sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
అష్టావింశతితమో೭ధ్యాయః - బ్రహ్మ స్వరూప, వైకుంఠవర్ణనలు నారద ఉవాచ - నారాదుడిట్లనెను - శ్రుతం సర్వం జగన్నాథ త్వత్ర్పసాదాజ్జగద్గురో | భవాన్ బ్రహ్మస్వరూపంచ వద బ్రహ్మనిరూపణం || 1 ప్రభో కిం బ్రహ్మ సాకారం కిం నిరాకారమీశ్వర | కిం తద్విశేషణం కిం వాప్యవిశేషణమేవ చ || 2 కిం వా దృశ్యమదృశ్యం వా లిప్తం దేవీషు కిం న వా | కింవా తల్లక్షణం శాస్త్రేవేదే వా కిం నిరూపితం || 3 బ్రహ్మాతిరిక్తా ప్రకృతిః కిం వా బ్రమ్మ స్వరూపిణీ | ప్రకృతేర్లక్షణం కింవా సారభూతం శ్రుతౌశ్రుతం || 4 ప్రాధాన్యం తస్య సృష్టౌ చ ద్వయోర్మధ్యే వరం పరం | విచార్య మనసా సర్వం సర్వజ్ఞ వద మాం ధ్రువం || 5 నారదస్య వచః శ్రుత్వా పంచవక్త్రః ప్రహస్య చ | భగవాన్ కర్తుమారేబే పరబ్రహ్మ నిరూపణం || 6 మహేశ్వరా ! నీ అనుగ్రహము వలన భక్ష్యాభక్ష్య స్వరూపము నంతము తెలిసికొంటిని. ప్రస్తుతము బ్రహ్మస్వరూపమును వివిరించి చెప్పుము. హే ప్రభో! బ్రహ్మకు ఆకారమున్నదా? లేక నిరాకారమేనా? దానికి విశేషణములున్నాయా? లేవా? అది దృశ్యమా లేక అదృశ్యమైనదా? వేదములలో శాస్త్రములలో బ్రహ్మ స్వరూప మేవిధముగా చెప్పబడినది? బ్రహ్మస్వరూపిణియైన ప్రకృతి బ్రహ్మకంటే అతిరిక్తమైనదా? దాని స్వరూపము వేదములలో ఏవిధముగా చెప్పబడినది. సృష్టి విషయమున ప్రకృతికి ఉన్న ప్రాధాన్యమెట్టిది? బ్రహ్మ, ప్రకృతుల మధ్య ఏది శ్రేష్ఠమైనది? వీటినన్నిటిని చక్కగా ఆలోచించి సర్వజ్ఞుడవైన నీవు నాకు తెలుపుము. అను నారదుని మాటలు విని ఐదు ముఖములుగల మహాదేవుడు చిరునవ్వుతో నారదునకు పరబ్రహ్మస్వరూపమునిట్లు చెప్పనారంభించెను. మహాదేవా ఉవాచ - శ్రీమహాదేవుడిట్లు పలికెను - యద్యత్పృష్టం త్వయా వత్స నిగూఢం జ్ఞానముత్తమం | సుదుర్లభం చ వేదేషు పురాణషు చ నారద || 7 అహం బ్రహ్మా చ విష్ణుశ్చ శేషో ధర్మో మహాన్విరాట్ | సర్వం నిరూపితం బ్రహ్మన్ అస్మాభిః శ్రుతిభిర్మునే || 8 యద్విశేషణయుక్తం చ దృశ్యం తత్ప్రత్యక్షమేవ చ | తన్నిరూపితమస్మాభిర్వేదే వేదవిదాం వర || 9 వైకుంఠే చ పురౌ పృష్ఠే ధర్మేణ బ్రహ్మణా తదా| యదువాచ హరిః కించిన్నిబోధ కథయామి తే || 10 సారభూతం చ తత్వానామజ్ఞానాంధక లోచనం | ద్వైధభ్రమ తమో ధ్వంస సుప్రకృష్ట ప్రదీపకం || 11 వత్స! నీవడిగినది చాల నిగూఢమైన ఉత్తమజ్ఞానము. ఆదిపురాణములలో వేదాలలో కూడా కనిపించనిది. నేను బ్రహ్మదేవుడు, విష్ణువు, ఆదిశేషుడు, ధర్ముడు, మేమందరము, వేదములు దీనిని వివరించుటకు ప్రయత్నించితిమి. పరబ్రహ్మము, విశేషణయుక్తమైనది. దృశ్యము, ప్రత్యక్షమైనది. మేము వేదములో దీనిని వివరించితిమి. పూర్వము వైకుంఠములలో బ్రహ్మదేవుడు, ధర్ముడు ఇదే ప్రశ్నను వేయగా శ్రీహరి తెల్పిన విషయములను నీకు తెలుపుదును. ఇది తత్వములయొక్క సారము. అజ్ఞానముచే గుడ్డివారికి కన్నులవంటిది. ద్విధా భ్రమమనే చీకటిని పారద్రోలు గొప్పదీపము. పరమాత్మ స్వరూపం చ పరం బ్రహ్మ సనాతనం | సర్వదేహస్థితం సాక్షి స్వరూపం దేహి కర్మణాం || 12 ప్రాణాః పంచ స్వయం విష్ణుః మనో బ్రహ్మా ప్రజాపతిః | సర్వజ్ఞాన స్వరూపోzహం శక్తిః ప్రకృతిరీశ్వరీ || 13 ఆత్మాధీనా వయం సర్వే స్థితే తస్మిన్ వయం స్థితాః | గతే గతాశ్చ పరమే నరదేవమివానుగాః || 14 జీవస్తత్ర్పతిబింబం చ సర్వభోగీ హి కర్మణాం | యథార్క చంద్రయోర్బింబం జలపూర్ణఘటేషు చ || 15 బింబం ఘటేషు భ##గ్నేషు ప్రలీనం చంద్రసూర్యయోః | తథా లయప్రసంగే స జీవో బ్రహ్మాణి లీయతే || 16 ఏకమేవ పరం బ్రహ్మ శేషే వత్స భవక్షయే | వయం ప్రలీనాస్తత్రైవ జగదేతచ్చరాచరం || 17 తచ్చ జ్యోతిః స్వరూపం మండలాకారమేవ చ | గ్రీష్మమధ్యాహ్న మార్తండ కోటికోటి సమప్రభం || 18 ఆకాశమివ విస్తీర్ణం సర్వవ్యాపకమవ్యయం | సుఖదృశ్యం యథా చంద్రబింబం యోగిభిరేవ చ || 19 పరబ్రహ్మ సనాతనమైనది. పరమాత్మ స్వరూపము కలది. అన్ని దేహములలో ఉండి ఆయా జీవులు చేయు కర్మలకు సాక్షిగా ఉండునది. శ్రీవిష్ణువు జీవునియొక్క పంచప్రాణస్వరూపుడు, ప్రజాపతియైన బ్రహ్మదేవుడు మనో రూపుడు. నేను జ్ఞానస్వరూపుడను. సర్వేశ్వరియైన శక్తి ప్రకృతి స్వరూపిణి. మేమందరము ఆ పరమాత్మకు ఆధీనులము. అతడు ఉన్నచోట మేముందుము. అతడు అక్కడినుండి జరిగినచో మేముకూడా రాజువెంటపోవు అనుచరట్లు పోదుము. జీవాత్మ ఆ పరమాత్మయొక్క ప్రతిబింబము. అతడు తాను చేసిన కర్మఫలితములనన్నిటిని అనుభవించును. సూర్యచంద్రుల ప్రతిబింబము నీటితోనిండిన కడవలలో కన్పించినట్లే పరమాత్మ ప్రతిబింబమైన జీవాత్మ ఆతడున్న చోట ఉండును. కుండలు పలిగిపోయినచో సూర్చచంద్రుల ప్రతిబింబములు మాయమైనట్లే లయ కాలమున జీవాత్మలు పరమాత్మలో విలీనమగును. పరబ్రహ్మము ఒక్కటే ప్రళయకాలమున ఈ చరాచర జగత్తు, మేమందరము ఆ పరబ్రహ్మలోనే విలీనమగుదుము. ఆ పరబ్రహ్మము, గ్రీష్మకాల మధ్యాహ్నమున కన్పించు కోటికోట్ల సూర్యుల కాంతితో సమానమైన మండలాకారమున నున్న జ్యోతిః స్వరూపము. అది ఆకాశమువలె సర్వత్ర వ్యాపించియున్నది. అట్లే ఆ పరమాత్మను యోగులు చంద్రబిబమును చూచినట్లు తేలికగా చూతురు. వదంతి యోగినస్తత్ర పరంబ్రహ్మ సనాతరం | దివానిశం చ ధ్యాయంతే సత్యం తత్సర్వం మంగళం || 20 నిరీహం చ నిరాకారం పరమాత్మానమీశ్వరం | స్వేచ్ఛామయ స్వతంత్రం చ సర్వకారణకారణం || 21 పరమానందరూపం చ పరమానంద కారణం | పరం ప్రధానం పురుషం నిర్గుణం ప్రకృతేః పరం | తత్రైవ లీనా ప్రకృతిః సర్వబీజస్వరూపిణీ || 22 యథాగ్నౌ దాహికా శక్తిః ప్రభాసూర్యే యథామునే | యథా దుగ్ధే చ ధావళ్యం జలేశైత్యం యథైవ చ || 23 యథా శబ్దశ్చగగనే యథాగంధః క్షితౌ సదా | తథాహి నిర్గుణం బ్రహ్మ నిర్గుణా ప్రకృతిస్తథా || 24 స్పష్ట్యున్ముఖేన తద్ బ్రహ్మ చాంశేన పురుషః స్మృతః | స ఏవ సగుణోవత్స ప్రాకృతో విషయీస్మృతః || 25 త్రిగుణా సాహి తత్రైవ పరా ఛాయామయీ స్మృతా || 26 యథామృదా కులాలశ్చ ఘటంకర్తుం క్షమః సదా | తథా ప్రకృత్యా తద్ బ్రహ్మం సృష్టిం స్రష్టుం క్షమో మునే || 27 యోగులు ఆ పరబ్రహ్మను సనాతనుడుగా పేర్కొనుచున్నారు. సత్వస్వరూపుడు, సర్వమంగళ స్వరూపుడైన ఆ పరమాత్మను యోగులు రాత్రింబవళ్ళు ఎల్లప్పుడు ధ్యానము చేయుచునందురు. ఆ పరబ్రహ్మ నిరీహుడు, నిరాకారుడు, స్వేచ్ఛామయుడు, స్వతంత్రుడు. సమస్త కారణములకు కారణమైనవాడు. ప్రధానమైనవాడు. పురుషుడు, ప్రకృతికంటే శ్రేష్ఠుడు. సమస్తమునకు కారణమైన ప్రకృతి ఆ పరమాత్మయందే విలీనమగుచున్నది. అగ్నికి దాహకశక్తి, సూర్యునికి కాంతి, పాలకు తెలుపుదనము, నీటికి చల్లదనము, ఆకాశమునకు శబ్దము, భూమికి గంధము ఎట్లు సహజమైనవో అట్లే పరబ్రహ్మమునకు, ప్రకృతికి నిర్గుణవ్వము సహజము. సృష్టిని చేయవలనని కోరికగల పరమాత్మయొక్క అంశ##మే పురుషుడు, అతడు సగుణస్వరూపుడు. సత్వ, రజస్తమస్సులనే త్రిగుణాత్మకమైన ప్రకృతి ఆ పురుషునకు నీడవంటిది. కుమ్మరి మట్టితో కుండలను చేసినట్లు పరబ్రహ్మ స్వరూపుడైన ఆ పురుషుడు ప్రకృతిద్వారా సృష్టిని చేయుచున్నాడు. స్వర్ణేన కుండలం కర్తుం స్వర్ణకారః క్షమోయథా | తథా బ్రహ్మా తయాసార్థం సృష్టిం కర్తుమిహేశ్వరః || 28 కులాల సృష్టా న చ మృత్ నిత్యా చైవ సనాతనీ | న స్వర్ణకార స్పష్టం తత్‌స్వర్ణం వా నిత్యమేవ చ || 29 నిత్యం తత్పరమం బ్రహ్మ నిత్యా చ ప్రకృతిః స్మృతా | ద్వయోః సమంచ ప్రాధాన్యమితి కేచిత్ వదంతి హి || 30 మృదం స్వర్ణం సమాహర్తుం కులాల స్వర్ణకారకౌ| న సమర్థౌ చ మృత్ స్వర్ణం తయోరాహరణ క్షమం || 31 తస్మాత్తత్ర్పకృతేర్బ్రహ్మ పరమేవ చ నారద | ఇతి కేచి ద్వదంత్యేవం ద్వయైర్వై నిత్యతా ధ్రువం || 32 కేచిద్వదంతి తద్ర్బహ్మ స్వయం చ ప్రకృతిః ప్రమాన్ | బ్రహ్మతిరిక్తా ప్రకృతిర్వదంతీతి చ కేచన || 33 తద్ర్బహ్మ పరమం ధామ సర్వకారణకారణం | తద్ర్బహ్మ లక్షణం బ్రహ్మన్నిదం కించిత్ శ్రుతౌ శ్రుతం || 34 బ్రహ్మచాత్వా చ సర్వేషాం నిర్లిప్తం సాక్షిరూపి చ | సర్వవ్యాపి చ సర్వాది లక్షణం చ శ్రుతౌ శ్రుతం || 35 తద్ర్బహ్మ శక్తిః ప్రకృతిః సర్వబీజ స్వరూపిణీ | యతస్తచ్ఛక్తిమత్ బ్రహ్మ చేదం ప్రకృతి లక్షణం || 36 తేజోరూపం చ తద్ర్బహ్మ ధ్యాయంతే యోగినః సదా | వైష్ణవాస్తన్నమన్యంతే మద్భక్తాః సూక్ష్మబుద్ధయః || 37 తత్తేజః కస్య నాశ్చర్యం ధ్యాయంతే పురుషం వినా | కారణన వినా కార్యం కుతో వా ప్రభ##వేద్భువి || 38 కంసాలివాడు బంగారముతో నగలనెట్లు చేయునో అట్లే పరబ్రహ్మ ప్రకృతితో సృష్టిని చేయుచున్నాడు. కుమ్మరివాడు మట్టిని సృష్టించకపోయినను, ఆ మట్టి నిత్యమైనది. అట్లే స్వర్ణకారుడు బంగారమును సృష్టించకపోయినను అది అంతకుముందు కూడా ఉన్నట్టిదే. ఈ విధముగా ప్రకృతి, పరబ్రహ్మలగూర్చి బాగుగా విచారించిన కొందరు పరబ్రహ్మ, ప్రకృతి రెండుకూడ నిత్యమైనవి అని, ఆ రెంటికి సమానమైన ప్రాధాన్యమునిత్తురు. కుమ్మరివాడు, స్వర్ణకారుడు మట్టి, బంగారముకంటే ఏ విధముగా ఉత్కృష్ణులో అట్లే పరబ్రహ్మ ప్రకృతికంటెను ఉత్కృష్టుడు. కాని కొందరు పరబ్రహ్మచే ప్రకృతి పురుషులుగా ఏర్పడినట్లు తెల్పుదురు. మరికొందరు ప్రకృతి పరబ్రహ్మ వేరువేరందురు. ఓ నారదా! సమస్తకారణములకు కారణభూతమైన పరబ్రహ్మను గూర్చి కొంత వేదములలో చెప్పబడినది. పరబ్రహ్మ అన్ని జీవులకు ఆత్మ, దానికి వికారములేవియు లేవు. పైగా జీవులు చేయు అన్ని కర్మలకు సాక్షిభూతమైనది, అంతట వ్యాపించియున్నది, అన్నటికిని అదే మూలమని వేదములో చెప్పబడినది. అన్నిటికి కారణరూపమైన ప్రకృతి ఆ పరబ్రహ్మము యొక్క శక్తి స్వరూపిణి. ఆ ప్రకృతి వలననే పరబ్రహ్మము శక్తిమంతమగుచున్నది. యోగులు పరబ్రహ్మను తేజః స్వరూపముగా భావించి ధ్యానింతురు. కాని నా భక్తులు, వైష్ణవులు పరబ్రహ్మను తేజః స్వరూపమని తలపరు. ధ్యాయంతే వైష్ణవాస్తస్మాత్తత్ర రూపం మనోహరం | స్వేచ్ఛామయస్య పుంసశ్చ సాకారస్యాత్మనః సదా || 39 తత్తేజోమండలాకారే సూర్యకోటి సమప్రభే | నిత్యం స్థలం చ ప్రచ్ఛనం గోలోకాభిధమేవ చ || 40 లక్షకోట్యా యోజనానాం చతురస్రం మనోహరం | రత్నేంద్ర సార నిర్మాణౖః గోపీభిశ్చావృతం సదా || 41 సుదృశ్యం వర్తులాకారం యథా చంద్రస్య మండలం | నానారత్నైశ్చ ఖచితం నిరాధారం తదిచ్ఛయా || 42 ఊర్ధ్వం చ నిత్యవైకుంఠాత్ పంచాశత్‌కోటియోజనం | గో గోప గోపీ సంయుక్తం కల్పవృక్ష సమన్వితం || 43 కామధేనుభిరాకీర్ణం రాసమండలమండితం | బృందావన వనాచ్ఛన్నం విరజావేష్టితం మునే || 44 శతశృంగం శాతకుంభైః సుదీప్తం శ్రీమదీప్సితం | లక్షకోట్యాపరిమితైః ఆశ్రమైః సుమనోహరైః || 45 శతమందిరసంయుక్తమాశ్రమం సమనోహరం | ప్రాకారపరిఖాయుక్తం పారిజాత వనాన్వితం || 46 కౌస్తుభేంద్రేణ మణినా రాజితం పరమోజ్వలం | హీరసార సుసంక్లుప్త సోపానైశ్చాతిసుందరైః || 47 మణీంద్రసారరచితైః కవాటైర్దర్పణాన్వితైః | నానాచిత్ర విచిత్రాద్యైరాశ్రమం చ సుసంస్కృతం || 48 వైష్ణవులు పరబ్రహ్మ ఉండుచోటగల తేజస్సును చూచి పురుషుడు లేకుండ ఈ తేజస్సు ఎట్లు వచ్చునని భావింతురు. అందువలన వారు స్వేచ్ఛామయుడైన ఆ పరమపురుషుని మనోహరమైన రూపమును ధ్యానింతురు. కోటిసూర్యులతో సమానమైన కాంతిగల, మండలాకారముననున్న ఆ తేజస్సు మధ్య గోలోకమనునది ప్రచ్ఛనముగానున్నది. అది లక్షకోట్ల యోజనాల వైశాల్యముకలది. రత్నములు, ఇంద్రనీలమణులు గల భవనములు కలది. సదా గోపికలతో ఆ ప్రాంతము నిండియుండును. ఆ గోలోకమున చంద్రమండలమువలె గుండ్రముగా వైకుంఠమునకు ఏబడి యోజనముల దూరములో అనేక రత్నములతో నిర్మింపబడిన భవనముగల ప్రాంతముకలదు. అచ్చట గోవులు, గోపులు, గోపికలుందురు. కల్పవృక్షములుగల బృందావనము, విరజానది ఉండును. బంగారముతో నిండిన శతశృంగములతో మిక్కిలి అందమైన లక్షకోటి ఆశ్రమములున్నవి. ప్రాకారములు, పరిఖ, పారిజాతవనములు ఉన్నవి. అచ్చట కౌస్తుభమణితో ప్రకాశించు గృహరాజము కలదు. దానిమెట్లు మణులతో నిర్మింపబడినవి. ద్వారములు కూడ శ్రేష్ఠమైన మణులతో కూడుకొని యున్నవి. చిత్రవిచిత్రములైన అనేకములైన అద్దములతో అది చాలా శోభాయమానముగానుండును. షోడశద్వార సంయుక్తం సుదీప్తం రత్నదీపకైః | రత్నసింహాసనే రమ్యే మహార్ఘమణి నిర్మితే || 49 నానాచిత్ర విచిత్రాఢ్యే వసంతం పరమీశ్వరం | నవీర నీరదశ్యామం కిశోరపయసం శిశుం || 50 శరన్మధ్యాహ్న మార్తండ ప్రభామోచక లోచనం | శరత్పార్వణపూర్ణేందు శుభదీప్తిమదాననం || 51 కోటికందర్ప లావణ్య లీలానిందిత మన్మథం | కోటిచంద్రప్రభాజుష్టం పుష్టం శ్రీయుక్త విగ్రహం || 52 సుస్మితం మురళీహస్తం సుప్రశస్తం సుమంగళం | పరమోత్తమ పీతాంశుక యుగేన చ సముజ్వలం || 53 చందనోత్‌క్షిత సర్వాంగం కౌస్తుభేన విరాజితం | ఆజానుమాలాతీమాల వనమాలా విభూషితం || 54 త్రిభంగ భంగ్యా సంయుక్తం మణిమాణిక్య భూషితం | మయూరపిచ్ఛ చూడం చ సద్రత్న మకుటోజ్జ్వలం || 55 రత్నకేయూరవలయ రత్నమంజీర రంజితం | రత్నకుండల యుగ్మేన గండస్థలసుశోభితం || 56 ముక్తా పంక్తి సదృక్షాభ ధనం సుమనోహరం | పక్వబింబాధరోష్టం చ నాసికోన్నతి శోభితం || 57 వీక్షితం గోపికాభిశ్చ వేష్టితాభి స్సమంతతః | స్థిర ¸°వనయుక్తాభిః సస్మితాభిశ్చసాదరం || 58 భూషితాభిశ్చ సద్రత్న నిర్మితైర్భూషణౖః పరం | సురేంద్రైశ్చ మునీంద్రైశ్చ మునిభిర్మానవేంద్రకైః || 59 బ్రహ్మవిష్ణు శివానంత ధర్మాద్యైర్వందితం ముదా | భక్తప్రియం భక్తనాథం భక్తానుగ్రహకారకం || 60 రాసేశ్వరం సురసికం రాధావక్షస్థలస్థితం | ఏవం రూపం ఆరూపం తం మూనే ధ్యాయంతి వైష్ణవాః || 61 ఆ భవనమునకు పదునారు ద్వారములున్నవి. రత్న నిర్మితములైన దీపములతో అది చక్కగా ప్రకాశించును. అచ్చట చిత్రవిచిత్రములతో ఉన్న గొప్ప విలువైన రత్న సింహాసనమున పరమాత్మ కూర్చొనియుండును. అతడు నూతన మేఘమువలె నల్లనివాడు. కిశోరవయస్కుడు. అతని కండ్లు శరత్కాలమందలి మధ్యాహ్న సూర్యుని కాంతివంటి కాంతిగలవి. అతని ముఖము శరత్కాలపు పున్నమిచంద్రుని వంటి కాంతిగలది. అతడు కోటి మన్మథుల లావణ్యము గలవాడు. కోటిచంద్రుల కాంతిగలవాడు. అతడు చిరునవ్వుతో, చేతితో మురళిని, పరమోత్తమమయిన పట్టు వస్త్రములను ధరించును. అతని శరీరమునిండ శ్రీచందనముండును. కౌస్తుభమనే మణితో, మోకాళ్ళవరకున్న మాలతీపుష్పముల వనమాలతో, మణిమాణిక్య భూషణములతో, శిరస్సున మయూరపింఛముతో రత్నమయమైన కిరీటముతో, రత్నములతో చేయబడిన దండె కండియములతో, రత్నమంజీరములతో, రత్నకుండలములతో అతడుండును. అతని ఆకారము త్రిభంగిమగానుండును. పలువరుస ముత్యాలవరుసవలె ఉండును. పెదవులు దొండపండువలె ఉండును. ముక్కు ఉన్నతమైనది. అతడెల్లప్పుడు మంచిరత్న భూషణములు, చిరునవ్వుతోనున్న ముఖములు కల గోపికలతో నుండును. ఇంకను అతడు బ్రహ్మాదిదేవతలు మునీంద్రులు నరశ్రేష్ఠులచే నమస్కారములనందుకొనుచుండును. ఆతడు భక్తులకు నాథుడు భక్తులననుగ్రహించువాడు. భక్తులను ప్రేమగా చూచుకొనువాడు. రాధాదేవి వక్షస్థలముపైనుండు రాసేశ్వరుడు. రసికుడు. ఇటువంటి ఆ పరమాత్మరూపమును వైష్ణవులెల్లప్పుడు తమ మనస్సులలో ధ్యానింతురు. కానీ ఆ పరమాత్మను రూపరహితుడుగా తలంపరు. సతతం ధ్యేయమస్మాకం పరమాత్మానమీశ్వరం | అక్షరం పరమం బ్రహ్మ భగవంతం సనాతనం || 62 స్వేచ్ఛామయం నిర్గుణం చ నిరీహం ప్రకృతేః పరం | సర్వాధారం సర్వభీజం సర్వజ్ఞం సర్వమేవ చ || 63 సర్వేశ్వరం సర్వపూజ్యం సర్వసిద్ధికరం ప్రదం | స ఏవ భగవానాదిః గోలోకే ద్విభుజః స్వయం || 64 గోపవేషశ్చ గోపాలైః పార్షదైః పరివేష్టితః | పరిపూర్ణతమః శ్రీమాన్ శ్రీకృష్ణో రాధికేశ్వరః || 65 సర్వాంతరాత్మా సర్వత్ర ప్రత్యక్షః సర్వగః స్మృతః | కృషిశ్చ సర్వవచనో నకారశ్చాత్మవాచకః || సర్వాత్మాచ పరంబ్రహ్మ తేనకృష్ణః ప్రకీర్తితః || 66 కృషిశ్చసర్వవచనోనకారశ్చాదివాచకః | సర్వాదిపురుషోవ్యాపీ తేనకృష్ణఃప్రకీర్తితః || 67 ఆ పరమాత్మ మాకందరకు ధ్యానించతగినవాడు. ఆ పరబ్రహ్మ అక్షరస్వరూపుడు, సనాతనుడు, స్వేచ్ఛామయుడు, నిర్గుణుడు,కోరికలు లేనివాడు. ప్రకృతికన్నను శ్రేష్ఠుడు. అతడు సమస్తమునకు ఆధారమైనవాడు. సమస్తసృష్టికి కారణభూతుడు, సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు, సమస్తజీవులచే పూజింపదగినవాడు. సమస్తసిద్ధులను కలిగించువాడు. ఆ భగవంతుడు గోలోకమున రెండు భుజములతో, గోపాలురతో గొల్లవేషమున తన సహచరులతో కలిసియుండును. రాధాదేవికి ఈశ్వరుడైన ఆశ్రీకృష్ణుడు సర్వపరిపూర్ణుడు. అతడు అందరి అంతరాత్మలలోనుండును. అంతట ప్రత్యక్షమగును. అంతట తిరుగుచుండును. కృషియనగా సమస్తము. నకారము ఆత్మను తెలుపును. అందువలన కృష్ణుడనగా సర్వాత్ముడు పర బ్రహ్మస్వరూపుడు. అట్లే కృషియనగా సమస్తము. నకారము ఆదిని తెలుపును. అందువలన కృష్ణుడనగా అందరికి ఆదిపురుషుడు. సర్వత్ర వ్యాపించియున్నవాడని అర్థము. సఏవాంశేన భగవాన్‌వైకుంఠేచ చతుర్బుజః | చతుర్భుజైః పార్షదైసై#్తః ఆవృతః కమలాపతిః || 68 సఏవకళయావిష్ణుః పాతా చ జగతాంప్రభుః | శ్వేతద్వీపేసింధుకన్యాపతిరేవ చతుర్భుజః || 69 ఏతత్తే కథితం సర్వం పరబ్రహ్మస్వరూపకం | అస్మాకం చింతనీయం చ సేవ్యం వందితమీప్సితం || 70 ఆ పరమాత్మయే తన అంశముతో శ్వేతద్వీపమందలి వైకుంఠమున చతుర్భుజములు గల విష్ణుమూర్తిగా నాల్గుభుజములుగల అనుచరులతో, లోకములను రక్షించుచున్నాడు. ఈ విధముగా మేమందరము సేవించుచున్న పరబ్రహ్మయొక్క స్వరూపును నీవు కోరినట్లు వివరించితిని. ఇత్యుక్త్వా శంకరస్తత్రవిరరామచ శౌనక | గంధర్వరాజస్తోత్రేణ తుష్టువే తంచ నారదః || 71 మునిస్తోత్రేణ సంతుష్టో భగవానాదిరచ్యుతః | జ్ఞానం మృత్యుజయస్తసై#్మప్రదదౌ వరమీప్సితం || 72 మునీంద్రస్తం ప్రణమ్య ప్రహృష్టవదనేక్షణః | తదాజ్ఞయా పుణ్యరూపం య¸° నారాయణాశ్రమం || 73 ఏవిధముగా శంకరుడు నారదునకు పరబ్రహ్మస్వరూపమును తెలుపగా నారదుడు, గంధర్వరాజునకు వసిష్ఠుడు ఉపదేశించిన నారాయణ స్తోత్రమును చేయగా అతడు సంతోషించెను. మృత్యుంజయుడైన శంకరుడు నారదునకు జ్ఞానమొసగగా అతడు సంతోషపడి శివునియొక్క ఆజ్ఞను తీసికొని పవిత్రమైన నారాయణాశ్రమమునకు వెడలిపోయెను. ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణ బ్రహ్మఖండే సౌతిశౌనక - సంవాదే బ్రహ్మస్వరూపవైకుంఠాదివర్ణనం నారదప్రస్థానం నామ అష్టావింశతి తమో೭ధ్యాయః || శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణమున సౌతిశౌనకమహర్షుల సంవాదముగల బ్రహ్మఖండమున బ్రహ్మస్వరూపవైకుంఠాది వర్ణనము, నారదుడు బయలుదేరుట అను అంశములు గల ఇరువది ఎనిమిదివ అధ్యాయము సమాప్తము.