Sri Devi Bagavatham-2    Chapters   

అథ అష్టమో7ధ్యాయః.

శ్రీనారాయణ ఉవాచ : సరస్వతీ పుణ్యక్షేత్ర మాజగామ చ భారతే | గంగా శాపేన కలయా స్వయం తస్థౌ హరేః పదే. 1

భారతీ భారతం గత్వా బ్రా హ్మీ చ బ్రహ్హణః ప్రియా | వాణ్యధిష్ఠాతృ దేవీసాతేన వాణీ ప్రకీర్తితా. 2

సరోవాప్యాంచ స్రోతసు సర్వత్రైవ హి దృశ్యతే | హరిః సరస్వాం స్త స్యేయం తేన నామ్నా సరస్వతీ. 3

సరస్వతీ నదీసా చ తీర్థరూపా7తిపావనీ | పాపినాం పాపదాహాయ జ్వల దగ్నిస్వరూపిణీ. 4

పశ్చా ద్బా గీరథీనీతా మహీం భగీర థేన చ | సావై జగామ కలయా వాణీశాపేననారద. 5

తత్రైవ సమయే తాంచ దధార శిరసా శివః | వేగం సోఢుమయం శక్తో భువః ప్రార్థనయా విభుః 6

పద్మా జగామ కలయా సా చ పద్మావతీ నదీ | భారతం భారతీ శాపా త్స్వయం తస్థౌ హరేః పదే. 7

తతో7న్యథా సా కలయా లేఖే జన్మ చ భారతే | ధర్వ ధ్వజసుతా లక్ష్మీ ర్విఖ్యాతా తులసీతి చ. 8

పురా సరస్వతీ శా పాత్పశ్చా చ్చ హరి శాపతః | బభూవ వృక్షరూపా సా కలయా విశ్వపావనీ. 9

కలేః పంచసహస్రంచ వర్షం స్థిత్వా చ భారతే | జగ్ము స్తా శ్చ సరి ద్రూపంవిహాయ శ్రీహరేః పదమ్‌. 10

యాని సర్వాణి తీర్థాని కాశీం బృందావనం వినా | యాస్యంతి సార్ధం తాభిశ్చ వైకుంఠ మాజ్ఞయా హరేః. 11

ఎనిమిదవ అధ్యాయము

యుగధర్మాది ప్రతిపాదనము

నారదా! సరస్వతి పుణ్యక్షేత్రమగు భారతదేశమున గంగశాపముచేత నొక్క కళతో నవతరించెను. తక్కిన కళలతో వైకుంఠమందే యుండెను. భారతదేశమునకు దిగి వచ్చుటచే భారతి యనియును బ్రహ్మభార్య యగుటచే బ్రాహ్మియనియును వాగధిష్ఠాతృదేవి అగుటచే వాణి అనియును సరస్వతి పేరు గాంచెను. విష్ణువు సరస్సులలో నదులందు బావులందంతట నిండియుండుటచే ''సరస్వాన్‌'' అనబడును. అతని శక్తి యగుట సరస్వతి యనబరగెను. తీర్థస్వరూపిణి యగు సరస్వతీనది మిక్కిలి పావనమైనది. పాపుల పాపరాసులు కాల్చుటయందు మండుచున్న యగ్ని వంటిది. పిమ్మట సరస్వతి శాపమువలన గంగయు తన యొకే కళతో భగీరథుని ప్రయత్నమున భూలోకమున కవతరించెను. గంగయొక్క ధారను భూమి భరింపజాలనందున భగీరథుని ప్రయత్నముచే శివుడు గంగను తలదాల్చెను. ఆ తరువాత లక్ష్మి భారతీ శాపమువలన నొకే కళతో పద్మావతీ నదిగ నవతరించెను. పూర్ణకళతో హరిసన్నిదిలోనే యుండెను. లక్ష్మి తన వేరొక కళతో ధర్మధ్వజుని కూతురు తలసిగ నవతరించెను. అటుపిమ్మట సరస్వతి శాపమున హరి యానతిచేత లక్ష్మి తన మఱియొక కళతో విశ్వపావనియగు తులసి వృక్షముగ నుద్బవించెను. కలియుగమున నైదు వేలేండ్లు గడచిన మీదట వీరెల్లరును నదీరూపములు వదలి విష్ణు సాన్నిధ్యము చేరగలరు. కాశి బృందావనమను నీ రెండు పుణ్యక్షేత్రములు తప్ప తక్కిన క్షేత్రము లన్నియును హరి యానతిచే విష్ణుపదము చేరగలవు.

శాల గ్రామః శక్తి శివౌ జగన్నాథ శ్చ భారతమ్‌ | కలేర్దశసహహస్రాంతే త్యక్త్వా యాంతి ని జంపదమ్‌. 12

సాధవశ్చ పురాణాని శంఖాని శ్రాద్ధతర్పణ | వేదోక్తానిచ కర్మాణి యయుసై#్తః సార్ధమేవచ. 13

దేవపూజాదేవనామ తత్కీర్తి గుణకీర్తనమ్‌ | వేదాంగాని చ శస్త్రాణి యయుసై#్తః సార్ధమేవచ. 14

సంతశ్చ సత్యం ధర్మశ్చ వేదాశ్చ గ్రామదేవతాః | వ్రతం తపశ్చాన శనం యయుసై#్తః సార్ధమేవచ. 15

వామాచారరతాః సర్వే మిథ్యా కపటసంయుతాః | తులసీ రహితా పూజా భవిష్యతి తతః పరమ్‌. 16

శఠాః క్రూరా దాంభికాశ్చ మహాహంకార సంయుతాః | చోరాశ్చ హింసకాః సర్వే భవిష్యంతి తతః పరమ్‌. 17

పుంసో భేదః స్త్రీవిభేదో వివాహోవా7పి నిర్బయః | స్వస్వామిభేదో వస్తూనాం భవిష్యతి తతః పరమ్‌. 18

సర్వే స్త్రీవశగాః పుంసః పుంశ్చల్యశ్చ గృహే గృహే | తర్జనైర్బర్త్సనైః శశ్వ త్స్వామినం తాడయంతిచ. 19

గృహేశ్వరీ చ గృహిణి గృహీ భృత్యాధి కో7ధమః | చేటీ దాససమౌవధ్వాః శ్వశ్రూశ్చశ్వశుర స్తథా. 20

కర్తారో బలినో గేహే యోనిసంబంధిబాంధవాః | విద్యాసంబంధిభిః సార్ధం సంభాషా7పిన విద్యతే. 21

యథా7పరిచితాలోకా స్తథా పుంసశ్చ బాంధవాః | సర్వ కర్మాక్షమాః పుంసో యోషితా మాజ్ఞయా వినా. 22

సాలగ్రామము శక్తి శివుడు జగన్నాథుడును కలికాలమున పది వేలేండ్లు గడచిన పిమ్మట తమ తమ నెలవులు చేరుకొనగలవు. వారి వెంట పరమసాధువులు పురాణములు వేదోక్తకర్మలు శంఖములు శ్రాద్ధతర్పణములు నన్నియును వెళ్ళిపోవును. వానివలె దేవపూజలు దేవగుణ కీర్తనలు శ్రీహరి నామము వేదాంగములు శాస్త్రము లన్నియును లోపించును. వానితో బాటు సజ్జనులు సత్యధర్మములు వేదాలు గ్రామదేవతలు తపోవ్రతములు నుపవాసములు నన్నియును రూపుమాసిపోవును. ఎల్ల రును వామాచారపరులు కపట మిథ్యావర్తనులు నగుదురు. తులసి పూజలు జరుగవు. తరువాత నెల్లవారును క్రూరును శఠులు డాంబికులు దొంగలు హింసకులు నహంకారులు నగుదురు. స్త్రీ పురుషులలో భేదాభిప్రాయములు సేవకునకు యజమానునకు మధ్య భేదాలు గల్గును. భయములేని వివాహములు జరుగును. పురుషులు స్త్రీవశు లగుదురు. ఇంటింట వ్యభిచారిణు లుందురు. స్త్రీలు తర్జనభర్జనలచే భర్తలను దండింతురు. ఇల్లాలింటి కధిపతి గాగలదు. ఆమె ముందు యజమానుడు దాసుని కన్న నధ ముడుగ మెలగును. కోడలి ముందట నత్తమామలు పరిచారకులుగ నుందురు. ఇంటిలో స్త్రీ తోడబుట్టిన వారు పెత్తనము సాగింతురు. చదువుకొనిన వారిలో నైకమత్య మడుగంటును. మగవాని వైపువార లపరిచితు లగుదురు. స్త్రీ యానతి లేనిదే పురుషు డే పనియును జేయజాలడు.

బ్రహ్మక్షత్ర విశః శూద్రా జాత్యాచార వివర్జితాః | సంధ్యా చ యజ్ఞసూత్రం చ భ##వేల్లుప్తం న సంశయః. 23

వ్లుెచ్బాచారా భవిష్యంతి వర్ణాశ్చత్వార ఏవ చ | వ్లుెచ్ఛశాస్త్రం పఠిష్యంతి స్వశాస్త్రాణివిహాయ చ. 24

బ్రహ్మక్షత్రవిశాం వంశాః శూద్రాణాం సేవకాః కలౌ | సూపకారా ధావకాశ్చ వృషవాహాశ్చ సర్వశః. 25

సత్యహీనా జనాః సర్వే సస్యహీనా చ మేదినీ | ఫలహీనా శ్చ తరవో7పత్యహీనా శ్చ యోషితః. 26

క్షీరహీనా స్తథా గావఃక్షీరం సర్పిర్వివర్జితమ్‌ | దంపతీ ప్రీతిహీనౌ చ గృహిణః సత్యవర్జితాః. 27

ప్రతాపహీనా భూపాశ్చ ప్రజా శ్చ కరపీడితాః | జలహీనా మహానద్యో దీర్ఘికా కందరాదయః. 28

ధర్మహీనాః పుణ్యహీనా వర్ణా శ్చత్వార ఏవ చ | లక్షేషు పుణ్యవాన్కో7పి నతిష్ఠతి తతః పరమ్‌. 29

కుత్సితా వికృతాకారా నరా నార్య శ్చ బాలకాః | కువార్తా కుత్సితః శబ్ధో భవిష్యతి తతః పరమ్‌. 30

కేచి ద్గ్రామాశ్చ నగరా నరశూన్యా భయానకాః | కేచి త్స్వల్పకుటీరేణ నరేణ చ సమన్వితాః. 31

అరణ్యాని భవిష్యంతి గ్రామేషు నగరేషు చ | అరణ్య వాసినః సర్వే జనాశ్చ కరపీడితాః. 32

సస్యాని చ భవిష్యంతి తడాకేషు నదీషు చ | ప్రకృష్ట వంశజా హీనా భవిష్యంతి కలౌయుగే. 33

బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు మున్నగు జాతు లుండవు. సంధ్యావందనము జందెములు మచ్చునకైన కనిపించవు. నాలుగు వర్ణములవారును వ్లుెచ్ఛవర్తను లగుదురు. వారు తమ శాస్త్రములు వదిలి వ్లుెచ్ఛశాస్త్రములు చదువుదురు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులును శూద్రుల సేవకులై శూద్రుల వంటలు చేయువారై శూద్రులు వస్త్రముల శుభ్రపరచుచు శూద్రుల బండ్లు ఎద్దులను లాగించుచుందురు. ఎల్లెడల సత్యములేని ప్రజలును పాడిపంటలులేని భూమియును పండ్లులేని చెట్లను పుత్రులులేని స్త్రీలు నుందురు. పాలులేని యావులు వెన్నలేని పాలు ప్రేమలులేని భార్యాభర్తలు సత్యము పాటించని గృహస్థులు నుందురు. రాజులు ప్రతాపశూన్యులు; ప్రజలు పన్నుల భారము భరింపలేనివారు; నీరులేని నదులు బావులు గుహలు నెల్లెడల నుండును. నాలుగు వర్ణములవారును పుణ్యధర్మములు లేనివారై యుందురు. లక్షమందిలో పుణ్యశీలు డెవ్వడో యొక్క డుండును. ఎల్ల స్త్రీ పురుషులు చిన్న పిల్లలును కుచ్చితులు వికారరూపులునై యుందురు. చెడువార్తలు కుచ్చితాల మాటలు తప్ప వారి నోట మంచి మాటలు రానేరావు. కొన్ని గ్రామములు నగరములును జనసంచారము లేకుండును. కొన్నిచోట్ల చిన్న చిన్న గుడిసెలు నందు క్రిక్కిరిసిన జనము నుండును. గ్రామములందు నగరములందు నడవులు ఏర్పడును. కృషకులు పన్నులు చెల్లించలేక బాధలు పడుదురు. వానలు లేనందున చెఱు వులు నదులును పంట పొలాలగును. ఉన్నత వంశములోనివారును కలిలో నీచు లగుదురు.

అలీకవాదినో ధూర్తాః శఠా శ్చా సత్య వాదినః | ప్రకృష్టాని చ క్షేత్రాణి సస్యహీనాని నారద. 34

హీనాః ప్రకృష్టా ధనినో దేవభక్తాశ్చ నాస్తికాః | హింసకా శ్చ దయాహీనాః పౌరా శ్చ నరఘాతినః. 35

వామనా వ్యాధియుక్తా శ్చ నరా నార్య శ్చ సర్వతః | స్వల్పాయుషో గదాయుక్తా ¸°వనైరహితాః కలౌ. 36

పలితాః షోడశే వర్షే మహా వృద్ధా శ్చ వింశతౌ | అష్టవర్షా చ యువతీ రజోయుక్తా చ గర్బిణీ. 37

వత్సరాంతప్రసూతా స్త్రీ షోడ శే చ జరాన్వితా | పతిపుత్రవతీ కాచి త్సర్వా వంధ్యాః కలౌయుగే. 38

కన్యావిక్రయిణః సర్వే వర్ణా శ్చత్వార ఏవచ | మాతృజాయా వధూనాం చ జారోపేతాన్నభక్షకాః. 39

కన్యానాం భగినీనాం వా జారోపాత్తాన్న జీవినః | హరేర్నామ్నాం విక్రయిణో భవిష్యంతి కలౌయుగే. 40

స్వయ ముత్సృజ్య దానంచ కీర్తివర్ధనహేతవే | తతః పశ్చా త్స్వ దానం చ స్వయముల్లంఘయిష్యతి. 41

దేవవృత్తిం బ్రహ్మ వృత్తిం వృత్తిం గురు కులస్య చ | స్వదత్తాం పరదత్తాం వా సర్వముల్లంఘయిష్యతి. 42

కన్యకాగామినః కే చి త్కేచి చ్చ శ్వశ్రుగామినః |కే చి ద్వధూగామినశ్చ కేచిద్వై సర్వగామినః. 43

భగినీ గామినః కేచి త్సపత్నీ మాతృ గామినః | భ్రాతృజాయా గామినశ్చ భవిష్యంతి కలౌ యుగే. 44

ఎల్లరును మాయలు పన్నువారే; అసత్యము లాడువారే; శఠులే మోసగాండ్రే; మంచిపొలములందును పంటలు పండవు. బాగుగ కలిమిగలవారును పేదవారుగను శక్తులు నాస్తికులుగ నగుదురు. పౌరులు హింసకులు నరహంతకులు దయా హీనులుగ నుందురు. కలియుగమునందు స్త్రీ పురుషులు పొట్టివారుగ వ్యాధిగ్రస్తులుగ అల్పాయుష్కులుగ నిండు పరువము నందే ¸°వనశక్తిరహితులుగ నుందురు. పదారేండ్లకే వెండ్రుకలు తెల్లపడును; ఇరువదేండ్లకే ముసలితనము వచ్చును. ఎనిమి దేండ్ల బాలిక యువతియై రజస్వలయై గర్బిణి యగును. ప్రతి యేడును పిల్లలను కని పదారేండ్లకే స్త్రీలు ముసలమ్మ లగు దురు. కలియుగములో పతిపుత్రులుగల స్త్రీ యెవరో యొకతె యుండును. ఎక్కువమంది స్త్రీలు సంతానము లేకుందురు. నాల్గు వర్ణములవారును కన్నెల నమ్ముకొందురు. తల్లికూతుళ్ళు వ్యభిచారముతో జీవింతురు. తల్లి కూతును అత్త కోడలిని వ్యభిచార వృత్తికి దింపును. మిండగాండ్రచేత పోషింపబడుదురు. కలియుగమున హరినామమును విక్రయింతురు. కీర్తికొఱకు దానముచేసి మఱల నా దానమును తీసికొందురు. తాముగాని పరులుగాని దేవ బ్రాహ్మణులకు గురుకులముల కిచ్చిన వృత్తులను తిరిగి పుచ్చుకొందురు. కూతుతోను అత్తతోను కోడళ్ళతోను పురుషులు వ్యభిచారము చేయుదురు. మఱికొందఱట్టి వారితోనైనను వలపు దీర్చుకొందురు. మఱికొంద ఱక్కచెల్లెండ్రతోను సవతి తల్లులతోను వదినలతోను వ్యభిచరింతురు.

ఆగమ్యాగమనం చైవ కరిష్యంతి గృహే గృహే | మాతృయోనిం పరిత్యజ్య విహరిష్యంతి సర్వతః. 45

పత్నీనాం నిర్ణయోనాస్తి భర్తౄణాంచ కలౌయుగే | ప్రజానాం చైవగ్రామాణాం వస్తూనాం చ విశేషతః. 46

అలీకవాదినః సర్వే సర్వే చోరాశ్చలంపటాః | పరస్పరం హింసకాశ్చ సర్వే చ నరఘాతినః. 47

బ్రహ్మక్షత్ర విశాం వంశా భవిష్యంతి చ పాపినః | లాక్షాలోహరసానాం చ వ్యాపారం లవణస్య చ. 48

వృషవాహా విప్రవంశాః శూద్రాణాం శవదాహి నః | శూద్రాన్న భోజినః సర్వే సర్వేచ వృషలీరతాః. 49

పంచ యజ్ఞ విహీనాశ్చ కుహూరాత్రౌచ భోజినః | యజ్ఞ సూత్ర విహీనాశ్చ సంధ్యాశౌచ విహీనకాః. 50

పుంశ్చలీ వార్ధుషాజీవా కుట్టనీ చ రజస్వలా | విప్రాణాం రంధనాగారే భవిష్యతి చ పాచికా. 51

అన్నానాం నియమో నాస్తి యోనీనాం చ విశేషతః | ఆశ్రమాణాం జనానాంచ సర్వేవ్లుెచ్ఛాఃకలౌయుగే. 52

ఏవం కలౌ సంప్రవృత్తే సర్వం వ్లుెచ్ఛమయం భ##వేత్‌ | హస్త ప్రమాణ వృక్షే చ అంగుష్ఠేచైవమానవే. 53

విప్రస్య విష్ణుయశసః పుత్రః కల్కి ర్బవిష్యతి | నారాయణకళాంశశ్చ భగవాన్బలినాం వరః. 54

దీర్ఘేణ కరవాలేన దీర్ఘఘోటకవాహనః | వ్లుెచ్ఛ శూన్యాం చ పృథి వీం త్రిరాత్రేణ కరిష్యతి. 55

ఇంటింట కన్నతల్లితోతప్ప ప్రతిదానితోను పురుషులు వ్యభిచారము చేయుదురు. ఇతడే నా పతియనికాని ఈమెయే నా పత్నియనికాని ప్రత్యేకముగ నియమము లుండవు. ఎవరి దే గ్రామము ఏ ప్రజ లెవరివారు ఏ వస్తు వెవరిదను నిర్ణయ మేమియు నుండదు. అందఱును మిథ్యావాదులు దొంగలు లంపటులు పరస్పర హింసకులు పరహంతలు నగుదురు. బ్రహ్మక్షత్రవైశ్య కులములు పాపభూయిష్ఠము లగును. వారు లక్కఇనుము ఉప్పురసముల వ్యాపారము చేతురు. విప్రులు బండ్లు లాగుదురు; శూద్రులు శవములను దహనము చేతురు; ఎల్లరును శూద్రాన్నము తిందురు. శూద్ర స్త్రీలయందు ఆసక్తు లగుదురు. ప్రజలు పంచయజ్ఞములు పాటింపరు; విప్రులు చంద్రుడు కనబడనిఅమావాస్య రాత్రియందును భుజింతురు; జందెము సంధ్యా వందనము శౌచమును వదిలిపెట్టుదురు. ఋణ గ్రస్తులు రజస్వలలువిధవలుజారిణులును విప్రులకు వంటలవారై యుందురు. అన్నపు నియమములు యోని నియమములు ఆశ్రమ నియమములును కలియుగమం దుండవు. ఎల్లరు వ్లుెచ్ఛవర్తను లగుదురు. ఇట్లు కలి తాండవించగ నంతయును వ్లుెచ్చమయ మగును. చెట్టు చేయంత పొడవు నరుడు బొటనవ్రేలంతయు నుండును. అట్టి సమయమునందు మహావిక్రముడగు నారాయణుడు తన కళాంశమున విష్ణుయశసుడను వాని కొడుకుగ కల్క్యవతారము దాల్చగలడు. అత డొక గుఱ్ఱ మెక్కి పెద్దకత్తితో మూడు రాత్రులలోనే భూమిపై వ్లుెచ్ఛుడనువాడు లేకుండు నట్లు చేయ గలడు.

నిర్ల్మే చ్ఛాం వసుధాం కృత్వా చాంతర్ధానం గమిష్యతి | అరాజకా చ వసుధా దస్యుగ్రస్తా భవిష్యతి. 56

స్థూలా ప్రమాణష డ్రాత్రం వర్షధారాప్లుతా మహీ | లోకశూన్యా వృక్షశూన్యా గృహశూన్యా భవిష్యతి. 57

తత శ్చ ద్వాదశాదిత్యాః కరిష్యంత్యుదయం మునే | ప్రా ప్నోతి శుష్కతాం పృథ్వీ సమా తేషాం చ తేజసా. 58

కలౌ గతే చ దుర్దర్షే ప్రవృత్తే చ కృతే యుగే | తపః సత్త్వ సమాయుక్తో ధర్మః పూర్ణో భవిష్యతి. 59

తపస్విన శ్చ ధర్మిష్ఠా వేదజ్ఞా బ్రాహ్మణా భువి | పతివ్రతా శ్చ ధర్మిష్ఠా యోషిత శ్చ గృహేగృహే. 60

రాజానః క్షత్రియాః సర్వే విప్రభక్తా మనస్వినః | ప్రతాపవంతో ధర్మిష్ఠాః పుణ్యకర్మరతాః సదా. 61

వైశ్యా వాణిజ్యనిరతా విప్రభక్తాశ్చ ధార్మకాః | శూద్రా శ్చ పుణ్యశీలా శ్చ ధర్మిష్ఠా విప్రసేవినః. 62

విప్రక్ష త్ర విశాం వంశా దేవీభక్తి పరాయణాః | దేవీమంత్రరతాః సర్వే దేవీధ్యాన పరాయణాః. 63

శ్రుతిస్మృతి పురాణజ్ఞా పుమాంసోఋతుగామినః | లేశోనాస్తి హ్యధర్మస్య పూర్ణోధర్మః కృతే యుగే. 64

ధర్మ స్త్రి పాచ్చ త్రేతాయాం ద్విపాచ్చ ద్వాపరే తతః | కలౌ వృత్తేచైకపాచ్చ సర్వలుప్తి స్తతః పరమ్‌. 65

వారాః సప్త తథా విప్ర తిథయః షోడశ స్మృతాః | తథా ద్వాదశమాసాశ్చ ఋతవశ్చ షడేవ చ. 66

అత డట్లు నేలపై వ్లుెచ్చుల నెల్ల సంహరింపగ భూమి యరాజకమై రాక్షసులతో నిండిపోవును. ఆరునాళ్ళు తీవ్ర వర్షము కుండపోతగ కురియుటవలన భూమి జలమయ మగును. మనుష్యులు చెట్లు గ్రహము లేవియును గుర్తుపట్టుటకు వీలు గాకుండును. ద్వాదశాదిత్యు లొకేసారి ప్రకాశింపగనేల యంతయు నెండిపోయి సమముగ నగును. ఘోర కలియుగ మంతరించును. సత్యమైన కృతయుగము ప్రారంభమగును; సాత్త్విక తపము సాగును; ధర్మము నాల్గు పాదముల నడచును. విప్రులు తాపసులుగ వేదనిష్ఠుగ ధర్మ నిష్ఠులుగ నగుదురు. ఇంటింట స్త్రీలు పతివ్రతా ధర్మములు పాటింతురు. అత్తఱి క్షత్రియులు రాజులై పాలకులై విప్రభక్తులై విచారశీలురై ప్రతాపవంతులై పుణ్యధర్మరతులై ప్రవర్తిల్లుదురు. వైశ్యులు విప్రభక్తులై వర్తకము చేయుచు ధర్మపరు లగుదురు. శూద్రులు ధర్మిష్ఠులు పుణ్యశీలురు విప్ర సేవాపరులు నగుదురు. అప్పుడే బ్రహ్మ క్షత్రియ వైశ్యవంశముల వారెల్లరును శ్రీమాతృదేవీ భక్తిపరాయణులై దేవీమంత్రపరులై శ్రీదేవీ ధ్యానతత్పరులై వెల్గుచుందురు. పురుషులు శ్రుతి స్మృతి పురాణవేత్తలును ఋతుకాలమందే భార్యాగాములును నగుదురు. అధర్మము లేశమాత్రమును కనిపించదు. కృతయుగమున ధర్మము పూర్ణముగ నడచును. ధర్మము త్రేతాయుగ మున మూడు పాదములుగను ద్వాపరయుగమందు రెండు పాదములుగ కలియుగమునం దొక పాదముతోను తర్వాత శూన్యముగ నడచును. ఓయి నారదా | వారము లేడు; తిథులు పదారు; నెలలు పండ్రెండు; ఋతువు లారు.

ద్వౌ పక్షౌ చాయనే ద్వేచ చతుర్బిః ప్రహరై ర్దినమ్‌ | చతుర్బిః ప్రహరై రాత్రి ర్మాస స్త్రింశద్దినై స్తథా. 67

వర్షం పంచవిధం జ్ఞేయం కాలసంఖ్యావిధిక్రమే | యథా చా77యాంతి యాంత్యేవ యథా యుగచతుష్టయమ్‌. 68

వర్షే పూర్ణే నరాణాంచ దేవానాంచ దివానిశమ్‌ | శతత్రయే షష్ట్యధికే నరాణాంచ యుగే కృతే. 69

దేవానాం చ యుగం జ్ఞేయం కాలసంఖ్యావిదాం మతమ్‌ | మన్వంతరం తు దివ్యానాం యుగానా మేకసప్తతిః. 70

మన్వంతర సమం జ్ఞేయమాయుష్యం చ శచీపతేః | అష్టావింశతిమే చేంద్రే గతే బ్రహ్మదివానిశమ్‌. 71

అషోత్తరశ##తే వర్షే గతే పాతశ్చబ్రహ్మణః | ప్రలయః ప్రాకృతో జ్ఞేయ స్తత్రా7దృష్టా వసుంధరా. 72

జల ప్లుతాని విశ్వాని బ్రహ్మవిష్ణు శివాదయః | ఋషయో జ్ఞానినః సర్వే లీనాః సత్యేచిదాత్మని. 73

తత్రైవ ప్రకృతి ర్లీనా తత్రప్రాకృతికోలయః | లయే ప్రాకృతికే జాతేయాతే చ బ్రహ్మణోమునే. 74

నిమేషమాత్రం కాలశ్చ శ్రీదేవ్యాః ప్రోచ్యతే మునే | ఏవం నశ్యంతి సర్వాణి బ్రహ్మాండాన్యఖిలానిచ. 75

నిమేషాంతరకాలేన పునఃసృష్టి క్రమేణ చ | ఏవం కతి విధా సృష్టి ర్లయః కతివిధో7పివా. 76

కతి కల్పా గతా యాతాః సంఖ్యాం జానాతి కః పుమాన్‌ | సృష్టీనాంచ లయానాంచ బ్రహ్మాండానాంచ నారద.

పక్షములు రెండు; అయనములు రెండు; పగలు నాల్గు జాములు రేతిరి నాల్గుజాములు; నెలకు ముప్పది నాళ్లు. కాలసంఖ్యను లెక్కించునపు డైదు విధములగు సంవత్సరములను లెక్కింతురు. యుగముల మాదిరిగవారము మున్నగునవి క్రమముగ వచ్చుచు బోవుచుండును. నరులకు నూఱండ్లకాలము దేవతలు కొక దినము; మూడు వందల యరువది మానవ యుగములు కడచిపోయినచో దేవతల కొక యుగ మగును. డెబ్బదియొక్క మహాయుగములు గతించగ నొక మన్వంతర మగునని కాలవిదు లందురు. ఒక మన్వంతర కాల మొక యింద్రుని పూర్ణాయువగును. ఇరువదెనిమిది మంది యింద్రుల కాలము బ్రహ్మ కొక్క నాడగును. ఈ విధముగ నూట యెనిమిది సంవత్సరములు బ్రహ్మకు పూర్ణాయువు. బ్రహ్మకాయువు నిండగనే ప్రాకృత ప్రళయము సంభవించును. అపు డీ భూమి కనిపించదు. విశ్వమందలి ప్రాణులు జలములో గలిసిపోదురు. బ్రహ్మ విష్ణు శివుడు ఋషులు జ్ఞానులు నెల్లరును సచ్చిదానంద బ్రహ్మమందు లయ మందుదురు. ఓ మునీ శ్వారా! ఇట్లు ప్రకృతి యంతయు లయమగుట ప్రాకృత ప్రళయ మనబడును. ప్రాకృత ప్రళయమున బ్రహ్మ కాయువు తీరును. మునీ! అపుడు శ్రీదేవి కొక ఱప్పపాటు కాలమగును. ఈ విధముగ బ్రహ్మాండము లన్నియును నశించును. దేవికి మఱియొక ఱప్పపాటుకాలములో సృష్టికార్యము మరల సాగును. ఇట్లు లెన్నియోసార్లు సృష్టి మరల లయము జరుగు చుండును. ఓయి నారదా! ఈ బ్రహ్మాండముల సృష్టి లయము లెన్నిసార్లు జరిగినవి; ఎన్ని కల్పములు గతించినవి; ఎన్ని పుట్టినవి; వీని లెక్క యెవడును కనిపెట్టలేడు.

బ్రహ్మాదీనాంద బ్రహ్మాండే సంఖ్యాం జానాతి కః పుమాన్‌ | బ్రహ్మడానాం చ సర్వేషామీశ్వరశ్చైక ఏవసః. 78

సర్వేషాం పరమాత్మా చ సచ్చిదాంనందరూప ధృక్‌ | బ్రహ్మాదయ శ్చ తస్యాంశా స్తస్యాంశశ్చ మహావిరాట్‌. 79

తస్యాంశశ్చ విరాట్‌క్షుద్రః సైవేయం ప్రకృతిః పరా | తస్యాః సకాశాత్సంజాతో7ప్వర్ధ నారీశ్వర స్తతః. 80

సైవ కృష్ణో ద్విధాభూతో ద్విభుజశ్చ చతుర్బుజః | చతుర్బుజశ్చ వైకుంఠే గోలోకే ద్విభుజః స్వయమ్‌. 81

బ్రహ్మాదితృణపర్యం తం సర్వే ప్రాకృతికం భ##వేత్‌ | యద్యత్ప్రాకృతికం సృష్టం సర్వం నశ్వరమేవచ. 82

ఏవం విధం సృష్టిహేతుం సత్యం విత్యం సనాతనమ్‌ | సేచ్ఛామయం పరం బ్రహ్మ నిర్గుణం ప్రకృతేః పరమ్‌. 83

నిరుపాధి నిరాకారం భక్తునుగ్రహ కాతరమ్‌ | కరోతి బ్రహ్మా బ్రహ్మాండం యద్‌జ్ఞానాత్కమలోద్బ వః. 84

శివో మృత్యుంజయశ్చైవ సంహర్తా సర్వసత్త్వవిత్‌ | యద్‌జ్ఞానాదస్య తపసా సర్వేశస్తుతపోమహాన్‌. 85

మహావిభూతి యుక్తశ్చ సర్వజ్ఞః సర్వదర్శనః | సర్వవ్యాపీ సర్వపాతా ప్రదాతా సర్వసంపదామ్‌. 86

విష్ణుః సర్వేశ్వరః శ్రీమా న్యద్బక్త్యా తస్యసేవయా | మహామాయా చ ప్రకృతిః సర్వశక్తి మయీశ్వరీ. 87

సైవప్రోక్తా భగవతీ సచ్చి దానందరూపిణీ | యద్‌జ్ఞానాద్యస్యతపసా మద్బక్త్యాయస్య సేవయా. 88

బ్రహ్మాండముల లెక్కలే తెలియనప్పుడు వానియందలి త్రిమూర్తుల లెక్కలెట్లు తెలియగలవు! కాని యీ బ్రహ్మండ కోటుల కన్నిటికి నధీశ్వరుడు మాత్ర మొక్కడే కలడు! అన్నిటికి పరమాత్మ సచ్చిదానందరూపుడు-మూలకారణము. బ్రహ్మాదులెల్లరు నా పరమాత్మునంషమున జన్మించినవారలే; మహావిరాట్టును పరమాత్మాంశముచే గల్గెను. క్షుద్రవిరాట్టును బ్రహ్మాంశ##మే. ఆ బ్రహ్మామే పరాప్రకృతి. పరాప్రకృతి పరాత్మలనుండి యర్ధనారీశ్వరుడగు శ్రీకృష్ణుడవతరించెను. శ్రీ కృష్ణుడు రెండు రూపులుదాల్చెను. రెండు భుజములతో గోలోకముందును నాల్గుబాహువులతో వైకుంఠ మందును విరాజిల్లు చుండును. బ్రహ్మమొదలుకొని గడ్డిపోచ వఱకున్న దంతయును ప్రకృతి యనబడును. ప్రాకృతిక సృష్టియంతయును నశ్వర మగును. ఇట్లు ప్రకృతి సృష్టికారణమగును. పరమగు నిత్యసత్యవస్తువు సనాతనమైనది స్వతంత్రము నిర్గుణము పర బ్రహ్మము. బ్రహ్మము నిరూపాధికము నిరాకారము భక్తానుగ్రహకారకము; ఇట్టి బ్రహ్మజ్ఞానము వలననే బ్రహ్మ యెల్ల బ్రహ్మాండముల రచించుచుండును. శివుడును బ్రహ్మ జ్ఞానమున బ్రహ్మతపమున సర్వేశ్వరుడు మహాత్ముడునగును. శివుడు మహావిభూతియుతుడు సర్వజ్ఞుడు సచర్వదర్శనుడు సర్వవ్యాపి సంహర్త సకలసంపద లొసగువాడునగును. పరబ్రహ్మసేన వలన భక్తివలన విష్ణువు సర్వేశ్వరుడు శ్రీమంతుడునగును. మహామాయా ప్రకృతియును బ్రహ్మజ్యోతివలననే సర్వశక్తిమయి సర్వేశ్వరియైనది. శ్రీ దుర్గాదేవి బ్రహ్మమునారాధించి సేవించి తెలిసికొనుటవలననే సచ్చిదానందస్వరూపిణిగ భగవతిగ ప్రసిద్ధిగాంచెను.

సావిత్రీ వేదమాతా చ వేదాధిష్ఠాతృ దేవతా | పూజ్యా ద్విజానాం వేదజ్ఞా యద్‌జ్ఞానా ద్యస్య సేవయా. 89

సర్వవిద్యాధిదేవీ సా పూజ్యాచ విదుషాం పరా | యత్సేవయా యత్తపసా సర్వవిశ్వేషు పూజితా. 90

సర్వగ్రామాధి దేవీ సా సర్వ సంపత్ర్పదాయినీ | సర్వేశ్వరీ సర్వవంద్యా సర్వేషాం పుత్రదాయినీ. 91

సర్వస్తుతా చ సర్వజ్ఞా సర్వ దుర్గార్తినాశినీ |కృష వామాంస సంభూతా కృష్ణప్రాణాధి దేవతా. 92

కృష్ణప్రాణాదికా ప్రేవ్ణూ రాధికాశక్తి సేవయా | సర్వధికం చ రూపం చ సౌభాగ్యం మానగౌరవే. 93

కృష్ణ వక్షః స్థలస్థానం పత్నీత్వే ప్రావ సేవయా | తపశ్చకార సా పూర్వం శతశృంగే చ పర్వతే. 94

దివ్య వర్షసహస్రంచ పతిప్రాప్త్యర్థమేవ చ | జాతే శక్తి ప్రసాదే తు దృష్ట్వా చంద్రకళో పమామ్‌. 95

కృష్ణో వక్షఃస్థలేకృత్వా రురోద కృపయా విభుః | వరం తసై#్య దదౌ సారం సర్వేషామపి దుర్లభమ్‌. 96

మమ వక్షః స్ధలే తిష్ఠ మమ భక్తా చ శాశ్వతీ | సౌభాగ్వేన చ మానేన ప్రేవ్ణూ7థో గౌరవేణ చ. 97

త్వం మే శ్రేష్ఠా చ జ్యేష్ఠాచ ప్రేయసీ సర్వయోషితామ్‌ | వరిష్ఠాచ గరిష్ఠాచ సంస్తుతా పూజితా మయా. 98

సతతం తవ సాధ్యో హం వశ్యశ్చ ప్రాణవల్లభే | ఇత్యుక్త్వా చ జగన్నాథ శ్చ కారలలనాంతతః. 99

సావిత్రియును బ్రహ్మాజ్ఞానమువలననే వేదవిదురాలు వేదమాత వేదాధిష్ఠానదేవి విప్రపూజ్యయై వన్నెకెక్కెను. పరాప్రకృతి సేవవలన సావిత్ర సర్వవిద్యాధిదేవి విశ్వపూజిత పండితమాన్య యైపేరెన్ని కగనెను. లక్ష్మియును శ్రీదేవి దయ వలననే సర్వగ్రామాధిదేవి సర్వసంపత్ప్రదాయిని సర్వేశ్వరి సర్వవంద్య యెల్లరికి పుత్రప్రదాయినియై వెల్లుచున్నది. దుర్గ శ్రీకృష్ణుని యెడమ భుజమునుండి యుద్బవించి సర్వజ్ఞ సర్వస్తుత సర్వకష్టనివారిణి కృషుని ప్రాణా దిష్టానదేవియై పేరొందెను. ఇక రాధిక శ్రీకృష్ణుని ప్రాణాధిక ప్రియురాలు సర్వాధిక రూపమాధుర్యము సౌభాగ్యము మానగౌరవములుగలది. రాధ శ్రీకృష్ణుని ఱొమ్మునివాసముగ చేసికొని యతని భార్యయైయుండెను. దీనికంతటికిని రాధమునుపు శతశృంగగిరిపై పరాప్రకృతిని గూర్చి చేసిన తీవ్రతపమే మూలకారణము. రాధవేయిదివ్య సంవత్సరములు పతిప్రాప్తికి తపించగమూల ప్రకృతి ప్రసన్న యయ్యెను. రాధచంద్రకళవలె చల్లనిది ప్రసన్నరూపిణి. ఆమెను శ్రీకృష్ణుడు తన వక్షమున నుంచుకొని యెవ్వరికిని సాధ్యము గాని దుర్లభ##మైన వరములిట్లొసంగెను. రాధికా! నీవు నాయందు భక్తిగల్గి నావక్షముపై నిత్యనివాసముండుము. నీవు సౌభాగ్యమున మానగౌరవములందు ప్రేమలో తక్కిన స్త్రీలందఱికంటె మిన్నవు. కడుంగడు శ్రేష్ఠురాలవు. గరిష్ఠవు వరిష్ఠవు; నాచేత సంస్తుతింపబడి పూజింపబడుదువు. ప్రేయసీ! నేను సంతతము నీకువశుడనై నీయధీనమున నుందును అని కృష్ణుడు రాధతో బలికెను.

సవత్వీరహితాం తాంచ చకార ప్రాణవల్లభమ్‌ | అన్యా యా యాశ్చ తా దేవ్యః పూజితాః శక్తి సేవయా. 100

తపస్తు యాదృశ్యం యాసాం తాదృక్తాదృ క్పల ం మునే | దివ్యం వర్శసహస్రంచ తప స్తప్త్వా హిమాచలే. 101

దుర్గా చ తత్పదం ధ్యాత్వా సర్వపూజ్యా బభూవ హి | సరస్వతీ తపస్తప్త్వా పర్వతే గంధమాదనే. 102

లక్షవర్షం చ దివ్యం చ సర్వవంద్యా బభూవ సా | లక్ష్మీ ర్యుగశతం దివ్యం తపస్తప్త్వా చ పుష్కరే. 103

సర్వసంపత్ప్రదాత్రీ చ జాతా దేవీనిషేవణాత్‌ | సావిత్రీ మలయే తప్త్వా పూజ్వా వం ద్యా బభూవ సా. 104

షష్టి వర్షసహస్రం చ దివ్యం ధ్యాత్వా చ తత్పదమ్‌ | శతమన్వంతరం తప్తం శంకరేణ పురా విభో. 105

శతమన్వంతరం చేదం బ్రహ్మా శక్తిం బజాప హ | శతమన్వంతరం విష్ణు స్తప్త్వా పాతా బభూవ హ. 106

దశమన్వంతరం తప్త్వా శ్రీకృష్ణః పరమం తపః | గోలోకం ప్రాప్తదా న్దివ్యం మోదతే7ద్యాపి త్రహ 107

దశమన్వంతరం ధర్మస్తప్త్వావై భక్తి సంయుతః | సర్వప్రాణః సర్వపూజ్యః సర్వాధారో బభూవ సః. 108

ఏవం దేవ్యశ్చ తపసా సర్వే దేవాశ్చ పూజితాః | మునయో మనవో భూపా బ్రహ్మణాశ్చైవపూజితాః. 109

ఏవం తే కథితం సర్వం పూరాణం స యథాగమమ్‌ | గురువక్క్రాద్యథా జ్ఞాతం కిం భూయః శ్రోతుమిచ్ఛసి. 110

ఇతి శ్రీ దేవి భాగవతే మహాపురాణ నవమస్కంధే7ష్టమో7ధ్యాయః.

కృష్ణుడు రాధను సవతులులేని ప్రాణవల్ల భగచేసెను. ఇతరదేవతలెల్లరును శక్తి సేవచేతనే పూజితులైరి. మునీ! తపమెట్టిదో ఫలమట్టిదే లభించును. పూర్వము గిమగిరిపై దుర్గ వేయిదివ్య వర్షములు తపించెను. దుర్గ పరాప్రకృతిని ధ్యానించి సర్వపూజనీయ య్యెను. సరస్వతి గంధమాదన గిరిపై తపమొనరించెను. ఆమె లక్ష దివ్యవర్షములు తపించి సర్వవంద్య యయ్యెను. లక్ష్మి పుష్కరతీర్ధమున నూఱు దివ్య సంవత్సరములు పరాప్రకృతిని గూర్చి తపించెను. దేవీసేవవలన లక్ష్మి సర్వసంపత్ప్రదాయిని యయ్యెను. సావిత్రి మలయగిరిపై తపించి సర్వవంద్య పూజ్యయయ్యెను. ఆమె దేవి పదము లరువదినేల దివ్యసంవత్సరములను సేవించెను. శంకరుడు నూఱుమన్వంతరముల వఱకు మున్ను దేవినారాధించెను. బ్రహ్మయును నుఱు మన్వంతరములు శక్తినిగొల్చెను. విష్ణువును నూఱుమన్వంతరములు గొల్చి పాలకుడయ్యెను. కృష్ణుడు పదిమన్వంతరములు శ్రీదేవిని సేవించి దివ్యగోలోకమున నిప్పటికి నానందమొందుచున్నాడు. ధర్ముడు పది మన్వంతరములు భక్తితో శక్తినిగొల్చి సర్వప్రాణుడు సర్వపూజ్యుడు సర్వాధారుడునయ్యెను. ఈ ప్రకారముగ శ్రీపరాభట్టారికను పరమతపమున సేవించి యెల్ల దేవతలు దేవులు మునులు మనువులు రాజులు బ్రాహ్మణులు సర్వపూజితులైరి. ఓయి నారదా! ఈ విధముగ మునపు గురు ముఖమున వేదవిధాన మనుసరించి నేను విన్నదంతయును నీకు విశద మొనరించితిని. ఇంకేమి వినదలతువో తెలుపుము.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి నవమ స్కందమున నెనిమిదవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters