sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
5. పంచమోzధ్యాయః - గోవులు, గోపికాగోపులు, రాధాదేవి మొ.వారి ఆవిర్భావం శౌనక ఉవాచ- శౌనక మహర్షి ఇట్లు పలికెను- గోగోప గోప్యో గోలోకే కిం నిత్యాః కింను కల్పితాః | మమ సందేహ భేదార్థం తన్మే వ్యాఖ్యాతుమర్హసి || 1 గోవులు, గోపకులు, గోపికలు గోలోకమున నిత్యము ఉంటారా? లేక కల్పించబడినవారా? నా సందేహ నివృత్తికై మీరు దీనిని విపులముగా వాఖ్యానించగలరు. సౌతిరువాచ- సౌతి మహర్షి ఇట్లనెను. సర్వాదిసృష్టౌ తాః క్లుప్తాః ప్రళ##యే ప్రళ##యే స్థితాః | సర్వాదిసృష్టి కథనం యన్మయా కథితం ద్విజ || 2 సర్వాది సృష్టౌ క్లుప్తౌ చ నారాయణ మహేశ్వరౌ | ప్రళ##యే ప్రళ##యే వ్యక్తా స్థితౌ తౌ తౌ ప్రకృతిశ్చ సా || 3 సర్వాదౌ బ్రహ్మకల్పస్య చరితం కథితం ద్విజ | వారాహపాద్మకల్పౌ ద్వౌ కథయిష్యామి శ్రోష్యసి || 4 బ్రహ్మ వారాహ పాద్మాశ్చ కల్పాశ్చ త్రివిధామునే | యథా యుగాని చత్వారి క్రమేణ కథితాని చ || 5 సత్యం త్రేతా ద్వాపరంచ కలిశ్చేతి చతుర్యుగం | త్రిశ##తైశ్చ షష్ఠ్యధికైః యుగైః దివ్యం యుగం స్మృతం || 6 మన్వంతరంతు దివ్యానాం యుగానాం ఏకసప్తతిః | చతుర్దశేషు మనుషు గతేషు బ్రహ్మణో దినం || 7 త్రిశ##త్తెశ్చ షష్ట్యధికై ర్దినైః వర్షం చ బ్రహ్మణః | అష్టోత్తరం వర్షశతం విధేరాయుర్నిరూపితం || 8 ఏతన్నిమేష కాలస్తు కృష్ణస్య పరమాత్మనః | బ్రహ్మణశ్చాయుషా కల్పః కాలవిద్భిర్నిరూపితః || 9 క్షుద్ర కల్పాః బహుతరాస్తే సంవర్తాదయః స్మృతాః | సప్తకల్పాంతజీవీ స మార్కండేయశ్చ తన్మతః || 10 బ్రహ్మణశ్చ దినేనైవ స కల్పః పరికీర్తితః | విధేశ్చ సప్తదివసే మునేరాయుర్నిరూపితం || 11 సర్వాది సృష్టిని గురించి నేను నీకింతకుముందే వివరించితిని. సర్వాదిసృష్టిలో నారాయణ మహేశ్వరులు, ప్రకృతి, ఇతర దేవతలు సృష్టింపబడి ప్రతి ప్రళయమువరకు ఉందురు. ఓ శౌనక మహర్షీ! బ్రహ్మ కల్పమునందు జరిగిన సృష్టిని గురించి నీకింతకు ముందే వివరించితిని. బ్రహ్మకల్పము తరువాత ఉన్న వారాహ పాద్మ కల్పముల గురించి నీకు ముందు వివరింతును. సత్య యుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అని నాలుగు యుగములు. 360 (మూడువందల అరువది యుగములను దివ్య యుగమని పిలుతురు. డెబ్బది ఒక్క (71) దివ్య యుగములు ఒక మన్వంతరము. పదునాలుగు మన్వంతరములు బ్రహ్మదేవునికి ఒక దినము. మూడు వందల అరువది దినములు గల నూటఎనిమిది (108) బ్రహ్మ సంవత్సరములు అతని ఆయుస్సు. బ్రహ్మదేవుని ఆయుఃపరిమితిమైన కాలము శ్రీకృష్ణ పరమాత్మకు ఒక నిముషము. బ్రహ్మ దేవుని ఆయుఃపరిమితమైన కాలమును 'కల్ప' మని అందురు. ఇంకను సామాన్యమైన, సంవర్తనము మొదలైన కల్పములు అనేకమున్నవి. ఇవి బ్రహ్మదేవుని ఏక దిన పరిమితములు. మార్కండేయ మహర్షి సప్తకల్పాంతజీవి అని అందురు. అనగా బ్రహ్మదేవుని ఏడు దినముల కాలము అతడు జీవించియుండును. బ్రహ్మవారాహ పాద్మాశ్చ త్రయః కల్పానిరూపితాః | కల్పత్రయే యథాసృష్టిః కథయామి నిశామయ || 12 బ్రాహ్మేచ మేదినీం సృష్ట్యా స్రస్టా సృష్టిం చకార సః | మధుకైటభయోశ్చైవ మేదసా చాజ్ఞయా ప్రభోః || 13 వారాహే తాం సముద్ధృత్య లుప్తాం మగ్నాం రసాతలాత్ | విష్టోః వరాహరూపస్య ద్వారా చాతిప్రయత్నతః || 14 పాద్మే విష్ణోః నాభిపద్మే స్రస్టా సృష్టిం వినిర్మమే | త్రిలోకీం బ్రహ్మలోకాంతాం నిత్యలోకత్రయం వినా || 15 ఈ విధముగా బ్రహ్మ, వారాహ, పాద్మ కల్పములు ఉండును. ఈ మూడు కల్పములందు జరిగిన సృష్టిక్రమమును నీకు వివరింతును. బ్రాహ్మకల్పమున శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆజ్ఞచే మధు, కైటభుల మేదస్సుచే బ్రహ్మదేవుడు మేదినిని సృష్టించెను. వారాహకల్పమున సముద్రములో పడిపోయిన భూమిని విష్ణువు వరాహ రూపమున పాతాళలోకమునుండి ఉద్ధరించెను. పాద్మ కల్పమున విష్ణుమూర్తి నాభికమలముననున్న బ్రహ్మదేవుడు వినాశములేక నిత్యమైన గోలోకము మొదలైన మూడు లోకములను వదిలి బ్రహ్మలోకము వరకున్న లోకములనన్నిటిని బ్రహ్మదేవుడు సృష్టించెను. ఏతత్తుకాల సంఖ్యానం ఉక్తం సృష్టి నిరూపణ | కించిన్నిరూపణం సృష్టేః కిం భూయః శ్రోతు మిచ్ఛసి || 16 ఇంతవరకు సృష్టి నిరూపణ ప్రకరణమున కాలమునకు సంబంధించిన విషయమును చెప్పితిని. ఇంకను సృష్టి నిరూపణమునకు చెందిన విషయము నేమైనా వినదలచుకున్నావా? శౌనక ఉవాచ- శౌనక మహర్షి ఇట్లనెను. అతః పరం కించకార భగవాన్ సాత్వతాం పతిః | ఏతాన్ సృష్ట్యా కిం చకార తన్మే వ్యాఖ్యాతు మర్హసి || 17 జగత్పతియైన శ్రీకృష్ణుడు బ్రహ్మాదులనందరిని సృష్టించిన తరువాత ఏమి చేసెనో దానిని నాకు విపులముగా తెలుపుడని సౌతిమహర్షి నడిగెను. సౌతి రువాచ- సౌతి మహర్షి ఇట్లు పలికెను. అతః పరంతు గోలోకే గోలేకేశో మహాన్ ప్రభుః | ఏతాన్ సృష్ట్యా జగామాసౌ సురమ్యం రాసమండలం || 18 రమ్యాణాం కల్పవృక్షాణాం మధ్యేzతీవ మనోహరం | సువిస్తీర్ణం చ సుసమం సుస్నిగ్ధం మండలీకృతం || 19 చందనాగురు కస్తూరీ కుంకుమైశ్చ సుసంస్కృతం | దధిలాజ సక్తు ధాన్య దూర్వాపర్ణ పరిప్లుతం || 20 పట్ట సూత్రగ్రంథి యుక్తం నవచందనపల్లవైః | సంయుక్త రంభాస్తంభానాం సమూహైః పరివేష్టితం || 21 సద్ర్నసార నిర్మాణ మండపానాం త్రికోటిభిః | రత్న ప్రదీప జ్వలితైః పుష్ఫ ధూపాధివాసితైః || 22 శృంగారార్హ భోగవస్తుసమూహ పరివేష్టితం | అతీవ లలితాకల్పతల్పయుక్తైః సుశోభితం || 23 తత్ర గత్వాచలైః సార్థం సమువాస జగత్పతిః | దృష్ట్యా రాసం విస్మితాస్తే బభూవుర్మునిసత్తమ || 24 బ్రహ్మాదులనందరిని సృష్టించిన తరువాత గోలోకమునకు అధిపతి, మహాప్రభువైన శ్రీకృష్ణుడు గోలోకమున ఉన్న అందమైన రాసమండలమునకు వెళ్ళెను. ఆ రాసమండలము అందమైన కల్పవృక్షముల మధ్య ఉన్నది. మిక్కిలి విస్తీర్ణమైనది. ఎత్తు పల్లములు లేక సమానముగానున్నది. మండలాకారముతో నున్నది. అది చందనము అగురు, కస్తూరి, కుంకుమాది సుగంధ ద్రవ్యములు చల్లబడిన ప్రదేశము. పెరుగు, పేలాలు, సత్తుపిండి, ధాన్యము, గరిక, ఆకులతోనిండి ఉన్న ప్రదేశము. జంటగా నున్న అరటి స్తంభముల సమూహముతో, మంచి రత్నములతో నిర్మించిన మండపములతో, వెలుగుతున్న రత్న దీపములతో పుష్ఫధూప దీపములచే మంచి వాసన కలిగిన ప్రదేశము. శృంగార భోగమునకు తగిన వస్తువులతో, కల్పవృక్ష కల్పితములైన మిక్కిలి సున్నితమైన పురుపులతో నిండి ఉన్న ప్రదేశమిది. అచ్చటికి జగత్పతి, దేవతలతో కలిసి వెళ్ళి కూర్చుండెను. అత్యద్భుతమైన ఆ రాసమండలమును చూచి దేవతలందరు మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆవిర్భభూవ కన్యైకా కృష్ణస్య వామ పార్శ్వతః | ధావిత్వా పుష్పమానీయ దదావర్ఘ్యం ప్రభోః పదే || 25 రాసే సంభూయ గోలోకే సా దధావ హరేః పురః | తేన రాధా సమాఖ్యాతా పురావిద్భిర్ధ్విజోత్తమ || 26 ప్రాణాధిష్ఠాతృదేవీ సా కృష్ణస్య పరమాత్మనః | ఆవిర్భభూవ ప్రాణభ్యః ప్రాణభ్యోzపిగరీయసీ || 27 దేవీ షోడశవర్షీయా నవ¸°వనసంయుతా | వహ్నిశుద్ధాంశుకాధానా సస్మితా సమనోహరా || 28 సుకోమలాంగీ లలితా సుందరీషు చ సుందరీ | బృహన్నితంబభారార్తా పీనశ్రోణి పయోధరా || 29 బంధుజీవజితారక్త సుందరోష్ఠాధరావరా | ముక్తాపంక్తిజితా చారుదంతపంక్తిర్మనోహరా || 30 శరత్పార్వణ కోటీందుశోభామృష్ట శుభాననా | చారుసీమంతినీ చారు శరత్పంకజలోచనా || 31 ఖగేంద్ర చంచు విజిత చారునాసా మనోహరా | స్వర్ణగండూక విజితే గండయుగ్మేచ బిభ్రతీ || 32 దధతీ చారు కర్ణేచ రత్నాభరణ భూషితే | చందనాగురు కస్తూరీ యుక్త కుంకుమ బిందుభిః || 33 సిందూర బిందు సంయుక్త సుకపోలా మనోహరా | సుసంస్కృతం కేశపాశం మాలతీమాల్యభూషితం || 34 సుగంధ కబరీభారం సుందరం దధతీ సతీ | స్థల పద్మ ప్రభామ్రుష్టం పాదయుగ్మంచ బిభ్రతీ || 35 గమనం కుర్వతీ సాచ హంస ఖంజన గంజనం | సద్రత్న సార నిర్మాణాం వనమాలాం మనోహరం || 36 హారం హీరకనిర్మాణం రత్నకేయూర కంకణం | సద్రత్న సార నిర్మాణం పాశకం సుమనోహరం || 37 అమూల్యరత్న నిర్మాణం క్వణన్మంజీర రంజితం | నానా ప్రకార చిత్రాఢ్యం సుందరం పరిబిభ్రతీ || 38 సా చ సంభాష్య గోవిందం రత్న సింహాసనే వరే | ఉవాస సస్మితా భర్తుః పశ్యంతీ ముఖ పంకజం || 39 శ్రీకృష్ణ పరమాత్మ ఎడమ భాగమున ఒక కన్య ఆవిర్భవించెను. ఆ కన్య వెంటనే పరుగెత్తుకొనిపోయి పుష్పమును తెచ్చి శ్రీహరి పాదములపై అర్ఘ్యముగా సమర్పించెను. గోలోకమున రాసమండలమున శ్రీహరిముందు పరుగెత్తినది (రాసే దధావ) కాన ఆమెను రాధ అని పిలిచిరి. ఆ రాధ శ్రీకృష్ణపరబ్రహ్మకు ప్రాణాధిష్ఠాతృదేవి. ప్రాణములలో ప్రాణము. పదునారు సంవత్సరాల నవ¸°వన. ఆమె బంగారువన్నెగల చీరను ధరించినది. చిరునగవుతో మిక్కిలి సుందరముగా నున్నది. కోమలాంగి, సుందరస్త్రీలకు సుందరి. బృహన్నితంబభారముతో పీనపయోధరములతో, మంకెన పూవు వన్నెను మించిన అధరోష్ఠముతో, పున్నమి చంద్రుల కాంతిని మించిన ముఖముతో, చక్కని పాపెడతో, శరత్కాల చంద్రునివంటి నేత్రములతో గరుత్మంతుని ముక్కు కంటె చక్కనైన నాసికతో, స్వర్ణగండూకమును మించు చెక్కిళ్ళతో, రత్నాభరణములు గల చెవులతో మిక్కిలి అందముగా నున్నది. చందనము, అగురు, కస్తూరితో కూడిన కుంకుమ బిందువులతో, సిందూర బిందువులు కల చెక్కిళ్ళతో మనోహరముగా నున్నది. మాలతీ పుష్పమాలతో, సువాసనలు కల కొప్పుముడిని, పద్మములకన్న మిన్న ఐన పాదములు కలది. ఆమె నడక హంస నడక. వనమాలా విరాజిత. వజ్రహార ధర. రత్నమయములైన చేతి కంకణములను, ఘల్లు ఘల్లు మని మ్రోయు అందెలను, నానావిధ చిత్రములు అంచులో గల చీరను ధరించిన ఆ రాధాదేవి శ్రీకృష్ణుని పలుకరించి అతనికి ఎదురుగా రత్నసింహాసనమున కూర్చున్నది. తస్యాశ్చ లోమకూపేభ్యః సద్యో గోపాంగనాంగణః | ఆవిర్భభూవ రూపేణ వేషేణౖవ చ తత్సమః || 40 లక్షకోటీ పరిమితః శశ్వత్సుస్థిర ¸°వనః | సంఖ్యావిద్భిశ్చ సంఖ్యాతో గోలోకే గోపికాగణః || 41 కృష్ణస్య లోమ కూపేభ్యః సద్యో గోపగణో మునే | ఆవిర్భభూవ రూపేణ వేషేణౖవ చ తత్సమః || 42 త్రింశత్‌కోటి పరిమితః కమనీయో మనోహరః | సంఖ్యావిద్భిశ్చ సంఖ్యాతో బల్లవానాం గణః శృతౌ || 43 కృష్ణస్య లోమ కూపేభ్యః సద్యశ్చావిర్బభూవ హా | నానావర్ణో గోగణశ్చ శశ్వత్ సుస్థిర ¸°వనః || 44 బలీవర్దాః సురభ్యశ్చ వత్సా నానావిధాః శుభాః | అతీవ లాలితాః శ్యామాః బహ్వ్యో వై కామధేనవః || 45 తేషామేకం బలీవర్దం కోటి సింహసమం బలే | శివాయ ప్రదధౌ కృష్ణః వాహనాయ మనోహరం || 46 ఆ రాధాదేవి యొక్క రోమకూపములనుండి, రూపమున, వేషమున ఆమెతో సమానముగా నున్న లక్షకోటి సంఖ్యగల గోపికా గణము ఆవిర్భవించెను. ఆ గోపికాగణము సుస్థిరమైన ¸°వనము కలది. అట్లే శ్రీకృష్ణుని రోమ కూపములనుండి, రూపమున, వేషమున శ్రీకృష్ణుని వలె ఉన్న ముప్పది కోట్ల గోపకుల సమూహము ఆవిర్భవించినది. అట్లే శ్రీకృష్ణుని యొక్కరోమకూపములనుండి అనేక రంగులు కల గోగణము ఆవిర్భవించెను. అందు అనేక విధములైన ఎడ్లు, ఆవులు, లేగలు ఉన్నవి. అనేకమైన కపిల ధేనువులు వాటిలో ఉన్నవి. ఆగోగణములో కోటి సింహముల బలము కల ఒక ఎద్దును శ్రీకృష్ణుడు శివునకు వాహనముగా ఇచ్చెను. కృష్ణాంఘ్రి నఖరంధ్రేభ్యః హంస పంక్తిర్మనోహరా | ఆవిర్భభూవ సహసా స్త్రీపుం వత్స సమన్వితా || 47 తేసామేకం రాజహంసం మహాబలపరాక్రమం | వాహనాయ దదౌ కృష్ణః బ్రహ్మణ చ తపస్వినే || 48 వామకర్ణస్య వివరాత్ కృస్ణస్య పరమాత్మనః | గణః శ్వేతతురంగాణామావిర్భూతో మనోహరః || 49 తేషామేకం చ శ్వేతాశ్వం ధర్మార్థం వాహనాయ చ | దదౌ గోపాంగనేశశ్చ సంప్రీత్యా సురసంసది || 50 దక్షకర్ణస్య వివరాత్ పుంసశ్చ సురసంసది | ఆవిర్భూతా సింహపంక్తిర్మహాబలపరాక్రమా || 51 తేషామేకం దదౌ కృష్ణః ప్రకృత్యై పరమాదరం | అమూల్యరత్నమాల్యం చ వరం యదభివాంఛితం || 52 శ్రీకృష్ణుని కాలిగోళ్ళనుండి స్త్రీ, పుం, వత్స సమన్వితమైన రాజహంసలగణమావిర్భవించెను. ఆ రాజహంసలలో మంచి బలిష్ఠమైన ఒక రాజహంసను శ్రీకృష్ణుడు బ్రహ్మ దేవునకు ఇచ్చెను. శ్రీకృష్ణుని ఎడమ చెవిలోనుండి తెల్లని గుఱ్ఱముల సమూహము ఆవిర్భవించెను. ఆగుఱ్ఱములలో ఒక మంచి గుఱ్ఱమును ధర్మునకు వాహనముగానిచ్చెను. ఆతని కుడిచెవిలోనుండి మిక్కిలి బలిష్ఠమైన సింహముల సమూహము ఆవిర్భవించెను. ఆ సింహములలో ఒక మేలైన సింహమును శ్రీకృష్ణుడు ప్రకృతి స్వరూపిణియైన దుర్గాదేవికి ఇచ్చెను. ఇంకను ఆమెకు ఇష్టమైన వరములను అమూల్యమైన రత్నములను, పూలమాలలను శ్రీకృష్ణుడు ఇచ్చెను. కృష్ణో యోగేన యోగీంద్రః చకార రథపంచకం | శుద్ధ రత్నేంద్ర నిర్మాణం మనోయాయి మనోహరం || 53 లక్షయోజనమూర్ధ్వేచ ప్రస్థే చ శతయోజనం | లక్షచక్రం వాయురహం లక్షక్రీడా గృహాన్వితం || 54 శృంగారార్హం భోగవస్తు తల్పాzసంఖ్య సమన్వితం | రత్నప్రదీప లక్షాణాం వాజిభిశ్చ విరాజితం || 55 నానాచిత్ర విచిత్రాఢ్యం సద్రత్న కలశోజ్వలం | రత్నదర్పణ భూషాఢ్యం శోభితం శ్వేతచామరైః || 56 వహ్నిశుద్ధాంశుకైశ్చిత్రైః ముక్తాజాలైర్విభూషితం | మణీంద్ర ముక్తామాణిక్య హీరహార విరాజితం || 57 ఆరక్త వర్ణ రత్నేంద్రసార నిర్మాణ కృత్రిమైః | పంకజానామసంఖ్యైశ్చ సుందరైశ్చ సుశోభితం || 58 దదౌ నారాయణాయైకం తేషాం మధ్యే ద్విజోత్తమ | ఏకం దత్వా రాధికాయై రరక్షాzశేషమాత్మనే || 59 యోగీంద్రుడగు శ్రీకృష్ణుడు తన యోగముచే పరిశుద్ధ రత్నములలో కూడియున్న మనోహరమైన ఐదు రథములను నిర్మించెను. అవి ఒక్కొక్కటి లక్షయోజనముల ఎత్తుగలవి. శతయోజన విస్తీర్ణము కలవి. వాయువేగము కల ఆ రథములు లక్షచక్రములతో, లక్షక్రీడా గృహములతో, శృంగారమునకు తగిన భోగవస్తువులో, అసంఖ్యాకమైన పరుపులతో కూడుకున్నవి. ఇంకను అవి అనేక చిత్రములతో, విచిత్రములతో, ముత్యాల వరుసలతో, మంచి రత్నకలశములతో, రత్నదర్పణములతో, భూషణములతో, తెల్లని చామరములతో, బంగారు వన్నెగల, చిత్రవస్త్రములతో, ఇంద్రమణులు, ముత్యాలు, మాణిక్యముల హారములతో నున్నవి. చాల అందమైన, సంపూర్ణముగా ఎఱ్ఱనైన రత్నములచే నిర్మింపబడిన కృత్రిమమైన తామరపుష్పములు అసంఖ్యాకముగా ఆ రథములందున్నవి. అటువంటి రథములలో నొక దానిని శ్రీకృష్ణుడు నారాయణున కిచ్చెను. ఇంకొక దానిని రాధాదేవికి ఇచ్చెను. మిగిలిన మూడు రథములను తనవద్దనే ఉంచుకొనెను. ఆవిర్బభూవ కృష్ణస్య గుహ్య దేశాత్తతః పరం | పింగళశ్చ పుమానేకః పింగళైశ్చ గణౖస్సహ || 60 ఆవిర్భూతా యతోగుహ్యాత్ తేన తే గుహ్యకాః స్మృతాః | యః పుమాన్ స కుబురశ్చ ధనేశో గుహ్యకేశ్వరః || 61 బభూవ కన్యకా చైకా కుబేరే వామ పార్శ్వతః | కుబేరపత్నీ సాదేవీ సుందరీణాం మనోరమా || 62 భూతప్రేత పిశాచాశ్చ కూష్మాండ బ్రహ్మ రాక్షసాః | వేతాలా వికృతాస్తస్యావిర్భూతా గుహ్యదేశతః || 63 శంఖ చక్ర గదాపద్మ ధారిణో వనమాలినః | పీతవస్త్రపరీధానాః సర్వే శ్యామచతుర్భుజాః || 64 కిరీటినః కుండలినో రత్నభూషణ భూషితాః | ఆవిర్భూతాః పార్షదాశ్చ కృష్ణస్య ముఖతోమునే || 65 చతుర్భుజాన్ పార్షదాంశ్చ దదౌ నారాయణాయచ | గుహ్యకాన్ గుహ్యకేశాయ భూతాదీన్ శంకరాయచ || 66 శ్రీకృష్ణుని గుహ్య ప్రదేశమునుండి పింగళ వర్ణము కల పురుషుడొకడు పింగళ వర్ణము కల వ్యక్తుల సమూహముతో ఆవిర్భవించెను. గుహ్య ప్రదేశమునుండి పుట్టినందువలన వారిని గుహ్యకులని అనిరి. ఆ గుహ్యకులలో మొదట పుట్టిన పురుషుడు కుబేరుడు. అతడు ధనపతి, గుహ్యకులకందరికి అధిపతి. ఆ కుబేరుని ఎడమ పార్శ్వమున ఉదయించిన సుందరి కుబేరుని పత్ని, అదేవిధముగా పరమేశ్వరుని యొక్క గుహ్య ప్రదేశమునుండి భూత, ప్రేత, పిశాచులు, కూష్మాండ, బ్రహ్మ రాక్షసులు, భేతాళురు పుట్టినారు. శ్రీకృష్ణుని యొక్క ముఖమునుండి శంఖ, చక్ర, గదా, పద్మములను, వనమాలలను, పీత వస్త్రములను ధరించినవారు, నల్లనివారు, నాల్గుభుజములు కలవారు, కుండలములు, కిరీటములను, రత్నభూషణములను ధరించిన పార్షదులు ఉద్భవించిరి. చతుర్భుజులైన పార్షదులను శ్రీకృష్ణదేవుడు నారాయణున కిచ్చెను, గుహ్యకులను గుహ్యకేశుడైన కుబేరునకిచ్చెను. భూత, ప్రేత, పిశాచాదులను శంకరునకు ఇచ్చి వేసెను. ద్విభుజాః శ్యామవర్ణాశ్చ జపమాలాకరా వరాః | ధ్యాయంతశ్చరణాంభోజం కృష్ణస్య సతతం ముదా || 67 దాస్యే నియుక్తా దాసాశ్చైవార్ఘ్యమాదాయ యత్నతః | ఆవిర్భూతా వైష్ణవాశ్చ సర్వే కృష్ణపరాయణాః || 68 పులకాంకితసర్వాంగాః సాశ్రునేత్రాః సగద్గదాః | ఆవిర్భూతాః పాదపద్మాత్ పాదపద్మైకమానసాః || 69 ఆవిర్భభూవుః కృష్ణస్య దక్షనేత్రాద్భయంకరాః | త్రిశూల పట్టిశధరాస్త్రినేత్రాశ్చంద్రశేఖరాః || 70 దిగంబరా మహాకాయాః జ్వలదగ్ని శిఖోపమాః | తే భైరవా మహాభాగాః శివతుల్యాశ్చ తేజసా || 71 రురు సంహార కాలాఖ్యాః అసిత క్రోధ భీషణాః | మహాభైరవ ఖట్వాంగా విత్యష్టౌ భైరవాః స్మృతాః || 72 రెండు భుజములు కలవారు, నల్లనివారు, ఎల్లప్పుడు జపమాలను చేతియందుంచుకొన్నవారు, శ్రీకృష్ణుని యొక్క పాదములను ఎల్లప్పుడు ధ్యానించుచున్నవారు, శ్రీకృష్ణదాసుల దాస్యమునందున్నవారు, శ్రీకృష్ణ పరాయణులు, శ్రీకృష్ణ నామస్మరణముచే పులకించిన అవయవములు కలవారు, కళ్ళలోనుండి నీరు స్రవించగా గద్గద కంఠులైన, వైష్ణవులు శ్రీకృష్ణుని పాద పద్మములనుండి ఆవిర్భవించిరి. శ్రీకృష్ణుని కుడికంటినుండి భయంకరమైనవారు, త్రిశూలము, పట్టిశమను ఆయుధముల ధరించినవారు, చంద్రుని శిరస్సులో కలవారు, మహాకాయులు, జ్వలించుచున్న అగ్ని శిఖలవలెనున్నవారు, శివునితో సమానమైన తేజస్సు కలవారు, పూజ్యులు, దిగంబరులైన అష్టభైరవులు పుట్టిరి. వారి పేర్లు వరుసగా రురు, సంహార, కాల, అసిత, క్రోధ, భీషణ, మహాభైరవ, ఖట్వాంగ అనునవి. ఆవిర్భభూవ కృష్ణస్య వామనేత్రాత్ భయంకరః | త్రిశూల, పట్టిశ, వ్యాఘ్రచర్మాంబర గదాధరః || 73 దిగంబరో మహాకాయః త్రేణత్రశ్చంద్రశేఖరః | స ఈశానో మహాభాగో దిక్పాలానామధీశ్వరః || 74 డాకిన్యశ్చైవ యోగిన్యః క్షేత్రపాలాః సహస్రశః | ఆవిర్భభూవుః సహసా పుంసో వై పృష్ఠదేశతః || 76 శ్రీకృష్ణుని యొక్క ఎడమ కంటినుండి భయంకరమైనవాడు, త్రిశూలము, పట్టిశ, గద అనే ఆయుధములను, వ్యాఘ్ర చర్మమును ధరించినవాడు, మహాకాయుడు, మూడు కన్నులు కలవాడు, దిగంబరుడు, చంద్రశేఖరుడైన ఈశ్వరుడు ఆవిర్భవించెను. అతడు దిక్పాలకులకందరికి అధిపతి. శ్రీకృష్ణుని ముక్కునుండి క్షేత్రపాలకులు, యోగులు ఐన డాకినులు ఉద్భవించిరి. అట్లే ఆ పరమాత్మయొక్క పృష్ఠ ప్రదేశమునుండి దివ్యమూర్తులను ధరించిన మూడు కోట్ల దేవతలు ఉద్భవించిరి. ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ సౌతి శౌనక సంవాదే సృష్టినిరూపణ బ్రహ్మఖండే పంచమోzధ్యాయః శ్రీబ్రహ్మ వైవర్తమహాపురాణమున సౌతి శౌనక సంవాద రూపమైన బ్రహ్మ ఖండములోని సృష్టినిరూపణ ప్రకరణమున ఐదవ అధ్యాయము సమాప్తము.