Naa Ramanasrma Jeevitham    Chapters   

3. శ్రీ రమణమహర్షులు ప్రథమ సందర్శనం

నా బండి సాగిపోయి ఆశ్రమం గేటుదాటి లోప్రాకారంలో ఆగింది. బండీ దిగుతూ వుండగానే గ్రిద్దలూరి సుబ్బారావుగారు బండివద్దకువచ్చి ''ఏవూరమ్మామనది?'' అన్నారు. బెజవాడనుంచి వచ్చానని పెద్దన్న పేరు చెప్పి రెండు మూడు వారాలుండి వెడుతా నన్నాను. సరేనని వారు సర్వాధికారి నిరంజనానందస్వామితో చెపితే వారెంతో ఆదరంతో అంగీకరించారు. సామానుతోసహా నన్ను సుబ్బలక్ష్మమ్మకు ఒప్పగించారు సుబ్బారావుగారు. ఆమె విషయం విచారించి, కాఫీ యిచ్చి, ఇప్పుడు 7 గం|| దాటింది. భగవాన్‌ అల్పాహారం ముగించుకొని కొండపైకి వెళ్ళారు. వచ్చేవరకూ కూర్చొండి అని మా పెత్తండ్రికొమార్తె సుబ్బమ్మగార్ని చూపి వెళ్ళింది. భగవాన్‌ కూర్చునే హాలుకు వెలుపల పశ్చిమ భాగంలో కూర్చున్న దామె. హఠాత్తుగా నన్ను చూచి విస్తుబోయింది. విషయం విచారించి తెలుసుకునే లోపల భగవాన్‌ కొండ దిగి వచ్చి హాలులో సోఫామీదా ఆసీనులైనారు. అందరి నమస్కారాలూ అయిన వెనుక ఆమె హాల్లోకి వెడుతూ నన్నూ రమ్మన్నది. నా చేతులో పళ్ళూ వగైరా ఏమీ లేవు, పెట్టెలోనూ, బుట్టలోనూ ఏమీ లేవు. మనస్సులో మాత్రం ఏమున్నదీ? ఏమీ లేదు. అంతకు ముందే మానస శతకంలో ఒక పద్యం వ్రాసుకున్నాను. ఆ పద్యం ఏమంటే:

ఆ. తత్త్వమెరిగినట్టి ధన్యుండు ధనవాంఛ

దగులడెందు వాని దరికి జేరి |

భక్తి సేవజేసి పావనంబౌమనః

పుష్పమిచ్చిశరణు బొందుమనస ||

ముందు తత్త్వశీలుడైన గురువు లభించాలి. ఆ వెనుక వారి సేవవల్ల మాలిన్యమంతా కడిగితే గదూ మనఃపుష్పం వికసించటం? అట్లా వికసించిన పుష్పాన్ని అర్పణచేయాలి. ఈ ఆశయంతో వుండటంవల్ల ఏమీ తేలేదే అన్న చింతగూడా లేకుండా రిక్తహస్తాలతో, తత్తరబిత్తరలాడే మనస్సుతో హాల్లో ప్రవేశించి, ఆమె వెనుక నేనూ నమస్కరించి, ఆడవాళ్ళ స్థలంలో తలవంచుకొని ఒదిగి కూర్చున్నాను.

హాలంతా నిశ్శబ్దంగానూ, ప్రశాంతంగానూ వున్నది. పది నిమిషాలు గడచిన వెనుక తల ఎత్తాను. భగవాన్‌ నా వంక తేఱిపాఱ చూస్తున్నారు. అతి శీతలమైన ఆ దృష్టివల్ల నా మనస్తాపం చల్లారి నట్లయింది. ఆ తేజోమయ దృగ్జాలాన్ని ఎదుర్కొన లేక వెంటనే నా తల వ్రాలిపోయింది. ఆ మధ్యాహ్నం ఆ భావమే ఒక పద్యంగా వ్రాసుకున్నాను. ఆ పద్యం ఏమంటే:

''నే జూచిన తాజూచెను

తాజూచిన తాళ##లేక తల వంచితినే |

తా చూడ్కి తేజుమూలము

లోజూడగరామి లజ్జలో తలవ్రాలెన్‌ ||

ఆ తరువాత ఈ పద్యం భగవాన్‌ చూపును గుఱించి వ్రాసిన తారాపథంలో చేర్చాను. ఈ సంఘటన జరిగిన వెనుక మరి తల ఎత్తనే లేదు. తొమ్మిదిముప్పావుకు భగవాన్‌ బయటికి వెళ్ళారు. అప్పుడు మే మంతా హాలు వెలుపలకు వచ్చాం. మా అక్క సుబ్బమ్మగారు తానున్న గది చిన్నది గనుక నీవు ఆశ్రమంలోనే అన్నం తింటూ అక్కడున్న స్త్రీలతో కలిసి ఉండటం మంచిదని సలహా చెప్పి తాను టౌనుకు వెళ్ళి పోయింది.

మూడురోజులు ఆశ్రమంలో అన్నం తింటూ అక్కడున్న స్త్రీలతో రాత్రిళ్ళు టౌనుకు వెడుతూ పగలంతా ఆశ్రమంలో గడుపుతూ వచ్చాం. ఆ రాక పోకలలో అరుణాచలేశ్వరా లయమంతా పరిశీలనగా చూచాను. ఆ వెనుక ఆశ్రమంలో జొన్నన్నం విడిగా వండుకొనే వీలు లేక, అక్కడి ఆహారం వంటికి సరిపడక, టౌనులో ఒక గది అద్దెకు తీసుకుని మకాం అక్కడికి మార్చాను. మార్చేముందు ఆశ్రమంలో భిక్ష చేయించడం మంచిదన్నారు. ఆ రోజుల్లో నిరంజనానందస్వాములు ఎంతో ఆదరంగా 5 రూపాయలతో అందరికీ భిక్ష చేయించేవారు. భగవానుకు మాత్రం కౌపీనం, పై తుండు వేరే తెప్పించి యిస్తే మంచిదని సుబ్బలక్ష్మమ్మ సలహా చెప్పింది. అది తెచ్చింది కుంజుస్వామి. పుచ్చుకొని భగవాను కిచ్చింది మాధవ స్వామి. వారిద్దరూ మళయాళీలే. వా రిద్దరితోనూ అప్పుడే పరిచయం కలిగింది. భిక్ష జరిగిన వెంటనే మకాం మార్చాను. మారిన వెనుక ఉదయం 6 గంటల లోపలే వంట మొదలైన పనులన్నీ ముగించుకొని ఆశ్రమానికి నడిచి రావటం, పదింటికి బయలుదేరి బసకు వెళ్ళి ఆహారాదులు ముగించుకొని రెండింటికి ఆశ్రామానికి వచ్చి, తిరిగి ఆరున్నరకు బయలు దేరి బసకు వెళ్ళటం - ఇదీ దినచర్య.

పదిరోజులు గడచినవి. శ్రీవారితో నాకు మాట లేదు, మంతనము లేదు. కాని సూదంటురాయివలె నా మనస్సు వారి వైపుకు లాగబడుతున్నట్లు అనుభవానికి వచ్చుటయే గాక ఆ రూపం నా హృదయంలో అచ్చుగుద్దినట్లు నిలిచి పోయింది. క్రమేణ స్వప్నగతసిద్ధపురుష లక్షణాలన్నీ భగవానుని యందు పొడగట్టుటయే గాక, వాసిష్ఠాది వేదాంత గ్రంథాలలో చెప్పబడిన జీవన్ముక్తలక్షణాలన్నీ, శ్రీవారి చర్యలలో గోచరింప సాగినవి. ఆశ్రమ కార్యము లన్నిటికీ తామే ఆశ్రయ భూతులయ్యు, వేటికి అంటక, తామరాకుపై నున్న నీటి బిందువు వలె విరాజిల్లుతూ వున్న ఆ జ్ఞానభాస్కరుని చూడగా చూడగా నా అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేయగల శ్రీగురు డితడే నన్న దృఢ నిశ్చయం కలిగి శరణాగతి చెందుట సంప్రదాయ సిద్ధమని తోచింది. మాటలతో చెప్పేటందుకు ధైర్యం చాలలేదు.

Naa Ramanasrma Jeevitham    Chapters