చంద్రస్య రోహిణీ సర్వమోహినీ|| 36
శచీ శక్రస్య కామస్య కామినీ రతిరీశ్వరీ | వరుణానీ జలేశస్య వాయోఃస్త్రీ ప్రాణవల్లభా || 37
వహ్నేః ప్రియా హి స్వాహా చ కుబేరస్య చ సుందరీ యమస్య తు సుశీలా చ నైఋతస్య చ కైటభీ || 38
ఐశానీ స్యచ్ఛశికళా శతరూపా మనోః ప్రియా| దేవహూతిః కర్దమస్య వసిష్ఠస్యాప్యరుంధతీ || 39
లోపాముద్రాzప్యగస్త్యస్య దేవమాతాదిస్తథా | అహల్యా గౌతమాస్యాzపి సర్వాధారా వసుంధరా|| 40
గంగా చ తులసీ చాపి పృథివ్యాం యా సరిద్వరా | ఏతాః సర్వాశ్చ యాహ్యన్యాః సర్వాస్త్వత్కళయాంzబికే || 41
గృహలక్ష్మీర్గృహేనౄణాం రాజలక్ష్మీశ్చ రాజసు| తపస్వినాం తపస్యా త్వం గాయత్రీ బ్రాహ్మణస్య చ || 42
సతాం సత్వస్వరూపా త్వమసతాం కలహాకురా | జ్యోతీరూపా నిర్గుణస్య శక్తిస్త్వం సగుణస్య చ || 43
సూర్యే ప్రభా స్వరూపా త్వం దాహికా చ హుతాశ##నే | జలే శైత్యస్వరూపా చ శోభారూపా నిశాకరే || 44
త్వం భూమౌ గంధరూపా చాప్యాకాశే శబ్దరూపిణీ |క్షుత్పిపాసాదయస్త్వం చ జీవినాం సర్వశక్తయః || 45
సర్వబూజ స్వరూపా త్వం సంసారే సార రూపిణి| స్మృతిర్మేధా చ బుద్ధిర్వా జ్ఞాన శక్తిర్విపశ్చితాం || 46
కృష్ణేన విద్యా యా దత్తా సర్వజ్ఞానప్రసూః శుభా| శూలినే కృపయా సా త్వం యయా మృత్యుంజయః శివః || 47
సృష్టిపాలన సంహారశక్తయస్త్రివిధాశ్చ యాః | బ్రహ్మవిష్ణుమహేశానాం సా త్వమేవ నమోస్తుతే || 48
ఓ దుర్గాదేవీ !నీవే విద్యవు. నీవే ఈ ప్రపంచమందలి స్త్రీ రూపిణివి. అందరకు నీవే మాతృమూర్తివి.
దేవేంద్రుని శచీదేవి, మన్మథుని రతీదేవీ, జలేశుడగు వరుణుని వరుణానీ, వాయువు భార్య, అగ్నిదేవుని స్వాహాదేవి, కుబేరుని ధర్మపత్ని, యమధర్మరాజు యొక్క సుశీల, నిఋతియొక్క కైటభి ఈశానుని శశికళ, మనువుయొక్క శతరూప, కర్దమ ప్రజాపతి దేవహుతి , వసిష్ఠుని అరుంధతీదేవి, అగస్త్యమహాముని లోపాముద్ర, గోతమ మహర్షి అహల్య, దేవమాతయగు అదితి, సమస్త ప్రాణికోటికి ఆదారభూతయగు ఈ భూమి, గంగ, తులసి, ఇంకను భూమిపై నున్న ఇతర నదీనదములు, ఇవన్నియు నీయొక్క అంశరూపములే .
అదేవిధముగా మానవుల ఇండ్లలోనుండు గృహలక్ష్మీ, రాజులయొక్క ఇండ్లలోనుండు రాజ్యలక్ష్మీ, తపస్వుల తపస్సు, బ్రహ్మణుని గాయత్రి ఇవి అన్నియు నీ రూపములే.
అట్లే సజ్జనులకు, సత్యస్వరూపగా, దుర్మార్గులకు కలహకారణముగా , నిర్గుమ పరమాత్మకు జ్యోతిస్స్వరూపగా, సగుణరూప పరమాత్మకు శక్తిగా, సూర్యునిలో కాంతిగా, అగ్నిలో దాహికాశక్తిగా, నీటిలో శైత్యస్వరూపగా చంద్రునిలో శోభగా, భూ మియందు గంధరూపముతో, ఆకాశమున శబ్దరూపముతో నీవున్నావు. ఇంకను ఆకలి దప్పులు మొదలగునవి ప్రాణులకుగల సమస్త శక్తులు. నీ రూపములే.
నీవు అన్నిటికి కారణభూతవు. సంసారమున సారరూపిణివి, స్మృతి, మేధ, బుద్ధి, జ్ఞాన ము, అన్నికూడ నీ స్వరూపములే. సమస్త జ్ఞానములనొసగు విద్యను శ్రీకృష్ణుడు శంకరునకొసగెను. ఆ జ్ఞానమువలననే శంకరుడు మృంత్యుంజయుడు కాగలిగెను.
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శక్తులగు సృష్టి పాలనము , సంహారము అను మూడు శక్తులును నీ స్వరూపములే . అట్టి నిన్ను నేను నమస్కరింతునని భార్గవరాముడు పలికెను.
మధుకైటభభీత్యా చ త్రస్తో ధాతా ప్రకంపితః | స్తుత్వా ముక్తశ్చయాం దేవీం తాం మూర్ధ్నా ప్రణమామ్యహం || 49
మధుకైటభయోరుద్ధే త్రాతాzసౌ విష్ణురీశ్వరీం | బభూవ శక్తిమాన్ సుత్వా త్వాం దుర్గాం ప్రణమామ్యహం || 50
త్రిపురస్య మహాయుద్ధే సరథే పతితే శివే | యాం తుష్టువుఃసురాః సర్వే తాం దుర్గాం ప్రణమామ్యహం || 51
విష్ణునా వృషరూపేణ స్వయం శంభుః సముత్థితిః | జఘాన త్రిపురం స్తుత్వా తాం దుర్గాం ప్రణమామ్యహం || 52
యదాజ్ఞయా వాతి వాతః సూర్యస్తపతి సంతతం| వర్షతీంద్రో దహత్యగ్నిస్తాం దుర్గాం ప్రణమామ్యహం || 53
యదాజ్ఞయా హి కాలశ్చ శశ్వద్భ్రమతి వేగతః | మృత్యుశ్చరతి జంతూనాం తాం దుర్గాం ప్రణమామ్యహం || 54
స్రష్టా సృజతి సృష్టిం చ పాతా పాతి యదాజ్ఞయా | సంహర్తా సంహరేత్కాలే తాం దుర్గాం ప్రణమామ్యహం || 55
జ్యోతిస్స్వరూపో భగవాన్ శ్రీకృష్ణో నిర్గుణః స్వయం | యయా వినా న శక్తశ్చ సృష్టిం కర్తుం నమామి తాం || 56
రక్ష రక్ష జగన్మాతరపరాధం క్షమస్వ మే | శిశూనామపరాధేన కుతో మాతా హి కుప్యతి || 57
మధుకైటభ రాక్షసుల భయముతో వణికిపోవుచున్న బ్రహ్మదేవుడు నిన్ను స్తుతించి భయమయునకు దూరమయ్యెను.
మధుకైటభ రాక్షసులతో లోకపాలకుడగు విష్ణుమూర్తి యుద్ధము చేయునపుడు పరమేశ్వరివగు నిన్ను స్తుతించి శక్తిని సంపాదించుకొనెను.
త్రిపురాసురులతో యుద్ధము చేయునపుడు శంకరుడు తన రథముతో భూమిపై పడిపోయిన సమయమున దేవతలందరు తమ భయము తొలగిపోవుటకు నిన్ను స్తుతించిరి. ఆ సమయమున విష్ణుమూర్తి వృషభరూపమున శంకరుని లేవనెత్తగా అతడు నిన్ను స్తుతించి త్రిపురాసులను సంహరించెను.
నీ యొక్క ఆజ్ఞననుసరించి గాలివీచును. సూర్యుడు ఎండకాయును, ఇంద్రుడు వర్షించును. అగ్ని దహించును. అట్లే నీ ఆజ్ఞవలన కాలము వేగముగా తిరుగుచున్నది. ప్రాణులకు మృత్యువు కలుగుచున్నది. సృష్టికర్తయగు బ్రహ్మదేవుడు విశ్వసృష్టి చేయగలుగుచున్నడు. సృష్టిరక్షకుడగు విష్ణుమూర్తి నీ యాజ్ఞవలననే రక్షింపగలుగుచున్నడు. సృష్టి సంహర్తుయగు శంకరుడు విశ్వరూపము చేయగలుగుచున్నాడు.
నిర్గుణుడగు శ్రీకృష్ణభగవానుడు జ్యోతిస్స్వరూపుడు . అట్టి భగవంతుడు సహితము నీవు లేక సృష్టికార్యము చేయలేకపోవుచున్నాడు. అంతటి మహిమ గల నీకు అనేక నమస్కారములు చేయుదును.
ఓ జగన్మాతా! నన్ను రక్షింపుము. నా యొక్క తప్పులనన్నిటిని క్షమింపుము. శిశువులు తప్పు చేసినచో తల్లి ఎక్కడైనను కోపించునా ?అందువలన నన్ను క్షమింపుమని భార్గవ రాముడు దుర్గాదేవిని స్తుతించెను.
ఉక్త్వా పరశురామశ్చేతి నత్వా తాం రురోద హ | తుష్టా దుర్గా సంభ్రమేణ చాభయం చ వరం దదౌ || 58
అమరో భవ హే పుత్ర వత్స సుస్థిరతాం వ్రజ | సర్వ ప్రసాదాత్సర్వత్ర జయోzస్తు తవ సంతతం || 59
సర్వాంతరాత్మా భగవాంస్తుష్టస్యా త్సంతతం హరిః | భక్తిరభవతు తే కృష్ణే శివదేచ శివే గురౌ || 60
ఇష్టదేవే గురౌ యస్య భక్తిర్భవతి శాశ్వతీ | తం హంతుం నహి శక్తా వా రుష్టా లా సర్వదేవతాః || 61
శ్రీకృష్ణస్య చ భక్తస్వం శిష్యో వై శంకరస్య చ | గురుపత్నీం స్తౌషి యస్మాత్కస్త్వాం హంతుమిహేశ్వరః || 62
అహో న కృష్ణ భక్తానా మశుభం విద్యతే క్వచిత్ | అన్య దేవేషు యే భక్తా న భక్తా వా నిరకుశాః || 63
చంద్రమా బలవాంస్తుష్టో యేషాం భాగ్యవతాం భృగో | తేషాం తారాగణా రుష్టా కిం కుర్వంతి చ దుర్బలాః || 64
యసై#్మ తుష్టః పాలయంతి నరదేవో మహాన్సుఖీ | తస్య కిం వా కరిష్యంతి రుష్టాభృత్యాస్చ దుర్భలాః || 65
ఈ విధముగా పరశురాముడు దుర్గాదేవిని స్తుతించి నమస్కరించి ఏడ్వసాగెను. అందువలన దుర్గాదేవి సంతోషించి భార్గవరామునకు ఆశీస్సును వరమును ఇచ్చెను.
పుత్ర !నీకు మరణము కలుగక ఉండుగాక. సుస్థిరుడవై శోభిల్లుము. సమస్త దేవతలయొక్క అనుగ్రహము వలన నీకు అంతట జయము కలుగుగాక. అన్ని జీవులకు అంతరాత్మయగు శ్రీహరి నీ యెడ ఎల్లప్పుడు సంతుష్టుడగును. అట్లే నీకు మంగళప్రదుడైన శ్రీకృష్ణునిపై, గురువగు శంకరునిపై భక్తి కలుగుగాక. నీవు శ్రీకృష్ణ పరమాత్మయొక్క భక్తుడవు. అట్లే శంకరుని శిష్యుడవు. ఇష్టదేవతయందు గురువునందెల్లప్పుడు భక్తి య్నువానిని సమస్త దేవతలు కోపగించినను ఏమియు చేయలేరు. అట్లే గురుపత్నిని స్తుతించు నిన్ను ఎవ్వరు ఏమియు చేయలేరు. శ్రీకృష్ణుని భక్తులకెన్నడును అశుభము జరుగదు.
ఇతరదేవతాభక్తులు, దేవతలను భక్తితో సేవింపక నిరంకుశులుగా నుండువారు సహితము శ్రీకృష్ణుని భక్తితో సేవించినచో అన్య దేవతలు కోపముతో అతనిని ఏమియు చేయలేరు. ఎట్లనగా బలవంతుడగు చంద్రుడు సంతోషపడినచో దుర్బలమైన తారాగణము కోపించినను అతనిని ఏమియు చేయలేదు కదా| అట్లే గొప్పవాడగు రాజు సంతుష్ఠుడైనచో దుర్బలురైన అతని భృత్యులు కోపించినను ప్రయోజనముండదు కదా! అట్లే అభీష్టదేవుడగు శ్రీకృష్ణుడు సంతోషించినచో దుర్బలురైన అన్య దేవతలు కోపపడినను ప్రయోజనముండదు.
ఇత్యుక్త్వా పార్వతీ తుష్టా దత్వా రామాయ చాశిషం | జగామాంతఃపురం తూర్ణం హర్షశబ్దో బభూవ హ || 66
స్తోత్రం వై కాణ్వశాఖోక్తం పూజాకాలే తు యః పఠేత్ | యాత్రాకాలే తతా ప్రాతః వాంఛితార్థం లభేద్ధ్రువం || 67
పుత్రార్థీ లభ##తే పుత్రం కన్యార్థీ కన్యకాం లభేత్ | విద్యార్థీం లభేత్ విద్యాం ప్రజార్థీ చాప్నుయాత్ప్రాజాః ||
భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం నష్టవిత్తో లభేద్ధనం || 68
యస్య రుష్టో గురుర్దేవో రాజా వా బాంధవోzథవా | తసై#్మ తుష్టశ్చ వరదః స్తోత్రరాజప్రసాదతః || 69
దస్యుగ్రస్తః ఫణిగ్రస్తశ్శత్రుగ్రస్తో భయానకః | వ్యాధిగ్రస్తో భ##వేనుక్తః స్తోత్రస్మరణ మాత్రతః || 70
రాజద్వారే శ్మశానే చ కారాగారే చ బంధనే | జలరాశౌ నిమగ్నస్చ ముక్తస్తత్ స్మృతి మాత్రతః || 71
స్వామిభేదే పుత్రభేదే మిత్రభేదే చ దారుణ | స్తోత్ర స్మరణ మాత్రేణ వాంఛితార్థం లబేద్ధ్రువం || 72
కృత్వా హవిష్యం వర్షం చ స్తోత్రరాజం శ్రుణోతి యా| భక్తా దుర్గాం చ సంపూజ్య మహావంధ్యా ప్రసూయతే || 73
లభ##తే సా దివ్యపుత్రం జ్ఞానినం చిరజీవినం |అసౌభాగ్యా చ సౌభాగ్యం షణ్మాస శ్రవణాల్లభేత్ || 74
నవమాసం కాకవంధ్యా మృతవస్తా చ భక్తితః | స్తోత్ర రాజం యా శ్రుణోతి సా పుత్రం లభ##తే ధ్రువం || 75
కన్యామాతా పుత్రహీనా పంచమాసం శ్రుణోతి యా | ఘటే సంపూజ్య దుర్గాం చ సా పుత్రం లభ##తే ధ్రువం || 76
పార్వతీదేవి భార్గవ రామునితో పై విధముగా పలికి సంతోషముతో అతనికి ఆశీస్సులనొసగెను. తరువాత అదేవి తన అంతఃపురమందిరమును ప్రవేశించెను.
ఈ దుర్గాస్తోత్రము కాణ్వశాఖయందు కనిపించును. దీనిని ప్రతిదినము పూజాకాలమున చదివినను. ఇతర స్థలములకు వెళ్ళునప్పుడు ఉదయము చదివినను అతని వాంఛితములన్నియు సిద్ధించును. ఈ స్తోత్రమును భక్తితో చదివినచో పుత్రులు కావలెనని అనుకొన్నవానికి పుత్రులు, పుత్రిక కావలెనన్నచో పుత్రిక, విద్య కావలెనన్నచో విద్య లభించును.
రాజ్యభ్రష్టుడైన వానికి ఈ స్తోత్రము యొక్క మహిమవలన రాజ్యము లభించును. ధనము పోయినచో ధనము లబించును. అభీష్టదేవత, గురువు, రాజులేనిచో బంధువులు కోపగించినను ఈ స్తోత్ర రాజము యొక్క అనుగ్రహమువలన వారందరు సంతోషపడి కోరికలను తీర్చెదరు.
దొంగలు బందిపోట్లు చుట్టుముట్టినను, మహాసర్పము కరచినను, శత్రవులు మీద బడి రాజ్యమునాక్రమించినను, వ్యాధిగ్రస్తుడైనను, భక్తితో ఈ స్తోత్రమును స్మరించినంతనే అన్నియు పటాపంచలగును. అట్లే రాజసన్నిధిలో, శ్మశానమందు, కారాగారమున, నీటిలో నిమగ్నుడైనప్పుడు ఈ స్తోత్రమును స్మరించినంతమాత్రమున విజయము లభించును. అదేవిధముగా ఒక సంవత్సరము దుర్గాదేవిని పూజను చేసి ఈ స్తోత్రమును విన్నచో మహావంధ్య సహితము సంతానమును పొందగలదు. ఆ పుత్రుడు మహాజ్ఞాని చిరకాల జీవియగును.
ఆరుమాసములు దుర్గాదేవిని పూజించుచు ఈ స్తోత్రమును విన్నచో సౌభాగ్యము లభించును. తొమ్మిది నెలలు ఈ స్తోత్రమును భక్తితో విన్నచో సంతానము పోవుచున్న స్త్రీ సహితము సంతానమును పొందును. అట్లే ఐదు నెలలు ఈ స్తోత్రమును భక్తితో చదివినచో పుత్ర సంతానము తప్పక లభించునని దుర్గాదేవి పలికెను.
ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ తృతీయే గణపతి ఖండే నారద నారాయణ సంవాదే పరశురామకృత దుర్గాస్తోత్రంనామ పంచచత్వారింశత్తమోzధ్యాయః
శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణమున మూడవదగు గణపతి ఖండము నారద నారాయణ సంవాదమున తెల్పబడిన పరశురాముడు చేసిన దుర్గాస్తోత్రము కల
నలుబది ఐదవ అధ్యాయము సమాప్తము.