Sri Devi Bagavatham-2    Chapters   

అథ ద్వావింశో7ధ్యాయః.

శ్రీనారాయణః : శివం ప్రణమ్య శిరసా దానవేంద్రః ప్రతాపవాన్‌ | సమారురోహ యానం చ సహామాత్యైః స సత్వరః. 1

శివః స్వసైన్యం దేవాం శ్చ ప్రేరయామాస సత్వరమ్‌ | దానవేంద్రః ససైన్య శ్చ యుద్ధారంభే బభూవహ. 2

స్వయం మహేంద్రో యుయుధే సార్ధం చ వృషపర్వణా | భాస్కరో యుయుధే విప్ర చిత్తినా సహ సత్వరః. 3

దంభేన సహ చంద్ర శ్చ చకార పరమం రణమ్‌ | కాలస్వరేణ కాల శ్చ గోకర్ణేన హుతాశనః. 4

కుబేరః కాలకేయేన విశ్వకర్మా మయేన చ | భయంకరేణ మృత్యు శ్చ సంహారేణ యమ స్తథా. 5

వికంకణన వరుణ శ్చం చలేన సమీరణః | బుధశ్చ ఘృతపృష్ఠేన రక్తాక్షేణ శ##నైశ్చరః. 6

జయంతో రత్న సారేణ వసవో వర్చసాం గణౖః | అశ్వినౌ చ దీప్తిమతా ధూమ్రేణ నలకూబరః. 7

ధురం ధరేణ ధర్మ శ్చ ఉషాక్షేణచ మంగళః | శోభాకరేణ వై భానుః పిఠరేణ చ మన్మథః. 8

గోధాముఖేన చూర్ణేన ఖడ్గేన చ ధ్వజేన చ | కాంచీముఖేన పిండేన ధూమ్రేణ సహ నందినా. 9

విశ్వేన చ పలాశేనాదిత్యాద్యా యుయుధుః పరే | ఏకాదశ చ రుద్రావై ఏకాదశ భయంకరైః. 10

మహామారీ చ యుయుధే చోగ్రచండాదిభిః సహ | నందీశ్వరాదయః సర్వే దానవానాం గణౖః సహ. 11

యుయుధుశ్చ మహాయుద్ధే ప్రళ##యే పి భయంకరే | వటమూలే చ శంభుశ్చ తస్థౌ కాళ్యాఃసుతేన చ. 12

ఇరువదిరెండవ అధ్యాయము

శక్తి ప్రాదుర్బావము-తులస్యుపాఖ్యానము

శ్రీనారాయణు డిట్లనియెను: ప్రతాపశాలియగు దానవపతి శివునకు తలవంచి నమస్కరించి త్వరితగతిని తన మంత్రులతో గూడి విమాన మెక్కెను. శివుడును తన సేనలను యుద్ధమునకు సిద్ధము గమ్మనెను. దానవతియును తనసైన్యముతో పోరున కాయత్తు డయ్యెను. మహేంద్రుడు స్వయముగ వృషపర్వునితో భాస్కరుడు విప్రచిత్తితో చంద్రుడు దంభునితో మహా యుద్ధము సాగించిరి. కాలుడు కాలస్వరునితో అగ్నిదేవుడు గోకర్ణునితోడ కుబేరుడు కాలకేయునితో విశ్వకర్మమయునితో మృత్యువు భయంకరునితో యముడు సంహారునితో వరుణుడు వికంకునితో వాయువు చంచలునితో బుధుడు ఘృతపృష్ఠునితో శ##నైశ్చరుడు రక్తాక్షునితో జయంతుడు రత్నసారునితో వసువులు వర్చోగణములతో అశ్వినులు దీప్తిమంతునితో నలకూబరుడు ధూమ్రునితో ధర్ముడు దురంధరునితో మంగళుడు ఉపాక్షునితో భానుడు శోభాకరునితో మన్మథుడు పిఠరునితో నంది గోధాముఖుడు చూర్ణుడు ఖడ్గుడు ధ్వజుడు కాంచీముఖుడు పిండుడు ధూమ్రుడు విశ్వుడు పలాశుడు మున్నగు వారితో ఆదిత్యులు మున్నగువారు ఏకాదశరుద్రులేకాదశ భయంకరులతో పోరిరి. మహామారి యుగ్రచండాదులతో నందీశ్వరాదులు దానవుల గణములతో పోరు సాగించిరి. వీరెల్లరును ప్రళయ భయంకరముగ యుద్ధమున బోరిరి. శంభుడు కాళికతో కుమారునితో గూడి మఱ్ఱిచెట్టు క్రింద నుండెను.

సర్వే చ యుయుధుః సైన్యసమూహాః సతతం మునే | రత్నసింహాసనే రమ్యే కోటిభిర్దానవైః సహ. 13

ఉవాస శంఖచూడ శ్చ రత్నభూషణ భూషితః | శంకరస్య చ యే యోధా దానవైశ్చ పరాజితాః. 14

దేవాశ్చ దుద్రువుః సర్వే భీతాశ్చ క్షతవిగ్రహాః | చకార కోపం స్కందశ్చ దేవేభ్యశ్చాభయందదౌ. 15

బలం చ స్వగణానాం చ వర్ధయామాస తేజసా | సో7య మేకశ్చ యుయుధే దానవానాంగణౖః సహ. 16

అక్షేహిణీనాం శతకం సమరే చ జఘాన సః | అసురాన్పాతయామాస కాళీ కమలలోచనా. 17

పపౌ రక్తం దానవానా మతిక్రుద్ధా తతః పరమ్‌ | దశలక్ష గజేంద్రాణాం శతలక్షం చ కోటిశః. 18

సమాదా యైకహస్తేన ముఖే చిక్షేప లీలయా | కబంధానాం సహస్రంచ ననర్త సమరే మునే. 19

స్కందస్య శరజాలేన దానవాః క్షతవిగ్రహాః | భీతాశ్చ దుద్రువుః సర్వే మహారణ పరాక్రమాః. 20

వృషపర్యా విప్రచిత్తి ర్దంభశ్చా పి వికంకణః | స్కందేన సార్ధం యుయుధుస్తే సర్వే విక్రమేణ చ. 21

మహామారీ చ యుయుధే న బభూవ పరాజ్ముఖీ | బభ్జూవుస్తే చ సంక్షుబ్ధాః స్కందస్య శక్తిపీడితాః. 22

న దుద్రువు ర్బయాత్స్వర్గే పుష్పవృష్టి ర్బభూవహ | స్కందస్య సమరం దృష్ట్వా మహారుద్రసముల్బణమ్‌. 23

దానవానాం క్షయకరం యథా ప్రాకృతికో లయః | రాజా విమాన మారుహ్య చకార బాణవర్షణమ్‌. 24

నారదా! ఆ విధముగ సేనలు తలపడి పోరుచుండెను. శంఖచూడుడు సొంపైన రతనాల గద్దియపై కోటి దానవులనుగూడి యుండెను. అతడు రత్నభూషణములతో మెఱయుచుండెను. శివుని సేనలు దానవుల చేతులలో నోట పడుచుండెను. సురలు నెత్తురు చిప్పిలు మేనులతో పరుగిడుచుండస్కందుడు కోపించి వారి కభయ మొసంగెను. కుమారుడు తన తేజముతో వారిలో నుత్తేజము గలిగించెను. తాను దానవగణములో తలపడెను. కుమారస్వామి యుద్ధమునందు కొన్ని వందల యక్షౌహిణులను హతమార్చెను. కమలలోచనయగు కాళికయును పెక్కురు రక్కసుల నుక్కడగించెను. ఆమె మహా క్రోధముతో రక్కసుల నెత్తరు గ్రోలెను. పదిలక్షల గజములను లక్షకోట్ల గుఱ్ఱములను చేతితో లీలగ పట్టుకొని కాళి నోటబెట్టు కొనెను. రణరంగమున వేల మొండెములు నటింపజొచ్చెను. కుమారస్వామి బాణపు దెబ్బలకు మేనులు చిల్లులుపడగ రణకోవిదులగు దానవులు వెఱపఱచిరి. కాని వృషపర్వుడు విప్రచిత్తి దంభుడు వికంకణుడు మొదలగు కొద్దిమంది పరాక్రమ ముతో కుమారునితో బోరుచుండిరి. మహామారి సైతము వెనుకంజ వేయక పోరు సాగించెను. దానవు లెల్లరును కుమారుని శక్తిచే పీడితులై గగ్గోలు పెట్టిరి. కాని వారు భయపడి పారిపోలేదు. ఇంతలో దివినుండి కుమారునిపై పూలజల్లు కురిసెను. కుమారుడు మహారుద్రుని విధమున యుద్ధము చేయుచుండెను. దానవులు ప్రాకృత ప్రళయమునందలి నాశమువలె నశించిరి. అపుడు శంఖచూడుడు విమానమెక్కి బాణవర్షము కురిపించెను.

నృపస్య శరవృష్టిశ్చ ఘనస్య వర్షణం యథా | మహాఘోరాంధకారశ్చ మహ్న్యుత్థానం బభూవ చ. 25

దేవాః ప్రదుద్రువుః సర్వే7ప్యన్యే నందీశ్వరాదయః | ఏక ఏవ కార్తికేయ స్తస్థౌ సమరమూర్ధని. 26

పర్వతానాం చ సర్పాణాం శిలానాం శాఖినాంతథా | నృప శ్చకార వృష్టిం చ దుర్వారాం చ భయం కరీమ్‌. 27

నృపస్య శరవృష్ట్యా చ ప్రహితః శివనందనః | నీహారేణ చ సాంద్రేణ ప్రహితో భాస్కరో యథా. 28

ధనుశ్చిచ్ఛేద స్కందస్య దుర్వహంచ భయంకరః | బభంజ చ రథం దివ్యం చిచ్ఛేద రథ పీఠకాన్‌. 29

మయూరం జర్జరీ భూతం దివ్యాస్త్రేణ చకార సః | శక్తిం చిక్షేప సూర్యాభాం తస్య వక్షస్య ఘాతినీమ్‌. 30

క్షణం మూర్ఛాం చ సంప్రాప బభూవ చేతనః పునః | గృహీత్వా తద్ధను ర్దివ్యం యద్దత్తం విష్ణునా పురా. 31

రత్నేంద్ర సారనిర్మాణ యానమారుహ్య కార్తికః | శస్త్రాస్త్రం చ గృహీత్వా చ చకారరణ ముల్బణమ్‌. 32

సర్పాంశ్చ పర్వతాంశ్చైవ వృక్షంశ్చ ప్రస్తరాం స్తథా | సర్వాం శ్చిచ్ఛేద కోపేన దివ్యాస్త్రేణ శివాత్మజః. 33

వహ్నిం నిర్వాపయామాస పార్జన్యేన ప్రతాపవాన్‌ | రథం ధను శ్చ చిచ్ఛేద శంఖచూడస్య లీలయా. 34

సన్నాహం సారథిం చైవ కిరీటం ముకుటోజ్జ్వలమ్‌ | చిక్షేప శక్తి శుక్లాభాం దానవేంద్రస్య వక్షసి. 35

మూర్ఛాం సంప్రాప్య రాజా చ చేతన శ్చ బభూహ | ఆరురోహ యానమన్య ద్ధనుర్జగ్రాహ సత్వరః. 36

దానవుని బాణవర్షము మేఘము లుంచినట్టుల కటికి చీకట్లు గల్గించుచు నిప్పులు గ్రక్కుచున్నట్టు లుండెను. అపుడు నందీశ్వరాది సురు లెల్లరును పలాయనము చిత్తగించిరి. కుమారస్వామి మాత్రము రణాంగణమందు కదలకుండెను. శంఖచూడుడు పర్వతముల-పాముల-శిలల వర్షము భీకరముగ కురిపించెను. అతని బాణ వృష్టికి శివ కుమారుడు దట్టపు మంచునీత గప్పబడిన వెలుగువలె కాంతి తరిగి వెలుగుచుండెను. దానవుడు స్కందుని బెట్టిదమైన విల్లువిఱిచి దివ్య రథమును రథ పీఠములను విఱుగగొట్టెను. అతడొక దివ్యాస్త్రముతో నెమిలిని చిల్లులు పడగొట్టెను. పిదప స్కందుని ఱొమ్ముమీద సూర్యునిబోలు శక్తిని ప్రయోగించెను. అంత స్కందుడు క్షణకాలము మూర్ఛిల్లి వెంటనే తెప్పరిల్లి తనకుమున్ను విష్ణు వొసంగిన దివ్యధనువు చేపట్టెను. కుమారుడు వెంటనే రత్నసార నిర్మితమైన రథ మెక్కి శస్త్రాస్త్రములు ధరించి మరల రణము సాగించెను. శివకుమారుడు దానవుడు విసరివేసిన పాములను పర్వతములను వృక్షములను రాళ్లను తన దివ్యాస్త్రము లతో కోపముతో తునాతునుకలు చేసెను. శంఖచూడుని యాగ్నేయాస్త్రమును కుమారస్వామి పర్జన్యాస్త్రముతో చల్లార్చెను. తర్వాత శంఖచూడుని రథమును ధనువును తేలికగ ముక్కముక్కలు చేసెను. వాని సారథిని మేలైన కిరీటమును ఛేదించి ధనుజుని ఱొమ్ముందు కుమారుడు తెల్లని శక్తిబాణము గాడనాటెను. దానవుడు మూర్ఛిల్లి పిదప తెలివొంది మఱియొక్క విమాన మెక్కి విల్లుచేత పట్టెను.

చకార శరజాలం చ మాయయా మాయినాం వరః | గుహం చచ్ఛాద సమరే శరజాలేన నారద. 37

జగ్రాహ శక్తి మవ్యగ్రాం శతసూర్య సమ ప్రభామ్‌ | ప్రళయాగ్ని శిఖారూపాం విష్ణోశ్చ తేజసావృతామ్‌. 38

చిక్షేప తాం చ కోపేన మహావేగేన కార్తికే | పపాత శక్తి స్తద్గాత్రే వహ్నిరాశి రివోజ్జ్వలా. 39

మూర్ఛాం సంప్రాప శక్త్యా చ కార్తికేయో మహాబలః | కాళీగృహీత్వాం తం క్రోడే నినాయ శివసన్నిధౌ. 40

సర్వే దేవాశ్చ గంధర్వా యక్షరాక్షసకిన్నరాః | వాద్యభాండశ్చ బహుశః శతశోమధువాహకాః. 43

సా చ గత్వా7థ సంగ్రామం సింహనాదం చకార చ | దేవ్యా శ్చ సింహనాదేన ప్రాపుర్మూర్చాంచ దానవా. 44

అట్టాట్టహాసమశివం చకార చ పునః పునః | దృష్ట్వా పపౌ చ మాధ్వీకం ననర్తరణమూర్ధని. 45

ఉగ్రదం ష్ట్రా చోగ్రదండా కోటకీ చ పపౌ మధు | యోగినీ డాకినీనాం చ గణాః సురగణాదయః. 46

దృష్ట్వా కాళీం శంఖచూడః శీఘ్రమాజౌ సమాయ¸° | దానవాశ్చ భయంప్రాపూ రాజా తేభ్యో7భయం దదౌ. 47

కాళీ చిక్షేప వహ్నిం చ ప్రళయాగ్నిశిఖోపమామ్‌ | రాజా నిర్వాపయామాస పార్జన్యేన చ లీలయా. 48

ఆ మాయావి మాయగ బాణజాలముతో కుమారుని కప్పివేసెను. అతడు పిమ్మట వందసూర్యులకాంతితో ప్రళయాగ్ని శిఖలతో విష్ణుతేజముతో తేజరిల్లునట్టి తీవ్రమైన శక్తి బాణము తీసికొనెను. అతడు క్రోధముతో వేగముగ దానిని కుమారునిపై విసరగ నతని శరీరముపై శక్తి బాణము నిప్పుకణములు కురిసెను. శక్తిబాణమునకు మహాబలుడగు కుమారుడు మూర్చిల్లగ వెంటనే కాళికవచ్చి యతనిని శివుని సన్నిధికి గొనిపోయెను. అంతట శివుడు తనజ్ఞాన బలమున నతనికి ప్రాణమువోసి యనంత బలమొసంగగనే కుమారుడు లేచినిలువబడెను. అపుడుకాళి యతనిని రక్షగనిలుచుండగా నందీశ్వరాది వీరులు తోడునడువగా షణ్ముఖుడు తిరిగి కయ్యమునకు కాలుదువ్వెను. అపుడు గంధర్వ యక్షకిన్నరాదులు వాద్యములు మ్రోగించిరి. పల్వురు మధువాహకులు వెంటనడచిరి. శ్రీకాళికాదేవి రణరంగమున సింహ నాదమొనరింపగా ఆనాదమునకేపెక్కురు మూర్ఛిల్లిరి. భీకరమూర్తియగు కాళి సింహనాదములు సేయుచు మధువు గ్రోలుచు రణాంగణమున నర్తింపసాగెను. ఆసమయమున ఉగ్రదంష్ట్రుడు ఉగ్రదండుడు కొటకి మొదలగువారుము మధువుసేవించి రి. యోగినీడాకినీ గణములు పెడ బొబ్బలు పెట్టెను. కాళీ వీరవిహారముగాంచి శంఖచూడుడు రణమునుండి పలాయనము చిత్తగించు తనసేనలకు వేగమే యభయమిచ్చి నిలిపెను. అంత కాళికాదేవి ప్రళయాగ్ని శిఖలు వెదజల్లునట్టి యాగ్నేయాస్త్రము ప్రయోగించగా దానిని దానవుడు పర్జన్యాస్త్రముతో చల్లార్చెను.

చిక్షేప వారుణంసాచ తీవ్రం చ మహదద్బుతమ్‌ | గాంధర్వేణ చ చిచ్చేద దానవేంద్రశ్చ లీలయా. 49

మాహేశ్వరం ప్రచిక్షేప కాళీ వహ్నిశిఖోపమమ్‌ | రాజా జఘాన తం శీఘ్రం వైష్ణవేన చ లీలయా. 50

నారాయణాస్త్రం సా దేవీ చిక్షేపమంత్ర పూర్వకమ్‌ | రాజా ననామ త ద్దృష్ట్వా చావరుహ్యరథా దసౌ. 51

ఊర్ధ్వం జగామ తచ్చా స్త్రం ప్రళయాగ్ని శిఖోపమమ్‌ | పపాత శంఖచూడ శ్చ భక్త్యా తం దండవద్బువి. 52

బ్రహ్మా స్త్రం సా చ చిక్షేప యత్నతో మంత్ర పూర్వకమ్‌ |

బ్రహ్మాస్త్రేణ మహారాజో నిర్వాపంచ చకార సః. 53

తథా చిక్షేప దివ్యా శ్త్ర సా దేవీ మంత్రపూర్వకమ్‌ | రాజా దివ్యాస్త్ర జాతేన తన్నిర్వాణం చకారచ. 54

దేవీ చిక్షేప శక్తిం యత్నతో యోజనాయతామ్‌ | రాజా దివ్యాస్త్రజాలేన శతఖండాం చకారహ. 55

జగ్రాహ మంత్రపూతం చ దేవీ పాశుపతం రుషా | నిక్షేపణం నిరోద్ధుంచ వాగ్బభూ వాశరీరిణీ. 56

మృత్యుః పాశుపతే నాస్తి నృ పస్యచ మహాత్మనః | యావదస్తి చ మంత్రస్య కవచం చ హరేరితి. 57

యావ త్సతీత్వ మస్త్యేవ సత్యా శ్చ నృపయోషితః | తావదస్య జరా మృత్యుర్నా స్త్రితి బ్రహ్మణోవచః. 58

ఇత్యాకర్ణ్య భద్రకాళీ నత చ్చి క్షేప శస్త్రకమ్‌ | శతలక్షం దానవానాం జగ్రాస లీలయా క్షుధా. 59

గ్రస్తుం జగామ వేగేన శంఖచూడం భయంకరీ | దివ్యాస్త్రేణ చ తీక్షేణన వారయామాస దానవః. 60

ఖడ్గం చిక్షేప సా దేవీ గ్రీష్మసూర్యోపమంయథా | దివ్యాస్త్రేణ దానవేంద్రః శకఖండం చ కార సః. 61

ఆమె యద్బుతమైన వారుణాస్త్రము నేయగా నతడు గంధర్వాస్త్రముతో దానిని వారించెను. కాళి యగ్ని జ్వాలలు గ్రక్కు మహేశ్వరాస్త్రము ఏయగా దాని నతడు వేగమే వైష్ణవాస్త్రముతో చల్లార్చెను. దేవి నారాయణాస్త్రము నభిమంత్రించి విడువగా నతడు రథము దిగి దానికి నమస్కరించెను. అతడు నేలపైని భక్తితో బోర్లపడియుండగ నస్త్ర మతని మీద నుండి తాకక వెళ్ళిపోయెను. అపుడు దేవి బ్రహ్మాస్త్రము ఏయగ దానవుడదే యస్త్రముతో దాని నివారించెను. కాళి మంత్రించి దివ్యా స్త్రములతో దానినినూఱు ముక్కలుచేసెను. అంతట దేవి మహాక్రోధముతో పాశుపతాస్త్రము సమంత్రకముగ ఏయబోగా నాకాశ వాణి వారించుచు నిట్లు పలికెను. ''ఈ మహారాజునకు పాశుపతము వలన కూడ చావులేదు. ఇతని చెంత శ్రీహరి కవచ మున్నంత కాలము నితనికి ముదిమియుచావును గల్గవని బ్రహ్మ మున్ను వర మొసంగెను.'' అను గగన వాక్కులు విని భద్ర కాళి దాని నుప సంహరించుకొనెను. కాని యా దేవి పేరాకటిచే నూఱు లక్షల దానవుల మ్రింగబోగ నతడు వాడియైన దివ్యా స్త్రముతో నామెను వారించెను. దేవి మండు వేసగి లోని సూర్యుని వంటి ఖడ్గము విసరగ దాని నతడు దివ్యాస్త్రముతో నూఱు తునుక లొనర్చెను.

పున ర్గ్ర స్తుం మహాదేవీ వేగేన చ జగామ తమ్‌ | సర్వసిద్ధేశ్వశః శ్రీమా స్వవృ ధే దానవేశ్వరః. 62

వేగేన ముష్టినా కాళీ కోపయుక్తా భయంకరీ | బభంజ చ రథం తస్య జఘాన సారథిం సతీ. 63

సా చ శూలం చ చిక్షేప ప్రళయాగ్ని శిఖోపమమ్‌ | వామహస్తేన జగ్రాహ శంఖచూడః స్వలీలయా. 64

ముష్ట్యా జఘానం తం దేవీ మహా కోపేన వేగతః | బభ్రామ చ తయా దైత్యః క్షణం మూర్చామవాపచ. 65

క్షణన చేతనాం ప్రాప్య సముత్తస్థౌ ప్రతాపవాన్‌ | న చకార బాహుయు ద్ధం దేవ్యా సహననామతామ్‌. 66

దేవ్యా శ్చా స్త్రం స చిచ్చే ద జగ్రాహ చ స్వేతేజసా | నా స్త్రం చిక్షేప తాం భక్తో మాతృభక్త్యాతువెష్ణవః. 67

గృహీత్వా దానవం దేవీ భ్రామయిత్వా పునః పునః | ఊర్ధ్వం చ ప్రాపయామాస మహావేగేన కోపితా. 68

ఉర్ధ్వా త్ప ఆత వేగేన శంఖచూడః ప్రతాపవాన్‌ | నిపత్య చ సముత్త స్థౌ ప్రణమ్య భద్రకాళికామ్‌. 69

రత్నేంద్రసార నిర్మాణాం విమానం సుమనోహరమ్‌ | ఆరురోహ హర్షయుక్తో న విశ్రాంతో మహారణ. 70

దానవానాం చ క్షతజం సాదేవీ చ పపౌక్షుధా | పీత్వా భుక్త్వా భద్రకాళీ జగామ శంకరాంతికమ్‌. 71

ఉవాచ రణపృత్తాంతం పౌర్యాపర్యం యథాక్రమమ్‌ | శ్రుత్వా జహాస శంభు శ్చ దానవానాం వినాశనమ్‌. 72

లక్షం చ దానవేంద్రాణా మవశిష్టం రణధునా | భుంజంత్యా నిర్గతం వక్త్రాత్త దన్యం భుక్తమీశ్వర. 73

సంగ్రామే దానవేంద్రం చ హంతుం పాశుపతేన వై | అవధ్యస్తవ రాజేతి వాగ్బభూవాశరీరిణీ. 74

రాజేంద్ర శ్చ మహాజ్ఞానీ మహాబలపరాక్రమః | నచ చిక్షేప మయ్య స్త్రం చిచ్ఛేద మమసాయకమ్‌. 75

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ నవమస్కంధే నారదనారాయణ సంవాదే ద్వావింశోధ్యాయః.

మహాదేవి మరల వానిని మ్రింగబోగ నతడు వేగిరమే సర్వసిద్దేశ్వరు డగుట వలన పెద్దగ పెరిగెను. కాశి కోపముతో తన పిడికిటితో వాని సారథిని రథమును నష్ట పఱచెను. దేవి మరల ప్రళయాగ్ని శూలము విసరగ నతడు దానిని తేలికగ నెడమచేత పట్టెను. దేవి వెంటనే తీవ్ర కోపముతో వానిని పిడికిట గొట్టగ నతడు గింగిరాలు తిరిగి మూర్చవోయెను. అతడు వెంటనే తెలివొంది లేచెను. అత డపుడు దేవితో ద్వంద్వయుద్ధమునకు తలపడక నామెకతడు నమస్కరించెను. ఆ పరమ వైష్ణవు డిక మాతృభక్తితో దేవిపై నస్త్రములు ఏయలేదు. అపుడు దేవి కోపించి దానవుని పట్టుకొని మహావేగముగ గిరగిర త్రిప్పుచు పైకి విసరెను. ప్రతాపియగు శంఖచూడు డంతపై నుండి దుమికి లేచి భద్రకాళికి చేతులు మోడ్చెను. అత డందమైన రత్నవిమాన మెక్కెను. అంత మహాయుద్దము జగిరినను నలసటయే యెఱుగ కతడు సంతోషముగ నుండెను. భద్ర కాళి యాకటితోదానవుల రక్తముత్రావి బాగుగ తిని శివుని సన్నిధానమున కరిగెను. దేవి జరిగిన రణవృత్తాంత మంతయును శివునకు దెల్పెను. శివుడును దానవసేనలు చచ్చుట విని సంతసించెను. ఒక లక్ష దానవులు నా నోటినుండి తప్పించుకొనిరి. తక్కినవారిని నేను తింటినని దేవి శివునితో ననెను. యుద్దమందు నేను దానవుని చంపుటకు పాశుపతాస్త్రము ఏయబోగ ''దానవుడు చంపబడ'' డని యాకాశవాణి పలికెను. అపుడు మహాజ్ఞాని పరాక్రమియగు దానవపతి నాపై నస్త్రములు ఏయక నేను ఏయు నస్త్రములను ఛేదించెను.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందు నవమ స్కంధమున నారద నారాయణ సంవాదమున నిరువదిరెండవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters