sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
షట్పంచాశత్తమో
శ్రీపార్వత్యువాచ- పార్వతీదేవి మహేశునితో నిట్లు పలికెను-
పూజావిధానం స్తోత్రం చ శ్రుతమత్యద్భుతం మయా | అధునా కవచం బ్రూహి శ్రోష్యామి త్వత్ప్రసాదతః || 1
మహేశ్వర! రాధాదేవియొక్క పూజవిధానమును ఆ దేవియొక్క స్తోత్రమును చక్కగా తెలిపితిరి. నాకు ఇప్పుడు రాధాదేవియొక్క కవచమును తెలుపగలరు.
శ్రీ మహేశ్వర ఉవాచ - మహేశ్వరుడు పార్వతితో ఇట్లనెను -
శ్రుణువక్ష్యామి హే దుర్గే కవచం పరమాద్భుతం | పురా మహ్యం నిగదితం గోలోకే పరమాత్మనా || 2
అతిగుహ్యం పరం తత్వం సర్వమంత్రౌఘ విగ్రహం | యద్ధృత్వా పఠనాద్బ్రహ్మా సంప్రాప్తో వేదమాతరం || 3
యద్ధృత్వాzహం తవ స్వామీ సర్వమాతా సురేశ్వరీ | నారాయణశ్చ యద్ధృత్వా మహాలక్ష్మీమవాప సః || 4
యద్ధృత్వా పరమాత్మా చ నిర్గుణః ప్రకృతేః పరః | బభూవ శక్తిమాన్ కృష్ణః సృష్టిం కర్తుం పురా విభుః || 5
విష్ణుః పాతా చ యద్ధృత్వా సంప్రాప్త స్సింధుకన్యకాం | శేషో బిభర్తి బ్రహ్మాండం మూర్ద్ని సర్షపవద్యతః || 6
ప్రత్యేకం లోమకూపేషు బ్రహ్మాండాని మహావిరాట్ | బిభర్తి ధారణాద్యస్య సర్వాధారో బభూవ సః || 7
యుద్ధారణాచ్చ పఠనాద్ధర్మః సాక్షీ చ సర్వతః | యుద్ధారణాత్కుబేరశ్చ ధనాధ్యక్షశ్చ భారతే || 8
ఇంద్రః సురాణామీశశ్చ పఠనాద్ధారణాద్విభుః | నృపాణాం మనురీశశ్చ పఠనాద్ధారణాద్విభుః || 9
శ్రీమాంశ్చంద్రశ్చ యద్ధృత్వా రాజసూయం చకారసః | స్వయం సూర్యస్త్రిలోకేశః పళనాద్ధారణద్ధరిః || 10
యద్ధృత్వా పఠనాదగ్నిః జగత్పూతం కరోతి చ | యద్ధృత్వా వాతి వాతోzయం పునాతిభువన త్రయం || 11
యద్ధృత్వా చ స్వతంత్రో హి మృత్యుశ్చరతి జంతుషు | త్రిఃసప్తకృత్వా నిఃక్షత్రాం చకార చ వసుంధరాం || 12
జామదగ్న్యశ్చ రామశ్చ పఠనాద్ధారణాత్ప్రభుః | పపౌ సముద్రో యద్ధృత్వా పఠనాత్కుంభ సంభవః || 13
సనత్కుమారో భగవాన్ యద్ధృత్వా జ్ఞానినాంగురుః | జీవన్ముక్తౌ చ సిద్ధౌ చ నరనారాయణావృషీ || 14
యద్ధృత్వా పఠనాత్సిద్ధో వసిష్ఠో బ్రహ్మపుత్రకః | పిద్ధేశః కపిలో యస్మాత్ యస్మద్దక్షః ప్రజాపతిః || 15
యస్మాద్భృగుశ్చ మాం ద్వేష్టి కూర్మః శేషం బిభర్తిచ | సర్వాధారో యతోవాయుః వరుణః పవనో యతః || 16
ఈశానో దిక్పతిశ్చైవ యమః శాస్తా యతః శివే | కాలః కాలాగ్ని రుద్రశ్చ సంహర్తా జగతాం యతః || 17
యుద్ధృత్వా గౌతమః సిద్ధః కశ్యపశ్చ ప్రజాపతిః | వసుదేవసుతాం ప్రాప చైకాంశేన తు తత్కళాం || 18
పురా స్వజాయావిచ్ఛేదే దుర్వాసా మునిపుంగవః | సంప్రాప రామః సీతాం చ రావణన హృతాం పురా || 19
పురానలశ్చ సంప్రాప దమయంతీం యతః సతీం | శంఖచూడో మహావీరో దైత్యానామీశ్వరో యతః || 20
ఓ దుర్గాదేవి! పూర్వము నాకు శ్రీకృష్ణపరమాత్మ తెలిపిన రాధా కవచమును నీకు చెప్పెదను. అది పరమాద్భుతమైనది. మిక్కిలి రహస్యమైనది. సమస్త మంత్రములే మూర్తీభవించినట్లున్నది. పరతత్వరూపమైనది.
ఈ రాధాదేవి కవచమును పఠించుచు బహుమూలమున దానిని ధరించుటవలననే బ్రహ్మదేవుడు వేదములకన్నిటికి తల్లియగు సావిత్రీదేవి పొందెను. నేను నీకు భర్తనైతిని. నారాయణుడు మహాలక్ష్మీదేవికి భర్త అయ్యెను. రాధాకవచమును ధరించి పఠించుచున్నందువలననే పరమాత్మ, నిర్గుణరూపుడు, ప్రకృతికంటె శ్రేష్ఠుడగు శ్రీకృష్ణుడు సృష్టిరచన చేయుచున్నాడు. విష్ణుమూర్తి సర్వజన రక్షకుడు సింధుకన్యకాపతి యయ్యెను. ఆదిశేషుడు ఈ బ్రహ్మాండమునంతయు తన శిరస్సుపై ఆవగింజను మోయుచున్నట్లు అవలీలగా మోయుచున్నాడు, మహావిరాట్స్వరూపుడగు శ్రీ మహావిష్ణువు తన రోమకూపములందు బ్రహ్మాండములన్నిటిని ధరించి సర్వాధారుడు కాగలిగెను. ధర్మదేవతసైతము ఈ కవచమును ధరించినందువలన పఠించుచున్నందువలన సర్వసాక్షిగా అయ్యెను. ఈ కవచముయొక్క మహిమవల్లనే కుబేరుడు ధనపతిగాను, ఇంద్రుడు దేవతాపతిగాను, మనువు మానవులందరకు అధిపతిగాను, సూర్యుడు ముల్లోకములయందు పూజితులయందు పూజితుడుగాను, అగ్నిదేవుడు పరమ పవిత్రుడుగానున్నారు. వాయుదేవుడు ఈ కవచముయొక్క మహిమవలన ముల్లోకములను పవిత్రము చేయగల్గుచున్నాడు. మృత్యువు అందరను సమానముగా చూచుచున్నాడు. జమదగ్నిమహర్షి పుత్రుడైన పరశురాముడు ఇరువది యొక్కమారులు ఈ భూమండలమంతయు తిరిగి దీనిని క్షత్రియరహితముగా చేయగలిగెను. సనత్కుమారముని మిక్కిలి జ్ఞానవంతుడాయెను. నరనారాయణ ఋషులు జీవన్ముక్తులు, సిద్ధులైనారు. వసిష్ఠుడు బ్రహ్మదేవుని పుత్రుడయ్యెను. దీనివలననే కపిలమహర్షి సిద్ధేశుడుగను, దక్షకుడు ప్రజాపతిగాను, భృగుమహర్షి నన్ను ద్వేషించునంతవాడుగాను, ఆదికూర్మము ఆదిశేషుని భరించువాడుగనునైరి. వాయు దేవుడు సర్వాధారుడయ్యెను. ఈశ్వరుడు దిక్పాలకుడయ్యెను. యమధర్మరాజు సమస్తమును శాసించగలుగుచున్నాడు. కాలుడు, కాలాగ్ని రుద్రుడు సమస్తజగములను సంహరింపగల్గిరి. ఈ కవచము యొక్క ప్రభావము వలన గౌతముడు సిద్ధుడుగాను, కశ్యపముని ప్రజాపతిగాను కాగలిగిరి. దుర్వాస మహాముని తన భార్యగతించినపుడు రాధాదేవి అంశగలస్త్రీని భార్యగ పొందెను. అట్లే రామచంద్రుడు రావణాసురునిచే అపహరింపబడిన సీతాదేవిని పొందగలిగెను. కలిదోషమువలన దూరమైన తన భార్యను నలుడు పొందగలిగెను. ఈ కవచముయొక్క గొప్పతనము వలన శంఖచూడుడను మహావీరుడు దానవవీరుడు కాగలిగెను.
వృషో వహతి మాం దుర్గే యతోహి గరుడో హరిం | ఏవం సంప్రాప సంసిద్ధిం సిద్ధాశ్చ మునయః పురా || 21
యద్ధృత్వామహాలక్ష్మీః ప్రదాత్రీ సర్వసంపదాం | సరస్వతీ సతాంశ్రేష్ఠా యతః క్రీడావతీ రతిః || 22
సావిత్రీ వేదమాతా చ యతః సిద్ధిమవాప్నుయాత్ | సింధుకన్యా మర్త్యలక్ష్మీర్యతో విష్ణుమవాప సా || 23
యద్ధృత్వా తులసీ పూతా గంగా భువన పావనీ | యద్ధృత్వా సర్వసస్యాఢ్యా సర్వాధారా వసుంధరా || 24
యద్ధృత్వా మనసా దేవీ సిద్ధావై విశ్వపూజితా | యద్ధృత్వా దేవమాతా చ విష్ణుం పుత్రమవాప సా || 25
పతివ్రతా చ యద్ధృత్వా లోపా ముద్రాzప్యరుంధతీ | లేభే చ కపిలం పుత్రం దేవహూతీ యతః సతీ || 26
ప్రియవ్రతోత్తానపాదౌ సుతౌ ప్రాప చ తత్ప్రసూః | త్వన్మాతా చాపి సంప్రాప త్వాం దేవీం గిరిజాం యతః || 27
ఏవం సర్వే సిద్ధగణాః సర్వైశ్వర్య మవాప్నుయుః |
శ్రీరాధాదేవియొక్క కవచ మహాత్మ్యము వలన నందీశ్వరుడు నన్ను, గరుత్మంతుడు శ్రీహరిని మోయగలుగుచున్నారు. ఇట్లే మునులు సిద్ధులు ఆ కవచము వలన సిద్ధిని పొందిరి. ఆ కవచ మహిమవలన మహాలక్ష్మీదేవి సమస్త సంపదలనొసగగలిగినది. అట్లే సరస్వతీదేవి పరమపూజ్యురాలైనది. రతీదేవి క్రీడావతియయ్యెను. అదేవిధముగా సావిత్రీదేవి వేదములకు మాతయై సిద్ధిని పొందెను. మర్త్యలక్ష్మియగు సింధుసుత శ్రీమహావిష్ణువును భర్తగా పొందినది. ఆ కవచ మహిమవలననే తులసీదేవి పరమపవిత్రమైనది, గంగాదేవి ముల్లోకములను పవిత్రము చేయగలిగినది. అట్లే మనసాదేవి సిద్ధురాలై ప్రపంచమునందంతట పూజలను అందుకొన్నది. దేవమాతయగు అదితీదేవి శ్రీమహావిష్ణువును ఉపేంద్రరూపమున పుత్రునిగా పొందగలిగినది. ఈ కవచము వలననే అరుంధతి మరియు లోపాముద్రలు పతివ్రతలైరి. దేవహూతీదేవి మహావిష్ణురూపుడైన కపిలుని పుత్రునిగా పడసినది. నీతల్లియగు మేనాదేవి నిన్ను పొందినది.
ఇట్లు రాధాదేవియొక్క కవచ మహిమవలన సిద్ధులందరు సమసై#్తశ్వర్యముల పొందగలిగిరి.
శ్రీ జగన్మంగళస్యాస్యం కవచస్య ప్రజాపతిః || 28
ఋషిశ్ఛందోzస్య గాయత్రీ దేవీ రాసేశ్వరీ స్వయం | శ్రీకృష్ణభక్తిసంప్రాప్తౌ వినియోగః ప్రకీర్తితః || 29
శిష్యా య కృష్ణభక్తాయ బ్రాహ్మణాయ ప్రకాశ##యేత్ | శఠాయ పరశిష్యాయ దత్వా మృత్యుమవాప్నుయాత్ || 30
రాజ్యం దేయం శిరోదేయం న దేయం కవచం ప్రియే | కంఠే ధృతమిదం భక్త్యా కృష్ణేన పరమాత్మనా || 31
మయాదృష్టం చ గోలోకే బ్రహ్మణా విష్ణునా పురా | ఓం రాధేతి చతుర్ధ్యంతం వహ్నిజాయాంతమేవచ || 32
కృష్ణేనోపాసితో మంత్రః కల్పవృక్షః శిరోzవతు | ఓం హ్రీం శ్రీం రాధికాం జేంతం వహ్నిజాయాంతమేవ చ || 33
కపాలం నేత్రయుగ్మం చ శ్రోత్రయుగ్మం సదాzవతు | ఓం ఐం హ్రీం శ్రీం రాధికాయై వహ్నిజాయాంతమేవ చ || 34
మస్తకం కేశ సంఘాంశ్చ మంత్రరాజః సదాzవతు | ఓం రాం రాధాచతురథ్యంతం వహ్నిజాయాంతమేవ చ || 35
సర్వసిద్ధి ప్రదః పాతు కపోలం నాసికాం ముఖం | క్లీం కృష్ణప్రియాజేంతం కంఠంసాతు నమోzంతకం || 36
ఓం రాం రాసేశ్వరీం జేంతం స్కంధం పాతునమోంతకం | ఓం రాం రాసవిలాసిన్యై స్వాహా పృష్ఠం సదాzవతు || 37
బృందావన విలాసిన్యై స్వాహా వక్షః సదాzవతు | తులసీ వనావాసిన్యై స్వాహా పాతు నితంబకం || 38
కృష్ణప్రాణాధికాజేంతం స్వాహాంతం ప్రణవాదికం | పాదయుగ్మం చ సర్వాంగం సంతతం పాతు సర్వతః || 39
ప్రాచ్యాం రక్షతు సారాధా వహ్నౌ కృష్ణప్రియాzవతు | దక్షే రాసేశ్వరీ పాతు గోపీశా నైఋతేzవతు || 40
పశ్చిమే నిర్గుణా పాతు పాయవ్యే కృష్ణపూజితా | ఉత్తరే సంతతం పాతు మూలప్రకృతిరీశ్వరీ || 41
సర్వేశ్వరీ సదైశాన్యాం పాతుమాం సర్వపూజితా | జలేస్థలే చాంతరిక్షే స్వప్నే జాగరణ తథా || 42
మహావిష్ణోశ్చ జననీ సర్వతః పాతు సంతతం |
జగన్మంగళకారకమైన ఈ కవచమునకు బ్రహ్మదేవుడు ఋషి, గాయత్రి ఛందస్సు, రాసేశ్వరియగు రాధాదేవి దేవత. శ్రీకృష్ణుని యందు భక్తి కలుగుటకై ఈ కవచమును ఉపయోగించవలెను. దీనిని శ్రీకృష్ణ భక్తునకు మాత్రము ఉపదేశముచేయవలెను. దుష్టుడైన ఇతర దేవతాభక్తునకు దీనిని ఉపదేశించినచో ఆ గురువు వెంటనే చనిపోవును. రాజ్యమివ్వవచ్చును. తన ప్రాణమునైన ఇవ్వవచ్చును. కాని అయోగ్యుడగువానికి ఈ కవచమును ఎట్టి పరిస్థితిలోను ఉపదేశింపరాదు.
ఈ కవచమును శ్రీకృష్ణపరమాత్మ తన కంఠమున ధరించెను. నేను, బ్రహ్మ, విష్ణువు కూడ ఈకవచమును ధరించుచున్నాము.
ఓం రాధయై స్వాహా అను కల్పవృక్షమువంటి మంత్రమును శ్రీకృష్ణుడు ఉపాసనచేసెను. ఈ మంత్రము నాశిరస్సును కాపాడుగాక.
ఓం హ్రీం శ్రీం రాధికాయై స్వాహా అనుమంత్రము నా శిరస్సును, వెంట్రెకలను ఎల్లప్పుడూ రక్షించుగాక.
ఓం రాం రాధియైస్వాహా అనుమంత్రము నా చెక్కిళ్ళను నాసికను ముఖమును రక్షించుగాక.
ఓం క్లీం కృష్ణప్రియాయై స్వాహా అనుమంత్రము నా కంఠమును రక్షించుగాక.
ఓం రాం రాసేశ్వర్యైస్వాహా అనునది నా భుజములను రక్షించుగాక.
ఓం రాం రాసవిలాసిన్యై స్వాహా అనుమంత్రము నా వీపును రక్షించుగాక.
ఓం బృందావన విలాసిన్యై స్వాహా అన మంత్రము నా రొమ్మును రక్షించుగాక.
ఓం తులసీవన వాసిన్యె స్వాహా అనునది నా నితంబముల రక్షించుగాక.
ఓం కృష్ణప్రాణాధికాయై స్వాహా అనునది నా పాదములను సమస్త అవయవములను ఎల్లప్పుడు రక్షించుగాక.
రాధాదేవి నా తూర్పుదిక్కున, కృష్ణప్రియ ఆగ్నేయ దిశలో, రాసేశ్వరి దక్షిణ దిశలో, గోపీశ నైఋతి దిశలో, నిర్గుణ పశ్చిమ దిశలో, కృష్ణపూజిత వాయువ్యదిశలో, మూలప్రకృతి ఈశ్వరి ఉత్తర దిశలో, సర్వేశ్వరి ఈశాన్యమున, సర్వపూజిత జలమున, నన్ను అన్నివైపులనుండి ఎల్లప్పుడు రక్షించుచుండుగాక.
కవచం కథితం దుర్గే శ్రీ జగన్మంగళం పరం || 43
యసై#్మ కసై#్మ న దాతవ్యం గుహ్యాద్గుహ్యతరం పరం | తవస్నేహాన్మయాzఖ్యాతం ప్రవక్తవ్యం కస్యచిత్ || 44
గురుమభ్యర్చ్య విధివద్వస్త్రాలంకార చందనైః | కంఠే వా దక్షిణ బాహౌ ధృత్వా విష్ణు సమో భ##వేత్ || 45
శతలక్ష జపేనైవ సిద్ధం చ కవచం భ##వేత్ | యది స్యాత్ సిద్ధకవచో న దగ్ఢో వహ్నినా భ##వేత్ || 46
ఏతస్మాత్మవచాద్గుర్గే రాజా దుర్యోధనః పురా | విశారదో జలస్తంభం వహ్నిస్తంభం చ నిశ్చితం || 47
మయా సనత్కుమారాయ పురా దత్తం చ పుష్కరే | సూర్యపర్వణి మేరౌ చ స సాందీపనయే దదౌ || 48
బల్లాయ తేన దత్తం చ దదౌ దుర్యోధనాయసః | కవచస్య ప్రసాదేన జీవన్ముక్తో భ##వేన్నరః || 49
నిత్యం పఠతి భ##క్త్యేదం తన్మంత్రోపాసకశ్చ యః | విష్ణుతుల్యో భ##వేన్నిత్యం రాజసూయాఫలం లభేత్ || 50
స్నానేన సర్వతీర్థానాం సర్వదానేన యత్ఫలం | సర్వవ్రతోపవాసేన పృథివ్యాశ్చ ప్రదక్షిణౖః || 51
సర్వయజ్ఞేషు దీక్షాయాం నిత్యం వై సత్యరక్షణ | నిత్యం శ్రీకృష్ణసేవాయాం కృష్ణనైవేద్యభక్షణ || 52
పాఠే చతుర్ణాం వేదానాం యత్ఫలం చ లభేన్నరః | తత్ఫలం లభ##తే నూనం పఠనాత్కవచస్య చ || 53
రాజద్వారే స్మశానే చ సింహహ్యాఘ్రాన్వితే వనే | దావాగ్నౌ సంకటే చైవ దస్యు చోరాన్వితే భ##యే || 54
కారాగారే రిపుగ్రస్తే ఘోరే చ దృఢబంధనే | వ్యాధియుక్తో భ##వేన్ముక్తో ధారణాత్కవచస్య చ || 55
పార్వతీ! లోకములకు మంగళమును కలిగించు రాధాదేవి కవచమును నీపైగల ప్రేమచే చెప్పితిని. కాని దీనిని అందరకు చెప్పరాదు.
మంత్రోపదేశము చేయుచున్న గురువును శాస్త్రోక్తముగా వస్త్రములు, అలంకారములు చందనము మొదలగు వాటిచే గౌరవించి అతనిచే ఉపదేశించబడిన ఈ కవచమును కుడిచేతికో లేక కంఠమునకో కట్టుకొనవలెను. అట్లు చేసినచో అతడు విష్ణుమూర్తితో సమానుడు అగును.
ఈ కవచమును కోటిమార్లు జపించినచో అది సిద్ధించును. కవచము సిద్ధించినచో అతనిని నిప్పు కాల్చలేదు. ఈ కవచముయొక్క సిద్ధిపొందినందువలననే దుర్యోధనుడు జలస్తంభ వహ్నిస్తంభవిద్యలలో నిష్ణాతుడయ్యెను.
దీనిని నేను పుష్కరక్షేత్రమున సనత్కుమారున కుపదేశింపగా అతడు సూర్యసంక్రమణ సమయమున మేరు పర్వతమున సాందీపనికి ఉపదేశించెను. సాందీపని బల్లున కుపదేశింపగా బల్లుడు దుర్యోధనునకుపదేశించెను.
ఈ కవచముయొక్క మహిమవలన మానవుడు జీమన్ముక్తుడగును. దీనిని ప్రతిదినము చదువుచు రాధామంత్రమును ఉపాసన చేసినచో అతడు విష్ణుమూర్తితో సమానుడగును. రాజసూయయాగ ఫలితమును కూడ పొందును. సమస్త పుణ్యతీర్థములలో స్నానముచేసినచో, సమస్త దానములు చేసినచో, అన్ని వ్రతములను అనుష్ఠించినచో, భూప్రదక్షిణలు చేసినచో, సమస్త యజ్ఞములు చేసినచో, సత్యధర్మమును చక్కగా పరిపాలించినచో, ప్రతిదినము శ్రీకృష్ణుని అర్చించినచో, శ్రీకృష్ణునకు నివేదితమైన అన్నమును భుజించినచో, నాలుగువేదములను పఠించినచో కలుగు పుణ్యము ఈ రాధాదేవి కవచమును శ్రద్ధగా పఠించినచో కలుగును.
రాజసన్నిధిలోను, స్మశానములోను, సింహములు, పులులు మొదలైన క్రూర మృగములున్న అడవిలోను, దావాగ్నియందును, కష్టములందును, దస్యులు చోరులవల్లను, కారాగారమునను, శత్రువులు పైనబడినప్పుడు, దృఢముగా బంధించినపుడు, వ్యాధిగ్రస్తుడైనప్పుడు కలుగు భయమంతయు ఈ కవచమును చదివినంత మాత్రముననే లేక ఈ కవచమును కంఠముననో లేక కుడిచేతికి కట్టుకున్నంతమాత్రమున నశించిపోవును. అతడు జీవన్ముక్తుడు కూడ అగుచున్నాడు.
ఇత్యేతత్కథితం దుర్గే తవైవేదం మహేశ్వరి | త్వమేవ సర్వరూపా మాం మాయా పృచ్ఛసి మాయయా || 56
ఓ దుర్గా ఈ విధముగా నీకు శ్రీ రాధాకవచమును తెల్పితిని. నీవు సమస్తము తెలిసినదానవు. సమస్త భూత రూపిణివి. ఐనను నన్ను కావలెనని అడుగుచున్నావని మహేశ్వరుడనెను.
శ్రీనారాయణ ఉవాచ- నారాయణముని నారదునితో నిట్లనెను-
ఇత్యుక్త్వా రాధికాఖ్యానం స్మారం స్మారం చ మాధవం | పులకాంకిత సర్వాంగః సాశ్రునేత్రో బభూవ సః || 57
న కృష్ణసదృశో దేవో న గంగా సదృశీ సరిత్ | న పుష్కరాత్పరం తీర్థం న వర్ణో బ్రాహ్మణాత్పరః || 58
పరమాణోః పరం సూక్ష్మం మహావిష్ణోః పరో మహాన్ | నభః పరం చ విస్తీర్ణం యథా నాస్త్యేవ నారద || 59
యథా న వైష్ణవాత్ జ్ఞానీ యోగీంద్రః శంకరాత్పరః | కామక్రోధలోభమోహా జితాస్తేనైవ నారద || 60
స్వప్నే జాగరణశశ్వత్ కృష్ణధ్యానరతః శివః | యథా కృష్ణస్తథా శంభు ర్నభేదో మాధవేశయోః || 61
యథా శంభుర్వైష్ణవేషు యథా దేవేషు మాధవః | తథేzదం కవచం వత్స కవచేషు ప్రశస్తకం || 62
మహేశ్వరుడు ఈ విధముగా పార్వతీదేవికి రాధాదేవియొక్క ఉపాఖ్యానమును చెప్పుచు మాటిమాటికి రాధాపతియగు మాధవుని తలుచుకొని అవయవములన్నియు పులకించిపోగా, ఆనందబాష్పములు రాలుచుండగా ఇట్లు చెప్పెను.
శ్రీకృష్ణ పరమాత్మవటి దేవుడు, గంగానదివంటి పవిత్రమైననది, పుష్కర కాలమును పవిత్రమైయున్న తీర్థము, బ్రాహ్మణుని వంటి జాతి, పరమాణువునకంటె చిన్నని వస్తువు, మహావిష్ణువుకన్న గొప్పవాడు, ఆకాశముకంటె విశాలమైన వస్తువు. వైష్ణవున కన్న గొప్ప జ్ఞాని, శంకరుని మించిన యోగి ఏ విధముగా లేడో అట్లే రాధా కవచముకంటె గొప్ప కవచమేది లేదు.
పరమశివుడు నిద్రలోను, జాగ్రదవస్థలోను ఎల్లప్పుడు శ్రీకృష్ణునే ధ్యానించుచుండును. శివకేశవుల మధ్య లేశ##మైనను బేధములేదు.
విష్ణుభక్తులలో శంకరుడు, దేవతలలో శ్రీ మహావిష్ణువు ఏ విధముగా ఉత్తములో అట్లే కవచములన్నిటిలోను రాధికా కవచమును సర్వోత్తమమైనది.
శి శబ్దో మంగళార్థశ్చ వకారోదాతృవాచకః | మంగళానాం ప్రదాతా యః స శివః పరికీర్తితః || 63
నరాణాం సంతతం విశ్వే శం కల్యాణం కరోతి యః | కల్యాణం మోక్ష ఇత్యుక్తం స ఏవం శంకరః స్మృతః || 64
బ్రహ్మాదీనాం సురాణాం చ మునీనాం వేదవాదినాం | తేషాం చ మహతాం దేవో మహాదేవః ప్రకీర్తితః || 65
మహతీ పూజితా విశ్వే మూలప్రకృతిరీశ్వరీ | తయా దేవః పూజితశ్చ మహదేవః స చ స్మృతః || 66
విశ్వస్థానాం చ సర్వేషాం మహతామీశ్వరః స్వయం | మహేశ్వరం చ తేనేమం ప్రవదంతి మనీషిణః || 67
హే బ్రహ్మపుత్ర ధన్యోసి యద్గురుశ్చ మహేశ్వరః | కృష్ణభక్తిదాతా యో భవాన్ పృచ్ఛతి మాంచ కిం || 68
'శి' అనుశబ్ధము మంగళమను అర్థమునిచ్చును. 'వ' అను శబ్ధము దాత అను అర్థమునిచ్చును.ర మంగళప్రదాత కావున అతనిని శివుడని పిలుచుచున్నారు. అట్లే మానవులందరకు 'శం' అనగా కల్యాణము లేక మోక్షమునిచ్చువాడు కావున అతడు శంకరుడయ్యెను. బ్రహ్మాది దేవతలకు మునులందరిలోను మహాత్ములైన వారందరకు దేవుడు కావున మహాదేవుడయ్యెను. అట్లే ప్రపంచముననున్న మహాత్ములందరకు ఈశ్వరుడు కావున మహేశ్వరుడని పిలువబడుచున్నాడు.
ఓ నారదా! నీవు చాలా ధన్యుడవు. నీ గురువు శ్రీకృష్ణభక్తిని కలిగించు సాక్షాత్ మహేశ్వరుడు. ఐనను నీవునన్ను శ్రీకృష్ణసంబంధములైన విషయములను తెల్పుమని అడుగుచున్నందువలన నేను కూడా ధన్యుడనైతిని.
ఇతి శ్రీబ్రహ్మవైవర్తే ద్వితీయే ప్రకృతిఖండే నారదనారాయణ సంవాదే రాధికోపాఖ్యానే తన్మంత్రాది కథనం నామ షట్పంచాశత్తమోzధ్యాయః ఇతి రాధోపాఖ్యానం ||
శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదగు ప్రకృతి ఖడమున నారద నారాయణుల సంవాదమున చెప్పబడిన రాధోపాఖ్యానములో రాధాదేవి మంత్రాది విషయములు గల
యాభైయారవ అధ్యాయము సమాప్తము.
రాధోపాఖ్యానము సమాప్తమైనది.