Naa Ramanasrma Jeevitham    Chapters   

2. నా రమణాశ్రమ యాత్ర

ఉదయాత్పూర్వమే గూడూరులో దిగి, స్నానంచేసి విల్లుపురం వెళ్ళే రైలు ఎక్కాను. ఆడవాళ్శపెట్టె లేక మా మూలు పెట్టెలోనే ఎక్కవలసివచ్చింది. త్రోవలో కాళహస్తి తిరుపతి వున్నవిగదా? ఆక్షేత్రాలు అదివరకు చూడనందువల్ల చూద్దామా? అని అనిపించింది. సరాసరి టికెట్టువున్నదే ఎల్లాగా? అని ఒకరిద్దరితో యోచిస్తూవుండగా కాళహస్తి సమీపించింది. అప్పుడొక ఉన్నతోద్యోగిగా కనిపంచే బ్రాహ్మణుడు ''అమ్మా! మీ టికెట్టుకు త్రోవలో మూడు రోజులు ఆగవచ్చును. ఇప్పుడు తొమ్మిది గంటలు కావచ్చింది. ఇక్కడ దిగి, ఆవులమ్మహోటలుకు వెడితే ఆమె గది యిస్తుంది. సామాను భద్రపరుచుకొని, సువర్ణముఖిలో స్నానంచేసి, స్వామిని సేవించుకొని వచ్చేసరికి ఆమెవంటచేసి వుంచగలదు. భోజనంచేసి, రవంత విశ్రమించి రెండున్నర రైలు ఎక్కితే రాత్రి ఎనిమిది గంటలకు తిరుపతి చేరగలరు. రెండు రోజులలో ఆ యాత్ర ముగించుకొని అరుణాచలం చేరుకోవచ్చును'' అన్నాడు. అయితే దిగుదునా? అంటూ వుండగానే స్టేషను వచ్చింది. నాకన్న ముందు ఆయనేదిగి, నా సామానందుకొని, బండికుదిర్చి, ఆవులమ్మ హోటలులో దింపుమని బండివానితో చెప్పి, ఎటో వెళ్ళిపోయినాడు. ఆహా! ఇదిగదా దైవసహాయం అని అనుకొని, ఆయన చెప్పినట్లే కాళహసస్తీశ్వరుని సేవించుకొని, రెండున్నర రైలెక్కి రాత్రి 8 గం|| దిగువ తిరుపతి చేరుకున్నాను.

అక్కడ దేవస్థానం కమీషనరు చాగంటి సాంబశివ రావుగారి భార్య అన్నపూర్ణమ్మకూ, నాకూ కొద్ది పరిచయం వుండుటవల్ల వారింటనే బసచేసి, వారి సహాయంతోనే కొండ పైకి వెళ్ళి, అధికారుల బంధుత్వమర్యాదతో శ్రీ వెంకటేశ్వర స్వామిని సేవించి, గోగర్భం, ఆకాశగంగ ఇత్యాదులన్నీ చూచి, రెండవరోజున కొండదిగి, శ్రీ అలిమేలుమంగ, వరద రాజుల దర్శనం చేసుకొని, మూడవనాటి మధ్యాహ్నం 12 గంటలకు అరుణాచలం మీదుగా వెళ్ళే విల్లుపురం ప్యాసింజరు ఎక్కాను. తీర్థయాత్ర జేసుకొన్న వెనుక నే శ్రీ గురు సందర్శనం చేయాలన్న విధివిధానం ఈ విధంగా తీరిందన్నమాట. నే నెక్కిన ఆ రైలు 4 గంటలకు కాట్పాడి చేరవలసినదల్లా 5 గంటలకు చేరింది. 41/2 కు అక్కడ మారవలసిన రైలు ఈ ఆలస్యంవల్ల దాటిపోయింది. తిరిగి ఆరున్నరకుగాని రైలు లేదు. అది అరుణాచలం చేరేసరికి 81/2 అవుతుందన్నారు. సరే ఏంజేస్తారు? అని స్టేషనులోనేకూర్చొని ఆ రైలు రాగానే ఆడవాళ్ళ పెట్టెలో ఎక్కాను. సూర్యాస్తమయం అయితే ఆశ్రమంలో ఆడవాళ్ళుండరాదని అదివరకే విన్నాను. రైల్లోనూ ఆ మాటే అన్నారు. సుబ్బమ్మ అక్కగారి చిరునామాగూడా తెచ్చుకోలేదు. ఊళ్ళో ఎవరినీ ఎఱుగను. రాత్రి వేళ. ఎక్కడికి వెడుదునా ఈశ్వరా? అని కంగారుపడుతుంటె ఆ పెట్టెలో ఇద్దరు యువతులుండి ''అమ్మా! కంగారుపడకండి. మేము తిరువణ్ణామలైలోనే మా బంధువుల యింటికి వెడుతున్నాము. మాతో వస్తే రాత్రి అక్కడగడిపి, ఉదయాన ఆశ్రమం చేరుకోవచ్చును.'' అన్నారు. ''సత్రంలో బస దొరికితే సరే, లేకుంటేవస్తా'' నన్నాను.

ఎనిమిదిన్నరకు తిరువణ్ణామల (అరుణాచలం) లో దిగాము. ఆ స్త్రీలు నా బండివానితో వాళ్ళు వెళ్ళే యింటి అడ్రస్‌ చెప్పి వెళ్ళారు. నా బండి సత్రం వద్ద ఆగింది. సత్రం అధికారిని బస అడిగితే ''అమ్మా! మీరు ఒంటరిగా వచ్చారు. ఇక్కడ స్త్రీ లెవ్వరూ లేరు. రాత్రి వేళ. ఈ పరిస్థితిలో ఇక్కడ వుండడం మీకు, ఇవ్వడం మాకు క్షేమం కాదు'' అని హితం చెప్పాడు. సరే, బండి వాడు ఆ స్త్రీలు చెప్పిన యింటి వద్దకు బండి తోలాడు. తిరువడుల వీధిలో వున్నది ఆ యిల్లు. నేను గుమ్మంలో అడుగు పెట్టగానే ఆ యువతు లిద్దరూ కనిపించి ఆదరంగా ఆ యింటి వారితో నా విషయం చెప్పి సామాను లోపల పెట్టించారు. నూతి వద్ద కాళ్ళు కడుక్కొని నీళ్ళు త్రాగి వాకిటి వసారాలో నిలబడ్డాను. వాళ్ళంతా ఏవో పెళ్ళి కబుర్లలో పడ్డారు. ఎన్నడూ ఒంటరిగా గడపదాటి యెరుగని దాన్ని ఎవరి పంచలో నిలబడడం ఎంతో కష్ట మనిపించింది. పది గంటలయింది. అప్పుడా యింటి యజమాని బయటి నుండి వచ్చి ''యారది? (ఎవరది?)'' అని గదమాయింపుగా అడిగాడు. నాప్రాణం క్రుంగిపోయింది. తడబడే ధ్వనితో ''వుళ్ళపోయి కేళుంగో (లోపలికి వెళ్ళి అడగండి)'' అన్నాను. పాపం పెద్ద మనిషి లోపలికి వెళ్ళినవాడు మళ్ళీ బయటికి రానే లేదు.

అయినా నాకేమో వెగటుతోచింది. వాళ్ళెవరో ఏ రకపు మనుష్యులో నన్న భీతిన్నీ కలిగింది. రోడ్డున పోయే వాళ్లొక రిద్దరిని పిలిచి ''ఆశ్రమానికి ఇప్పుడు పోవచ్చునా?'' అని ప్రశ్నిస్తే, వెళ్ళవచ్చు నని ఒకరూ, వెళ్ళరాదని ఒకరూ చెప్పారు. ఇదంతా ప్రక్కయింటి యిల్లాలు గమనించి ''అమ్మా! మీరు కొత్తవారలే వున్నారు. ఇప్పుడు ఆశ్రమానికి ఆడవాళ్ళు వెళ్ళరాదమ్మ'' అన్నది తెలుగులో, ఆదరణతో కూడిన ఆ మాటలు వినేసరికి నా ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఆ వెనుక ఒకరి నొకరు విచారించి తెలుసుకున్నాం. ఆమె శేషయ్యరు అనే వారి భార్య. ఆ శేషయ్యరు చాలాకాలం కాకినాడలో వకీలుగా వుండుటవల్ల వారందరికి తెలుగు తెలుసును. అప్పు డామెభర్త ఆశ్రమంలోనే ఏదో పని చూస్తూ వున్నాడట. నేను దిగిని ఆ యింటివారు మర్యాదస్తులేనని ధైర్యం చెప్పిందామె. ఆ వసారాలోనే ఆమె అటు నే నిటూగా పడుకుని వేకువన లేచి, శేషయ్యరింట్లోనే స్నాన పానాదులు ముగించుకొని, జట్కా బండిలో సామాను పెడుతూ వుండగా శేషయ్యరు వచ్చి ''ఆశ్రమంలో వారణాశి సుబ్బలక్ష్మమ్మ అనే తెలుగామె ఉన్నది. మీ సౌకర్యాలన్నీ చూడ గలదు'' అని చెప్పాడు.

Naa Ramanasrma Jeevitham    Chapters