Naa Ramanasrma Jeevitham    Chapters   

19. విన్నపము

1. తలవులను నలలద్రోయగ

పలుమరు నీవాడు నట్టి పలుకులె మదిలో

నిలిచి బలమీయ నడపితి

కలమున్‌ భవజలధి కావ్యగతి శ్రీ రమణా ||

2. కలతలను గాలి విసరులఁ

గలఁగెనిపుడు మనము దానగలము దిరిగె శ్రీ

కలితాక్షా నీ దృష్టిని

నిలుకడఁ గలిగింపుమయ్య నేతా రమణా ||

3. జడమతికి జీవకళలన్‌

గడువడిఁ జేకూర్చి ముదముగా సుఖజలధిన్‌ |

నడపినఁగలము తుపానునఁ

బడకుండ ననుగ్రహింప భావ్యము రమణా ||

4. బలహీనులైనవారికి

బలమీవని శ్రుతులు నొక్కి పలికిన పలుకుల్‌ |

తలపోసి కర్ణధారిగ

నిలబడి యీకలము దరికి నీడ్వవె రమణా ||

5. కలమున గూర్చిన పెన్నిధిఁ

గల దంతయు కట్టగట్టి కలతల కెడమున్‌ |

గలుగదని తలచి నీ పద

తల మందిడి కావుమంటి దయగను రమణా ||

6. కలమును కాంతలు నడుపుట

గలదే విపరీతమైన కాలమటంచున్‌ |

బలికిన జను లౌరాయన

సలలితమగు దారి జూప జనదే రమణా||

7. బీదలకును సాధులకును

చేదోడై మెలగి పెంపు సేయుదువని నీ

¸°దార్యము నుతియింతురు

గాదనుటకు కారణంబు గాకుము రమణా ||

8. సబలులు తన్నెఱిగిన వా

రబలలు తన్నెఱుగనట్టి యజ్ఞులటంచున్‌

విబుధులు పలుకగ వింటిని

సబలనుగా నిలిపి నన్ను సాకవె రమణా ||

9. అలసితినని ముచుకుందుడు

బలభిన్ముఖసురలగోరె బహుతరనిద్రన్‌

కలమున నలసిన నాకికఁ

గలలేని సునిద్ర నొసగి కావవె రమణా ||

ఈ పద్యాలు వ్రాసి శ్రీవారికి సమర్పిస్తే చూచి షెల్ఫులో పెట్టారేగాని భగవా నేమీ పలుక లేదు. ఆ వెనుక చాలా ఆర్తితో ''అరుణాద్రివాసా శ్రీ రమణ'' అనే పల్లవితో ఒక కీర్తన వ్రాసి శ్రీవారికి అందజేశాను. ఆ కీర్తన తాత్పర్యం దిగువ వ్రాస్తున్నాను.

(ప) అరుణాద్రివాసా! శ్రీరమణా! నన్ను విచారించి రక్షించు ||

1. శరీరం నే ననే భ్రాంతి వదలక వెఱ్ఱి సంకల్పాలకు చిక్కి నలిగిపోతున్నాను.

2. కరుణించు స్వామీ! అందామంటె ఆ కరుణయె నీ రూపంగా కనుపిస్తూ వున్నది - ఇం కేమని అడుగను?

3. కన్ను మూసి హృదయంలో వున్న నిన్ను చూడక, నాకన్నా (జ్ఞాననేత్రమ). నా కంటె నీవు వేరని వెలిచూచి కలత పొందుతూ ఉన్నాను.

4. నీవు నటరాజమూర్తివయి నా మనస్సులో ఆనందతాండవం ఆడుతూవుండు రమణా

5. ఆవర్తపురి (అంటె నీటి సుడిగల తిరుచ్చుళి అని ఒక అర్థం. త్రిపుటీ స్థానమైన హృదయక్షేత్ర మని ఒక అర్థం.) జన్మస్థానముగా, నాగాంబ మనస్సనే సరస్సున విహరించే హంసస్వరూపా! శ్రీరమణా! నన్ను రక్షింపుము.

ఇదే విధమైన భావాలతో 9 చరణాలు వ్రాసి శ్రీవారికి అందజేశాను. ఊహూ - చలనం లేదు. నాకా ప్రాణం పోయేంత సంకటంగా వున్నది. కడకిక పట్టుదలతో ఒక మధ్యాహ్నమంతా తదేక దీక్షతో కూర్చుని ''పలుకవే ఒకసారి రమణా'' అనే పల్లవితో నిశ్చలంగా ప్రార్థిస్తూ ఒక చక్కని భావంగల కీర్తన వ్రాసి ముగించేసరికి మూడు గంటలయింది. దాని భావం ఏమంటె.

(ప) అమృతము చిలుకునట్లు ఒక్కసారి పలకవే రమణా! తాపత్రయాగ్నిచే క్రాగు జీవులకు లలితమైన నీ వాక్కులయొక్క సమూహం శీతలమైన నీటివలె వుంటుంది. ఒక్కసారి మాట్లాడు రమణా ||

1. చిరునవ్వులనే వెన్నెలలు కాస్తూ వుండగా ఆత్మ పరతంత్రమైన చూపులు కలిగి, సరసమైన సద్వాక్కులతో సజ్జనుల హృదయం కరిగి నీలో ఐక్యమును పొందునట్లు ఒక్కసారి పలుకవా రమణా ||

2. ఋక్కులలే (అంటె వేదములే) వాక్కులై పరిణమించగా సర్వదిక్కులున్నూ కీర్తిచే ప్రకాశింప ఒక్కమాట మాట్లాడితే మాలోనున్న వుడుకంతా చల్లారి, చొక్కియథార్థమైన స్థానంలో సోలి నిద్రపోగలమే? ఒక్కసారి పలుకవా రమణా ||

3. వన్నెలూ, చిన్నెలూ కల యీ జగత్తులో ఎన్నెన్నో చిక్కులుపడి, ఏ మార్గమూ కనలేక, నాగాంబ, దీనురాలై నిన్నే శరణని వేడుతూ వున్నది. ఇంకా ఆలస్యం ఎందుకు? ఒకసారి పలుక రాదా రమణా||

Naa Ramanasrma Jeevitham    Chapters