sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
శ్రీబ్రహ్మ వైవర్త మహాపురాణము ద్వితీయ ఖండము - ప్రకృతి ఖండము ప్రథమోzధ్యాయః - ప్రకృతి యొక్క స్వరూపబేద వర్ణన శ్రీ గణశాయనమః || శ్రీవేంకటేశ్వరాయనమః || శ్రీలక్ష్మీనరసింహాభ్యాం నమః | శ్రీ గణశునకు, శ్రీ వేంకటేశ్వరునకు, శ్రీలక్ష్మీ నరసింహులకు నమస్కారము. అథప్రకృతి ఖండ ప్రారంభః - ప్రకృతి ఖండము ప్రారంభింపబడుచున్నది. నారద ఉవాచ - నారద మహర్షి ఇట్లనెను - గణశజననీ దుర్గా రాధా లక్ష్మీః సరస్వతీ | సావిత్రీ వై సృష్టివిధౌ ప్రకృతిః పంచధా స్మృతా || 1 ఆవిర్బభూవ సా కేన కేవా సా జ్ఞానినాం వరా | కిం వా తల్లక్షణం బ్రూహి సాzభవత్పంచధా కథం || 2 సర్వాసాం చరితం పూజావిధానం కథమీప్పితం | అవతారం కుత్ర కస్యాః తన్మాం వ్యాఖ్యాతు మర్హసి || 3 సృష్టికి కారణమైన ప్రకృతి, గణశుని తల్లిగా దుర్గగా, రాధగా, లక్ష్మీదేవతగా, సరస్వతీదేవిగా సావిత్రీమాతగా ఐదు మూర్తులతో ఉన్నది కదా. ఆ ప్రకృతి ఎవరి వలన ఉద్భవించినది. ఆమె స్వరూపమేమి. ఐదు విధములుగా ఎందువలన మారినది. ప్రకృతి స్వరూపాలైన దుర్గాదిదేవతల కథను, వారి పూజా విధానమును, దాని వలన కలుగు ఫలితమును, ఆయా దేవతలు ఎక్కడ ఏవిధముగా అవతరించినారో వాటినన్నిటిని విస్తరించి నాకు తెలుపగలరు. నారాయణ ఉవాచ - నారాయణు డిట్లనెను- ప్రకృతేర్లక్షణం వత్స కోవా వక్తుం క్షమో భ##వేత్ | కించిత్తదాzపి వక్ష్యామి యత్ శ్రుతం ధర్మ వక్త్రతః || 4 ప్రకృష్టవాచకః ప్రశ్చ కృతిశ్చ సృష్టివాచకః| సృష్టౌ ప్రకృష్ఠా యాదేవి ప్రకృతిః సా ప్రకీర్తితా || 5 గుణ ప్రకృష్ట సత్వేచ ప్రశబ్దో వర్తతే శ్రుతౌ | మధ్యమే కృశ్చ రజసి తిశబ్దస్తమసి స్మృతః || 6 త్రిగుణాత్మస్వరూపా యా సర్వశక్తి సమన్వితా | ప్రధానా సృష్టికరణ ప్రకృతిస్తేన కథ్యతే || 7 ప్రథమే వర్తతే ప్రశ్చ కృతిః స్యాత్ సృష్టివాచకః | సృష్టేరాద్యా చ యా దేవి ప్రకృతిః సా ప్రకీర్తితా || 8 యోగేనాత్మా సృష్టివిధౌ ద్విధారూపో బభూవ సః | పుమాంశ్చ దక్షిణార్ధాంగో వామాంగః ప్రకృతిః స్మృతః || 9 సా చ బ్రహ్మ స్వరూపా స్యాన్మాయా నిత్యా సనాతనీ | యథాzత్మా చ యథాశక్తిః యథా zగ్నౌ దాహికా స్మృతా || 10 అత ఏవహి యోగీంద్రః స్త్రీం పుం భేదం నమన్యతే | సర్వం బ్రహ్మమయం బ్రహ్మన్ శశ్వత్పశ్యతి నారద || 11 స్వేచ్ఛామయస్యేచ్ఛయా చ శ్రీకృష్ణస్య సిసృక్షయా | సాzవిర్బభూవ సహసా మూల ప్రకృతిరీశ్వరీ || 12 నారదా! ప్రకృతి యొక్క స్వరూపమును చక్కగా ఎవరు కూడా చెప్పలేరు. ఐనప్పటికిని దర్ముని వలన విన్న విషయములను కొంత నీకు చెప్పెదను. ''ప్ర'' అనునది శ్రేష్ఠము అను నర్థము నిచ్చును. ''కృతి'' అనగా సృష్టి. సృష్టిలో శ్రేష్టురాలైన దేవతను ప్రకృతి యని అందురు. అట్లే 'ప్ర' అనునది ఉత్కృష్టమైన సత్వగుణమును సూచించును 'కృ' అనునది రజోగుణమును, 'తి' అనునది తమోగుణమును తెలుపుము. ఈ విధముగా సత్యరజస్తమోగుణ స్వరూఫిణి, సర్వశక్తి సమన్వితయైన ప్రకృతి, సృష్టి విషయమున ప్రధాన స్థానము వహించుచున్నందువలన ప్రకృతియని పేర్కొనబడినది. అదే విధముగా 'ప్ర' అనునది ప్రథమము అను అర్థమున ఉన్నందువలన సృష్టి అను అర్థము కృతి అను పదమునకు ఉన్నందువలన సృష్టిలో తొలుత ఉద్భవించిన దేనిని 'ప్రకృతి' అని అందురు. పరమాత్మ తన యోగశక్తివలన రెండు రూపములను ధరించెను. ఆ పరమాత్మయొక్క కుడిభాగము పురుషుడుగా, ఎడమ భాగము ప్రకృతిగా మారినవి. ఆ ప్రకృతి పరబ్రహ్మ స్వరూప, మాయా స్వరూపిణి, సనాతని. అగ్నికి మండేగుణమువలె ఆ ప్రకృతి పరబ్రహ్మయొక్క శక్తి స్వరూపిణి. అందువలననే యోగీంద్రులు సమస్తము బ్రహ్మమయమైనదను భావనవల్ల స్త్రీ పురుష బేధమును పరిగణింపరు. స్వేచ్ఛామయుడైన శ్రీకృష్ణుడు చరాచర జగత్తును సృష్టించవలెనని కోరుకున్నప్పుడు పరమేశ్వరియైన ''మూల ప్రకృతి'' పుట్టినది. తదాజ్ఞ యా పంచవిధా సృష్టికర్మణి భేదతః | అథ భక్తానురోధాద్వా భక్తానుగ్రహ విగ్రహా || 13 గణశమాతా దుర్గా యా శివరూపా శివప్రియా | నారాయణీ విష్ణుమాయా పూర్ణబ్రహ్మస్వరూపిణీ || 14 బ్రహ్మాది దేవైర్మునిభిః మనుభిః పూజితా సదా | సర్వాధిష్ఠాతృదేవి సా బ్రహ్మరూపా సనాతనీ || 15 యశోమంగళ ధర్మశ్రీ సత్య పుణ్య ప్రదాయినీ | మోక్ష హర్ష ప్రదాత్రీయం శోక దుఃఖార్తినాశినీ || 16 శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణా | తేజఃస్వరూపా పరమా తదధిష్ఠాతృదేవతా || 17 సర్వశక్తి స్వరూపా చ శక్తిరీశస్య సంతతం | సిద్ధేశ్వరీ సిద్ధరూపా సిద్ధిదా సిద్ధిదేశ్వరీ || 18 బుద్ధిర్నిద్రా క్షుత్పిపాసా ఛాయా తంద్రా దయాస్మృతిః | జాతిః క్షాంతిశ్చ శాంతిశ్చ కాంతిర్భ్రాంతిశ్చ చేతనా || 19 తుష్టిః పుష్టిస్తథా లక్ష్మీర్వృత్తిర్మాతా తథైవ చ | సర్వశక్తిస్వరూపా సా కృష్ణస్య పరమాత్మనః || 20 ఉక్తః శ్రుతౌ గుణశ్చాతిస్వల్పో యథాగమం | గుణో೭స్త్యనంతో೭నంతాయాః అపరాం చ నిశామయ || 21 శ్రీ కృష్ణుని యొక్క ఆజ్ఞవలన సృష్టికర్మకై మూలప్రకృతి ఐదు రూపములు ధరించినది. లేక భక్తుల యొక్క ప్రార్థన ననుసరించి కానిచో భక్తులననుగ్రహించుటకు ఐదు రూపములనామె ధరించినది. గణాధిపతియైన గణశుని తల్లియైన దుర్గాదేవి ప్రకృతియొక్క మొదటిరూపము. ఆ దుర్గ మంగళస్వరూప, శివునకు ప్రియమైన భార్య, ఆమెను నారాయణి యని, విష్ణుమాయ యని, పూర్ణ బ్రహ్మస్వరూపిణి యని పిలుతురు. సనాతని పరబ్రహ్మస్వరూపయగు ఆ దుర్గాదేవి బ్రహ్మాది దేవతలచే, మునులచే, మనువులచే ఎల్లప్పుడు పూజలనందుకొనును. ఆమె కీర్తిని, శుభములను, ధర్మమును, సంపదను, సత్యవాక్కును, పుణ్యమును, సంతోషమును మోక్షమును ఇచ్చును. దుఃఖశోకములను పోగొట్టును.శరణుపొందిన వారిని దీనులను, ఆర్తులను రక్షించు స్వభావము కలది. తేజః స్వరూప. సర్వశక్తి స్వరూప. బుద్ధి, నిద్ర, ఆకలి, దప్పి, నీడ, తంద్ర, దయ, స్మృతి, జాతి, క్షాంతి, శాంతి, కాంతి, భ్రాంతి, చేతన, తుష్టి,పుష్టి, లక్ష్మి, వృత్తి, మాత ఇవన్నియు ఆమె పేర్లే. ఆమె శ్రీకృష్ణపరమాత్మయొక్క సర్వశక్తి స్వరూపిణి. వేదములలో ఈమె గొప్పతనము చెప్పబడినను సంపూర్ణముగా మాత్రము అవి వివరింపలేక పోయినవి. అనంత యగునామె గుణములనంతములు. ఇక ప్రకృతి యొక్క ద్వితీయ రూపమును తెలుపుదును. శుద్ధ సత్వస్వరూపా యా పద్మా చ పరమాత్మనః | సర్వసంవత్స్వరూపా యా తదధిష్ఠాత్స దేవతా || 22 కాంతా దాంతాzతిశాంతా చ సుశీలా సర్వమంగళా | లోభాన్మోహాత్కామరోషాన్మదాహంకారతస్తథా || 23 త్వక్తాzనురక్తా పత్యుశచ సర్వాద్యా యా పతివ్రతా | ప్రాణతుల్యా భగవతః ప్రేమపాత్రీ ప్రియం సదా || 24 సర్వసస్యాత్మికా సర్వజీవనోపాయరూపిణీ | మహాలక్ష్మీశ్చ వైకుంఠే పతిసేవాపరాయణా || 25 స్వర్గే చ స్వర్గలక్ష్మీశ్చ రాజలక్ష్మీశ్చ రాజసు | గృహే చ గృహలక్ష్మీశ్చ మర్త్యానాం గృహీణాం తథా || 26 స్వర్గేషు ప్రాణి ద్రవ్యేషు శోభారూపా మనోహరా | ప్రీతిరూపా పుణ్యవతాం ప్రభారూపా నృపేషు చ || 27 వాణిజ్యరూపా వణిజాం పాపినాం కలహంకరీ | దయామయీ భక్తమాతా భక్తానుగ్రహకారికా || 28 చపలే చపలా భక్తసంపదో రక్షణాయ చ | జగజ్జీవన్మృతం సర్వం యయా దేవ్యా వినా మునే || 29 శక్తిర్ద్వితీయా కథితా వేదోక్తా సర్వసమ్మతా | సర్వపూజ్యా సర్వవంద్యా చాన్యాం మత్తో నిశామయ || 30 పద్మయగు లక్ష్మీదేవి శ్రీ కృష్ణ పరమాత్మయొక్క శుధ్ధ సత్వగుణ స్వరూప. సమస్త సంపదలకు ఆమె అధిష్ఠాన దేవత. ఆమె చాలా అందమైనది. పరమసంయమస్వరూప. మిక్కిలి శాంతస్వభావము కలది. సర్వమంగళ స్వరూపిణి. లోభ, మోహ, కామ, రోష, మదాహంకారములనే అరిషడ్వర్గమును జయించినది. అందరికంటే ముందు తన భర్తయైన నారాయణుని యొక్క అనురాగమును పొందినది. పతివ్రత. ఆమెను భగవంతుడైన శ్రీమన్నారాయణుడు తన ప్రాణములతో సమానముగా ప్రేమించును. ఆమె ఎల్లప్పుడు ప్రియమైన మాటలనే మాటాడును. సర్వసస్యాత్మిక యగు ఆ దేవి అన్ని ప్రాణులు సుఖముగా జీవించుటకు కారణమైనది. ఆమె వైకుంఠములో తన భర్తయైన శ్రీమన్నారాయణుని సేవించుచు మహాలక్ష్మిగా పిలువబడుచున్నది. స్వర్గలోకములో ఉన్న ఆ లక్ష్మిని స్వర్గలక్ష్మియని పిలుతురు. రాజులయందున్న ఆ లక్ష్మిని, రాజలక్ష్మిగా, గృహములందున్నందువలన ఆమెను గృహలక్ష్మిగా పిలుతురు. సమస్త ప్రాణులయందు, సమస్త ద్రవ్యములందు ఆమె అందమైన శోభగా కన్పించును. పుణ్యము చేసికొన్న వారికి ఆనందరూపముతో, రాజులకు కాంతి రూపముతో, వర్తకులకు వాణిజ్య రూపముతో ఆమె కన్పించును. పాపములు చేయువారికి ఆమె కలహములు పెట్టుచు కన్పడును. ఆమె దయకలది. భక్తులకు తల్లివంటిది. భక్తులయొక్క సంపదలను రక్షించునది. ఆ లక్ష్మీదేవిలేనిచో ప్రపంచమంతయు బ్రతికియున్నను చచ్చిన దానితో సమానముగా నుండును. ఆమె గుణగణములను వేదములు అనేకవిధములుగా స్తుతించినవి. ఆమె అందరకు నమస్కరించతగినది, పూజించతగినది. ఇక ప్రకృతి యొక్క మూడవ స్వరూపమును తెలిపెదను. వాగ్బుద్ధి విద్యాజ్ఞానాధిదేవతా పరమాత్మనః | సర్వ విద్యాస్వరూపా యా సా చ దేవీ సరస్వతీ || 31 సుబుద్ధిః కవితా మేధా ప్రతిభా స్మృతిదా సతాం | నానాప్రకారా సిద్ధాంత భేదార్థ కల్పనాప్రదా || 32 వ్యాఖ్యాబోధస్వరూపా చ సర్వసందేహభంజినీ | విచారకారిణీ గ్రంథకారిణీ శక్తిరూపిణీ || 33 సర్వసంగీత సంధాన తాలకారణరూపిణీ | విషయజ్ఞాన వాగ్రూపా ప్రతివిశ్వం చ జీవినాం || 34 యయా వినా చ విశ్వౌఘో మూకోమృతసమః సదా | వ్యాఖ్యాముద్రాకరా శాంతా వీణా పుస్తక ధారిణీ || 35 శుద్ధసత్వస్వరూపా యా సుశీలా శ్రీహరిప్రియా | హిమచందన కుందేందు కుముదాంభోజ సన్నిభా || 36 జపంతీ పరమాత్మానం శ్రీకృష్ణం రత్నమాలయా | తపస్స్వరూపా తపసాం ఫలదాత్రి తపస్వినీ || 37 సిద్ధివిద్యా స్వరూపా చ సర్వసిద్ధి ప్రదా సదా || 38 సరస్వతీదేవి వాక్కునకు, బుద్ధికి, జ్ఞానముకు, ఆధిదేవత, సర్వవిద్యాస్వరూపిణి. ఆదేవి మంచి బుద్ధిని, కవిత్వ రచనాశక్తిని, మేథను, ప్రతిభను స్మృతి జ్ఞానమును భక్తులకు కలిగించును. అట్లే అనేక విధములైన సిద్ధాంత భేదములయొక్క అర్థజ్ఞానము నొసగునది. సమస్త సంశయములను తొలగించునది. ఆలోచనా శక్తిని, గ్రంథరచనాశక్తిని కలిగించునది. సమస్త సంగీతమున ప్రధానాంశ##మైన శ్రుతి లయల స్వరూపము గలది. విషయము, జ్ఞానము, వాక్కు, ఆమెయొక్క రూపములు. ఆ దేవి లేనిచో ప్రపంచమంతయు మూగదై, జీవరహితముగా ఉండును. ఆ దేవి పరిశుద్ధమైన సత్వగుణరూపిణి. అందువలననే శ్రీహరి ఆమెను మన్నించును. ఆమె మంచువలె, చందనమువలె, మల్లెపూవువలె, తెల్లనిపద్మమువలె, కలవవలె తెల్లనిది. ఆమె ఎల్లప్పుడు తన చేతిలోని రత్నమాలతో శ్రీకృష్ణనామమును జపించుచుండును. ఆమె తపస్ప్వరూప, తపఃఫలితముల నొసగునది. సిద్ధి విద్యా స్వరూప. సమస్త సిద్ధులనొసగునది. యథాగమం యథాకించి దపరాం సంనిబోధమే మూలప్రకృతి యొక్క నాలుగవ స్వరూపమును నాకుతెలుపుమని నారదుడడిగెను. మాతా చతుర్ణాం వేదానం వేదాంగానం చ ఛందసాం || 39 సంధ్యావందన మంత్రాణాం తంత్రాణాం చ విచక్షణా | ద్విజాతి జాతి రూపా జపరూపా తపస్వినీ || 40 బ్రహ్మణ్య తోజోరూపా చ సర్వ సంస్కార కారిణీ | పవిత్రరూపా సావిత్రీ గాయత్రీ బ్రహ్మణః ప్రియా |7 41 తీర్థాని యస్యాః సంస్పర్శం దర్శం వాంఛంతి శుద్ధయే | శుద్ధ స్ఫటిక సంకాశా శుద్ధ సత్వ స్వరూపిణీ || 42 పరమానందరూపా చ పరమా చ సనాతనీ | పరబ్రహ్మ స్వరూపా చ నిర్వాణపద దాయినీ || 43 బ్రహ్మతేజోమయీ శక్తిస్తదాధిష్టాతృ దేవతా | యత్పాదరజసా పూతం జగత్సర్వం చ నారద || 44 నారదా! పవిత్రమైన స్వరూపముగల సావిత్రి లేక గాయత్రి సమస్త వేదములకు, వేదాంగములకు ఛందస్సులకు, సంధ్యావందన మంత్రములకు, తంత్రములకు మాతృస్వరూప. ఆ సావిత్రీదేవి జపరూపిణి. బ్రహ్మతేజోవిరాజిత. సమస్త సంస్కారములను కలిగించునది. బ్రహ్మదేవునకు ఇష్టమైన భార్య. సమస్త పవిత్ర తీర్థములు ఆ దేవియొక్క దర్శనమును, స్పర్శనుపొంది తాము పవిత్రము కావలెనని కోరుకొనుచున్నవి. ఆ దేవీ శుద్ధ సత్వగుణ స్వరూపిణి, శుద్ధ స్ఫటికమువలె తెల్లనిది. ఆనంద స్వరూపిణి, పరబ్రహ్మ స్వరూపిణి. ఆమె తన భక్తులకు మోక్షమునిచ్చును. బ్రహ్మ తేజస్సునకు ఆమె అధిదేవత. ఆ దేవియొక్క కాలి ధూలిచేతనే ఈ జగమంతయు పవిత్రమగుచున్నది. దేవీ చతుర్థీ కథితా పంచమీం వర్ణయామి తే | ప్రేమా ప్రాణాధిదేవీ యా పంచప్రాణాస్వరూపిణీ || 45 ప్రాణాధికప్రియతమా సర్వాద్యా సుందరీ వరా | సర్వ సౌభాగ్య యుక్తా చ మానినీ గౌరవాన్వితా || 46 వామార్ధాంగ స్వరూపా చ సుగుణౖస్తేజసా సమా | పరా వరా సర్వమాతా పరమాద్యా సనాతనీ || 47 పరమానందరూపా చ ధన్యా మాన్యా చ పూజితా | రాసక్రీడాధిదేవీ చ కృష్ణస్య పరమాత్మనః || 48 రాస మండల సంభూతా రాసమండల మండితా | రాసేశ్వరీ సురసికా రాసావాసవివాసినీ || 49 గోలోకవాసినీ దేవీ గోపీవేష విధాయికా | పరమాహ్లాదరూపా చ సంతోషాzమర్షరూపిణీ || 50 నిర్గుణా చ నిరాకారా నిర్లిప్తాzత్మస్వరూపిణీ | నిరీహా నిరహంకారా భక్తానుగ్రహవిగ్రహా || 51 వేదానుసార ధ్యానేన విజ్ఞేయా సా విచక్షణౖః | దృష్టిర్దృష్టా సహస్రేషు మునీంద్రైర్ముని పుంగవైః || 51 వహ్ని శుద్ధాంశుకాధానారత్నలంకార భూతితా | కోటి చంద్రప్రభాజుష్ట శ్రీయుక్తా భక్త విగ్రహా || 52 శ్రీకృష్ణ భక్తదాసై#్యకదాయినీ సర్వసంపదాం | అవతారే చ వారాహే వృషభానుసుతా చ యా || 53 యత్పాదపద్మ సంస్పర్శపవిత్రా చ వసుంధరా | బ్రహ్మాదిభిరదృష్టా యా సర్వదృష్టా చ భారతే || 55 స్త్రీరత్నసారసంభూతా కృష్ణవక్షః స్థలస్థితా | తథా ఘనే నవఘనే లోలా సౌదామినీ మునే || 56 షష్టివర్ష సహస్రాణి ప్రతప్తం బ్రహ్మణా పురా | యత్పాదపద్మనఖరదృష్టయే చాత్మశుద్ధయే || 57 స్వప్నేzపినైన దృష్టాస్యాత్ ప్రత్యక్షేzపి చ కా కథా | తేనైన తపసా దృష్టా భూరి బృందావనే వనే || 58 నారదా! ఇంతవరకు మూలప్రకృతి యొక్క నాల్గవ రూపమైన సావిత్రీ దేవి గురించి తెలిపితినీ. ఇక ప్రకృతి యొక్క ఐదవ స్వరూపమైన రాధాదేవి విషయము వినుము. ఆ రాధాదేవి ప్రేమకు, ప్రాణమునకు, అధిదేవత. పంచప్రాణ స్వరూపిణి. పరబ్రహ్మయగు శ్రీకృష్ణునకు ప్రాణములకంటె మిన్నయైన ప్రియురాలు. మిక్కిలి అందమైనది. సమస్త సౌభాగ్యములు కలది. గొప్ప గౌరవము కలది. ఆమె శ్రీకృష్ణపరబ్రహ్మ యొక్క వామార్ధ భాగస్వరూపిణి. ఆమె యొక్క సుగుణములతో, తేజస్సుతో శ్రీకృష్ణునకు సమానమైనది. ఆమె సర్వశ్రేష్ఠురాలు. అందరికి తల్లివంటిది. సనాతని. పరమానందరూపిణి. మాన్యురాలు. అందరిచే పూజింపబడినది. శ్రీ కృష్ణపరమాత్మ యొక్క రాసక్రీడకు అధిదేవత. గోలోకముననున్న ఆ దేవి గోపికావేషముననుండి పరమానందమున తేలియాడుచుండును. ఆమె సంతోషాzమర్షరూపిణి, నిర్గుణ, నిరాకార, నిర్లిప్త, నిరీహ, నిరహంకార, భక్తులననుగ్రహించుటకై అవతరించినది. వేదోక్త ప్రకారముగా ధ్యానించు మహనీయులు మాత్రము ఆమెను తెలిసికొందురు. రాధాదేవి బంగారువన్నె గల వస్త్రములను, రత్నాభరణములను ధరించుచుండెను. ఆమె శరీర కాంతి కోటి చంద్రుల కాంతి కంటె మిన్నయైనది. ఆమె తన భక్తులకు సమస్త సంపదలను శ్రీకృష్ణునిపై దాస్య భక్తిని ఇచ్చును. వరాహావతారసమయమున ఈమె వృషభానుడను రాజునకు పుత్రికగా అవతరించినది. ఈ భూమి రాధాదేవి పాదపద్మ స్పర్శవలన పవిత్రమైనది. బ్రహ్మాది దేవతలు ఈ దేవిన కఠిన తపస్సు చేసినా చూడలేకపోయిరి. కాని భారత వర్ష వాసుల కీమె ఎల్లప్పుడు కనిపించును. చిక్కని నల్లని మబ్బులోనున్న మెరుపుతీగవలె ఈమె శ్రీకృష్ణునివక్షస్థలముపై నుండును. బ్రహ్మదేవుడు రాధాదేవియొక్క పదపద్మములోని గోటిని దర్శించుటకై అరువైవేల సంవత్సరములు కష్టపడి తపస్సుచేసినను చూడలేకపోయినాడు. ఆమె దర్శనము కలలో సైతము కన్పించ లేదన్నచో ప్రత్యక్షముగా కనిపించునను ప్రసక్తి లేదు. కాని బ్రహ్మ దేవుడు కష్టపడి తపస్సు చేసి బృందావనములో మాత్రము రాధాదేవి యొక్క పాదపద్మములను దర్శించుకొనగలిగెను. కథితా పంచమీ దేవీ సా రాధా పరికీర్తితా | అంశరూపాః కళారూపాః కళాంశాంశసముద్భవాః || 59 ప్రకృతేః ప్రతివిశ్యం చ రూపం స్కాత్సర్వ యోషితః | పరిపూర్ణతమాః పంచవిధా దేవ్యః ప్రకీర్తితాః || 60 యా యాః ప్రధానాంశరూపా వర్ణయామి నిశామయ | ప్రధానాంశ స్వరూపా చ గంగా భువన పావనీ || 61 విష్ణుపాదాబ్జసంభూతా ద్రవరూపా సనాతనీ | పాపిపాపేధ్మ దాహాయ జ్వలదింధన రూపిణీ || 62 దర్శన స్పర్శన స్నానపానైర్నిర్వాణ దాయినీ | గోలోక స్థాన గమన సుసోపాన స్వరూపిణీ || 63 పవిత్రరూపా తీర్థానాం సరితాం చ పరావరా | శంభుమౌళి జటామేరు ముక్తాపంక్తి స్వరూపిణీ || 64 తపస్సంపాదినీ సద్యో భారతే చ తపస్వినాం | శంఖ పద్మక్షీరనిభా శుద్ధ సత్వ స్వరూపిణీ || 65 ఈ విధముగా మూలప్రకృతి యొక్క ఐదవ రూపముగా రాధాదేవిని పేర్కొందురు. అన్ని లోకములలో నున్న స్త్రీలు ప్రకృతి యొక్క అంశ స్వరూపాలుగా, కళారూపాలుగా, కళయొక్క అంశాంశ స్వరూపాలుగా పేర్కొనవచ్చును. ఇంతకు పూర్వము పేర్కొనబడిన దుర్గాది దేవతలు ప్రకృతియొక్క పరిపూర్ణస్వరూపము కలవారు. ఇక ప్రకృతి యొక్క ప్రధానాంశ స్వరూపాలైన దేవతల గురించి తెలుపుదును. సమస్త లోకమములను పవిత్రము చేయు గంగాదేవి ప్రకృతి యొక్క ప్రధానాంశ స్వరూపిణి. ఆ గంగ శ్రీవిష్ణువు యొక్క పాదముల వద్ద పుట్టి పాపములు చేసిన వారియొక్క పాపములను సమూలముగా పొగొట్టుచున్నది. ఆ గంగను చూచినను, తగిలినను, స్నానము చేసినను నీటిని తాగినను మోక్షము సిద్ధించును. నదిగా నున్న ఆ గంగా దేవి గోలోకమునకు వెళ్ళుటకు మంచిమెట్లవంటిది. అన్ని పుణ్యతీర్థములలో, అన్ని నదులలో ఆ గంగానది మిక్కిలి గొప్పనిది. శంకరుని శిరస్సుపై నున్న ఆ గంగానది ముత్యాల వరుసవలె కన్పించును. శంఖమువలె తెల్లని పద్మమువలె, పాలవలె తెల్లనైన ఆ గంగానది భారతవర్షమున నున్న మహర్షులకు తపఃఫలితమును వెంటనే కల్గించును. నిర్మలా నిరహంకారా సాధ్వీ నారాయణప్రియా | ప్రధానాంశస్వరూపా చ తులసీ విష్ణుకామినీ || 66 విష్ణుభూషణరూపా చ విష్ణుపాదస్థితా సతీ | తపస్సంకల్ప పూజాది సద్యస్సంపాదినీ మునే || 67 సారభూతా చ పుష్పాణాం పవిత్రా పుణ్యదా సదా | దర్శన స్పర్శనాభ్యాం చ సద్యో నిర్వాణ దాయినీ || 68 కలౌ కలుషశుష్కేధ్మ దాహనాయాగ్ని రూపిణీ | యత్పాద పద్మ సంస్పర్మాత్ సద్యః పూతా వసుంధరా || 69 యత్స్పర్శం దర్శనం వాంఛంతి తీర్థానామాత్మ శుద్ధయే | యయా వినా చ విశ్వేషు సర్వం కర్మాస్తి నిష్ఫలం || 70 మోక్షదా యా ముముక్షూణాం కామినాం సర్వకామదా | కల్పవృక్ష స్వరూపా చ భారతే వృక్షరూపిణీ || 71 ప్రకృతి యొక్క ప్రధానాంశ##మైన తులసీ దేవీ విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనది. ఆమె నిర్మలమైనది. అహంకారములేనిది. విష్ణుమూర్తికి హారముగా, అర్చనా సమయములో పాదములపై ఉండును. తపస్సంకల్ప సమయమున పూజాది సందర్భములలో తులసి యొక్క ఆవశ్యమెంతేని కలదు. ఆ తులసి పుష్పములన్నిటిలో సారమైనది. పవిత్రమైనది, సదా పుణ్యము కల్గించునది. ఆ తులసి యొక్క దర్శన, స్పర్శనలవలన మోక్షము లభించును. కలియుగమున మానవులు చేయు పాపములనే కట్టెలను అగ్నివలె క్షణములో భస్మము చేయును. భూమి ఆ తులసి యొక్క పాద స్పర్శవలన (వేళ్ళస్మర్శ) పవిత్రమగుచున్నది. సమస్త పుణ్య తీర్థములు తాము పరిశుద్ధి నొందుటకు తులసి యొక్క స్పర్శ దర్శనములను కోరుకొనుచున్నవి. ఆ తులసి లేనిచో సమస్త కర్మలు నిష్ఫలమై పోవును. మోక్షము కోరుకొనువారికి మోక్షమును, కోరినవారికి అన్ని కోరికలను కల్పవృక్షమువలె తీర్చును. భారత వర్షమున ఈ తులసి వృక్షరూపమున కన్పించుచున్నది. త్రాణాయా భారతానాం చ పూజానాం పరదేవతా | ప్రధానాంశ స్వరూపా చ మనసా కశ్యపాత్మజా || 72 శంకర ప్రియశిష్యా చ మహాజ్ఞానవిశారదా | నాగేశ్వరస్యానంతస్య భగినీ నాగపూజితా || 73 నాగేశ్వరీ నాగమతా సుందరీ నాగవాహినీ | నాగేంద్రగణ యుక్తా సా నాగభూషణ భూషితా || 74 నాగేంద్రవందితా సిద్ధయోగినీ నాగశాయినీ | విష్ణుభక్తా విష్ణురూపా విష్ణుపూజా పరాయణా || 75 తపస్స్వరూపా తపసాం ఫలదాత్రీ తసప్వినీ | దివ్యం త్రిలక్షవర్షం చ తపస్తప్తం యయా హరేః || 76 తపస్వినీషు పూజ్యా చ తసప్విషు చ భారతే | సర్వ మంత్రాధిదేవీ చ జ్వలంతీ బ్రహ్మ తేజసా || 77 బ్రహ్మ స్వరూపా పరమా బ్రహ్మ భావన తత్పరా | జరత్కారుమునేః పత్నీ కృష్ణశంభు పతివ్రతా || 78 ఆస్తీకస్య మునేర్మాతా ప్రవరస్య తపస్వినాం | కశ్యపమహర్షి పుత్రికయగు మనసా దేవి కూడ ప్రకృతి యొక్క ఒక ప్రధానాంశ##మే. ఆమె చాలా గొప్ప జ్ఞానము కలది. శంకరునికి చాల ఇష్టమైన శిష్యురాలు, సర్పశ్రేష్ఠుడైన అనంతునకు సోదరి. ఆమెన సర్పములెప్పుడూ కొలచుచుండును. ఆమె భూషణములు సర్పములే. ఆమె సిద్ధయోగిని. విష్ణుభక్తురాలు. విష్ణురూప. ఆమె శ్రీహరి గురించి మూడు లక్షల దివ్య సంవత్సరములు తపస్సు చేసినది. అందువలననే ఆమె భారత వర్షమందలి తపస్యులందరికి పూజనీయురాలైనది. ఆమె సమస్త మంత్రములకు అధిదేవత. బ్రహ్మతేజస్సుతో వెలిపోవుచున్న ఆ మనసాదేవి బ్రహ్మ భావనతో ఎల్లప్పుడూ ఉండును. ఈమెకు జరత్కారు అనే పేరు కూడ ఉన్నది. ఈమె జరత్కారు మహర్షిని పెండ్లియాడి తపోధనులలో శ్రేష్ఠుడని కీర్తిపొందిన ఆస్తీకమహర్షిని కన్నది. ప్రధానాంశస్వరూపా యా దేవసేనా చ నారద || 79 మాతృకా సా పూజ్యతమా సాచ షష్ఠీ ప్రకీర్తితా | శిశూనాం ప్రతి విశ్వం తు ప్రతిపాలన కారిణీ || 80 తపస్వినీ విష్ణుభక్తా కార్తికేయస్య కామినీ | షష్ఠాంశరూపా ప్రకృతేః తేన షష్టీ ప్రకీర్తితా || 81 పుత్రపౌత్రప్రదాత్రీ చ ధాత్రీ చ జగతాం సదా | సుందరీ యువతీ రమ్యా సతతం భర్తురంతికే || 82 స్థానే శిశూనాం పరమా వృద్ధరూపా చ యోగినీ | పూజా ద్వాదశమాసేషు యస్యాః షష్ఠ్యా స్తు సంతతం || 83 పూజా చ సుతికాగారే పరషష్ఠదినే శిశోః | ఏకవింశతిమే చైవ పూజా కళ్యాణ హేతుకీ || 84 శశ్వన్నియమితా చైషా నిత్యా కామ్యాzప్యతః పరా | మాతృరూపా దయారూపా శశ్వద్రక్షణకారిణీ || 85 జలే స్థలే చాంతరిక్షే శిశూనాం స్వప్న గోచరా | ప్రకృతి యొక్క మరియొక ప్రధానాంశము దేవసేన. ఆమె ప్రకృతి యొక్క షష్టాంశ రూపగావున షష్ఠీ అని కూడా ఆమెను పిలుతురు. ఆమె మిక్కిలి గౌరవించదగిన ''మాతృక''. సమస్త విశ్వములలో ఉండే శిశువుల నామె కాపాడుచుండును. అందరకు పుత్రపౌత్ర సంపదనిచ్చును. భర్త సమీపమున అందమైన యువతిగా ఎల్లప్పుడు కన్పించుచున్నను శిశువుల దగ్గర యోగిని యైన పండుముసలి వలె ఉండును. ఈ షష్టీదేవి యొక్క పూజలు ఎల్లప్పుడు సంవత్సరమున పన్నెండు నెలలు చేయవచ్చును. శిశువు పుట్టిన తరువాత సూతికా గృహములో, ఏడవ దినమున లేనిచో ఇరువది యొకటవ దినమున ఈమెపూజ చేసినచో శిశువునకు ఆయురారోగ్యములు కలుగును. మాతృ రూపిణియగు నీ దేవసేన మిక్కిలి దయగలది. ఆమె శిశువులను నీటిలోను, భూమిపైనను, ఆకాశమునందును రక్షించును. వారికి ఆమె స్వప్పములో దర్శనమొసగుచుండును. ప్రధానాంశ స్వరూపా యా దేవీ మంగళ చండికా || 86 ప్రకృతేర్ముఖసంభూతా సర్వమంగళదా సదా | సృష్టౌ మంగళరూపాచ సంహారే కోపరూపిణీ || 87 తేన మంగళ చండీ సా పండితైః పరికీర్తితా | ప్రతిమంగళవారేషు ప్రతివిశ్వేషు పూజితా || 88 పంచోపచారైర్భక్త్యా చ యోషిద్భిః పరిపూజితా | పుత్రపౌత్ర ధనైశ్వర్య యశోమంగళ దాయినీ || 89 శోక సంతాప పాపార్తి దుఃఖ దారిద్ర నాశినీ | పరితుష్టా సర్వవాంఛాప్రదాత్రీ సర్వయోషితాం || 90 రుష్టా క్షణన సంహర్తుం శక్తా విశ్వం మహేశ్వరీ | 'ప్రకృతి' దేవియొక్క మరొక ప్రధానాంశము ఆమె ముఖమునుండి పుట్టిన మంగళచండిక, ఆమె సమస్త మంగళములను తన భక్తుల కిచ్చును. ఆమె సృష్టి జరుగునప్పుడు మంగళ స్వరూపిణిగా సంహారసమయమున చండీ స్వరూపిణిగా కనిపించుచున్నందువలన మంగళ చండియని కీర్తింపబడుచున్నది. ఆమె సమస్తలోకములలో ప్రతి మంగళవారము స్త్రీలచే పంచోపచారములచే పూజింపబడుచున్నది. ఆమె తనను పూజించువారికి పుత్రపౌత్ర ధనైశ్వర్యములను, కీర్తిని, సంతోషమును ఇచ్చును. అట్లే వారికి శోకము, సంతాపము, ఆర్తి, దుఃఖము, దారిద్ర్యము,పాపములు కలుగనివ్వదు. ఆమె సంతుష్ఠురాలైనచో స్త్రీలందరకు అన్ని కోరకలు తీర్చును. కోపగించినచో క్షణములో సమస్త ప్రపంచమును సంహరించును. ప్రధానాంశ స్వరూపా చ కాళీ కమలలోచనా || 91 దుర్గాలలాట సంభూతా రణ శుంభనిశుంభయోః | దుర్గార్ధాంశ స్వరూపా స్యాద్గుణౖస్సా తేజసా సమా || 92 కోటి సూర్య ప్రభాజుష్ట దివ్యసుందర విగ్రహా | ప్రధానా సర్వశక్తీనాం వరా బలవతీ పరా || 93 సర్వసిద్ధిప్రదా దేవీ పరమా సిద్ధియోగినీ | కృష్ణభక్తా కృష్ణతుల్యా తేజసా విక్రమైర్గుణౖః కృష్ణ భావనయా శశ్వత్ కృష్ణవర్ణా సనాతనీ || 94 బ్రహ్మాండం సకలం హర్తుం శక్తా నిశ్వాసమాత్రతః | రణం దైత్యైః సమం తస్యాః క్రీడాస్యాల్లోక రక్షయా || 95 ధర్మార్థ కామమోక్షాంశ్చ దాతుం శక్తా సుపూజితా | బ్రహ్మాదిభిః స్తూయమానా మునిభిర్మనుభిర్నరైః ||96 ప్రకృతియొక్క మరియొక ప్రధానాంశము కాళికాదేవి, దుర్గాదేవి శుంభనిశుంభ రాక్షసులతో యుద్ధము చేయుచున్నప్పుడు కోపించిన ఆమె ముఖమునుండి తదర్ధాంశముగా కాళికాదేవి పుట్టినది. ఆ కాళిక తన గుణములతో తేజస్సుతో దుర్గాదేవితో సమానమైనది. కోటి సూర్యలు కాంతితో సమానమైన కాంతి గలది. దివ్య సౌందర్యముచే ప్రకాశించునది. ఆమె తన భక్తులకు సకల సిద్ధులనొసంగును. కృష్ణభక్తురాలైన కాళిక శ్రీకృష్ణుని సంతతము ధ్యానించుచున్నందువలన శ్రీకృష్ణుని వలె నల్లని శరీరముతో ప్రకాశించును. లోకమును రక్షించుటకై రాక్షసులతో ఆమె యుద్ధము చేయుచుండును. ఆమెకది ఒక ఆట. ఆమె తన నిట్టూర్పుతో సకల బ్రహ్మాండములను హరించును. బ్రహ్మాది దేవతలతో, మునులతో, నరులతో పూజలందుకొని ఆ కాళిక ధర్మార్థ కామ మోక్షములనిచ్చును. ప్రధానాంశ స్వరూపాచ ప్రకృతిశ్చ వసుంధరా | ఆధార భూతా సర్వేషాం సర్వ సస్య ప్రసూతికా || 97 రత్నాకరా రత్నగర్భా సర్వ రత్నాకరాశ్రయా | క్రాదిభిః ప్రజేశైశ్చ పూజితా వందితా సదా || 98 సర్వోపజీవ్యరూపా చ సర్వసంపద్విధాయినీ | యయా వినా జగత్సర్వం నిరాధారం చరాచరం || 99 ప్రకృతి యొక్క మరియొక ప్రధానాంశము వసుంధర. ఈ భూమి అందరకు ఆధారమైనది. సమస్త సస్యములను పండించునది. ఈ భూమి రత్నములకు నిలమైనది. సమస్త సముద్రములు దీనిని ఆశ్రయించుకొని యున్నవి. ఈమె నరులచే నరాధిపతులచే పూజలందుకొనును. అందరు జీవించుటకు కారణమగుచున్నది. అందరకు సంపదలను కల్గించునది. ఈ భూమిలేనిచో ఈ చరాచర జగత్తంతయు నిరాధారమై నశించిపోవును. ప్రకృతేశ్చ కళా యా యాస్తా నిబోధ మునీశ్వర | యస్య యస్య చ యా పత్న్యస్తాః సర్వా వర్ణయామి తే || 100 ఓ నారదా ! ప్రకృతి యొక్క అంశ స్వరూపలను, వారి భర్తల పేర్లను నీకు తెలుపుదును. స్వాహదేవీ వహ్నిపత్నీ లోకేషు పూజితా | యయా వినా హవిర్దత్తం న గ్రహీతుం సురాః క్షమాః || 101 దక్షిణా యజ్ఞపత్ని చ దీక్షాసర్వత్ర పూజితా | యయా వినాచ విశ్వేషు సర్వం కర్మచ నిష్ఫలం || 102 స్వధా పితౄణాం పత్నీ చ మునిభిర్మనుభిర్మరైః | పూజితా పైతృకం దానం నిష్ఫలం చ యయా వినా || 103 స్వస్తిదేవి వాయుపత్నీ ప్రతి విశ్వేషు పూజితా | ఆదానం చ ప్రదానం చ నిష్ఫలం చ యయా వినా || 104 పుష్టిర్గణపతేః పత్నీ పూజితా జగతీ తలే | యయా వినా పరీక్షీణాః పుమాంసో యోషితోzపి చ || 105 అనంతపత్నీ తుష్టిశ్చ పూజితా నందితా సదా | యయా వినా న సంతుష్టాః సర్వే లోకాశ్చ సర్వతః || 106 ఈశానపత్నీ సంపత్తిః పూజితా చ సురైర్నరైః | సర్వే లోకా దరిద్రాశ్చ విశ్వేషు చ యయా వినా || 107 ధృతిః కపిలపత్నీ చ సర్వైః సర్వత్ర పూజితా | సర్వే లోకా అధీరాః స్యుః జగత్సు చ యయా వినా || 108 యమపత్నీ క్షమా సాధ్వీ సుశీలా సర్వపూజితా | సమున్మత్తాశ్చ రుద్రాశ్చ సర్వే లోకా యయా వినా || 109 'స్వాహాదేవి' అగ్నిదేవుని భార్య. యజ్ఞములలో ఆమెలేకుండ హవిస్సునిస్తే దేవతలు దానిని తీసికొనలేరు. 'దక్షిణాదేవి' యజ్ఞపత్ని. ఆమె లేనిచో సమస్త కర్మలు నిష్ఫలమగుచున్నది. ''స్వధా దేవి'' పితృపత్ని. స్వధాకారము లేక పితృకర్మలలో చేసిన దానము వ్యర్థమగుచున్నది. స్వస్తిదేవి వాయువుభార్య. ఆమెలేకుండా చేసిన ఆదాన ప్రదానములు వ్యర్థమగును. 'పుష్టిదేవి' గణపతి యొక్క భార్య. అనంతుని భార్య ''తుష్టిదేవి''. ''సంపత్తి'' ఈశ్వరుని భార్య. ''ధృతి'' కపిలమహర్షి భార్య ''క్షమ'' యముని భార్య. ఆమె లేనిచో సమస్తలోకములు కోపముతో పిచ్చెక్కినట్లుండును. క్రీడాధిష్టాతృదేవీ సా కామపత్నీ రతిః సతీ | కేళకౌతుకహీనాశ్చ సర్వే లోకా యయా వినా|| 110 సత్యపత్నీ పతీ ముక్తిః పూజితాం జగతాం ప్రియా | యయా వినా భ##వేల్లోకో బంధురాహితః సదా || 111 మోహపత్నీ దయా సాధ్వీ పూజితా చ జగత్ప్రియా | సర్వేలోకాశ్చ సర్వత్ర నిష్ఠురాశ్చ యయా వినా || 112 పుణ్యపత్నీ ప్రతిష్ఠా సా పుణ్యరూపా చ పూజితా | యయా వినా జగత్సర్వం జీవన్మృతసమం మునే || 113 సుకర్మపత్నీ కీర్తిశ్చ ధన్యా మాన్యా చ పూజితా | యయా వినా జగత్సర్వం యశోహీనం మృతం యథా || 114 క్రియా ఉద్యోగపత్నీ చ పూజితా సర్వసంగతా | యయా వినా జగత్సర్వం ఉచ్ఛిన్నమివ నారద || 115 అధర్మపత్నీ మిథ్యా సా సర్వ ధూర్తైశ్చ పూజితా | యయా వినా జగత్సర్వం ఉచ్ఛిన్నం విధినిర్మితం || 116 సత్యే అదర్మనా యా చ త్రేతాయాం సూక్ష్మరూపిణీ | అర్ధావయవ రూపా చ ద్వాపరే సంహృతా హ్రియా || 117 కలౌ మహాప్రగల్భా చ సర్వత్ర వ్యాప్తి కారణాత్ | కపటేన సహభ్రాత్రా భ్రమత్యేవ గృహే గృహే || 118 శాంతిర్లజ్జా చ భార్యే ద్వే సుశీలస్య చ పూజితే | యభ్యాం వినా జగత్సర్వం ఉన్మత్తమివ నారద || 119 జ్ఞానస్య త్రిస్రో భార్యశ్చ బుద్ధిర్మేధా స్మృతిస్తథా | యాభిర్వినా జగత్సర్వం మూఢం మృతసమం సదా || 120 రతికేళీకౌతుకమునకు కారణమైనది, రతిక్రీడకు అధిష్టాన దేవతయగు 'రతీదేవీ' మన్మథుని భార్య. అందరకు ఇష్టమైన ''ముక్తిదేవత'' సత్యపత్ని. ''దయాదేవి'' మోహపత్ని. పూణ్య స్వరూపిణియైన ''ప్రతిష్ఠాదేవి'' పుణ్యపత్ని. పేరు ప్రతిష్ఠలకు కారణభూతురాలైన ''కీర్తిదేవి'' సుకర్మపత్ని. ''క్రియాదేవి'' ఉద్యోగపత్ని. సమస్త దుష్టులచే గౌరవింపబడుచున్న ''మిథ్యాదేవి'' అధర్ముని భార్య. ఆమె సత్య (కృత) యుగములోకనిపించలేదు. త్రేతాయుగములో సూక్ష్మరూపములో ఉండినది. ద్వాపరయుగములో ముడుచుకొని పోయి అర్ధావయవములున్నట్లు కనిపించును. కాని కలియుగములో అంతటా కనిపిస్తూ కపటుడను తన సోదరునితో కలిసి ఇంటింటికి తిరుగుచుండెను. సుశీలుని భార్యలు ''శాంతి, లజ్జ''. జ్ఞానదేవునకు ''బుద్ధి, మేధ, స్మృతి'' అను ముగ్గురు భార్యలు కలరు. మూర్తిశ్చ ధర్మపత్నీ సా కాంతిరూపా మనోహరా | పరమాత్మా చ విశ్వౌఘా నిరాధారా యయా వినా || 121 సర్వత్రశోభరూపా చ లక్ష్మీర్మూర్తిమతీ సతీ | శ్రీరూపా మూర్తిరూపాచ మన్యా ధన్యా చ పూజితా || 122 కాలాగ్ని రుద్రపత్నీ చ నిద్రాయా సిద్ధయోగినాం | సర్వలోకాః సమాచ్ఛన్నాః మయాయోగేన రాత్రిషు || 123 కాలస్య త్రిస్రో భార్యాశ్చ సంధ్యా రాత్రిర్దినాని చ | యాభిర్వినా విధాత్రా చ సంఖ్యాం కర్తుం న శక్యతే || 124 క్షుత్పిపాసే లోభభార్యే ధన్యే మాన్యే చ పూజితే | యాభ్యాం వ్యాప్తం జగత్ క్షోభయుక్తం చింతితమేవ చ || 125 ప్రభా దాహికా చైవ ద్వే భార్యే తేజసస్తథా | యాభ్యాం వినా జగత్ర్సష్టుం విధాతా చ న హీశ్వరః || 126 కాలకన్యే మృత్యుజరే ప్రజ్వరస్య ప్రియే ప్రియే | యాభ్యాం జగత్సముచ్ఛిన్నం విధాత్రా నిర్మితే విధౌ || 127 నిద్రాకన్యా చ తంద్రా సా ప్రీతిరన్యా సుఖప్రియే | యాభ్యాం వ్యాప్తం జగత్సర్వం విధిపుత్ర విధేర్విధౌ || 128 వైరాగ్యస్య చ ద్వే భార్యే శ్రద్ధా భక్తిశ్చ పూజితే | యాభ్యాం శశ్వత్ జగత్సర్వం జీవన్ముక్తమిదం మునే || 129 అదితిర్దేవమాతా చ సురభిశ్చం గవాం ప్రసూః | దితిశ్చ దైత్యజననీ కద్రూశ్చ వినతా దనుః || 130 ఉపయుక్తాః సృష్టి విధావితాశ్చ ప్రకృతేః కళాః | కళాశ్చాన్యాః సంతి బహ్వ్యః తాసు కాశ్చిన్నిబోధమే || 131 కాంతి రూపమైనది. అందమైనది అగు 'మూర్తిదేవి' ధర్మపత్ని. ఆమె లేనిచో సమస్త లోకములు పరమాత్మ నిరాధారులగుదురు. కాంతి రూపిణియగు ఆ దేవి లక్ష్మీదేవి స్వరూపిణి. ఆమె అందరిచే గౌరవింపబడుచున్నది. శ్రీ, మూర్తి ఈమె యొక్క రూపములు. ''నిద్రాదేవి'' కాలాగ్ని రుద్రుని యొక్క భార్య. ఈమెయొక్క మాయయందు సమస్తలోకములు రాత్రివేళలో మునిగిపోవుచున్నవి. సంధ్య, రాత్రి, దినములను ముగ్గురు కాలముయొక్క భార్యలు. 'క్షుత్పిపాసలు' లోభ##దేవత యొక్క భార్యలు. తేజస్సునకు ''ప్రభా, దాహికా'' అను ఇద్దరు భార్యలు. కాలుని కుమార్తెలైన మృత్యు, జరలు ప్రజ్వరుని యొక్క భార్యలు. నిద్రాదేవి కూతురైన ''తంద్ర'' సుఖదేవుని భార్య. అతని యొక్క మరియొక భార్య పేరు 'ప్రీతి'', ''శ్రద్ధా,భక్తి'' వైరాగ్యుని భార్యలు. ఇంకను దేవతల తల్లియైన ''అదితి'', గోవులకు మూలమైన 'సురభి', దైత్యులకు తల్లియైన 'దితి', కద్రువ, వినత, దనువు వీరందరు సృష్టిక్రమములో ఉపయోగింపబడినవారు. పైన పేర్కొన్న వారందరు ప్రకృతి యొక్క సూక్ష్మాంశస్వరూపలు. ఇంకను సూక్ష్మాంశ స్వరూపలు చాలామంది గలరు. రోహిణీ చంద్రపత్నీ చ సంజ్ఞా సూర్యస్య కామినీ | శతరూపా మనోర్భార్యా శచీంద్రస్య చ గేహినీ || 132 తారా బృహస్పతేర్భార్యా వసిష్ఠస్యాప్యరుంధతీ | అహల్యా గౌతమస్త్రీ స్యాదనసూయా zత్రి కామినీ || 133 దేవహూతిః కర్దమస్య ప్రసూతిర్దక్ష కామినీ | పితౄణాం మానసీ కన్యా మేనకా సాzంబికా ప్రసూః || 134 లోపాముద్రా తథా హూతిః కుబేరస్యతు కామినీ | వరుణానీ యమస్త్రీ చ బలేర్వింధ్యావళీతి చ || 135 కుంతీ చ దమయంతీ చ యశోదా దేవకీ సతీ | గాంధారీ ద్రౌపదీ సవ్యా సావిత్రీ సత్యవత్ర్పియా || 136 వృషభానుప్రియా సాధ్వీ రాధామాతా కళావతీ | మందోదరీ చ కౌసల్యా సుభద్రా కైకయీ తథా || 137 రేవతీ సత్యభామా చ కాళిందీ లక్ష్మణా తథా | మిత్రవిందా నాగ్నజితా తథా జాంబవతీ పరా || 138 లక్ష్మణా రుక్మిణీ సీతా స్వయం లక్ష్మీః ప్రకీర్తితా | కళాయోజనగంధా చ వ్యాసమాతా మహాసతీ || 139 బాణపుత్రీ తథోషఫా చ చిత్రలేఖా చ తత్సభీ || ప్రభావతీ భానుమతీ తథా మాయావతీ సతీ || 140 రేణుకా చ భృగోర్మాతా హలిమాతా చ రోహిణీ | ఏకోనంశా చ దుర్గా సా శ్రీ కృష్ణభగినీ సతీ || 141 బహ్వ్యః సంతి కళాశ్చైవం ప్రకృతేరేవ భారతే | యా యాశ్చ గ్రామదేవ్యస్తాః సర్వాశ్చ ప్రకృతేః కళాః || 142 ''రోహిణీదేవి'' చంద్రుని భార్య కాగా ''సంజ్ఞాదేవి'' సూర్యుని భార్య. ''శతరూపాదేవి, మనువుభార్య, ఇంద్రుని భార్య పేరు ''శచి''. 'తార' బృహస్పతి భార్య. వసిష్ఠుని భార్య పేరు ''అరుంధతి''. ''అహల్యదేవి'' గౌతమ మహర్షి భార్య. అత్రిమహర్షి భార్య ''అనసూయదేవి''. దేవహూతి కర్దముని భార్యకాగా ''ప్రసూతి'' దక్షప్రజాపతి భార్య., మనసాదేవి కూతురైన మానసీదేవి పితృభార్య. పార్వతీదేవిని గన్నతల్లి ''మేనక'', లోపాముద్ర, హోలి, వరుణానీ, యమపత్ని, వింధ్యావళి, కుంతి, దమయంతి, యశోద, దేవకీదేవి, గాంధారి, ద్రౌపది, సత్యవంతుని భార్యయైన సావిత్రీ, రాధకు తల్లియైన కళావతి, మండోదరి, కౌసల్య, సుభద్ర, కైకేయి, రేవతి, సత్యభామ, కాళింది, లక్ష్మణ, మిత్రవింద, నాగ్నజితి, జాంబవతి లక్ష్మీదేవి స్వరూపాలైన సీత, రుక్మిణి, వ్యాసుని తల్లియైన యోజనగంధ, బాణాసురుని కూతురైన ఉషాదేవి, ఆమె స్నేహితురాలైన చిత్రలేఖ, ప్రభావతి, భానుమతి, మాయావతి, పరుశురాముని తల్లియైన రేణుకాదేవి, బలరాముని తల్లియగు రోహిణీ, శ్రీకృష్ణునకు సోదరియగు దుర్గ మొదలైన వారందరు ప్రకృతి యొక్క అంశ స్వరూపలు. అట్లే గ్రామ దేవతలందరు ప్రకృతి యొక్క సూక్ష్మాంశ స్వరూపాలే. కళాంశాంశ సముద్భూతాః ప్రతి విశ్వేషు యోషితః | యోషితామపమానేన ప్రకృతేశ్చ పరాభవః || 143 బ్రహ్మణీ పూజితా యేన పతి పుత్రవతీ సతీ | ప్రకృతిః పూజితా తేన వస్త్రాలంకార చందనైః || 144 కుమారీ చాష్టవర్షీయా వస్త్రాలకంరా చందనైః | పూజితా యేన విప్రస్య ప్రకృతిస్తేన పూజితా || 145 సర్వాః ప్రకృతిసంభూతా ఉత్తమాధమమధ్యమాః | సత్వాంశాశ్చోత్తమా జ్ఞేయాః సుశీలాశ్చ పతివ్రతాః || 146 మధ్యమా రజసశ్చాంశాస్తాశ్చ భోగ్యాః ప్రకీర్తితాః | సుఖసంబోగవత్యశ్చ స్వకార్యే తత్సరాః సదా || 147 అధమాస్తమసశ్చాంశాః పుంశ్చల్యః పరికీర్తితాః | దుర్ముఖాః కులటా ధూర్తాః స్వతంత్రాః కలహప్రియాః || 148 పృథివ్యాం కులటా యాశ్చ స్వర్గే చాప్పరసాంగణాః | ప్రకృతేస్తమసశ్చాంశాః పుంశ్చల్యః పరికీర్తితాః || 149 ఏవం నిగదితం సర్వం ప్రకృతేర్భేదపంచకం | తాః సర్వాః పూజితాః పృథ్వాం పుణ్యక్షేత్రే చ భారతే || 150 స్త్రీలందరు ప్రకృతియొక్క అంశాంశ స్వరూపలు. కావున స్త్రీలనవమానించినచో ప్రకృతిని అవమానించినట్లే అగును. భర్త, పుత్రులు గల స్త్రీని వస్త్రాలంకారములచే గౌరవించినచో ప్రకృతిని పూజించినట్లే అగును. ఎనిమిది సంవత్సరములు వయసు కలిగిన కన్యను వస్త్రము, అలంకారము చందనములతో గౌరవించిన ప్రకృతిని పూజించినట్లగును. ప్రకృతి వలన పుట్టిన స్త్రీలలో ఉత్తమ స్త్రీలు, మధ్యమ స్త్రీలు, అధమ స్త్రీలు అని ఉందురు. మంచి నడవడిక గలిగిన పతివ్రతలు సత్వగుణాంశ##లైన ఉత్తమ స్త్రీలుగా పరిగణింపబడుదురు. సుఖసంభోగమునిచ్చుచు తన పనులను తాము చేసికొను స్త్రీలు రజోగుణాంశగల మధ్యమస్త్రీలు. కలహప్రియులు, కులటలు, దుష్టలు ఐన స్త్రీలు తామసాంశగల అధమ స్త్రీలు. ఈ భూమిపై నున్న కులటలు, స్వర్గమందున్న అప్సరసలందరు అధమస్త్రీలుగా పరిగణింపబడుదురు. ఈ విధముగా ప్రకృతి యొక్క పంచభేదములను అంశాంశములుగా వివరించుట జరిగినది. ఆ ప్రకృతియొక్క అంశస్వరూపలందరు పుణ్యక్షేత్రమైన ఈ భారతవర్షమున సదా పూజింపబడుచుందురు. పూజితా సురథేనాదౌ దుర్గార్తినాశనీ | ద్వితీయా రామచంద్రేణ రావణస్య వధార్థినా || 151 తత్పశ్చాజ్జగతాం మాతా త్రిషు లోకేషు పూజితా | జాతాzదౌ దక్షపత్న్యాంచ నిహంతుం దైత్య దానవాన్ || 152 తతో దేహం పరిత్యజ్య యజ్ఞే భర్తుశ్చ నిందయా | జజ్ఞే హిమవతః పత్న్యాం లేభే పశుపతిం పతిం || 153 గణశశ్చ స్వయం కృష్ణః స్కందో విష్ణుకళోద్భవః | బభూవతుస్తౌ తన¸° పశ్చాత్తస్యాశ్చ నారద || 154 లక్ష్మీర్మంగళ భూపేన ప్రథమే పరిపూజితా | త్రిషు లోకేషు తత్పశ్చాద్దేవతాముని మానవైః || 155 సావిత్రీ ప్రథమం చాపి భక్త్యా వై పరిపూజితా | తత్పశ్చాత్త్రిషు లోకేషు దేవతాముని మానవైః || 156 ఆదౌ సరస్వతీ దేవీ బ్రహ్మణా పరిపూజితా | తత్పశ్చాత్ త్రిషులోకేషు దేవతాముని మానవైః || 157 ప్రథమం పూజితా రాధా గోలోకే రాసమండలే | పౌర్ణమాస్యాం కార్తికస్య కృష్ణేన పరమాత్మనా || 158 గోపికాభిశ్చ గోపైశ్చ బాలికాభిశ్చ బాలకైః | గవాంగణౖః సురగణౖః తత్పశ్చాన్మాయయా హరేః || 159 తదా బ్రహ్మాదిభిర్దేవైర్మునిభిర్మనుభిస్తథా | పుష్ప ధూపాదిభిర్భక్త్యా పూజితా వందితా సదా || 160 పృథివ్యాం ప్రథమాదేవీ సుయజ్ఞేన చ పూజితా | శంకరేణోపదిష్టేన పుణ్యక్షేత్రే చ భారతే || 161 త్రిషులోకేషు తత్పశ్చాదాజ్ఞయా పరమాత్మనః | పుష్ప ధూపాదిభిర్భక్త్యా పూజితా మునిభిః సురైః || 162 కళా యా యాః సుసంభూతా పూజితాస్తాశ్చ భారతే | పూజితా గ్రామదేవ్యశ్చ గ్రామే చ నగరే మునే || 163 మిక్కిలి గొప్పనైన ఆర్తులను తొలగించు దుర్గాదేవిని సురథుడను రాజు తొలుగ పూజింపగా రావణవధకై వెళ్ళుచు శ్రీరామచంద్రుడు తరువాత పూజించెను. ముల్లోకములకు తల్లియగు ఆ దుర్గాదేవి సమస్త లోకములయందు ఆ తరువాత పూజింపబడినది. దుర్గాదేవి దైత్యులను దానవులను చంపుటకై తొలుత దక్షప్రజాపతి ఇంట పుట్టినది. దక్షయజ్ఞమున తండ్రియైన దక్షుడు తన భర్తను నిందించుచుండగా సహింపలేక యజ్ఞాగ్నిలో తన దేహమును చాలించి హిమవంతునకు కూతురుగా జన్మించి శంకరుని మరల భర్తగా పొందెను. శ్రీకృష్ణస్వరూపుడైన గణపతి, శ్రీకృష్ణాంశ రూపుడైన కుమారస్వామి ఆమెకు పుత్రులైరి. లక్ష్మీదేవిని తొలుత మంగళభూపతి పూజించెను. అట్లే సావిత్రీ దేవిని తొలుత భక్తి పూజించెను. సరస్వతీదేవి తొలుత బ్రహ్మదేవుని చేత పూజింపబడినది. రాధాదేవి తొలుత గోలోకమున రాసమండలమున పరమాత్మయగు శ్రీకృష్ణునిచే కార్తీక పూర్ణిమనాడు పూజింపబడినది. ఆ తరువా గోప, గోపికలతో , బాలబాలికలతో గోగణముతో, దేవతాగణముతో పూజింపబడినది. భూలోకమున ఆ రాధాదేవిని తొలుత సుయజ్ఞుడను రాజు శంకరుని ఉపదేశముననుసరించి భారతవర్షమున పూజించెను. ఆ తరువాత శ్రీకృష్ణపరమాత్మ యొక్క ఆజ్ఞవలన దేవతలు, మునులు ఆమెను పూజచేసిరి. ప్రకృతీదేవి యొక్క అంశలలో పుట్టిన గ్రామదేవతలు పల్లెలలో పట్టణములలో ఈ భారతదేశమున పూజలను అందుకొనుచున్నారు. ఏవం తే కథితం సర్వం ప్రకృతేశ్చరితం శుభం | యథాగమం లక్షణం చ కిం భూయః శ్రోతుమిచ్ఛసి || 164 నారదా! నీకు ఈ విధముగా ప్రకృతి యొక్క చరిత్రను శాస్త్రబద్దమైన దాని యొక్క లక్షణమునంతయు వివరించితిని. ఇంకను నీవు వినవలసినదేమైన ఉన్నచో తెలుపుము. ఇతి శ్రీ బ్రహ్మ వైవర్తేమహాపురాణ ద్వితీయే ప్రకృతి ఖండే నారాయన నారద నారాయణ నారద సంవాదే ప్రకృతి స్వరూప తద్భేద వర్ణనం నామ ప్రథమో೭ధ్యాయః శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణములోమ రెండవదైన ప్రకృతి ఖండములోమ నారద నారాయణ సంవాద సందర్భమున చెప్పబడిన ప్రకృతి స్వరూపము, దాని భేదములను తెలుపు. ప్రథమాధ్యాయము సమాప్తము.