sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters   

త్రయోవింశతితమోZధ్యాయః - సావిత్రీ ఉపాఖ్యాన ప్రారంభము

నారద ఉవాచ- నారదుడిట్లు నారాయణునితో పల్కెను-

తులస్యుపాఖ్యానమిదం శ్రుతమీశ మనోహరం | యత్తు సావిత్య్రుపాఖ్యానం తన్మేవ్యాఖ్యాతు మర్హసి || 1

పురా యేన సముద్భాతా సాశ్రుతా చ శ్రుతిప్రరసూః | కేన వా పూజితాదేవీ ప్రథమే కైశ్చ వా పరే || 2

ఓ నారాయణుడా! అందమైన తులస్యుపాఖ్యానమును ఇంతవరకు వింటిని. ఇక నీవు సావిత్ర్యుపాఖ్యానమును వివరించి చెప్పుము. వేదములకు తల్లియగు ఆ సావిత్రి ఎవరివలన జన్మంచినది. ఆమెను తొలుత ఎవరు పూజించిరి ? ఆ తరువాత ఎవరు పూజించిరో నాకు విశదీకరింపుడు.

నారాయణ ఉవాచ- శ్రీమన్నారాయణుడిట్లు చెప్పెను-

బ్రహ్మణా వేదజననీ పూజితా ప్రథమే మునే | ద్వితీయే చ దేవగణౖః తత్పశ్చాత్‌ విదుషాంగణౖః || 3

తథా చాశ్వపతిః పూర్వం పూజయామాస భారతే | తత్సశ్చాత్‌ పూజయామాసుః వర్ణాశ్చత్వార ఏవ చ || 4

వేదములకు మాతయైన సావిత్రీదేవిని తొలుత బ్రహ్మదేవుడు పూజించెను. తరువాత దేవతలు, ఆ తరువాత విద్వాంసులు పూజించిరి. భారత దేశమున తొలుత అశ్వపతి యనురాజు ఆమెను పూజించగా తర్వాత జనులందరు ఆమెను పూజింపసాగిరి.

నారద ఉవాచ-నారదుడిట్లు పలికెను-

కోవా సోzశ్వపతిః బ్రహ్మన్‌ కేన వా తేన పూజితా | సర్వ పూజ్యా చ సావిత్రీ వ్యాఖ్యాతు మర్హసి || 5

ఓ నారాయణుడా! అశ్వపతి ఎవరు? అతడెందుకు సావిత్రీదేవిని పూజించెను. ఆమె అందరిచే పూజలనెట్లందుకొన్నది ఈ విషయములన్నిటిని నాకు వివరించి చెప్పుడు అని పలికెను.

నారాయణ ఉవాచ- నారాయణుడిట్లు పలికెను-

మద్రదేశే మహారాజో బభూవాశ్వపతిర్మనే | వైరిణాం బలహర్తా చ మిత్రాణాం దుఃఖనాశనః || 6

ఆసీత్తస్య మహారాజ్ఞీ మహిషీ ధర్మచారిణీ | మాలతీత చ సా ఖ్యాతా యథా లక్ష్మీర్గదాభృతః|| 7

సా చ రాజ్ఞీ మహాసాధ్వీ వసిష్ఠిస్యోపదేశతః| చకారారాధనం భక్త్యా సావిత్ర్యా శైవ నారద || 8

ప్రత్యాదేశం న సా ప్రాప మహిషీ న దదర్శతాం | గృహం జగామ సా దుఃఖాత్‌ హృదయేన విదూయతా || 9

రూజా తాం దుఃఖితాం దృష్ట్యా బోధయిత్వా నయేనవై | సావిత్య్రస్తపసే భక్త్యా జగామ పుష్కరం తదా || 10

తపశ్చచార తత్రైవ సంయతః శతవత్సరం | న దదర్శచ సావిత్రీం ప్రత్యాదేశో బభూవ హ || 11

శుశ్రావాకాశ వాణీం చ నృపేంద్రశ్చాశరీరిణీం | గాయత్రీ దశలక్షం చ జపం కుర్వితి నారద || 12

ఏతస్మన్నంతరే తత్రప్రజగామ పరాశరః | ప్రణనామ నృపస్తం చ మునిర్నృపమువాచ హ || 13

ఓ నారద! మద్రదేశమున అశ్వపతియను రాజుండేవాడు. అతడు మహాబలవంతుడు . శత్రు సైన్యమును నాశనము చేసెడివాడు. మిత్రులకు సంతోషము కలుగజేసెడివాడు. అతని ధర్మచారిణి పేరు మాలతి. ఆమె వసిష్ఠ మహర్షి ఉపదేశముననుసరించి సావిత్రీ దేవి నారాధించెను.

కాని మాలతీదేవికి సావిత్రీదేవత సాక్షాత్కారముగాని, ఆమె అనుగ్రహము కాని లభించలేదు. అందువలన అపట్టపురాణి బాధాసంతప్తహృదయముతో ఇంటికి తిరిగి వెళ్ళెను.

అశ్వపతి తన భార్య పడుచున్న దుఃఖమును చూచి ఆమెను ఓదార్చి తాను సావిత్రీదేవి తపస్సును చేయుటకు పుష్కరక్షేత్రమునకు వెళ్ళెను. అచ్చట ఆ మహారాజు యమనియమములతో వంద సంవత్సరములు తపస్సు చేయగా సావిత్రీ దేవి ప్రత్యక్షము కాకపోయినను ఆమె అనుగ్రహమును మాత్రము పొందెను. పదిలక్షల గాయత్రీ మంత్ర జపమును అనుష్ఠించమని ఆకాశవాణి అతనితో పలికినది.

ఆ సమయమున పరాశరముని అచ్చటికి రాగా అశ్వపతి మహారాజు ఆ మునికి నమస్కరించగా అతడు ఆ రాజుతో నిట్లనెను.

పరశర ఉవాచ- పరాశరమహర్షి ఇట్లెనెను-

సకృజ్ఞపశ్చ గాయత్ర్యాః పాపం దినకృతం హరేత్‌ | దశధా ప్రజపాన్నృణాం దివారాత్య్రఘమేవచ || 14

శతధా చ జపాచ్చైవం పాపం మాసార్జితం పరం | సహస్రధా జపాచ్చైవం కల్మషం వత్సరార్జితం || 15

లక్షం జన్మకృతం పాపం దశలక్షం త్రిజన్మనః | సర్వజన్మకృతం పాపం శతలక్షం వినశ్యతి || 16

గాయత్రీ జపమును ఒక మారు చేసినచో ఆ దినము (పగలు) చేసిన పాపము నశించును. పదిమార్లు జపించినచో ఆ దినము (రాత్రింబగళ్లు) చేసిన పాపము తొలగిపోవును. వంద మార్లు గాయత్రీ జపము చేసిన ఆ నెలలో చేసికొన్న పాపము నశించిపోవును. వేయిమార్లు జపము చేసినచో ఆ సంవత్సరములో చేసికొన్న పాపమంతయు నశించును. లక్షసార్లు జపము చేసిన ఆ జన్మలో చేసిన పాపము హరించును. పదిలక్షల జపము మూడు జన్మలలో చేసికొన్న పాపములను తొలగించును. నూరు లక్షల గాయత్రీ జపము చేసికొన్నవానికి అతడు అన్ని జన్మలలో చేసికొన్న పాపములన్ని నశించును.

కరోతి ముక్తిం విప్రాణాం జపో దశగుణస్తథా | కరం సర్పఫణాకారం కృత్వాతు ఊర్ధ్వముద్రితం || 17

ఆనమ్ర మూర్ధ మచలం ప్రజపేత్‌ ప్రాబ్ముభో ద్విజః | అనామికా మధ్య దేశాదధో వామక్రమేణ చ || 18

తర్జనీ మూలపర్యంతం జపసై#్యష క్రమః కరే | శ్వేత పంకజ బీజానాం స్ఫటికానాం చ సంస్కృతాం || 19

కృత్వా వా మాలికాం రాజన్‌ జపేత్తీర్ధే సురాలయే | సంస్థాప్య మాలామశ్వత్థ పత్ర సప్తమ సంయతః || 20

కృత్వా గోరోచనాక్తాం చ గాయత్రీం స్నపయేత్సుధీః | గాయత్రీ శతకం తస్యాః జపేచ్చ విధిపూర్వకం || 21

అథవా పంచగవ్యేన స్నాతా మాలా చ సంస్కృతా | అథ గంగోదకేనైవ స్నాతా వాతి సుసంస్కృతా || 22

ఏవం క్రమేణ రాజర్షే దశలక్షం జపం కురు | సాక్షత్‌ ద్రక్ష్యసి సావిత్రీం త్రిజన్మపాతక క్షయాత్‌ || 23

నిత్యం నిత్యం త్రిసంధ్యం చ కరిష్యసి దినే దినే | మధ్యాహ్నే చాపి సాయాహ్నే ప్రాతరేవ శుచిః సదా || 24

సంధ్యాహీనోzశుచిర్నిత్యం అనర్హః సర్వ కర్మసు | యదహ్నే కురుతే కర్మ న తస్య ఫలభాగ్భవేత్‌ || 25

నోపతిష్ఠతి యః పూర్వాం నోపాస్తే యశ్చ పశ్చిమాం | స శూద్ర వద్బహిష్కార్యః సర్వస్మాత్‌ ద్విజకర్మణః || 26

యావజ్జీవనపర్యంతం యస్త్రిసంధ్యాం కరోతి చ | సచ సూర్యసమో విప్రః తేజసా తపసా సదా || 27

విప్రుడు గాయత్రీ జపమును చేసినచో ద్విజాతులగు క్షత్రియ వైశ్యులకంటె పదిరెట్లు ఎక్కువ ఫలితమును పొందును. చేతిని పాము పడగవలె చేసి, ఊర్ధ్వముద్రను వేసి, తూర్పు దిక్కు ముఖము చేసి, తలవంచుకొని స్ధిరముగా నుంéడి జపము చేయవలెను. జపము చేయునపుడు కుడిచేతి ఉంగరపువ్రేలు మధ్య కణుపునుండి క్రిందికి వెళ్ళి ఎడమవైపు తిరిగి పైకి వెళ్ళి చుట్టు తిరుగుచు చూపుడువేలు క్రింది కణుపు వరకు రావలెను.() ఇది జపము చేయువిధానము. లేనిచో తెల్లకలువబీజముల యొక్క మాలతోనైనా స్ఫటికమాలతోనైన నదీతీరమున లేక దేవాలయమున జపము చేయవలెను. ఆ జపమాలను రావి ఆకులపై నుంచి గోరోచనముతో అద్ది గాయత్రీ మంత్రముచే ఆమాలను అభిషేకింపవలెను. తరువాత విధి విధానముగా శతగాయత్రీ మంత్ర జపమును చేయవలెను. జపమాలను పంచగవ్యముతోనైనా గంగోదకముతోనైనా అభిషేకింపవలెను.

ఇట్టి జపమాలతో నీవు దశలక్షగాయత్రీ జపమును చేసినచో మూడు జన్మల పాపములన్ని నశించగా సావిత్రీ దేవి దర్శనము నీకు లభించును. ప్రతిదినము మధ్యాహ్నము, సాయంకాలము, ఉదయము అను మూడు సంధ్యలయందు శుచియై గాయత్రీ జపమును చేయుము.

ప్రతిదినము సంధ్య చేయనివాడు అపవిత్రుడగు. అన్ని పుణ్యకర్మములు చేయుటకు అనర్హడగును. ఆ దినము చేసిన పుణ్యఫలమును పొందలేడు. ప్రాతస్సంధ్యను సాంయ సంధ్యను చేయనిచో అతడు బ్రాహ్మణులు చేయు సమస్త కర్మలనుండి బహిష్కరించ తగినవాడుగును. తన జీవిత కాలము త్రిసంధ్యలలో గాయత్రీ జపము చేయువాడు తేజస్సున, తపస్సున సూర్యునితో సమానుడగును.

తత్పాదపద్మరజసా సద్యః పూతా వసుంధరా | జీవన్ముక్తః సతేజస్వీ సంధ్యాపూతో హియో ద్విజః || 28

తీర్ధాని చ పవిత్రాణి తస్య స్పర్శన మాత్రతః | తతః పాపాని యాంత్యేవ వైనతేయాదివోరగాః || 29

న గృహ్ణంతి సురాః పూజాం పితరః పిండతర్పణం | స్వేచ్ఛాయా చ ద్విజాతేశ్చ త్రిసంధ్యారహితస్య చ ||30

విష్ణుమంత్ర విహీనశ్చ త్రిసంధ్యారహితో ద్విజః | ఏకాదశీ విహీనశ్చ విషహీనో యథోరగః || 31

హరేరనైవేద్యభోజీ ధావకో వృషవాకః | శూద్రాన్నభోజీ విప్రశ్చ విషహీనో యథోరగః || 32

శవదాహీ చ శూద్రాణాం యో విప్రో వృషలీపతిః | శూద్రాణాం సూపకారశ్చ విషహీనో యథోరగః || 33

శూద్రాణాం చ ప్రతిగ్రాహీ శూద్రయాజీ చ యోద్విజః | అసిజీవి మషీజీవీ విషహీనో యథోరగః || 34

యో విప్రోzవీరాన్నభోజీ ఋతుస్నాతాన్న భోజకః | భగజీవీ వార్దుషికో విషహీనో యథోరగః || 35

యః కన్యావిక్రయీ విప్రో యోహరేర్నామవిక్రయీ | యో విద్యా విక్రయీ భూప విషహీనో యథోరగ ః || 36

సూర్యోదయే చ ద్విర్భోజీ మత్స్యభోజీ చ యోద్విజః | శిలాపూజాదిరహితో విషహీనో యథోరగః || 37

మూడు సంధ్యలలో సంధ్యావందనమాచరించిన ద్విజుని పాదధూళిచే ఈ భూమి పవిత్రమగుచున్నది. సంధ్యావందనమువలన పవిత్రుడగు నా ద్విజుడు తేజస్వి, జీవన్ముక్తుడు కూడ అగుచున్నాడు. అతని స్పర్శ తగులగనే పాపములన్నియు పటాపంచలగును.

త్రిసంధ్యలలో సంధ్యావందనము చేయని ద్విజులు చేసిన పూజను దేవతలు పరిగ్రహించరు. అట్లే అతడు చేసిన పిండతర్పణములను పితృదేవతలు స్వీకరింపరు. విష్ణుమంత్రరహితుడు, సంధ్యావందనమాచరింపనివాడు, ఏకాదశీవ్రతము చేయనివాడు, శ్రీహరికి నివేదింపబడని ఆహారమును తీసుకొనువాడు, శూద్రులయొక్క ఇండ్లలో అన్నము తినువాడు, శస్త్రములపై బ్రతుకు బ్రాహ్మణుడు (యుద్దములు చేయువాడు) లెక్కలు వ్రాసి బ్రతుకు బ్రాహ్మణుడు, ఋతుస్నాతయైన స్త్రీ చేసిన వంటను తిను బ్రాహ్మణుడు, తన కన్యలను అమ్ముకొని బ్రతుకువాడు, శ్రీహరి నామము అమ్ముకొని బ్రతుకువాడు, తన విద్యనమ్ముకొనువాడు, సూర్యోదయముననే భోజనము చేయువాడు, చేపలు తినువాడు, సాలగ్రామపూజారహితుడైన బ్రాహ్మణుడు విషములేని రసర్పమువలె తేజోహీనులగుచున్నాడు.

ఇత్యుక్త్యా చ మునిశ్రేష్ఠః సర్వం పూజావిధిక్రం | తమువాచ చ సావిత్ర్యాః ధ్యానాదికమభీప్పితం || 38

దత్వా సర్వం నృపేంద్రాయ ప్రయ¸° స్వాలయం మునిః | రాజా సంపూజ్య సావిత్రీం దదర్శ వరమాప చ || 39

ఈ విధముగా పరాశరముని అశ్వపతి మహారాజునకు సావిత్రీ దేవియొక్క ధ్యానాదికమునంతయు తెలిపి తన ఆశ్రమమునకు వెళ్ళిపోయెను. అశ్వపతి పరాశరముని చెప్పినట్లు సావిత్రి దేవిని పూజింపగా ఆ దేవి ప్రత్యక్షమై మహారాజునకు వరమిచ్చెను.

నారద ఉవాచ- నారదమహర్షి ఇట్లు నారాయణునితో ననెను-

కింవా ధ్యానం చ సావిత్ర్యః కిం వా పూరజా విధానకం | స్తోత్రం మంత్రం చ కిం దత్వా ప్రయ¸° స పరాశరః || 40

నృపః కేన విధానేన సంపూజ్య శ్రుతి మాతరం | వరం చ కిం వా సంప్రాప వద సోzశ్వపతిః నృపః || 41

సావిత్రీ దేవత యొక్క ధ్యానము, పూజావిధానము స్తోత్రము మంత్రము ఏ విధముగానున్నవి? అశ్వపతి మహారాజు వేదమాతయగు సావిత్రిని ఏ పద్దతిలో పూజించి ఆమెచే వరమును పొందెనో వాటినన్నిటిని నాకు విపులముగా తెలుపుడని అనెను.

నారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను-

జ్యేష్ఠే కృష్ణత్రయోదశ్యాం శుద్దేకాలే చ సంయతః | వ్రతమేవ చతుర్దశ్యాం వ్రతీ భక్యా సమాచరేత్‌ || 42

వ్రతం చతుర్దశాబ్దం చ ద్విసప్తఫలసంయుతం | దత్వా ద్వి సప్తనైవేద్యం పుష్ప ధూపాదికం తథా || 43

వస్త్రం యజ్ఞోపవీతం చ భోజ్యం చ విధిపూర్వకం | సంస్ధాప్య మంగళఘటం ఫలశాఖా సమన్వితం || 44

గణశం చ దినేశం చ వహ్నిం విష్ణుం శివం శివాం | సంపూజ్య పూజయేదిష్టం ఘటే ఆవాహితే మునే || 45

జేష్ఠ మాసమున బహుళ త్రయోదశినాడు మంచి ముహూర్తమున వ్రతదీక్షను పూని చతుర్దశినాడు ఈవ్రతమును ప్రారంభింపవలెను. ఈవ్రతమును పదునాలుగు సంవత్సరములాచరింపవలెను. ఈ వ్రతమున పదునాలుగు పండ్లు పదునాలుగు విధములైన నైవేద్యములు, పుష్పము, ధూపము, వస్త్రము, యజ్ఞోపవీతము భోజ్యము మొదలగువానిని శాస్త్రపద్దతిననుసరించి సమర్పింపవలెను.

ప్రారంభమున ఫలములు, శాఖలు గల మంగళకలశమును స్ధాపింపవలెను.తరువాత గణపతిని, సూర్యుని, అగ్నిని, శ్రీమహావిష్ణువును, శివుని, శక్తిని పూజించి మంగళకలశమును ఇష్టదేవతను ఆవాహన చేయవలెను.

శ్రుణు ధ్యానం చ సావిత్ర్యః చోక్తం మధ్యందినే చయత్‌ | స్తోత్రం పూజా విధానం చ మంత్రంచ సర్వకామదం || 46

నారదా | మధ్యందిన సంహితయందు పేర్కొనబడిన స్తోత్రమును పూజావిధానమును, మంత్రమును నీకు తెలిపెదను.

తప్తకాంచనవర్ణాభాం జ్వలంతీం బ్రహ్మతేజసా | గ్రీష్మమధ్యాహ్న మర్తండ సహస్ర సమసుప్రభాం || 47

ఈపద్దాస్య ప్రసన్నాస్యాం రత్నభూషణ భూషితాం | వహ్ని శుద్దాంశుకాధానాం భక్తానుగ్రహకాతరాం || 48

సుఖదాం ముక్తిదాం శాంతాం కాంతాం చ జగతాం విధేః | సర్వ సంపత్స్వరూపాం చ ప్రదాత్రీం సర్వసంపదాం || 49

వేదాధిష్ఠాతృదేవీం చ వేదశాస్త్ర స్వరూపిణీం | వేదే బీజస్వరూపాం చ భ##జేత్వాం వేదమాతరం || 50

పరిశుద్దమైన బంగారు వన్నెగలది, బ్రహ్మతేజస్సుచే ప్రకాశించునది, వేయి గ్రీష్మకాలమధ్యాహ్నసూర్యులవలె వెలిగిపోవుచున్నది. చిరునవ్వుతో ప్రసన్నమైన ముఖము కలది, రత్నాలంకార సుశోభిత, బంగారు కాంతిగల వస్త్రములను ధరించునది, భక్తుల ననుగ్రహింపవలయునని ఉఱ్ఱూతలూగునది, సర్వ సంపదల యొక్క స్వరూపిణి, సర్వసంపదలనొసగునది. వేదములకు అధిష్ఠాన దేవత, వేద శాస్త్ర స్వరూపిణి, వేదమునందున్న బీజాక్షర స్వరూప, వేదములకు తల్లియైన నిన్ను (సావిత్రీదేవిని) సేవింతును.

ధ్యాత్వా ధ్యానేన చానేన దత్వాపుష్పం స్వమూర్దని | పునర్ధ్యాత్వా ఘటే భక్త్యా దేవీమావాహయేత్‌ వ్రతీ || 51

దత్వా షోడశోపచారం వేదోక్తమంత్రపూర్వకం | సంపూజ్య స్తుత్వా ప్రణమేదేవం దేవీం విధానతః || 52

పై ధ్యాన శ్లోకములతో సావిత్రీ దేవిని ధ్యానించి పూజాపుష్పమును తన శిరస్సుపై నుంచుకొని మరల దేవిని ధ్యానించి పూజా కలశమందు దేవిని ఆవాహన చేయవలెను. వేదమంత్ర పూర్వకముగా షోడశోపచారములతో దేవిని శాస్త్రక్తర విధానముగా ఆరాధించి స్తుతించి నమస్కరింపవెను.

ఆసనం పాద్యమర్ఘ్యం చ స్నానీయం చానులేపనం | ధూపం దీపం చ నైవేద్యం తాంబూలం శీతలంజలం || 53

వసనం భూషణం మాల్యం గంధమాచనమనీయకం | మనోహరం సుతల్పం చ దేయాన్యేతాని షోడశ || 54

ఆసనము, పాద్యము, అర్ఘ్యము, స్నానీయము, అనులేపనము, ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలము, చల్లనినీరు, వస్త్రము, భూషణము, పుష్పమాల, గంధము, ఆచమనీయము, శయ్య అనునవి షోడశోపచారములు.

ఆసన మంత్రము-

దారుసారవికారం చ హేమాది నిర్మితం చవా | దేవాధారాం పుణ్యదం చ మయా నిత్యం నివేదితం || 55

చక్కని చెక్కతో నిర్మితమైనది లేక బంగారముతో నిర్మితమైనది, దేవతలకు ఆసనయోగ్యమైనది పుణ్యప్రదమైన ఆసనమును నీకు సమర్పించుచున్నాను.

పాద్య మంత్రము-

తీర్ధోదకం చ పాద్యం చ పుణ్యదం ప్రీతిదం మహత్‌ | పూజాంగభూతం శుద్దంచ మయా భక్త్యా నివేదితం || 56

పుణ్యప్రదమైనది. మిక్కిలి సంతోషమునిచ్చునది. పుణ్యతీర్ధములకు చెందిన ఈ పాద్యము పూజాంగభూతమైనది. ఇట్టి పాద్యమును నీకు నేను భక్తితో సమర్పించుచున్నాను.

అర్ఘ్య మంత్రము-

పవిత్రరూపమర్ఘ్యం చ దూర్వాపుష్పాక్షతాన్వితం | పుణ్యదం శంఖతోయాక్తం మయా తుభ్యం నివేదితం || 57

గరక, పుష్పములు, అక్షతలతో నున్న ఈ అర్ఘ్యజలము పవిత్రమైనది. ఇది పుణ్యప్రదమైన శంఖతీర్ధముతో కలిసియున్నది. ఇట్టి అర్ఘ్యజలమును నీకు నివేదించుచున్నాను.

స్నానీయ మంత్రముc

సుగంధి ధాత్రీ తైలం చ దేహసౌందర్య కారణం | మయా నివేదితం భక్యా స్నానీయం ప్రతి గృహ్యతాం || 58

దేహ సౌందర్యమును పెంచునది, సువాసన కలదియగు ఉసిరికనూనెను నీకు స్నానీయముగా ఇచ్చుచున్నాను. దీనిని నీవు స్వీకరింపుము.

అమలేపన మంత్రముc

మలయాచల సంభూతం దేహశోభావివర్ధనం | సుగంధియుక్తం సుఖదం మయాతుభ్యం నివేదితం || 59

శరీరకాంతిని పెంచునది. మలయ పర్వతారణ్యమున పుట్టినది, మంచివాసన కలదియగు అనులేపనమును నీకు ఒసగుచున్నాను.

ధూపమంత్రముc

గంధద్రవ్యోద్భవః పుణ్యః ప్రీతిదో దివ్యగంధదః | మయా నివేదితో భక్త్యా ధూపోzయం ప్రతిగృహ్యతాం || 60

సుగంధద్రవ్యముల వలన ఉత్పన్నమైనది, చక్కని సువాసనను, సంతోషమును ఒసగు ధూపమును నీకు భక్తితో ఇచ్చుచున్నాను. దీనిని నీవు స్వీకరింపుము.

దీపమంత్రముc

జగతాం దర్శనీయం చ దర్శనం దీప్తికారణం | అంధకారధ్వంస బీజం మయా తుభ్యం నివేదితం || 61

జగములన్నిటికి దర్శనీయమైనది, ప్రకాశమునకు కారణమైనది చీకటిని పారద్రోలునది అగు దీపమును నీకు సమర్పించుచున్నాను.

నైవేద్య మంత్రముc

తుష్టిదం చైవ ప్రీతిదం క్షుద్వినాశనం| పుణ్యదం స్వాదురూపంచ నైవేద్యం ప్రతి గృహ్యతాం || 62

తుష్టి, పుష్టి, ప్రీతిని కలిగించునది. ఆకలిని పొగొట్టునది రుచియైనది అగు నైవేద్యమును సమర్పించుచున్నాను. దానిని నీవు స్వీకరింపుము.

తాంబూలమంత్రముc

తాంబూలం చ వరం రమ్యం కర్పూరాది సువాసితం | తుష్టిదం పుష్టిదం చైవ మయా భక్త్యా నివేదితం || 63

ఈ తాంబూలము కడు శ్రేష్ఠమైనది. రమ్యమైనది. కర్పూరాది సుగంధ ద్రవ్యములచే ఘుమఘుమలాడుచున్నది. ఇది తుష్టిని, పుష్టిని కలిగించును. అట్టి తాంబూలమును నీకు నివేదించుచున్నాను.

శీతల జల మంత్రముc

సుశీతలం వాసితం చ పిపాసానాశకారణం| జగతాం జీవ రూపంచ జీవనం ప్రతి గృహ్యతాం || 64

మిక్కిలి చల్లనిది, సువాసనగలది, దప్పిని తీర్చునది, లోకములకన్నిటికి ప్రాణరూపమైన నీరును నీవు తీసికొనుము.

వస్త్ర మంత్రంc

దేహశోభా స్వరూపం చ సభాశోభా వివర్ధనం | కార్పాసజం చ క్రిమిజం వసనం ప్రతి గృహ్యతాం || 65

శరీరమునకు శోభను కలిగించునది అట్లే సభల యందు గొప్పదనమును కలిగించునది యగు ప్రత్తితో నేయబడిన వస్త్రము లేక పట్టుపురుగులవల్ల ఉత్పన్నమైన పట్టు వస్త్రమును నీకు సమర్పించుచున్నాను. దీనిని నీవు స్వీకరింపుము.

అభరణ మంత్రముc

కాంతనాదిభిరాబద్దం శ్రీయుక్తం శ్రీకరం సదా | సుఖదం పుణ్యదం చైవ భూషణం ప్రతి గృహ్యతాం || 66

బంగారు మొదలగు ద్రవ్యములచే నిర్మితమైనది, శోభాయుతము, శోభాకరము, సుఖమును కలిగించు అభరణములను ఇచ్చుచున్నాను. వీటిని నీవు పరిగ్రహింపుము.

మాలా మంత్రముc

నానాపుష్పలతా కీర్ణం బహుభాసా సమన్వితం | ప్రీతిదం పుణ్యదం చైవ మాల్యంవై ప్రతిగృహ్యతాం || 67

అనేకమైన పుష్పములు, లతలతో నిండినది, వివిధములైన కాంతులనిచ్చునది, సంతోషమును, పుణ్యమును కలిగించు ఈ మాలను నీవు ప్రతి గ్రహింపుము.

గంధ మంత్రముc

సర్వమంగళరూపశ్చ సర్వమంగలదోవరః | పుణ్యప్రదశ్చ గంధాఢ్యో గంధశ్చ ప్రతిగృహ్యతాం || 68

సర్వ మంగళస్వరూపిణి, అన్ని విధములైన మంగళములను కలిగించునది పుణ్యప్రదము సుగంధయుతమైన గంధమును నీకు సమర్పించుచున్నాను. దీనిని నీవు స్వీకరింపుము.

ఆచమన మంత్రముc

శుద్ధం శుద్ధిప్రదం చైవ శుద్ధానాం ప్రీతిదం మహత్‌ | రమ్యమాచమనీయం చ మయా దత్తం ప్రగృహత్యాం || 69

పరిశుద్ధమైనది, శుద్ధిని కలిగించునది, పరిశుద్ధమైన వారికి మిక్కిలి ప్రీతిని కలిగించునది, సంతోషమును కలిగించు ఈ ఆచమనమును నీకు ఇచ్చుచున్నాను. దీనిని నీవు స్వీకరింపుము.

శయ్యా మంత్రముc

రత్నసారాది నిర్మాణం పుష్పచందన సంయుతం | సుఖదం పుణ్యదం చైవ సుతల్పం ప్రతిగృహృతాం || 70

విలువైన రత్నములచే నిర్మించబడినది, పుష్పములు, చందనద్రవ్యము మొదలగు ద్రవ్యభరితము, సుఖమును కలిగించు శయ్యను నీవు ప్రతిగ్రహింపుము.

ఫలమంత్రము

నానా వృక్షసముద్భూతం నానా రూప సమన్వితం | ఫల స్వరూపం ఫలదం ఫలం చ ప్రతిగృహ్యతాం || 71

అనేక వృక్షములనుండి పుట్టినవి. అనేక రూపములు కలవి, భగవదనుగ్రహ ఫలితము నిచ్చునవి అగు ఫలములను నీవు స్వీకరింపుము.

సిందూర మంత్రముc

సిందూరం చ వరం రమ్యం భాలశోభావివర్ధనం | భూషణం భూషణానాం చ సిందూరం ప్రతిగృహ్యతాం || 72

ఈ సిందూరము చాలా అందమైనది. నొసలునకు ఒక క్రొత్తనైన శోభను కలిగించును. అలంకరణములలోకెల్లను అలంకారభూతమైన ఈ తిలకమును నీవు స్వీకరింపుము.

యజ్ఞోపవీత మంత్రముc

విశుద్ధగ్రంథి సంయుక్తం వుణ్యసూత్ర వినిర్మితం | పవిత్రం వేదమంత్రేణ యజ్ఞ సూత్రం చ గృహ్యతాం || 73

పరిశుద్ధమైన దారములు కలది, పవిత్రమైన గ్రంధి (ముడి) కలది, వేదమంత్రోచ్చారణ వల్ల పవిత్రమైనది అగు యజ్ఞోపవీతమును నీకు ఇచ్చుచున్నాను. నీవు దీనిని దయతో స్వీకరింపుము.

ద్రవ్యాణ్యతాని మూలేన ధ్యాత్వా స్తోత్రం పఠేత్సుధీః | తతః ప్రణమ్యవిప్రాయ వ్రతీ దద్యాచ్చ దక్షిణాం || 74

పైన పేర్కొనబడిన ద్రవ్యములనన్నిటిని మూలమంత్రము చదువుచు సమర్పించిన ఆ పిమ్మట నియమ నిష్ఠలు గల ఒక విప్రునకు కొంత దక్షిణను సమర్పింపవలెను.

సావిత్రీతి చతుర్ధ్యంతం వహ్నిజాయాంతమేవచ | లక్ష్మీ మాయాకామపూర్వం మంత్రమష్టాక్షరం విదుః || 75

శ్రీం హ్రీం క్లీం సావిత్య్రై స్వాహా అనునది.

చతుర్ధీవిభక్తి గల సావిత్రీ శబ్దము అగ్నిభార్యయగు స్వధా శబ్దాంతము కాగా దీనికి ముందు లక్ష్మీ బీజమైన శ్రీం మాయాబీజీక్షరమైన హ్రీం, కామ బీజాక్షరమైన క్లీం అనునవి కలిగిన అష్టాక్షరీ మంత్రము ఈ సావిత్రీ మంత్రము. దాని స్వరూపము శ్రీం హ్రీం క్లీం సావిత్య్రై స్వాహా

మంధ్యందినోక్తస్తోత్రం చ సర్వవాంఛా ఫలప్రదం | విప్ర జీవన రూపం చ నిబోధ కథయామి తే || 76

సమస్తమైన కోరికలను తీర్చునది బ్రాహ్మణులకు జీవనాధార భూతమైనది, మధ్యందిన సంహితయందు చెప్పబడిన సావిత్రీ స్తోత్రము ను నీకు చెప్పుచున్నాను.

కృష్ణేన దత్తా సావిత్రీ గోలోకే బ్రహ్మణ పురా | న యాతి సా తేన సార్ధం బ్రహ్మలోకం తు నారద || 77

బ్రహ్మా కృష్ణాజ్ఞయా భక్త్యా పర్యష్టౌత్‌ వేదమాతరం | తదా సా పరితుష్టా చ బ్రహ్మాణం చకమే సతీ || 78

పూర్వకాలమున శ్రీకృష్ణుడు బ్రహ్మదేవునకు సావిత్రి నీయగా ఆమె బ్రహ్మలోకమునకు వెళ్ళుట కంగీకరించలేదు. కాని శ్రీకృష్ణుని ఆజ్ఞ ననుసరించి బ్రహ్మదేవుడు ఆమెను స్తుతింపగా వెంటనే అతనిని కామించెను.

బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడు ఇట్లు పలికెను-

నారాయణ స్వరూపే చ నారాయణి సనాతని | నారాయణ సముద్భూతే ప్రసన్నాభవ సుందరి || 80

నిత్యే నిత్య ప్రియే దేవి నిత్యానంద స్వరూపిణి | సర్వమంగళ రూపేణ ప్రసన్నా భవ సుందరి || 81

సర్వ స్వరూపే విప్రాణాం మంత్రసారే పరాత్పరే | సుఖదే మోక్షదే దేవి ప్రసన్నా భవ సుందరి || 82

విప్రపాపేధ్మ దాహాయ జ్వలదగ్ని శిఖోపమే | బ్రహ్మతేజః ప్రదే దేవి ప్రసన్నా భవ సుందరి || 83

కాయేన మనసా వాచా యత్పాపం కురుతే ద్విజః | తత్తే స్మరణమాత్రేణ భస్మీభూతం భవిష్యతి || 84

ఇత్యుక్త్వా జగతాం ధాతా తత్ర తస్ధౌ చ సంసది | సావిత్రీ బ్రహ్మణా సార్ధం బ్రహ్మలోకం జగామ సా || 85

ఓ సావిత్రీ దేవి ! నీవు నారాయణుని స్వరూపము కల దానవు. నారాయణివి. సనాతనివి. నారాయణుని నుండి ఉద్భవించిన దానవు . తేజఃస్వరూపిణివి, చాలా శ్రేష్ఠురాలవి. పరమానంద రూపిణివి. బ్రాహ్మణజాతికి చిహ్నమవు. నీవు నిత్యురాలవు. ఎల్లప్పుడు అందరికి ప్రియమైన దానవు. నిత్యానంద స్వరూపమవు. సమస్త మంగళరూపిణివి. బ్రాహ్మణులకు సర్వస్వమవు. సుఖమును, మోక్షమునిచ్చుదానవు. బ్రాహ్మణులు చేసిన పాపములను సమూలముగా నాశనము చేయగలవు. నీవు బ్రహ్మతేజస్సును కలిగించుదానవు. ద్విజులు మనో వాక్కాయుముల ద్వారా చేసిన పాపములన్నియు నీ నామస్మరణ చేసినంత మాత్రముననే భస్మమగును. అట్టి నీవు నాకు ప్రసన్నురాలవుకమ్ము

ఈ విధముగా బ్రహ్మదేవుడు సావిత్రిని స్తుతించి ఆ సభలోనుండగా సావిత్రి సంతోషపడి బ్రహ్మదేవునితో కలసి బ్రహ్మలోకమునకు వెళ్ళెను.

అనేన స్తవ రాజేవ సంస్తూయాశ్వపతిర్నృపః | దదర్శ తాంచ సావిత్రీం వరం ప్రాప మనోగతం || 86

స్తనరాజమిదం పుణ్యం త్రిసంధ్యాయాం చ యః పఠేత్‌ | పాఠే చతుర్ణాం యత్ఫలం తల్లభేత్‌ ధ్రువం || 87

సావిత్రీ దేవి యొక్క ఈ స్తోత్రమును పఠించి అశ్వపతి మహారాజు సావిత్రీ దేవిని ప్రత్యక్షము చేసికొనగలిగెను. ఈ మాత అశ్వపతి కోరుకున్న కోరికను (సంతానమును) వరముగా నిచ్చెను.

ఈ సావిత్రీస్తోత్రమును మూడు పూటలయందు భక్తితో చదివినచో నాల్గువేదములు పారాయణము చేసిన ఫలితమును పొందుదురు.

ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణ ద్వితీయే ప్రకృతి ఖండే నారద నారాయణ సంవాదే సావిత్య్రుపాఖ్యానే

సావిత్రీస్తోత్రకథనం నామ త్రయోవింశతితమే7ధ్యాయః |

శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదగు ప్రకృతి ఖండమున నారద నారాయణుల సంవాద సమయమున

పేర్కొనబడిన సావిత్ర్యుపాఖ్యానములో సావిత్రీస్తోత్ర కథనమను

ఇరువది మూడవ అధ్యాయము సమాప్తము.

sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters