sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters   

త్రింశత్తమోధ్యాయః - భగవత్‌స్తుతి, అతని స్వరూపముల వివరణ

శ్రీనారాయణవాచ - శ్రీనారాయణుడు ఇట్లు పలికెను -

లంబోదరో హరి రుమాపతిరీశ శేషా బ్రహ్మాదయః సురగణా మనవో మునీంద్రాః |

వాణిశివా త్రిపథగా కమలాదికాశ్చ సం చింతయేద్భగవతః చరణారవిందం || 1

సంసారసాగరమతీవ గభీర ఘోరం దావాగ్ని సర్పపరివేష్టిత చేష్టితాంగం |

సంలఘ్య గంతుమభివాంఛతి యో హి దాస్యం సంచింతయేద్భగవతశ్చరణారవిందం || 2

గోవర్ధనోద్ధరణ కీర్తిరతీవ భిన్నా భూర్ధారితా చ దశనాగ్రత ఏవచార్ధా |

విశ్వాని లోమవివరేషు బిభర్తురాదేః సంచింతయేద్భగవతః చరణారవిందం || 3

వేదాంగ వేదముఖ నిఃసృతకీర్తిరంశైః వేదాంగ వేదజనకస్య హరేర్విధాతుః |

జన్మాంతకాది భయశోక విదీర్ణదేహః సంచింతయోద్భగవతశ్చరణారవిందం || 4

గోపాంగనా వదన పంకజ షట్పదస్య రాసేశ్వరస్య రసికారమణస్య పుంసః |

బృందావనే విహరతో వ్రజవేషవిష్ణోః సంచితయోద్భగవతశ్చరణారవిందం || 5

చక్షుర్నిమేషపతితో జగతాం విధాతా తత్కర్మ వత్స కధితుం భువి కః సమర్థః |

త్వంచాపి నారదమునే పరమాదరేణ సంచింతనం కురు హరేశ్చరణారవిందం || 6

శ్రీగణశుడు, శంకరుడు, బ్రహ్మదేవుడు మొదలైన దేవతాగణము స్వాయంభువాది మనువులు, మహర్షులు, లక్ష్మి, గంగ, గౌరి, సరస్వతి మొదలైన దేవతలందరు ఏ భగవంతుని ధ్యానింతురో అతనియొక్క పాదపద్మములను ధ్యానింపవలెను.

సంసారమను సాగరము చాలా లోతైనది. భయంకరమైనది. దానిని దాటిపోవుటకు మానవుడు ఎవరి దాస్యము చేయవలెనని కోరుకొనచున్నాడో ఆ భగవంతుని పాదపద్మములను ఎల్లప్పుడు ధ్యానింపవలెను.

శ్రీకృష్ణుడు తన చిన్నతనముననే గోవర్ధన పర్వతమునెత్తెనను మాట చాలా చిన్నది. తన ఒక పంటియొక్క చివర ఈ భూమండలమునంతయు ఎత్తెనను మాటకూడా సామాన్యమైనదే. ఈ విశ్వములన్నియు అతని రోమకూపములందు ఒదిగియున్నవి. అట్టి భగవంతునియొక్క పాదపద్మములను సంతతము ధ్యానింపవలెను.

జననము, మరణము, భయము, శోకము మొదలగు భావములచే శిథిలమైన దేహముకల మానవుడు వేదములు, వేదాంగములకు కారణులైన ఆ శ్రీకృష్ణుని చరణారవిందములను ఎల్లప్పుడు ధ్యానముచేయవలెను.

గోపికాస్త్రీలయొక్క ముఖపద్మములకు తుమ్మెదవంటివాడును, రాసేశ్వరుడు, రసికరమణుడు, బృందావనములో గోపవేషముతో తిరుగుచున్న శ్రీకృష్ణుని చరణారవిందములను సదా ధ్యానింపవలెను.

ఏ శ్రీ కృష్ణునియొక్క కనురెప్పపాటుతో ఈ జగముల సృష్టించు బ్రహ్మదేవుడు పడిపోవునో (చనిపోవునో) అతని చర్యలనన్నిటిని చెప్పుటకు ఎవ్వరు సమర్థులు కారు. అట్టి శ్రీహరి చరణారవిందములను మిక్కిలి గౌరవభావముతో నీవుకూడ ధ్యానింపుము.

యూయం వయం తస్య కలకలాంశాః కలాకలాంశా మనవో మునీంద్రాః |

కలావిశేషా భవసారముఖ్యాః మహాన్‌ విరాట్‌ యస్య కళావిశేషః ||7

సహస్రశీర్షా శిరసః ప్రదేశే బిభర్తి సిద్ధార్థసమం చ విశ్వం |

కూర్మే చ శేషో మశకో గజే యథా కూర్మశ్చ కృష్ణస్య కలాకలాంశః || 8

గోలోకనాథస్య విభోర్యశోzమలం శ్రుతౌపురాణ న హి కించన స్ఫుటం |

న పాద్మముఖ్యాః కథితుం సమర్థాః సర్వేశ్వరం తం భజ పాద్మముఖ్యం || 9

విశ్వేషు సర్వేషు చ విశ్వధామ్నః సంత్యేవ శశ్వద్విధివిష్ణురుద్రాః |

తేషాం చ సంఖ్యాః శ్రుతయశ్చ దేవాః పరం న జానంతి తమీశ్వరం భజ || 10

కరోతి సృష్టిం స విధేర్విధాతా విధాయ నిత్యాం ప్రకృతిం జగత్ప్రసూం |

బ్రహ్మాదయః ప్రకృతి కాశ్చ సర్వే భక్తిప్రదాం శ్రీప్రకృతిం భజంతి || 11

బ్రహ్మస్వరూపా ప్రకృతిర్నభిన్నా యయాచసృష్టిం కురుతే సనాతనః |

శ్రియశ్చసర్వాః కలయాజగత్సు మాయా చ సర్వే చ తయా విమోహితాః || 12

నారాయణీ సా పరమా సనాతనీ శక్తిశ్చ పుంసః పరమాత్మనశ్చ |

ఆత్మేశ్వరశ్చాపి యయా చ శక్తిమాంస్తయా వినాస్రష్టుమశక్త ఏవ || 13

మీరు మేము మనువులు మహర్షులు అందరు ఆ శ్రీకృష్ణుని యొక్క అంశాంశములే. మహద్విరాట్‌ స్వరూపము సైతము అతని కళావిశేషమే. వేయి తలలుగల శేషుడు ఈ భూమండలమును చిన్న ఆవగింజవలె మోస్తున్నాడు. ఆ శేషుని ఆదికూర్మము తన వీపుపై ఏనుగు దోమను మోయుచున్నట్లు మోయుచున్నది. అటువంటిది ఆదికూర్మము శ్రీకృష్ణునియొక్క చాలా చిన్ననైన అంశభాగము. విభుస్వరూపుడైన గోలోకనాథుని యొక్క నిర్మలమైన కీర్తి వేదములలలో పురాణములలో ఉన్నప్పటికిని విస్పష్టముగా మాత్రము కన్పించదు. ఆ శ్రీకృష్ణుని మహిమలను బ్రహ్మదేవుడు మొదలగువారు సైతము చెప్పలేరు. అందువలన సర్వేశ్వరుడైన ఆ శ్రీకృష్ణుని నీవు తప్పక సేవించుము.

అనంతమైన విశ్వములలో ఒక్కొక్క విశ్వములో బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు ప్రత్యేకముగానున్నారు. వారియొక్క సంఖ్యను, ఆ విశ్వముల సంఖ్యను దేవతలు వేదములు తెలిసికొనలేవు. అట్టి విశ్వములకన్నిటిని స్థానమైన ఆ పరమేశ్వరుని నీవు సేవింపుము. బ్రహ్మదేవునకు సైతము మూలకారణమైన ఆ శ్రీకృష్ణుని జగత్కారణమైన ప్రకృతిని సృష్టించి ఆ ప్రకృతిద్వారా సృష్టిచేయుచున్నాడు. బ్రహ్మాది దేవతలందరు ఆ ప్రకృతికి సంబంధించినవారే. అందువలన వారందరు ఆ పరమేశ్వరునిపై భక్తిని కలిగించు శ్రీప్రకృతిని సేవించుచున్నారు. అంతమాత్రమున సనాతనుడైన పరమేశ్వరుడు ఏ ప్రకృతిననుసరించి ఈ సృష్టి చేయుచున్నాడో ఆ ప్రకృతి పరబ్రహ్మ స్వరూప. ఆ ప్రకృతి, పరబ్రహ్మలిద్దరు అభిన్నులే, వారిమధ్య భేదములేదు. ఆ ప్రకృతియొక్క అంశవలననే సమస్త విశ్వములందున్న లక్ష్మీదేవతలు ఆవిర్భవించుచున్నారు. ఆ ప్రకృతి మాయారూపిణి. నారాయణి ఆత్మేశ్వరుడైన పరమాత్మయొక్క శక్తిస్వరూపిణి. ఆ పరమాత్మసైతము ఆ ప్రకృతివలననే శక్తికలవాడగుచున్నాడు. ఆమె లేనిదే ఇతడు సృష్టికార్యమును చేయుటకు అశక్తుడగుచున్నాడు.

గత్వా వివాహం కురు వత్స సాంప్రతం కర్తుంప్రయుక్తశ్చ పితుర్నిదేశః |

గురుర్నిదేశ ప్రతిపాలకో భ##వేః సర్వత్రపూజ్యో విజయీ చ సంతతం || 14

స్వపత్నీం పూజయే ద్యోహి వస్త్రాలంకారచందనైః | ప్రకృతిస్తన్య సంతుష్టా యథా కృష్ణో ద్విజార్చనే || 15

సా చ యోషిత్స్వరూపా చ ప్రతివిశ్వేషు మాయయా | యోషితామపమానేన పరాభూతా చ సా భ##వేత్‌ || 16

దివ్యాస్త్రీ పూజితా యేన పతిపుత్రవతీ సతీ | ప్రకృతిః పూజితా తేన సర్వమంగళదాయినీ || 17

మూలప్రకృతిరేకా సా పూర్ణబ్రహ్మ స్వరూపిణీ | వాగధిష్ఠాతృదేవీ యా సా చ పూజ్యా సరస్వతీ || 20

సావిత్రీ వేదమాతా చ పూజ్యరూపా విధేః ప్రియా | శంకరస్య ప్రియా దుర్గా యస్యాః పుత్రోగణశ్వరః || 21

ఓ నారదా! ఇంటికివెళ్ళి వివాహము చేసికొనుము. నీవిప్పుడు నీ తండ్రి ఆజ్ఞను పరిపాలింపవలసియున్నది. దానివలన తండ్రియాజ్ఞను నిర్వహించినవాడవు కాగలవు. అట్లే అంతట పూజ్యుడవై విజయివికూడా అగుదువు.

తన భార్యను వస్త్రములు, అలంకారములు, చందనాదులతో సంతృప్తిపరిచినచో, బ్రాహ్మణులను గౌరవించినచో శ్రీకృష్ణుడు సంతోషపడినట్లు ప్రకృతి చాలా సంతోషపడును.

ఆ ప్రకృతి స్త్రీ స్వరూప కావున స్త్రీలను అవమానించినచో ఆమెను అవమానించినట్లే యగును. పతివ్రత, భర్త, పిల్లలతోనున్న స్త్రీని గౌరవించినచో సర్వమంగళదాయిని యైన ప్రకృతిని పూజించనట్లగును. మూలప్రకృతి ఒక్కటే, ఆమె పూర్ణబ్రహ్మస్వరూపిణి. ఆమెను సనాతనియైన విష్ణుమాయ అని కూడ అందురు ఆమె సృష్టి జరుగునప్పుడు పంచభూతాత్మక అగుచున్నది.

ఆమె పరమాత్మయగు శ్రీకృష్ణునకు ప్రాణమువంటిది. సమస్త ప్రకృతులలో చాలా ఇష్టమైన ప్రకృతిని రాధయని అందురు.

సమస్త సంపదలకు ప్రతిరూపమైన లక్ష్మీదేవి నారాయణునకు ధర్మపత్ని. పూజ్యురాలైన సరస్వతి చదువులకు అధిష్ఠానదేవత. పూజ్యురాలు వేదమాతయైన సావిత్రి బ్రహ్మదేవుని పత్రి. శంకరుని భార్య దుర్గ. ఆమె పుత్రుడే గణశ్వరుడు.

ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణ బ్రహ్మఖండే సౌతిశౌనక సంవాదే భగవత్‌స్తుతి తత్స్వరూపవర్ణనం నామ త్రింశతమోధ్యాయః ||

శ్రీబ్రహ్మ వైవర్త మహాపురాణమున సౌతి శౌనక మహర్షుల సంవాదముగల బ్రహ్మఖండమున భగవంతుని స్తోత్రము అతని స్వరూపవర్ణనగల ముప్పదియవ అద్యాయము సమాప్తము.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ ప్రథమం బ్రహ్మఖండం సంపూర్ణం ||

శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణమున తొలిఖండమగు బ్రహ్మఖండము సమాప్తమైనది.

sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters