sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters   

శ్రీః

శ్రీ వేదవ్యాసుని

శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణము

ప్రథమ ఖండము

తాత్పర్యసహితము

తాత్పర్య రచయిత

డా|| యన్‌.యల్‌.నరసింహాచార్య

ఆంధ్రోపన్యాసకులు

ప్రభుత్వకళాశాల సిద్ధిపేట

ప్రకాశకులుః

శ్రీ వేంకటేశ్వర ఆర్షభారతి ట్రస్ట్‌

గురుకృప

1-10-140/1, ఆశోక్‌ నగర్‌, హైదరాబాద్‌-500 020

సర్వస్వమ్యములు ప్రకాశకులని

ప్రథమ ముద్రణము ః 2000

ప్రతులు ః 1000

మూల్యము ః రూ.200/-

ఇంటింట దేవతామందిరములందు పూజింపవలసినని,

ఆడపడచులు అత్తవారింటికి వెళ్లునపుడు సారె పెట్టవలసినని,

ఆచంద్రార్కము మనుమల మునిమనుమల ఆయురారోగ్య భాగ్య సౌభాగ్య సమృద్ధికి

ధర్మము దనము భోగము మోక్షమునుకోరి చదివి చదివించి

విని వినిపింపవలసినని, వేద వేదాంత రహస్య సుబోధకములైనవి,

వ్యాసప్రోక్త అష్టాదశ(18) మహాపురాణములు.

వానిని సంస్కృతమూల - సరళాంధ్రానువాద - పరిశోధనలతో

శ్రీ వేంకటేశ్వర ఆర్షభారతి ట్రస్టు ముద్రించి

అందించుచున్నది.

ప్రతులకు ః ముద్రణ ః

శ్రీ వేంకటేశ్వర ఆర్షభారతి ట్రస్ట్‌ శ్రీ దత్తసాయి గ్రాఫిక్స్‌

గురుకృప, శ్రీవాణి, 1-8-702/105,

1-10-140/1, అశోక్‌ నగర్‌, నల్లకుంట, హైదరాబాద్‌-44

హైదరాబాద్‌- 500 020 ఫోన్‌ ః 7633275, 3020719

ముందుమాట

విశ్వశ్రేయస్సునే పరమధర్మంగా భావించి లోకాన్ని ధర్మ పథంలో పయనింపచేసినవాడు మహర్షి వేదవ్యాసుడు. ఋగ్య జుస్సామాలుగా వేదాలను విభజించుటయే కాక అష్టాదశ పురాణాలు, ఉపపురాణాలు, మహాభారత సంహిత రచించి జగద్ధితాన్ని చేకూర్చిన మహానుభావుడాతడు. తాను విభజించిన వేదాలను జైమిన్యాది శిష్యుల ద్వారా ప్రచారం చేసినట్లే, తాను రచించిన పురాణాదులను తన శిష్యుడైన రోమహర్షణుడనే పేరున్న సూతమహర్షికి వినిపించి ధర్మ వ్యాప్తిని చేయించిన లోకోపకారి ఆమహర్షి. గురువు తనకు పురాణాలనన్నిటిని వరుసగా చెప్పుతుంటే అందలి కథలను, ధర్మ బోధనలను ఆనందంతో పరవశుడై సూతమహర్షి వినేవాడు. అందువల్ల అతని శరీరమంతా గగుర్పొడిచేదట. ఆ విధంగా రోమాలన్నీ హర్షంతో నిండిపోయినందువల్ల అతడు రోమహర్షణుడనే పేర ప్రసిద్ధి గాంచినాడు.

పురాzపినవం పురాణం. కథ పాతదేఐనా కథకుడు తన కథనాశైలితో దాన్ని నిత్య నూత్నంగా శ్రోతలు ఉవ్విళ్లూరేటట్లు చేస్తాడు కాబట్టి అది పురాణం.

సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశో మన్యంతరాణి చ

వంశాను చరితం చేతి పురాణం పంచలక్షణం

అనేది పురాణ నిర్వచనం. సృష్టి, ప్రతిసృష్టి, మన్యంతరం. ఒక వంశకథ, ఆవంశం యొక్క తరువాతి విషయాలన్నీ పురాణాల్లో విపులంగా కన్పిస్తాయి. అంటే పురాణాలు ఒక విధమైన భారతీయ చారిత్రక గ్రంథాలన్న మాట. ప్రసక్తాను ప్రసక్తంగా అన్ని శాస్త్రాలు దీనిలో కనిపిస్తాయి. ఐనా సత్కావ్యం వలె వినుటకు లేక చదువుటకు ఇంపుగా నుండి లోకానికంతా మేలును చేకూరుస్తాయి.

యాగాలు సాధారణంగా ఏకాహాలు, అహీనాలు, సత్రాలని మూడు విధాలు. ఒకే దినంలో పూర్తి అయ్యేవి ఏకాహాలు. రెండు నుండిపన్నెండు దినాలలో పూర్తి అయ్యే యాగాలు అహీనాలు కాగా పన్నెండు దినాలకంటె ఎక్కువ కాలం పట్టే యాగాలన్నీ సత్రయాగాలు. గవామయనమనే యాగాన్ని సంవత్సరం వరకు చేస్తారు. రాజసూయ యాగం చేయటానికి సంవత్సరం కంటె ఎక్కువ కాలమే పట్టవచ్చు. ఇటువంటి యాగాలు ఇంకా ఉన్నాయి.

యాగాలనన్నిటిని పగటి పూటనే అనుష్ఠిస్తారు. అందు వల్ల యాగం చేయటానికి వచ్చిన వారికి, అందులో పాల్గొనే వారికి రాత్రిపూట పురాణతి హాస కథలు వినిపించి వారిలో ధార్మిక భావనలు నాటుకొని పోయేటట్లు చేసేవారు. అదే విధంగా పురాణాలన్నీ బ్రహ్మ దేవుడు చేసిన సుత్యాహ మనే సత్ర యాగంలో చెప్పబడ్డాయి. బ్రహ్మ వైవర్త పురాణం కూడా అదే విధంగా సూత మహర్షిచే శౌనకాది మహా మునులకు చెప్ప బడింది. ఇందలి విషయం రథంతర కల్పానికి చెందిందని, నారదమహర్షి ప్రధాన శ్రోతగా శ్రీ కృష్ణ పరబ్రహ్మ మాహాత్మ్యం ఇందు చెప్ప బడిందని, ఇందు 18 వేల శ్లోకాలున్నాయని స్కాంద పురాణంలో చెప్పబడింది.

రథంత కల్పస్య వృత్తాంత మధికృత్య చ|

సావర్ణినా నారదాయ కృష్ణ మాహాత్మ్య సంయుతం ||

చరితం బ్రహ్మ వరాహస్య చరితం వర్ణ్యతేzత్ర చ|

తదష్టా దశసాహస్రం బ్రహ్మవైవర్తముచ్యతే ||

స్కాంద పురాణం - ప్రభాసఖండం - అధ్యా 1.శ్లో 52, 53

మత్స్య పురాణం, నారదపురాణంలోనూ బ్రహ్మవైవర్తంలో 18, వేల శ్లోకాలే ఉన్నట్లు చెప్పబడింది కాని ప్రస్తుతం దొరుకుతున్న బ్రహ్మవైవర్త పురాణంలో మాత్రం 12వేల పై చిల్లర శ్లోకాలే కనిపిస్తున్నాయి. అంటే సుమారుగా ఆరువేల శ్లోకాలు కాలగతిలో కనిపించకుండా పోయినాయి. కారణం అనూహ్యం.

ఈ పురాణంలో బ్రహ్మ, ప్రకృతి, గణశ, శ్రీకృష్ణ జన్మఖండాలనే నాలుగు ఖండాలున్నాయి. బ్రహ్మ ఖండంలో సృష్టి క్రమం వివరింపబడింది. ప్రకృతి ఖండంలో తులసీ, రమ, సరస్వతీ, దుర్గ, రాధ మొదలైన దేవతాస్త్రీల వృత్తాంతంతో పాటు ఆ దేవతల ధ్యానము, పూజావిధి, మంత్రము, కవచము మొదలైన విషయాలెన్నో కన్పిస్తాయి. గణశ ఖండంలో గణపతి జన్మ వృత్తాంతం కనిపిస్తుంది. ఈ ఖండంలో గణపతికి శిరస్సు తెగిపడుటకు కారణం శనీశ్వరుని దృష్టి ఆ శిశువుపై పడుటయే అని చెప్పబడింది. చివరిదైన శ్రీ కృష్ణ ఖండంలో శ్రీకృష్ణ జన్మ వృత్తాంతమంతా వివరంగా చెప్పబడింది.

ఈ పురాణంలో శ్రీకృష్ణుడే పరాత్పరుడుగా, చిత్రింపబడ్డాడు. బ్రహ్మ, విష్ణు, మహేశాది దేవతలంతా అతని అంశలుగా వర్ణింపబడ్డారు. అట్లే రాధాదేవి శ్రీకృష్ణ పరబ్రహ్మ యొక్క అర్థాంగిగా, లక్ష్మి, పార్వతి, సరస్వతి మొదలైన దేవతాస్త్రీలు ఆ దేవి యొక్క అంశలుగా, అంశాంశలుగా వర్ణింపబడ్డారు.

ఇక ఈ పురాణాన్ని పురాణమనే గౌరవభావంతోను దేవతాస్తుతి, మంత్ర, కవచ పూజాది విధుల కొరకు, ధార్మిక భావన అభివృద్ధి చెందుటకు చదువవచ్చు. ఆధునిక భావం కలవారు ఆనాటి జీవన విధానం, సంస్కృతి, మనస్తత్వం మొదలైన వాటిని అధ్యయనం చేయుటకు దీనిని చదువవచ్చు.

ఒక చిన్న ఉదాహరణ.

మానసీ దేవి కశ్యప మహర్షి కూతురు. ఆమెను జరత్కారు అని కూడా అంటారు. ఆమె శంకరుని శిష్యురాలు. శ్రీకృష్ణ భక్తురాలు. ఆమె భర్త పేరు కూడ జరత్కారువే. మహా యోగియైన ఆ మహర్షి తన భార్య చేసిన ఒక చిన్న తప్పును సాకుగా చూపి ఆమెను వదలివేస్తాడు.

అప్పుడు భార్యా భర్తల తగవు తీర్చుటకు పెద్ద మనుష్యులుగా మానసీదేవి తండ్రి యైన కశ్యప ప్రజాపతి, గురువైన శంకరుడు, ఇష్టదేవుడైన శ్రీకృష్ణుడు మొదలగువారు వస్తారు.

కోర్టులకెక్కి నానా రభస సృష్టించుకొని సంసారాన్ని నరకం చేసుకొనే వారిని వదలి వేస్తే. ఈ రోజుల్లో కూడా ఈ పద్ధతే ఎక్కువగా కనిపిస్తుంది.

శిశువు పుట్టగానే బంధువులు, పరిచితులు ఆశిశువును చూచి రావడం దీంట్లో కనిపిస్తుంది. ఒక చోట బెల్లం కలిపి చేసిన పేలాల ఉండలు చెప్పబడ్డాయి. ఆనాడు రాజు నిరంకుశుడే ఐనా రాజుకు ప్రత్యేకంగా ధనముండేది. దానిని 'రాజస్వం' అని అనేవారు. రాజు ఆధనాన్ని మాత్రమే దాన ధర్మాలకు ఉపయోగించుకొనేవాడు కాని ప్రజలు తనకు కప్పంగా ఇచ్చిన ధనాన్ని యధేచ్ఛగా తనకై ఖర్చు పెట్టుటో, దానం చేయుటో చేసేవాడు కాదు. ఇటువంటిని ఈ పురాణంలో కోకొల్లలు.

వైష్ణవుని గూర్చి ఈ పురాణంలో చాలా చోట్ల చెప్పబడింది.

వైష్ణవుడంటే,

గురువక్త్రాత్‌ విష్ణుమంత్రో యస్య కర్ణే ప్రవిశ్యతి

తం వైష్ణవం మహా పూతం జీవన్ముక్తం వదేద్విధిః ||

బ్రహ్మవైవర్తం - బ్రహ్మ ఖండం అధ్యా || 13 శ్లో 41

ఆచార్య సమాశ్రయణం చేసి ఆతని కరుణా కటాక్షాన్ని పొంది అతని ద్వారా నారాయణమంత్రోపదేశాన్ని పొందిన వాడే వైష్ణవుడని, వైష్ణవులకు విష్ణుభక్తి తప్ప అన్యమైన దేదీ కోరతగింది కాదని, శ్రీహరి నివేదితం కాని ఏ వస్తువునైనా తినకూడదని అంటుంది. ఒక చోట తిరుమల ప్రస్తావన, అందున్న శ్రీనివాసుని ప్రస్తావన కూడ కనిపిస్తుంది.

శ్రీశైలే శ్రీవనే రమ్యే శ్రీనివాస నిషేవితే

బ్రహ్మఖండం - అధ్యా 13 శ్లో 30

ఈ విధంగా భౌతిక దృస్టితో అధ్యయనం చేసే వారికి కూడ అనేక విధాలుగా ఉపయోగించే ఈ పురాణంలోని మొదటి మూడు ఖండాలు అనువాదం చేసే మహద్భాగ్యాన్ని వాటికి సంపాదకత్వం వహిస్తున్న, ఉస్మానియా యూనివర్శిటీ సంస్కృత విభాగానికి చెందిన విశ్రాంతాచార్యులు, బ్ర.శ్రీ.పుల్లెల శ్రీరామచంద్రుడుగారు కలిగిస్తే ఈ విషయంలో పురుషకారాన్ని చేసిన వారు నా ఆబాల్య మిత్రులు డా|| కిడాంజి నరసింహాచార్యులుగారు.

ఆర్షభారతీ ట్రస్ట్‌ హైదరాబాదు పక్షాన సంస్కృత శ్లోకాలు తెలుగు అనువాదంతో పురాణాలనన్నిటిని ముద్రించే బృహత్‌ కార్యక్రమాన్ని అధిక ధన వ్యయ ప్రయాసల కోర్చి నిర్వహిస్తున్నవారు కాకతీయ సిమెంట్స్‌ లిమిటెడ్‌ అధినేత శ్రీ పి.వెంకటేశ్వర్లుగారు. వారి ఆదరణవల్లనే నా అనువాదం ఈ విధంగా రూపుదిద్దుకోగల్గింది.

శ్రియంః పతి వారిచే ఇటువంటి విశిష్ట కార్యక్రమాల నెన్నిటినో నిర్వహింప జేస్తూ వారికి సదా ఆనందైశ్వరాలను ప్రసాదించాలని శ్రీనివాసుని ప్రార్థిస్తున్నాను.

పుస్తకం రచించడం గొప్ప పని ఐతే దాన్ని సర్వాంగ సుందరంగా, తప్పులు లేకుండ పాఠకుల నాకట్టు కొనేటట్లు తీర్చిదిద్దడం అసాధారణమైన పని. ఈ కృషిలో అన్ని విధాలా నిష్ణాతులు శ్రీ దత్తసాయి గ్రాపిక్స్‌, హైదరాబాద్‌, అధిపతులు, డా|| జి.యస్‌.లక్ష్మిగారు.

ఇంకా ఎందరో మహానుభావులు !!

అందరికీ నా వందనములు !!!

దేవుని అల్వాల భవదీయుడు

2-10-99 యన్‌.ఎల్‌.నరసింహాచార్య

 

sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters