Sri Devi Bagavatham-2    Chapters   

అథ చతుర్థోధ్యాయః

వ్యాసః : గతే రాజని సా బాలా పతిసేవాపరాయణా | బభూవ చ తథాగ్నీనాం సేవనే ధర్మతత్పరా.ః 1

ఫలాన్యాదాయ స్వాదూని మూలాని వివిధాని చ | దదౌ సా మునయే బాలా పతిసేవాపరాయణా. 2

పతిం తప్తోదకేనాశు స్నాపయిత్యా మృగత్వచా | పరివేష్ట్య శుభాయాం తు బ్రుస్యాం స్థాపితవత్యపి. 3

తిలా న్యవకుశానగ్రే పరికల్ప్య కమండలుమ్‌ | తమువాచ నిత్యకర్మ కురుష్య మునిసత్తమ. 4

తముత్థాప్య కరేకృత్వా సమాప్తే నిత్యకర్మణి | బృస్యాం వా సంస్తరే బాలా భర్తారం సంన్యవేశయత్‌. 5

పశ్చాదానీయ పక్వాని ఫలాని చ నృపాత్మజా | భోజయామాస చ్యవనం నీవారాన్నం సుసంస్కృతమ్‌. 6

భుక్తవంతం పతిం తృప్తం దత్త్వా೭೭చమన మాదరాత్‌ | పశ్చా చ్చ పూగం పత్రాణి దదౌ చాదరసంయుతా. 7

గృహీతముఖవాసం తం సంవేశ్య చ శుభాసనే | గృహీత్వా೭೭జ్ఞాం శరీరస్య చకార సాధనం తతః. 8

ఫలాహారం స్వయంకృత్వా పునర్గత్వా చసన్నిధౌ | ప్రోవాచ ప్రణయోపేతా కిమాజ్ఞాపయసే ప్రభో. 9

పాదసంవాహనం తేద్య కరోమి యది మన్యసే | ఏవం సేవాపరా నిత్యం బభూవ పతితత్పరా. 10

సాయం హోమావసానేసా ఫలాన్యాహృత్య సుందరీ | అర్పయామాస మునయే స్వాదూని చమృదూని చ. 11

నాల్గవ అధ్యాయము - సుకన్య వృత్తాంతము

వ్యాసుడిట్లనియెను : అట్లు రాజు వెడలిన పిదప సుకన్య ధర్మ తత్పరమతితో పతిసేవా పరాయణయై యగ్నులను సేవించు చుండెను. సుకన్యబాల. ధర్మ తత్పరయై మునిపతికి తీయని ఫలములను కందమూలములను పెక్కులు తెచ్చి యిచ్చెను. ఆమె ప్రేమమీర తనపతిని వేన్నీటి స్నానమొనర్చి జింకతోలు ధరింపజేసి దర్బాసనమున కూర్చుండ బెట్టును. ఆ సతీ తిలతము మునితిలకుని సన్నిధిలో తిలలు యవలు దర్బలు కమండలువునుంచి మునీశ ! నిత్యానుష్ఠానమొనరింపుమని యనును. నిత్యానుష్ఠానము పూర్తియైన పిమ్మట సుకన్య తన ప్రియ భర్తను చేతులతో లేపి దర్బలపై గాని వేరొక ఆసనముపై గాని కూర్చుండ పెట్టును. ఆ పిదప నా రాచకన్నియు ముదుర పండిన తీయని పండ్లును మంచి నీవారాన్నమును దెచ్చి చ్యవన మునివరునకు తినిపించును. తనపతి తుష్టిగ పుష్టిగ భుజించిన తర్వాత సుకన్య మర్యాదతో నతనికి కమ్మని యాకు వక్కల తాంబూల మందించును ముఖము కడుగుకొని తాంబూలము సేవించిన తన నాధుని సుఖాసనముననుంచి యతని యాజ్ఞతో నామె తన పనులు తాచూచుకొనును. తనపతి తినగ మిగిలినది తాను గుడిచి పిదప నతని సన్నిధికేగి నెయ్యము దియ్యము దోప సుకన్య ప్రభూ! ఏమియాజ్ఞ యని యడుగును. మీ యానతియైనచో రాగము తళుకొత్త మీపాదము లొత్తుదును. అని సుకన్య నిత్యము పతిసేవా పరాయణయై పేరుగాంచెను. ముని సాయంకాల హోమము నిర్వర్తించిన మీదట సుకన్య సుందరి మునిపతికి ప్రియ మధురములగు ఫలములు తెచ్చియిచ్చును.

తతః శేషాణి బుభుజే ప్రేమయుక్తా తదాజ్ఞయా | సుస్పర్శా స్తరణం కృత్వా శాయయామాస తం ముదా. 12

సుప్తే సుఖే ప్రియే కాంతా పాదసంవాహనం తదా | చకార పృచ్ఛతీ ధర్మం కులస్త్రీణాం కృశోదరీ. 13

పాదసంవాహనం కృత్యానిశి భక్తిపరాయణా | నిద్రితం చ మునిం జ్ఞాత్వా సుష్వాప చరణాంతికే. 14

శుచౌ ప్రతిష్ఠితం వీక్ష్య తాల వృంతేన భామినీ | కుర్వాణా శీతలం వాయుం సిషేవే స్వపతిం తదా. 15

హేమంతే కాష్ఠసం భారం కృత్వాగ్ని జ్వలనం పురః | స్థాపయిత్వా తథావృచ్ఛ త్సుఖంతే స్తీతి చాసకృత్‌.

బ్రహ్మే ముహూర్తే చొత్థాయ జలం పాత్రంచ మృత్తికామ్‌ | సమర్పయిత్వా శౌచార్థం సముత్థాప్యపతిం ప్రియా.

స్థానాద్దూరే చ సంస్థాప్య దూరం గత్వా స్థిరాభవత్‌ | కృతశౌచం పతి కృత్వా జ్ఞాత్వా జ గ్రాహ తం పునః. 18

అనీయాశ్రమ మవ్యగ్రా చోపవేశ్యాసనే శుభే | మృజ్జలాభ్యాం చ ప్రక్షాళ్య పాదావస్య యథావిధి. 19

దత్త్వా೭೭చమన మాత్రం తు దంతధావన మాహరత్‌ | సమర్ప్య దంతకాష్ఠం చ యథోక్తం నృపనందినీ. 20

చకారోష్ణం జలం శుద్దం సమానీతం సుపావనమ్‌ | స్నానార్థం జల మాహృత్య పప్రచ్ఛ ప్రణయాన్వితా. 21

కి మాజ్ఞాపయసే బ్రహ్మన్కృతం వై దంతధావనమ్‌ | ఉష్ణోదకం సుసంపన్నం కురుస్నానం సమంత్రకమ్‌. 22

ఆ తరువాత ముని యనుమతితో సుకన్య మిగిలిన ఫలములు తినును. ఆ కోమలాంగి తనపతిని మెత్తని మెత్తని సెజ్జపై సుఖకరముగ పరుండ బెట్టును. అట్లు తన ప్రియకాంతుడు పరుండిన పిదప కృశోదరి యగు సుకన్య కుల కాంతల ధర్మములను గుఱించి యతని నడిగెను. ఆమె తన పతి పాదములొత్తి యతడు నిద్రించిన పిమ్మట పతి భక్తి తనరార పతి చరణ సన్నిధిలో నిదురించును. మండు గాడ్పులు చెరగు గ్రీష్మ కాలమున నామె తన భర్తకు చల్లని తాల వృంతముతో కమ్మతెమ్మెరలు వీవ విసరెను. ఆ పతిసేవా పరాయణ హేమంత ఋతువునందు చిదుగు పుల్లలు తెచ్చి మంటబెట్టి యిపుడు నీ మదికి వెచ్చవెచ్చగ నున్నదాయని మాటి మాటి కడిగెను. ఆమె తెలతెల వారకముందే లేచి తన పతినిలేపి యతని శౌచక్రియకు నీళ్లచెంబు మట్టి తెచ్చును. ఆమె చెంబును మట్టిని తనపతిదేవుని చెంతనుంచి తానుదూరముగ నుండును. శౌచక్రియ పూర్తియైన పిదప ఆమె తన భర్త చేయిపట్టుకొనెను. ఆ పతివ్రత తన పతినొక శుభాసనమున గూర్చుండబెట్టి యతని పాదములను మట్టితో నీళ్లతో శుభ్రముగ యధావిధిగ కడుగును. ఆ రాజకన్య మునిరాజునకు ఆచమనము చేయించి పండ్లుతోము పుల్లతెచ్చి యిచ్చును. ఆమె ముని స్నానమునకు వేడినీరుతెచ్చి కూర్మి పేర్మి నతనితో నిట్లనును : ఓ బ్రాహ్మణోత్తమా! ఏమియాజ్ఞ! పండ్లు తోముట పూర్తియైనదా? వేడినీరు సిద్ధముగ నున్నది. సమంత్రకముగ స్నా వ మొనరింపుము.

వర్తతే హోమకాలోయం సంధ్యాపూర్వా ప్రవర్తతే | విధివ ద్దవనం కృత్వా దేవతాపూజనం కురు. 23

ఏవం కన్యా పతిం లబ్ద్వా తపస్విన మనిందితా | నిత్యం పర్య చర త్ర్పీత్వా తపసా నియమేన చ. 24

అగ్నీనా మతిథీనాం చ శుశ్రూషాం కుర్వతీ సదా | ఆరాధయామాస ముదా చ్యవనం సా శుభాననా. 25

కస్మిం శ్చి తథ కాలే తు రవిజా వశ్వినా పుభౌ | చ్వవన స్వాశ్రమాభ్యాశే క్రీడమానౌ సమాగతౌ. 26

జలే స్నాత్వా తు తాం కన్యాం నివృత్తాం స్వాశ్రమంప్రతి | గచ్చంతీం చారు సర్వాంగీం రవిపుత్రా వపశ్యతామ్‌. 27

తాం దృష్ట్వా దేవకన్యాభాం గత్వాచాంతిక మాదరాత్‌ | ఊచతుః సమభిద్రుత్య నాసత్యా పతిమోహితౌ. 28

క్షణం తిష్ఠ వరారోహే ప్రష్టుం త్వాం గజగామిని | ఆవాం దేవసుతౌ ప్రాప్తౌ బ్రూహి సత్యం శుచిస్మితే 29

పుత్రీ కస్య పతిః కస్తే కథ మూద్యాన మాగతా | ఏకాకినీ తటాకేస్మి న్స్నానార్థం చారులోచనే. 30

ద్వితీయా శ్రీరివాభాసి కాంత్యా కమలలోచనే | ఇచ్చామస్తు వయం జ్ఞాతుం తత్త్వ మాఖ్యాహి శోభ##నే. 31

కోమలౌ చరణౌ కాంతే స్థితౌ భూమా వనావృతౌ | హృదయే కురుతః పీడాం చలంతౌ చలలోచనే. 32

విమానార్హాసి తన్వంగి కథం పద్బ్యాంప్రజస్యదః | అనావృతాత్ర విపినే కిమర్థం గమనం తవ. 33

తూర్పున సంజకెంజాయ విరియుచున్నది. హోమసమయము సమీపించినది. యథావిధిగవేల్చి దేవతార్చన చేయుము ఈ చందముగ సుకన్య మునిపతిని పతిగ బడసి యనిందిత చరిత్రయై నిత్య మతనికి నియమనిష్ఠలతో ప్రేమమీర పరిచర్యలు చేసెను. ఆ శుభాసన యీ విధిగ అగ్నులను అతిథులను అభ్యాగతులను సేవించుచు చ్యవనుని ముదమార కొల్పుచుండెను. అంత నొకనాడు సూర్యపుత్రులగు అశ్విను లిర్వును చ్యవనముని యాశ్రమము పొంత స్వేచ్చగవిహరించుచుండిరి. నీట స్నానమాడి తన యాశ్రమము వైపుగ నేతెంచుచున్న సర్వాగసుందరియగు సుకన్యను రవిపుత్రులు చూచిరి. దేవకన్యను బోలు సుకన్యనుగాంచి వారు విమోహితులై యామె సన్నిధికేగి యిట్లనిరి: వరారోహా! గజగామినీ! శుచిస్మితా! క్షణమాగుము. మేము దేవసుతులము. మే మడిగిన దానికి నిజము పలుకుము. చారునేత్రీ! నీ వెవ్వని కూతురవు? నీ పతి యెవరు? నీవొంటరిగ స్నానమున కీతటాకమున కేల వచ్చితివి? శోభనాంగీ! కమలాక్షీ! నీ కాంతిచే లక్ష్మికి ప్రతిరూపముగ వెల్గుచున్నావు. నిన్ను గూర్చి తెలిసికొనదలచితిమి నిజము చెప్పుము. చంచలాక్షీ! సుందరీ! నీ యింత మెత్తని పాదములు పాదరక్షలు తొడు గులు లేకున్నవేమి! ఈ కటికి నేలపై నీ యగుడులు పడినంతనే మా గుండెలు వ్రయ్యలగుచున్నవి. తన్వంగీ! నీవు విమాన మెక్క తగినదానవు. వట్టి కాళ్లతో నీ చిట్టడివిలో గ్రుమ్మరుదు వేల?

దాసీశతసమాయుక్తా కథం సత్వం వినిర్గతా | రాజపుత్ర్యప్సరావాసివద సత్యం పరాననే. 34

ధన్యా మాతా యతో జాతా ధన్యోసౌ జనకస్తవ | వక్తుం త్వాం నైవ శక్తౌచ భర్తుర్బాగ్యం తవానఘే. 35

దేవలోకాధికా భూమి రియంచైవ సులోచనే | ప్రచలం శ్చరణస్తేద్య సంపావయతి భూతలమ్‌. 36

సౌభాగ్యాశ్చ మృగాః కామం యేత్వాం పశ్యంతివై వనే | యే చాన్యే పక్షిణః సర్వే భూరియంచాతి పావనా. 37

స్తుత్యాలం తవ చాత్యర్థం సత్యం బ్రూహి సులోచనే | పితా కస్తే పతిః క్వాసౌ ద్రష్టుమిచ్చాస్తి సాదరమ్‌. 38

వ్యాసః తయోరితి వచః శ్రుత్వా రాజకన్యాతి సుందరీ | తామువాచ త్రపాక్రాంతా దేవపుత్రౌ నృపాత్మజా. 39

శర్యాతితనయాం మాం వాంవిత్తం భార్యాం మునేరిహ | చ్యవనస్య సతీం కాంతాం పిత్రా దత్తాం యదృచ్చయా.

పతి రంధోస్తి మేదేవో వృద్దశ్చాతీవ తాపసః | తస్య సేవా మహోరాత్రం కరోమి ప్రీతిమానసా. 41

కౌయువాం కిమిహాయాతౌ పతి స్తిష్ఠతి చాశ్రమే | తత్రాగత్య ప్రకురత మాశ్రమం చాద్య పావనమ్‌. 42

తదాకర్ణ్య వచో దస్రాపూచతుస్తాం నరాధిప | కథం త్వ మపి కల్యాణి పిత్రా దత్తా తపస్వినే. 43

వరాననా! దాసీ సహస్రములు కొలుచుచుండగ వెడలవేమి? నీవు రాచపట్టివో! దేవకన్యనో నిజము పలుకుము. ఓ యనఘురాలా! నిన్ను గన్న తల్లి ధన్య! నీ తండ్రి ధన్యుడు. ఇక నిన్ను చేపట్టిన భర్త యదృష్టమేమని తెలుపగలము! సులోచనా! ఈ భూలోకము స్వర్గసీమకంటె మహోన్నతతరమైనది. నీ పవిత్రపాదములు పడుటవలన ఈ భూతలమంత యును పవిత్రమై ధన్యమైనది. ఈ వనమందు నిన్ను గన్నులార చూచు జంతువులు మిక్కిలి యదృష్టము గలవి. పక్షులు నదృష్టము గలవి. ఈ వనభూమియు పావనమైనది. సులోచనా! ఈ పొగడ్త లన్నియు నెందులకు! నీ తండ్రి యెవరో నీ పతి యెవరో నిజము చెప్పుము. వారిని చూడదలచితిమి. అను వారి మాటలువిని సుందరాంగియగు సుకన్య సిగ్గుతో దేవ కుమారుతో నిట్లు చెప్పెను. నేను శర్యాతి కూతురను. ఈ చ్యవనముని భార్యను. కులసతిని నా తండ్రి నన్నీ మునికి తన ఇచ్ఛతో దానము చేసెను. నే నీ మునికి సహధర్మచారిణిని. నా పతిదేవుడు తాపసుడు; వృద్ధు; గ్రుడ్డివాడు. నేను ప్రేమ భక్తితో నిరంతరము నా పతిని సేవించుచుందును. మీరెవ్వరు? ఏ పనిమీద వచ్చితిరి? నా నాధు డాశ్రమమందు గలడు. మీరచటి కేతెంచి యాశ్రమమును పావనము చేయుడు. అను సుకన్య పలుకులువిని వారిట్లనిరి: కల్యాణీ ! నీవు నీ తండ్రిచే యీ తబిసి కెట్లు దానము చేయబడితివి?

భాజసేస్మిన్వనో ద్దేశే విద్యు త్సౌదామినీ యథా | న దేవేష్యపి తుల్యా హి తవ దృష్టాస్తి భామిని. 44

త్వం దివ్యాంబరయోగ్యాసి శోభ##సే నాజినైర్వృతా | సర్వాభరణసంయుక్తా నీలాలకవరూథినీ. 45

అహో విధే ర్దుష్కలితం విచేష్టితం యద తరంభోరు వనేవిషీదసి |

విశాల నేత్రే೭೦ధమిమం పతింప్రియే మునిం సమాసాద్య జరాతురం భృశమ్‌. 46

వృథా వృతస్తేన భృశంసశోభ సేనవం వయః ప్రాప్యసునృత్య పండితే |

మనోభ##వేనాశు శరాః సుసంహితాః పతంతి కస్మి న్పతి రీదృశ స్తవ. 47

త్వ మంధభార్యా నవ¸°వనాన్వితా కృతాసి ధాత్రా నను మందబుద్దినా|

నచైన మర్హస్యసితా యతేక్షణ పతిం త్వమన్యం కురు చారులో చనే. 48

వృథైవ తే జీవిత మంబుజేక్షణ పతిం చ సంప్రావ్య మునిం గతేక్షణమ్‌ |

వనే నివాసం చ తథాజినాంబర ప్రధారణం యోగ్యతరం న మన్మహే. 49

అతోనవద్యాం గ్యుభయో స్త్వమేకకం వరం కురుష్వా వహితా సులోచనే |

కిం ¸°వనం మానిని సంకరోషి వృథా మునిం సుందరి సేవమానా. 50

కిం సేవసే భాగ్యవివర్జితం తం సముజ్ఘితం పోషణ రక్షణాభ్యామ్‌ |

త్యక్త్వా మునిం సర్వసుఖాప వర్జితం భజానవద్యాం గ్యుభయోస్త్వమేకమ్‌. 51

త్వం నందనే చైత్రరథే వనే చ కురుష్వకాంతే ప్రథితం విహారమ్‌ |

అంధేన వృద్ధేన కథం హి కాలం వినేష్యసే మానిని మానహీనమ్‌. 52

భూపాత్మజా త్వం శుభలక్షణా చ జానాసి సంసారవిహార భావమ్‌ |

భాగ్యేనహీనావిజనే వనే త్ర కాలం కథం వాహయసే వృథా చ. 53

తస్మా ద్బజస్వ పికభాషిణి చారువక్త్రే ఏకం ద్వయోస్తవ సుఖాయ విశాలనేత్రే |

దేవాలయేషు చకృశోదరి భుంక్ష్వ భోగాం స్త్యక్త్వా మునిం జరఠమాశు నృపేంద్రపుత్రి. 54

కింతే సుఖం యత్రవనే సుకేశి వృద్దేన సార్థం విజనేమృగాక్షి |

సేవా తథాంధస్య నవంవయశ్చ కింతే మతం భూపతి పుత్రిదుఃఖమ్‌. 55

శశిముఖి త్వమతీవ సుకోమలా ఫలజలా హరణం తవనోచితమ్‌. 56

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ సప్తమస్కంధే చతుర్థోధ్యాయః.

భామినీ! నీ వీ వనప్రదేశమునందు మెఱుపుతీగవోలె వెల్గుచున్నావు. దేవగణములందును నీపాటి యందగత్తె కనబడలేదు. నీవు దివ్యమాల్యాంబరంబులు దివ్యనానా భరణములు ధరింపదగినదానవు. నల్లని ముంగురుల దానవు. ఈ నార చీరలు నీకు తగవు. రంభోరూ! విశాలాక్షీ! ముదుసలివానిని గ్రుడ్డివానిని భర్తగబొంది యీ నట్టడివిలో నేల బాధలు పడు చున్నావు? అక్కట విధివిలాసమెంత విపరీతమైనదే! నర్తన చతురులారా! ఇంతటి మిసమిసలాడు నిండుజవ్వనము పొంగులు పారుదానవే! ఆ ముసలిని వరించి యేమి సుఖము బొందుదువు? మన్మథుడు ప్రయోగించినవాడి ముల్కులింకెవ్వనిపై బడును! చారునేత్రీ! నల్లని వాశాలమయిన కురులుకలదానా! అందమైన కనులదానా! విధాత నవ¸°వనమందున్న నిన్ను గ్రుడ్డివానికి భార్యనుగ చేసినాడు. నీకితడు తగిన జంటగాడు. ఇంకొకని పతిగ వరింపుము. కమలనయనా! నీ జీవితమంతయు వ్యర్థమే కదా! ముసలి గ్రుడ్డివానిని భర్తగ బొందుట అరణ్యనివాసము జింకతోలు దాల్చుట ఇవన్నియు నీకు తగినవి గావని దలతుము. మానినీ! సుందరాంగీ! సులోచనా! శుభాంగీ ! ఈ పండుముసలి మునిని వ్యర్థముగా సేవించి నీకేమి సుఖము? దోర వయసును వ్యర్థము చేయకుము. మాలో నొకనిని వరింపుము. శోభనాంగీ! నిన్ను పోషించి రక్షించుటకు చేతకాని వానిని నీలోని కోర్కెలు తీర్చజాలని వానిని భాగ్యహీనుని మునిని వదలి మా యిర్వురిలో నీ నచ్చినవానిని వరింపుము. కాంతా మణీ! మానినీ! ఈ ముసలి చీకుతో కాలమెట్లు గడుపుదువు? నీవు సుందర నందన వనమందు చైత్రరథమునందు స్వేచ్ఛగ విహరింపుము. నీవు రాచపట్టివి. శుభలక్షణవు. ఆలుమగలు కలిసి మెలసి మసలు టెఱిగినదానవు. ఓపలేని వలకాకతో తపించు దానవు. ఈ వనమందు సరిగ తగిన జంటలేక ప్రొద్దెట్లు పోవును? పికవాణీ! ముద్దు పల్కుదాన! రాజకన్య! ముసలి మునిని వదలుము. రారమ్ము. మాలో నొక్కని సేవించుకొమ్ము! స్వర్గమందలి దేవగృహములలో సుఖసీమలలో మైమఱచిపొమ్ము. ఓ రాజకుమారీ! సుకేశీ! మృగాక్షీ! ఈ గ్రుడ్డివృద్దుతో ఈ యొంటరి యడవిలో నీకేమి సుఖము గల్గును? నీ పందెముగాయు పడుచుతన మేడ! ఈ ముదుసలి గ్రుడ్డి సేవ యేడ! దుఃఖములనిన నీ కిష్టమా యేమి? చంద్రముఖీ! నీ నెమ్మేను కుసుమ కోమలము. పండ్లు నీరు తెచ్చుటకు తగినదికాదు.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమున సప్తమ స్కంధమున నాల్గవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters