Naa Ramanasrma Jeevitham    Chapters   

28. శివ రహస్యం

దక్షిణామూర్తి ప్రాదుర్భావమును గుఱించి భగవాన్‌ ఆ కథ చెప్పినప్పుడు భగవాన్‌ "ఇది దేనిలోనో చదివాను" అని సెలవిచ్చారు. నేను కథంతా వ్రాశానే గాని దేనిలో వున్నదది, అని భగవానుని తరచి అడగనూ లేదు. వారంతగా యోచించి చెప్పనూ లేదు. కొంతకాలం అల్లాగే జరిగి పోయింది. 1948 ఏప్రిల్‌ నెలలో ఒక సంఘటన జరిగింది, అప్పుడు భగవాన్‌ పగలంతా జూబ్లీ హాలులోనే వుంటూ వచ్చారు. ఒకనాడు ఉదయాన రిటైర్డు జడ్జీ ప్రతపరాయ్‌ దేశాయి అనే ఒక గుజరాతి భక్తుని భార్య స్త్రీలు కూర్చుండే స్తలంలో ఏదో పుస్తకం చూస్తూ కూర్చుని కొంతసేపుండి వెళ్ళిపోయింది. పది గంటలు దాటుటవల్ల స్త్రీలు ఒక్కొక్కరుగా ఇళ్ళకు చేరుకున్నారు. ఆ స్థలమంతా నేను సర్దుతూ వుంటే ఒక పుస్తకం కనుపించిది. తెఱచి చూతును కదా సంస్కృత శ్లోకాలూ, గుజరాతి తాత్పర్యమూ వున్నదందులో. అది ఏ గ్రంథమో నాకు త్వరగా అర్థం కాక "ఈ పుస్తకం ఎవరో మరచిపోయా రిక్కడ" అంటూ శ్రీవారి చేతి కిచ్చాను. భగవా& అందుకొని "ఆ దేశాయి భార్య అక్కడే కూర్చుని చదువుతూ వున్నది. ఆమెదే అయివుంటుది." అంటూ పుస్తకం విప్పి చూచి "ఇదుగో సంస్కృతశ్లోకమూ. గుజరాతి తాత్పర్యమూ వున్నదిందులో, ఆమెదే, వచ్చిన వెనుక ఇవ్వవచ్చును" అని నాల్గు పుటలు త్రిప్పిచూచి, చిరునవ్వుతో న న్నుద్దేశించి "ఇదుగో! ఇందులో దక్షిణామూర్తి ప్రాదుర్తి ప్రాదుర్భావఘట్టం వున్నది. శివరహస్యం దశమాంక ద్వితీయాధ్యాయంలో ఆ కథ వున్నదన్నమాట. "ఇదుగో! ఇల్లా వచ్చి చూడు" అని ఆ భాగమంతా నాకు వివరంగా చూపారు భగవాన్‌. ఈ కథ ఎక్కడో చదివా నని ఎప్పుడో భగవాన్‌ అంటె ఇదుగో ఇక్కడే వున్నా నని పుస్తకం ఎదురుగా వచ్చిందన్నమాట. అప్పుడే ఆ విషయం నోటు చేసుకొని సాయంకాలం ఆమె పుస్తకం ఆమెకు అందజేశాను.

భగవద్వాణికి ఇల్లా ఎప్పటి కప్పుడు ప్రమాణం దొరకుటయే గాక శ్రీవారి సన్నిధిలో భక్తులు ఏదైనా సద్విషయమై ప్రస్తావిస్తే దానికిన్నీ ప్రమాణం దొరికేది. ఎప్పుడైనా అల్లా దొరకకుంటే శ్రీ భగవాన్‌ భక్తత్రాణ పరాయణులు గనుక తామే వెదకి ఆ ప్రమాణం చూపేవారు. ఈ విషయమైన నా అనుభవం ఒకటి దిగువన విశదీకరిస్తున్నాను.

Naa Ramanasrma Jeevitham    Chapters