sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters   

తృతీయోzధ్యాయః - సృష్టిక్రమ నిరూపణము

సౌతిరువాచ - సౌతి మహర్షి ఇట్లు పలికెను -

దృష్ట్యా శూన్యమయం విశ్వం గోలోకం చ భయంకరం | నిర్జంతు నిర్జలం ఘోరం నిర్వాతం తమసాzవృతం || 1

వృక్ష శైల సముద్రాది విహీనం వికృతాకృతం | నిర్ముక్తికం చ నిర్ధాతు నిఃసస్యం నిస్తృణం ద్విజ || 2

ఆలోచ్య మనసా సర్వం ఏక ఏవాసహాయవాన్‌ | స్వేచ్ఛయా స్రష్టుమారేభే సృష్టిం స్వేచ్ఛామయః ప్రభుః || 3

స్వేచ్ఛామయుడు, అసహాయుడు, ప్రభువునైన శ్రీకృష్ణుడు శూన్యమైన విశ్వము, భయంకరముగా నున్న గోలోకము జంతువులు, జలములు, వాయువు, వృక్షములు, పర్వతములు, సముద్రములు, ధాతువులు, సస్యములు, తృణములు లేక వికృతముగా ఉండగా సమస్తమును మనస్సులో ఆలోచించి స్వేచ్ఛతో సృష్టించుటకు ప్రారంభించెను.

ఆవిర్బభూవుః సర్గాదౌ పుంసో దక్షిణపార్శ్వతః | భవకారణరూపాశ్చ మూర్తిమంతస్త్రయో గుణాః || 4

తతోమహానహంకారః పంచతన్మాత్ర ఏవచ | రూపరసగంధస్పర్శ శబ్దాశ్చైవేతి సంజ్ఞకాః || 5

సృష్టియొక్క ప్రారంభసమయమున పరమపురుషుడైన శ్రీకృష్ణునియొక్క కుడిప్రక్క నుండి సంసారమునకు మూలహేతువులైన సత్వరజస్తమస్సులనే త్రిగుణములు పంచవింశతి తత్వములకు చెందిన మహత్తత్వము, అహంకారము, గంధ, రస, రూప, స్పర్శ, శబ్దములనే పంచ తన్మాత్రలు ఆకారమును ధరించి పుట్టినవి.

ఆవిర్బభూవ తత్పశ్చాత్‌ స్వయం నారాయణః ప్రభుః | శ్యామో యువా పీతవాసా వనమాలీ చతుర్భుజః || 6

శంఖచక్రగదాపద్మధరః స్మేరముఖాంబుజః | రత్నభూషణ భూషాఢ్యః శార్‌ఙ్గ కౌస్తుభభూషణః || 7

శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీనిధిః శ్రీవిభావనః | శారదేందు ప్రభామృష్ట ముఖేందు సుమనోహరః || 8

కామదేవ ప్రభామృష్ట రూపలావణ్య సుందరః | శ్రీకృష్ణ పురతః స్థిత్వా తుష్టావ తం పుటాంజలిః || 9

ఆ తర్వాత శ్యామమూర్తి, యువకుడు, పీతవస్త్రములు ధరించినవాడు, వనమాలను ధరించినవాడు, చతుర్భుజుడు, శంఖ, చక్ర, గధా, పద్మాయుధములు ధరించినవాడు చిరునవ్వుతో కూడిన ముఖపద్మము కలవాడు, రత్నభూషణములు, కౌస్తుభమణి, శార్‌ఙ్గమనే ధనుస్సు ధరించినవాడు, వక్షస్థలమున శ్రీవత్సము కలవాడు, లక్ష్మీనివాసుడు, శరత్కాల చంద్రుని కాంతిని మరుగుపరిచే ముఖచంద్రునివల్ల అందమైనవాడు, మన్మథుని అందముకన్న మిన్నయైన రూపలావణ్యము కలవాడు అగు నారాయణమూర్తి స్వయముగా ఆవిర్భవించెను. ఆ నారాయణమూర్తి శ్రీకృష్ణదేవుని ముందర నిలిచి చేతులు జోడించి ఇట్లు స్తుతించెను.

నారాయణ ఉవాచ- నారాయణుడు ఇట్లు పలికెను.

వరం వరేణ్యం వరదం వరార్హం వరకారణం | కారణం కారణానాంచ కర్మ తత్కర్మ కారణం || 10

తపస్తత్ఫలదం శశ్వత్తపస్వీశం చ తాపసం | వందే నవఘనశ్యామం స్వాత్మారామం మనోహరం || 11

నిష్కామం కామరూపంచ కామఘ్నం కామకారణం | సర్వం సర్వేశ్వరం సర్వబీజరూపమనుత్తమం || 12

వేదరూపం వేదభవం వేదోక్త ఫలదం ఫలం | వేదజ్ఞం తద్విధానం చ సర్వవేదవిదాం వరం || 13

శ్రేష్ఠుడు, ప్రధానమైనవాడు, వరములనిచ్చువాడు, వరముల నిచ్చుటకు అర్హుడు, కారణములకు కారణమైనవాడు, కర్మస్వరూపుడు, ఆయాకర్మలకు కారణభూతుడు, తపస్వరూపుడు, ఆయా తపస్సుల ఫలితమునిచ్చువాడు, సదా తపస్వి, ఈశుడు, నూతన మేఘమువలె నల్లనివాడు, స్వాత్మయందును ఉండువాడు, మనస్సును హరించువాడు, నిష్కాముడు, కామస్వరూపుడు, కామమును పోగొట్టువాడు, కోరికలకు కారణభూతుడు, సర్వస్వరూపి, సర్వేశ్వరుడు సమస్తమునకు కారణమైనవాడు, వేదరూపుడు, వేదవాచ్యుడు, వేదములందు చెప్పబడిన ఫలితములనిచ్చువాడు, ఫలస్వరూపుడు, సమస్త వేదములు తెలిసినవాడు, సమస్తవేదములు తెలిసినవారిలో శ్రుష్ఠుడును ఐన నిన్ను ఎల్లప్పుడు నేను ప్రార్థింతును.

ఇత్యుక్త్వా భక్తియుక్తశ్చ స ఉవాస తదాజ్ఞయా | రత్న సింహాసనే రమ్యే పురతః పరమాత్మనః || 14

ఈ విధముగా భక్తితోకూడుకున్న ఆ నారాయణుడు శ్రీకృష్ణపరమాత్మ ఆజ్ఞననుసరించి ఆ పరమాత్మకు ముందున్న రత్న సింహాసనమున కూర్చుండెను.

నారాయణకృతం స్తోత్రం యః పఠేత్సుసమాహితః | త్రిసంధ్యం యః పఠేన్నిత్యం పాపం తస్య నవిద్యతే || 15

పుత్రార్థీలభ##తే పుత్రం భార్యార్థీ లభ##తే ప్రియాం | భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం ధనం భ్రష్ట ధనో లభేత్‌ || 16

కారేగారే విపద్గ్రస్తః స్తోత్రేణానేన ముచ్యతే | రోగాత్ప్రముచ్యతే రోగీ ధ్రువం శ్రుత్వా చ సంయుతః || 17

శ్రీమన్నారాయణుడు చేసిన ఈ స్తోత్రమును శ్రద్ధాభక్తులతో నియమముతో గూడి త్రిసంధ్యలలో ఎవరు పఠింతురో, ఎవరు ఇతరులు చదువగా విందురో వారికి పాపమే ఉండదు. పుత్రులను కోరి ఈ స్తోత్రము చేసినచో, విన్నచో వారికి తప్పక పుత్రులు కలుగుదురు. భార్య (వివాహము) కావలెనను కొన్నచో భార్య లభించును. రాజ్యభ్రష్టునికి రాజ్యము లభించును. ధనహీనుడు ధనమును పొందును. ఆపదలలో ఉన్నా, కారాగారములో పడినా ఈస్తోత్రమువలన తప్పక విముక్తుడగును. రోగపీడుతుడైనా ఈ స్తోత్త్రశ్రవణమువల్ల రోగముల పోగొట్టుకొనును.

సౌతి రువాచ - సౌతిమహర్షి ఇట్లు పలికెను.

ఆవిర్బభూవ తత్పశ్చాదాత్మనో వామపార్శ్వతః | శుద్ధ స్ఫటిక సంకాశః పంచవక్త్రో దిగంబరః || 18

తప్తకాంచనవర్ణాభజటాభారధరో వరః | ఈషద్ధాస్య ప్రసన్నాస్యః త్రినేత్రశ్చంద్రశేఖరః || 19

త్రిశూలపట్టిశధరః జపామాలకరః పరః | సర్వసిద్ధేశ్వరః సిద్ధః యోగీంద్రాణాం గురోర్గురుః || 20

మృత్యోర్ముఋత్యురీశ్వరశ్చమృత్యుః మృత్యుంజయః శివః | జ్ఞానానందో మహాజ్ఞానీ మహాజ్ఞానప్రదః పరః || 21

పూర్ణచంద్రప్రభామృష్ణ ముఖదృశ్యో మనోహరః | వైష్ణవానాం చ ప్రవరః ప్రజ్వలన్‌ బ్రహ్మతేజసా || 22

శ్రీకృష్ణపురతః స్థిత్వా తుష్టావ తం పుటాంజలిః | పులకాంకిత సర్వాంగః సాశ్రునేత్రోzతిగద్గదః || 23

ఆ పరమాత్మ ఎడమభాగమున శుద్ధస్ఫటికమువలెనున్నవాడు, ఐదు శిరస్సులు కలవాడు దిగంబరుడు, మిక్కిలి పరిశుద్ధమైన బంగారు కాంతిగల జడలు ధరించినవాడు, చిరునవ్వుగల ముఖముతో నున్నవాడు, మూడు కన్నులవాడు, శిరస్సున చంద్రుడున్నవాడు, చేతిలో జపమాల కలవాడు, సమస్త సిద్ధులకు ఈశ్వరుడు, స్వయముగా సిద్ధుడు, యోగీంద్రులకు, గురువుకు గురువైనవాడు, మృత్యువుకు మృత్యువు, ఈశ్వరుడు, మృత్యుంజయుడు, శివస్వరూపుడు, జ్ఞానానందుడు, కాంతికన్న మిన్నయైన ముఖచంద్రుడు కలవాడు, విష్ణుభక్తులకెల్ల శ్రేష్ఠుడు అగుమహాదేవుడు బ్రహ్మతేజస్సుతో ప్రకాశించుచు శ్రీకృష్ణదేవునిముందు నిలిచి పులకించిన అవయవములు కలవాడై కన్నీళ్ళు కారగా మిక్కిలి గద్గద స్వరముతో ఆ పరమాత్మను ఇట్లు స్తోత్రము చేసెను.

మహాదేవ ఉవాచ- శ్రీమహాదేవుడు ఈవిధముగా అనెను.

జయ స్వరూపం జయదం జయేశం జయకారణం | ప్రవరం జయదానాంచ వందే తమపరాజితం || 24

విశ్వం విశ్వేశ్వరేశం చ విశ్వేశం విశ్వకారణం | విశ్వాధారం చ విశ్వస్తం విశ్వకారణ కారణం || 25

విశ్వరక్షాకారణం చ విశ్వఘ్నం విశ్వజం పరం | ఫలబీజం ఫలాధారం ఫలం చ తత్ఫలప్రదం || 26

తేజః స్వరూపం తేజోదం సర్వతేజస్వినాం వరం | ఇత్యేవముక్త్వా తం నత్వా రత్న సింహాసనే వరే |

నారాయణం చ సంభాష్య ఐస ఉవాస తదాజ్ఞయా || 27

జయస్వరూపుడు, జయమును కల్గించువాడు, జయేశుడు, జయకారకుడు, జయమును కల్గించువారిలో శ్రేష్ఠుడు, విశ్వస్వరూపుడు, విశ్వేశ్వరులకు ఈశ్వరుడు, విశ్వసృష్టికి కారకుడు, విశ్వమునకు ఆధారభూతుడు, విశ్వకారణ కారణుడు, ఈ ప్రపంచమును రక్షించువాడు, లయమును చేయువాడు, విశ్వమున పుట్టినవాడు, ఫలకారకుడు,ఫలమునకు ఆధారభూతుడు, ఫలస్వరూపుడు ఆ యా ఫలితముల నిచ్చువాడు, తేజఃస్వరూపుడు, తేజస్సును కలిగించువాడు, సమస్త తేజోవంతులలో శ్రేష్ఠుడు, అపరాజితుడు అగు శ్రీకృష్ణదేవుని నమస్కరింతును.

ఈ విధముగా స్తుతించి, ప్రక్కననున్న నారాయణమూర్తిని పలుకరించి, ఆ శ్రీకృష్ణదేవుని ఆజ్ఞననుసరించి శ్రేష్ఠమైన రత్నసింహాసనమున కూర్చుండెను. -

ఇతి శంభుకృతం స్తోత్రం యో జనః సంయతః పఠేత్‌ | సర్వసిద్ధిర్భవేత్తస్య విజయం చ పదే పదే || 27

సంతతం వర్ధతే మిత్రం ధనమైశ్వర్యమేవచ | శత్రుసైన్యం క్షయం యాతి దుఃఖాని దురితాని చ || 28

ఇతి బ్రహ్మవైవర్తే శంభుకృతం శ్రీకృష్ణస్తోత్రం || 29

మహాదేవుడు చేసిన ఈ శ్రీకృష్ణస్తోత్రమును ఎవరు నియమముతో చదువుదురో వారికి అన్ని సిద్ధులు కలుగును. ఎల్లప్పుడు విజయము కలుగుచుండును. స్నేహితులు, ధనము, ఐశ్వర్యము కూడ కలుగును. శత్రుసైన్యములు నశించును. దుఃఖము, పాపముకూడ నశించును.

బ్రహ్మవైవర్త పురాణములో శ్రీ శంభువు చేసిన శ్రీకృష్ణస్తోత్రము సంపూర్ణము.

సౌతిరువాచ - సౌతిమహర్షి ఇట్లనెను.

ఆవిర్భభూవ తత్పశ్చాత్‌ కృష్ణస్య నాభిపంకజాత్‌ | మహాతపస్వీ వృద్ధశ్చ కమండలుకరో వరః || 30

శుక్లవాసాః శుక్లదంతః శుక్లకేశశ్చతుర్ముఖః | యోగీశః శిల్పినామీశః సర్వేషాం జనకో గురుః || 31

తపసాం ఫలదాతా చ ప్రదాతా సర్వసంపదాం | స్రష్టా విధాతా కర్తా చ హర్తా చ సర్వకర్మణాం || 32

ధాతా చతుర్ణాం వేదానాం జ్ఞాతా వేదప్రసూపతిః | శాంతః సరస్వతీకాంతః సుశీలశ్చ కృపానిధిః || 33

శ్రీకృష్ణపురతః స్థిత్వా తుష్టాన తం పుటాంజలిః | పులకాంకిత సర్వాంగః భక్తి నమ్రాత్మ కంధరః || 34

ఆ తర్వాత శ్రీకృష్ణదేవుని నాభిపంకజమునుండి మహాతపస్వి, వృద్ధుడు, కమండలువు హస్తమున కలవాడు, శ్రేష్ఠుడు, తెల్లని బట్టలు, దంతములు, వెండ్రుకలు కలవాడు, యోగులకు, శిల్పులకు ఈశ్వరుడు, సమస్త ప్రాణికోట్లకు జనకుడు, గురుడు, తపః ఫలితములను, సర్వసంపదలను ఇచ్చువాడు, సృష్టికర్త, సమస్త కర్మలకు కర్త, విధాత, హర్త, నాల్గువేదములను తన ముఖములందు ధరించినవాడు, నాల్గువేదాలు తెలిసినవాడు, వేదములనుండి పుట్టినవాటికి అధిపతి, శాంతుడు, మంచివాడు, అధికదయకలవాడు, సరస్వతీదేవికి భర్తయైన చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భవించెను. ఆతడు శ్రీకృష్ణదేవుని ముందర నిలిచి చేతులు మొగిడ్చి, పులకించిన సమస్తశరీరముతో, భక్తితో వంగిన శిరస్సు కలవాడై ఇట్లు స్తుతించెను.

బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడు ఇట్లు పలికెను.

కృష్ణంవందే గుణాతీతం గోవిందమేకమక్షరం | అవ్యక్తమవ్యయం వ్యక్తం గోపవేషవిధాయినం || 35

కిశోరవయసం శాంతం గోపీకాంతం మనోహరం | నవీన నీరదశ్యామం కోటికందర్పసుందరం || 36

వృందావనవనాభ్యర్ణే రాసమండల సంస్థితం | రాసేశ్వరం రాసవాసం రాసోల్లాససముత్సుకం || 37

ఇత్యేవముక్త్వా తం నత్వా రత్నసింహాసనే వరే | నారాయణశౌ సంభాష్య స ఉవాస తదాజ్ఞయా || 38

గుణాతీతుడు, అద్వితీయుడు, నాశనములేనివాడు, వ్యక్తముకానివాడు, వ్యక్తుడు, వ్యయముకానివాడు, గోపవేషమును ధరించినవాడు, మనోహరుడు, నూతన మేఘమువలె నల్లనివాడు, కోటి మన్మథుల సౌందర్యము కలవాడు, బృందావనమున రాసమండలమున ఉన్నవాడు, రాసేశ్వరుడు, రాసవాసుడు, రాసక్రీడద్వారా ఉల్లాసము కలిగించువాడు, ఆవులకు ఆనందమును కలిగించు శ్రీకృష్ణ దేవుని నమస్కరింతును.

ఈ విధముగా శ్రీకృష్ణదేవుని స్తుతించి, సమీపముననున్న ఈశ్వరుని, నారాయణుని పలుకరించి ఆ కృష్ణదేవుని ఆజ్ఞపై రత్నసింహాసనమున కూర్చుండెను.

ఇతి బ్రహ్మకృతం స్తోత్రం ప్రాతరుత్థాయ యః పఠేత్‌ | పాపాని తస్యనశ్యంతి దుఃస్వప్నః సుస్వప్నో భ##వేత్‌ || 39

భక్తిర్భవతి గోవిందే శ్రీపుత్రపౌత్ర వర్ధినీ | అకీర్తిః క్షయ మాప్నోతి సత్కీర్తి ర్వర్ధతే చిరం || 40

ఇతి బ్రహ్మవైవర్తే బ్రహ్మకృతం శ్రీకృష్ణస్తోత్రం ||

బ్రహ్మదేవుడు చేసిన ఈ స్తోత్రాన్ని ఉదయమే లేచి ఎవరు చదువుతారో వారి పాపాలన్నీ తొలగిపోవును. దుస్వప్నములు కలుగక సుస్వప్నములే కలుగుచుండును. సంపదలు, పుత్రులు, పౌత్రులు కలిగించే గోవింద భక్తి కలుగును. అపకీర్తి నశించి సత్కీర్తి కలుగగలదు.

బ్రహ్మ వైవర్తపురాణములో బ్రహ్మదేవుడు చేసిన శ్రీకృష్ణస్తోత్రము సమాస్తము.

సౌతిరువాచ- సౌతిమహర్షి ఇట్లు పలికెను.

ఆవిర్బభూవ తత్పశ్చాద్వక్షసః పరమాత్మనః | సస్మితః పురుషః కశ్చిత్‌ శుక్లవర్ణో జటాధరః || 41

సర్వసాక్షీ చ సర్వజ్ఞః సర్వేషాం సర్వకర్మణాం | సమః సర్వత్ర సదయః హింసా కోపవివర్జితః || 42

ధర్మజ్ఞానయుతో ధర్మః ధర్మిష్ఠో ధర్మదో భ##వేత్‌ | స ఏవ ధర్మిణాం ధర్మః పరమాత్మా ఫలోద్భవః || 43

శ్రీకృష్ణపురతః స్థిత్వా ప్రణమ్య దండవద్భువి | తుష్టావ పరమాత్మానం సర్వేశం సర్వ కామదం || 44

ఆ తర్వాత పరమాత్మ వక్షస్థలమునుండి తెల్లనివాడు జడలను ధరించినవాడు, అన్నిటికి సాక్షీభూతుడు, సర్వజ్ఞుడు, అందరియందు, అన్ని కర్మలలో సమదృష్టి కలవాడు, దయ కలవాడు, హింస, కోపము వదలినవాడు, ధర్మజ్ఞానము కలవాడు, ధర్మపరాయణుడు, ధర్మస్వభావమును కలిగించువాడు, ధర్మవంతులకెల్ల ధర్మవంతుడు చిరునవ్వుకల ధర్ముడను పురుషుడుదయించెను. ఆ ధర్మదేవత శ్రీకృష్ణునిముందు దండప్రణామమొనరించి సర్వేశుడు, సమస్త కామితములనిచ్చు పరమాత్మను ఇట్లు నుతించెను.

శ్రీధర్మ ఉవాచ- ధర్మదేవత ఈవిధముగా అనెను-

కృష్ణం విష్ణుం వాసుదేవం పరమాత్మాన మీశ్వరం | గోవిందం పరమానందం ఏకమక్షరమచ్యుతం || 45

గోపేశ్వరం చ గోపీశం గోపం గోరక్షకం విభుం | గవామీశం చ గోష్ఠస్థం గోవత్సపుచ్ఛధారిణం || 47

ఇత్యుచ్చార్య సముత్తిష్ఠన్రత్నసింహాసనే వరే | బ్రహ్మవిష్ణుమహేశాంస్తాన్సంభాష్య స ఉవాస హ || 48

శ్రీకృష్ణుడు, విష్ణువు, వాసుదేవుడు, పరమాత్మ, ఈశ్వరుడు, గోవిందుడు, పరమానందుడు, అద్వితీయుడు, అక్షరుడు, అచ్చుతుడు, గోవులను కాచే గోపులకు నాథుడు, గోపికలకు నాథుడు, గోష్ఠమున ఉండువాడు, గోవత్స పుచ్ఛధారి, గో, గోప, గోపీ మధ్యస్థుడు, ప్రధానుడు, పురుషోత్తముడు అగు నిన్ను నమస్కరిస్తున్నాను.

అని స్తుతించి, సమీపముననున్న బ్రహ్మవిష్ణు శివులను పలుకరించి శ్రేష్ఠమైన రత్న సింహాసనమున కూర్చుండెను.

చతుర్వింశతి నామాని ధర్మవక్త్రోద్గతాని చ | యః పఠేత్ప్రాతరుత్థాయ స సుఖీ సర్వతో జయీ || 49

మృత్యుకాలే హరేర్నామ తస్యసాధ్యం లభేత్‌ ధ్రువం | సయాత్యంతే హరేః స్థానం హరిదాస్యం భ##వేత్‌ ధ్రువం || 51

తం దృష్ట్యా సర్వపాపాని పలాయంతే భ##యేన చ | భయానిచైవ దుఃఖాని వైనతేయమివోరగాః || 52

ఇతి బ్రహ్మవైవర్తే ధక్మకృతం శ్రీకృష్ణస్తోత్రం

ధర్మదేవత చెప్పిన ఈ ఇరువదినాల్గు నామములను ఉదయమే లేచి ఎవరు చదువుదురో వారు సుఖముగా ఉందురు. అన్నివిధముల జయము పొందుదురు. చనిపోవు సమయమున హరినామస్మరణ తప్పక చేయగులుగుదురు. ధర్మము ఎల్లప్పుడు అతనినంటియుండును. అధర్మముపై అభిరుచి ఎన్నడును కలుగదు. ధర్మార్థకామమోక్షములనే చతుర్వర్గ ఫలము అతని కరతలమున ఉండును. ఈ స్తోత్రము చదువువానిని చూచి సమస్తపాపములు, భయములు, దుఃఖములు గరుత్మంతుని చూచి పాములు పరుగెత్తినట్లు శీఘ్రముగ తొలగిపోవును.

బ్రహ్మవైవర్తపురాణమున ధర్మదేవత చేసిన శ్రీకృష్ణస్తోత్రము సమాప్తము,

సౌతిరువాచ- సౌతిమహర్షి ఇట్లనెను-

ఆవిర్బభూవ కన్యైకా ధర్మస్య వామపార్శ్వతః | మూర్తిర్మూర్తిమతీ సాక్షాత్‌ ద్వితీయా కమలాలయా || 53

ఆవిర్బభూవ తత్పశ్చాత్‌ ముఖతః పరమాత్మనః | ఏకాదేవి శుక్లవర్ణా వీణాపుస్తకధారిణీ || 54

కోటిపూర్ణేందుశోభాఢ్యా శరత్పంకజలోచనా వహ్నిశుద్ధాంశుకాధానా రత్నభూషణభూషిత || 55

సస్మితా సుదతీ శ్యామా సుందరీనాం చ సుందరీ | శ్రేష్ఠా శ్రుతీనాం శాస్త్రాణాం విదుషాం జననీ పరా || 56

వాగధిష్ఠాతృదేవీ సా కవీనామిష్టదేవతా | శుద్ధసత్వస్వరూపా చ శాంతరూపా సరస్వతీ || 57

గోవిందపురతః స్థిత్వా జగౌ ప్రథమతః సుఖం | తన్నామ గుణకీర్తిం చ వీణయా సా ననర్త చ || 58

కృతాని యాని కర్మాణి కల్పేకల్పే యుగే యుగే | తాని సర్వాణి హరిణా తుష్టావ సంపుటాంజలిః || 59

ఆ తర్వాత పరమాత్మయగు శ్రీకృష్ణునిముఖమునుండి ధర్మదేవత యొక్క ఎడమ భాగమున మూర్తీభవించిన రెండవ లక్ష్మివలె ఒక కన్య ఆవిర్భవించెను. అద్వితీయయగు ఆ దేవి శుక్లవర్ణము కలది. వీణను పుస్తకమును చేతులలో ధరించినది. కోటి పూర్ణచంద్రులవంటి కాంతికలది. శరత్కాలమందలి పద్మములవంటి కన్నులుకలది. బంగారు వన్నెగల చీరను, రత్నభూషణములను ధరించినది. చక్కని పలువరుసకలది. చిరునవ్వుతోనున్న ముఖముకలది. శ్యామ, సుందరాంగులలో సుందరి, వేదములకు, శాస్త్రములకు నిలయ, విద్వాంసులకు తల్లివంటిది. వాక్కుకు అధిష్ఠానదేవత, కవులకు చాలాప్రీతిపాత్రమైన దేవత, శుద్ధసత్వస్వరూప, శాంతరూపయగు సరస్వతి గోవిందుని ముందు నిలిచి భగవంతుని గుణములను కీర్తిని సుందరముగా పాడెను. తర్వాత ప్రతి కల్పమునందును యుగమునందును హరియొనరించిన కర్మలను చక్కగా తన వీణపై ఆలాపించి చేతులు జోడించుకొని ఇట్లు స్తుతించెను.

సరస్వత్యువాచ- సరస్వతీదేవి ఇట్లు పలికినది-

రాసమండలమధ్యస్థం రాసోల్లాస సముత్సుకం | రత్నసింహాసనస్థం చ రత్నభూషణ భూషితం || 60

రాసేశ్వరం రాసకరం వరం రాసేశ్వరీశ్వరం | రాసాధిష్ఠాతృదైవం చ వందే రాసవినోదినం || 61

రాసాయాసపరిశ్రాంతం రాసరాసవిహారిణం | రాసోత్సుకానాం గోపీనాం కాంతం శాంతం మనోహరం || 62

ప్రణమ్య చ తమిత్యుక్త్వా ప్రహృష్టవదనా సతీ | ఉవాస సా సకామా చ రత్నసింహాసనే వరే || 63

రాసమండల మధ్యభాగమున నున్నవాడు, రాసోల్లాస సముత్సుకుడు, రత్నసింహాసనమందున్నవాడు, రత్నభూషణ, భూషితుడు, రాసేశ్వరుడు, రాసకరుడు, రాసేశ్వరీశ్వరుడు, రాసలీలకు అధిష్ఠాన దైవము, రాసక్రీడా వినోది, రాస్రకీడయందలి ఆయాసమువల్ల పరిశ్రాంతినందినవాడు, శాంతమైనవాడు, అందమైనవాడు అని స్తుతించి నమస్కరించినది. పిమ్మట ఆ సరస్వతీ దేవి శ్రేష్ఠమైన రత్నసింహాసనమున పరమాత్మ ఆజ్ఞననుసరించి కూర్చొనినది.

ఇతివాణీ కృతం స్తోత్రం ప్రాత రుత్థాయ యః పఠేత్‌ | బుద్ధిమాన్‌ ధనవాన్‌ సోzపి విద్యావాన్‌ పుత్రవాన్సదా ఇతిబ్రహ్మవైవర్తే సరస్వతీకృతం శ్రీకృష్ణస్తోత్రం || 64

సరస్వతీదేవి చేసిన ఈ శ్రీకృష్ణస్తోత్రమును ఉదయముననే లేచి ఎవరు చదువుదురో వారు బుద్ధిమంతులు, ధనవంతులు, విద్యావంతులు, పుత్రవంతులు కాగలరు.

సౌతిరువాచ- సౌతిమహర్షి ఇట్లునుడివెను-

ఆవిర్బభూవ మనసః కృష్ణస్య పరమాత్మనః | ఏకాదేవీగౌరవర్ణా రత్నాలంకార భూషితా || 65

పీతవస్త్రపరీధానా సస్మితా నవ¸°వనా | సర్వైశ్వర్యాధిదేవీ సా సర్వసంపత్ఫలప్రదా || 66

సా హరేః పురతః స్థిత్వా పరమాత్మానమీశ్వరం | తుష్టాన ప్రణతా సాధ్వీ భక్తిమ్రాత్మకంధరా || 67

శ్రీకృష్ణదేవుని మనస్సునుండి రత్నాలంకారములు పీతాంబరము ధరించినది, చిరునవ్వుగల ముఖము కలది, నవ¸°వనవతి, సమసై#్తశ్వర్యములకు అధిదేవత, సమస్త సంపదల ఫలితములనిచ్చునది అగు ఒకదేవి విష్ణువుముందు నిలబడి భక్తిచే వంచిన తలకలదై నమస్కరించుచు స్తోత్రము చేసెను.

మహాలక్ష్మీరువాచ- మహాలక్ష్మి ఇట్లనెను

సత్యస్వరూపం సత్యేశం సత్యబీజం సనాతనం | సత్యాధానం చ సత్యజ్ఞం సత్యమూలం నమామ్యహం || 68

ఇత్యుక్త్వా శ్రీహరిం నత్వా సా చోవాస సుఖాసనే | తప్తకాంచనవర్ణాభా భాసయంతీ దిశస్త్విషా || 69

సత్యస్వరూపుడు, సత్యమునకు ఈశ్వరుడు, సత్యకారణుడు, సనాతనుడు, సత్యమునకు ఆధారభూతుడు, సత్యజ్ఞుడు, సత్యమూలుడు అగు శ్రీహరిని నమస్కరింతును అని శ్రీమహాలక్ష్మి స్వచ్ఛమైన బంగారమువంటి తన శరీర కాంతిచే అన్ని దిక్కులను ప్రకాశింపజేస్తూ శ్రీకృష్ణుని నమస్కరించి సుఖాసనమున కూర్చుండెను.

ఆవిర్బభూవ తత్పశ్చాత్‌ బుద్ధేశ్చ పరమాత్మనః | సర్వాధిష్ఠాతృదేవీ సా మూలప్రకృతిరీశ్వరీ || 70

తప్తకాంచనవర్ణాభా సూర్యకోటిసమప్రభా | ఈషద్ధాస్య ప్రసన్నాస్యా శరత్పంకజలోచనా || 71

రక్తవస్త్రపరీధానా రత్నాభరణ భూషితా | నిద్రాతృష్ణాక్షుత్పిపాసాదయాశ్రద్ధాక్షమాదికాః || 72

తాసాం చ సర్వశక్తీనామీశాధిష్ఠాతృదేవతా | భయంకరా శతభుజా దుర్గా దుర్గార్తి నాశినీ || 73

ఆత్మనః శక్తిరూపా సా జగతాం జననీ పరా | త్రిశూల శక్తిశార్‌ఙ్గం చ ధనుః ఖడ్గ శరాణి చ || 74

శంఖచక్రగదాపద్మమక్షమాలాం కమండలుం | వజ్రమంకుశపాశం చ భుశుండీ దండ తోమరం || 75

నారాయణాస్త్రం బ్రహ్మస్త్రం రౌద్రం పాశుపతం తథా | పార్జన్యం వారుణం వాహ్నం గాంధర్వం బిభ్రతీ సతీ | కృష్ణస్యపురతః స్థిత్వా తుష్టావ తం ముదాన్వితా || 76

ఆ తర్వాత శ్రీకృష్ణదేవుని బుద్ధినుండి సమస్తమునకు అధిష్ఠాతృదేవి, మూలప్రకృతి, ఈశ్వరి, మేలిమి బంగారు వంటి కాంతి కలది, కోటి సూర్యుల కాంతి కలది, చిరునవ్వు కల ముఖముకలది, శరత్కాల పద్మమువంటి కన్నులుకలది, ఎఱ్ఱని వస్త్రములు ధరించినది రత్నాభరణములు ధరించినది, నిద్ర, తృష్ణ, ఆకలిదప్పులు, దయ, శ్రద్ధ, క్షమ మొదలగు సర్వశక్తులకు అధిష్ఠాన దేవత, భయంకరమైనది, నూరు భుజములు కలది, కష్టసాధ్య, ఆర్తిని పోగొట్టునది, భగవంతుని శక్తిస్వరూప, లోకముల కన్నిటికి మాతృస్వరూప, త్రిశూలము, శక్తి శార్‌ఙ్గమనే ధనుస్సు, ఖడ్గము, బాణములు, శంఖము, చక్రము, గద, పద్మము, స్ఫటికమాల, కమండలువు, వజ్రము, అంకుశము, పాశము, భుశుండి, దండము, తోమరము, నారాయణాస్త్రము, బ్రహ్మాస్త్రము, రౌద్రాస్త్రము, పాశుపతాస్త్రము, వాయవ్యాస్త్రము, వారుణాస్త్రము, ఆగ్నేయాస్త్రము, గాంధర్వాస్త్రమును ధరించుచున్న ప్రకృతి (దుర్గ) శ్రీకృష్ణుని ముందుండి ముదముతో ఇట్లు స్తుతించెను.

ప్రకృతి రువాచ- ప్రకృతి (దుర్గ) ఇట్లు పలికెను.

అహం ప్రకృతి రీశానా సర్వేశా సర్వరూపిణీ | సర్వశక్తిస్వరూపాచ మయా శక్తిమజ్జగత్‌ || 77

త్వయా సృష్టా న స్వతంత్రా త్వమేవ జగతాం పతిః | గతిశ్చ పాతా స్రష్టా చ సంహర్తా చ పునర్విధిః || 78

స్రష్టుం స్రష్టా చ సంహర్తుం సంహర్తా వేధసాం విధిః | పరమానందరూపం త్వాం వందే చానంద పూర్వకం | చక్షుర్నిమేషకాలే చ బ్రహ్మణః పతనం భ##వేత్‌ || 79

తస్యప్రభావమతులం వర్ణితుం కః క్షమో విభో | భ్రూభంగ లీలా మాత్రేణ విష్ణుకోటిం సృజేత్తు యః || 80

చరాచరాంశ్చ విశ్వేషు దేవాన్‌ బ్రహ్మపురోగమాన్‌ | మద్విధాః కతివా దేవీః స్రష్టుం లీలయా || 81

పరిపూర్ణతమం స్వీడ్యం వందే చానందపూర్వకం | మహాన్విరాట్‌ యత్కలాంశో విశ్వ సంఖ్యాశ్రయో విభో | వందే చానందపూర్వం తం పరమాత్మాన మీశ్వరం || 82

యం చ స్తోతుమశక్తాశ్చ బ్రహ్మవిష్ణు శివాదయః | వేదా అహం చ వాణీ చ వందే తం ప్రకృతేః పరం || 83

వేదాశ్చ విదుషాం శ్రేష్ఠాః స్తోతుం శక్తాశ్చ న క్షమాః | నిర్లక్ష్యం కః క్షమంస్తోతుం తం నిరీహం నమామ్యహం || 84

ఇత్యేవముక్త్యా సా దుర్గా రత్నసింహాసనే వరే | ఉవాస నత్వా శ్రీకృష్ణం తుష్టువుస్తాం సురేశ్వరాః || 85

నేను ప్రకృతి స్వరూపిణిని, ఈశ్వరిని, సర్వేశ్వరిని, సమస్త రూపములు ధరించుదానను. సర్వశక్తి స్వరూపిణిని, నావలననే ఈ జగత్తంతా శక్తి కలిగి ఉన్నది. నేను నీచే సృష్టించబడిన దానను. అందువలననే స్వతంత్రురాలను కాదు. నీవే ఈలోకములకెల్ల ఈశ్వరుడవు. గమ్యుడవు, రక్షకుడవు, సృష్టికర్తవు, సంహారకారకుడవు, పునఃసృష్టికర్తవు. సృష్టికర్తలను సృష్టించువాడవు, సంహారకారకులను సంహరించువాడవు. పరమానంద స్వరూపుడవైన నిన్నునమస్కరింతును. నీ కనురెప్పపాటు కాలములో బ్రహ్మ నశించును. అట్టి నీ ప్రభావమును ఎవరు వర్ణింపగలరు. నీ కనుబొమల విరుపుతోనే కోటి సంఖ్యగల విష్ణువులను సృష్టించగలవు. మహత్స్వరూపము, విరాట్‌ స్వరూపము నీ కళలో ఒక చిన్న భాగము. పరిపూర్ణుడవు, పరమాత్మవు, ఈశ్వరుడవగు నిన్ను సంతోషముతో నమస్కరింతును. నిన్ను స్తుతించుటకు బ్రహ్మ విష్ణు శివాదిదేవతలు, వేదములు, నేను, సరస్వతి, గొప్ప విద్వాంసులు సైతము శక్తులు కారు. నిరీహుడవగు నిన్ను నేను నమస్కరిస్తున్నాను.

ఈ విధముగా దుర్గాదేవి శ్రీకృష్ణుని స్తుతించి, ఆ దేవునికి నమస్కరించి శ్రేష్ఠమైన రత్నసింహాసనమున కూర్చుండెను. దుర్గాదేవి చేసిన స్తోత్రమునకు దేవతలంతా సంతోషించి ఆమెను పొగిడినారు.

ఇతి దుర్గాకృతం స్తోత్రం కృష్ణస్య పరమాత్మనః | యః పఠే దర్చనా కాలే సజయీ సర్వతః సుఖీ || 86

దుర్గా తస్య గృహం త్యక్త్వా నైవ యాతి కదాచన | భవాబ్ధౌ యశసా భాతి యాత్యంతే శ్రీహరేః పురం || 87

శ్రీకృష్ణ పరమాత్మను గురించి దుర్గాదేవి చేసిన ఈ స్తోత్రమును పూజా సమయములో ఎవరు పఠిస్తారో వారు అన్ని స్థలములలోను జయమును పొందుదురు. సుఖమును పొందుదురు. ఆతని ఇంటిని దుర్గాదేవి వదలి ఎచ్చటికి పోదు. ఆతడు ఈజన్మలో కీర్తిని, మరణించిన తరువాత శ్రీహరి సాన్నిధ్యాన్ని పొందును.

ఇతి శ్రీబ్రహ్మ వైవర్తే మహాపురాణ బ్రహ్మఖండే సౌతి శౌనక సంవాదే సృష్టి నిరూపణ దుర్గాస్తోత్రం నామ తృతీయోzధ్యాయః

శ్రీ బ్రహ్మ వైవర్తమహాపురాణములో సౌతి శౌనక సంవాద రూపమగు బ్రహ్మ ఖండమున 'సృష్టినిరూపణ' సమయమున దుర్గాదేవి చేసిన శ్రీకృష్ణ స్తోత్రము కల

మూడవ అధ్యాయము సమాప్తము.

sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters