sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
ఏకవింశితతమోzధ్యాయః - సాలగ్రామ వివరణ నారద ఉవాచ - నారదుడు నారాయణునితోనిట్లనెను - నారాయణశ్చ భగవాన్ వీర్యాధానం చకార హ | తులస్యాం కేన రూపేణ తన్మే వ్యాఖ్యాతుమర్హసి || 1 భగవంతుడగు నారాయణుడు తులసీదేవితో ఎట్లు సంగమించెనో ఆవృత్తాంతమునంతయు నాకు వివరముగా తెల్పగలరు. నారాయణ ఉవాచ - నారాయణుడు నారదునితోనిట్లు పలికెను. నారాయణశ్చ భగవాన్ దేవానాం సాధనేన చ | శంఖచూడస్య రూపేణ రేమే తద్రమయా సహ || 2 శంఖ చూడస్య కవచం గృహీత్వా మాయయా హరిః | పునర్విధాయ తద్రూపం జగామ తులసీగృహం || 3 దుందుభిం వాదయామాస తులసీ ద్వారసన్నిధౌ | జయశబ్దరవద్వారా బోధయామాస సుందరీం || 4 తచ్ర్ఛుత్వా సా చ సాధ్వీచ పరమానందసంయుతా | రాజమార్గ గవాక్షేణ దదర్శ పరమాదరాత్ || 5 బ్రహ్మణభ్యో ధనం దత్వా కారయామాస మంగళం | బందిభ్యో భిక్షుకేభ్యశ్చ వాచికేభ్యో ధనం దదౌ || 6 అవరుహ్య రథాద్దేవో దేవ్యాశ్చ భవనం య¸° | అమూల్య రత్న సంక్లుప్తం సుందరం సుమనోహరం || 7 నారాయణుడు దేవతాకార్యమును సాధించుటకై శంఖచూడుని వేషమును ధరించి తులసీదేవి గృహమును చేరెను. ఆమె ఇంటిముందు దుందుభి వాద్యమును మ్రోగించుచు జయ శబ్దముతో తులసీదేవిని పిలిచెను. అప్పుడు శంఖచూడుని వేషమున నున్న నారాయణుడు పలికిన జయ శబ్దమును విని తులసి తన భర్త దేవతలతోడి యుద్దమున విజయము సాధించెనని భావించి మిక్కిలి ఆనందముతో అతనిని గవాక్షమునుండి (కిటికీ) చూచినది. వెంటనే తులసి అధిక సంతోషముతో బ్రాహ్మణులకు దానములు చేసినది. అట్లే కారాగారబద్దులకు, బిచ్చగాండ్రకు దానములు చేసినది. అప్పుడు శంఖచూడవేషధారి యగు నారాయణుడు రథమునుండి కిందికి దిగి
తులసీదేవి భవనములోనికి వెళ్ళెను. దృష్ట్వా చ పురతః కాంతం శాంతం కాంతా ముదాన్వితా | తత్పాదం క్షాళయామాస ననామ చ రురోద చ || 8 రత్నసింహాసనే రమ్యే వాసయామాస కాముకీ తాంబూలం చ దదౌ తసై#్మ కర్పూరాది సువాసితం || 9 అద్య మే సఫలం జన్మ హ్యద్యమే సఫలాః క్రియాః | రణాగతం చ ప్రాణశం పశ్యంత్యాశ్చ పునర్గృహే || 10 సస్మితా సకటాక్షం చ సకామా పులకాంచితా | పప్రచ్ఛ రణవృత్తాంతం కాంతం మధురయా గిరా || 11 తులసీదేవి తనకెదురుగా నిలబడియున్న భర్తను (శ్రీహరిని) చూచి సంతోషముతో అతని కాళ్ళు కడిగి నమస్కరించి అతనిని రత్నసింహాసనమున కూర్చుండబెట్టెను. తరువాత అతనికి కర్పూరాది సువాసన ద్రవ్యములచే సువాసితమై యున్న తాంబూలమునిచ్చి నా భర్త రణరంగమునుండి క్షేమముగా ఇల్లు చేరినందువలన, నా జన్మసఫలమైనది. నేను చేసిన పుణ్యకార్యములన్ని సఫలమైనవి అని తులసి పలికి రణరంగమున జరిగిన విషయమునన్నిటిని వివరింపుడని మధురమైన మాటలతో పలికినది. తులస్యువాచ - తులసీదేవి ఇట్లనెను - అసంఖ్య విశ్వసంహర్త్రా సార్థమాజౌ తవప్రభో | కథం బభూవ విజయస్తన్మె బ్రూహి కృపానిధే || 12 తులసీ వచనం శ్రుత్వా ప్రహస్య కమలాపతిః | శంఖచూడస్య రూపేణ తామువాచానృతం వచః || 13 ఓ ప్రభూ అసంఖ్యాకమైన విశ్వములనన్నిటిని సంహరించు పరమేశ్వరునితో నీవేవిధముగా యుద్దము చేసితివి. ఆ యుద్దమున నీకు విజయమెట్లు లభించినది అని తులసి అడుగగా శంఖచూడుని రూపుననున్న నారాయణుడామెతో ఇట్లనెను. శ్రీహరిరువాచ - శంఖచూడుని వేషముననున్న శ్రీహరి ఇట్లు పలికెను. ఆవయోః సమరం కాంతే పూర్ణమబ్దం బభూవ హ | నాశో బభూవ సర్వేషాం దానవానాం చ కామిని || 14 ప్రీతించ కారయామాస బ్రహ్మాచ స్వయమావయోః | దేవానామధికారశ్చ ప్రదత్తో బ్రహ్మణా పురా || 15 మయాzగతం స్వభవనం శివలోకం శివోగతః | ఇత్సుక్త్యా జగతాం నాథః శయనం చ చకారహ || 16 రేమే రమాపతిస్తత్ర రామాయా సహ నారద | సా సాధ్వీ సుఖ సంభోగాదాకర్షణ వ్యతిక్రమాత్ || సర్వం వితర్కయామాస కస్త్యమేవేత్యువాచ హ || 17 '' ఓ తులసీ నాకు పరమశివునకు మధ్య ఒక సంవత్సరకాలము యుద్దము సాగినది. చివరకు ఆయుద్దములో రాక్షసులందరు చనిపోయిరి. అప్పుడు బ్రహ్మదేవుడు మా ఇద్దరి మధ్య సంధిని చేసెను. దాని ప్రకారము దేవతల రాజ్యము దేవతల కీయబడినది. నేను ఇచ్చటికి రాగా శివుడు శివలోకమునకు పోయెను'' అని పలికి శంఖచూడుని రూపమున నున్న శ్రీహరి శయ్యపై పరుండి తులసితో సంభోగమొనర్చెను. కాని సాధ్వియగు తులసి సుఖసంభోగమున జరిగిన వ్యతిక్రమమువలన అతనిని శంకించి నీవెవవ్వరవని శంఖచూడుని రూపమున నున్న అతనినడిగెను. తులస్యువాచ - తులసీదేవి ఈ విధముగా శ్రీహరితో అనెను. - కో వా త్వం వద మాయేశో భుక్తాzహం మాయయా త్వయా || 18 దూరీకృతం మత్సతీత్వమథవా త్వాం శపామ్యహం | తులసీ వచనం శ్రుత్వా హరిః శాపభ##యేన చ || 19 దధార లీలయా బ్రహ్మన్ స్వాం మూర్తిం సుమనోహరం | దదర్శపురతో దేవీ దేవదేవం సనాతనం || నవీన నీరదశ్యామం శరత్పంకజ లోచనం || కోటి కందర్ప లీలాభం రత్నభూషణ భూషితం | ఈషద్దాస్యం ప్రసన్నాస్యం శోభితం పీతవాససా | 21 తం దృష్ట్వా కామినీ కామాత్ మూర్ఛాం సంప్రాప లీలయా | పునశ్చ చేతనాం ప్రాప్య పునః సా తమువాచ హ || 22 హే నాథ తే దయా నాస్తి పాషాణ సదృశస్య చ | ఛలేన ధర్మ భంగేన మమ స్వామీ త్వయా హతః || 23 పాషాణ సదృశస్త్యం చ దయాహీనో యతః ప్రభో | తస్మా త్పాషాణ రూపస్త్వం భువి దేవ భవాzధునా || 24 యే వదంతి దయాసింధుం త్వాం తే భ్రాంతి న సంశయః | భక్తో వినాzపరాధేన పరార్థే చ కథం హతః || 25 దుర్వృత్తస్త్యం చ సర్వజ్ఞో న జానాసి పరవ్యధాం | అతస్త్వమేక జనుషి స్వమేవ విస్మరిష్యసి || 26 మాయావియగు నీవెవరవు? నన్ను మోసము చేసి అనుభవించితివి. నా పాతివ్రత్యమును మంటగలిపితివి. ఇన్ని మాటలెందులకు, నిన్ను ఇప్పుడే శపింతును అని తులసీ దేవి అనగా శ్రీహరి భయముతో అందమైన తన రూపును ధరించెను. తులసీదేవి తనకెదురుగా నిలుచున్న దేవదేవుడు, సనాతనుడు, నీలమేఘశ్యాముడు శరత్పద్మములవంటి నేత్రములు కలవాడు. కోటిమన్మథకారుడు, రత్నభూషణములచే అలంకృతుడు, పీతవస్త్రుడు, పీతవస్త్రుడు, చిరునవ్వుతో నున్న శ్రీహరిని చూచి కామిని వెంటనే మూర్ఛనొందినది. వెంటనే స్మృతికి వచ్చి తులసీదేవి శ్రీహరితో నిట్లనెను. ఓలోకనాథ ! రాయివంటి నీకు దయలేదు. నీవు నా భర్తను మోసగించి అధర్మ మార్గమున చంపితివి. నీవు దయాహీనుడవు. పాషాణము వంటివాడవు. అందువలన భూలోకమున పాషాణరూపుడపు కమ్ము. కొందరు అజ్ఞానమువలన నిన్ను కరుణాసింధువందురు. కాని నీ భక్తుని తప్పులేకపోయినను ఇతరుల కొరకు అతనిని చంపితివి. నీవు దుర్మార్గుడవు. సర్వజ్ఞుడవైన నీవు ఇతరుల దుఃఖమును గమనింపలేదు. ఇత్యుక్త్యా చ మహాసాధ్వీ నిపత్య చరణ హరేః | భృశం రురోద శోకార్తా విలలాప ముహుర్మహుః || 27 తస్యాశ్చ కరుణాం దృస్ట్వా కరుణామయసాగరః | నారాయణస్తాం బోధయితుమువాచ కమలాపతి ః || 28 తులసీదేవి శ్రీహరితో పైవిధముగా పలికి శ్రీహరి చరణములపై వ్రాలి చాలాకాలమేడ్చినది. దయాసాగరుడు లక్ష్మీపతియగు నారాయణుడు తులసిని ఈ విధముగా ఓదార్చెను. శ్రీభగవానువాచ - భగవంతుడగు శ్రీహరి తులసితో ఇట్లనెను - తపస్త్యయా కృతం సాధ్వి మదర్థే భారతే చిరం | త్వదర్థే శంఖచూడశ్చ చకార సుచిరం తపః || 29 కృత్వా త్వాం కామినీం కామీ విజహార చ తత్ఫలాత్ | అధునా దాతుముచితం తవైవ తపనః ఫలం || 30 ఇదం శరీరం త్యక్త్యా చ దివ్యదేహం విధాయ చ | రాసే మే రమయా సార్థం త్వం రమా సదృశీ భవ || 31 ఇయం తనుర్నదీ రూపా గండకీతి చ విశ్రుతా | పూతా సుపుణ్యదా నృణాం పుణ్యా భవతు భారతే || 32 తవ కేశసమూహాశ్చ పుణ్యవృక్షా భవం త్వితి | తులసీ కేశ సంభూతా తులసీతి చ విశ్రుతా || 33 త్రిలోకేషు చ పుష్పాణాం పత్రాణాం దేవపూజనే | ప్రధాన రూపీ తులసీ భవిష్యతి వరాననే || 34 ప్వర్గే మర్త్యే చ పాతాళే వైకుంఠే మమ సన్నిధౌ | భవంతు తులసీవృక్షా వరాః పుష్పేషు సుందరి || 35 గోలోకే విరజాతీరే రాసే బృందావనే భువి | భాండీరే చంపకవనే రమ్యే చందన కాననే || 36 మాధవీ కేతకీ కుంద మల్లికా మాలీవనే | భవంతు తరవస్తత్ర పుష్పస్థానేషు పుణ్యదాః || 37 తులసీ తరుమూలే చ పుణ్య దేశే సుపుణ్యదే | అధిష్ఠానం తు తీర్థానాం సర్వేషాం చ భవిష్యతి || 38 తత్రైవ సర్వదేవానాం సమధిష్ఠానమేవ చ | తులసీ పత్ర పతనం ప్రాయో యత్ర వరాననే || 39 సస్నాతః సర్వతీర్థేషు సర్వయజ్ఞేషు దీక్షితః | తులసీ పత్రతోయేన యోzభిషేకం సమాచరేత్ || 40 సుధాఘట సహస్రేణ సా తుష్టిర్నభ##వేత్ హరేః | యా చ తుష్టిః భ##వేత్ నృణాం తులసీపత్రదానతః || 41 గవామయుతదానేన యత్ఫలం లభ##తే నరః | తులసీపత్ర దానేన తత్ఫలం లభ##తే సతి || 42 తులసీ పత్రతోయం చ మృత్యుకాల చ యో లభేత్ | స ముచ్యతే సర్వపాపాత్ విష్ణులోకం స గచ్ఛతి || 43 నిత్యం యస్తులసీ తోయం భుంక్తే భక్త్యాచ యో నరః | స ఏవ జీవన్ముక్తశ్చ గంగాస్నాన ఫలం లభేత్ || 44 నిత్యం యస్తులసీం దత్వా పూజయేన్మాం చ నారద | లక్షాశ్వమేధజం పుణ్యం లభ##తే నాత్ర సంశయః || 45 తులసీం స్వకరే ధృత్వా దేహే ధృత్వా చ మానవః | ప్రాణాంస్త్యజతి తీర్థేషు విష్ణులోకం స గచ్ఛతి || 46 తులసీకాష్ఠ నిర్మాణమాలాం గృహ్ణాతి యో నరః | పదే పదేzశ్వమేధస్య లభ##తే నిశ్చితం ఫలం || 47 తులసీం స్వకరే ధృత్వా స్వీకారం యో నరక్షతి | సయాతి కాలసూత్రం చ యావదింద్రాశ్చతుర్దశ || 48 కరోతి మిథ్యా శపథం తులస్యా యోహి మానవః | సయాతి కుంభీపాకం చ యావదింద్రిశ్చతుర్దశ || 49 తులసీతోయ కణికాం మృత్యుకాలే చ యో లభేత్ | రత్నయానం సమారుహ్య వైకుంఠం స ప్రయాతి చ || 50 పూర్ణిమాయాం అమాయాం చ ద్వాదశ్యాం రవి సంక్రమే | తైలాభ్యంగే చాస్నాతే చ మధ్యహ్నే నిశి సంధ్యయోః || 51 అశౌచేzశుచికాలే వా రాత్రి వా సాన్వితే నరః | తులసీం యే చ ఛిందంతి హరేః శిరః || 52 త్రిరాత్రం తులసీ పత్రం శుద్దం పర్యుషితం సతి | శ్రాద్దే వ్రతే వా దానే నా ప్రతిష్ఠాయాం సురార్చనే || 53 భూగతం తోయపతితం యద్దత్తం విష్ణవే సతి | శుద్దం తు తులసీపత్రం క్షాళనాదన్యకర్మణీ || 54 వృక్షాధిష్ఠాత్రీ దేవీ యా గోలోకే చ నిరామయే | కృష్ణేన సార్థం రహసి నిత్యం క్రీడాం కరిష్యతి || 55 నద్యధిష్ఠాతృదేవీ యా భారతే చ సుపుణ్యదా | లవణోదస్య పత్నీ చ మదంశస్య భవిష్యతి || 56 త్వం చ స్వయం మహాసాధ్వీ వైకుంఠే మమ సన్నిధౌ | రామ సమా చ రాసే చ భవిష్యసి న సంశయః || 57 సాధ్వియైన ఓ తులసీదేవి నీవు భారతఖండమున నన్ను పొందవలెనని పెక్కేండ్లు తపమాచరించితివి. శంఖచూడుడు నీకై చాలాకాలము తపస్సు చేసెను. ఆ తపః ఫలితముగానే అతడు నిన్ను భార్యగా పొంది చాలాకాలము సుఖముగానుండి తన శరీరమును వదలి పెట్టెను. అట్లే నీతపఃఫలితమును పొందుటకు నీకిప్పుడు యోగ్యత లభించినది. నీవు ఈ నీ శరీరమును వదలి దివ్యదేమము ధరించి రాసక్రీడలో లక్ష్మీదేవివలె నీవు కూడ ఆమె తో కలిసి విహరింతువు. ప్రస్తుతమున్న నీయొక్క పార్థివశరీరము నదీరూపును దాల్చి గండకీనదిగా ప్రసిద్దమగును. అది భారత ఖండములో పవిత్రమై అచ్చటి జనులకు పుణ్యమును కలిగించును. నీతల వెండ్రుకలు పుణ్యవృక్షములు కాగలవు. తులసీదేవి కేశములనుండి పట్టిన చెట్లు తులసియను పేరుతోనే ప్రఖ్యాతి వహించును. ఈ తులసి, దేవతార్చనమున పత్ర, పుష్పములలో ప్రధానస్థానమాక్రమించును. ముల్లోకములలోను, నాలోకములోను నాసమీపమున నున్న పుష్పములలో ఇవి శ్రేష్ఠములగును. గోలోకమున, విరజానదీతీరమున, రాసప్రదేశమున, మాధవి, కేతకి, కుంద, మల్లికా పుష్పములు గల మాలతీవనమున, పుష్పములుండు స్థలములో తులసీవృక్షములు పుణ్యప్రదములు కాగలవు. పుణ్యప్రదమైన తులసీ వృక్షము క్రింద సమస్త తీర్థములు సమస్త దేవతలు నివసింతురు. తులసీపత్రములు పడిన స్థలము కూడ మిక్కిలి పవిత్రమైనది. తులసీ పత్రములున్న నీటితో ఎవరు స్నానము చేయుదురో వారు సమస్త తీర్థస్నాన ఫలితమును పొందుదురు. అట్లే సమస్త యజ్ఞములు చేసిన ఫలితమును అనుభవింతురు. అట్లే తులసీ పత్రములు శ్రీహరికి సమర్పించినచో వేయి అమృత కలశములను అతనికి సమర్పించిన దానికన్న మిన్నగా శ్రీమన్నారాయణుడు సంతోషపడును. అట్లే లక్షల కొలది గోవులు దానము చేసిన ఫలమునతడు పొందును. చనిపోవునప్పుడు తులసీ తీర్థమిచ్చినచో మృతిచెందిన వ్యక్తి తాను పాపములనన్నిటిని పోగొట్టుకొని విష్ణులోకమునకు వెళ్ళును. ప్రతిదినము తులసీ తీర్థమును భక్తితో త్రాగు మానవుడు జీవన్ముక్తుడగును పైగా అతనికి గంగానదిలో స్నానము చేసిన ఫలము లభించగలదు. ప్రతిదినము నన్ను తులసీదళములతో పూజించునచో లక్ష అశ్వమేధయాగములు చేసిన ఫలితమును పొందును. తులసీ దళమును తనచేతిలో పట్టుకొని లేక శరీరమున ధరించి పుణ్యతీర్థమున చనిపోయిన వాడు వైకుంఠమును చేరును. తులసిమాలనుధరించినవానికి అనేక అశ్వమేధయాగములు చేసిన ఫలితము లభించును. తులసీపత్రమును చేతితో తాకి దానిని తిరస్కరించువాడు సూర్యచంద్రులున్నంతవరకు నరకమున ఉండును. అట్లే తులసీపత్రమును తాకి తప్పుడు ప్రమాణమును చేసినచో అతడు పదునలుగురు దేవేంద్రులు గతించువరకు కుంభీపాకనరకమున నివసించును. పూర్ణిమనాడు, అమావాస్యనాడు, ద్వాదశినాడు, సూర్య సంక్రమణకాలమున, తైలాభ్యంగనముచేయు సమయమున, స్నానము చేయక, మధ్యాహ్నమున, రాత్రికాలమున, సాయంప్రాతస్సంధ్యాకాలములలో అశుచిగానున్నప్పుడు జాతాశౌచ, మృతాశౌచ కాలములలో రాత్రి కట్టుకున్న వస్త్రములను ధరించియున్నప్పుడు తులసీ దళమును తెంపినచో శ్రీహరి శిరస్సును ఛేదించిన పాపము లభించును. శ్రాద్దకాలమున, వ్రతములనుష్ఠించు సమయమున, దానము చేయునప్పుడు, దేవప్రతిష్ఠాకాలమున, దేవతార్చన కాలమున ఉపయోగించిన తులసీదళము మూడు దినములవరకు పవిత్రమైయుండును. భూమిపై పడినను విష్ణవునకు సమర్పితమైన తులసీదళమును కడిగినచో పరిశుద్దమై ఇతర కార్యముల యందుపయోగమునకు వచ్చును. వృక్షమునకు అధిష్ఠాన దేవతయగు తులసి గోలోకమున శ్రీకృష్ణునితో ప్రతిదినము రహస్యక్రీడలు సాగించును. గండకీనదికి అధిష్ఠాన దేవతగా నున్న తులసి భారతదేశమున జనులందరకు పుణ్యప్రదమై నా అంశస్వరూపుడైన సముద్రునకు భార్య కాగలదు. స్త్రీ రూపమున నున్న నీవు వైకుంఠమున నా సన్నిధిలో లక్ష్మీదేవితో సమానమై మెలగగలవు. అహం చ శైలరూపీ చ గండకీ తీర సన్నిధౌ | అధిష్ఠానం కరిష్యామి భారతే తవ శాపతః || 58 వజ్రకీటాశ్చ కృమయో వజ్రదంష్ట్రాశ్చ తత్రవై | తచ్ఛిలాకుహరే చక్రం కరిష్యంతి మదీయకం || 59 ఓ తులసీ! నేను నీ యొక్క శాపముననుసరించి భారత దేశమందలి గండకీనది తీరమున శిలారూపముతోనుందును. వజ్రములవంటి పండ్లు గల వజ్రకీలకములు వజ్రక్రిములు ఆ శిలలో చక్రమువంటి రంధ్రములను చేయును. ఏకధ్వారే చతుశ్చక్రం వనమాలా విభూషితం | నవీన నీరద శ్యామం లక్ష్మీనారాయణాభిధం || 60 గండకీనది తీరమందు లభించు శిలలలో ఒకే రంధ్రముండి అందు నాలుగు చక్రములుండి వనమాలా విభూషితమై నల్లని రంగులో లభించు సాలగ్రామ శిల లక్ష్మీనారాయణము. ఏకద్వారే చతుశ్చక్రం నవీన నీరదోపమం | లక్ష్మీజనార్దనం జ్ఞేయం రహితం వనమాలయా || 61 ఒకే రంధ్రమున నాలుగు చక్రములుండి వనమాల లేని శిలను లక్ష్మీ జనార్దనమందురు. ద్వారద్వయే చతుశ్చక్రం గోష్పదేన సమన్వితం | రఘునాథాభిధం జ్ఞేయం రహితం వనమాలయా || 62 రెండు రంధ్రములలో నాల్గు చక్రములు, గోష్పాదముండి వనమాల లేనిచో ఆ శిలను రఘునాథ సాలగ్రామముగా పేర్కొందురు. అతిక్షుద్రం ద్విచక్రం చ నవీన జలద ప్రభం | దధివామనాభిధం జ్ఞేయం గృహిణాం చ సుఖ ప్రదం || 63 రెండు చక్రములుండి నల్లగా, మిక్కిలి చిన్నగానుండు సాలగ్రామమును దధివామనమని అందురు. ఆ సాలగ్రామమునారాధించినచో గృహస్థులకు మేలు చేకూరును. అతిక్షుద్రం ద్విచక్రం చ వనమాలా విభూషితం | విజ్ఞేయం శ్రీధరం దేవం శ్రీప్రదం గృహిణాం సదా|| 64 రెండు చక్రములు వనమాల కలిగియున్న చిన్న సాలగ్రామమును శ్రీధరమని అందురు. అదికూడ గృమస్థులకు శుభమును కలిగించుచున్నది. స్థూలం చ వర్తులాకారం రహితం వనమాలయా | ద్విచక్రం స్ఫుటమత్యంతం జ్ఞేయం దామోదరాభిధం || 65 గుండ్రముగా లావుగానుండి వనమాల లేక రెండు చక్రములు స్పష్టముగా కనిపించు సాలగ్రామమును దామోదరమందురు.మధ్యమం వర్తులాకారం ద్విచక్రం బాణ విక్షతం | రణరామాభిధం జ్ఞేయం శరతూణ సమన్వితం || 66 గుండ్రముగా, బాణవిద్దమై రెండు చక్రములుండి మరీ చిన్నగా, మరీ లావుగా కాక మధ్య రీతిలోనుండి అమ్ములపొది ఉన్న సాలగ్రామమును రణరామమని పిల్చెదరు. మధ్యమం సప్తచక్రం చ ఛత్ర తూణసమన్వితం | రాజరాజేశ్వరం జ్ఞేయం రాజసంపత్ర్పదం నృణాం || 67 ఏడు చక్రములు, ఛత్రము బాణము కలిగి మధ్యమాకారమున నుండు సాలగ్రామమును రాజరాజేశ్వరమందురు. దానిని పూజించినచో రాజ సంపదలు కలుగును. ద్విసప్త చక్రం స్ధూలం చ నవీన జలదప్రభం | అనంతాఖ్యం చ విజ్ఞేయం చతుర్వర్గఫలప్రదం || 68 పదునాలుగు చక్రములతో లావుగాను, నల్లగానున్న సాలగ్రామము ధర్మార్ధ కామమోక్షములనే చతుర్వర్గ ఫలితమునిచ్చు 'అనంత' సాలగ్రామము. చక్రాకారం ద్విచక్రం చ సశ్రీకం జలప్రభం | సగోష్పదం మధ్యమం మధ్యమం చ విజ్ఞేయం మధుసూదనం || 69 రెండు చక్రములు, గోష్పదము, లక్ష్మీని చక్రాకారము మధ్యమముగా నున్న నల్లని సాలగ్రామమును మధుసూదనమని పిలుతురు. సుదర్శనం చైకచక్రం గుప్తచక్రం గదాధరం | ద్విచక్రం హయవక్త్రాభం హయగ్రీవం ప్రకీర్తితం || 70 ఒకే చక్రమున్న సాలగ్రామమును సుదర్శనమని, చక్రము కనపడక యున్నచో గదాధరమని రెండు చక్రములతో శుద్ధ స్పటికకాంతితో నుండు సాలగ్రామమును హయగ్రీవమని అందురు. అతీవ విస్త్రతాస్యం చ ద్విచక్రం వికటం సతి | నరసింహాభిధం జ్ఞేయం సద్యో వైరాగ్యదం నృణాం || 71 మిక్కిలి వెడల్పైన రంధ్రముతో రెండు చక్రములతో వికటముగా నున్న సాలగ్రామము వైరాగ్యమును వెంటనే కలిగించు నరసింహసాలగ్రామము. ద్విచక్రం విస్త్పతాస్యం చ వనమాలా సమన్వితం | లక్షీనృసింహం విజ్ఞేయం గృహిణాం సుఖదం సదా || 72 మిక్కిలివెడల్పైన రంధ్రము, వనమాల, రెండు చక్రములు గల సాలగ్రామము గృహస్ధులకు సుఖసంపదలనిచ్చు లక్ష్మీనృసింహ సాలగ్రామము. ద్వారదేశే ద్విచక్రం చ సశ్రీకం చ సమం స్ఫుటం | వాసుదేవం చ విజ్ఞేయం సర్వకామఫలప్రదం || 73 రంధ్రము యొక్క ప్రారంభభాగముననే రెండు చక్రములుండి సమానముగాను, లక్ష్మీదేవి కలిగియున్న సాలగ్రామము వాసుదేవము. అది సమస్త వాంఛలను తీర్చును. ప్రద్యుమ్నం సూక్ష్మచక్రం చ నవీన నీరదప్రభం | సుషిరే ఛిద్రబహుళం గృహిణాంచ సుఖప్రదం || 74 సూక్ష్మమైన చక్రము, రంధ్రమున ఎక్కువఛిద్రములున్న నల్లని సాలగ్రామము ప్రద్యుమ్నము. అది గృహస్ధులకు మేలును కలిగించును. ద్వేచక్రే చైకలగ్నే చ పృష్ఠే యత్ర తు పుష్కలం | సంకర్షణం తు విజ్ఞేయం సుఖదం గృహిణాం సదా || 75 రెండు చక్రములు ఒకదానికొకటి తగులుకొని యుండి కింది భాగము విశాలముగా నుండునది సంకర్షణ సాలగ్రామము. అది గృహస్ధులకు శభమును కల్గించును. అనిరుద్ధం తు పీతాభం వర్తులం చాతి శోభనం | సుఖప్రదం గృహస్ధానాం ప్రవదంతి మనీషిణః || 76 పచ్చని కాంతితో గుండ్రముగా నుండు సాలగ్రామము అనిరుద్ధము. అది గృహస్ధులకు సుఖశాంతులనిచ్చును. సాలగ్రామ శిలా యత్ర తత్ర సన్నిహితో హరిః | తత్రైవ లక్ష్మీర్వసతి సర్వ తీర్ధ సమన్వితా || 77 శాలగ్రామ శిలయుండుచోట శ్రీహరి ఎల్లప్పుడు నివసించును. అచ్చట లక్ష్మీదేవి సమస్త పుణ్యతీర్ధములతో కలిసియుండును. యాని కాని చ పాపాని బ్రహ్మహత్యాదికాని చ | తాని సర్వాణి నశ్యంతి శాలగ్రామ శిలార్చనాత్ || 78 బ్రహ్మహత్యాది పాపములన్నియు సాలగ్రామము నారాధించినందువలన నశించుచున్నవి. ఛత్రాకారే భ##వేద్రాజ్యం వర్తులే చ మహాశ్రియం | దుఃఖంచ శకటాకారే శూలాగ్రే మరణం ధ్రువం || 79 వికృతాస్యేచ దారిద్ర్యం పింగళే హానిరేవచ | భగ్న చక్రే భ##వేద్వ్యాధిః విదీర్ణే మరణం ధ్రువం || 80 సాలగ్రామ శిల ఛత్రాకారమున నున్నచో రాజ్యము లభించును. అట్లే గుండ్రని సాలగ్రామము నారాధించన అధిక సంపద కలుగును. రథము వంటి శాలగ్రామము దుఃఖమును, శూలము యొక్క చివర భాగమున్నట్లు వాడిగా యున్న సాలగ్రామము మరణమును కలిగించును. వికృతా కారమున నున్న సాలగ్రామము దారిద్ర్యమును కలిగించగా నలుపు పసుపు రంగులు కలిసియున్న సాలగ్రామము హానిచేయును. అదే విధముగా భగ్నచక్రమున్నచో వ్యాధిని కలిగించును. పగిలిపోయిన సాలగ్రామము ఇంటి యజమానికి తప్పక మరణమును కలిగించును. వ్రతం దానం ప్రతిష్ఠా చ శ్రాద్ధం చ దేవపూజనం | శాలగ్రామ శిలాయాశ్చైవాధిష్ఠానాత్ ప్రశస్తకం || 81 సాలగ్రామమున్నందువలన ఆఇంటిలో చేసిన వ్రతములు, దానము, దేవతాప్రతిష్ఠ, దేవతాపూజ, శ్రాద్ధము మొదలగునవి ప్రశస్తమగుచున్నవి. స స్నాతః సర్వతీర్థేషు సర్వ యజ్ఞేషు దీక్షితః | శాలగ్రామ శిలాతోయైః యోzభిషేకం సమాచరేత్ || 82 సర్వదానేషు యత్పుణ్యం ప్రాదక్షిణ్య భువో యథా | సర్వయజ్ఞేషు తీర్ధేషు వ్రతేష్వనశ##నేషు చ || 83 తస్య స్పర్శం చ వాంఛంతి తీర్ధాని నిఖిలాని చ | జీవన్ముక్తో మహాపూతో భ##వేదేవ న సంశయః || 84 పాఠే చతుర్ణాం వేదానాం తపసాం కరణ సతి | తత్పుణ్యం లభ##తే నూనం శాలగ్రామ శిలార్చనాత్ || 85 శాలగ్రామ శిలాతోయం నిత్యం భంక్తే చ యో నరః | సురేప్సితం ప్రసాదం చ జన్మమృత్యు జరాహరం || 86 తస్య స్పర్శం చ వాంఛంతి తీర్ధాని నిఖిలాని చ | జీవన్ముక్తో మహాపూతోzప్యంతే యాతి హరేః పదం || 87 యాని కాని చ పాపాని బ్రహ్మహత్యాదికాని చ | తం చ దృష్ట్వా భియా యాంతి వైనతీయమివోరగాః|| 88 తత్రైవ హరిణా సార్దం అసంఖ్యం ప్రాకృతం లయం | పశ్యత్యేవ హి దాస్యేచ నిర్మక్తో దాస్య కర్మణి || 89 తత్పాదపద్మ రజసా సద్యః పూతా వసుంధరా | పుంసాం లక్షం తత్పితృణాం నిస్తారస్తస్య జన్మనః || 90 శాలగ్రామశిలాతోయం మృత్యుకాలే చ యో లభేత్ | సర్వపాపాద్వినిర్ముక్తో విష్ణులోకం స గచ్ఛతి || 91 నిర్వాణముక్తిం లభ##తే కర్మభోగాద్విముచ్యతే | విష్ణుపాదే ప్రలీనశ్చ భవిష్యతి న సంశయః || 92 శాలగ్రామశిలాంధృత్వా మిథ్యావాదం వదేత్తు యః | స యాతి కూర్మదంష్ట్రం చ యావద్వై బ్రహ్మణోవయః || 93 శాలగ్రామశిలాం స్పృష్ట్యా స్వీకారం యో న పాలయేత్ | స ప్రయాత్యసిపత్రం చ లక్షమన్వంతరాధికం || 94 తులసీ పత్ర విచ్ఛేదం శాలగ్రామే కరోతి యః| తస్య జన్మాంతరే కాలే స్త్రీవిచ్ఛేదో భవిష్యతి || 95 సాలగ్రామమునభిషేకించిన నీటిని శిరస్సుపై ప్రోక్షించుకొన్నచో సమస్త పుణ్యతీర్థములందు స్నానము చేసిన ఫలము, సమస్త యజ్ఞములు చేసిన పుణ్యము లభించును. అట్లే అన్ని విధములైన దానములు చేసిన పుణ్యము, భూమి ప్రదక్షిణము చేసిన ఫలితము, సమస్త వ్రతములు ఉపవాసములుచేసిన పుణ్యము దొరకును. సమస్త పుణ్య తీర్థములు సాలగ్రామ శిలాతోయమును శిరస్సుపై చల్లుకొనువాని స్పర్శను కోరుకొనును. అతడు పరమ పవిత్రుడై జీవన్ముక్తుడగును.సాలగ్రామమునర్చించినచో అతనికి సమస్త వేదములు చదివిన పుణ్యము, అన్ని విధములైన తపస్సులు చేసిన పుణ్యము లభించును. శాలగ్రామమునభిషేకించిన తీర్థమును ప్రతినిత్యము స్వీకరించుచున్నవానికి అది జరామరణములను పునర్జన్మమును పోగొట్టి, దేవతలు ఇష్టపడు ప్రసాదమగును. బ్రహ్మహత్యాది పాపములన్నియు ఆ భక్తుని చూడగనే గరుత్మంతుని చూచిన సర్పములవలె పరుగెత్తును. అతడు శ్రీహరి సాన్నిధ్యమున నుండి అచటినుండి అనేక ప్రాకృతలయములను చూచును.అతని పాదరేణువులవలన ఈ భూమి పవిత్రమగుచున్నది. అతని పితరులు లక్షతరముల వాండ్లైనను ముక్తి చెందుదురు. శాలగ్రామాభిషేక తీర్ధమును మృత్యుకాలమందు పొందినచో వారు సమస్త పాపవిముక్తులై వైకుంఠమును చేరుకొందురు. అతడు కర్మఫలితము లన్నిటినుండి విముక్తుడై శ్రీహరిపాదమున విలీనమగును. సాలగ్రామమును చేతిలో పెట్టుకొని అబద్ధమైన ప్రమాణములు చేసినచో బ్రహ్మదేవుడున్నంతవరకు కూర్మదంష్ట్రమనే నరకమును పొందును. సాలగ్రామ శిలను నిరాదరణచేసినచో లక్షమన్వంతరములవరకు అసి పత్రమనే నరకమును పొందును. సాలగ్రామముపై తులసీ పత్రములను తెంపివేసినచో అతనికి తరువాత జన్మలో భార్యా వియోగము సంభవించును. తులసీపత్రవిచ్ఛేదం శంఖే యో హి కరోతి చ | భార్యా హీనో భ##వేత్సోzపి రోగి చ సప్తజన్మసు || 96 శాలగ్రామం చ తులసీం శంఖమేకత్ర ఏవ చ | యో రక్షతి మహాజ్ఞానీ స భ##వేత్ శ్రీహరి ప్రియః || 97 శంఖమునందు తులసీ పత్రములను తుంచి సమర్పించినచో అతడు ఏడు జన్మలవరకు రోగమనుభవించును. అట్లే భార్యావిహీనుడు కూడ కాగలడు.సాలగ్రామమును, తులసిని, శంఖమును ఒకచోట ఉంచి పూజ చేసినచో అతడు గొప్ప జ్ఞానమును పొందును. అట్లే శ్రీహరికి ఇష్టమైన భక్తుడు కూడ కాగలడు. సకృదేవ హి యో యస్యాం వీర్యాధానం కరోతి యః | తద్విచ్ఛేదే తస్య దుఃఖం భ##వే దేవ పరస్పరం || 98 త్వం ప్రియా శంఖచూడస్య చైకమన్వంతరావధి | శంఖేన సార్థం త్వద్భేదః కేవలం దుఃఖదస్తవ || 99 స్త్రీ పురుషులిద్దరు పరస్పరాను రాగముతో ఒకసారి కలిసినను ఆ తరువాత వారిరువురకు వియోగమేర్పడినచో ఇరువురకు దుఃఖము కల్గును. నీవు శంఖచూడునకు ఒక మన్వంతరము వరకు భార్యవు. తరువాత ఇద్దరకు వియోగము జరుగవలసినదే. ఇత్యుక్త్యా శ్రీహరిస్తాం చ విరరామ చ సాదరం | సా చ దేహం పరిత్యజ్య దివ్యరూపం దధార హ || 100 యథా శ్రీశ్చ తథా సా చాప్యువాస హరివక్షసి | ప్రజగామ తయా సార్థం వైకుంఠం కమలాపతిః || 101 లక్ష్మీః సరస్వతీ గంగా తులసీ చాపి నారద | హరేః ప్రియాః చతస్రశ్చ బభూవురీశ్వరస్య చ || 102 ఈవిధముగా శ్రీహరి తులసిని ఓదార్చి ఊరకుండగా ఆమె తన శరీరమును వదలిపెట్టి దివ్యరూపమును ధరించినది. లక్ష్మీదేవి వలె తులసి కూడా శ్రీహరి వక్షస్ధలమున చోటుచేసికొన్నది. ఈవిధముగా శ్రీహరికి లక్ష్మీ, సరస్వతి, గంగ, తులసి భార్యలైరి. సద్యస్తద్దేహజాతా చ బభూవ గండకీ నదీ | హరే రంశేన శైలశ్చ తత్తీరే పుణ్యదో నృణాం || 103 కుర్వంతి తత్ర కీటాశ్చ శిలాం బహువిధాం మునే | జలే పతంతి యా యాశ్చ జలదాభాశ్చ నిశ్చితం || 104 స్థలస్థాః పింగళాజ్ఞేయాశ్చోపతాపాత్ హరేరితి | ఇత్యేవం కథితం సర్వం కిం భూయః శ్రోతు మిచ్ఛసి || 105 తులసీ దేహమునుండి గండికీనది ఆవిర్భవించినది. అట్లే ఆ నదీతీరమున శ్రీహరియొక్క అంశవలన పుణ్యప్రదమైన పర్వతము ఏర్పడినది. ఆ పర్వతమునందలి శిలలను కీటకములు అనేక విధములుగా తొలుచుచున్నందువలన నీలమేఘమువలే నల్లని శిలలు నీటిలో పడిపోవును. శ్రీహరికి కలిగిన ఉపతాపమువలన భూమిపై పడిన సాలగ్రామశిలలు పింగళవర్ణమున ఉన్నవి. నారదా! ఈ విధముగా తులసీదేవి చరిత్రనంతయు నీకు విశదీకరించితిని. ఇంకను నీవు వినగోరుచున్న విషయమేదైన ఉన్నచో చెప్పెదను. ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణ ద్వితేయే ప్రకృతిఖండే నారద నారాయణ సంవాదే తులస్యుపాఖ్యానం నామ ఏకవింశోzధ్యాయః || శ్రీ బ్రహవైవర్తమను మహాపురాణమున రెండవదైన ప్రకృతి ఖండమున నారద నారాయణుల సంవాదమున తెల్పబడిన తులసీ ఉపాఖ్యానమను ఇరువది ఒకటవ అధ్యాయము సమాప్తము.