Naa Ramanasrma Jeevitham    Chapters   

21. శ్రేయాంసి బహువిఘ్నాని

ఈ సంఘటన జరుగకముందే ఒకనాడు భగవాన్‌ గోశాల వెనుకనుంచి వస్తుంటే వారికి సమీపంగా నిలిచాను. భగవానున్నూ నిలబడ్డారు. ''ఈ పనులన్నీ ఒకసారి ఆగి పోవటంవల్ల భగవాను కెంతో దూరమయినట్లున్న దే? చంటి బిడ్డను దూరం చేసినట్లున్న దే?'' అన్నాను దీనంగా, ''నువ్వేగా దూరంగా పోతున్నావు'' అన్నారు భగవాన్‌. ''చిన్న స్వామియే గదా వద్దన్నారు?'' అన్నాను. ''వారి కెవరు చెప్పారో?'' అంటూ నడకసాగించారు భగవాన్‌. ఆ మాటతో నాకు చిన్నస్వామి మీద కోపం తగ్గిపోయింది. అందుకు కారకులున్నారని భగవద్వాక్కులో ధ్వనిస్తున్నది గదా?

ఆ వెనుక దాదా పొక నెలవరకూ లేఖలు వ్రాయలేదు. అది విని కుంజుస్వామి దినదినం వచ్చి ''ఎందుకమ్మా మీరు మానటం? మీ యింట్లో మీరు, మీ అన్నకు వ్రాసే జాబులకు ఎవరు వద్దన్నా ఆపవలసిన పని లేదు. ఆఫీసువారు ఆపమనుట కున్నూ కారణం లేకపోలేదు. లోగడ బ్రంటన్‌, వెంకట్రామయ్యగారూ వాళ్ళూ వ్రాసినప్పుడు, ఎవరెవరో కాపీచేసుకొని వారి వారి పేర్లతో ప్రకటించి ఏదో డబ్బు సంపాదించారనీ, ఏదేదో వున్నది. మీకు అదంతా ఏమీ లేదు గదా? ఎందుకు జంకటం? తాత్కాలికంగా వద్దన్నా భవిష్యత్తున కది చాలా ఉపకరిస్తుంది. సత్కార్యానికి ఏదో అంతరాయాలు రాకుండా వుంటవా? అంతమాత్రాన ఆపవలసిన పనిలేదని హెచ్చరించేవారు. చింతా దీక్షితులగారి సమస్యాపూరణ జాబుకు బదులు వ్రాస్తూ లేఖలు వ్రాయటం ఆపానన్న సమాచారం వ్రాస్తే, వారు బదులు వ్రాస్తూ ''మీరు లేఖలు వ్రాయుట మానినా రని విని చాలా విచారిస్తున్నాన. 'శ్రేయాంసి బహువిఘ్నాని' అని పెద్ద లన్నారు. ఏదో విఘ్నం కలిగిందని శ్రేయస్కరమైన పని విడువరాదని పెద్ద లనలేదా? భర్తృహరి సుభాషితంలో

''ప్రారభ్యతే న ఖలు విఘ్నభ##యేన నీచైః

ప్రారభ్యవిఘ్నవిహతా విరమంతి మధ్యాః |

విఘ్నైర్ముహు ర్ముహురపి ప్రతిహన్యమానాః

ప్రారభ్య ముత్తమజనా న పరిత్యజంతి ||

(తాత్పర్యం : అధములు విఘ్నములు సంభవించునని కార్యమును ఆరంభింప వెఱతురు. మధ్యములు ఆరంభించి విఘ్నములు వచ్చినప్పుడు వదలెదరు. ధీరులు ఎన్ని సార్లు విఘ్నములు వచ్చినను తాము ఆరంభించిన కార్యమును విడువరు) అనే శ్లోకం చదివే వున్నారు గదా! మీరు ఎన్ని విఘ్నాలు తటస్థించినా ఈ పని మానరాదు. మానితే మా కందరికీ ద్రోహం చేసినట్లేసుమా.'' అంటూ ఆనబెట్టి ఎంతో దూరం వ్రాశారు.

Naa Ramanasrma Jeevitham    Chapters