Naa Ramanasrma Jeevitham    Chapters   

29. ఆముక్తం

1943 అక్టోబరులో గుఱ్ఱం సుబ్బరామయ్యగారు అట్టలు సడలీ, కుట్లువూడి, శిథిలావస్థలో వున్న కృష్ణదేవరాయ విరచితమైన ఆముక్తమాల్యద (గోదాకల్యాణం) అనే గ్రంథం, వేదం వెంకటరాయశాస్త్రిగారి టీకా, తాత్పర్య విశేషార్థ సహితమైన దానిని భగవాన్‌ సన్నిధికి పంపారు. శ్రీవా రది చక్కగా బైండుచేయించి, ముత్యాలవంటి అక్షరాలతో పేరు వ్రాసి నా వైపు చూస్తూ "సుబ్బరామయ్యగారు ఈ గ్రంథం భగవాన్‌ తప్పక చదవాలని వ్రాశారు. ఇదంతా ఎవరు చదవగలరు? ఎల్లాగున్నదీ వ్రాయించండని నిన్న వ్రాశారు. ఈ ప్రబంధాలన్నీ ఇప్పుడు చదవాలంటే కుదురుతుందా? ఎవరన్నా చదివి విషయం చెపితే చెప్పవచ్చును" అని సెలవిస్తే శ్రీవారి నడిగి ఆ గ్రంథం తీసుకున్నాను. ఆ బైండింగు చేసిన విధానమును గుఱించి వెంటనే కొన్ని పద్యాలు వ్రాసి భగవానుకు సమర్పించి గ్రంథం చదువుటకు ఆరంభించాను. అదివరకు ఒకసారి చదివే వున్నందున కథలన్నీ త్వరగా అవగాహన మయినవి. అయిదారు రోజులవగానే "ఏమి? ఎల్లాగున్నది? విషయ మేమిటి?" అని అడిగారు భగవా&. "దీనికి విష్ణుచి త్తీయమనిన్నీ పేరున్నది. గోదాకల్యాణమే ప్రాధాన్యమైన కథ. అటూ యిటూ మాలదాసరి కథ మొదలైనవి వున్నవి గాని అన్నిటికంటే ఖాండిక్య కేశిధ్వజుల కథ చాలా బాగుంటుంది." అన్నాను "అల్లాగా! అయితే చూద్దాం" అన్నారు భగవా&. నేను టవునులో వున్న రోజులవి. అందువల్ల వెంటనే పుస్తకం అందించ లేక మరుదినం తెచ్చి శ్రీవారి కిస్తూ "ఈ ఖాండిక్య కేశిధ్వజుల కథ అసలు అద్వైతపరంగానే వున్నది. భారతంలోనో ఎక్కడో చూచాను. వీరు, అంటే కృష్ణదేవరాయలు అంతా అద్వైతపరంగానే చెప్పి కడపట వైష్ణవపరంగా త్రిప్పి త్రిప్పి వ్రాశారు. తాతాచార్యులవారు వారికి గురువు గదా. అందువల్ల అల్లా త్రిప్పారంతే" అన్నాను. భగవా& చిరునవ్వుతో "ఓహో! అల్లాగా! సరి సరి" అంటూ ఆ కథ మాత్రం చూచి, సాయంకాలం సమీపవర్తులను పిలిచి "ఏమోయ్‌, భారతం పట్టుకొని రా. అందులో ఈ కథ వున్న దేమో చూద్దాం" అన్నారు. వారది తెస్తే ఆరణ్య, శాంతి, ఆనుశాసనిక, అశ్వమేధ పర్వాలన్నీ త్రిప్పి త్రిప్పి చూచినా ఎక్కడా కనుపించలేదు. ఆ రోజంతా తెలుగులో నేనూ చూచాను. నాకూ కనుపించలేదు. ఏమో ఈశ్వరా! పెద్దల సన్నిధిలో జంకూ గొంకూ లేకుండా ఈ కథ అద్వైత పరంగా వున్నదని చెప్పానే. ఎక్కడా కనుపించలేదే. మహా తెలిసినట్లు మాట్లాడిందని అంతా అనుకుంటారు గాబోలు నని చిన్నబోయిన ముఖంతో టవునుకు వెళ్ళాను. రాత్రంతా కలవరంగానే వున్నది.

తెల్లవారిన వెనుక యథాప్రకారం భగవాన్‌ సన్నిధికి వస్తే భగవా& ఏదో పెద్ద పుస్తకం చూస్తూ నా రాక గమ నిస్తూనే వున్నారు. హాల్లో ప్రవేశించి నమస్కరించి లేవగానే "ఇదుగో! ఇది విష్ణుపురాణం. దీనిలో ఖాండిక్య కేశిధ్వజుల కథ వున్నది. అద్వైత పరంగానే వున్నదిందులో. మీ రన్నది నిజమే. ఇదుగో చూడండి" అన్నారు భగవా&. నా ప్రాణం లేచి వచ్చినట్లయింది. "అల్లాగా! ఒక సారి అష్టాదశపురాణాలూ కలిసి వున్న పెద్ద పుస్తకం చదివాను. అందులోవున్న దన్నమాట. జ్ఞాపకం లేక భారతంలో నేమోనని అన్నాను. ఎక్కడో ఒకచోట వున్నది గదా అద్వైత పరంగా?" అన్నాను "ఆ, ఆ, అదే. అదే. అంతే అయివుంటుంది. ఏం చూస్తారా?" అన్నారు భగవా&. "భగవా& సెలవిస్తే చాలును. చూడటం ఎందుకు?" అన్నాను. భగవా& నా మాట పొల్లు గాకుండా ఎంత వాత్సల్యంతో పురాణాలన్నీ వెతికి ప్రమాణం చూపించారో యని పొంగిపోయినాను. ప్రక్కనున్న వారిలో కొందరు ఆ కథయేమిటో సంగ్రహంగానైనా భగవా& సెలవిస్తే భాగుండునే. మాకు తెలుగు రాదు కదా?" అని శ్రీవారి నడిగితే "సరిపోయింది. కావాలంటే నాగమ్మ నడగండి చెపుతుంది" అన్నారు భగవాన్‌. ఆ వెనుక ఆ భక్తసోదరుల అభిలాష ననుసరించి వారికి చెప్పిన ఆ కథాసంగ్రహం దిగువన పొందుపరుస్తున్నాను.

Naa Ramanasrma Jeevitham    Chapters