Naa Ramanasrma Jeevitham    Chapters   

17. లేఖారచనకు అంతరాయాలు

లేఖలు ప్రథమభాగం సరిగా జయంతివేళకు అందలేదు గదా? తరువాత 1947 జూలైలో నే నెందుకో మద్రాసు వెళ్ళాను. నాల్గు రోజులే అక్కడుండి తిరిగి ఆశ్రమానికి వస్తుంటే ఆ పుస్తకాలు 12 మాత్రమే బైండు అయినవనీ, తక్కినవి వెనుక పంపగలమనీ ప్రెస్సువారు అన్నయ్యతో చెప్పి ఆ డజను పుస్తకాలూ పంపితే వాటిని నన్నే ఆశ్రమానికి తీసుకొని వెళ్ళుమన్నారు అన్నయ్య. సరేనని 1947 జూలై 3వ తేదీన మద్రాసులో బయలుదేరి 4 ఉదయాన ఆశ్రమం చేరుకొని ఆ లేఖలు భగవాన్‌ సన్నిధిలో సమర్పించాను.

కొత్తగా ఏదైనా పుస్తకం అచ్చయివస్తే వెంటనే హాల్లో చదివించేవారు భగవాన్‌. నా యీ లేఖల పుస్తకం వచ్చినప్పుడు గూడా చదువుమంటా రేమోనని చూశాను. కాని భగవాన్‌ ఆ మాటే ఎత్తలేదు. నాకా భగవాన్‌ సన్నిధిలో చదవాలన్న ఉబలాటం తగ్గదు. ఒకసారి భగవానుని సమీపించి సూచనగా అడిగితే ''పుస్తకాలన్నీ రానీ తరువాత చూద్దాం'' అని సెలవిచ్చారు భగవాన్‌. ఒకటి రెండుసార్లు చిన్నస్వాములతో ప్రస్తావించాను. ఇదుగో ఈ సందడి తగ్గనియ్యి, ఆ సందడి తగ్గనియ్యి అని వా రంటూ వుంటే అల్లా అల్లా రెండు వారాలు గడిచిపోయినవి. ఈ లోపల పుస్తకాలు వెయ్యి కాపీలు ఆశ్రమం చేరినవి. పత్రికలవారు చాలా బాగున్నవనే అభిప్రాయాలు ప్రకటించారు. ఎక్కడెక్కడి నుంచో ఆర్డర్లు వస్తున్నవి. వాటన్నిటితో పాటు అసూయలున్నూ పెరుగుతున్నవన్న విషయం నా బుఱ్ఱ కెక్కక హాల్లో చదవాలన్న ఉబలాటమే ముందుకు ఉరికింది. దయగలవారు గనుక ఎల్లాగో చిన్నస్వామిని ఒప్పించి, వారు ఒప్పుకున్నారు చదువుతానని భగవాన్‌తో మనవి చేస్తే ''సరే'' నని వా రనుమతించిన వెనుక జూలై 20, 22 ఆ ప్రాంతాలలో ఆ లేఖలు హాల్లో చదువుటకు ఆరంభించాను. ఇట్లా ప్రారంభించానని ఆ నాడే మద్రాసుకు జాబు వ్రాస్తే వినాలన్న కుతూహలంతో మా చిన్నవదినెగారు ఒక్క పరుగున రైలెక్కి వచ్చిం దిక్కడికి.

మూడు రోజుల్లో పుస్తకం సగం చదివాను. భగవాన్‌ ఎంతో ఉత్సాహంతో వింటూ ఆయా లేఖలకు సంబంధించిన విషయాలన్నీ విపులంగా సెలవిస్తూ వచ్చారు. హాల్లో వున్న వా రంతా ఎంతో సంతోషిస్తే అసూయాపరుల కది సహింపరానిదైంది. వారు చిన్నస్వామికి ఒత్తిడి కలిగించారు. మూడవ రోజున కొంత చదివి ముగించగానే ఆఫీసుకు రావల సిందని నాకు ఆజ్ఞ వచ్చింది. సరేనని వెడితే ''ఇక ఇంతటితో ఆపు చెయ్యి'' అని ఆజ్ఞాపించారు చిన్నస్వామి. చదవటమే ఆపమన్నారనుకొన్నా నేను. మరుదినం మధ్యాహ్నం 3 గంటలకు చదువుతా నని అంతా వచ్చారు. నేను చదువలేదు. ''ఏమి? చదవవేమి?'' అన్నారు భగవాన్‌. ''చిన్నస్వామి వద్దన్నా'' రన్నాను. ''అల్లాగా?'' అని ప్రక్కనున్న రాజ గోలపాయ్యరును చూచి ''మనం చదవమనటం వారు వద్దనటం బాగున్నది. ఇక మన మెవరికీ పని చెప్పరాదన్న మాట'' అన్నారు భగవా&. రాజగోపాలయ్యరు ఆఫీసుకు వెళ్ళి భగవాన్‌ అన్న మాటలు చెప్పగానే ''చదువవద్దని నే ననలేదు; ఇక వ్రాయటం ఆపుమని అన్నాను'' అన్నారు చిన్న స్వాములు.

మరుదినం మళ్ళీ చదువుట కారంభించి మూడు రోజుల్లో అంతా చదివి ముగించాను. ముగింపగానే మళ్ళీ ఆఫీసుకు రమ్మని ఆర్డరు. సరేనని వెడితే ''నీ విక లేఖలు వ్రాయవద్దనీ, ఇప్పుడు వ్రాసినంతవరకూ అన్నీ తెచ్చి మా కీయవలసిందనీ, లైబ్రరీ తాళపు చెవులు మా కప్పగించవలసిందనీ'' చిన్న స్వాములు గట్టిగా ఆజ్ఞాపించారు. అన్నయ్య గదా వ్రాయుమన్నది. ఆయన వచ్చినప్పుడు ఇస్తాను లెండి అంటే. కాదు, ఇప్పుడే కావాలన్నారు. నాకెంతో కించకలిగింది. ఎందుకల్లా విచారిస్తావని మా వదినెగారన్నా నా విచారం పోలేదు. లైబ్రరీ తాళపు చెవులు ఆట్టే కష్టం లేకుండానే భగవాన్‌ కిస్తూ లైబ్రరీ పని నన్ను చూడవద్దన్నారన్నాను. భగవాన్‌ తాళపు చెవులు అందుకొని ''ఓహో! అల్లాగా! పోనీ, ఆ పని పోతేపోనీ'' అన్నారు. ఆ పని అంత కష్టం లేకుండానే భగవానుకు ఒప్పగించానుగాని ఉన్న లేఖలన్నీ తెచ్చియివ్వడానికి ఎంతో కష్టమయింది. లోగడ వెంకట్రామయ్యరుగారి డైరీ ఆశ్రమం వారు తీసుకున్నారని వినివుండుటవల్ల ఎందుకైనా మంచిదే. రెండవ కాపీ మన వద్ద వుండాలని ఆ రెండవ భాగంగా వ్రాసిన లేఖలన్నీ చాలా భాగం అప్పటి కొక వారం క్రిందటనే అన్నయ్య వచ్చినప్పుడు ఒరిజనలు కాపీ మద్రాసుకు తీసుకొని వెళ్ళారు. నావద్ద కార్బన్‌ కాపీ మాత్రమే వున్నది. ''మనవద్ద రెండవ కాపీ వున్నది గదా? ఇచ్చేందుకు శంకిస్తా వెందుకు.'' అంటుంది వదినె. నాకేమో నేనేమీ తప్పు చేయలేదే. అన్నయ్య వచ్చేవరకూ ఆగమన్నా ఆగరే. ఎందు కింత శిక్ష అన్న ఉక్కురోషం.

Naa Ramanasrma Jeevitham    Chapters