sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
షడ్వింశతితమోధ్యాయః - ఆహ్నిక కార్యక్రమముల వివరణ సౌతిరువాచ - సౌతి మహర్షి ఇట్లనెను - హరిస్తోత్రం చ కవచం మంత్రం పూజావిధిం పరం | హరం యయాచే దేవర్షిః ధ్యానం చ జ్ఞానమేవ చ ||
1 స్తోత్రం చ కవచం మంత్రం ధ్యానం పూజావిధిం తథా | తత్ప్రాక్తనీయజ్ఞానం చ దదౌ తసై#్మ మహేశ్వరః || 2 సర్వం ప్రాప్య మునిశ్రేష్టః పరిపూర్ణమనోరథః | ఉవాచ ప్రణతో భక్త్యా గురుం ప్రణతవత్సలం || 3 దేవర్షియైన నారదుడు పరమశివునితో హరిస్తోత్రమును, కవచమును, మంత్రమును, పూజావిధిని, ధ్యానాదికములను తెలుపుమని ప్రార్థించగా నతడు నారదుడు కోరినవన్ని ఇచ్చెను. శంకరుని వల్ల తన కోరిక తీరగా నారదుడు భక్త జనవత్సలుడైన శంకరునకు భక్తితో నమస్కరించి ఇట్లు పలికెను. నారద ఉవాచ - నారదుడిట్లనెను. ఆహ్నికం బ్రాహ్మణానాం చ వద వేదవిదాం వర్ణ | స్వధర్మపాలనం నిత్యం యతో భవతి నిత్యశః || 4 వేదార్థములన్నితెలిపిన వారిలో శ్రేష్ఠుడైన మహేశాబ్రాహ్మణులకు స్వధర్మపరిపాలన దేనితో ప్రతిదినము నిర్వహించబడునో ఆ బ్రహ్మణాహ్నికమును నాకు వివరముగా తెల్పుము. శ్రీ మహేశ్వర ఉవాచ - శ్రీ మహేశ్వరుడిట్లనెను - బ్రాహ్మే ముహూర్తే చోత్థాయ బ్రహ్మరంధ్రస్థ పంకజే | సూక్ష్మే సహస్రపత్రే స్వే నిర్మలే గ్లానివర్జితే || 5 రాత్రివాసం పరిత్యజ్య గురుం తత్రైవ చింతయేత్ | వ్యాఖ్యాముద్రాకరం ప్రీతం సస్మితం శిష్యవత్సలం || 6 ప్రసన్నవదనం శాంతం పరితుష్టం నిరంతరం | సాక్షాద్ర్బహ్మ స్వరూపం చ పరమం చింతయేత్సదా || 7 ధ్యాత్వైవం గురుమారాధ్య హృత్పద్మే నిర్మలే సితే | సహస్ర పత్రే విస్తీర్ణే దేవమిష్టం విచింతయేత్ || 8 యస్య దేవస్య యద్ధ్యానం యద్రూపం తద్విచింతయేత్ | గృహీత్వా తదనుజ్ఞాం చ కర్తవ్యం సమయోచితం || 9 ఆదౌ ధ్యాత్వా గురుం నత్వా సంపూజ్య విధిపూర్వకం | పశ్చాత్తదాజ్ఞామాదాయ ధ్యాయేదిష్టం ప్రపూజయేత్ || 10 ప్రతి నిత్యము బ్రహ్మీ ముహూర్తమున నిద్రలేచి రాత్రిపూట ధరించిన వస్త్రములు వదలి నూతన వస్త్రములు ధరించి కూర్చొని తన బ్రహ్మరంధ్రమందున్న సహస్రారకమలమున వ్యాఖ్యాముద్రను ధరించినవాడును. స్మిత వదనుడు, శిష్యులపై వాత్సల్యము కలవాడు నగు తన గురుదేవుని తొలుత ధ్యానింపవలయును. ఆగురువు ప్రసన్నమైన ముఖము కలవాడు, నిత్యసంతోషి, సాక్షాత్పర బ్రహ్మస్వరూపుడు. అతనిని తన సహస్రాకారములమున ధ్యానించి తరువాత గురుదేవుని అనుజ్ఞను గైకొని సమయోచితమైన కార్యక్రమములు నిర్వహింపవలెను. తొలుత గురువుని ధ్యానించి అతనికి నమస్కరించి మానసిక పూజను శాస్త్ర ప్రకారము నిర్వర్తించి తరువాత గురువుయొక్క ఆజ్ఞప్రకారము ఇష్టదేవతను పూజింపవలెను. గురుప్రదర్శితో దేవః మంత్రపూజావిధిర్జపః | న దేవేన గురుః దృష్టస్తస్మాద్దేవాద్గురుః పరః || 11 గురుర్భ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః | గురుః ప్రకృతిరీశాద్యా గురుశ్చంద్రో೭నలో రవిః || 12 గురుర్వాయుశ్చ వరుణో గురుర్మాతా పితా సుహృత్ | గురురేవ పరం బ్రహ్మ నాస్తిపూజ్యో గురోః పరః || 13 అభిష్టదేవే రుష్టే చ సమర్థో రక్షణ గురుః | న సమర్థా గురౌ రుష్టే రక్షణ సర్వ దేవతాః || 14 యస్యతేష్టో గురుః శశ్వత్ జయస్తస్య పదే పదే | యస్య రుష్టో గురుస్తస్య సర్వనాశశ్చ సర్వదా || 15 న సంపూజ్యం గురుం దేవం యో మూఢః పూజయేద్ర్భమాత్ | బ్రహ్మహత్యాశతం పాపీ లభ##తే నాత్ర సంశయః || 16 సామవేదే చ భగవానిత్యువాచ హరిః స్వయం | తస్మాదభీష్ట దేవాచ్చ గురుః పూజ్యతమః పరః || 17 గురువు దేవుని అతని మంత్రపూజాదికములను జపవిధిని తెలుపుము. కాని దేవుడు గురువును చూపించడు. అందువలన దేవునికంటే గురువు శ్రేష్ఠుడు. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, ఈశుడు మొదలైన దిక్పాలకులు, ప్రకృతి, వాయువు, వరుణుడు, తల్లిదండ్రులు, స్నేహితుడు, సర్వము గురువే. చివరకు పరబ్రహ్మ కూడ గురువే. అనగా గురువు సర్వదేవతా స్వరూపుడు. అందువలన గురువుకంటే పూజించతగిన వాడెవ్వరు లేరు. ఇష్టదేవత కోపగించినను గురువు అతనిని రక్షించును. కాని గురువు కోపించినచో అతడు నూరు బ్రహ్మహత్యలు చేసిన ఫలమును తప్పక పొందును. అందువలన ఇష్టదేవత కన్న ఎక్కువగా గురువే పూజింపతగినవాడని శ్రీహరి స్వయముగా సామవేదమున తెలిపెను. గురుమిష్టం స్వయం ధ్యాత్వా స్తుత్వా వై సాధకో మునే | నిర్మలం స్థలమాసాద్య విణ్మూత్రం హ్యుత్సృజేన్ముదా || 18 జలం జలసమీపం చ సరంధ్రం ప్రాణిసన్నిధిం | దేవాలయ సమీపం చ వృక్షమూలం చ వర్త్మ చ || 19 హలోత్కర్ష స్థలం చైవ సస్యక్షేత్రం చ గోష్ఠకం | నదీ కందర గర్భంచ పుష్పోద్యానం చ పంకిలం || 20 గ్రామాద్యంభ్యంతరం చైవ నౄణాం గృహసమీపకం | శంకుం సేతుం శరవణం శ్మశానం వహ్నిసన్నిధిం || 21 క్రీడాస్థలం మహారణ్యం మంచకాధః స్థలం తథా | వృక్షచ్ఛాయాయుతం స్థానం అంతఃప్రాణ్యవపర్ణకం || 22 దూర్వాస్థానం కుశస్థానం వల్మీకస్థానమేవ చ | వృక్షారోపణ భూమిం చ కార్యార్థం చ పరిష్కృతం || 23 ఏతత్సర్వం పరిత్యజ్య పూర్వతాపవివర్జితం | కృత్వా గర్తం పురీషం చ మూత్రం చ పరివర్జయేత్ || 24 గురువును, ఇష్టదేవతను ధ్యానించి, స్తుతించి నిర్మలమైన స్థలమున మూత్ర పురీషములను వదలి పెట్టవలెను. జలము, జలసమీపము, పుట్టలున్నచోటు దేవాలయ సమీపము, చెట్టు మొదలు, త్రోవ, నాగలి దున్నిన ప్రాంతము, సస్యములున్న ప్రాంతము, పశువుల కొట్టము, నదులలోను, గుహలలోను, ఉద్యానవనములు, బురుద ఉన్న ప్రాంతము, గ్రామము యొక్క మధ్య, మనుషులున్న ఇండ్లసమీపము, శంకువు పాతినచోటు, వంతెన, రెల్లు పొద, శ్మశానము, నిప్పు ఉన్న ప్రాంతము, దర్భలున్న స్థలము,చెట్లు నాటిన స్థలము, ఏదేని ఒక కార్యమునకై చదును చేసిపెట్టుకొన్న స్థలము, సూర్యుని ఎండ పడని చోటు వీటినన్నిటిని వదలి చిన్న గోతిని తీసి మలమూత్రములు వదలి పెట్టవలయును. పురీషమూత్రోత్సర్గం చ దివా కుర్యాదుదఙ్మఖః | పశ్చిమాభిముఖో రాత్రౌ సంధ్యాయాం దక్షిణాముఖః || 25 మౌనీ భూత్వా చ నిశ్వాసం యథా గంధో న సంచరేత్ | త్యక్త్యా మృదా సమాచ్ఛాద్య శౌచం కుర్యాద్విచక్షణః || 26 కృత్వా తు లోష్ఠశౌచం చ జలశౌచం తతః పరం | మృద్యుక్తం తజ్జలం చైవ తత్ర్పమాణం నిశామయ || 27 ఏకాం లింగే మృదం దద్యాత్ వామహస్తే చతుష్టయం | ఉభయోర్హస్తయోః ద్వే తు మూత్రశౌచం ప్రకీర్తితం || 28 మూత్రశౌచం ద్విగుణితం మైథునానంతరం యది | మైథునానంతరం యద్వా మూత్రశౌచం చతుర్గుణం || 29 ఏకా లింగే గుదే తిస్రః తథా వామకరే దశ | ఉభయోః సప్త దాతవ్యాః పాదః షష్ఠేన శుధ్యతి || 30 పురీషశౌచం విప్రాణాం గృహిణామిదమేవ చ | విధవానాం ద్విగుణితం శౌచమేవం ప్రకీర్తితం || 31 యతీనాం వైష్ణవానాంచ బ్రహ్మర్షే బ్రహ్మచారిణాం | చతుర్గుణం చ గృహిణాం తేషాం శౌచం ప్రకీర్తితం || 32 నోయావదుపనీయేత ద్విజః శూద్రస్తథాంగనా | గంధలేపక్షయకరం తేషాం శౌచం ప్రకీర్తితం || 33 శౌచం క్షత్రవిశోశ్చైవ ద్విజానాం గృహిణాం సమం | ద్విగుణం వైష్ణవాదీనాం మునీనాం పరికీర్తితం || 34 న్యూనాధికం న కర్తవ్యం శౌచం శుద్ధిమభీప్సతా | ప్రాయశ్చిత్తం ప్రయుజ్యేత విహితాతిక్రమే కృతే || 35 మలమూత్రములను పగటిపూట ఉత్తరాభిముఖుడై విసర్జించవలెను. రాత్రివేళ పశ్చిమాభిముఖుడై, సాయంకాలమున దక్షిణాభిముఖుడై విసర్జింపవలెను. మౌనముగా మలమూత్రముల దుర్గంధము ముక్కులోనికి పోకుండ ఉచ్ఛ్వాస నిశ్వాసములను మెల్లగా చేయవలెను. తరువాత మలమును మట్టితో కప్పివేయవలెను. తరువాత ప్రక్షాళన చేసికొనవలెను. తొలుత మట్టితో క్షాళన చేసి అటుపిమ్మట జలముతో ప్రక్షాళన చేసికొనవలెను. శౌచమునకై తీసికొను మట్టి జలముల పరిమాణములివి. మూత్ర విసర్జన తరువాత ఒకసారి మట్టితో లింగమును కడిగి తరువాత నీటితో కడుగుకొనవలెను. అట్లే ఎడమ చేతిని నాల్గు పర్యాయములు, రెండు చేతులను రెండుసార్లు మట్టితోను నీటితోను కడుగుకొనవలెను. ఇది మూత్ర శౌచము. మైథునము తరువాత మూత్రము చేసినచో పైదానికి రెట్టించి శుభ్రము చేసికొనవలెను. లేక మలమూత్రములు విసర్జించినచో దానికి నాల్గురెట్లు ఎక్కువగా శుద్ధి చేసికొనవలెను. ఒకమారు లింగమును, మూడుమార్లు గుదమును, ఎడమ చేతిని పదిమారులు, రెండు చేతులను కలిపి ఏడు మారులు పాదములు ఆరుమారులు మట్టితో జలముతో శుభ్రము చేసికొనవలెను. ఇది గృహస్థాశ్రమమున ఉన్న బ్రాహ్మణులు చేయవలసిన మలశుద్ధి. భర్త చనిపోయిన స్త్రీలు పైదానికి రెట్టించిన సంఖ్యతో మలశుద్ధి చేసికొనవలెను. వైష్ణవులైన సన్యాసులు, బ్రహ్మచారులు, గృహస్థాశ్రమమున నున్న వారి కంటెను నాల్గురెట్లు ఎక్కువగా మలశుద్ధిని చేసికొనవలెను. ఉపయనము కానంతవరకు బ్రాహ్మణుడు కూడ శూద్రుడే. అట్లే స్త్రీ శూద్రుడు జలముతో మలమును శుద్ధిచేసికొన వలెను. క్షత్రియులు, వైశ్యులు బ్రాహ్మణులవలెనే మలమును శుద్ధిచేసికొనవలెను. కాని వైశ్యక్షత్రియ జాతులలోని వైష్ణవులు మునులు తమ జాతివారికంటెను. రెండురెట్లు అధికముగా శుద్ధి చేసికొనవలయును. పైవిధముగా కాక ఆ సంఖ్యలో ఎక్కువ తక్కువలు చేసినచో విధిగా ప్రాయశ్చిత్తము చేసికొనవలెను. శౌచం తన్నియమం మత్తః సావధానం నిశామయ | మృచ్ఛౌచే చ శుచిర్విప్రః అప్యశుచిశ్చ వ్యతిక్రమే || 36 వల్మీక మూషికోత్ఖాతాం మృదమంతర్జలాం తథా | శౌచావశిష్టాం గేహాచ్చ న దద్యాత్‌క్లేశసంభవాం || 37 అంతః ప్రాణ్యవపర్ణాం చ హలోత్ఖాతాం విశేషతః | కుశమూలోత్థితాం చైవ దూర్వామూలోత్థితాం తథా || 38 అశ్వత్థమూలాన్నీతాం చ తథైవ శయనోత్థితాం | చతుష్పథాచ్చగోష్ఠానాం గోష్పదానాం తథైవ చ || 39 సస్యస్థలానాం క్షేత్రాణాం ఉద్యానానాం మృదం త్యజేత్ | స్నాతోవాzప్యథవాzస్నాతో విప్రః శౌచేన శుధ్యతి || 40 శౌచహీనోzశుచిర్నిత్యం అనర్హః సర్వకర్మసు | కృత్వా శౌచమిదం విప్రో ముఖం ప్రక్షాళ##యేత్సుధీః || 41 ఓ నారదా! శౌచనియమమును వినుము. బ్రాహ్మణుడు మట్టిచేతనే శుచి యగుచున్నాడు. లేనిచో అతడు అశుచియే. పుట్టమన్నును, ఎలుకలు త్రవ్విన మన్నును, తడిసిన మట్టిని, లోపల క్రిమి కీటకాలు కలదానిని, ఆకులతో కప్పబడిన దానిని, నాగలిచే దున్నబడని దానిని, దర్భలు గరిక, రావిచెట్టు మొదళ్ళనుండి తీయబడినదానిని, అట్లే పడుకొను స్థలమునుండి తీసిన మట్టిని, చతుష్పథము, కొట్టము, సస్యము వేసిన స్థలము, పొలము, ఉద్యానములకు చెందిన మట్టిని, శౌచమునకుపయోగించగా మిగిలిన మట్టిన శౌచమునకు ఉపయోగించరాదు. స్నానము చేసినను చేయకున్నను పైవిధముగా మలమూత్రాదుల శుద్ధి చేసికొనని బ్రాహ్మణుడు సమస్త కర్మలకు అనర్హుడగున్నాడు. అందువలన పైవిధముగా మలమూత్రముల శుద్ధి చేసికొని ముఖ ప్రక్షాళనము చేయవలెను. ఆదౌ షోడశగండూషైర్ముఖ శుద్ధిం విధాయ చ | దంతకాష్ఠేన దంతం చ తత్పశ్చాత్పరిమార్జయేత్ || 42 పునష్షోడశ గండూషైర్ముఖశుద్ధిం సమాచరేత్ | దంత మార్జన కాష్ఠానాం నియమం శృణు నారద || 43 నిరూపితం సామవేదే హరిణా చాహ్నిక క్రమే | అపామార్గం, సింధువారం ఆమ్రం చ కరవీరకం || 44 ఖదిరం శిరీషం చ జాతి పున్నాగ శాలకం | అశోకమర్జునం చైవ క్షీరివృక్షం కదంబకం || 45 జంబూకం బకులం తోక్మం పలాశం చ ప్రశస్తకం | బదరీం పారిభద్రంచ మందారం శాల్మలీం తథా || 46 వృక్షం కంటక యుక్తం చ లతాది పరివర్జయేత్ | పిప్పలం చ ప్రియాలం చ తింతిడీకం చ తాళకం || 47 ఖర్జూరం నారికేళం చ తాళం చ పరివర్జయేత్ | దంతశౌచ విహీనశ్చ సర్వ శౌచ విహీనకః. 48 శౌచహీనోzశుచిర్నిత్యం అనర్హః సర్వకర్మసు | కృత్వా శౌచం శుచిర్విప్రో ధృత్వా ధౌతే చ వాససీ || 49 ముఖ ప్రక్షాళనము చేయుటకు ముందు పదునారు మార్లు నీటిని పుక్కిలించి ముఖమును కడుగుకొని, పండ్లపుల్లతో పండ్లుతోముకొని మరల పదునారుమార్లు నీటిని పుక్కిలించి ముఖముకడుగుకొనవలెను. సామవేదమున ఆహ్నికక్రమము చెప్పు సందర్భమున శ్రీహరి పండ్లు తోముకొనుటకు ఏఏ చెట్ల పుల్లలు వాడవలెనో తెలిపెను. అవి నేరెడు, వావిలి, మామిడి, గన్నేరు, చండ్ర, శిరీషం, జాజి, లొద్దిగ, అశోకము, మద్దిపాలచెట్లు, కడిమి, పొగడ, మోదుగ, పుల్లలు చాలా ప్రశస్తమైనవి. కాని రేగు, దేవదారు, మందార, బూరుగు, రావి, చింత, ఈత, ఖర్జూరము, కొబ్బరి, తాటిచెట్టుపుల్లలు, ముండ్ల చెట్లపుల్లలు, పండ్లు తోముకొనుటకు వాడకూడదు. పండ్లు తోముకొననిచో సమస్తమైన పరిశుద్ధి లేని వాడగును. వాడు శుచిత్వము లేనివాడు కావున సమస్త పుణ్య కర్మలకు అర్హుడు కాకుండా పోవును. అందువలన శౌచాచారములను పాలించి స్నానము చేసి అన్ని విధములుగా నిర్మలుడై ఉతికిన బట్టలు కట్టుకొని, ఇంటికి వచ్చి ఉదయ కాలపు సంధ్యావందనము చేయవలెను. ప్రక్షాళ్య పాదావాచమ్య ప్రాతః సంధ్యాం సమాచరేత్ | ఏవం త్రిసంధ్యం సంధ్యాం చ కురుతే కులజో ద్విజః || 50 స స్నాతః సర్వతీర్థేషు త్రిసంధ్యం యః సమాచరేత్ | సంధ్యాత్రితయ హీనఃస్యాదనర్హః సర్వకర్మసు || 51 యదహ్నా కురుతే కర్మ న తస్య ఫలభాగ్బవేత్ | నోపతిష్ఠతి యః పూర్వాం నోపాస్తే యస్తు పశ్చిమాం || 52 స శూద్రవద్భహిష్కార్యః సర్వస్మాత్ ద్విజకర్మణః | పూర్వాం సంధ్యా పరిత్యజ్య మధ్యమాం పశ్చిమాం తథా || 53 బ్రహ్మహత్యామాత్మహాత్యాం ప్రత్యహం లభ##తే ద్విజః | ఏకాదశీవిహీనో యః సంధ్యాహీనశ్చ యో ద్విజః || 54 కల్పం వ్రజేత్కాల సూత్రం యథా హి వృషలీపతిః | ప్రాతః సంధ్యాం విధాయైవం గురుమిష్టం సురం రవిం || 55 బ్రహ్మాణమీశం విష్ణుం చ మాయాం పద్మాం సరస్వతీం | ప్రణమ్య గురుమాజ్యం చ దర్పణం మధుకాంచనం || 56 స్పృష్ట్యాస్నానాదికం కాలే కుర్యాత్సాధక సత్తమః | పుష్కరిణ్యాం తు వాప్యాం తు యదాస్నానం సమాచరేత్ || 57 సముద్ధృత్య పంచపిండానాదౌ ధర్మీ విచక్షణః | నద్యాం నదే కందరే వా తీర్థే వా స్నానమాచరేత్ || 58 కుర్యాత్ స్నాత్యా తు సంకల్పం తతః స్నానం పునర్మునే | శ్రీకృష్ణప్రీతికామశ్చ వైష్ణవానాం మహాత్మనాం || 59 సంకల్పో గృహిణాం చైవ కృతపాతకనాశకః | విప్రః కృత్వా తు సంకల్పం మృదం గాత్రే ప్రలేపయేత్ || 60 వేదోక్త మంత్రేణానేన దేహశుద్ధి కృతే నరః | అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరే || 61 మృత్తికే హరమే పాపం యన్మయా దుష్కృతం కృతం | ఉద్ధృతాసి వరాహేణ కృష్ణేన శతబాహూనా || 62 ఆరుహ్యమమగాత్రాణి సర్వం పాపం ప్రయోచయ | పుణ్యం దేహిమహాభాగే స్నానానుజ్ఞం కురుష్వ మాం || 63 ప్రాతర్మధ్యాహ్న సాయంకాల సంధ్యాసమయములందు సంధ్యావందనము చేయు బ్రాహ్మణుడు సమస్త తీర్థములలో స్నానము చేసిన వానితో సమానుడగును. మూడు సంధ్యాకాలములలో సంధ్యావందనము చేయని బ్రాహ్మణుడు సమస్తవైదిక కర్మలు చేయుటకు అనర్హుడగుచున్నాడు. ఆ దినము చేసిన సమస్త పుణ్యకర్మల ఫలితముననుభవించలేడు. ప్రాతస్సంధ్యావందనమును సాయం సంధ్యావదనము చేయనివాడు సమస్త వైదిక కర్మలకు దూరమగును. అట్లే త్రికాలములందు సంధ్యావందనమును చేయని వానికి బ్రహ్మహత్యాఫలము ఆత్మహత్యాఫలము ప్రతిదినము కలుగును. ఏకాదశీ వ్రతానుష్ఠానమును సంధ్యావందనమును చేయనివాడు కల్పకాలము నరకమున ఉండును. ఉదయము సంధ్యావందనము చేసి తన గురువును, తన ఇష్ట దేవతను, సూర్యుని, త్రిమూర్తులను, లక్ష్మీపార్వతీ సరస్వతులను నమస్కరించి నేతిని, అద్దమును, బంగారమును ముట్టుకొనవలెను. ప్రతి దినము స్నానము చేయవలసిన పద్దతి ఇట్లుండును. ప్రతిదినము స్నానసమయమును పుష్కరిణిలోనైనా బావిలోనైనా స్నానము చేయవలెను. స్నానము చేయుటకు ముందు ఐదు బుద్దల మట్టిని ఆపుష్కరిణి లేక దిగుడు బావినుండి తీసి బయట వేయవలెను. స్నానమును నదిలోగాని పశ్చిమాభిముఖముగా ప్రవహించు నదమున కాని లేక పుణ్య తీర్థమునగాని స్నానము చేయవచ్చును. స్నానము చేసిన తరువాత స్నాన సంకల్పము చెప్పుకొని మరల స్నానము చేయవలెను. ఆసంకల్పమున మహాత్ములైన వైష్ణవులు శ్రీకృష్ణుని ప్రీతికొరకు చెప్పుకొనగా సామాన్యులు తాము చేసికొనిన పాపముల నివృత్తికొరకు చెప్పుకొందురు. బ్రాహ్మణుడు సంకల్పము చెప్పికొనిన తరువాత శరీరమునందంతట తడిమట్టిని పూనికొనవలెను. ఆతరువాత మహౄనారాయణమునందలి ''అశ్వక్రాంతే రథక్రాంతే'' అను వేదమంత్రములను చదువుచు స్నానము చేయవలెను. ఆ వేదమంత్రము యొక్క అర్థమిది. ''ఓ భూమాతా! గుఱ్ఱములు, రథములు నీపై సంచరించుచున్నవి. నీవు త్రివిక్రముడైన విష్ణువుయొక్క పాదములచే ఆక్రమించబడినదానవు. ఈమట్టి నేను చేసిన పాపములనన్నిటిని పోగొట్టును. నీవు వందల కొలది బాహువులు గల నల్లని ఆదివరాహమూర్తి చేత ఉద్దరింపబడినదానవు.'' నీవు నా శరీరమును తాకి నేను చేసిన పాపములనన్నిటిని తొలగింపుము. ఓభూమాతా! నాకు పుణ్యమునొసగి స్నానమున కనుజ్ఞనిమ్ము ఇత్యుక్త్వా చ జలే నాభిప్రమాణ మంత్రపూర్వకం | చతుర్హస్త ప్రమాణాం చ కృత్వా మండలికాం శుభాం || 64 తీర్థాన్యావాహయేత్తత్ర హస్తం దత్వా తపోధన | యాని యాని చ తీర్థాని సర్వాణి కథయామి తే || 65 గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి | నర్మదే సింధు కావేరీ జలేzస్మిన్ సన్నిధిం కురు || 66 నలినీ నందినీ సీతా మాలినీ చ మహాపగా | విష్ణుపాదాబ్జసంభూతా గంగా త్రిపథగామినీ || 67 పద్మావతీ భోగవతీ స్వర్ణరేఖా చ కౌశికీ | దక్షా పృథ్వీ చ సుభగా విశ్వకాయా శివామృతా || 68 విద్యాధరీ సుప్రసన్నా తథా లోకప్రసాదినీ | క్షేమా చ వైష్ణవీ శాంతా శాంతిదా గోమతీ సతీ || 69 సావిత్రీ తులసి దుర్గా మహాలక్ష్మీః సరస్వతీ | కృష్ణప్రాణాధికా రాధా లోపముద్రా zదితీరతిః || 70 అహల్య చాదితిః సంజ్ఞా స్వధా స్వాహాzప్యరుంధతి | శతరూపా దేవహూతిరిత్యాద్యా: సంస్మరేత్సుధిః || 71 పై వేదమంత్రమును చదువుచూ బొడ్డువరకున్న నీలటిలో నాల్గు హస్తముల (ఎనిమిది మూరల) మేర మండలము నేర్పరచి ఆ మండలమున చేతితో సమస్త తీర్థముల నావాహన చేయవలెను. నేను స్నానము చేయుచున్న జలములో గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరీనదులు ప్రవేశించుగాక. అట్లే స్నానము చేయుచున్నప్పుడు నళిని, నందిని, సీత, మాలినీనది, విష్ణుపాదములనుండి పుట్టిన గంగానది,పద్మావతి, భోగవతి స్వర్ణరేఖ, కౌశికి, దక్ష, పృథివి, విశ్వకాయ, శివామృత, విద్యాధరి, గోమతి, సావిత్రి, తులసి, దుర్గ, మహాలక్ష్మి, సరస్వతి, రాధ, లోపాముద్ర, దితి, రతి, అదితి, సంజ్ఞ, స్వాహా, అరుంధతి, శతరూప,దేవహూతి మొదలైన వారిని స్మరించవలెను. స్నాత్వా స్నాత్వా మహాపూతః కుర్యాత్తు తిలకం బుధః | బాహ్వోర్మూలే లలాటేచ కంఠదేశే చ వక్షసి || 72 స్నానం దానం తపో హోమో దేవతా పితృకర్మ చ | తత్సర్వం నిష్ఫలం యాతి లలాటే తిలకం వినా || 73 బ్రాహ్మణస్తిలకం కృత్వా కుర్యాత్సంధ్యాం చ తర్పణం | నమస్కృత్య సురాన్ భక్యా గృహం గచ్ఛేన్ముదాzన్వితః || 74 ప్రక్షాళ్య పాదౌ యత్నేన ధృత్వా ధౌతే చ వాససీ | మందిరం ప్రవిశేత్ప్రాజ్ఞ ఇత్యాహ హరిరేవ చ || 75 వినా పాదక్షాళనం యః స్నాత్వా విశతి మందిరం | తస్య స్నానాదికం నష్టం జపహోమాదిపంచకం || 76 పరిధాయ స్నిగ్ధవస్త్రం గృహం చ ప్రవిశేద్గృహీ | రుష్టా లక్ష్మీ గృహాద్యాతి శాపం దత్వా సుదారుణం || 77 జంఘోర్ధ్వతశ్చ యో విప్రః పాదౌ ప్రక్షాళ##యే ద్యదా | తావద్భవతి చండాలో యావద్గంగాం న పశ్చతి || 78 స్నానమును రెండుసార్లు చేసి పవిత్రమై భుజములపై, ముఖముపై, కంఠముపై, రొమ్ముపై బొట్టు పెట్టకొనవలెను. ముఖముపై బొట్టు పెట్టుకొననిచో చేసిన స్నానము, దానము, తపస్సు, హోమము, దేవపూజ, పితృతర్పణము అన్నియు వ్యర్థము కాగలవు. బ్రాహ్మణుడు బొట్టుపెట్టుకొని సంధ్యావందనమును, పితృతర్పణమును, దేవతాపూజను చేసికొని ఇంఇకి వెళ్ళవలెను. ఇంటికి వెళ్ళిన తరువాత పాదములను కడుగుకొని, ఉతికిన బట్టలను కట్టుకొనవలెను. పాదప్రక్షాళనము చేసికొనక ఇంటిలోకి వెళ్ళినచో అతడు చేసిన స్నానాదికములు జపహోమాదులు అన్నియు వ్యర్థమైపోవును. లక్ష్మీదేవి కోపముతో శాపముపెట్టి అతని ఇంటిని వదలిపోవును. అట్టే పిక్కలపై భాగమువరకు కాళ్ళు కడుగుకొన్నచో గంగానదిని చూచువరకు చండాలుడగును. ఉపవిశ్యాసనే బ్రహ్మన్ శుచిరాచమ్య సాధకః | పూజాం కుర్యాత్తు వేదోక్తాం భుక్తియుక్తో హి సంయతః || 79 శాలగ్రామే మణౌ మంత్రే ప్రతిమాయాం జలే స్థలే | గోపృష్ఠే వా గురౌ విప్రే ప్రశస్తమర్చనం హరేః || 80 సర్వేషు శస్తా పూజా చ శాలగ్రామే చ నారద | సురాణామేవ సర్వేషాం యత్రాధిష్ఠాన మేవ చ || 81 స స్నాతః సర్వతీర్థేషు సర్వయజ్ఞేషు దీక్షితః | శాలగ్రామోదకేనైవ యోzభిషేకం సమాచరేత్ || 82 శాలగ్రామజలం భక్త్యా నిత్యమశ్నాతి యో నరః | జీవన్ముక్తంః స చ భ##వేత్ యాత్యంతే కృష్ణమందిరం || 83 తత్ర యో హి మృతో దేహీ జ్ఞనాzజ్ఞానేన దైవతః | రత్న నిర్మితయానేన స యాతి శ్రీహరేః పదం || 85 శాలగ్రామం వినాzన్యత్ర కః సాధుః పూజయేద్ధిరిం | కృత్వా తత్ర హరేః పూజాం పరిపూర్ణం ఫలం లభేత్ || 86 పుష్కరిణ్యాదులలో స్నానము చేసి ఇంటికి తిరిగివచ్చి కాళ్ళు కడుగుకొని ఆసనముపై కూర్చుండి భక్తికలవాడై వేదవిహిత పద్ధతితో పూజ చేయవలెను. సాలగ్రామమును, మణియందు, మంత్రమున, ప్రతిమయందు, జలమున, స్థలమున, గోపృష్ఠభాతమున, గురువులో, విప్రునిలో శ్రీహరిని భావించి పూజచేయుట ఉత్తమమైనది. వీటిలోను సాలగ్రామపూజ అన్నిటికంటె శ్రేష్ఠమైనది. సాలగ్రామాభిషేకతీర్థమును తన శిరస్సుపై ప్రతిదినము ప్రోక్షించుకొని వ్యక్తి సమస్త తీర్థములలో స్నానము చేసినవాడు, సమస్త యజ్ఞములలో దీక్షను స్వీకరించినవాడగుచున్నాడు. ఎవరి ఇంటిలో సాలగ్రామశిలాచక్రము ఉండునో ఆ ఇంటిలో చక్రసహితుడైన శ్రీహరి నివసించును. అచ్చట సమస్త తీర్థములు కూడా ఉండును. సాలగ్రామ చక్రమున్న ఇంటిలో తెలిసియో తెలియకుండనో చనిపోయిన వ్యక్తి శ్రీహరి భటులు వెంట రాగా రత్నములచే నిర్మించబడిన విమానమున శ్రీహరిస్థానమును చేరుకొనును. సాధుపురుషులు సాలగ్రామము లేక హరిపూజలు చేయనే చేయరు. ఎందుకనగా సాలగ్రామమున హరిపూజ చేసినచో పరిపూర్ణమైన ఫలితము నిచ్చునని వారికి తెలియునున. పూజాధారశ్చ కథితః శ్రూయతాం పూజనక్రమః | హరేః బహుమతాం కథయామి యథాగమం || 87 కశ్చిద్దదాతి హరయే చోపచారాంశ్చ షోడశ | సుందరాణి పవిత్రాణి నిత్యం భక్త్వా చ వైష్ణవః || 88 కశ్చిద్ద్వాదశవస్తూని పంచవస్తూని కశ్చన | యేషామేవ యథాశక్తిర్భక్తి మూలం చ పూజనే || 89 ఆసనం వసనం పాద్యం అర్ఘ్యమాచమనీయకం | పుష్పం చందన ధూపం చ దీపం నైవేద్యముత్తమం || 90 గంధం మాల్యం చ శయ్యాం చ లలితాం సువిలక్షణాం | జలమన్నం చ తాంబూలం సాధారం దేయమేవ చ || 91 గంధాన్న తల్ప తాంబూలం వినా ద్రవ్యాణి ద్వాదశ | పాద్యార్ఘ్యజల నైవేద్య పుష్పాణ్యతాని పంచ చ || 92 సర్వాణ్యతాని మూలేన దద్యాత్సాధకసత్తమః | గురూపదిష్టం మూలం చ ప్రశస్తం సర్వకర్మసు || 93 అదౌ కృత్వా భూతశుద్ధిం ప్రాణాయామం తతః పరం | అంగప్రత్యంగయోర్న్యాసం మంత్రన్యాసం తతః పరం || 94 వర్ణన్యాసం వినిర్వర్త్య చార్ఘపాత్రం వినిర్దిశేత్ | త్రికోణమండలం కృత్వా తత్రకూర్మం ప్రపూజయేత్ || 95 జలేనపూర్యశంఖం చ తత్ర సంస్థాపయేద్ధ్విజః | జలం సంపూజ్య విధివత్తీర్థాన్యావాహయేత్తతః || 96 పూజోపకరణం తే జలేన క్షళ##యేత్సునః | తతో గృహీత్వా పుష్పం చ కృత్వా యోగాసనం శుచిః || 97 ధ్యానేన గురుదత్తేన ధ్యాయేత్కృష్ణమనన్యధీః | ధ్యత్వా పాద్యాదికం సర్వం దద్యాన్మూలేన సాధకః || 98 అంగప్రత్యంగదేవం చ తంత్రోక్తం పూజయేత్ హరిం | మూలం జప్త్వా యథాశక్తి దేవమంత్రం విసర్జయేత్ || 99 దత్వోపహారం వివిధం స్తుత్వా చ కవచం పఠేత్ | తతః కృత్వా పరీహారం మూర్ధ్నా చ ప్రణమేద్భువి || 100 కృత్వా వై దేవపూజాం చ యజ్ఞం కుర్యాద్విచక్షణః | శ్రౌతస్మార్తాగ్ని యుక్తం చ బలిం దద్యాత్తతో మునే || 101 నిత్యశ్రాద్ధం యథాశక్తి దానం విత్తానురూపకం | కృత్వా కృతీ స విహరేత్ క్రమ ఏష శ్రుతౌ శ్రుతః || 102 ఇంతవరకు పూజచేయవలసిన వస్తువుల గూర్చి చెప్పితిని. ఇకముందు పూజాక్రమము ఏవిధముగా ఉండునో తెల్పుదును. కొందరు షోడశోపచారములతో అర్చించగా మరికొందరు ద్వాదశోపచారములతో, పంచోపచారములతో కూడా యథాశక్తి పూజింతురు. పూజచేయునప్పుడు ఉపచారముల సంఖ్య ప్రధానము కాదు. భక్తియే ప్రధానమైనది. ఆసనము, అర్ఘ్యము, పాద్యము, ఆచమనము, వస్త్రము, పుష్పము, చందనము, దూపము, దీపము, సాధారణ నైవేద్యము, గంధము, మాల్యము, మహా నైవేద్యము, జలము, తాంబూలము శయ్య అనునవి పదునారు ఉపచారములు. వీటిలో గంధము, అన్నము, (మహా నైవేద్యము) తాంబూలము శయ్య అను నాలుగు ఉపచారములను వదిలినచో మిగిలినవి ద్వాదశోపచారములు అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము, నైవేద్యము, పుష్పసమర్పణ అనునవి పంచోపచారములు. గురువుచే ఉపదేశించబడిన మూలమంత్రమును చదువుచు పై షోడశోపచారపూజను లేక ద్వాదశోపచారపూజను, పంచోపచార పూజను చేయవలెను. అర్చన ప్రారంభించుటకు ముందు భూతశుద్దిని చేసి ప్రాణాయామ పూర్వకముగా దేశకాలాదులను తెలిపి అంగప్రత్యంగములయందు మంత్రన్యాసమును వర్ణన్యాసమును చేసి అర్ఘ్యపాద్యాది పాత్రలనుంచవలెను. తరువాత త్రికోణమును, మండలమును (ముగ్గుతో) వేసి అచ్చట ఆదికూర్మమును భావించుకొని పూజించవలెను. శంఖమున జలమును పోసి ఆ శంఖమును కూర్మము పైనుంచి విధిగా సమస్తతీర్థములను ఆ జలమున ఆవాహన చేయవలెను. ఆ జలముతో పూజోపకరణములను శుద్ధిచేసి పుష్పమును తీసికొని యోగాసన విధిని నిర్వర్తింపవలెను. ఆ తరువాత గురూపదిష్టమైన మంత్రముతో అర్ఘ్యపాద్యాదులను ఇవ్వవలెను. ఆయా తంత్రములందు చెప్పబడినట్లు అంగప్రత్యంగ దేవతలతో కలిపి శ్రీహరిని ఆరాధించి యథాశక్తి మూలమంత్రమును, దేవతామంత్రమును జపించవలెను. అటుపిమ్మట నైవేద్యమును సమర్పించి వివిధ స్తోత్రములచే స్తుతించి, కవచమును చదువవలెను. తరువాత తానొర్చిన పూజలో ఏవైనా తప్పులు చేసినచో వాటికై క్షమాపణ చెప్పుకొని, శ్రౌతస్మార్తాగ్నితో యజ్ఞము చేసి, ఆ తరువాత, భూతబలిని పెట్టవలెను. నిత్య శ్రాద్ధమును నిర్వర్తించి యథాశక్తి దానము చేయవలెను. ఇది వేదవిహితమైన పూజావిధానము- ఇతి తే కథితం సర్వం వేదోక్తం సూత్రముత్తమం | ఆహ్నికస్య చ విప్రాణాం కిం భూయః శ్రోతుమిచ్ఛసి || 103 ఓ నారద! ఇంతవరకు నీకు బ్రాహ్మణులు ప్రతిదినము ఆచరించవలసిన వేదములలో చెప్పబడిన ఆహ్నిక క్రమము వివరించితి. ఇంకను నీవేమైనా వినదలచినచో చెప్పెదను. ఇతి శ్రీబ్రహ్మవైవర్తే బ్రహ్మఖండే శివనారద | సంవాద ఆహ్నిక నిరూపణం నామ షడ్వింశతితమో೭ధ్యాయః || శ్రీ బ్రహ్మవైవర్తమహాపురాణమున బ్రహ్మఖండములోని శివనారద సంవాదమున ఆహ్నిక నిరూపణమను ఇరువది యారవ అధ్యాయము సమాప్తము.