sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters   

త్రయోదశోధ్యాయః - తులసి ఉపాఖ్యా ప్రారంభము

నారద ఉవాచ- నారద మహర్షి ఇట్లనెను -

నారాయణప్రియా సాధ్వీ కథం సా చ బభూవహ | తులసీ కుత్ర సంభూతా కా వా సా పూర్వ జన్మని || 1

కస్య వా సా కులే జాతా కస్య తపస్వినీ | కేన వా తపసా సా చ సంప్రాప ప్రకృతే ః పరం || 2

నిర్వికల్పం నిరీహం చ సర్వసాక్షి స్వరూపకం |నారాయణం పరం బ్రహ్మ పరమాత్మానమీశ్వరం || 3

సర్వారాధ్యం చ సర్వేశం సర్వజ్ఞం సర్వం కారణం | సర్వాధారం సర్వరూపం సర్వేషాం పరిపాలకం || 4

కథమేతాదృశీ దేవి వృక్షత్వం సమవాప హ | కథం సాzప్యసురగ్రస్తా సంబభూవ తపస్వీనీ || 5

సందిగ్దం మే మనో లోలం ప్రేరయేన్మాం ముహూర్మహుః | ఛేత్తుమర్హసి సందేహం సర్వసందేహభంజన || 6

నారాయణునకు ప్రియురాలైన తులసి పూర్వజన్మలో ఎవరి కులమున పుట్టినది? ఎవరికి కూతురుగా జన్మించినది? ఎట్టి తపసు చేసి ప్రకృతి కంటే అతీతుడైన శ్రీమన్నారాయణుని భర్తగా పొందినది. ఈమె వృక్షముగా ఎందుకు మారినది అట్లే రాక్షసులకు ఎట్లు దక్కినది.

ఇట్టి సందేహములతో నిండిన నా మనస్సు మాటి మాటికి డోలాయమానమగుచున్నది. కావున అందరి సందేహములను తీర్చు మీరు నా సందేహముల తొలగింపుడు.

నారాయణ ఉవాచ - నారాయణు డిట్లనెను-

మనుశ్చ దక్షసావర్ణిః పుణ్యవాన్‌వైష్ణవః శుచిః | యశస్వీ కీర్తిమాంశ్చైవ విష్ణోరంశ సముద్భవః || 7

తత్పుత్రో ధర్మసావర్ణిః ధర్మిష్ఠో వైష్ణవః శుచిః | తత్పుత్రో విష్ణుసావర్ణిః వైష్ణవశ్చ జితేంద్రియః || 8

తత్పుత్రో దేవసావర్ణిః విష్ణు వ్రత పరాయణ ః | తత్పుత్రో రాజ సావర్ణిః మహావిష్ణు పరాయణః || 9

వృషధ్వజశ్చ తత్పుత్రో వృషధ్వజ పరాయణః | యస్యాశ్రమే స్వయం శంభురాసీత్‌ దైవ యుగత్రయం || 10

పుత్రాదపి పరః స్నేహో నృపే తస్మిన్‌ శివస్యచ | న చ నారాయణం మేనే న చ లక్ష్మీం సరస్వతీం || 11

పూజాం చ సర్వదేవానా దూరీభూతాం చకార సః | భాద్రేమాసి మహాలక్ష్మీపూజాం మత్తోzత్యజన్నృపః || 12

మాఘే సరస్వతీ పూజాం దూరీభూతాం చకార సః | యజ్ఞం చ విష్ణుపూజాం చ నినిందే న చకార సః || 13

నకోzపి దేవో భూపేంద్రం శశాప శివకారణాత్‌ | భ్రష్టశ్రీర్భవ భూపేతి చాశపత్తం దివాకరః || 14

శూలం గృహీత్వా తం సూర్యం ధృతవాన్‌ శంకరః స్వయం | పిత్రా సార్ధం దినేశశ్చ బ్రహ్మాణం శరణం య¸° || 15

శివస్త్రిశూలహస్తశ్చ బ్రహ్మలోకం య¸° కృధా | బ్రహ్మా సూర్యం పురస్కృత్య వైకుంఠంచ య¸° భియా || 16

శూలం గృహీత్వా త్రతాzపి ధృతవాన్‌ శంకరో రవిం | బ్రహ్మ కశ్యప మార్తండాః సంత్రస్తా శుష్కతాలుకాః || 17

నారాయణం చ సర్వేశం తే యయుః శరణం భియా | మూర్ధ్న ప్రణముస్తే గత్వా తుష్టువుశ్చ పునః పునః || 18

సర్వేనివేదనం చక్రుః భియస్తే కారణం హరౌ || 19

నారాయణశ్చ కృపయాzభయం తేభ్యో దదౌ మునే | స్థిరా భవత హే భీతా భయం కిం వోమయి స్థితే || 20

స్మరంతియే యత్రతత్ర మాం విపత్తౌ భయాన్వితాః | తాంస్తత్ర గత్వా రక్షామి చక్రహస్థః త్వరాన్వితః || 21

పాతాzహం జగతాం దేవః కర్తాzహం సతతం సదా | స్రష్టా చ బ్రహ్మరూపేణ సంహర్తా శివరూపతః || 22

శివోzహం త్వమహం చాపి సూర్యోzహం త్రిగుణాత్మకః | విధాయ నానారూపం చ కుర్యాం సృష్ట్యాదికాః క్రియాః || 23

పూర్వము విష్ణుభక్తుడైన దక్షసావర్ణి అనే మనువు ఉండెను. అతని పుత్రుడు ధర్మ సావర్ణి. అతని పుత్రుడు విష్ణుసావర్ణి. అతని పుత్రుడు దేవసావర్ణి. వీరందరు విష్ణుభక్తులే. విష్ణువ్రత పరాయణులే.

కాని దేవసావర్ణి పుత్రుడు వృషధ్వజుడు. అతడు శివభక్తుడు. అతని ఆశ్రమములో శంకరుడు మూడు దేవ యుగముల వరకు స్వయముగా నివసించెను. పరమశివునకు ఆ మహారాజుపై పుత్రుని కంటె ఎక్కువ ప్రేమ ఉండినది.

ఆమహారాజు నారాయణుని పూజించలేదు. లక్ష్మిని గాని, సరస్వతినిగాని పూజించేవాడు కాదు. అందువలన సమస్త దేవపూజను అతడు దూరము చేసెను. భాద్రపద మాసములో చేయు మహాలక్ష్మీ పూజను నగాని, మాఘమాసములో చేయు సరస్వతీ పూజను కాని ఆ వృషధ్వజుడు వదలివేసెను. అందువలన దేవతలతనిని శపింపదలచినప్పటికిని శివునియొక్క భయము వల్ల అతనిని శపించుటకు ఎవరును సాహసింపలేదు.

ఒకప్పుడు సూర్యుడు మాత్రము ఆ మహారాజును నీ సంపదలన్నిటిని పోగొట్టుకొనుము అని శపించెను. అందువలన శంకరుడు కోపముతో శూలము పట్టుకొని సూర్యుని నిగ్రహించుటకు వెళ్ళెను. అది చూచి సూర్యుడు బ్రహ్మను శరణువేడెను. అందువలన బ్రహ్మదేవుడు సూర్యునితో కలిసి వైకుంఠమునకు వెళ్ళెను. శంకరుడచటికి సైతము తన శూలమును పట్టుకొని కోపముతో వెళ్ళెను. దాన్ని చూచి బ్రహ్మ, కశ్యప, సూర్యులు, నాలుకలెండిపోగా నారాయణుని శరణువేడిరి. అతనికి నమస్కరించి అనేక విధములుగా స్తుతించిరి. అట్లే వారందరు తమ భయమునకు కారణమును తెలిపిరి. నారాయణుడు వారందరకు కృపతో అభయమిచ్చును ''నేనుండగా మీరు భయపడవలసిన పనిలేదు. ఆపదలు వచ్చినప్పుడు భయముతో నన్ను స్మరించుకొనిన నేనచ్చటకు చక్రము దరించి పోయి రక్షింతును. నేను సమస్తలోకములను రక్షింతును. బ్రహ్మగా ఈలోకములను సృష్టింతును. శివరూపుడనై సంహరించెదను. నేనే శివుడను. నేనే బ్రహ్మను. నేనే సూర్యుడను. త్రిగుణాత్మకమైన అనేక రూపములను ధరించి సృష్టిమొదలగు క్రియలు చేయుచుందును.

యూయం గచ్ఛత భద్రం భవిష్యతి భయం కుతః | అద్యప్రభృతి వో నాస్తి మద్వరాత్‌ శంకరాద్భయం || 24

ఆశుతోషశ్చ సభగవాన్‌ శరణ్యశ్చ సతాం గతిః | భక్తాధీనశ్చ భ##క్తేశో భక్తాత్మా భక్తవత్సలః || 25

సుదర్శనం శివశ్చైవ మమ ప్రాణాధిక ప్రి¸° | బ్రహ్మాండేషు న తేజస్వీ హే బ్రహ్మన్ననయోః పరః || 26

శక్తం స్రష్టుం మహాదేవః సూర్యకోటిం చ లీలయా | కోటిం చ బ్రహ్మణామేవం కిమసాధ్యం చ శూలినః || 27

బాహ్యజ్ఞానం తన్న కించిత్‌ ధ్యాయతో మాం దివానిశం | మన్నామ మద్గుణం భక్త్యా పంచవక్త్రేణ గీయతే || 28

అహమేవ చింతయామి తత్కల్యాణం దివానిశం | యే యథా మాం స్రపద్యంతే తాన్‌ తథైవ భజామ్యహం || 29

శివ స్వరూపో భగవాన్‌ శివాధిష్ఠాతృదేవతా | శివో భవతి యస్మాచ్చ శివం తేన విదుర్భుధాః || 30

మీరందరు మీమీలోకములకు వెళ్ళుడు. మీరు భయపడవలసిన అవసరము లేదు.

నావరమువలన మీకు నేటినుండి శంకరుని నుండి భయములేదు. ఆ శంకరుడు తొందరగా సంతోషించువాడు. భక్తవత్సలుడు. శరణమునొసగువాడు. భక్తులకు అధీనమైనవాడు. నాకు శంకరుడు, సుదర్శన చక్రములు ప్రాణముల కంటె మిన్నయైనవి. ఈలోకములన్నిటిలో వీరికంటె తేజోవంతులు లేరు. అతడు నన్నెల్లప్పుడు ధ్యానించును. తన పంచముఖములచే నా నామస్మరణమును, నాగుణస్మరణమును ఎల్లప్పుడు చేయుచుండును. నేను కూడ ఆపరమశివుని యోగక్షేమములను చింతిచుచుందును. అతడు మంగళస్వరూపుడు. మంగళమునకు అధిదేవత. అతని స్మరణమువలన మంగళము జరుగును కావున అతడు శివుడైనాడని నారాయణుడనెను.

ఏతస్మిన్నంతరే తత్ర చాగమచ్ఛంకరః స్వయం | శూలహస్తోవృషారూఢో రక్త పంకజలోచనః || 31

అవరుహ్య వృషాత్తూర్ణం భక్తి నమ్రాత్మ కంధరః | ననామ భక్త్యా తం శాంతం లక్ష్మీకాంతం పరాత్పరం || 32

రత్న సింహాసనస్థం చ రత్నాలంకార భూషితం | కిరీటినం కుండలినం చక్రిణం వనమాలినం || 33

నవీనం నీరదశ్యామం సుందరం చ చతుర్భుజం | చతుర్భుజైః సేవితం చ శ్వేత చామరవాయునా || 34

చందనోక్షిత సర్వాంగం భూషితం పీతవాససా | లక్ష్మీప్రదత్త తాంబూలం భుక్తవంతం చ నారద || 35

విద్యాధరీ నృత్యగీతం శృణ్వంతం సస్మితం ముదా | ఈశ్వరం పరమాత్మానం భక్తానుగ్రహ విగ్రహం || 36

తం ననామ మహాదేవో బ్రహ్మాణం చ ననామ సః | ననామ సూర్యో భక్త్యా చ సంత్రస్తశ్చంద్రశేఖరం || 37

కశ్యపశ్చ మహాభక్త్యా తుష్టావ చ ననామ చ | శివః సంస్తూయ సర్వేశం సమువాస సుఖాసనే || 38

సుఖాసనే సుఖాసీనం విశ్రాంతం చంద్రశేఖరం | శ్వేత చామరవాతేన సేవితం విష్ణుపార్షదైః || 39

అక్రోధం సత్వసంసర్గాత్‌ ప్రసన్నం సస్మితం ముదా | స్తూయమానం పంచవక్త్రైః పరం నారాయణం విభుం || 40

ఆ సమయమున శంకరుడు నందినెక్కి శూలహస్తుడై ఎరుపెక్కిన కళ్ళతో అచ్చటికి వచ్చెను. అతడు నందిని దిగి భక్తితో వంచిన శిరస్సు కలవాడై పరాత్పరుడు, లక్ష్మీకాంతుడు, చతుర్భుజుడు, చతుర్భుజములు కల సేవకులచే సేవింపబడినవాడు. శరీరమంతా చందనము పూసుకొన్నవాడు, లక్ష్మీదేవిచ్చిన తాంబూలము సేవించుచున్నవాడు, విద్యాధరుల నాట్యమును గీతములను వినుచున్నవాడు, పరమాత్మ యగు నారాయణుని నమస్కరించెను. అట్లే బ్రహ్మదేవునకు కూడ శంకరుడు నమస్కరించెను.

అప్పుడు సూర్యుడు భయపడుచు భక్తితో శంకరునకు నమస్కరించెను. కశ్యప ప్రజాపతి కూడ అతనికి నమస్కరించెను. శంకరుడు సర్వేశ్వరుని స్తుతించి విష్ణుపార్షదులు చామరములు వీయుచుండగా సుఖాసనమున విశ్రాంతి తీసికొనుచుండెను.

తమువాచ ప్రసన్నాత్మ ప్రసన్నం సురసంసది | పీ%యూషతుల్యం మధురం వచనం సుమనోహరం || 41

అప్పుడు ప్రసన్నాత్ముడైన శ్రీమాన్నారాయణుడు, ప్రసన్నుడై శంకరునితో మధురముగా ఇట్లు మాట్లాడెను.

శ్రీభగవానువాచ- శ్రీమన్నారాయణుడిట్లనెను-

అత్యంతముపహాస్యం చ శివప్రశ్నం శివే శివం | లౌకికం వైదికం చైవ త్వాం పృచ్ఛామి తథాzపి శం || 42

తపసాం ఫలదాతారం దాతారం సర్వసంపదాం | సంపత్ర్పశ్నం తపః ప్రశ్నేమయోగ్యం త్వాం చ సాంప్రతం || 43

జ్ఞానాధిదేవే సర్వజ్ఞే జ్ఞానం పృచ్ఛామి కిం వృథా | నిరాపది విపత్ర్పశ్నమలం మృత్యుంజయే హరే || 44

త్వామేవ వాగ్ధనం ప్రశం అలం స్వాశ్రయమాగమే | ఆగతోzసి కథం వేగాదిత్యువాచ రమాపతిః || 45

మంగళస్వరూపుడవైన పరమేశ్వరా! నిన్ను మంగళమును గూర్చి అడుగుట ఉపహాస కరమైనది. ఐనను మీ క్షేమమును అడుగుచున్నాను. తపఃఫలమును సర్వసంపదలను ఇచ్చు నిన్ను సంపదలగురించి తపస్సు గురించి అడుగుట తగనిది. మృత్యుంజయుడవైన నిన్ను ఆపదలగురించి అడుగుట తగనది. ఐనను నీవిచ్చటికి ఇంత త్వరగా ఏలవచ్చితిరని నారాయణుడు అడిగెను.

శ్రీమహాదేవ ఉవాచ- మహాదేవుడిట్లనెను-

వృషధ్వజం చ మద్భక్తం మమప్రాణాధిక ప్రియం | సూర్యః శశాప ఇతి మే హేతు రాగమకోపయోః || 46

పుత్రవాత్సలశోకేన సూర్యం హంతుం సముద్యతః | సబ్రహ్మాణం ప్రపన్నశ్చ ససూర్యశ్చ విధిస్త్వయి || 47

త్వాం యే శరణమాపన్నా ధ్యానేన వచసాzపివా | నిరాపదస్తే నిశ్శంకా జరామృత్యుశ్చ తైర్జితః || 48

సాక్షాద్యే శరణాపన్నాః తత్ఫలం కిం వదామి భోః | హరి స్మృతిశ్చాభయదా సర్వ మంగళదా సదా || 49

కిం మే భక్తస్య భవితా తన్మే బ్రూహిజగత్పతే | శ్రీహతస్యాzస్యమూఢస్య సూర్య శాపేన హేతునా || 50

ఓ భగవంతుడా! వృషధ్వజుడను నా భక్తుని సూర్యుడు శపించినందువలన కోపించి ఇక్కడకు వచ్చితిని. వృషధ్వజునిపై గల పుత్ర వాత్సల్యముతో, శోకముతో సూర్యుని చంపసమకట్టితిని. అతడు బ్రహ్మదేవుని శరణుపొందగా వారిద్దరు నిన్ను శరణుపొందిరి.

నిన్ను ధ్యానమాత్రముననో మాటతోడనో శరణు పొందినవారికి ఎట్టి ఆపదలుండవు. అట్టి సమయమున సాక్షాత్తు నిన్నే శరణన్నవారికి ఏభయమూ ఉండదు. శ్రీహరిస్మరణ అభయమును, సమస్త మంగళములను ఒసగును.

ఐనచో సూర్యుని యొక్క శాపము వలన సర్వస్వమును కోలుపోయిన నా భక్తుని గతి ఏమిటో వివరింపుము.

శ్రీభగవానువాచ- భగవంతు డిట్లనెను-

కాలోzతియాతో దైవేన యుగానామేకవింశతిః | వైకుంఠే ఘటికార్ధేన శీఘ్రం యాహి నృపాలంయం || 51

వృషధ్వజో మృతః కాలాత్‌ దుర్నివార్యాత్సుదారుణాత్‌ | హంసధ్వజశ్చ తత్పుత్రో మృతః సోzపి శ్రియాహతః || 52

తత్పుత్రౌ చ మహాభాగౌ ధర్మధ్వజ కుశధ్వజా | హతశ్రి¸° సూర్యశాపాత్తౌ వై పరమవైష్ణవౌ || 53

రాజ్యభ్రష్టౌ శ్రియాభ్రష్టౌ కమలా తాపసావుభౌ |తయోశ్చ భార్యోయోః లక్ష్మీః కళయా చ జనిష్యతి || 54

సంపద్యుక్తౌ తదా తౌ చ నృపశ్రేష్ఠా భవిష్యతః | మృతస్తే సేవకః శంభో గచ్ఛ యూయం చ గచ్ఛత || 55

ఇత్యుక్త్వా చ సలక్ష్మీకః సభాతోzభ్యంతరం గతః | దేవా జగ్ముశ్చ హంహృష్టా స్వాశ్రమం పరమం ముదా || 56

శివశ్చ తపసే శీఘ్రం పరి%పూర్ణతమో య¸° ||

పరమ శివా! వైకుంఠమున నీవు గడిపిన అరగడియ కాలమున భూలోకమున ఇరవై ఒక్క యుగములు గడిచినవి. నీవు శీఘ్రముగా నీ భక్తుని ఇంటికి వెళ్ళుము. అక్కడ కాలవశమున నీ భక్తుడగు వృషధ్వజుడు చనిపోయెను. అతని పుత్రుడైన హంసధ్వ జుడు సహితము చనిపోయెను. అతని పుత్రుడైన హంసధ్వేజుడు సహితము చనిపోయెను. అతని పుత్రులైన ధర్మధ్వజ కుశధ్వజులు ప్రస్తుతమున్నారు. వార పరమ వైష్ణవులైనను సూర్యుని శాపమువలన రాజ్యభ్రష్టులైనారు. వారి భార్యలకు లక్ష్మీదేవి తన అంశ స్వరూపముతో జన్మించును. అప్పుడు వారు ధనవంతులై రాజ్యము పొందగలరు.

ఓశంకరుడా! నీ భక్తుడు ఎప్పుడో చనిపోయెను. కావున మీరు మీమీ లోకములకు పొండు అని శ్రీహరి సభనుండి లేచి అంతఃపురమును ప్రవేశించెను. దేవతలందరు తమ లోకములకేగిరి. శివుడు తపస్సు చేయుటకు తన ఆశ్రమమునకు వెళ్ళిపోయెను.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ ద్వితీయే ప్రకృతిఖండే నారద నారాయణ సంవాదే తులస్యుపాఖ్యానం నామత్రయోదశసర్గః

శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణములో రెండవదైన ప్రకృతి ఖండములో నారద నారాయణ సంవాద సమయమున చెప్పబడ్డ తులస్యుపాఖ్యానమను

పదమూడవ అధ్యాయము సమాప్తము.

sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters