Sri Devi Bagavatham-2    Chapters   

అథ త్రయెదశోధ్యాయః

రాజోవాచః హరిశ్చంద్రః కృతోరాజా సచివైర్నృపశాసనాత్‌ |త్రిశంకుస్తు కధం ముక్త స్తస్మచ్చాండాల దేహతః 1

మృతో వా వనమధ్యే తు గంగాతీరే పరిప్లుతః | గురుణా వా కృపాం కృత్వా శాపాత్తస్మా ద్వియోచితః. 2

ఏత ద్వృత్తాంత మఖిలం కథయస్వ మమాగ్రతః | చరితం తస నృపతేః శ్రోతుకామోస్మి సర్వధా. 3

అభిషిక్తం సుతం కృత్వా రాజా సంతుష్టమానసః | కాలాతి క్రమణం తత్ర చకార చింతయన్‌ శివామ్‌. 4

ఏవం గచ్ఛతి కాలేతు తపస్తప్త్యా సమాహితః | త్రష్టుం దారా న్సుతాదీం శ్చ తదాగా త్కౌశికోమునిః 5

ఆగత్య స్వజనం దృష్ట్యా సుస్ధితం ముదమాప్తవాన్‌ | భార్యాం పప్రచ్ఛ మేధావీ స్దితామగ్రే సపర్యయా. 6

దుర్బిక్షే తు కధం కాల స్త్యయా నీతః సులోచనే | అన్నం వినా త్విమే బాలాః పాలితాః కేన తద్వద. 7

అహం తపసి సంబద్ధో నాగతః శృణు సుందరి | కిం కృతం తుత్వయా కాంతే వినా ద్రవ్యేణశోభ##నే. 8

మయా చింతా కృతా తత్ర శ్రుత్వా దుర్బీక్ష మద్బుతమ్‌ | నాగతోహం వీచార్యైవం కిం కరిష్యామి నిర్దమః. 9

అహ మప్యతివామెరు పీడితః క్షుధయా వనే | ప్రవిష్ట శ్చౌరభావేన కుత్రిచిత్‌ శ్వపచాలయే. 10

శ్వపచం నిద్రితం దృష్ట్వాక్షుధయా పీడితో భృశమ్‌ | మహానసం పరిజ్ఞాయ భక్ష్యార్దం సముపస్దీతః. 11

యదా భాండం సముద్ఘాట్య పక్వం శ్వతనుజామిషమ్‌ | గృహ్ణామి భక్షణార్దాయ తదా దృష్ట స్తు తేన వై. 12

వృష్టః కస్త్వం కధం ప్రాప్తో గృహే మే నిశి సాదరమ్‌ | బ్రూహి కార్యం కిమర్ధంత్వ ముద్ఘాటయసి భాండకమ్‌.

పదుమూడవ అధ్యాయము

త్రిశంకు వృత్తాంతము

రాజిట్లనెను: రాజాజ్ఞవలన హరిశ్చంద్రుడు మంత్రులచే రాజుగ చేయబడెను. మరి త్రిశంకుడు చండాలదేహము నుండి యెట్లు ముక్తుడయ్యెను. అతడు నట్టడవిలో మరణించెనా? గంగలో కొట్టుకొనిపోయెనా? లేక గురుడు దయదలచి యతనిని శాపముక్తుని జేసెనా? ఈ త్రిశంకు వృత్తాంతమంతయును విన వేడుకగుచున్నది. నా కా రాజు చరిత్ర సమస్తము తేటపఱచుము. వ్యాసుడు ఇట్లనెను. తన కుమారు డభిషిక్తుడుగుటవిని త్రిశంకుడు ప్రమోదమొంది శ్రీశివకుటుంబినియగు శివదేవిని స్మరించుచు కాలము గడిపెను. ఇట్లు కొంతకాలము సాగిన పిమ్మట విశ్వామిత్రుడు నియమముతో తప మొనర్చిన పిదప తన భార్యను సుతులనుజూడ నేతెంచెను. విశ్వామిత్రుడుడేతెంచి సుఖముగనున్న తన వారిని చూచి ప్రమోదమొంది తనకు సేవ చేయదలచిన భార్యతో నిట్లనెను. సులోచనా! అప్పటి కరవుకాటకముల కాలమెట్లు గడిపితివి? అన్నములేక మలమలలాడు బాలుర నెవరు పోషించిరో తెల్పుము. సుందరీ! శోభనాంగీ! నేను ఘేరతపమున మునిగియుండుచే రాజాలకపోతిని. నీ యొద్దధనము లేదు గదా. అందులకు నీవేమి చేసితివి? అంతటి కరవుకాలము దాపురించినపుడు బీద వాడ నగు నేను వచ్చి మాత్రము ఏమ వెలుగబైట్టుదునని తలచి రాలేదు. వామోరూ! నేను వనమందొకనాడాకలి మంటకు తాళ##లేక చండాలునింట దొంగవలె ప్రవేశించితిని. చండాలుడు నిదురించుటగని యాకలి బాధ కోర్వజాలక వంటశాల లోని తినుబండారములు వెదకితిని. అపుడొక కుండలో వండి కుక్కమాంసము చూచి తినుటకు తీసుకొను నంతలో నింటి వాని కంటబడితిని. నీవెవరవు? ఈ నడిరేయి నాయింటి కేల వచ్చితివి? ఈకూటికుండ నేల తీసికొంటివి? నీ కేమి పని తెల్పుమని చండాలు డనెను.

ఇత్యుక్తః శ్వపచే నాహం క్షుదయా పీడితో భృశమ్‌ | తమవోచం సుకేశాంతే కామం గద్గదయా గిరా. 14

బ్రాహ్మణోహం మహాభాగ తాపసః క్షుధయార్దితః | చౌరభావ మునుప్రాప్తో భక్ష్యం పశ్యామి భాండకే. 15

చౌరభావేన సంప్రాప్తోస్మ్యతిథిస్తే మహామతే | క్షుధితోస్మి దదస్వాజ్ఞాం మాంస మద్మి సుసంస్కృతమ్‌. 16

విశ్వామిత్రః : శ్వపచ స్తు వచః శ్రుత్వా మామువాచ సునిశ్చితమ్‌ |

భక్షం మా కురు వర్ణాగ్ర్య జానీహి శ్వపచాలయమ్‌. 17

దుర్లభం ఖలు మానుష్యం తత్రాపి చ ద్విజన్మతా | ద్విజత్వే బ్రాహ్మణత్వం చ దుర్లభం వేత్సి కిం నహి. 18

దుష్టాహారో న కర్తవ్యః సర్వథా లోకమిచ్ఛతా | ఆగ్రాహ్యా మనునా ప్రోక్తాః కర్మణా సప్తచాంత్యజాః. 19

త్యాజ్యో హం కర్మణా విప్ర శ్వపచో నాత్ర సంశయః | నివారయామి భక్షా త్త్వాం న లోభేనాంజసా ద్విజ. 20

సుకేశీ! చండాలుడట్లడుగగ నా కట నకనకలాడుచు డగ్గుత్తికతో తొట్రుపడు మాటలతో నేనతని కిట్లంటిని. మహాత్మా! నేను బ్రాహ్మణుడను. తాపసుడను. పేరాకట బాధపడువాడను. అందుచే దొంగవలె నన్నము కుండ వెదకుచున్నాను. మహామతీ ! నేను నీ యింటికి దొంగగ వచ్చిన యతిథిని. ఆకలిగొన్నవాడను. వండిన మాంసము దినుట కనుమతి యిమ్ము అంటిని. ఆ చండాలుడు నా మాటలు విని నిశ్చయించుకొని యిట్లనెను: ''ఓ బ్రాహ్మణుడా! ఇది మాలయిల్లు, తనకుము. మానవ జన్మము దుర్లభ##మైనది. అందును ద్విజత్వము లభించుట కడు దుర్లభతరము. ద్విజత్వము నందుబ్రాహ్మణత్వము దుర్లభతమమని తెలియదా! ఉత్తమ లోకములు గోరుకొనువాడు నీచజాతుల వారి యన్న మెప్పుడును తినరాదని మనువు మున్నగువారు తెలిపిరి. విప్రా! నేను కర్మచే చండాలుడను. దూరముగ నుండదగినవాడను. అందువలన నిన్ను తినవద్దనుచున్నాను. కాని లోభమున గాదు.

వర్ణసంకరదోషోయం మా೭೭యాతు త్వాం ద్విజోత్తమ |

విశ్వామిత్రః : సత్యం వదసి ధర్మజ్ఞ మతిస్తే విశదాంత్యజ. 21

తథాప్యాపది ధర్మస్మ సూక్ష్మమార్గం బ్రవీమ్యహమ్‌ | దేహస్య రక్షణం కార్యం సర్వథా యది మానద. 22

పాపస్యాంతే పునః కార్యం ప్రాయశ్చిత్తం విశుద్ధయే | దుర్గతి స్తు భ##వే త్పాప మనాపది నచా೭೭పది. 23

మరణాత్‌ క్షుధితస్యాథ నరకో నాత్ర సంశయః | తస్మాత్‌ క్షుధాపహరణం కర్తవ్యం శుభమిచ్చతా. 24

తేనాహం చౌర్యధర్మేణ దేహం రక్షేప్యథాంత్యజ | అపర్షణచ చౌర్యేణ యత్పాపం కథితం బుధైః. 25

యోన వర్షతి పర్జన్యం తత్తు తసై#్మ భవిష్యతి | విశ్వామిత్రః | ఇత్యుక్తే వచనే కాంతే పర్జన్యః సహసాపతత్‌. 26

గగనా ద్దస్తి హస్తాభి ర్దారాభి రభికాంక్షితః | ముదితోహం ఘనం వీక్ష్య వర్షంతం విద్యుతా సహ. 27

తదాహం తద్గృహం త్యక్త్వా నిఃసృతః పరయా ముదా | కథయత్వం వరారోహే కాలోనీత స్త్వయా కథమ్‌. 28

కాంతారే పరమక్రూరః క్షయకృత్ప్రాణినా మిహ | ఇతితస్య వచః శ్రుత్వా పతిమాహ ప్రియంవదా. 29

యథా శృణు మయా నీతః కాలః పరమ దారుణః | గతే త్వయి మునిశ్రేష్ఠ దుర్బిక్షం సముపాగతమ్‌. 30

అన్నార్థం పుత్రకాః సర్వే బభూవు శ్చాతి దుఃఖితాః | క్షుధితా న్బాలకా న్వీక్ష్య నీవారార్థం వనేవనే. 31

భ్రాంతాహం చింతయా೭೭విష్టాకించి త్ర్పాప్తం ఫలం తదా | ఏవంచకతిన్మాసా నీవారేణాతివాహితాః. 32

ద్విజోత్తమా : వర్ణసంకర దోషము నీకు గల్గరాదు. అనెను. నేను (విశ్వామిత్రుడు) ఇట్లంటిని. ధర్మజ్ఞా ! నీవు చండాలుడవైనను నీ బుద్ది నిర్మలమైనది. నీకు ధర్మ సూక్ష్మము చెప్పుచున్నాను వినుము. ఆపద్ధర్మ మొకటి గలదు. దాని వలన తప్పకాపదలందు దేహమును పోషించుకొనవచ్చును. పాపము చేసిన పిదప నివృత్తి కొఱకు ప్రాయశ్చిత్తముచేసి కొనవచ్చును. ఆపద లేనపుడు పాపము చేసిన దానివలన దుర్గతి గల్గును. ఆకలిచే చచ్చినవానికి నరకము గల్గును. ఇది నిజము. కనుక మేలు కోరుకొనువాడేదియో విధముగ నాకలి మంట చల్లార్చుకొనవలయును. కనుక చండాలుడా! నేను దొంగ వృత్తితో నా శరీరమును పోషించుకొనదలచితిని. వానలు లేనపుడు దొంగతనము చేయుట పాపమని పండితులందురు. మేఘము వానకురియనిచో నా దోషము మేఘునిదే. కాంతా! నేనిట్లు పలుకగనే వెంటనే మేఘము వర్షించెను. ఆకసము నుండి యేనుగు తొండము లావు ధారలతో వానపడెను. ఉఱుములు మెఱుపులు మొయిళ్ళు వాన-చూచినేనెంతయో ముదమొందితిని. అపుడు నేనా చండాలుని యిల్లు వదలి బయటికి వెళ్లితిని. వరారోహా! ఇంక నీవెట్లు కాలము గడిపితివో తెలుపుము. ఈ కరవు చాల ఘోరమైనది. ఈ వనము మలమల మాడినది. ప్రాణుల కాహారము దొరకుటలేదు. అను మాటలు విని యామె తన పతి కిట్లనియెను. మునివర్యా! నీవు వెళ్ళిన పిమ్మట నేను దారుణమైన కరవు కాల మెట్లు గడిపితినో వినుము. మన పుత్రు లంద ఱన్నము లేక మిక్కిలి దుఃఖించిరి. ఆకలిగొన్న బాలురను జూచి ధాన్యమునకై వనమువనము తిరిగితిని. అట్లు విచార ముతో తిరుగుచుండగ నాకు కొన్ని ఫలములు కనిపించెను.

తదభావే మయాకాంత చింతితం మనసా పునః | న భిక్షా కిల దుర్బిక్షే నీవారా నాపి కాననే. 33

న వృక్షేషు ఫలా న్యాసు ర్నమూలాని ధరాతలే | క్షుధయా పీడితా బాలా రుదంతి భృశమాతురాః. 34

కిం కరోమి క్వ గచ్ఛామి కిం బ్రవీమి క్షుర్ధి దతాన్‌ | ఏవం విచింత్య మనసా నిశ్చయ స్తు మయా కృతః. 35

పుత్ర మేకం దదా మ్యద్య కసై#్మచి ద్ధనినే కిల | గృహీత్వా తస్య మౌల్యం తు తేన ద్రవ్యేణ బాలకాన్‌. 36

పాలయేహహం క్షుధార్తాం స్తునాన్యోపాయో స్తి పాలనే |

ఏవం సంచింత్య మనసా పుత్రోయం ప్రహితో మయా. 37

విక్కయార్థం మహాభాగ క్రందమానో భృశాతురః | క్రందమానం గృహీత్వైనం నిర్గతాహం గతత్రపా. 38

తదా సత్యవ్రతో మార్గే మాముద్వీక్ష్య భృశాతురమ్‌ | పప్రచ్ఛ స చ రాజర్షిః కస్మా ద్రోదితి బాలకః. 39

తదాహం తమువాచేదం వచనం మునిసత్తమ | విక్రమార్థం నీయతేసౌ బాలకోద్య మయా నృప. 40

శ్రుత్వామే వచనం రాజా దయార్దృహృదయ స్తతః | మామువాచ గృహం యాహి గృహీత్వైనం కుమారకమ్‌. 41

భోజనార్థే కుమారాణా మామిషం విహితం తవ | ప్రాపయిష్యామ్యహం నిత్యం యావన్ముని సమాగమః. 42

అహన్యహని భూపాలో వృక్షేస్మి న్మృగ సూకరాన్‌ |

విన్యస్య యాతి హత్వాసౌ ప్రత్యహం దయయా న్వితః. 43

వానితో కొంత ధాన్యముతో నెట్లో కొన్ని నెలలు గడిపితిని. కాంతా! కొంతకాలమున కవియు దొరుకక నేనెంతయో కుమిలితిని. ఈ కరవు దినములలో నింత బిచ్చము పెట్టువారులేరే! అడవిలో ధాన్యములేదే! చెట్లకు పండ్లులేవు. భూమిలో కందమూలములు లేవు. నాబాలు రాకటి బాధచే బావురుమని యేడ్చుచున్నారు. ఇపుడెక్కడికేగుదును? ఏమి చేతును? ఈ యాకలిచే పీడితుల కేమి సమాధానము చెప్పుదును. అని మదిలో చింతించి తుదకిట్లు నిశ్చయించితిని. ఒక కుమారు నే ధనవంతున కైన నమ్మి డబ్బు తీసికొని దానితో బాలురను త్కనకి పోషింపవలయును. ఇటు లాకలిచే పీడితులను బోషింతును. వీరిని పెంచుటకు మఱి యితరోపాయము లేదు. అని తలచి యొక బాలు నమ్మదలచితిని. మహానుభావా! ఆ బాలుడు పల్మారు క్షుధార్తితో నేడ్చుచుండెను. అట్టివానిని తీసికొని నేను సిగ్గుమాలి బయలుదేరితిని. అంతలో త్రోవలో సత్య వ్రతుడను రాజర్షి దిక్కు లేని నన్ను జూచి యీ బాలు డేల యేడ్చుచున్నాడని యడిగెను. మునిసత్తమా! అపుడు నేనతని కిట్లు పలికితిని. నేనీ బాలు నమ్ముటకు వెళ్ళుచున్నాను. నా మాటలు వినగనే రాజు గుండె కరగెను. అతడిట్లనెను: ఈ చిన్నారి బాలుని తీసుకొని నీ యింటి కేగుము. ముని తిరిగి వచ్చునంతవఱకు నేనీ కుమారకులకు తగిన మాంసము పంప గలను. ఆ రాజు దయతో ప్రతిదినము పందులను జింకలను వేటాడి వాని మాంసము నొక చెట్టుపై నుంచి వెళ్ళుచుండెను.

తేనైవ బాలకాః కాంత పాలితా వృజినార్ణవాత్‌ | వసిష్ఠేనాథ శప్తోసౌ భూపతి ర్మమ కారణాత్‌. 44

కస్మిం శ్చి ద్ధివసే మాంసం న ప్రాప్తం తేన కాననే | హతా దోగ్ద్రీ వసిష్ఠస్య తేనాసౌ కుపితో మునిః. 45

త్రిశంకు రితి భూపస్య కృతం నామ మహాత్మనా | కుపితేన వధా ద్ధేతో శ్చాండాలశ్ఛ కృతో నృపః. 46

తేనాహం దుఃఖితా జాతా తస్య దుఃఖేన కౌశికః | శ్వపచత్వ మసౌ ప్రాప్తో మత్కృతే నృపనందనః. 47

యేనకేనాప్యుపాయేన భవతా నృపతేః కిల | తస్మా ద్రక్షా ప్రకర్తవ్యా తపసా ప్రబలేన హ. 48

ఇతి భార్యా వచః శ్రుత్వా కౌశికో మునిసత్తమః | తామాహ కామినీం దీనాం సాంత్వపూర్వ మరిందమ. 49

మోచయిష్యామి తం శాపా న్నృపం కమలలోచనే | ఉపకారః కృతో యేన కాంతారా ద్రక్షితాసి వై. 50

విద్యాతపోబలేనాహం కరిష్యే దుఃఖసంక్షయమ్‌ | ఇత్యాశ్వాస్య ప్రియాం తత్ర కౌశికః పరమార్థవిత్‌. 51

చింతయామాస నృపతేః కథం స్యా ద్దుఃఖనాశనమ్‌ | సం విమృశ్య మునిస్తత్ర జగామ యత్ర పార్థివః. 52

త్రిశంకుః పక్కణ దీనః సంస్థితః శ్వపచాకృతిః | ఆగచ్ఛంతం మునిం దృష్ట్వా విస్మితోసౌ నరాధిపః. 53

దండవ న్నిపపాతోర్వ్యాం పాదయోస్తరసా మునేః | గృహీత్వా తం కరే భూపం పతితం కౌశిక స్తదా. 54

ఉత్థాప్యోవాచ వచనం సాంత్వపూర్వం ద్విజోత్తమః | మత్కృతే త్వం మహీపాల శప్తోసి మునినా యతః. 55

అతని వలననే మన బాలకులీ దుఃఖసాగరము దాటగల్గిరి. అట్టి రాజు నా కారణమున వసిష్ఠునిచే శపింపబడెను. ఒకనాడడవిలో మాంసము దొరకనందున నతడు వసిష్ఠునియావును చంపెను. గాన వసిష్ఠునకు కోపము వచ్చెను. ముని యతనిని చండాలునిగ శపించెను. ఇట్లు కోపము గోవధ చండాలత్వ - మీమూటి వలన రాజునకు త్రిశంకుడని పేరు పెట్టెను. ఓ కౌశికా! అతనికి గల్గిన దుఃఖమునకు నేనెంతయో వగచితిని. నా వలన రాజకుమారుడు చండాలుడయ్యెను కనుక ఏ ఉపాయము చేతనైనను నీ ప్రబల తపము వలన నైన నా రాజును బ్రోచుట మంచిది. అను భార్య మాటలు విని కౌశిక ముని దీనముగ నున్న తన పత్ని నోదార్చి యామె కిట్లనెను ''కమలలోచనా! అతడు నీ కుపకారము చెసెను. అడవిలో నీ వతని వలన రక్షింపబడితివి. కనుక నేను రాజును శాపముక్తుని జేయగలను. నా విద్యా తపోబలము నతని దుఃఖము బాప గలను.'' అని పరమార్థవిదుడగు కౌశికుడు తన భార్య నూరడించెను. త్రిశంకున కెట్లు దుఃఖము తొలగునాయని కౌశికముని యెంతయో యోజించి తుదకు రాజున్న చోటికేగెను. అపుడు త్రిశంకుడొక మాలపల్లెలో దీనముగ చండాల రూపమున నుండెను. తన చెంతకు వచ్చుచున్న మునిని గని రాజచ్చెరువందెను. రాజు వెంటనే ముని పాదములకు దండ ప్రణామము లొనర్చెను. ముని రాజును లేపి చల్లనిమెల్లని మాటలతో నిట్లనెను. ఓ రాజా! నీవు నా కొఱకు ముని చేత శపింపబడితివి.

వాంఛితం తే కరిష్యామి బ్రూహి కిం కరవాణ్యహమ్‌ | రాజా : మయా సంప్రార్థితః పూర్వం వసిష్ఠో మఖహేతవే.

మాం యాజయ ముని శ్రేష్ఠ కరోమి మఖ ముత్తమమ్‌ | యథేష్టం కురు విప్రేంద్ర యథాస్వర్గం వ్రజామ్యహమ్‌. 57

అనేనైవ శరీరేణ శక్రలోకం సుఖాలయయమ్‌ | కోపం కృత్వా వసిష్ఠోసౌ మామాహేతి సుదుర్మతే. 58

మానుషేణ హి దేహేన స్వర్గవాసః కుతస్తవ | పునర్మయోక్తో భగవా న్స్వర్గలుబ్ధేన చానఘు. 59

అన్యం పురోహితం కృత్వా యక్ష్యేహం యజ్ఞము త్తమమ్‌ | దతా తేనైవ శపో హం చాండాలో భవ పామర.

ఇత్యేత త్కథితం సర్వం కారణం శాపసంభవమ్‌ | మమ దుఃఖివినాశాయ సమర్థోసి మునీశ్వర. 61

ఇత్యుక్తా విరరామాసౌ రాజా దుఃఖరుజార్దితః | కౌశికోపి నిరాకర్తుం శాపం తస్య వ్యచింతయత్‌. 62

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ సప్తమస్కంధే త్రయోదశోధ్యాయః.

రాజిట్లనెను: నేను మున్ను యాగము చేయించుమని వసిష్ఠుని ప్రార్థించితిని. ముని వర్యా! నేనొక యజ్ఞము చేయదలచితిని. ఆ యాగము వలన నేను స్వేచ్ఛగ స్వర్గమేగ దలచితిని. దానిని జరిపించుమని మునినడిగితిని. నేనీ శరీరముతోడనే స్వర్గ సుఖములంద గోరితిని. అపుడు వసిష్ఠుడు కోపించి నన్ను దుర్మతీ! అని సంబోధించి యిట్లనెను : ఈ నర దేహముతో స్వర్గ వాసము నీకెట్లు గల్గును? అనగా అపుడు నేను మరల స్వర్గ లోభముచే నిట్లంటిని. ''అట్లయిన నేను వేరొక్కని పురో హితునిగ నియమించుకొని నాయుత్తమ యజ్ఞ మొనర్తును'' అపుడు నేను మునిచే చండాలుడుగ శాప్తుడనైతిని. ఇట్లు నీకు నాశాప కారణము తెల్పితిని. మునీశ్వరా! నా దుఃఖము తొలగించుటకు నిన్ను వేడుచున్నాను. అని శోకార్తుడగు రాజు మిన్నకుండెను. అంత కౌశికుడును రాజు శాపము తొలగించుటకు నెమ్మది చక్కగ తలంచెను.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణ మందలి సప్తమ స్కంధమున పదుమూడవ అధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters