sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
షోడశోzధ్యాయః - చికిత్సా ప్రకరణము బ్రాహ్మణ ఉవాచ- బ్రాహ్మణుడిట్లనెను- దృష్ఠః కాలో యమో మృత్యుకన్యా వ్యాధిగణా అహో | కస్తేz ధునా చ సందేహః తం పృచ్ఛకన్యకే శుభే || 1 బ్రాహ్మణస్య వచః శ్రుత్వా హృష్టా మాలావతీ సతీ | యన్మనో నిహితం ప్రశ్నం చకార జగదీశ్వరం || 2 ఓ మాయావతీ! నీవు కాలుని, యముని, మృత్యుకన్యను వ్యాధుల సమూహమును చూచితివి కదా. ఇప్పటికీ నీకు మిగిలిన సందేహమును అడుగుము. బ్రాహ్మణుని మాటలువిని పతివ్రతయైన మాలావతి తన మనస్సులోనున్న సందేహము తీర్చుకొనుటకు జగత్పతినిట్లు ప్రశ్నించినది. మాలావత్యువాచ- మాలావతి ఇట్లనెను- త్వయా యత్కథితో వ్యాధిః ప్రాణినాం ప్రాణహారకః | తత్కారణం చ వివిధం సర్వం వేదే నిరూపితం || 3 యతో న సంచరేత్ వ్యాధిః దుర్నివారోzశుభావహః | తదుపాయం చ సాకల్యం భవాన్ వక్తుమిహార్హతి || 4 యద్యత్ పృష్టమపృష్టం వా జ్ఞాతమజ్ఞాతమేవ వా | సర్వం కథయ తద్భద్రం త్వం గురుర్దీనవత్సలః || 5 మాలావతీవచః శ్రుత్వా విప్రరూపీ జనార్దనః | సంహితాం వక్తుమారేభే సంహితార్థాం చ వైద్యకీం || 6 ఓ బ్రాహ్మణా! ప్రాణుల ప్రాణములను పోగొట్టే వ్యాధి, వ్యాధి కారణము సమస్తము వేదమున నిరూపించబడినట్లు ఏదైతే చెప్పబడినదో నివారించుటకు వీలు కానిది అశుభ##మైనది ఐన ఆ వ్యాధి వ్యాపించకుండ దానికి తగిన ఉపాయమును వివరముగా తెలుపగలరు. దీనవత్సలుడు గురువు ఐన మీరు నేను అడిగినవాటిని, అడగనివాటిని కూడ, అట్లే నాకు తెలిసినా తెలియకపోయినా అన్నిటిని వివరముగా చెప్పుడు. మాలావతి మాటలు విని విప్రరూపముననున్న జనార్దనుడు వైద్య సంహితను, సంహితార్ధమును కూడ చెప్పుటకు ప్రారంభించెను. బ్రాహ్మణ ఉవాచ- బ్రాహ్మణుడిట్లనెను- వందే తం సర్వతత్వజ్ఞం సర్వకారణకారణం | వేదవేదాంగబీజస్య బీజం శ్రీకృష్ణమీశ్వరం || 7 స ఈశశ్చతురో వేదాన్ ససృజే మంగళాలయాన్ | సర్వమంగళమాంగళ్యబీజరూపః సనాతనః || 8 ఋగ్యజుస్సామాధర్వాఖ్యాన్ దృష్ట్యా వేదాన్ ప్రజాపతిః | విచింత్య తేషామర్థం చైవాయుర్వేదం చకార సః || 9 కృత్వా తు పంచమం వేదం భాస్కరాయ దదౌ విభుః | స్వతంత్రసంహితాం తస్మాద్భాస్కరశ్చ చకార సః || 10 భాస్కరశ్చ స్వశిష్యేభ్య ఆయుర్వేదం స్వసంహితాం | ప్రదదౌ పాషయామాస తే చక్రుః సంహితాస్తతః || 11 తేషాం నామాని విదుషాం తంత్రాణి తత్కృతాని చ | వ్యాధిప్రణాశబీజాని సాధ్వి మత్తో నిశామయ || 12 ధన్వంతరిర్దివోదాసః కాశీరాజోzశ్వినీసుతౌ | నకులః సహదేవోzర్కిః చ్యవనో జనకో బుధః బుధః 13 జాబాలో జాజిలిః పైలః కరథ్యోzగస్త్య ఏవ చ | ఏతే వేదాంగ వేదజ్ఞాః షోడశ వ్యాధినాశకాః || 14 సర్వతత్వములు తెలిసినవాడు, సర్వకారణములకు కారణభూతుడు, వేదవేదాంగముల కారణులకు కారణమైనవాడు ఈశ్వరుడు ఐన కృష్ణుని నమస్కరింతును. సర్వమంగళమాంగళ్యములకు కారణభూతుడు, సనాతనుడైన పరమేశ్వరుడు చతుర్వేదములను సృష్టించెను. ఋక్, యజుస్ సామాధర్వములను వేదములను బ్రహ్మదేవుడు తెలిసికొని వాటి అర్థమును కూడ తెలుసుకొని ఆయుర్వేదమును సృష్టించెను. బ్రహ్మదేవుడు ఆయుర్వేదమను పంచమ వేదమును సృష్టించి భాస్కరునకుపదేశించెను. భాస్కరుడు తన శిష్యులకు ఆయుర్వేదమును తనపేరబరుగు భాస్కరసంహితను ఉపదేశించెను. సూర్యునియొక్క శిష్యులు వివిధములైన సంహితలను వ్యాప్తిచేసిరి. సూర్యుని శిష్యులయొక్క పేర్లు వారు రచించిన, వ్యాధిని సంపూర్ణముగా నాశనము చేయగలుగు తంత్రములు ఇవి. ధన్వంతరి, దివోదాసుడు, కాశీరాజు, అశ్వినీకుమారులు, నకులుడు, సహదేవుడు, అర్కి, చ్యవనుడు, జనకుడు, బుధుడు, జాబాలుడు, జాబిలి, పైలుడు, కరథుడు, అగస్త్యుడు అను పదునారుగురు సూర్యుని శిష్యులు. వారు వేదవేదాంగ తత్వజ్ఞులే కాక వ్యాధులను నిర్మూలనము చేయు సామర్థ్యముకూడ కలిగినటువంటివారు. చికిత్సాతత్వవిజ్ఞానం నామ తంత్రం మనోహరం | ధన్వంతరిశ్చ భగవాన్ చకార ప్రథమం సతి || 15 చికిత్సాదర్పణం నామ దివోదాసశ్చకార సః | చికిత్సాకౌముదీం దివ్యాం కాశీరాజశ్చకార సః || 16 చికిత్సాసారతంత్రం చ భ్రమఘ్నం చాశ్వినీసుతౌ | తంత్రం వైద్యకసర్వస్వం నకులశ్చ చకార సః || 17 చకార సహదేవశ్చ వ్యాధిసింధువిమర్దనం | జ్ఞానార్ణవం మహాతంత్రం యమరాజశ్చకార సః || 18 చ్యవనో జీవదానం చ చకార భగవానృషిః | చకార జనకో యోగీ వైద్యసందేహభంజనం || 19 సర్వసారం చంద్రసుతః జాబాలస్తంత్రసారకం | వేదాంగసారం తంత్రం చ చకార జాజలిర్మునిః || 20 పైలో నిదానం కరథస్తంత్రం సర్వధరం పరం | ద్వైధనిర్ణయతంత్రం చ చకార కుంభసంభవః || 21 చికిత్సాశాస్త్రబీజాని తంత్రాణ్యతాని షోడశ | వ్యాధిప్రణాశబీజాని బలాధానకరాణి చ || 22 ధన్వంతరి చికిత్సా తంత్ర విజ్ఞానమనే తంత్రమును, దివోదాసుడు చికిత్సాదర్పణతంత్రమును, కాశీరాజు చికిత్సా కౌముదీ తంత్రమును, అశ్వినీకుమారులు సందేహములను తొలగించే చికిత్సాసార తంత్రమును, నకులుడు వైద్యక సర్వస్వమనే తంత్రమును సహదేవుడు వ్యాధిసింధు విమర్దనమును, అర్కియైన యముడు జ్ఞానార్ణవ మహాతంత్రమును చ్యవనమహర్షి జీవదాన తంత్రమును, యోగియగు జనకమహారాజు వైద్య సందేహభంజనమును, చంద్రపుత్రుడైన బుధుడు సర్వసార తంత్రమును జాబాలమహర్షి తంత్రసారకమును, జాజలిముని వేదాంగసార తంత్రమును, పైలమహర్షి నిదాన తంత్రమును, కరధుడు సర్వధర తంత్రమును, అగస్త్యమహర్షి ద్వైధనిర్ణయ తంత్రమును రచించెను. మథిత్వా జ్ఞానమంత్రేణౖవాయుర్వేద పయోనిధిం | తతస్తస్మాదుదాజహ్రుర్నవనీతాని కోవిదాః || 23 ఏతాని క్రమశో దృష్ట్యా దివ్యాం భాస్కర సంహితాం | ఆయుర్వేదం సర్వబీజం సర్వం జానాసి సుందరి || 24 వ్యాధేస్తత్వపరిజ్ఞానం వేదనాయాశ్చ నిగ్రహః | ఏతద్వైద్యస్య వైద్యత్వం నవైద్యః ప్రభురాయుషః || 25 ఆయుర్వేదస్య విజ్ఞాతా చికిత్సాసు యథార్థవిత్ | ధర్మిష్ఠశ్చ దయాళుశ్చ తేన వైద్యః ప్రకీర్తితః || 26 ఆయుర్వేదశాస్త్రవిశారదులైన ధన్వంతరి మొదలగువారు ఆయుర్వేదమనే సముద్రమును జ్ఞానమనేమందర పర్వతముచే చిలికి పైన పేర్కొన్న గ్రంథములనే నవనీతముల తీసిరి. దివ్యమైన భాస్కరసంహితను, పైగ్రంథములను చక్కగా చూచిన ఆయుర్వేదశాస్త్రము సమస్తమునకు కారణమని నీకు స్పష్టముగా తెలియును. వ్యాధితత్వమును చక్కగా గుర్తించుట, రోగమువలన కలుగు వేదనలను నిగ్రహించు శక్తి కలిగినవాడే వైద్యుడు. ఆయుర్వేదశాస్త్రమును చక్కగా తెలిసినవాడు, చికిత్స చేయుట చక్కగా తెలిసినవాడు, దయాస్వభావము కలవాడు, ధర్మిష్ఠుడు వైద్యుడనబడును. ఆ వైద్యుడు ఆయుస్సునకు కర్త మాత్రము కాజాలడు. జనకః సర్వరోగాణాం దుర్వారో దారుణో జ్వరః | శివభక్తశ్చ యోగీ చ నిష్ఠురో వికృతాకృతిః || 27 భీమస్త్రిపాదస్త్రిశిరాః షడ్భుజో నవలోచనః | భస్మప్రహరణో రౌద్రః కాలాంతకయమోపమః || 28 మందాగ్నిస్తస్య జనకః మందాగ్నేర్జనకాస్త్రయః | పిత్తశ్లేష్మసమీరాశ్చ ప్రాణినాం దుఃఖదాయకాః || 29 వాయుజః పిత్తజశ్చైవ శ్లేష్మజశ్చ తథైవ చ | జ్వరభేదాశ్చ త్రివిధాః చతుర్థశ్చ త్రిదోషజః || 30 పాండుశ్చకామలః కుష్ఠః శోథః ప్లీహా చ శూలకః | జ్వరాతిసారగ్రహణీ కాస వ్రణ హలీమకాః || 31 మూత్రకృచ్ఛ్రశ్చ గుల్మశ్చ రక్తదోషవికారజః | విషమేహశ్చ కబ్జశ్చ గోదశ్చ గలగండకః || 32 భ్రమరీ సన్నిపాతశ్చ విఘాచీ దారుణీ సతీ | ఏషాం భేదప్రభేదేన చతుష్పష్టీ రుజః స్మృతాః || 33 మృత్యుకన్యా సుతాశ్చైతే జరా తస్యాశ్చ కన్యకా | జరా చ భ్రాతృభిస్సార్థం శశ్వత్ భ్రమతి భూతలం || 34 ఏతే చోపాయవేత్తారం న గచ్ఛంతి చ సంయతం | పలాయంతే చ తం దృష్ట్యా వైనతేయమివోరగాః || 35 సమస్త రోగములకు కారణము దారుణమైన జ్వరము. ఆ జ్వరము శివభక్తుడు, యోగి, వికృతాకృతి కలది, భయంకరమైనది, మూడుపాదములు, మూడు తలలు, ఆరుభుజములు, తొమ్మిది కళ్ళు కలది. రౌద్రస్వరూపము కలది. కాలాంతక యమతుల్యమైనది. జ్వరమునకు తండ్రి (కారణము) మందాగ్ని. ఆ మందాగ్నికి వాత, పిత్త శ్లేష్మములు కారణములు. జ్వరములు వాతము వల్ల కలిగినది, పిత్తమువలన కలిగినది, శ్లేష్మమువల్ల కలిగినది, త్రిదోషముల వలన కలిగినది అని నాలుగు విధములు. పాండు, కామల, కుష్ఠు, శోధము (జలోదరము) ప్లీహము, శూల, జ్వరము, అతిసారము, గ్రహణి, కాస, వ్రణములు, హలీమకము, మూత్రకృఛ్చ్రము, రక్తదోష వికారమువలన కలిగిన గుల్మము, విషమేహము, కబ్జము, గోదము, గలగండకము, భ్రమరి, సన్నిపాతము, విషూచి వీటి భేదములు, ప్రభేదములచే అరువది నాలుగు విధములైన రోగములు కలుగుచున్నవి. ఈవ్యాధులన్ని మృత్యుకన్యకు పుత్రులు. జరా (ముసలితనము) మృత్యుకన్య పుత్రిక. ఈ జర తన సోదరులతో కలసి భూమండలమంతయు తిరుగుచున్నది. ఇవన్నియు యమనియమములతో నుండువానిని, రోగనివారణోపాయము తెలిసిన వానిని చూచి గరుత్మంతుని చూచి సర్పములు పరుగెత్తినట్లు పరుగెత్తిపోవును. చక్షుర్జలం చ వ్యాయామః పాదాధసై#్తలమర్దనం | కర్ణయోర్మూర్ద్ని తైలం చ జరావ్యాధి వినాశనం || 36 వసంతే భ్రమణం వహ్నిసేవాం స్వల్పాం కరోతి యః | బాలాం చ సేవతే కాలే జరా తం నోపగచ్ఛతి || 37 ఖాతశీతోదకస్నాయీ సేవతే చందనద్రవం | నోపయాతి జరా తం చ నిదాఘేz నిలసేవకం || 38 ప్రావృష్యుష్ణోదకస్నాయీ ఘనతోయం న సేవతే | సమయే చ సమాహారీ జరా తం నోపగచ్ఛతి || 39 శరద్రౌద్రం న గృహ్ణాతి భ్రమణం తత్ర వర్జయేత్ | శాతస్నాయీ సమాహారీ జరా తం నోపగచ్ఛతి || 40 ఖాతస్నాయీ చ హేమం తే కాలే వహ్నిం చ సేవతే | భుంక్తే నవాన్న ముష్ణం చ జరా తం నోపగచ్ఛతి || 41 సద్యోమాంసం నవాన్నం చ బాలాస్త్రీ క్షీర భోజనం | ఘృతం చ సేవతే యో హి జరా తం నోపగచ్ఛతి || 42 శిశిరేంశుకవహ్నిం చ నవోష్ణాన్నం చ సేవతే | యశ్చ వోష్ణోదకస్నాయీ జరా తం నోపగచ్ఛతి || 43 భుంక్తే సదన్నం క్షుత్కాలే తృష్ణాయాం పీయతే జలం | నిత్యం భుంక్తే చ తాంబూలం జరా తం నోపగచ్ఛతి || 44 దధిహైయంగవీనం చ నవనీతం తథా గుడం | నిత్యం భుంక్తే సంయమీ యో జరా తం నోపగచ్ఛతి || 45 కళ్ళను నీటితో పరిశుభ్రము చేయుట, వ్యాయమము, కాళ్ళ అడుగులను నూనెతో మర్దించుట, చెవులలో నూనె వేసికొనుట, తలంటుకొనుట చేసికొన్నచో జరా, వ్యాధులు దూరమగును. వసంతరుతువులో ప్రతి దినము తిరుగుట, స్వల్పముగా వహ్నిని సేవించుట యుక్త సమయములో తనకంటె వయస్సులో చిన్నదైన స్త్రీతో సంగమించుట జరిగినచో వానికి ముసలితనమురాదు. గ్రీష్మరుతువులో సరస్సులో నున్న చల్లని నీటిలో స్నానము చేయుచు, చందన ద్రవమును, చల్లనిగాలిని సేవించిన వ్యక్తికి ముసలితనము రాదు. వర్షరుతువులో వేడినీళ్ళ స్నానము చేయవలెను. వర్షపు నీరును త్రాగరాదు. నిర్ణీతసమయమున సమానమైన (అతిగా కాకుండ, తక్కువ కాకుండ) భోజనము చేయవలెను. శరత్కాలములో ప్రతిదినము ఉదయకాలపు భ్రమణమును మానివేయవలెను. సరస్సులో స్నానము చేయవలెను. మితమైన ఆహారమును మాత్రమే భుజింపవలెను. హేమంత రుతువులోను సరస్సులో స్నానము చేయుట మంచిది. యుక్త సమయమున వహ్నిని సేవించవలెను. వేడిగానున్న క్రొత్త బియ్యపు అన్నమును తినినచో వారిని ముసలితనము దరి చేరదు. శిశిర రుతువులోనూ వేడిగా నున్న క్రొత్త బియ్యపుటన్నమును తినవలెను. బట్ట చాటుగా ఉన్న అగ్నిని సేవించవలెను. ఉష్ణోదకమున స్నానము చేయవచ్చును. అందువలన ముసలితనము దరిచేరదు. ఆకలియైనప్పుడు మంచి భోజనమును చేయవలెను. దప్పియైనప్పుడు నీరు తాగవలెను. నిత్యము తాంబూలమును సేవించినచో ముసలితనమతనికి రాదు. జిహ్వాచాపల్యములేక పెరుగు, నిన్న పిండిన పాలను తొడుపెట్టి తీసిన వెన్న (హైయంగవీనం) క్రొతనేయి, బెల్లము ప్రతినిత్యము తినినవానికి జర దరిచేరదు. శుష్కమాంసం స్త్రియం వృద్ధాం బాలార్కం తరుణం దధి | సంసేవంతం జరా యాతి ప్రహృష్టా భ్రాతృభిః సహ || 46 రాత్రౌ యే దధి సేవంతే పుంశ్చలీశ్చ రజస్వలాః | తానుపైతి జరా హృష్టా భ్రాతృభిః సహ సుందరి || 47 రజస్వలా చ కులటా చావీరా జారదూతికా | శూద్రయాజకపత్నీ యా ఋతుహీనా చ యా సతి || 48 యో హి తాసామన్నభోజీ బ్రహ్మహత్యాం లభేత్తు సః | తేన పాపేన సార్థం సా జరా తముపగచ్ఛతి || 49 ఎండిన మాంసము, తనకంటె వయసులో పెద్దస్త్రీ, ఉదయ కాలసూర్యుడు, లేతపెరుగు, రాత్రి పూట పెరుగు, చెడునడక గలస్త్రీ, రజస్వల ఐన స్త్రీ, భర్త, పుత్రులు లేని స్త్రీ, జారుని యొక్క దూతిక, యాగము చేసిన శూద్రుని భార్య, ముట్లుడిగిన స్త్రీ వీరిని సేవించిన వానిని వ్యాధులు ముసలితనము త్వరగా దరిచేరును. పైన పేర్కొనిన స్త్రీలు పెట్టిన అన్నము తిన్నచో బ్రహ్మహత్యా ఫలితము లభించగలదు. ఆ అన్నము తినిన వ్యక్తికి బ్రహ్మహత్యాపాపముతో ముసలితనముకూడా త్వరగా దరిచేరును. పాపానాం వ్యాధిభిస్సార్థం మిత్రతా సంతతం ధ్రువం | పాపం వ్యాధిజరాబీజం విఘ్నబీజం చ నిశ్చితం || 50 పాపేన జాయతే వ్యాధిః పాపేన జాయతే జరా | పాపేన జాయతే దైన్యం దుఃఖం శోకో భయంకరః || 51 తస్మాత్పాపం మహావైరం దోషబీజమమంగళం | భారతే సతతం సంతో నాచరంతి భయాతురాః || 52 పాపములకు వ్యాధులకు స్నేహము కలదు. పాపము జర, వ్యాధి, విఘ్నములకు కారణమగుచున్నది. పాపమువలన వ్యాధి కలుగును. వ్యాధులవలన ముసలితనము కలుగుచున్నది. ఆ పాపమువలన దైన్యము, దుఃఖము, మిక్కిలి భయంకరమైన శోకము కూడా కలుగుచున్నవి. అందువలన ఈ భారతదేశమున సత్పురుషులు దోషములకు హేతువైన పాపములను భయపడి చేయరు. స్వధర్మాచారయుక్తం చ దీక్షితం హరిసేవకం | గురుదేవాతిథీనాం చ భక్తం సక్తం తపస్సు చ || 53 వ్రతోపవాసయుక్తం చ సదా తీర్థనిషేవకం | రోగా ద్రవంతి తం దృష్ట్వా వైనతేయమివోరగాః || 54 ఏతాన్ జరా న సేవేత వ్యాధిసంఘశ్చ దుర్జయః | సర్వం బోధ్యమసమయే కాలే సర్వం గ్రసిష్యతి || 55 జ్వరస్య సర్వరోగాణాం జనకః కథితః సతి | పిత్తశ్లేష్మ సమీరాశ్చ జ్వరస్య జనకాస్త్రయః || 56 ఏతే యథా సంచరంతి స్వయం యాంతి చ దేహిషు | తమేవ వివిధోపాయం సాధ్వి మత్తో నిశామయ || 57 స్వధర్మాచారము కలవాడు దీక్షగైకొన్నవాడు, హరిభక్తుడు, గురువులందు, దేవతలందు, అతిథులందు భక్తి కలవాడు, తపస్సు చేయువాడు, వ్రతములు, ఉపవాసములయందు అనురక్తి కలవాడు. పుణ్యతీర్థములను సేవించువాడు మొదలగు వారిని చూచి రోగములు గరుత్మంతుని చూచిన సర్పములవలె పరుగెత్తుకొని పోవును. జ్వరమునకు, ఇతరములైన సమస్త రోగములకు పిత్తము, శ్లేష్మము, వాతము కారణములని ఇంతకుముందే చెప్పితిని. ఓమాలావతి! ఆ వ్యాధులు ఏవిధముగా మానవులను చేరుచున్నవో వాటిని ఎట్లు నివారించవచ్చునో వినుము. క్షుధి జాజ్వల్యమానాయాం ఆహారాభావ ఏవచ | ప్రాణినాం జాయతే పిత్తం చక్రే చ మణిపూరకే || 58 తాలబిల్వఫలం భుక్త్వా జలపానం చ తక్షణం | తదేవ తు భ##వేత్పిత్తం సద్యః ప్రాణహరం పరం || 59 తప్తోదకం చ శిరసి భాద్రే తిక్తం విశేషతః | దైవగ్రస్తశ్చ యో భుంక్తే పిత్తం తస్య ప్రజాయతే || 60 సశర్కం చ ధాన్యాకం పిష్టం శీతోదకాన్వితం | చణకం సర్వగవ్యం చ దధితక్ర వివర్జితం || 61 బిల్వతాళఫలం పక్వం సర్వ మైక్షవ మేక్షవ మేవ చ | ఆర్ద్రకం ముద్గయూషం చ తిలపిష్టం సశర్కరం. || 62 పిత్తక్షయకరం సద్యో బలపుష్టిప్రదం పరం | పిత్తనాశం చ తద్బీజముక్తమన్యన్నిబోధ మే || 63 బాగుగా ఆకలి అగుచున్నప్పుడు అన్నము తినకుండా ఉన్నందువలన మణిపూరక చక్రములో పైత్యము పుట్టుచున్నది. తాటిపండును (ముంజకాయలను) మారేడు పండును తిని తక్షణము నీరు త్రాగినచో ప్రాణములను పోగొట్టు పిత్తమేర్పడగలదు. వేడి నీటిని శిరస్సుపై పోసుకొన్నను, భాద్రపదమాసమున చేదు వస్తువులు విపరీతముగా తిన్నను పైత్యమేర్పడును. చక్కర కలిపిన ధనియాలు, చల్లని నీటితో తడుపబడిన పిండి, శనగలు, పెరుగు, మజ్జిగ కాక మిగిలిన గవ్యములు (ఆవుపాలు, ఆవువెన్న, ఆవునెయ్యి, ఆవుమీగడ) బాగుగా పండిన తాటిపండ్లు, మారేడు పండ్లు, చెరుకు సంబంధమైనవి, పెసరపప్పుతో చేసిన కట్టుచారు, చక్కర కలిపిన నువ్వులపిండి, అల్లము ఇవి పిత్తమును పోగొట్టును, బలమును పుష్టిని కలిగించును. పై విధముగా పైత్యమునకు కారణములు, పిత్తనాశక వస్తువులు చెప్పబడినవి. భోజనానంతరం స్నానం జలపానం వినా తృషా | తిలతైలం స్నిగ్ధతైలం స్నిగ్ధమామలకీ ద్రవం || 64 పర్యుషితాన్నం చ తక్రం చ పక్వం రంభాఫలం దధి | మేఘాంబు శర్కరాతోయం సుస్నిగ్ధజలసేవనం || 65 నారికేళోదకం రూక్షస్నానం పర్యుషితే జలే | తరుగుంజాపక్వఫలం సుపక్వం కర్కటీఫలం || 66 ఖాతస్నానం చ వర్షాసు మూలకం శ్లేష్మకారకం | బ్రహ్మరంధ్రే చ తజ్జన్మ మహద్వీర్య వినాశనం || 67 భోజనము తరువాత స్నానము చేసినను, దప్పిక లేక నీరు త్రాగినను, నువ్వుల నూనె, చిక్కని ఆమలకీ ద్రవము, చిక్కని నూనె, చద్ది అన్నము, నిన్నటి మజ్జిగ, పెరుగు, బాగా పండిన అరటిపండు, మేఘాంబువులు, చక్కరనీళ్ళు, కొబ్బరినీళ్ళు, గురివెంద చెట్టు పండు, బాగుగా పండిన సన్నదోసపండు, వర్షకాలములో సరస్సులో చేసిన స్నానము మొదలగునవి శ్లేష్మమును కలిగించును. ఆ శ్లేష్మము వీర్యమునంత పోగొట్టును. దాని జన్మస్థానము బ్రహ్మరంధ్రము. వహ్నిస్వేదం భ్రష్టభంగం పక్వతైల విశేషకం | భ్రమణం శుష్కభక్షం చ శుష్కపక్వహరీతకీ || 68 పిండారకమపక్వం చ రంభాఫలమపక్వకం | వేసవారః సింధువారః అనాహారమపానకం || 69 సఘృతం రోచనాచూర్ణం సఘృతం శుష్కశర్కరం | మరీచం పిప్పలం శుష్కమార్ద్రకం జీవకం మధు || 70 ద్రవ్యాణ్యతాని గాంధర్వి సద్యః శ్లేష్మహరాణి చ | బలపుష్టి కరాణ్యవ వాయుబీజం నిశామయ || 71 వహ్ని స్వేదము (అవిరి పట్టుకొనుట?) తిరుగుట, ఎండిన వస్తువుల తినుట, కరకకాయ, పక్వము కాని వెలగపండు, అరటిపండు, వేసవారము (మిరియాలు, ధనియాలు, అల్లము మొదలగు దినుసులతో చేయబడిన పొడి), ఆహారము తీసుకొనకుండుట, నీరుతాగకుండుట, నేయి కలిపిన రోచనా చూర్ణము (ఆకలిపుట్టించు పొడి) నేయి కలిపిన చక్కర, మిరియాలు, పిప్పళ్ళు, శొంఠి, జీవకము, తేనె ఇవన్ని శ్లేష్మమును వెంటనే తొలగించును. ఈ వస్తువులన్ని బలమును పుష్టిని కలిగించునవి. ఓగంధర్వ రాజ దుహితా! మాలావతీ! వాతరోగమునకు గల కారణములను వినుము. భోజనానంతరం సద్యోగమనం ధావనం తథా | ఛేదనం వహ్నితాపశ్చ శశ్వద్భ్రమణ మైథునం || 72 వృద్ధస్త్రీగమనం చైవ మనస్సంతాప ఏవచ | అతిరూక్షమనాహారం యుద్ధం కలహమేవచ || 73 కటువాక్యం భయం శోకః కేవలం వాయుకారణం | ఆజ్ఞాఖ్య చక్రే తజ్జన్మ నిశామయ తదౌషధం || 74 భోజనము చేసిన వెంటనే నడుచుట, పరుగెత్తుట, ఛేదించుట (శారీరక శ్రమకలుగునట్లు చేయుట) ఎండకు కాచుకొనుట, నిరంతరము తిరుగుట, అతిమైథునము, వృద్ధస్త్రీ సంగమము, మనస్తాపము, మొరటు ప్రవర్తన, సరియైన వేళకు ఆహారము తీసికొనకుండుట, పోట్లాటలు, యుద్ధముచేయుట, ఇతరులను బాధపెట్టు మాటలాడుట, భయము, దుఃఖము ఇవన్నియు వాత రోగమునకు కారణములగుచున్నవి. ఈరోగమునకు జన్మస్థానము మానవుని శరీరములోని ఆజ్ఞా చక్రము. ఇక ఈవాతరోగమునకు ఔషధములను వినుము. పక్వం రంభాఫలం చైవ సబీజం శర్కరోదకం | నారికేళోదకం చైవ సద్యస్తక్రం సుపిష్టకం || 75 మాహిషం దధి మిష్టం చ కేవలం వా సశర్కరం | సద్యః పర్యుషితాన్నం చ సౌవీరం శీతలోదకం || 76 పక్వతైలవిశేషం చ తిలతైలం చ కేవలం | అంగలీతాళఖర్జూరముష్ణం ఆమలకీద్రవం || 77 శీతలోష్ణోదకస్నానం సుస్నిగ్ధ చందన ద్రవం | స్నిగ్ధపద్మపత్రతల్పం సుస్నిగ్ధవ్యంజనాని చ || 78 ఏతత్తే కథితం వత్సే సద్యోవాయుప్రణాశనం | వాయవస్త్రివిధాః పుంసాం క్లేశసంతాప కామజాః || 79 పండిన అరటిపండు, కొబ్బరినీరు, అప్పుడే చిలికి చేసిన మజ్జిగ, మంచి పిండి, గేదెపెరుగు, శర్కరతో కూడుకున్న రుచికరమైన ఆహారము, కేవలం రుచికరమైన ఆహారము మరీ చద్దిదికాని అన్నము, సౌవీరము, చల్లనినీరు, పక్వతైలము, నువ్వులనూనె, కొబ్బరి, ఖర్జూరము, తాటిపండు, వేడియైన ఆమలకీద్రవము, చిరువెచ్చని నీటిలో చేయుస్నానము, మంచి చందన ద్రవము, దట్టమైన తామరరేకుల శయ్య, చక్కని పిసనకఱ్ఱలు, ఇవన్నియు వాతరోగమును పోగొట్టుచున్నవి. ఈవాతరోగములు క్లేశజనితములని, సంతాప జనితములని, కామ జనితములని మూడు విధములుగానున్నవి. వ్యాధిసంఘశ్చ కథితః తంత్రాణి వివిధాని చ | తాని వ్యాధిప్రణాశాయ కృతాని సద్భిరేవ చ || 80 తంత్రాణ్యతాని సర్వాణి వ్యాధిక్షయకరాణిచ | రసాయనాదయో యేషు చోపాయాశ్చ సుదుర్లభాః || 81 న శక్తః కథితుం సాధ్వి యథార్థం వత్సరేణ చ | తేషాం చ సర్వతంత్రాణాం కృతానాం చ విచక్షణౖః || 82 కేన రోగేణ త్వత్కాంతో మృతః కథయ శోభ##నే | తదుపాయం కరిష్యామి యేన జీవేదయం సతి || 83 వ్యాధులపేర్లు, వాటి నివారణకై ప్రాచీనులు రచించిన వివిధ తంత్ర గ్రంథముల పేర్లు నీకు చెప్పితిని. ఓ మాలావతీ! ఈ తంత్రగ్రంథములన్నియు వ్యాధులను సమూలముగా నాశనము చేయునవి. ఈగ్రంథములందు తెల్పబడిన రసాయనాదులు, ఉపాయములు చాలా దుర్లభ##మైనవి. ఓ సాధ్వి! వీటనన్నిటిని పూర్తి వివరముగా చెప్పుటకు సంవత్సరకాలము కూడ సరిపడదు. ఓ పతివ్రతా! నీ భర్త ఏ రోగమువల్ల చనిపోయెనో తెలుపుము. దానివలన నీ భర్త బ్రతుకు ఉపాయమును నేను చెప్పుదును. సౌతిరువాచ- సౌతి మహర్షి ఇట్లనెను - బ్రాహ్మణస్య వచః శ్రుత్వా కన్యా చిత్రరథస్య చ | కథాం కథితుమారేభే సా గాంధర్వీ ప్రహర్షితా || 84 బ్రాహ్మణుని మాటలు విని చిత్రరథుని కూతురైన మాలావతి సంతోషముతో తన విషయమునిట్లు చెప్పెను. మాలావత్యువాచ- మాలావతి ఇట్లనెను - యోగేన ప్రాణాంస్తత్యాజ బ్రాహ్మణః శాపహేతునా | సభాయాం లజ్జితః కాంతః మమ విప్ర నిశామయ || 85 సర్వం శ్రుతమపూర్వం చ శుభాఖ్యానం మనోహరం | భ##వేద్భవే కుతః కేషాం మహల్లభ్యం విపద్వినా || 86 అధునా మత్ర్పాణకాంతం దేహి దేహి విచక్షణ | నత్వా వః స్వామినాసార్థం యాస్వామి స్వగృహం ప్రతి || 87 మాలావతీవచః శ్రుత్వా విప్రరూపీ జనార్దనః | సభాం జగామ దేవానాం శీఘ్రం విప్రస్తదంతికం || 88 బ్రహ్మదేవుని సభలో తనకు జరిగిన అవమానమువలన నా భర్త సిగ్గుపడి బ్రహ్మదేవుని శాపకారణముగా యోగశక్తిచే తన ప్రాణములు వదిలెను. ఓ బ్రాహ్మణుడా! అపూర్వము మనోహరమైన నా భర్తకు సంబంధించిన విషయమునంత వింటివి. ఈ ప్రపంచములో ఎవ్వరికిని కష్టము లేక మంచి జరుగదు. అందువలన నీవు నా భర్తను వెంటనే బ్రతికింపుము. అప్పుడు మేమిద్దరము నీకు నమస్కరించి మా ఇంటికి పోయెదము. మాలావతి మాటలు విని విప్రుని వేషమున నున్న నారాయణుడు దేవతలున్న బ్రహ్మదేవుని సభకు వెళ్ళెను. ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ సౌతి శౌనక సంవాదే బ్రహ్మ ఖండే మాలావతీ విష్ణు సంవాదే చికిత్సా ప్రణయనే షోడశోzధ్యాయః. శ్రీ బ్రహ్మ వైవర్తమను మహాపురాణమున సౌతి శౌనక సంవాద రూపమైన బ్రహ్మ ఖండమున మాలావతీ విష్ణుమూర్తుల సంవాద సమయమున చికిత్సా ప్రణయనమను పదునారవ అధ్యాయము సమాప్తము.