sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణము తృతీయ ఖండము - గణశ ఖండము శ్రీగణశాయనమః | శ్రీమద్వేంకటేశానమః || అథబ్రహ్మవైవర్తేమహాపురాణతృతీయం గణపతిఖండం ప్రారభ్యతే || శ్రీబ్రహ్మవైవర్తమహాపురాణమున మూడవదగు గణశఖండము ప్రారంభమగుచున్నది. ప్రథమోzధ్యాయః - పార్వతీ పరమేశ్వరుల సంభోగ వర్ణనము నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం | దేవీం సర్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ ||
1 శ్రీమన్నారాయణనకు మానవులలో ఉత్తవడైన నరుడను మహర్షికి, సరస్వతీదేవికి వ్యాసునకు నమస్కరించి జయజయధ్వానముచేయవలెను. ఇది ప్రార్థనాశ్లోకం. నారద ఉవాచ - నారదమహర్షి నారాయణునితో ఇట్లనెను. శ్రుతం ప్రకృతిఖండం తదమృతార్ణవముత్తం | సర్వత్కృష్ణమభీష్టం చ మూఢానాం జ్ఞానవర్దనం || 2 అధునా శ్రీగణశస్య ఖండం శ్రోతుమిహాగతః | తజ్జన్మచరితం నౄణాం సర్వమంగళమంగళం || 3 కథం జజ్ఞే సురశ్రేష్ఠః పార్వత్యా ఉదరే శుభే | దేవీ కేన ప్రకారేణ చాలభత్తాదృశం సుతం || 4 సంచాశః కన్య దేవస్య కథం జన్మ లలాభ సః | అయోనిసంభవః కిం వా కింవాzసౌ యోనిసంభవః || 5 కిం వా తద్బ్రహ్మా తేజో నా కిం తస్య చ పరాక్రమః | కా తపస్యాచ కిం జ్ఞానం కివా తన్నిర్మలం యశః || 6 కథం తస్య పురః పూజా విశ్వేషు నిఖిలేషు చ | స్థితే నారాయణ శంభౌ జగదీశే చ ధాతరి || 7 పురాణషు నిగూఢం చ తజ్జన్మ పరికీర్తితం | కథం వా గజవక్త్రోzయమేకదంతో మహోదరః || 8 ఏతత్సర్వం సమాచక్ష్య శ్రోతుం కౌతుహలం మమ | సువిస్తీర్ణం మహాభాగ తదతీవ మనోహరం || 9 ఓనారాయణమునీ! నీ అనుగ్రహమువలన అమృతసముద్రమని పేరొందినది, అజ్ఞానులకు జ్ఞానమును కలిగించునది, అందరకు ఇష్టమైనది, సర్వోత్కృష్టమైనది యగు ప్రకృతిఖండమును వింటిని. ఇప్పుడు అందరకు మంగళప్రదమైన శ్రీగణశఖండమును వినవలెనను కోరిక నాకు కల్గినది. ఆతని జన్మ, ఆతని చరిత్ర శుభములకే శుభ##మైనది. కావున దానిని వినవలెనని అనుకొనుచున్నాను. దేవతాశ్రేష్ఠుడగు ఆ గణపతి పార్వతీదేవిపుత్రుడుగా ఎట్లు ఉద్భవించెను? పార్వతీదేవి సహితము గజముఖుడగు ఆ బాలకుని 'ఏవిధముగా కన్నది? ఆ గణపతి ఏదేవునియొక్క అంశ? ఎవరివలన జన్మించెను? అతనిజన్మప్రకారమెట్టిది? అతడుయోనిజుడా అయోనిజుడా? ఆ బ్రహ్మతేజస్సు ఎటువంటిది? అతని పరాక్రమవిశేషములెట్టివి? ఆతడెట్టి తపస్సు చేసెను? అతనికి లభించిన జ్ఞానమెట్టిది? ఆతని కీర్తి వివరములేమి ? ఈసమస్తవిశ్వములందు బ్రహ్మ, నారాయణుడు, శంకరుడు వంటి దేవతలుండగా ఈతనికి ప్రథమపూజను అందరెందులకు చేయుచున్నారు? అతని జన్మవృత్తాంతము పురాణములలో చాలా రహస్యముగా నున్నదని వింటిని. ఆ గణశుడు గజముఖుడుగా, ఏకదంతుడుగా ఎట్లయ్యెను మొదలగు విషయములనన్నిటిని వినవలెనని కోరికకలదు. మిక్కిలి సుందరమైన ఆ గణశుని చరిత్రను నాకు సంపూర్ణముగా వివరింపుడని ప్రార్థించుచున్నాను అని పలికెను. శ్రీనారాయణ ఉవాచ- శ్రీమన్నారాయణుడిట్లనెను. శ్రుణు నారద వక్ష్యామి రహస్యం పరమాద్భుతం | పాపసంతాపహరణం సర్వవిఘ్నవినాశం || 10 సర్వమంగళదం సారం సరవశ్రుతిమనోహరం | సుఖదం మోక్షబీజం చ పాపమూలనికృంతనం || 11 దైత్యార్దితానాం దేవానాం తేజోరాశిసముద్భవా | దేవీ సంహృత్య దైత్యౌఘాన్ దక్షకన్యా బభూవ హ || 12 సా చ నామ్నా సతీ దేవీ స్వామినో నిందయా పురా | దేహం సంత్యజ్య యోగేన జాతా శైలప్రియోదరే || 13 శంకరాయ దదౌ తాం చ పార్వతీం పర్వతో ముదా | తాం గృహీత్వా మహాదేవో జగామ విజనం వనం || 14 శయ్యాం రతికరీం కృత్యా పుష్పచందన చర్చితాం | స రేమే నర్మదాతీరే పుష్పోద్యానే తయా సహ || 15 సహస్రవర్షపర్యంతం దైవమానేన నారద | తయోర్బభూవ శృంగారో విపరీతాదికో మహాన్ || 16 దుర్గాంగస్పర్శమాత్రేణ మదనాన్మూర్ఛితః శివః | మూర్చితా సా శివస్పర్శాత్ బుబుధే న దివానిశం || 17 హంసకారండవాకీర్ణే పుంస్కోకిల రుతాకులే | నానా పుష్పవికాసాఢ్యే భ్రమరధ్వని గుంజితే || 18 సుగంధికుసుమాశ్లేషి వాయునా సురభీకృతే | అతీవ సుఖదే తత్ర సర్వజంతు వివర్జితే || 19 దృష్ట్వాతయోః శృంగారం చింతాంప్రాపుః సురాః పరాం | బ్రహ్మాణం చ పురస్కృత యయుర్నారాయణాంతికం || 20 తం నత్వా కథయామాస బ్రహ్మ వృతతాంతమీప్సితం | సంతస్థుర్దేవతాః సర్వాశ్చిత్రా పుత్తాలికా యథా || 21 ఓనారదమహర్షీ శ్రీగణపతియొక్క చరిత్ర చాలా రహస్యమైనది. మిక్కిలి ఆశ్చర్యమును కలిగించునది. సమస్తపాపములను, శోకములను హరించునది. సమస్తవిఘ్నములను తొలగించునది. ఈతని చరిత్ర సమస్తశుభములను కలిగించును, సుఖమును మోక్షమును కలిగించును. సమస్తపాపములకు కారణమైన దుష్కర్మలను పోగొట్టును. పూర్వకాలమున రాక్షసులు దేవతలను మిక్కిలి బాధించెడివారు. దానవపీడితులైన దేవతల ప్రార్థన ననుసరించి తేజోరాశినుండి పుట్టిన దుర్గాదేవి రాక్షసులనందరను సంహరించినది. ఆ దుర్గాదేవియే సతీదేవి యనుపేర దక్షునకు పుత్రికగా జన్మించినది. ఆ సతీదేవి దక్షయజ్ఞమున తండ్రియగు దక్షుడు తన భర్తను నిందింపగా విని సహింపలేక యోగబలము వలన తన శరీరమును వదలిపెట్టి హిమవంతునకు అతని భార్యయగు మేనాదేవికి పుత్రికగా జన్మించినది. యుక్తవయస్కురాలగు తన పుత్రికను హిమవంతుడు శంకరునకిచ్చి వివాహము చేసెను. అప్పుడు శంకరుడు పార్వతీదేవిని తీసికొని నిర్జనమైన నర్మదానదీతీరమునకు తీసికొనిపోయెను. అక్కడనున్న పుష్పోద్యానవనమున పుష్పములు, చందనములతో రతికి అనుకూలమైన శయ్యను ఏర్పరచి అచ్చట అనేకవేల దేవతావర్షములు ఆమెతో సంభోగించెను. దుర్గాదేవియొక్క శరీరస్పర్శతోనే పరమేశ్వరుడు పులకించి మైమరచిపోగా, శంకరుని అవయవస్పర్శవలన పార్వతీదేవి పులకించి మైమరచిపోయినది. వారిద్దరు హంసలు, బాతులు తిరుగుచున్న ప్రదేశమున గండు కోకిలలు మనోహరముగా శబ్దించుచున్న సమయమున, తుమ్మెదల ఝూంకారములతో పువ్వులపైనుండి వచ్చు సుగంధమందమారుతములతో ఆ ప్రదేశమంతయు పరమరమణీయముగానుండగా నిర్జనమైన స్థలమున సుఖసంభోగమున తేలియాడుచుండిరి. కాని సమయమునేమాత్రము పట్టించుకొనకుండా వారు సంభోగముననున్నందువలన దేవతలు చాల చింతించి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళిరి. బ్రహ్మదేవుడు సహితము దేవతలను వెంటబెట్టుకొని శ్రీమన్నారాయణుని సన్నిధికి వెళ్ళెను. అచ్చట బ్రహ్మదేవుడు పార్వతీపరమేశ్వరుల విషయమును నారాయణునకు చెప్పుచున్నప్పుడు దేవతలందరు చిత్రములోని బొమ్మలవలె అచ్చట నిలుచుండిరి. బ్రహ్మవాచ- బ్రహ్మదేవుడిట్లనెను- సహస్రవర్షపర్యంతం దేవమానేన శంకరః | రతౌ రతశ్చ నిశ్చేష్టో న యోగీ విరరామ హ || 22 మైథునస్య విరామే చ దంపత్యోర్జగదీశ్వర | కింభూతం భవితాzపత్యం తన్నః కథితుమర్హసి || 23 శంకరుడు వేయి దేవమాన సంవత్సరములనుండి రతిలోనిమగ్నుడై రతికార్యమును విరమింపక ఉన్నాడు. అందువలన ఓ జగదీశ్వరుడవైన శ్రీమన్నారాయణమూర్తీ! ఈదంపతులకెట్టి సంతానము కలుగునో మాకు తెలుపుడు అని బ్రహ్మ శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థించెను. శ్రీభగవానువాచ- భగవంతుడగు నారాయణమూర్తి ఇట్లనెను. చింతా నాస్తిజగద్ధాతః సర్వం భద్రం భవిష్యతి | మయి యే శరణాపన్నాస్తేషాం దుఃఖం కుతో విధే || 24 యేనోపాయేన తద్వీర్యం భూమౌ పతతినిశ్చితం | తత్కురుష్వ ప్రయత్నేన సార్థం దేవగణన చ || 25 యదా చ శంభోర్వీర్యం తత్పార్వత్యా ఉదరే పతేత్ | తతోzపత్యం చ భవితా సురాసుర విమర్దకం || 26 జగములనన్నిటిని సృష్టించు ఓ బ్రహ్మదేవుడా! మీరు భయపడవలసిన అవసరము లేదు. మీకు సమస్తము శుభములే కలుగును. నన్ను శరణుపొందినవారికి దుఃఖము ఎన్నటికిని కలుగదు. ప్రస్తుతము నీవు, ఈదేవతాగణము అందరు కలసి శంకరుని వీర్యము భూమిపై పడునట్లు చేయుడు. శంకరుని వీర్యము పార్వతీదేవి కడుపున పడినచో దేవరాక్షసులనందరును సంహరించు పుత్రుడు పుట్టును కావున నేను చెప్పినట్లు చేయుడు అని పలికెను. తతః శుక్రాదయః సర్వే సురా నారాయణాజ్ఞాయా | ప్రయయుర్నర్మదాతీరం య¸° బ్రహ్మ నిజాలయం || 27 తత్రైవ పర్వతద్రోణీబహిర్దేశే సురాః పరాః | విషణ్ణవదనాస్సర్వే బభూవుర్భయకాతారాః || 28 శక్రో రాజా కుబేరం చ కుబేరో వరుణం తథా | సమీరణం చైవ వరుణో యమం చైవ సమీరణః || 29 హుతాశనం యమశ్చైవ భాస్కరం చ హుతాశనః | చంద్రం తథా భాస్కరశ్చత్వీశానం చంద్ర ఏవ చ || 30 ఏవం దేవాః ప్రేరయంతి దేవాంశ్చ రతిభంజనే | హరశృంగారభంగం చ కుర్విత్యుక్త్వా పరస్పరం || 31 ద్వారిస్థితో వక్రశిరా శక్రః ప్రాహ మహేశ్వరం || 32 శ్రీమన్నారాయణుని అనుజ్ఞనుపొంది దేవతలందరు నర్మాదాతీరమునకు వెళ్ళగా బ్రహ్మదేవుడు బ్రహ్మలోకమునకు పోయెను. దేవతలచ్చట పర్వతముల నడుమనున్న స్థలమున భయముతో విషణ్ణవదనులైరి. ఆ భయమువల్లనే ఇంద్రుడు కుబేరుని, కుబేరుడు వరుణుని, వరుణుడు వాయువును, వాయువు యమధర్మరాజును, యముడు అగ్నిని, అగ్నిదేవుడు సూర్యుని, సూర్యుడు చంద్రుని, చంద్రుడు ఈశ్వరుని ఇట్లు దేవతలొకరినొకరు శంకరుని రతిభంగము చేయు మని ప్రేరేపించుచుంéడిరి. చివరకు దేవేంద్రుడు పార్వతీపరమేశ్వరులున్న ఇంటిద్వారమువద్ద ముఖము తిప్పుకొని శంకరునితో ఇట్లనెను- ఇంద్ర ఉవాచ- ఇంద్రుడిట్లు పలికెను- కింకరోషిమహాదేవ యోగీశ్వర నేమోzస్తుతే | జగదీశ జగద్బీజ భక్తానాం భయభయంజన || 33 హరిర్జగామేత్యుక్త్వా తమాజగామ చ భాస్కరః | ఉవాచ భీతో ద్వారస్థః భయార్తో వక్రచక్షుషా || 34 ఓ మహాదేవ! నీవేమి చేయుచున్నావు? యోగీశ్వరుడవు, జగదీశుడవు, భక్తులభయములపోగొట్టునీకు నమస్కారము. ఇంద్రుడిట్లు పలికిపోగానే సూర్యుడచ్చటకు వచ్చి తన తలతిప్పుకొని భయపడుచు ఇట్లనెను. శ్రీసూర్య ఉవాచ- సూర్యభగవానుడిట్లనెను. కిం కరోషి మహాదేవ జగతాం పరిపాలక | సురశ్రేష్ఠ మహాభాగ పార్వతీశ నమోzస్తుతే || 35 ఇత్యేవముక్త్వా శ్రీసూర్యః స జగామ భయాత్తతః | ఆజగామ తథా చంద్ర అవోచద్వక్ర కంధరః || 36 జగములన్నిటిని పరిపాలించు ఓమహాదేవా! నీవు ఏమిచేయుచున్నావు. దేవతాశ్రేష్ఠుడవగు పార్వతీనాథా! నీకు నమస్కారము. అని సూర్యుడు పలికి భయముతో అక్కడినుండి వెళ్ళిపోయెను. అప్పుడాస్థలమునకు చంద్రుడువచ్చి తలప్రక్కకుదిప్పి ఇట్లనెను. చంద్ర ఉవాచ - చంద్రుడిట్లు పలికెను. కింకరోషి త్రిలోకేశ త్రిలోచన నమోzస్తుతే | ఆత్మారామస్వయంపూర్ణ పుణ్యశ్రవణకీర్తన || 37 ఇత్యేవముక్త్వాభీతశ్చ విరరామ నిశాపతిః | సమీరణోzపి ద్వారస్థస్సంవీక్ష్యోవాచ సాదరం || 38 ముల్లోకములకు ఈశ్వరుడవగు ముక్కంటీ! నీవేమిచేయుచున్నావు. స్వయంపూర్ణుడవు, ఆత్మారాముడవగు నిన్ను నమస్కరింతును అని చంద్రుడు భయముతో పలికి ఊరకుండగా వాయువచ్చటకు వచ్చి ఇట్లనెను. పవన ఉవాచ - వాయుదేవు డిట్లు పలికెను. కిం కరోషి జగన్నాథ జగద్బంధో నమోzస్తుతే | ధర్మార్థకామమోక్షాణం బీజరూపసనాతన || 39 ఇత్యేవం స్తవనం శ్రుత్వా యోగజ్ఞానవిశారదః | త్యక్తుకామో న తత్యాజ శృంగారం పార్వతీభయాత్ || 40 దృష్ట్వా సురాన్ భయార్తశ్చ పునఃస్తోతుం సముద్యతాన్| విజహౌ సుఖసంభోగం కంఠలగ్నాం చ పార్వతీం || 41 ఉత్తిష్ఠతో మహేశస్య త్రాసలజ్జాయుతస్య చ భూమౌ | పపాత తద్వీర్యం తతః స్కందోబ భూవ హ || 42 లోకములకన్నిటికిని బంధువగు ఓజగన్నాథుడా! నీవిప్పుడేమి చేయుచున్నావు ? ధర్మార్థకామమోక్షములచే చతుర్వర్గములకు కారణమైన ఓసనాతనుడా! నీకు నమస్కారము. ఈవిధమైన దేవతలస్తోత్రమును విని యోగజ్ఞానము చక్కగా నెరిగిన పరమశివుడు పార్వతీదేవిని వదలిపెట్టినచో ఆమె ఏమనుకోనునో అని భయపడి రతికార్యమును వదిలిపెట్టలేదు. ఐనను దేవతలు తనను మరల స్తుతింపబోవుచున్న విషయము నెరిగి తననాలింగము చేసికొన్న పార్వ తీదేవిని వదలి సుఖసంభోగమును త్యజించెను. ఆ సమయమున మహేశ్వరునకు వీర్యస్ఖలనమై అది భూమిపై పడినది. ఆ మహేశ్వరవీర్యమే కుమారస్వామిగా రూపుదాల్చినది. పశ్చాత్తాం కథయిష్యామి కథామతిమనోహరాం | స్కందజన్మప్రసంగే చ సాంప్రతం వాంఛితం శ్రుణు || 43 నారదా! అతిమనోహరమైన తరువాతికథను కుమారస్వామి జన్మవృత్తాంతమును వివరింపునప్పుడు నీకు చెప్పెదను. ప్రస్తుతము నీవు కోరుకున్న గణపతి వృత్తాంతమును నీవు వినుమని నారాయణు డనెను. ఇతిశ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణ తృతీయే గణపతి | ఖండే నారదనారాయణసంవాదే ప్రథమోzధ్యాయః || శ్రీబ్రహ్మవైవర్తమహాపురాణమున మూడవదగు గణపతిఖండములో నారదనారాయణులసంవాదము కల మొదటి అధ్యాయము సమాప్తము.