Sri Devi Bagavatham-2    Chapters   

అథ అష్టాత్రింశోధ్యాయః.

సావిత్య్రువాచ : దేవీ భక్తిం దేహిమహ్యం సారాణాం చైవ సారకమ్‌ | పుంసాం ముక్తి ద్వార బీజం నరకార్ణవ తారకమ్‌. 1

కారణం ముక్తి సారాణాం సర్వాశుభ వినాశనమ్‌ | దారకం కర్మ వృక్షాణాం కృత పాపౌఘ హారణమ్‌. 2

ముక్తి శ్చ కతిధాప్యప్తి కింవా తాసాం చ లక్షణమ్‌ | దేవీ భక్తిం భక్తి భేదం నిసేకస్యాపి ఖండమన్‌. 3

తత్వ జ్ఞాన విహీనా చ స్త్రీజాతి ర్విధి నిర్మితా | కించిత్‌ జ్ఞానం సారభూతం వద వేద విదాంపర. 4

సర్వం దానం చ యజ్ఞ శ్చ తీర్దస్నానం వ్రతం తపః |అజ్ఞాని జ్ఞాన దానస్య కళాం నార్హంతి షోడశీమ్‌. 5

పితుః శతగుణా మాతా గౌరవేచేతి నిశ్చితమ్‌ | మాతుః శతగుణః పూజ్యో జ్ఞాన దాతా గురుః ప్రభో. 6

ధర్మరాజ ఉవాచ : పూర్వం సర్వోవరో దత్తో యస్తే మనసి వాంఛితః |

అధునాశక్తి భక్తిస్తే వత్సే భవతు మద్వరాత్‌. 7

శ్రోతు మిచ్చసి కల్యాణి శ్రీదేవీ గుణ కీర్తనమ్‌ | వక్తౄణాం పృ చ్ఛ కానాం చ శ్రోతౄణాం కులతారణమ్‌. 8

శేషో వక్త్ర సహస్రేణ నహియ ద్వక్తు మీశ్వరః | మృత్యుంజయో నక్షమశ్చ వక్తుం పంచముఖేన చ. 9

ధాతా చతుర్ణాం వేదానాం విధాతా జగతా మపి | బ్రహ్మా చతుర్ముఖేనైవ నాలం విష్ణుశ్చ సర్వవిత్‌. 10

కార్తికేయః షణ్ముఖేన నా పి వక్తుమలం ధ్రువమ్‌ | న గణశః సమర్థ శ్చ యోగీంద్రాణాం గురోర్గురుః. 11

సారభూతా శ్చ శాస్త్రాణాం వేదాశ్చత్వార ఏవచ | కళామాత్రం యద్గుణానాం న విదంతి బుధాశ్చయే. 12

ముప్పదిఎనిమిదవ అధ్యాయము

సావిత్ర్యుపాఖ్యానము

సావిత్రి యిట్లనెను : సారములతో సారము భుక్తిముక్తిప్రదము నరక సముద్రము దాటించునది యగు శ్రీదేవీ భక్తిని గూర్చి నాకు తెల్పుము. దేవీ భక్తి - ముక్తి సారములకు మూలకాలరణము - శుభకరము - కర్మవృక్ష దారకము - పాప సంహరణము. ముక్తి యెన్ని విధములు? వాని లక్షణము లెవ్వి? దేవి భక్తి యెటువంటిది? భక్తి స్వరూపమేమి? కర్మవినాశ మెట్లు గల్గును? వేదవిదులలో శ్రేష్ఠుడా! స్త్రీలను తత్త్వజ్ఞాన విహీనులుగ బ్రహ్మ విధించెను. కనుక నాకు సారభూతమైన తత్త్వజ్ఞానము దెలుపుము. ఎల్ల తపోవ్రతములును - యజ్ఞదానములును - తీర్థ స్నానములును కలిసినప్పటికి నజ్ఞానికి గల్గించిన జ్ఞానములోని పదారవ కళతో సరితూగవు. ప్రభూ! తండ్రికన్న తల్లి నూఱు రెట్లు గౌరవపాత్రురాలు. తల్లికన్న గురువు నూఱు రెట్లు గౌరవపాత్రుడు. గురువు జ్ఞానదాత. ధర్మరాజిట్లనెను : బిడ్డా! నీ మనసులోని కోర్కెలన్నియు నీవు పడయ గలవని నీకు మొదటనే వర మిచ్చితిని గదా! ఇపు డింకను నా పరప్రభావమున నీకు దేవీ భక్తియును గల్గును. కల్యాణీ! నీవు శ్రీదేవీ గుణ - మహత్మ్య - కీర్తనము వినదలచితివి. అది దేవిని గూర్చి యడుగువారి - పలుకువారి - వినువారి కులములను తరింపజేయుగలదు. శేషుడు తన వేయి నోళ్లతోను దేవి గుణములు వర్ణింపజాలడు. శివుడును తన యైదు ముఖములతో దేవి మహిమ తెలుపనోపడు. నాల్గు వేదములు - సకల జగములు రచించిన బ్రహ్మదేవుడును తన నాల్గు మొగములతో దేవీ గుణ వర్ణన చేయనేరడు. సర్వవిదుడగు విష్ణువునకును తరము కాదు. షణ్ముఖుడు తన యారు ముఖములతోను వర్ణింపజాలడు. యోగీంద్రులకును గురువులకును గురువగు గణపతియును సమర్థుడు గాడు. సారభూతములగు శాస్త్రములు -నాల్గు వేదములు - పండితులును దేవి గుణములలోని యొక్క కళను గూడ చక్కగ నెఱుగజాలరు.

సరస్వతీ జడీభూతా నాలం తద్గుణా వర్ణనే | సనత్కుమారో ధర్మశ్చ సనందశ్చ సనాతనః. 13

సనకః కపిలః సూర్యో యేన్యే చ బ్రహ్మణః సుతాః | విఛక్షణా న యత్వక్తుం కిం చాన్యే జడబుద్ధయః. 14

న యద్వక్తుం క్షమాః సిద్ధా మునీంద్రా యోగిన స్తథా | కేచాన్యే చ వయం కే వా శ్రీదేవ్యాగుణవర్ణనే. 15

ధ్యాయంతే యత్పదాంభోజం బ్రహ్మ విష్ణు శివాదయః | అతి సాధ్యం స్వభక్తానాం తదన్యేషాం సుదుర్లభమ్‌. 16

కశ్చిత్కిం చిద్విజానాతి తద్గుణోత్కీర్తనం శుభమ్‌ | అతిరిక్తం విజానాతి బ్రహ్మా బ్రహ్మ విశారదః. 17

తతోతిరిక్తం జానాతి గణశోజ్ఞానినాం గురుః | సర్వాతిరిక్తం జానాతి సర్వజ్ఞః శంభు రేవసః. 18

తసై#్మ దత్తం పురాజ్ఞానం కృష్ణేన పరమాత్మనా | అతీవ నిర్జనేరణ్య గోలోకే రాస మండలే. 19

తత్రైవ కథితం కించిత్త ద్గుణోత్కీర్తనం శుభమ్‌ | ధర్మం చ కథ యామాస శివలోకే శివః స్వయమ్‌. 20

ధర్మస్తు కథయామాస భాస్వతే పృచ్ఛతే తథా | యమారాధ్య మత్పితాపి సంప్రాప తపసా సతి. 21

పూర్వంస్వం విషయంచాహం నగృహ్ణామి ప్రయత్నతః | వైరాగ్యయుక్త తపసే గంతు మిచ్చామి సువ్రతే. 22

తదామాం కథయామాస పితా తద్గుణ కీర్తనమ్‌ | యథాగమం తద్వదామి నోబోధాతీవ దుర్గమమ్‌. 23

తద్గుణం సా న జానాతి తదన్యస్య చ కాకథా | యథాకాశో న జానాతి స్వాంతమేవ వరాననే. 24

దేవీ గుణగానములో సరస్వతి కంఠము మూగవోవును. సనత్కుమారుడు సనందుడు సనాతనుడు ధర్ముడు సనకుడు కపిలుడు సూర్యుడు నితరులైన బ్రహ్మ పుత్రులును దేవి గుణవర్ణనలో నిపుణులుగారు. ఇక మందమతుల సంగతి చెప్పనేల! సకల మునీంద్రులును సిద్ధ యోగులను పలుక జాలరు. ఇంకితరులెవ్వరు పలుకగలరు! నేనేమి చెప్ప గలను ! బ్రహ్మ విష్ణు మహేశులు మొదలగువారును దేవి పద పద్మములు సర్వకాలము సేవింతురు. దేవి పదభక్తి దేవిభక్తుల కతి సులభము. ఇతరుల కతి దుర్లభము. దేవి గుణముల మహిమము గూర్చి నూటికి కోటి కెవడో యొక డేకొద్దిగనో యెఱుగును. బ్రహ్మ విశారదుడగు బ్రహ్మ యింకకొంచెమెక్కువగ యెఱుంగును. పూర్వ మొకప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ గోలోక మందలి రాసమండలమం దేకాంతముగ శివునకు దేవీ జ్ఞానము కొంత తెలిపెను. అపుడు కృష్ణుడు దేవి గుణముల కీర్తనముగూర్చియును శివునకు కొంత తెలిపెను. పరమ శివుడును తన లోకమున స్వయముగ ధర్మునకు వినిపించెను. సూర్యుడడుగగ ధర్ముడతనికి వినిపించెను. నా తండ్రియగు సూర్యుడు దేవి నారాధించి తపముతో మఱికొంత గ్రహించెను. మొదట నేను సైతము నాకీపదవి వలదంటిని. వైరాగ్యమువలన తపము చేయుటకు వెళ్ళదలచితిని. ఆ సమయమున నా తండ్రి దేవి గుణ మహిమలు నాకు తెలిపెను. నా తండ్రి నాకు చెప్పినట్లుగ నేను నీకు దుర్లభములైన దేవి గుణములు తెలుపుదును. దేవి తన గుణములను తానే యెఱుగజాలదు. ఇంకితరులెట్టు లెఱుగగలరు? వరాననా! ఆకాశము తనలో నేమున్నదో తానెఱుగదు.

సర్వాత్మా సర్వభగవాన్సర్వ కారణ కారణః | సర్వేశ్వరశ్చ సర్వాద్యః సర్వ విత్పరి పాలకః. 25

నిత్యరూపీ నిత్యదేహీ నిత్యానందో నిరాకృతిః | నిరంకుశో నిరాశంకో నిర్గుణశ్చ నిరామయః. 26

నిర్లిప్తః సర్వసాక్షీ చ సర్వాధారః పరాత్పరః | మాయావిశిష్టః ప్రకృతి స్తద్వికారాశ్చ ప్రాకృతాః. 27

స్వయం పుమాంశ్చ ప్రకృతిస్తావభిన్నౌ పరస్పరమ్‌ | యథా వహ్నేస్తస్య శక్తిర్న భిన్నాస్త్యే వకుత్రచిత్‌. 28

సేయంశక్తి ర్మహామాయా సచ్చిదానంద రూపిణీ | రూపం బిభర్త్యరూపా చ భక్తానుగ్రహ హేతవే. 29

గోపాలసుందరీ రూపం ప్రథమం సా ససర్జహ | అతీవ కమనీయం చ సుందరం సు మనోహరమ్‌. 30

నవీన నీరదశ్యామం కిశోరం గోపవేషకమ్‌ | కందర్పకోటి లావణ్యం లీలాధాను మనోహరమ్‌. 31

శరన్మధ్యాహ్మపద్మానాం శోభా మోచనలో చనమ్‌ | శరత్పార్వణ కోటీందు శోభాప్రచ్ఛాదనాననమ్‌. 32

అమూల్య రత్న నిర్మాణ నానా భూషణ భూషితమ్‌ | సస్మితం శోభితం శశ్వద మూల్య పీతవా ససా. 33

పరబ్రహ్మ స్వరూపం చ జ్వలంతం బ్రహ్మతేజసా | సుఖదృశ్యం చ శాంతం చ రాధా కాంత మనంతకమ్‌. 34

గోపీభి ర్వీక్ష్యమాణం చ సస్మితాభిశ్చ సంతతమ్‌ | రాస మండల మధ్యస్థం రత్నసింహా స న స్థితమ్‌. 35

వంశీం క్వణంతం ద్విభుజం వనమాలా విభూషితమ్‌ | కౌస్తు భేంద్ర మణీం ద్రేణ శశ్వద్వక్షః స్థలోజ్జ్వలమ్‌. 36

సర్వాత్ముడు సర్వభగవానుడు సర్వకారణ కారణుడు - సర్వాత్ముడు - సర్వేశ్వరుడు - సర్వాద్యుడు - సర్వపాలకుడు నిత్య రూపి - నిత్య దేహి - నిత్యానందుడు - నిరాకారుడు - నిరంకుశుడు - నిరాతంకుడు - నిర్గుణుడు - నిరామయుడు నిర్లిప్తుడు - సర్వసాక్షి - సర్వాధారుడు - పరాత్పరుడు మయామయుడు; అతడే ప్రకృతి ప్రకృతివికారములు ప్రాకృతములనబడును. ప్రకృతి పురుషు లొక్కరేగాని యిర్వురుగారు, వాని భిన్నులుగారు అగ్ని మఱి దానిలోని శక్తి రెండును వేర్వేరు గావు గదా ! ఆ ప్రకృతియే శక్తి - మహామాయ - సచ్చిదానందరూపిణి. ఆమెకు రూపములేదు. ఐనను భక్తులను గాపాడుటకుదయతో నామె పెక్కురూపులు దాల్చును. దేవి మొట్టమొదట మిక్కిలి మనోహరము-సుందరమునైన గోపాల రూపము దాల్చెను. ఆ గోపాల సుందర రూపము క్రొత్త మేఘమువలె శ్యామల కోమలము బాలగోపాల వేషము కోటి మన్మథుల లావణ్యము సుందర లీలా మానుష విగ్రహము. శరత్కాల మందలి మధ్యాహ్న మందొప్పుచున్న కమల పత్రముల శారద పూర్ణచంద్రుల కాంతులు మించి శోభిల్లునది. ఒంటినిండ విలువైన రతనాలు పొదిగిన పెక్కుసొములు మెఱయుచున్నవి. విలువైన పట్టు వస్త్రము చెన్నొందు చున్నది. బ్రహ్మ తేజముట్టిపడు పరబ్రహ్మ స్వరూపము. ఆ రూపము ప్రియదర్శనము-శాంత సుందరము రాధారమణీయము. నిరంతరముగ చిర్నగవులు చిందించెడు గోపికలు చూచుచుండెడు రూపము రాసమండలము నడుమరత్న సింహాసన మందున్న రూపము వేణ నాదము గలది. ద్విభుజములు పేరురమునందు వనమాల కౌస్తుభమణులు ప్రకాశించుచున్నవి.

కుంకుమాగురు కస్తూరీ చందనార్చిత విగ్రహమ్‌ | చారు చంపక మాలాక్తం మాలతీ మాల్య మండితమ్‌. 37

చారు చంద్రకశోభాఢ్యం చూడా వంక్రిమరాజితమ్‌ | ఏవం భూతం చ ధ్యాయంతి భక్తా భక్తి పరిప్లుతాః. 38

యద్బయా జ్జగతాం ధాతావిధత్తే సృష్టి మేవచ | కర్మానుసారాల్లిఖితం కరోతి సర్వ కర్మణామ్‌. 39

తపసాం ఫలదాతా చ కర్మణాం చ యదాజ్ఞయా | విష్ణుః పాతా చ సర్వేషాం యద్బయా త్పాతి సంతతమ్‌. 40

కాలాగ్ని రుద్రః సంహర్తా సర్వవిశ్వేషు యద్బయాత్‌ | శివో మృత్యుంజయ శ్చైవ జ్ఞానినాం చ గురోర్గురుః. 41

యత్‌ జ్ఞానాత్‌ జ్ఞానవానస్తి యోగీశో జ్ఞాన విత్ప్రభుః | పరమానంద యుక్త శ్చ భక్తివైరాగ్య సంయుతః. 42

యద్బయా ద్వాతి పవనః ప్రవరః శీఘ్రగామినామ్‌ | తపనశ్చ ప్రతపతి యద్బయా త్సంతతం సతి. 43

యదాజ్ఞయా వర్షతీంద్రో మృత్యు శ్చ రతి జంతుషు | యదాజ్ఞయా దహేద్వహ్ని ర్జలమేవం సుశీతలమ్‌. 44

దిశో రక్షంతి దిక్పాలా మహాభీతా యదాజ్ఞయా | భ్రమంతిరాశి చక్రాణి గ్రహా శ్చ యద్బయేన చ. 45

భయాత్పలంతి వృక్షా శ్చ పుష్ప్యత్యపి చ యాద్బయాత్‌ | యదాజ్ఞాంతు పురస్కృత్య కాలఃకాలే హరేద్బయాత్‌. 46

తథా జలస్థల స్థాశ్చ న జీవంతి యదాజ్ఞయా | అకాలేనాహరే ద్విద్ధం రణషు విషమేషు చ. 47

ధత్తేవాయు స్తోయ రాశింతోయ కూర్మం తదాజ్ఞయా | కూర్మోనంతం స చ క్షోణీం సముద్రాన్సా పర్వతాన్‌. 48

ఆ విగ్రహమున కన్ని యంగములందు మంచి గంధము కస్తూరి కుంకుమాగరులు పూయబడి పరిమళములు విరజిమ్ముచున్నవి. సంపెగ-మాలతి పూలదండలు నెత్తావు లీనుచ్నువి. శిఖిపింఛమౌళి-యగు గోప-సుందర దివ్యరూపమును గోప భక్తులు భక్తి రసమున నోలలాడుచు కన్నుల కరవుదీర గాంతురు. అట్టి గోపాల కృష్ణుని భయమువలన జగములు రచించు బ్రహ్మ కర్మాను సారముగ జీవకోటిని సృజియించును. అతని యాజ్ఞవలననే దేవతలు తపఃఫలము లిత్తురు. విష్ణు వతని భయము వలననే యెల్లకాలము లోకాలను బ్రోచును. అతనికి వెఱచి కాలాగ్ని రుద్రుడు విశ్వములను సంహరించును. శివుడు మృత్యుంజయుడు జ్ఞానులకు గురువులకు గురువు. అట్టి శివుడును కృష్ణుని జ్ఞానోపదేశమున సర్వజ్ఞుడు-యోగీశుడు-జ్ఞానవిదుడు-ప్రభువు-పరమానందయుతుడు-భక్తివైరాగ్య సంపన్నుడునయ్యెను. కృష్ణుని వలని భయమున శీఘ్రగాములలో శ్రేష్ఠుడగు గాలి వీచును. అచని భయమున నిరంతరము సూర్యుడు తపించు చున్నాడు. కృష్ణ పరమాత్ము నానతివలన నింద్రుడు వానకురియును. మృత్యువు ప్రాణులను చంపును. అగ్ని మండును. నీరు చల్లగ నుండును. అతని యాజ్ఞమేరకు దిత్పతులు గడగడలాడు దిక్కులను గాపాడుదురు. అతనికి జడిసి గ్రహములు రాశి చక్రము నిరంతరముగ తిరుగుచుండును. అతని భయమున చెట్లు పూలుపూచి పండ్లతో నలరారును. అతని యాజ్ఞమేరకు కాలచక్రము క్రమము దప్పక తిరుగు చుండును. అతని యాజ్ఞ లేక జలస్థలములందలి ప్రాణికోటులు బ్రతుకజాలవు. కాలము తీరనిచో ఘోరరణములందును చావు రాదు. శ్రీ కృష్ణు నా దేశాను సారముగ గాలి నీటిని నీకు కూర్మమును కూర్మము శేషుని శేషుడు భూమిని సముద్ర గిరులను దాల్చును.

సర్వాచైవ క్షమారూపా నానారత్నం బిభర్తియా | యతః సర్వాణిభూతాని స్థీయంతే హంతితత్రహి. 49

ఇంద్రాయుశ్చైవ దివ్యానాం యుగానా మేకసప్తతిః | అష్టావింశే శక్ర పాతే బ్రహ్మణ శ్చ దివానిశమ్‌. 50

ఏవం త్రిం శద్ధినైర్మాసో ద్వాభ్యా మా భ్యామృతుః స్మృతః | ఋతుభిః షడ్బిరే వాబ్దం బ్రహ్మణో వైవయఃస్మృతమ్‌. 51

బ్రహ్మణ శ్చ నిపాతే చ చక్షు రున్నీలనం హరేః | చక్షురున్నీలనే తస్యలయం ప్రాకృతికం విదుః. 52

ప్రలయే ప్రాకృతే సర్వే దేవాద్యా శ్చ చరాచరాః | లీనా ధాతా విధాతా చ శ్రీకృష్ణనాభి పంకజే. 53

విష్ణుః క్షీరోదశాయీ చవైకుంఠే య శ్చతుర్బుజః | విలీనా వా మ పార్శ్వే చ కృష్ణస్య పరమాత్మనః. 54

యస్యజ్ఞానే శివోలీనో జ్ఞానాధీశః సనాతనః | దుర్గాయాం విష్ణుమాయాయాం విలీనాః సర్వ శక్తయః. 55

సాచ కృష్ణస్య బుద్ధౌ చ బుద్ధ్య దిష్ఠాతృ దేవతా | నారాయణాంశః స్కంద శ్చ లీనోవక్షసి తస్య చ. 56

శ్రీకృశ్ణాం శశ్చ తద్బాహౌ దేవా ధీశోగణశ్వరః | పద్మాంశాశ్చైవ పద్మాయాం సారాధాయాం చ సువ్రతే. 57

గోప్య శ్చాపి చతస్యాం చ సర్వా శ్చ దేవయోషితః | కృష్ణప్రాణాధి దేవీ సాతస్య ప్రాణషు సంస్థితాః. 58

సావిత్రీ చ సరస్వత్యాం వేదాః శాస్త్రణియానిచ | స్థితా వాణీ చ జిహ్వాయాం తసై#్యవ పరమాత్మనః. 59

గోలోకస్య చ గోపాశ్చ విలీనాస్త స్యలోమసు | తత్ప్రాణషు చ సర్వేషాం ప్రాణా వాతా హుతాశనాః. 60

భూమాత క్షమారూపిణి-రత్నగర్బ. సకల భూతకోటులను భూమి భరించును. చంపును. డెబ్బదియొక్క దివ్యయుగములు దేవేంద్రునకు పూర్ణాయువు. ఇరువదెనిమిది మంది యింద్రుల పతనము బ్రహ్మ కొకపగలు-రాత్రి యగును. ఇట్టి ముప్పది దినములు బ్రహ్మ కొక నెల. రెండు నెల లొక ఋతువు. ఆరు ఋతువు లొక సంవత్సరము. అట్టి నూఱు సంవత్సరములు-బ్రహ్మదేవుని పూర్ణాయువు. ఒక బ్రహ్మపతనము-హరి కొక్క ఱప్పపాటుకాలము. ఆదిదేవుడగు హరి-రెప్పపాటున ప్రాకృతిక ప్రళయము జరుగును. ప్రకృతి ప్రళయమందు దేవతలు-చరాచర ప్రాణికోటి-ధాత-విధాత యెల్లరును శ్రీకృష్ణుని నాభికమలమున లయ మొందుదురు. అపుడు పాలసంద్రముపై పవ్వళించు విష్ణువును వైకుంఠధామమందలి చతుర్బుజుడును శ్రీకృష్ణ పరమాత్ముని యెడమ భాగములో కలిసిపోదురు. సనాతనుడగు శివుడును కృష్ణుని జ్ఞానములో నైక్య మొందును. విష్ణుమాయయైన దుర్గాదేవిలో సకల శక్తులు కలిసిపోవును. బుద్ధ్యధిష్ఠానదేవియగు దుర్గయును శ్రీకృష్ణ భగవానుని బుద్ధిలో లీన యగును. నారాణాంశ గల స్కందు డతని వక్షఃస్థలమున లీను డగును. దేవాధీశుడు-కృష్ణాంశుడు నగు గణపతి కృష్ణుని బాహువులందు లయ మొందును. పద్మాంశగల లక్ష్మి రాధలో లయ మొందును. ఎల్ల దేవస్త్రీలును గోపీజనమును రాధలో గలియును అపుడు కృష్ణుని ప్రాణాధిష్ఠానదేవియగు రాధ కృష్ణుని ప్రాణములందు ప్రాణమై యల రారును. సావిత్రి-సకల వేదశాస్త్రములును సరస్వతిలో గలియును. సరస్వతి కృష్ణ పరాత్పరుని నాలుకపై వాణిగ వెలు గొందును. గోలోకము- గోపకు లందఱు కృష్ణుని రోమకూపములందు లయ మొందుదురు. ఎల్ల ప్రాణుల ప్రాణవాయువులు కృష్ణుని ప్రాణములందు గలియును.

జఠరాగ్నౌ విలీనాశ్చ జలంతద్ర స నాగ్రతః | వైష్ణవా శ్చరణాంభోజే పరమానంద సంయుతాః. 61

సారాత్సారతరా భక్తీ రస పీయూష పాయినః | విరాడం శాశ్చ మహతి లీనాః కృష్ణే మహావిరాట్‌. 62

యసై#్యవలోమ కూపేషు విశ్వాని నిఖిలాని చ | యస్య చక్షుప ఉన్మేషే ప్రాకృతః ప్రలయో భ##వేత్‌. 63

చక్షురున్మీలనే సృష్టి ర్యసై#్యవ పునరేవ సః | యావత్కాలో నిమేషేణ తావదున్మలనేన చ. 64

బ్రహ్మణ శ్చ శతాబ్దే చ సృష్టేః సూత్రలయః పునః | బ్రహ్మ సృష్టిలయానాం చ సంఖ్యానాస్త్యేవ సువ్రతే. 65

యథా భూరజసాంచైవ సంఖ్యానంనైవ విద్యతే | చక్షుర్నిమేషే ప్రళయో యస్య సర్వాంతరాత్మనః. 66

ఉన్మీలనే పునః స్బష్టి ర్బవే దేవేశ్వరేచ్ఛయా | స కృష్ణః ప్రళ##యే తస్యాం ప్రకృతౌలీన ఏవహి. 67

ఏకైక చ పరా శక్తి ర్నిర్గుణఃపరమః పుమాన్‌ | సదే వేదమగ్ర ఆసీదితి వేదవిదో విదుః. 68

మూల ప్రకృతిరవ్యక్తాప్యవ్యా కృత పదాభిధా | చితభిన్నత్వ మాపన్నా ప్రళ##యేసైవ తిష్ఠతి. 69

తద్గుణోత్కీర్తనం వక్తుం బ్రహ్మాండేషు చ కఃక్షమః | ముక్తయశ్చ చతుర్వేదైర్నైరుక్తా శ్చ చతుర్విధా. 70

తత్ర్పధానాదేవ భక్తి ర్ముక్తేరపి గరీయసి | సాలోక్యదా భ##వేదేకా తథా సారూప్యదాపరా. 71

సామీప్యదాథ నిర్వాణ ప్రదా ముక్తి శ్చ తుర్విధా | భక్తా స్తా నహి వాంఛంతి వినా తత్సేవనం విభోః. 72

అగ్నులు కృష్ణుని జఠరాగ్నియందును జలములు శ్రీకృష్ణుని నాలుక కొనయందును పరమానందయుతులైన వైష్ణవులు శ్రీకృష్ణుని పాదపద్మములందును కలిసిపోదురు. సారముల సారమగు భక్తిరసామృతము గ్రోలు భక్తశేఖరులు కృష్ణునిలో గలియుదురు. క్షుద్రవిరాట్టు మహావిరాట్టులో మహావిరాట్పురుషుడు శ్రీకృష్ణునిలోను లీన మగును. ఎల్ల విశ్వము లును శ్రీకృష్ణ బ్రహ్మము రోమకూపములందు కలిసిపోవును. శ్రీ కృష్ణ పరమాత్మ కనురెప్ప వేయుటచే ప్రళయము సంభవించును. అతడు శయనించిన మీదట సృష్ఠి మరల మొదలగును. అత డెంతకాలము కన్నులు మూసియుండునో యంత కాలము కన్నులు తెరచియుండును. బ్రహ్మకు నూఱండ్లు నిండగనే సృష్టిసూత్రము తెగును. ఓ సుశీలా! బ్రహ్మల సృష్టి లయముల సంఖ్య లెక్కింప నలవికాదు. ఎట్లనగ భూమిమీద ధూళి కణముల సంఖ్య నెవరును లెక్కింపలేరు గదా ! సర్వాంతరాత్ముడగు విరాట్పురుషుడు ఱప్పవేయగ ప్రళయము గల్గును. కన్నులు తెరవగనే మరల సృష్టియు నీశ్వరాజ్ఞచే గల్గుచుండును. చివరకు కృష్ణుడును ప్రాకృత ప్రళయమున లీనుడగును. ఇట్లు కృష్ణుడు మూలప్రకృతియు నొక్కటి గాగ పరాశక్తి మిగులును. ఆ శక్తియు నిర్గుణుడగు పరమపురుషుడు నిర్వురు నొకరే. వేదవిదులు సైదము సృష్టికి పూర్వము సత్పదార్థము మాత్రమే గలదని యందురు. అదే పురుషుని తొలి స్వరూపము. అట్టి మూల ప్రకృతిని ''అవ్యక్తము-అవ్యాకృతము'' అను పేర్లతో పిలుతురు. అది చిత్పదార్థము కన్న భిన్నము గాదు. ప్రళయమం దదోక్కటియే మిగిలియుండును. అటువంటి పరాప్రకృతి గుణరత్నముల మహిమలు తెలుపుట కీ బ్రహ్మాండములందు సమర్థుడెవడును లేడు. నాల్గు వేదములందును ముక్తి నాల్గు తెఱగులుగ నుండునని చెప్పబడినది. అట్టి నాల్గు విధముల మోక్షముల కన్న దేవీభక్తి శ్రేష్ఠతమము కడుంగడు దొడ్డది. నాల్గు విధముల ముక్తులలో నొకటి సాలోక్యముక్తి-ఇంకొకటి సారూప్య ముక్తి. వేఱొకటి సామీప్యముక్తి-మరియొకటి నిర్వాణముక్తి. నిజమైన భక్తు లీనాల్గింటిని కోరరు. ఎందుకనక ముక్తిలో ప్రభుసేవ లేదు.

శివత్వ మమ రత్వం చ బ్రహ్మత్వం చావహేలయా | జన్మ మృత్యుజరావ్యాధి భయశోకాదికం ధనమ్‌. 73

దివ్యరూప ధారణం చ నిర్వాణం మోక్షణం విదుః | ముక్తి శ్చ సేవారహితా భక్తిః సేవా వివర్ధినీ. 74

భక్తి ముక్త్యోరయం భేదో నిషేక ఖండనం శృణు | విదుర్బుధా నిషేకం చ భోగం చ కృత కర్మణామ్‌. 75

తత్ఖండనం చ శుభదం శ్రీవిభోః సేవనం పరమ్‌ | తత్త్వ జ్ఞాన మిదం సాధ్వి స్థిరం చ లోకవేదయోః. 76

నిర్విఘ్నం శుభదం చోక్తం గచ్ఛ వత్సే యథాసుఖమ్‌ | ఇత్యుక్త్వా సూర్యపుత్ర శ్చజీవయిత్వా చ తత్పతిమ్‌. 77

తసై#్య శుభాశిషం దత్వా గమనం కర్తుముద్యతః | దృష్ట్వాయమం చ గచ్ఛంతం సాసావిత్రీ ప్రణమ్యచ. 78

రురోద చరణౌ ధృత్వా సాధుచ్ఛే దేన దుఃఖితా | సావిత్రీరోదనం శ్రుత్వా యమశ్చైవ కృపానిధిః. 79

తామిత్యువాచ సంతుష్టః స్వయం చైవ రురోదవా | ధర్మ ఉవాచ : లక్ష వర్షం సుఖం భుక్త్వా పుణ్యక్షేత్రే చ భారతే. 80

అంతే యా స్యసి తల్లోకం యత్ర దేవీ విరాజతే | గత్వా చ స్వ గృహం భ##ద్రే సావిత్రాని శ్చ వ్రతంకురు. 81

ద్వి సప్త వర్ష పర్వంతం నారీణాం మోక్షకారణమ్‌ | జ్యేష్ఠ శుక్ల చ తుర్దశ్యాం సావిత్ర్యా శ్చ వ్రతం శుభమ్‌. 82

శుక్లాష్టమ్యాం భాద్రపదే మహాలక్ష్మ్యాయథా వ్రతమ్‌ | ద్వ్యష్ట వర్షం వ్రతంచైవ ప్రత్యాదేయం శుచిస్మితే. 83

కరోతి భక్త్యా యానారీ సాయాతి చ విబోఃపదమ్‌ | ప్రతిమంగళవారే చ దేవీం మంగళదాయినీమ్‌. 84

శివత్వము బ్రహ్మత్వము అమరత్వము జన్మమృత్యువులు జరావ్యాధులు భయశోకములు ధనరాసులు మున్నగు వానిని దేవీభక్తులు తుచ్ఛముగ చూతురు. దివ్యరూపములు దాల్చగలుగు నిర్వాణముక్తిని సైతము వారు గోరరు. ముక్తిలో సేవ లేదు. భక్తిలో సేవ వర్ధిల్లును. భక్తిముందు తక్కినవన్ని దిగదుడుపులే. ఇదే భక్తికి ముక్తికిగల భేదము. ఇక నిషేక ఖండనము గూర్చి చెవులకు చవులూరగ వినుము. తాము చేసికొనిన కర్మల ఫలములనే నిషేకమని విబుధులందురు. శ్రీవిభుని పరాప్రకృతిని సేవించుటవలన కర్మఫలము తెగును శుభము చేకూరును. ఓ సాధ్వీ! వేద ప్రపంచమందు నిటువంటి తత్త్వజ్ఞానమే తెలుపబడెను. ఓ యమ్మాయీ! అది నిర్విఘ్నమైనది. శుభకరమైనది. ఇక నీవు నీ యిచ్చ వచ్చిన చోటి కేగుము. అని సూర్యపుత్రుడగు యముడు సావిత్రిపతిని బ్రదికించెను. యముడు సావిత్రికి శుభాశీస్సు లొసంగి వెళ్ళుటకు సిద్ధమయ్యెను. తన చోటికి వెళ్ళదలచిన యముని గాంచి సావిత్రి చేతు లెత్తి నమస్కరించెను. సజ్జనుడు వెళ్ళిపోవుచున్నందున లోన దిగులొంది సావిత్రి యముని పాదములు పట్టుకొని యేడ్చెను. ఆమె రోదనము వినగనే యమునికిని జాలి గలిగెను. అతడు తాను నేడ్చి మరల సంతోషముతో నామెతో నిట్లనెను : వత్సా! నీ వీ పుణ్య భారతభూమిపై లక్ష వత్సరములు సుఖము లనుభవింపగలవు. అటు పిమ్మట నీవు దేవిలోకమున కేగి విరాజిల్లుదువు. కల్యాణీ ! నీ విక యింటి కేగి సావిత్రీదేవివ్రతము చక్కగ నిర్వహింపుము. సావిత్రీ వ్రతమును పదునాలుగేండ్లు జరిపిన స్త్రీకి ముక్తి గల్గును. జ్యేష్ఠ శుద్ధ చతుర్దశినాడు సావిత్రీవ్రతము జరుపుట శుభము. భాద్రపద శుక్లాష్టమినాడు లక్ష్మీవ్రతము చేయుట శుభము. ఓ శుభ హాసినీ ! పదారేండ్లు మహాలక్ష్మీ వ్రత మాచరించవలయును. ఇట్లు లక్ష్మీ వ్రతము జరిపిన స్త్రీ తుదకు విష్ణుని పరమపదమునకు జేరును. ప్రతి మంగళవారమును మంగళ చండీవ్రతము జరుపవలయును.

ప్రతిమాసం శుక్ల షష్ఠ్యాం షష్ఠీం మంగళదాయినీమ్‌ | తథా చాషాఢ సంక్రాంత్యాం మనసాం సర్వసిద్ధిదామ్‌. 85

రాధాం రాసే చ కార్తిక్యాం కృష్ణప్రాణాధిక ప్రియామ్‌ | ఉపోష్య శుక్లాష్టమ్యాం చ ప్రతిమాసం వరప్రదామ్‌. 86

విష్ణుమాయాం భగవతీం దుర్గాం దుర్గార్తి నాశినీమ్‌ | ప్రకృతిం జగదంబాం చ పతిపుత్రవీషు చ. 87

పతివత్రాసు శుద్ధాసు యంత్రేషు ప్రతిమాసు చ | యానార పూజయే ద్బ క్త్యా ధన సంతానహేతవే. 88

ఇహలోకే సుఖం భుక్త్వా యాత్యం తే శ్రీవిభోః పదమ్‌ | ఏవం దేవ్యా విభూతి శ్చ పూజయే త్సాధకోనిశమ్‌. 89

సర్వకాలం సర్వరూపా సంసేవ్యా పరమేశ్వరీ | నాతః పరతరం కించ త్కృత కృత్యత్వ దాయకమ్‌. 90

ఇత్యుక్త్వా తాం ధర్మరాజో జగామనిజ మందిరమ్‌ | గృహీత్వా స్వామినం సా చ సావిత్రీ చ నీజాలయమ్‌. 91

సావిత్రీ సత్యవాశ్చైవ ప్రయ¸° చ యథా గమమ్‌ | ఆయాంశ్చ కథయామాస స్వవృత్తాంతం హినారదః. 92

సావిత్రీ జనకః పుత్రాన్సం ప్రాప్తః ప్రక్రమేణ చ | శ్వశుర శ్చక్షుపీ రాజ్యం సా చ పుత్రా న్వరేణ చ. 93

లక్ష వర్షం సుఖం భుక్త్వా పుణ్యక్షేత్రే చ భారతే | జగామ స్వామినా సార్ధం దేవీలోకం పతివ్రతా. 94

సవితుశ్చాధి దేవీయా యం తాధాష్ఠాతృ దేవతా | సావిత్రీ హ్యపి వేదానాం సావిత్రీ తేన కీర్తితా. 95

ఇత్యేవం కథితం వత్స సావిత్ర్యాఖ్యాన ముత్తమమ్‌ | జీవకర్మ విపాకం చ కిం పునః శ్రోతు మిచ్ఛసి. 96

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ నవమస్కంధే నారద నారాయణ సంవాదే సావిత్ర్యు పాఖ్యానే ష్టా త్రింశోధ్యాయః.

ప్రతినెల శుద్ధ షష్ఠినాడు మంగళనాయికయగు షష్ఠీదేవిని కొలువవలయును. ఆషాడ మాసమున సంక్రాంతినాడు సర్వసిద్ధు లొసగునట్టి మనసాదేవి నారాధింపవలయును. కార్తిక శుద్ధ పూర్ణిమనాడు కృష్ణుని ప్రాణాధికప్రియయగు రాధా దేవిని పూజింపవలయును. ప్రతినెల శుద్ధాష్టమినా డుపవసించి దుర్గాదేవిని కొలువవలయును. శ్రీదుర్గాదేవి వరప్రద-విష్ణుమాయ-భగవతి-దుర్గార్తినాశని-మఱియు పతిపుత్రులుగల పతివ్రత నిత్యమును శుభము కోరి మహాప్రకృతియగు జగదంబ నారాధింపవలయును. ధనము-సంతానము గోరిన స్త్రీ తాను పతివ్రతలను గాని దేవి యంథ్రములను గాని దేవి ప్రతిమలను గాని భక్తితో పూజింపవలయును. అట్టి స్త్రీ యీ లోకమున సుఖము లొంది చివరకు దివ్యలోకము చేరును. ఈ రీతి నుత్తమసాధకుడు నిరతము దేవి విభూతుల నారాధింపవలయును. ఎల్లవేళల విశ్వరూపయగు పరమేశ్వరి సంసేవింపదగినది. దేవి సేవనము తప్ప జన్మ ధన్యత గాంచుటకు వేరు మార్గము లేనేలేదు. అని ధర్మరాజు తన భవనమున కరిగెను. సావిత్రియును తన పతిని తీసికొని తన యింటి కేగెను. ఓ నారదా ! ఇట్లు సావిత్రీ సత్యవంతులు తమ యాశ్రమమున కేగి జరిగిన వృత్తాంత మంతయును తమ వారికి తెల్పిరి. సావిత్రి తండ్రికి కొన్నాళ్లకు పుత్ర సంతానము గలిగెను. ఆమె మామ కండ్లకు వెల్గుబాట కనిపించెను. అతడును రాజ్యమును పుత్రులను బడసెను. పతివ్రతయగు సావిత్రి యటుల లక్ష వత్సరములు పుణ్య భారతదేశమున సుఖము లొంది పిదప తన పతితో దేవిలోకమునకు చేరెను. సవితకు గాయత్రికి నధిష్ఠానదేవి సావిత్రీదేవి. ఆమె యంత్రాధిష్ఠానదేవి. వేదమాతయగుట వలన నామెను సావిత్రి యందురు. ఓ వత్సా ! నారదా ! ఈ విధముగనీకు శ్రీ సావిత్రీ మహోపాఖ్యానము వినిపించితిని. జీవుల కర్మ విపాకము తెలిపితిని. ఇంకేమి వినదలతువో తెలుపుము.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి తొమ్మిదవ స్కంధమున నారద నారాయణ సంవాదమున సావిత్ర్యుపాఖ్యానమున ముప్పదెనిమిదవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters